మానవ పరిపాలనను తూకంవేస్తే
ఇనుము బురదయు మిళితమైయున్న రాజకీయ విధానం
దేశాభిమానము: ఒక దేశాన్ని ఇతర దేశాలకంటే ఉన్నతమైనదని హెచ్చించే జాతీయతా సిద్ధాంత భావం మరియు దాని సంస్కృతి, అనురక్తుల అభివృద్ధిని ఇతర దేశాల కంటె ముందుగా వుంచుట; ఈ భావం 18వ శతాబ్దపు చివరి భాగంలో మొదటిసారిగా ప్రస్ఫుటమైనది గానీ 20వ శతాబ్దంలో అది అత్యున్నత దశకు చేరింది.
అనేక సమస్యలతో నిస్సహాయంగా సతమతమౌతున్న మానవ ప్రభుత్వాలు మానవ సమాజానికి స్థిరత్వాన్ని తెచ్చుటలో విఫలమౌతున్నవి. అమెరికా మాజీ అధ్యక్షుడు, జిమ్మి కార్టర్ యొక్క జాతీయ భద్రతా సలహాదారుడైన జిగిన్యూ బ్రెజిన్‌స్కి ప్రకారం పరిస్థితి ఇంత త్వరలో మారదు.
“అవర్ డిసింటిగ్రేటింగ్ వరల్డ్” అనే పేరుతో 1985లో ప్రచురింపబడిన ఒక శీర్షికను ఆమె తయారుచేసే టప్పుడు జార్జీ యాన్ని గేయర్ అనే పత్రికా విలేఖరి, ప్రపంచ నాయకులతో పాటు బ్రెజిన్‌స్కిని కూడ ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆమె బ్రెజిన్‌స్కి ఇలా అన్నాడని వ్రాసింది: “అంతర్జాతీయ అస్థిరత్వమునకు దారితీసే క్రియలే, మంచి సహాయ సహకారములందించి పనిచేసే శక్తుల కన్న అధిక చారిత్రాత్మకమైన ఆధిపత్యాన్ని పొందుచున్నవి. భౌగోళిక పరిస్థితులను విడదీసి పరిశీలిస్తే వచ్చే నిశ్చయమైన ముగింపు ఏమనగా సామాజిక అలజడి, రాజకీయ అస్థిరత్వం, ఆర్థిక దుస్థితి, మరియు అంతర్జాతీయ సంఘర్షణలు మొదలగునవి ఈ శతాబ్దమునకు మిగిలియున్న కాలములో మరింత ఎక్కువగా విస్తరించవచ్చును.”
నిజంగా ఇది నిస్తేజమైన బావిసూచనే గాని బైబిలు విద్యార్థులను ఆశ్చర్యపరచేదేమి కాదు. ఈ పరిస్థితిని గూర్చియే చాలాకాలం క్రితం ప్రవచింపబడినది. ఎప్పుడు? ఎచ్చట?
ఒక కలతో తారుమారు
నెబుకద్నెజరు, సా.శ.పూ. 624 నుండి 582 వరకు పాలించిన బబులోను రాజు ఒక కల మూలంగా కలతచెందాడు. అందులో ఆయన ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశాడు, దాని శిరస్సు బంగారముతో, రొమ్ము భుజములు వెండివియు, ఉదరమును తొడలును ఇత్తడివియు, మోకాళ్లు ఇనుపవియు, పాదములును వేళ్లును ఇనుము మట్టితో మిళితములై యుండెను. దేవుని ప్రవక్తయగు దానియేలు నెబుకద్నెజరుకు ఆ ప్రతిమ యొక్క ప్రాముఖ్యతను గూర్చి వివరిస్తూ ఇలా చెబుతున్నాడు: “రాజా . . . తామే ఆ బంగారు శిరస్సు. తమరి తర్వాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్యమొకటి లేచును. అటు తర్వాత లోకమంతటిని యేలునట్టి మూడవ రాజ్యమొకటి లేచును. అది యిత్తడివంటిదగును.” గనుక స్పష్టంగా ఆ ప్రతిమ మానవ ప్రభుత్వాలను సూచించునదై యుండెను.—దానియేలు 2:37-39.
