కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt యిర్మీయా 1:1-52:34
  • యిర్మీయా

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యిర్మీయా
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా

యిర్మీయా

1 హిల్కీయా కుమారుడైన యిర్మీయా* మాటలు. హిల్కీయా బెన్యామీనుకు చెందిన అనాతోతులోని+ యాజకుల్లో ఒకడు. 2 ఆమోను+ కుమారుడూ యూదా రాజూ అయిన యోషీయా+ పరిపాలనలోని 13వ సంవత్సరంలో యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం. 3 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ రోజుల్లో కూడా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన సిద్కియా+ పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు, అంటే ఐదో నెలలో యెరూషలేము ప్రజలు చెరగా వెళ్లేంత వరకు+ వాక్యం అతని దగ్గరికి వచ్చింది.

4 యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:

 5 “గర్భంలో నేను నిన్ను రూపొందించకముందే నువ్వు నాకు తెలుసు,*+

నువ్వు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపర్చాను.*+

నేను నిన్ను దేశాలకు ప్రవక్తగా చేశాను.”

 6 అయితే నేను, “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా!

నేను చిన్నవాణ్ణి,+ ఎలా మాట్లాడాలో నాకు తెలీదు”+ అన్నాను.

 7 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:

“ ‘నేను చిన్నవాణ్ణి’ అని అనొద్దు.

నేను పంపించే వాళ్లందరి దగ్గరికి నువ్వు వెళ్లాలి,

నేను నీకు ఆజ్ఞాపించే ప్రతీది చెప్పాలి.+

 8 వాళ్లను చూసి భయపడకు,+

ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

9 అప్పుడు యెహోవా తన చెయ్యి చాపి నా నోటిని ముట్టాడు.+ తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నేను నా మాటలు నీ నోట ఉంచాను.+ 10 ఇదిగో, ఈ రోజు నేను నిన్ను దేశాల మీద, రాజ్యాల మీద నియమించాను. పెల్లగించడానికి, కింద పడేయడానికి; నాశనం చేయడానికి, పడగొట్టడానికి; కట్టడానికి, నాటడానికి నేను నిన్ను నియమించాను.”+

11 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి, “యిర్మీయా, నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “బాదం చెట్టు* కొమ్మ కనిపిస్తోంది” అన్నాను.

12 యెహోవా నాతో ఇలా అన్నాడు: “నువ్వు సరిగ్గా చూశావు, ఎందుకంటే నా మాటను నెరవేర్చడానికి నేను మెలకువగా ఉన్నాను.”

13 యెహోవా వాక్యం రెండోసారి నా దగ్గరికి వచ్చి, “నీకు ఏం కనిపిస్తోంది?” అని అడిగింది. అందుకు నేను, “మరుగుతున్న పాత్ర* కనిపిస్తోంది, దాని మూతి ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా* వంగి ఉంది” అన్నాను. 14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు:

“ఉత్తరం వైపు నుండి విపత్తు ముంచుకొస్తుంది,

అది దేశ ప్రజలందరి మీదికి వస్తుంది.+

15 ఎందుకంటే, ‘ఉత్తర రాజ్యాల కుటుంబాలన్నిటినీ నేను రప్పిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,+

‘వాళ్లు వస్తారు; వాళ్లలో ప్రతీ ఒక్కరు

యెరూషలేము ప్రవేశ ద్వారాల దగ్గర,+

దాని చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటి ఎదురుగా,

యూదా నగరాలన్నిటి ఎదురుగా తమ సింహాసనాన్ని స్థాపిస్తారు.+

16 నా ప్రజల దుష్టత్వమంతటిని బట్టి వాళ్ల మీద నా తీర్పులు ప్రకటిస్తాను,

ఎందుకంటే వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+

వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ వాటి పొగ పైకిలేచేలా చేస్తున్నారు,*+

తమ చేతులతో చేసిన వాటికి వంగి నమస్కారం చేస్తున్నారు.’+

17 అయితే నువ్వు నడుం కట్టుకొని,

లేచి నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పాలి.

వాళ్లను చూసి భయపడకు,+

లేదంటే వాళ్ల ముందు నువ్వు భయపడేలా చేస్తాను.

18 ఈ రోజు నేను నిన్ను ప్రాకారంగల నగరంలా చేశాను;

దేశమంతటి ముందు,

యూదా రాజుల ముందు, దాని అధిపతుల ముందు,

యాజకుల ముందు, దేశ ప్రజల ముందు+

నిన్ను ఇనుప స్తంభంలా, రాగి గోడల్లా చేశాను.+

19 వాళ్లు ఖచ్చితంగా నీతో పోరాడతారు,

కానీ వాళ్లు నీ మీద గెలవరు,

ఎందుకంటే, ‘నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

2 యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “నువ్వు వెళ్లి, యెరూషలేము ప్రజలు వింటుండగా ఇలా ప్రకటించు, ‘యెహోవా ఇలా అంటున్నాడు:

“నీ యౌవనం నాటి భక్తి,*+

పెళ్లి నిశ్చయమైనప్పుడు నువ్వు చూపించిన ప్రేమ,+

ఎడారిలో,* విత్తనాలు నాటని దేశంలో నువ్వు నన్ను అనుసరించిన తీరు+ నాకు బాగా గుర్తుంది.

 3 ఇశ్రాయేలు యెహోవాకు పవిత్రుడు,+ ఆయన పంటలోని ప్రథమఫలాలు.” ’

‘అతన్ని మింగేసేవాళ్లు అపరాధులౌతారు.

వాళ్లమీదికి పెద్ద విపత్తు వస్తుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

 4 యాకోబు ఇంటివాళ్లారా,

ఇశ్రాయేలు వంశంలోని కుటుంబాల్లారా, మీరంతా యెహోవా వాక్యం వినండి.

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

“మీ తండ్రులు నన్ను విడిచిపెట్టి అంత దూరం వెళ్లడానికి,

వ్యర్థమైన దేవుళ్లను అనుసరించి+ వ్యర్థులవ్వడానికి+

వాళ్లకు నాలో ఏ తప్పు కనిపించింది?+

 6 వాళ్లు, ‘ఐగుప్తు* దేశం నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా+ ఎక్కడ?

ఎడారి గుండా,

ఎడారి ప్రాంతాలతో,+ గోతులతో నిండిన దేశం గుండా,

అనావృష్టి,+ కటిక చీకటి ఉన్న దేశం గుండా,

ఏ మనిషీ సంచరించని దేశం గుండా,

మనుషులెవ్వరూ నివసించని దేశం గుండా మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడ?’ అని అడగలేదు.

 7 తర్వాత నేను, పండ్ల తోటలు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను,

మీరు దాని పండ్లను, దానిలోని మంచివాటిని తినాలని అలా తీసుకొచ్చాను.+

కానీ మీరు వచ్చి నా దేశాన్ని అపవిత్రం చేశారు;

నా స్వాస్థ్యాన్ని అసహ్యంగా తయారుచేశారు.+

 8 యాజకులు, ‘యెహోవా ఎక్కడ?’ అని అడగలేదు.+

ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్లకు నేను తెలీదు,

కాపరులు నాకు ఎదురుతిరిగారు,+

ప్రవక్తలు బయలు పేరున ప్రవచించారు,+

వ్యర్థమైన దేవుళ్లను అనుసరించారు.

