చిన్న కుందేల్లు రమ్యమైనవి మరియు సహజ జ్ఞానముగలవి
దక్షిణాఫ్రికాలోని మేల్కోలుపు! ప్రతినిధి ఇచ్చిన వ్యాసం.
ఏ జంతువులను బైబిలు “మిక్కిలి జ్ఞానముగలవి . . . బలములేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకొనును” అని పిలుస్తున్నది? ఈ అసాధారణమైన చిన్న ప్రాణులను, ఒక కుందేలంత వుండే వీటిని, చెవుల పిల్లులని, పంది కొక్కువంటి జంతువులని లేక చిన్నకుందేళ్లని వివిధ బైబిలు తర్జుమాలలో పిలువబడుతున్నవి.—సామెతలు 30:24-26.
ఈ చిన్నకుందేలు ఆఫ్రికాలోని ప్రాంతాల్లోను ఆసియాలోని నైరుతి లోపలిభాగాన మాత్రమే కనబడు ఒక బుల్లి జంతువు. దక్షిణాఫ్రికాలో ఇవి విస్తార సంఖ్యలో వున్నవి, అక్కడ దాన్ని రాక్ డస్సీ అంటారు, “చిన్నకుందేలు” ను డచ్ భాషలో పిలిచే పదమునుండి ఆ పేరు వచ్చింది.
డస్సీ కొంచెము చర్వకములవలె కనబడినప్పటికీ, నిజానికవి “అన్ని మిళితమైయున్న” ఆకారములు కలవి, జెర్రీ డిగ్రాఫ్ ప్రకారం, “వాటి కత్తెరపల్లు చర్వకములవలెను, వాటి దవడపల్లు ఖడ్గమృగముల వలెను, వాటి నాడీమండలము తిమింగలము వంటిదిగాను, వాటి పాదములు ఏనుగు వంటివిగాను కనబడును. వాటిని చూచిన జంతు శాస్త్రజ్ఞులు నిశ్చయంగా ఆశ్చర్యపోతున్నారు.
అవి అంత వేగంగా నడువలేక పోయినను, అంతగా స్వయంరక్షణ కల్పించుకొనలేక పోయినను, ఈ డస్సీలు అతి తెలివిగా కొండ బండ సందులలోను, ఎత్తైన కొండపేటులలోను నివసించును. ఇందువల్ల గాలికి వానకు, చీల్చితినే జంతువుల బారినుండి వాటికి సంరక్షణ దొరుకుతుంది. రోజుకు రెండు సార్లు వాటి ఆహారంకొరకు బయటికి రావడం తప్ప అవి అరుదుగా బయటికి వచ్చును.
మరి ఎటువంటి ఆహారం! అవి అంత బుల్లి జంతువులైనను అమితంగా మొక్కలు తినటమే ఆశ్చర్యం. మరింకా ఆశ్చర్యకరమేమిటంటే తిండికొరకు అవి రోజుకొక గంటమాత్రమే వినియోగిస్తాయి. ఈ అలవాటుకు తగినట్లే వాటి జీర్ణకోశ పద్ధతి కూడా ఉంది. “జంతుప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్నది” అని జంతు శాస్త్రజ్ఞుడైన జె. జె. సి. సాయర్ వర్ణిస్తున్నాడు.
సులభమైన ఆహారముకాదు
చిన్నకొండ ప్రాంతాలల్లో సర్వసాధారణంగా కనబడేవి ఈ డస్సీలే, ఇవి చిన్న చిన్న కొండల్లాగానే ఆ తీక్షణమైన ఎండలో మెరుస్తూ కనబడును. నల్ల డేగకు ఎంతో ప్రియమైన ఈ డస్సీలు వాటికి ఆహారానికి ఆకర్షణీయంగా ఉండును. గాని బుల్లిది అంత సులభముగా చిక్కదు. దాని కనుదృష్టి ఎంత తీక్షణంగా ఉంటుందంటే అరమైలు దూరంనుండి కదలికను పసికడుతుంది! డేగ సూర్యునివైపు వున్నప్పటికి, డస్సీ దాన్ని గుర్తుపడుతుంది. అదెలా సాధ్యం! ఏహాని లేకుండ సూర్యరశ్మిని వడగట్టి నేరుగా సూర్యున్ని చూడగల ఒక ప్రత్యేక కంటిపొరతో దాని నేత్రములు నిర్మింపబడినవి. శత్రువు రాకను పసిగట్టిన వెంటనే ఒక హెచ్చరికవస్తుంది—కావలిగావున్న డస్సీ సూక్ష్మమైన అరుపుతో వస్తుంది—తక్షణమే బండలన్నీ ఖాళీ అయిపోవును, డస్సీలన్నీ బండ సందుల్లోనికి క్రిందికి దిగి దాక్కొనును. డేగ తన ఆహారాన్ని మరోసారి వెతుక్కోవలసివస్తుంది.