దానియేలు కాలానికి ముందున్న ఐగుప్తు, అస్సీరియా రాజ్యాలు, బైబిలు గ్రంథకర్త ఎన్నుకున్న ప్రజలైన ఇశ్రాయేలీయులను బాధించాయి. (నిర్గమకాండము 19:5) బైబిలు ప్రకారంచూస్తే, నిజానికి ఇవి ప్రపంచాధిపత్యం వహించిన ఏడు రాజ్యాలలో మొదటివి. (ప్రకటన 17:10) ఆ పిదప దానియేలు కాలంలో, బబులోను యెరూషలేమును కూలద్రోసి ఇశ్రాయేలీయులను చెరగా తీసికొనిపోయింది. ఆ విధంగా బబులోను ప్రపంచ ఆధిపత్యములలో మూడవదిగా తయారై, యీ సందర్భంగా దాని “శిరస్సు బంగారముతో” వున్నదనే మాటతో యుక్తంగా పిలువబడింది. బైబిలు మరియు మానవ చరిత్ర యీ ప్రపంచ ఆధిపత్యములు యింకను రానైయున్న మాదీయ-పారశీకులు, గ్రీసు, రోమా చివరికి ఆంగ్లో అమెరికాa ప్రభుత్వాలేనని గుర్తించినవి.
ఈ రాజ్యాలను బైబిలు ప్రపంచాధిపత్యముల వర్గంలో చేర్చింది, ఎందుకంటె అవి దేవుని ప్రజలతో వ్యవహరించి, దేవుని సేవకులు ప్రకటించిన దైవపాలనను వ్యతిరేకించినవి. ఆ విధంగా, నెబుకద్నెజరు చూచిన ఆ ప్రతిమ, ఆయన రాజ్యానంతరం కూడ మానవ పాలన ఎట్లు దైవిక సార్వభౌమాధిపత్యమును వ్యతిరేకిస్తూనే వుండునో సరిగ్గా సూచించెను. ప్రతిమ యొక్క ఇతర భాగాలతో సూచించబడిన తర్వాతి ప్రపంచ ఆధిపత్యములు, శిరస్సునుండి ప్రారంభించి పాదములవరకు వచ్చెను, గనుక న్యాయబద్ధంగా చూస్తే దాని పాదములును వ్రేళ్లును దానియేలు తెల్పినరీతిగా, “అంత్యదినములలో” ఉండబోవు ఆఖరి మానవ పరిపాలనను సూచిస్తున్నవి. కాబట్టి మనం దేనికొరకు ఎదురు చూడాలి?—దానియేలు 2:41, 42; 12:4.
‘పది వ్రేళ్లు’
ఒక ప్రపంచ ఆధిపత్యము వారిని బాధించులాగున దేవుని ప్రజలిక ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి పరిమితమై వుండరు. (అపొ. కార్యములు 1:8; 10:34, 35) అన్ని దేశాల సభ్యులుగా, ప్రతి విధమైన మానవ ప్రభుత్వపు పౌరులుగా, అంతం సమీపించినదనియు మానవపాలనకు కాలం చెల్లిందని—బదులుగా దేవుని పరిపాలన త్వరలో వస్తుందని వారు ఆసక్తితో ప్రకటిస్తున్నారు.b ఆవిధంగా వారు ప్రకటించే సాహసోపేత సమాచారము ఉనికిలోవున్న అన్ని రాజకీయ ప్రభుత్వాధికారములకు సవాలుగావున్నది. అందుకే బైబిలు నందుపయోగించబడిన “పది” అనే సంఖ్య భూసంబంధమైన వాటి విషయంలో సంపూర్ణతను సూచిస్తుంది. కావున ఆ ప్రతిమయొక్క ‘పది వ్రేళ్లు’ న్యాయసమ్మతంగా దాని సంపూర్ణతయందు అంత్యకాలములో దైవ సార్వభౌమాధిపత్యమును ఐక్యముగా వ్యతిరేకిస్తున్న రాజకీయమానవ పరిపాలనను సూచిస్తున్నవి.
ముందుగానే తెల్పబడిన యీ కాలారంభమున రాజకీయపరిస్థితి ఎలావుండెను? 1800 సంవత్సరములో ఐరోపా దేశాలు భూగోళములో 35 శాతాన్ని ఆక్రమించినవి, కానీ 1914 నాటికి ఆ సంఖ్య 84 శాతానికి పెరిగింది! ది కాలిన్స్ అట్లాస్ ఆఫ్ వర్ల్‌డ్ హిస్టరీ గమనించినట్లు “1914 యుద్ధం దృష్ట్యా ప్రపంచ ఆధిపత్యముల మధ్య ప్రపంచాన్ని పంచుకొనుట దాదాపు పూర్తియైనట్లే.” వాస్తవానికి ఇంగ్లాండ్ ఎసెక్స్ యూనివర్శిటీ హిస్టరీ లెక్చరర్ హగ్ బ్రోగన్ అనున దేమనగా “అనతి కాలములోనే ప్రపంచమంతా అర డజను ప్రభుత్వాలచేత పరిపాలించ బడేటట్లు కనబడింది.”