 9 ‘కాబట్టి నేను ఇంకా మీ మీద నేరం మోపుతూనే ఉంటాను,+

మీ పిల్లల పిల్లలమీద కూడా నేరం మోపుతాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

10 ‘కిత్తీము+ తీర ప్రాంతాలకు* వెళ్లి చూడండి.

అవును, కేదారుకు+ మనుషుల్ని పంపి జాగ్రత్తగా ఆలోచించండి;

ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందేమో చూడండి.

11 దేవుళ్లుకాని వాటికోసం ఏ దేశమైనా ఎప్పుడైనా తన దేవుళ్లను మార్చుకుందా?

కానీ నా సొంత ప్రజలు పనికిరాని దానికోసం నా మహిమను ఇచ్చేశారు.+

12 ఆకాశమా, దీన్ని చూసి ఆశ్చర్యపో;

విపరీతమైన భయంతో వణికిపో’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

13 ‘నా ప్రజలు రెండు తప్పులు చేశారు:

జీవజలాల ఊట అయిన నన్ను విడిచిపెట్టారు,+

నీళ్లు నిలవని పగిలిపోయిన తొట్లను తొలిపించుకున్నారు.’*

14 ‘ఇశ్రాయేలు సేవకుడా? ఇంట్లో పుట్టిన దాసుడా?

మరి అతను దోపుడుసొమ్ముగా ఎందుకు ఇవ్వబడ్డాడు?

15 కొదమ సింహాలు అతన్ని చూసి గర్జించాయి;+

అవి బిగ్గరగా గర్జించాయి.

అతని దేశాన్ని భయంకరంగా మార్చేశాయి.

అతని నగరాల్ని తగలబెట్టి నిర్మానుష్యం చేశాయి.

16 నోఫు,*+ తహపనేసు+ ప్రజలు నీ జుట్టు పీకి నీ తలను బోడిచేస్తున్నారు.

17 నీ దేవుడైన యెహోవా నిన్ను ఆ దారిలో నడిపిస్తుండగా

ఆయన్ని విడిచిపెట్టడం వల్ల

నువ్వే కదా దాన్ని నీ మీదికి తెచ్చుకున్నావు?+

18 ఇప్పుడు నువ్వు షీహోరు* నీళ్లు తాగడానికి ఐగుప్తుకు,+

ఆ నది* నీళ్లు తాగడానికి అష్షూరుకు+ వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నావు?

19 నీ దుష్టత్వమే నిన్ను సరిదిద్దాలి,

నీ నమ్మకద్రోహమే నిన్ను గద్దించాలి.

నీ దేవుడైన యెహోవాను విడిచిపెట్టడం

ఎంత తప్పో, ఎంత దుఃఖకరమో తెలుసుకో, అర్థం చేసుకో;+

నువ్వు నాకు ఏమాత్రం భయపడలేదు’+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ప్రకటిస్తున్నాడు.

20 ‘చాలాకాలం క్రితం నేను నీ కాడిని విరగ్గొట్టాను,+

నీ సంకెళ్లను తెంచేశాను.

కానీ నువ్వు, “నేను మాత్రం నిన్ను సేవించను” అన్నావు.

నువ్వు ఎత్తైన ప్రతీ కొండ మీద, పచ్చని ప్రతీ చెట్టు కింద+

పడుకొని వ్యభిచారం చేశావు.+

21 నేను నిన్ను శ్రేష్ఠమైన ఎర్రని ద్రాక్ష తీగగా నాటాను,+ నీ విత్తనాలన్నీ మేలు రకం విత్తనాలు;

మరి నువ్వు నా ముందు చెడ్డ కొమ్మలుగల అడవిద్రాక్ష తీగగా ఎలా మారావు?’+

22 ‘నువ్వు క్షారముతో,* చాలా సబ్బుతో కడుక్కున్నా,

నీ అపరాధం మరకలా నాకు కనిపిస్తూనే ఉంటుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

23 ‘నన్ను నేను మలినపర్చుకోలేదు.

బయలు దేవుళ్లను అనుసరించలేదు’ అని నువ్వు ఎలా అంటున్నావు?

లోయలో నువ్వు ఎలా ప్రవర్తించావో చూడు,

నువ్వు ఏమేం చేశావో పరిశీలించుకో.

నువ్వు ఇష్టమొచ్చినట్టు అటూఇటూ వేగంగా పరుగెత్తే ఆడ ఒంటెలా ఉన్నావు;

24 ఎడారికి అలవాటుపడి, కామోద్రేకంతో మగ వాసన కోసం గాలిస్తున్న

అడవి గాడిదలా ఉన్నావు.

ఎదకు వచ్చినప్పుడు దాన్ని ఎవరు అదుపు చేయగలరు?

మగదేదీ దాని కోసం వెతుకుతూ అలసిపోవాల్సిన అవసరం ఉండదు.

దాని నెలలో అది వాటికి దొరుకుతుంది.

25 ‘ఇశ్రాయేలూ, వట్టికాళ్లతో వెళ్లకు,

నీ గొంతు ఎండిపోకుండా చూసుకో’ అని నేను చెప్పాను.

కానీ నువ్వు, ‘అలా కాదు,+

నేను అపరిచితులతో* ప్రేమలో పడ్డాను,+

వాళ్ల వెంట వెళ్తాను’ అన్నావు.+

26 దొరికిపోయినప్పుడు దొంగ అవమానాలపాలు అయినట్టు,

ఇశ్రాయేలు ఇంటివాళ్లు అవమానాలపాలు అవుతారు.

వాళ్లు, వాళ్ల రాజులు, అధిపతులు,

యాజకులు, ప్రవక్తలు అవమానాలపాలు అవుతారు.+

27 వాళ్లు చెట్టుతో, ‘నువ్వే మా నాన్నవు’ అని,+

రాయితో, ‘నువ్వే మా అమ్మవు’ అని అంటారు.

నాకు ముఖాన్ని కాకుండా వీపును చూపిస్తారు,+

కానీ విపత్తు వచ్చినప్పుడు మాత్రం,

‘లేచి మమ్మల్ని రక్షించు!’ అని అంటారు.+

28 నువ్వు చేసుకున్న నీ దేవుళ్లు ఇప్పుడు ఏమయ్యారు?+

వాళ్లనే లేచి విపత్తు సమయంలో నీకు సహాయం చేయనీ.

యూదా, నీ నగరాలు ఎన్నో నీ దేవుళ్లూ అంతేమంది.+

29 ‘మీరు ఎందుకు నాతో వాదిస్తూ ఉన్నారు?

మీరంతా ఎందుకు నా మీద తిరుగుబాటు చేశారు?’+ అని యెహోవా అంటున్నాడు.

30 నేను మీ కుమారుల్ని శిక్షించాను, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు.+

వాళ్లు క్రమశిక్షణను ఏమాత్రం అంగీకరించరు;+

వేటాడే సింహంలా మీ కత్తే మీ ప్రవక్తల్ని చంపేసింది.+

31 ఈ తరం ప్రజలారా, యెహోవా మాట మీద మనసుపెట్టండి.

నేను ఇశ్రాయేలుకు ఎడారిలా,

అణచివేసే చీకటిగల దేశంలా ఉన్నానా?