మంచి సంఘజీవులు
సహజీవనం—రాత్రి పూట డస్సీలన్నీ చలిపెట్టినపుడు కలిసివుండుట వాటికెంత అనుకూలంగా వుంటుందో! అన్నీ తలలు బయటపెట్టుకొని గట్టిగా అంటుకొని తోటి డస్సీలన్నీ కలిసి పడుకోవడం చాలా సహాయకరంగా వుంటుంది. ఒక్కొక్క సారి 25 వరకు—మూడు నాలుగు వరుసలుగా వచ్చేంత వరకు ఒకదానిమీద ఒకటి కుక్కుకొని కూర్చున్న గుంపుమీద ఎక్కును— ఒకదానికొకటి వెచ్చదనాన్ని పంచుకొనును.
అయితే ఈ బుల్లి జంతువులు కలహప్రియులే. కొన్ని లోపాలు వాటికుండనే వున్నవి. గానీ వాటికున్న సహజ జ్ఞానము వాటిని రక్షిస్తుంది. డాక్టర్. పి. బి. ఫౌపీ ఇలా వివరిస్తున్నాడు: వాటి తలలు దూరందూరంగానే పెట్టుకొని సాధారణంగా పండుకుంటాయి, ఒకదానికొకటి అంత దగ్గరగా రావు, మరి ఒక్కదాని వెంట ఒకటి దగ్గరగా కదలవలనంటే శాంతంగా వేరు వేరు శబ్దములు చేస్తాయి.” సాధారణంగా అవి కొన్ని గజాలదూరం మాత్రమే వినబడేటట్లు మెల్లిగా అరుస్తాయి గనుక చీల్చే జంతువుల ఆకర్షణకు గురికాకుండా ఒకదానికొకటి సంభాషించుకొంటాయి.
చురుకైన మరియు మనోహరమైన పెంపుడు జంతువు
నిట్టనిలువుగా, నున్నగావున్న బండను డస్సీలు వేగంగా ఎక్కిపోవుట పరిశీలించే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. అవెలా దాన్ని చేయగలవు? దట్టమైన, మెత్తని నొక్కులుగల మాంసపు కుదురులున్న వాటి పాదాలు ఒత్తుగా చేసుకొని ఎక్కగలవు. వాటి శరీర భాగాల్లోని ఒకేఒక స్వేదోత్పాదముచేయు వాటి పాదాలెప్పుడూ తడిగానే వుండును గనుక వాటి నడక అంత బలంగా ఉంటుంది.
ఈ ప్రియమైన జీవులను సులభముగా సాధు చేయగలం. వాటి పరిశుభ్రత విషయంలో విచారపడనక్కర్లేదు— ఎందుకంటే అవి ఎప్పుడూ వాటి వెనుక పాదాలతో శరీరాన్ని శుభ్రంచేసుకుంటాయి, ప్రత్యేకంగా అందుకే వాటికి అనువైన చిన్న గోళ్లున్నవి. ఆమె పెంపుడు డస్సీ తన శరీరాన్ని తానే అలవాటు ప్రకారం గోకుకొనుట చూచి ఆశ్చర్యపోయానని బార్న్ ఫ్రీ అనే తన పుస్తకంలో జాయ్ ఆడంసన్ అంగీకరిస్తుంది. ఈ గోళ్లతోనే డస్సీ తన శరీరము మీద ఒక్క పిడుజుగానీ మచ్చగానీ ఉండకుండ రోమములను మెత్తగా వుంచుకుంటుందని ఆ పిదప ఆమె గ్రహించింది.
ఈ పెంపుడు డస్సీని ఇంటికి ఎలా అలవాటు చేయాలి? ఏంచేయాల్సిన అవసరములేదు. అడవిలోనైతే వాటన్నిటికొరకు మలవిసర్జన స్థలాన్ని ప్రత్యేకించుకొంటాయి. గనుక పెంపుడు జంతువులుగా డస్సీలు “స్వయంగా మలవిసర్జన స్థలాన్ని ఉపయోగించుటకు నేర్చుకొనునని” ఫారో వివరిస్తున్నాడు. “ఆ స్థలాన్ని కడుగవనుకోండి” అని ఇంకా ఆయన అంటున్నాడు. మరి జాయ్ ఆడమ్సన్ డస్సీ సంగతికూడా అంతే. “దాని మల విసర్జనా అలవాట్లు ప్రత్యేకంగా వుండేవి . . . ఇంటి దగ్గర పాటీ యనేది మరుగుదొడ్డి గట్టుమీద పదిలంగా కూర్చుంటుంది. ఆ దృశ్యం వింతగా వుంటుంది. జంతుశాలలో దానికటువంటి ప్రత్యేక ఏర్పాట్లేవి చేయబడలేదు గనుక అది పూర్తిగా దిగ్భ్రమ చెందేది గనుక మేము దానికొరకు చివరకొక మరుగుదొడ్డిని అమర్చాము.
యెహోవా దేవుడు “మిక్కిలి జ్ఞానముగల” వాటిగా చేసిన ఇటువంటి మరి ఇతర జంతువులను గూర్చి సకాలములో సంపూర్ణముగా తెలుసుకొనుట మనకెంత ఆహ్లాదకరంగా వుంటుందో! (g90 9/8)