“అర డజను ప్రభుత్వాల” కంటె కొంచెం అధికమైయుండి అక్షరార్థమగు సంఖ్య కానటువంటి యీ సంపూర్ణ ప్రపంచ ప్రభుత్వాలను సూచించుటకు ‘పది వ్రేళ్లు’ అను మాట ఉపయోగించుట సమంజసముగా లేదు. గనుక ప్రవచన నెరవేర్పుగా “పదివ్రేళ్లు” నిజమైన ప్రాముఖ్యత వహించవలసి యుండెను, 1914లో నున్న రాజకీయ పరిస్థితి మారిపోవలసి యుండెను.
ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బ్రిటీష్ సామ్రాజ్యం, 1900వ దశాబ్దం ప్రారంభమయ్యే నాటికి, భూమి మీదనున్న ప్రతి నాలుగవ వ్యక్తిమీద పరిపాలించెను. ఇతర ఐరోపా సామ్రాజ్యాలు యింకను లక్షలాది మంది ప్రజలను పాలించినవి. అయితే మొదటి ప్రపంచ యుద్ధంవల్ల దేశాభిమానము విజయఢంకా మ్రోగించింది. యాలె యూనివర్శిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గానున్న పాల్ కెనడీ ఇలా వివరిస్తున్నాడు: “భూభాగము—న్యాయ సంబంధం అనే పదముల దృష్టిలో చూస్తే, ఐరోపాలో వచ్చిన గొప్పమార్పు ఏమనగా దేశం—రాష్ట్రాలు ఏర్పడే అత్యవసర పరిస్థితియే—అంటే హబ్బ్‌బర్గ్, రొమానోవ్, మరియు హోహెన్ జోలెన్ సామ్రాజ్యాలలో ఒకనాడు భాగమైయున్న దేశాలకు బదులు పోలాండ్, జెకొస్లొవేకియా, ఆస్ట్రియా, హంగేరి, యుగొస్లావియా, ఫిన్‌లాండ్, ఈస్టోనియా, లాటివియా మరియు లితూనియా అనునవి ఏర్పడినవి.”
రెండవ ప్రపంచ యుద్ధానంతరం, యిది విపరీతంగా పెరిగిపోయింది. దేశాభిమానం పూర్ణబలంతో పెల్లుబికింది. విశేషంగా 1950వ దశాబ్దపు మధ్యకాలానికి దీని ధాటికి ఎదురులేక పోయింది. ఐదు శతాబ్దముల ఐరోపా విస్తరణ, వలస సామ్రాజ్యాల పతనముతో పాటు అంతరించెను. ఆఫ్రికా, ఆసియా, మరియు మధ్యప్రాశ్చ దేశాలెన్నో ఆకస్మికంగా అవతరించినవి.
ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెల్పునదేమనగా ఈ “మార్పు గడచిన 2,000 సంవత్సరాలలో వుండిన రాజకీయ సిద్ధాంతానికి ప్రాధాన్యత వహించిన భావాలకు వ్యతిరేకంగా నడిచింది.” “ఇప్పటివరకు మానవుడు సర్వసాధారణమైన విశ్వ ఐక్యతనుగూర్చి నొక్కి తెలిపే ఐక్యత కోరదగిన గమ్యము” అని అన్నది. ఇప్పుడు దేశాభిమానమైతే దేశాల మధ్య విభేదాలను నొక్కి తెల్పుచున్నది. ఐక్యపరచే బదులు అది అనైక్యతకు నడుపుతుంది.
ఇనుము మరియు బురద
ఆ ప్రతిమ పాదములలో “ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై యుండెను” అని చెబుతూ ఇంకను “ఆ రాజ్యములో భేదములుండును . . . ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును. వారు ఒకరితోనొకరు పొసగకయుందురు” అనే బైబిలు వివరణను గమనించండి. (దానియేలు 2:33, 41-43) వలస ప్రాంతాలేర్పడుట తగ్గిపోగా, దేశాభిమానం పెచ్చుపెరిగి పోగా, వర్ధమాన దేశాలు వర్ధిల్లుచుండగా ఒకరికొకరు ఐక్యమైయుండుట అసాధ్యమైనట్లు స్పష్టంగా కనబడింది. భూగోళమంతా త్వరితగతిని రాజకీయ విచ్ఛిన్నానికి దారితీసింది.