కానీ నా ప్రజలు, ‘మేము స్వేచ్ఛగా తిరుగుతాం.

ఇక నీ దగ్గరికి రాము’ అని ఎందుకు అన్నారు?+

32 కన్య తన నగల్ని,

పెళ్లికూతురు తన ఒడ్డాణాన్ని మర్చిపోతుందా?

అయితే నా సొంత ప్రజలు లెక్కలేనన్ని రోజులు నన్ను మర్చిపోయారు.+

33 నువ్వు ప్రేమను వెదకడానికి ఎంత నేర్పుగా దారిని ఎంచుకున్నావు!

నీ అంతట నువ్వే చెడ్డపనులు చేయడం నేర్చుకున్నావు.+

34 చివరికి నీ బట్టల మీద కూడా అమాయకులైన పేదవాళ్ల రక్తం మరకలు కనబడుతున్నాయి,+

ఆ మరకలు, వాళ్లు కన్నం వేసినప్పుడు వాళ్లను చంపడం వల్ల అయిన మరకలు కాదు;

అయినా అవి నీ బట్టలన్నిటి మీదా కనిపిస్తున్నాయి.+

35 అప్పటికీ నువ్వు, ‘నేను నిర్దోషిని.

ఖచ్చితంగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయింది’ అని అంటున్నావు.

ఇప్పుడు నేను నీకు తీర్పు తీర్చబోతున్నాను.

ఎందుకంటే నువ్వు, ‘నేను పాపం చేయలేదు’ అని అంటున్నావు.

36 నువ్వు నీ అస్థిరమైన ప్రవర్తనను ఎందుకంత తేలిగ్గా తీసుకుంటున్నావు?

నువ్వు అష్షూరును బట్టి సిగ్గుపడినట్టే,+

ఐగుప్తును బట్టి కూడా సిగ్గుపడతావు.+

37 ఈ కారణాన్ని బట్టి కూడా నువ్వు అవమానంతో నీ చేతుల్ని తలమీద పెట్టుకుని వెళ్లిపోతావు,+

ఎందుకంటే, నువ్వు నమ్మకం పెట్టుకున్న వాళ్లను యెహోవా తిరస్కరించాడు;

వాళ్లు నీకు విజయాన్ని ఇవ్వలేరు.”

3 ప్రజలు ఇలా అంటారు: “ఒకతను తన భార్యకు విడాకులిచ్చినప్పుడు, ఆమె వెళ్లిపోయి ఇంకొకరి భార్య అయ్యాక అతను మళ్లీ ఆమె దగ్గరికి వెళ్తాడా?”

అలాంటి దేశం పూర్తిగా కలుషితమైపోయింది కదా.+

యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు చాలామంది సహచరులతో వ్యభిచారం చేశావు,+

ఇప్పుడు మళ్లీ నా దగ్గరికి తిరిగిరావచ్చా?”

 2 “చెట్లులేని కొండల వైపు నీ తల ఎత్తి చూడు.

నువ్వు చెరచబడని స్థలం ఏదైనా ఉందా?

ఎడారిలో అరబీయుడిలా*

నువ్వు వాళ్లకోసం దారుల పక్కన కాచుకొని కూర్చున్నావు.

నీ వ్యభిచారంతో, నీ దుష్టత్వంతో

దేశాన్ని కలుషితం చేస్తూ ఉన్నావు.+

 3 అందుకే వర్షాలు పడట్లేదు,+

కడవరి వాన* కురవట్లేదు.

వ్యభిచారం చేసే భార్యలా నువ్వు సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నావు;*

నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు.+

 4 ఇప్పుడేమో నాకు ఇలా మొరపెడుతున్నావు:

‘నా తండ్రీ, చిన్నప్పటి నుండి నువ్వే నా సహచరుడివి!+

 5 నువ్వు ఎప్పుడూ కోపంగా ఉంటావా?

ఎప్పటికీ పగ పెట్టుకుంటావా?’

నువ్వు ఇలా అంటావు కానీ,

నీ చేతనైనంత చెడు చేస్తూనే ఉంటావు.”+

6 రాజైన యోషీయా+ రోజుల్లో యెహోవా నాతో ఇలా అన్నాడు: “ ‘విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు నాకు ఏం చేసిందో చూశావా? ఆమె వ్యభిచారం చేయడానికి ఎత్తైన ప్రతీ పర్వతం మీదికి, పచ్చని ప్రతీ చెట్టు కిందికి వెళ్లింది.+ 7 ఆమె ఇవన్నీ చేసినా, నా దగ్గరికి తిరిగిరమ్మని నేను ఆమెతో చెప్తూ వచ్చాను.+ కానీ ఆమె తిరిగిరాలేదు; యూదా, నమ్మకద్రోహియైన తన సహోదరిని గమనిస్తూ ఉంది.+ 8 నేను అది చూసి, విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు వ్యభిచారాన్ని బట్టి+ ఆమెకు విడాకుల పత్రాన్ని ఇచ్చి పంపించేశాను.+ అయితే నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదా దాన్ని చూసి భయపడలేదు; ఆమె కూడా వెళ్లి వ్యభిచారం చేసింది.+ 9 ఆమె తన వ్యభిచారాన్ని తేలిగ్గా తీసుకుంది; ఆమె దేశాన్ని కలుషితం చేస్తూ రాళ్లతో, చెట్లతో వ్యభిచారం చేస్తూ వచ్చింది.+ 10 ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదా తన నిండు హృదయంతో నా దగ్గరికి తిరిగిరాలేదు, కేవలం వచ్చినట్టు నటించిందంతే’ అని యెహోవా అంటున్నాడు.”

11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నమ్మకద్రోహియైన యూదా కన్నా విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు ఎక్కువ నీతిమంతురాలు.+ 12 నువ్వు ఉత్తర దిక్కుకు వెళ్లి ఈ మాటలు ప్రకటించు:+

“ ‘ “భ్రష్టురాలైన ఇశ్రాయేలూ, తిరిగి రా,” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’+ ‘ “నేను విశ్వసనీయుణ్ణి కాబట్టి నీ మీద కోపం చూపించను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ‘ “నేను ఎల్లప్పుడూ కోపంగా ఉండను. 13 నువ్వు మాత్రం నీ అపరాధాన్ని గుర్తించు, ఎందుకంటే నువ్వు నీ దేవుడైన యెహోవాకు ఎదురుతిరిగావు. నువ్వు పచ్చని ప్రతీ చెట్టు కింద అపరిచితులతో* సంబంధం పెట్టుకుంటూ ఉన్నావు, నా స్వరానికి లోబడట్లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”

14 “భ్రష్టులైన పిల్లలారా,* తిరిగిరండి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “నేను మీ నిజమైన యజమానిని* అయ్యాను; నేను ప్రతీ నగరం నుండి ఒకర్ని, ప్రతీ కుటుంబం నుండి ఇద్దర్ని తీసుకుంటాను. అలా మిమ్మల్ని సీయోనుకు తీసుకొస్తాను.+ 15 నా ఇష్టం* ప్రకారం నడుచుకునే కాపరుల్ని మీకు ఇస్తాను;+ వాళ్లు జ్ఞానంతో, లోతైన అవగాహనతో మిమ్మల్ని పోషిస్తారు. 16 ఆ రోజుల్లో మీరు దేశంలో వృద్ధి చెంది చాలామంది అవుతారు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ “ ‘యెహోవా ఒప్పంద* మందసం!’* అని మీరు ఇంకెప్పుడూ అనరు. దాని గురించి ఎప్పుడూ ఆలోచించరు,* దాన్ని గుర్తుచేసుకోరు, అది లేదని బాధపడరు, అలాంటిది ఇంకొకటి తయారుచేయరు. 17 అప్పుడు యెరూషలేమును యెహోవా సింహాసనం అని పిలుస్తారు;+ దేశాలన్నీ యెహోవా పేరును స్తుతించడానికి యెరూషలేములో సమకూర్చబడతాయి,+ వాళ్లు ఇంకెప్పుడూ మొండిగా తమ దుష్ట హృదయాన్ని అనుసరించరు.”

18 “ఆ రోజుల్లో యూదా ఇంటివాళ్లు, ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఐక్యంగా నడుస్తారు;+ వాళ్లు ఉత్తర దేశం నుండి కలిసి బయల్దేరి, నేను మీ పూర్వీకులకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశానికి వస్తారు.+ 19 నేను, ‘నిన్ను నా కుమారుల్లో ఒకడిగా ఎంచి నీకు రమ్యమైన దేశాన్ని, దేశాల మధ్య ఎంతో అందమైన స్వాస్థ్యాన్ని ఇవ్వాలి’ అనుకున్నాను.+ అంతేకాదు మీరు నన్ను, ‘తండ్రీ!’ అని పిలుస్తారని, నన్ను అనుసరించడం మానేయరని అనుకున్నాను. 20 ‘కానీ, భార్య తన భర్తకు నమ్మకద్రోహం చేసి అతన్ని విడిచిపెట్టినట్టే, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు కూడా నాకు నమ్మకద్రోహం చేశారు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

21 చెట్లులేని కొండల మీద ఒక శబ్దం వినిపిస్తోంది,

అది ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ, వేడుకుంటున్న శబ్దం.

ఎందుకంటే, వాళ్లు తప్పు దారిలో వెళ్లారు;

తమ దేవుడైన యెహోవాను మర్చిపోయారు.+

22 “భ్రష్టులైన పిల్లలారా,* తిరిగిరండి.

నేను మీ భ్రష్ట హృదయాన్ని బాగుచేస్తాను.”+

“ఇదిగో మేము వచ్చాం! నీ దగ్గరికి వచ్చాం!

ఎందుకంటే యెహోవా, నువ్వే మా దేవుడివి.+

23 కొండల మీద, పర్వతాల మీద చేసే అల్లరి నిజంగా మోసకరమే.+

నిజంగా, మా దేవుడైన యెహోవా నుండే ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది.+

24 కానీ మా చిన్నప్పటి నుండి, ఆ పనికిరాని* దేవుడు మా పూర్వీకుల కష్టాన్ని,

వాళ్ల పశువుల్ని, మందల్ని,

కుమారుల్ని, కూతుళ్లను మింగేశాడు.+

25 రండి, మనం అవమానంతో పడుకుందాం,

మన సిగ్గు మనల్ని కప్పేయాలి,

ఎందుకంటే మనమూ, మన తండ్రులూ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు

మన దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం,+

మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడలేదు.”

4 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలూ, నువ్వు తిరిగొస్తే,

నా దగ్గరికి తిరిగొచ్చి నీ అసహ్యమైన విగ్రహాల్ని నా ముందు నుండి తీసేస్తే,

నువ్వు దేశదిమ్మరిగా ఉండవు.+

 2 నువ్వు ‘యెహోవా జీవం తోడు’ అని

సత్యంతో, న్యాయంతో, నీతితో ప్రమాణం చేస్తే,

అప్పుడు దేశాలు ఆయన* దీవెన పొందుతాయి,

ఆయన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటాయి.”+

3 యూదా, యెరూషలేము ప్రజలతో యెహోవా ఇలా అంటున్నాడు:

“సాగుచేయని భూమిని మీకోసం దున్నండి,

ముళ్ల మధ్య విత్తనాలు విత్తకండి.+

 4 యూదా, యెరూషలేము ప్రజలారా,

యెహోవా కోసం సున్నతి చేసుకోండి,

మీ హృదయాలకు సున్నతి చేసుకోండి,+

లేకపోతే మీ చెడ్డపనుల వల్ల

నా కోపం అగ్నిలా రగులుకొని కాల్చేస్తుంది,

దాన్ని ఎవరూ ఆర్పలేరు.”+

 5 యూదాలో దాన్ని ప్రకటించండి, యెరూషలేములో దాన్ని చాటించండి.

దేశమంతటా బూర* ఊదుతూ, కేకలు వేస్తూ,+

బిగ్గరగా ఇలా చెప్పండి: “అందరూ సమకూడండి,

మనం ప్రాకారాలుగల నగరాలకు పారిపోదాం.+

 6 సీయోను వైపు ధ్వజం* ఎత్తండి.

ఆశ్రయం కోసం వెదకండి, ఊరికే నిలబడకండి.”

ఎందుకంటే, నేను ఉత్తరం నుండి విపత్తును, గొప్ప ముప్పును రప్పిస్తున్నాను.+

 7 అతను సింహంలా పొదల్లో నుండి బయటికి వచ్చాడు;+

దేశాల్ని నాశనం చేసేవాడు బయల్దేరాడు.+

నీ దేశాన్ని భయంకరంగా మార్చేందుకు అతను తన స్థలం నుండి బయల్దేరాడు.

నీ నగరాలు శిథిలాలౌతాయి, వాటిలో ఒక్కరు కూడా నివసించరు.+

 8 కాబట్టి గోనెపట్ట కట్టుకోండి,+

గుండెలు బాదుకుంటూ ఏడ్వండి.

ఎందుకంటే, యెహోవా కోపాగ్ని మన మీది నుండి తొలగిపోలేదు.

 9 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజున, రాజు గుండె జారిపోతుంది,+

అధిపతులు ధైర్యం కోల్పోతారు;

యాజకులు హడలిపోతారు, ప్రవక్తలు ఆశ్చర్యపోతారు.”+

10 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ‘మీకు శాంతి ఉంటుంది’+ అంటూ నువ్వు ఈ ప్రజల్ని, యెరూషలేమును పూర్తిగా మోసం చేశావు.+ నిజానికి, మా గొంతు మీద కత్తి ఉంది.”

11 ఆ సమయంలో ఈ ప్రజలతో, యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది:

“ఎడారిలోని చెట్లులేని కొండల నుండి

నా ప్రజల కూతురి* మీదికి వడగాలి వీస్తుంది;

అది వచ్చేది తూర్పారబట్టడానికో, శుభ్రం చేయడానికో కాదు.

12 నా పిలుపు విని, ఆ చోట్ల నుండి అది బలంగా వీస్తూ వస్తుంది.

ఇప్పుడు నేను వాళ్లమీద తీర్పులు ప్రకటిస్తాను.