ప్రతిమ పాదములలోని ఇనుము మట్టి అతకనట్లున్న రీతిగానే కొన్ని ప్రభుత్వాలు ఇనుమువలె నిరంకుశంగా లేక క్రూరంగా వుంటున్నవి—ఇతరములు మట్టివలె—సున్నితంగా లేక ప్రజాస్వామ్య పద్ధతిలో వుంటున్నవి. స్పష్టంగా ఇవి ప్రపంచ ఐక్యతలో ఒకదానితోనొకటి పొసగక యున్నవి. మన కాలంలోని యీ విషయాలను నొక్కితెల్పుచు జర్మనీ పుస్తకము అస్‌సిరి వెల్ట్—జిస్టెర్న్, హ్యుటె, మోర్గెన్ 1800-2000; (మన ప్రపంచం—నిన్న, నేడు, రేపు 1800-2000), ఇలా తెలుపుతుంది: “19వ శతాబ్దాని కల్లా ప్రజాస్వామ్య స్వాతంత్ర్యము నాగరికత చెందిన దాదాపు అన్నిదేశాలలోను ప్రబలినది మరియు మొదటి ప్రపంచ యుద్ధాంతానికి స్వతంత్ర అభిలాష విజయాన్ని సాధించినట్లు కనబడుతుంది . . . 1917లో రష్యానందు తిరుగుబాటు ఉద్యమముతో నియంతృత్వము కోరలు చాచింది. అప్పటినుండి 20వ శతాబ్దం, నియంతృత్వం, ప్రజాస్వామ్యముల మధ్యనున్న సహజీవనము విభేదములతో కొనసాగుచునే యున్నది.”—ఇటాలిక్స్ మావి.
ప్రజాశక్తి
‘పది వ్రేళ్లు’ పరిపాలించే కాలములో, సామాన్య మానవులు, “మనుష్యజాతులు,” ప్రభుత్వాలలో ఎక్కువ జోక్యం చేసుకుంటూ వుంటాయనే విషయాన్ని కూడ గమనించండి. ఈ ప్రవచనమును చరిత్ర వాస్తములు రుజువు చేస్తున్నాయా?—దానియేలు 2:43.
ప్రజాస్వామ్యమనేది, ప్రజలచే పాలించబడే ప్రభుత్వం, మొదటి ప్రపంచ యుద్ధానంతరం అత్యంత ప్రజాదరణ పొందినది. పందొమ్మిది వందల ఇరవై, 1930 దశాబ్ద కాలములో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజా ప్రభుత్వాలకు బదులు నియంతృత్వ పాలన వచ్చినప్పటికిని అటువంటి ఆదరణ పొందింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వలస రాజ్యాల క్షీణత వలన మరల అనేక క్రొత్త ప్రభుత్వాలేర్పడినవి. అయితే ఆ పిదప, 1960, 1970 దశాబ్ద కాలములో మునుపటి వలస రాజ్యాలు స్వాతంత్ర్య వ్యతిరేక ప్రభుత్వ విధానాలున్న వాటినే అధికంగా ఎంపిక చేసుకున్నవి.
అయిననూ, 20వ శతాబ్దంలో ఏకఛత్రాధిపతులకు, నిరంకుశ ప్రభుత్వాలకు బదులు ప్రజాస్వామ్యములు లేదా ప్రజలు పాలించే ప్రభుత్వాలే కావాలనే ధోరణి కనబడుతుంది. గత సంవత్సరం తూర్పు ఐరోపాలో వచ్చిన రాజకీయ పెనుమార్పులను గూర్చి తెలుపుచూ అది “ప్రజల సంవత్సరము” అని టైం పత్రిక అభివర్ణించింది. మరి చివరికి బెర్లిన్ గోడ కూలగా డెర్ స్పైగెల్ అనే జర్మనీ వార్తాపత్రిక దాని అట్టమీద అందమైన అక్షరాలతో “దాస్ వోల్క్ సియట్”—ప్రజా విజయం! అని వివరించింది.
మాటలు కొల్లలు, క్రియలు శూన్యం
ప్రజాశక్తి రాజకీయ మార్పులను తెచ్చినటువంటి తూర్పు ఐరోపా దేశాలన్నింటిలోను, అనేక రాజకీయ పార్టీలు పాల్గొని స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిపించాలనే డిమాండ్ పెరుగుతూవున్నది. ఇప్పుడు ఐరోపా ఉత్తర అమెరికాలో వున్న రాజకీయ పార్టీల స్వరూపం 19వ శతాబ్దంలోనే ఆరంభమైనది. ఇరవయ్యో శతాబ్దపు మధ్యకాలానికి అవి లోకమంతట వ్యాపించినవి. ఈనాడు అవి ముందటికంటె ఎంతో పెద్దవిగా, పటిష్టమైనవిగా బాగా క్రమబద్ధం చేయబడినవి. ఆ పార్టీలద్వారాను, కార్మిక యూనియన్లు, బృందములు, పరిసర ప్రాంతములోని గుంపులు మరియు లెక్కలేనంత మంది ఇతర పౌరులు, ప్రత్యేక శ్రద్ధవహించు గుంపులతో యీ ప్రజాశక్తి ఇప్పుడు మునుపెన్నటికంటే మిన్నగా బిగ్గరగా అతి తరచుగా మాట్లాడుతుంది.