13 ఇదిగో! శత్రువు వానమబ్బుల్లా వస్తాడు,

అతని రథాలు సుడిగాలిలా వస్తాయి.+

అతని గుర్రాలు గద్దల కన్నా వేగంగా పరుగెత్తుతాయి.+

అయ్యో, మనకు శ్రమ, మనం నాశనమైపోయాం!

14 యెరూషలేమా, నీ హృదయంలో నుండి దుష్టత్వాన్ని కడిగేయి,

అప్పుడే నువ్వు కాపాడబడతావు.+

ఎంతకాలం నీ హృదయంలో దుష్ట ఆలోచనలకు చోటిస్తావు?

15 దాను నుండి ఒక స్వరం వినిపిస్తుంది,+

అది ఎఫ్రాయిము కొండల్లో నుండి విపత్తును చాటిస్తుంది.

16 దాని గురించి దేశాలకు చెప్పండి;

యెరూషలేముకు వ్యతిరేకంగా దాన్ని చాటించండి.”

“దూరదేశం నుండి ముట్టడిదారులు వస్తున్నారు,

వాళ్లు యూదా నగరాల మీద యుద్ధకేకలు వేస్తారు.

17 వాళ్లు మైదానాల కాపలాదారుల్లా అన్నివైపుల నుండి ఆమె మీదికి వస్తారు.+

ఎందుకంటే, ఆమె నా మీద తిరుగుబాటు చేసింది”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

18 “నీ ప్రవర్తనకు, నీ పనులకు నువ్వు మూల్యం చెల్లించాలి.+

నీ విపత్తు చాలా ఘోరంగా ఉంటుంది,

అది ఏకంగా నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది!”

19 అయ్యో నా ఆవేదన,* నా ఆవేదన!

నా హృదయం ఎంతో వేదన పడుతుంది.

నా గుండె దడదడ కొట్టుకుంటోంది.

నేను మౌనంగా ఉండలేను,

ఎందుకంటే, నాకు బూర శబ్దం వినిపించింది,

యుద్ధ ఘంటిక* వినిపించింది.+

20 ఆపద గురించిన వార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి,

ఎందుకంటే దేశమంతా నాశనమైపోయింది.

ఉన్నట్టుండి నా డేరాలు,

ఒక్క క్షణంలో నా డేరా తెరలు నాశనమైపోయాయి.+

21 ఎంతకాలం నేను ధ్వజాన్ని* చూస్తూ,

బూర శబ్దాన్ని వింటూ ఉండాలి?+

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు తెలివితక్కువవాళ్లు;+

వాళ్లు నన్ను ఏమాత్రం లెక్కచేయరు.

నా పిల్లలు మూర్ఖులు, వాళ్లకు కొంచెం కూడా అవగాహన లేదు.

చెడు చేసే విషయంలో వాళ్లు చాలా తెలివైనవాళ్లు,

కానీ మంచి చేయడం మాత్రం వాళ్లకు తెలీదు.”

23 నేను దేశాన్ని చూసినప్పుడు అది ఖాళీగా, నిర్మానుష్యంగా ఉంది!+

ఆకాశాన్ని చూసినప్పుడు అక్కడ వెలుగు లేదు.+

24 పర్వతాల్ని చూసినప్పుడు అవి కంపిస్తూ ఉన్నాయి,

కొండలు వణికిపోతూ ఉన్నాయి.+

25 నేను చూసినప్పుడు, ఒక్క మనిషి కూడా లేడు,

ఆకాశపక్షులన్నీ ఎగిరిపోయాయి.+

26 నేను చూసినప్పుడు, పండ్ల తోట ఎడారిలా తయారైంది,

దాని నగరాలన్నీ కూలిపోయాయి.+

యెహోవా వల్ల, ఆయన కోపాగ్ని వల్ల ఇలా జరిగింది.

27 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “దేశమంతా నిర్జనమౌతుంది,+

అయితే నేను దాన్ని పూర్తిగా తుడిచిపెట్టను.

28 ఈ కారణాన్ని బట్టి దేశం దుఃఖిస్తుంది,+

పైనున్న ఆకాశం చీకటౌతుంది.+

ఎందుకంటే నేను చెప్పాను, నిర్ణయించాను,

నా మనసు మార్చుకోను,* చర్య తీసుకోకుండా ఉండను.+

29 గుర్రపురౌతుల శబ్దం, విలుకాండ్ర శబ్దం విని

నగర వాసులంతా పారిపోతారు.+

వాళ్లు పొదల్లోకి దూరతారు,

బండలు ఎక్కుతారు.+

ప్రతీ నగరం నిర్మానుష్యమౌతుంది,

వాటిలో ఎవ్వరూ నివసించరు.”

30 నువ్వు నాశనమైపోయావు, ఇప్పుడు ఏం చేస్తావు?

నువ్వు ముదురు ఎరుపు రంగు బట్టలు వేసుకునేదానివి,

బంగారు నగలు పెట్టుకునేదానివి,

కాటుకతో నీ కళ్లు పెద్దవి చేసుకునేదానివి.

అయితే అందంగా తయారవ్వడానికి నువ్వు పడిన ప్రయాస అంతా వృథా,+

ఎందుకంటే, నీ మీద మోజుపడిన వాళ్లు నిన్ను తిరస్కరించారు;

ఇప్పుడు వాళ్లు నీ ప్రాణం తీయాలని చూస్తున్నారు.+

31 ఎందుకంటే, నొప్పులతో ఉన్న స్త్రీ అరుపు లాంటి శబ్దం నాకు వినిపించింది,

అది తన మొదటి బిడ్డను కంటున్న స్త్రీ వేదన లాంటి శబ్దం,

కష్టంగా ఊపిరి తీసుకుంటున్న సీయోను కూతురి స్వరం.

ఆమె తన చేతులు చాపుతూ+ ఇలా అంది:

“అయ్యో, నాకు శ్రమ, హంతకుల వల్ల నా ప్రాణం అలసిపోయింది!”

5 యెరూషలేము వీధుల్లో సంచరించండి.

చుట్టూ చూడండి, తెలుసుకోండి.

ఆమె సంతవీధుల్లో వెదకండి,

న్యాయంగా నడుచుకునే వ్యక్తి,

నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించే వ్యక్తి ఒక్కరైనా ఉన్నారేమో చూడండి.+

ఉంటే, నేను ఆమెను క్షమిస్తాను.

 2 వాళ్లు, “యెహోవా జీవం తోడు!” అని అంటారు,

కానీ అబద్ధ ప్రమాణాలు చేస్తారు.+

 3 యెహోవా, నీ కళ్లు నమ్మకమైనవాళ్ల కోసం వెదుకుతాయి కదా?+

నువ్వు వాళ్లను శిక్షించావు, కానీ వాళ్లలో ఏ మార్పూ రాలేదు.*

నువ్వు వాళ్లను తుడిచిపెట్టేశావు, కానీ వాళ్లు క్రమశిక్షణను అంగీకరించలేదు.+

వాళ్లు తమ ముఖాల్ని బండరాయి కన్నా గట్టిగా చేసుకున్నారు,+

నీ వైపు తిరగడానికి ఇష్టపడలేదు.+

 4 అయితే నేను ఇలా అనుకున్నాను: “ఖచ్చితంగా వీళ్లు సామాన్యులు అయ్యుంటారు.

వీళ్లు తెలివితక్కువగానే ప్రవర్తిస్తారు,

ఎందుకంటే వీళ్లకు యెహోవా మార్గం, తమ దేవుని తీర్పు తెలీదు.

 5 నేను ప్రముఖుల దగ్గరికి వెళ్లి మాట్లాడతాను,

ఎందుకంటే యెహోవా మార్గం, తమ దేవుని తీర్పు

వాళ్లకు తెలిసే ఉంటుంది.+

అయితే వాళ్లంతా తమ కాడిని విరగ్గొట్టుకున్నారు,

తమ కట్లు తెంచేసుకున్నారు.”

 6 అందుకే అడవిలో నుండి సింహం వచ్చి వాళ్లమీద దాడిచేస్తుంది,

ఎడారి మైదానాల్లో నుండి తోడేలు వచ్చి వాళ్లను చీల్చేస్తుంది,

చిరుతపులి వాళ్ల నగరాల దగ్గర పొంచి ఉంటుంది.

వాటిలో నుండి బయటికి వచ్చే వాళ్లంతా ముక్కలుముక్కలుగా చీల్చేయబడతారు.

ఎందుకంటే, వాళ్ల అపరాధాలకు లెక్కేలేదు;

వాళ్లు ఎన్నోసార్లు నమ్మకద్రోహం చేశారు.+

 7 ఇలా చేసినందుకు నేను నిన్ను ఎలా క్షమించగలను?

నీ కుమారులు నన్ను విడిచిపెట్టారు,

వాళ్లు దేవుడుకాని వాటి తోడని ప్రమాణం చేస్తున్నారు.+

నేను వాళ్ల అవసరాల్ని తీర్చాను,

కానీ వాళ్లు వ్యభిచారం చేస్తూ వచ్చారు,

గుంపులుగుంపులుగా వేశ్యాగృహాలకు వెళ్లారు.

 8 కామోద్రేకంతో ఉన్న గుర్రాల్లా,

వాళ్లలో ప్రతీ ఒక్కరు సకిలించుకుంటూ వేరేవాళ్ల భార్య వెంట వెళ్తున్నారు.+

 9 “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?

ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా?” అని యెహోవా అంటున్నాడు.+

10 “ఆమె ద్రాక్షతోటల్లోకి వెళ్లి నాశనం చేయండి,

అయితే పూర్తిగా తుడిచిపెట్టేయకండి.+

విస్తరిస్తున్న కొమ్మల్ని తీసేయండి,

అవి యెహోవాకు చెందినవి కావు.

11 ఎందుకంటే, ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు

నాకు చాలా నమ్మకద్రోహం చేశారు” అని యెహోవా అంటున్నాడు.+

12 “వాళ్లు యెహోవాను తిరస్కరించి ఇలా అంటూ ఉన్నారు:

‘ఆయన ఏమీ చేయడు.*+

మన మీదికి ఏ విపత్తూ రాదు;

కత్తిని గానీ కరువును గానీ మనం చూడం.’+

13 ప్రవక్తలు గాలి మాటలు మాట్లాడుతున్నారు,

దేవుని వాక్యం వాళ్లలో లేదు.

వాళ్ల మాటల్లాగే వాళ్లు కూడా వ్యర్థులవ్వాలి!”

14 కాబట్టి సైన్యాలకు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఈ మనుషులు ఇలా అంటున్నారు కాబట్టి,

నీ నోట నా మాటల్ని అగ్నిలా చేస్తున్నాను,+

ఈ ప్రజలే కలప,

అది వాళ్లను దహించేస్తుంది.”+

15 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, నేను దూరం నుండి మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తున్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“అది చాలాకాలం నుండి ఉన్న దేశం,

పురాతన దేశం.

దాని భాష నీకు తెలీదు,

వాళ్లు మాట్లాడేది నీకు అర్థం కాదు.+

16 వాళ్ల అంబులపొది తెరచి ఉన్న సమాధి;

వాళ్లంతా యోధులు.

17 వాళ్లు నీ పంటను, రొట్టెను,

కుమారుల్ని, కూతుళ్లను,

మందల్ని, పశువుల్ని,

ద్రాక్షచెట్లను, అంజూర చెట్లను మింగేస్తారు.+

నువ్వు నమ్ముకున్న ప్రాకారాలుగల నీ నగరాల్ని కత్తితో నాశనం చేస్తారు.”

18 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “చివరికి ఆ రోజుల్లో కూడా నేను నిన్ను పూర్తిగా తుడిచిపెట్టను.+ 19 వాళ్లు, ‘మన దేవుడైన యెహోవా మనకు ఎందుకు ఇలా చేశాడు?’ అని అడిగినప్పుడు నువ్వు వాళ్లతో ఇలా చెప్పాలి: ‘మీరు నన్ను విడిచిపెట్టి మీ దేశంలో వేరే దేవుణ్ణి సేవించారు కదా. కాబట్టి మీది కాని దేశంలో మీరు విదేశీయులకు సేవలు చేస్తారు.’ ”+

20 యాకోబు ఇంటివాళ్లకు,

యూదా ప్రజలకు ఇలా ప్రకటించండి:

21 “తెలివి, వివేచన* లేని ప్రజలారా,+

కళ్లు ఉండీ చూడలేని,+ చెవులు ఉండీ వినలేని ప్రజలారా,+ ఇది వినండి:

22 ‘మీరు నాకు భయపడరా?’ అని యెహోవా అంటున్నాడు,

‘మీరు నా ముందు వణకవద్దా?

సముద్రానికి ఇసుకను సరిహద్దుగా,

అది దాటలేని నిత్య నియమంగా పెట్టింది నేనే.

దాని అలలు పైకి ఎగసినా, అవి జయించలేవు;

అవి ఘోషించినా సరే, దాన్ని దాటి వెళ్లలేవు.+

23 కానీ ఈ ప్రజల హృదయం మొండిది, ఎదురుతిరిగేది;

వాళ్లు పక్కకు తొలగి తమ సొంత దారిలో వెళ్లిపోయారు.+

24 వాళ్లు, “మన దేవుడైన యెహోవాకు భయపడదాం,

సకాలంలో వర్షాన్ని కురిపించేది,

తొలకరి వానను,* కడవరి వానను* ఇచ్చేది ఆయనే.

మనకోసం కోతకాలపు వారాల్ని నియమించింది ఆయనే”+ అని తమ హృదయంలో అనుకోరు.

25 ఇవి రాకపోవడానికి కారణం మీ తప్పులే;

మీ పాపాలే మీకు మంచి జరగకుండా చేశాయి.+

26 నా ప్రజల్లో దుష్టులు ఉన్నారు.

వేటగాడు పొంచివున్నట్టు వాళ్లు పొంచివుంటారు.

వాళ్లు ప్రాణాంతకమైన ఉచ్చు పెడతారు.

దానితో మనుషుల్ని పట్టుకుంటారు.

27 పంజరం పక్షులతో నిండివున్నట్టు,

వాళ్ల ఇళ్లు మోసంతో నిండివుంటాయి.+

అందుకే వాళ్లు శక్తిమంతులు, ధనవంతులు అయ్యారు.

28 వాళ్లు కొవ్వుపట్టి నున్నగా తయారయ్యారు;

వాళ్లలో దుష్టత్వం పొంగిపొర్లుతుంది.