అయిననూ రాజకీయ విధానంలో జోక్యం చేసుకునే ప్రజలు అధికమగుచున్నందువల్ల, రాజకీయ అంగీకారం సాధించడం కూడ కష్టమౌతుంది. అసంఖ్యామైన అభిప్రాయాలు అభిరుచులు, వ్యక్తపరస్తూ వున్నందువలన తరచూ మైనారిటీ ప్రభుత్వాలేర్పడుచున్నవి, దిక్కుతోచని ప్రభుత్వాలు మాటల్లో కొల్లలు, చేతల్లో శూన్యం అన్నట్లున్నాయి.
ఇనుము బురదవలె 1914 నుండి ఉన్న భూవ్యాప్త రాజకీయ మిశ్రమమంతా పటుత్వం లేనిదైయున్నది. ఉదాహరణకు, ప్రభుత్వ విషయాలలో దేవుని నడిపింపును అర్థించిన రోజులు గతించిపోయినవి. “పశ్చిమ దేశప్రజలు ఆ విధంగా వారి మీద వారే ఆధారపడవలసి వచ్చింది, వారే నిస్సహాయులయ్యారు” అని ది కొలంబియా హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ తన ముగింపు మాటల్లో చెబుతుంది.
ఆశావాదానికి తావున్నదా?
“విభేదములుండియు పరస్పర సంబంధము కల్గియున్న యీ మార్పులెందుకున్నవి? ఒకటిగా 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో వచ్చినవి? మానవుని గత చరిత్రలో ఎన్నడూ లేనంత విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవుడు సముపార్జించిన తరములోనే కచ్చితంగా ప్రపంచాన్నే కూల్చివేస్తామనే బెదిరింపు లెందుకు వచ్చినట్లు?” పత్రికా విలేఖరి గేయర్ అడిగిన యీ ప్రశ్నలు ఆలోచింపజేసేవే. అయితే వీటికి సమాధానాలు ఎవరివద్దనైనా ఉన్నాయా?
దాదాపు పది సంవత్సరాల క్రితం ది వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ఆశావాదపు దృష్టితో ఇట్లన్నది: “ముందు తరం కంటె మనమిప్పుడు మన సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అధికంగా మనకు కనబడుచున్నది.” అయితే ఒక దశాబ్దం తర్వాత, 1990 దశకపు ప్రారంభంలో ఇంకా యీ ఆశావాదానికి తావున్నదా? ప్రచ్ఛన్న యుద్ధము ఆగిపోవుట, తూర్పు పశ్చిమ దేశాల మధ్య సమన్వయం, ప్రపంచ నిరాయుధీకరణ విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించుటను చూపిస్తూ, నీవు ‘అవును’ అని అనవచ్చును.
వారలా చేస్తారని బైబిలు ప్రవచించినది. బైబిలు చరిత్ర ప్రకారం ఏడవ ప్రపంచ ఆధిపత్యపు పరిపాలనా కాలంలో సమకాలికమైన ఒక ఎనిమిదవ ఆధిపత్యము, రాజ్యములను ఏకంచేయుటకు ప్రత్యేకంగా నియమించబడునని అది సూచిస్తుంది. (ప్రకటన 17:11) అయితే అది విజయం సాధించునా? “మానవ పరిపాలనను తూకంవేస్తే” అనే 9వ శీర్షిక దీనికి సమాధానమిచ్చును. (g90 11/22)
[అధస్సూచీలు]
a ది వాచ్‌టవర్, 1988 ఫిబ్రవరి 1, నుండి జూన్ 1, వరకు, దాని శీర్షికలలో బైబిలు చరిత్ర తెలుపు యీ ప్రపంచ ఆధిపత్యములనుగూర్చి ఒక్కొక్క దానిని విడివిడిగా చర్చించింది.
b బైబిలు రుజువు కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారు 1982లో ప్రచురించిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకంలోని 16, 18 పుటలను చూడండి.
[16వ పేజీలోని చిత్రం]
“తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును.”—మత్తయి 12:25
[16వ పేజీలోని చిత్రం]
“జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి.”—కీర్తన 46:6