తాము గెలవాలనే ఉద్దేశంతో

వాళ్లు తండ్రిలేని పిల్లల వ్యాజ్యాన్ని వాదించరు;+

పేదవాళ్లకు న్యాయం జరగనివ్వరు.’ ”+

29 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?

ఇలాంటి దేశం మీద నేను పగతీర్చుకోవద్దా?

30 దేశంలో ఘోరమైన, భయంకరమైన ఒక విషయం జరిగింది, అదేంటంటే:

31 ప్రవక్తలు అబద్ధాల్ని ప్రవచిస్తున్నారు,+

యాజకులు తమ అధికారంతో ఇతరుల్ని అణగదొక్కుతున్నారు.

అలా జరగడం నా ప్రజలకు ఇష్టం.+

అయితే అంతం వచ్చినప్పుడు మీరు ఏంచేస్తారు?”

6 బెన్యామీను వంశస్థులారా,* యెరూషలేము నుండి పారిపోయి ఆశ్రయం పొందండి.

తెకోవలో+ బూర* ఊదండి;+

బేత్‌-హక్కెరెములో సూచనగా మంట వెలిగించండి!

ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి విపత్తు, గొప్ప విపత్తు ముంచుకొస్తోంది.+

 2 సీయోను కూతురు అందంగా, సుకుమారిలా ఉంది.+

 3 గొర్రెల కాపరులు తమ మందలతో వస్తారు.

వాళ్లు ఆమె చుట్టూ డేరాలు వేసుకుంటారు,+

ప్రతీ ఒక్కరు తమ స్థలంలో మందను మేపుతారు.+

 4 “ఆమెతో యుద్ధానికి సిద్ధమవ్వండి!

లెండి, మధ్యాహ్నం ఆమె మీద దాడిచేద్దాం!”

“అయ్యో, మనకు శ్రమ! పొద్దు గ్రుంకుతోంది,

సాయంకాల నీడలు పొడవౌతున్నాయి!”

 5 “లెండి, రాత్రిపూట దాడిచేసి

ఆమె పటిష్ఠమైన బురుజుల్ని నాశనం చేద్దాం.”+

 6 ఎందుకంటే, సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“చెట్లను నరికి యెరూషలేము ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టండి.+

అది శిక్షించబడాల్సిన నగరం;

ఆమెలో ఎక్కడ చూసినా అణచివేతే కనిపిస్తుంది.+

 7 బావిలో నుండి చల్లని నీళ్లు ఊరినట్టు,

ఆమెలో నుండి దుష్టత్వం ఊరుతుంది.

దౌర్జన్యం, వినాశనం జరుగుతున్న శబ్దం ఆమెలో వినిపిస్తుంది;+

ఎప్పుడూ అనారోగ్యం, తెగులే కనిపిస్తున్నాయి.

 8 యెరూషలేమా, హెచ్చరికను విను.

లేదంటే నిన్ను అసహ్యించుకుని నీ దగ్గర నుండి వెళ్లిపోతాను;+

నిన్ను ఎవ్వరూ నివసించని నిర్జన ప్రదేశంగా మారుస్తాను.”+

 9 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“వాళ్లు ఇశ్రాయేలులోని మిగిలినవాళ్లను ద్రాక్షచెట్టు మీదున్న చివరి ద్రాక్షల్ని ఏరినట్టు పూర్తిగా ఏరుతారు.

ద్రాక్షల్ని ఏరేవాడు ద్రాక్షతీగల మీద చెయ్యి వేసినట్టు మళ్లీ దానిమీద చెయ్యి వేయి.”

10 “నేను ఎవరితో మాట్లాడాలి? ఎవర్ని హెచ్చరించాలి?

నేను చెప్పేది ఎవరు వింటారు?

ఇదిగో! వాళ్ల చెవులు మూసుకుపోయాయి,* అందుకే వాళ్లు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు,+

ఇదిగో! వాళ్లు యెహోవా వాక్యాన్ని ఎగతాళి చేస్తున్నారు;+

వాళ్లు దాన్ని ఏమాత్రం ఇష్టపడట్లేదు.

11 నేను యెహోవా కోపంతో నిండిపోయాను,

దాన్ని అణుచుకొనీ అణుచుకొనీ అలసిపోయాను.”+

“వీధిలోని పిల్లల మీద,

యువకుల గుంపుల మీద దాన్ని కుమ్మరించు.+

వాళ్లంతా చెరపట్టబడతారు,

భర్త, భార్య, ముసలివాళ్లు, పండు ముసలివాళ్లు అంతా చెరపట్టబడతారు.+

12 వాళ్ల ఇళ్లు, వాళ్ల పొలాలు, వాళ్ల భార్యలు వేరేవాళ్ల సొంతమౌతాయి,+

ఎందుకంటే, నేను దేశ నివాసుల మీద నా చెయ్యి చాపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

13 “సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ అక్రమంగా సంపాదిస్తున్నారు;+

ప్రవక్తల నుండి యాజకుల వరకు అందరూ మోసం చేస్తున్నారు.+

14 శాంతి లేకపోయినా ‘శాంతి ఉంది! శాంతి ఉంది!’ అని చెప్తూ

వాళ్లు నా ప్రజల గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.+

15 వాళ్లు తమ అసహ్యమైన పనుల్ని బట్టి సిగ్గుపడుతున్నారా?

ఏమాత్రం సిగ్గుపడట్లేదు!

సిగ్గుపడడం అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలీదు!+

కాబట్టి కూలిపోయినవాళ్లతో పాటు వాళ్లూ కూలిపోతారు.

నేను వాళ్లను శిక్షించినప్పుడు వాళ్లు పడిపోతారు” అని యెహోవా అంటున్నాడు.

16 యెహోవా ఇలా అంటున్నాడు:

“కూడలిలో నిలబడి చూడండి.

పురాతన దారుల గురించి అడగండి,

మంచి దారి ఏదో అడిగి తెలుసుకొని, దానిలో నడవండి,+

అలా విశ్రాంతి పొందండి.”

కానీ వాళ్లు, “మేము దానిలో నడవం” అని అంటున్నారు.+

17 “నేను కావలివాళ్లను నియమించాను.+

వాళ్లు, ‘బూర ధ్వనిని+ శ్రద్ధగా వినండి!’ అని చెప్పారు.”

కానీ ప్రజలు, “మేము వినం” అన్నారు.+

18 “కాబట్టి దేశాల్లారా, వినండి!

సమాజమా, వాళ్లకు ఏం జరుగుతుందో తెలుసుకో.

19 భూమీ, విను!

ఈ ప్రజల కుట్రల్ని బట్టి

నేను వాళ్లమీదికి విపత్తు రప్పిస్తున్నాను,+

ఎందుకంటే, వాళ్లు నా మాటల్ని పట్టించుకోలేదు,

వాళ్లు నా ధర్మశాస్త్రాన్ని* తిరస్కరించారు.”

20 “నువ్వు షేబ నుండి సాంబ్రాణి తీసుకొస్తే నాకేంటి?

దూరదేశం నుండి సువాసన మొక్క తీసుకొస్తే నాకేంటి?

మీ సంపూర్ణ దహనబలుల్ని నేను అంగీకరించట్లేదు,

మీ బలుల్ని చూసి నేను సంతోషించట్లేదు.”+

21 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“ఈ ప్రజల కోసం నేను అడ్డురాళ్లు పెడుతున్నాను,

వాళ్లు వాటికి తట్టుకొని పడిపోతారు,

తండ్రులు, కుమారులు,

పొరుగువాడు, అతని సహచరుడు,

అందరూ నశించిపోతారు.”+

22 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! ఉత్తర దేశం నుండి ఒక జనం వస్తుంది,

భూమ్మీది సుదూర ప్రాంతాల నుండి ఒక గొప్ప జనం బయల్దేరుతుంది.+

23 వాళ్లు విల్లును, ఈటెను పట్టుకొని వస్తారు.

వాళ్లు క్రూరులు, ఏమాత్రం కరుణలేని వాళ్లు.

వాళ్ల స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది,

వాళ్లు గుర్రాలమీద స్వారీ చేస్తారు.+

సీయోను కూతురా, వాళ్లు యోధుడిలా యుద్ధ పంక్తులు తీరి నీమీదికి వస్తారు.”

24 మనం దాని గురించిన వార్త విన్నాం.

మన చేతులు పడిపోయాయి;+

విపత్తు మనమీదికి ముంచుకొచ్చింది,

ప్రసవించే స్త్రీ వేదన లాంటి వేదన మనల్ని పట్టుకుంది.+

25 పొలంలోకి వెళ్లకు,

దారిలో నడవకు,

ఎందుకంటే, శత్రువు దగ్గర కత్తి ఉంది;

అంతటా భయం అలుముకుంది.

26 నా ప్రజల కూతురా,

గోనెపట్ట కట్టుకుని+ బూడిదలో దొర్లు.

ఒక్కగానొక్క కుమారుడి కోసం ఏడ్చినట్టు వెక్కివెక్కి ఏడ్వు,+

ఎందుకంటే, నాశనం చేసేవాడు హఠాత్తుగా మనమీదికి వస్తాడు.+

27 “నేను నిన్ను* నా ప్రజల మధ్య లోహాన్ని పరీక్షించేవాడిగా,

క్షుణ్ణంగా పరిశీలించేవాడిగా చేశాను;

నువ్వు వాళ్లమీద దృష్టిపెట్టి వాళ్లేం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి.

28 వాళ్లంతా చాలాచాలా మొండివాళ్లు,+

వాళ్లు లేనిపోనివి కల్పించి చెప్పుకుంటూ తిరుగుతారు.+

వాళ్లు రాగి లాంటివాళ్లు, ఇనుము లాంటివాళ్లు;

వాళ్లంతా భ్రష్టులు.

29 కొలిమి తిత్తులు మాడిపోయాయి.

వాటి మంటల్లో నుండి సీసం వస్తోంది.

ఎంత కష్టపడి శుద్ధి చేసినా ఫలితం లేదు,+

చెడ్డవాళ్లు వేరుచేయబడలేదు.+

30 ప్రజలు వాళ్లను, తిరస్కరించబడిన వెండి అని అంటారు,

ఎందుకంటే యెహోవా వాళ్లను తిరస్కరించాడు.”+

7 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “నువ్వు యెహోవా మందిర ద్వారంలో నిలబడి, అక్కడ ఈ సందేశం ప్రకటించు: ‘యెహోవాకు వంగి నమస్కారం చేయడానికి ఈ ద్వారాల గుండా ప్రవేశించే యూదా ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. 3 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “మీ ప్రవర్తనను, మీ పనుల్ని సరిదిద్దుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థలంలో ఉండనిస్తాను.+ 4 మోసకరమైన మాటల మీద నమ్మకం పెట్టుకుని, ‘ఇది* యెహోవా మందిరం, యెహోవా మందిరం, యెహోవా మందిరం!’ అని అనకండి.+ 5 మీరు నిజంగా మీ ప్రవర్తననూ మీ పనుల్నీ సరిదిద్దుకుంటే, ఒక మనిషికీ అతని పొరుగువాడికీ మధ్య న్యాయం చేస్తే,+ 6 పరదేశుల్ని, అనాథల్ని,* విధవరాళ్లను అణచివేయకుండా ఉంటే,+ ఈ స్థలంలో నిర్దోషుల రక్తాన్ని చిందించకుండా ఉంటే, మీ స్వనాశనానికి దారితీసే వేరే దేవుళ్లను అనుసరించకుండా ఉంటే,+ 7 ఈ స్థలంలో, అంటే మీ తండ్రులకు నేను శాశ్వతంగా* ఇచ్చిన దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.” ’ ”

8 “కానీ మీరు మోసకరమైన మాటల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు,+ దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. 9 మీరు దొంగతనాలు,+ హత్యలు, వ్యభిచారం, అబద్ధ ప్రమాణాలు చేసి,+ బయలుకు బలులు అర్పించి,+ మీకు తెలియని దేవుళ్లను అనుసరించి, 10 తర్వాత వచ్చి, నా పేరు పెట్టబడిన ఈ మందిరంలో నా ముందు నిలబడి, అసహ్యమైన ఈ పనులన్నీ చేసి కూడా, ‘మేం కాపాడబడతాం’ అని మీరు అనుకోవచ్చా? 11 నా పేరు పెట్టబడిన ఈ మందిరం మీ కళ్లకు దోపిడీదొంగల గుహలా కనిపిస్తుందా?+ మీరు చేసిందంతా నేను చూశాను” అని యెహోవా అంటున్నాడు.

12 “ ‘అయితే ఇప్పుడు షిలోహులో నేను ఎంచుకున్న చోటుకు,+ అంటే నా పేరును మహిమపర్చడానికి నేను మొదట్లో ఎంచుకున్న చోటుకు+ వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చెడుతనాన్ని బట్టి నేను దానికి ఏమి చేశానో చూడండి.+ 13 అయినాసరే మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు’ అని యెహోవా అంటున్నాడు. ‘నేను పదేపదే* మీతో మాట్లాడాను, కానీ మీరు వినలేదు.+ నేను మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ మీరు పలకలేదు.+ 14 కాబట్టి నేను నా పేరు పెట్టబడిన ఈ మందిరానికి, మీరు నమ్మకం పెట్టుకుంటున్న ఈ మందిరానికి,+ మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన ఈ స్థలానికి షిలోహుకు చేసినట్టే+ చేస్తాను.+ 15 మీ సహోదరులైన ఎఫ్రాయిము వంశస్థులందర్నీ వెళ్లగొట్టినట్టే మిమ్మల్ని కూడా నా కళ్లముందు నుండి వెళ్లగొడతాను.’+

16 “నువ్వైతే, ఈ ప్రజల కోసం ప్రార్థించకు. వాళ్లకోసం మొరపెట్టకు, ప్రార్థన చేయకు, నన్ను వేడుకోకు;+ ఎందుకంటే నేను వినను.+ 17 యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు కదా? 18 కుమారులు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు మంట వెలిగిస్తున్నారు, వాళ్ల భార్యలేమో ఆకాశరాణికి* రొట్టెలు అర్పించడానికి పిండి పిసుకుతున్నారు,+ వేరే దేవుళ్లకు పానీయార్పణలు అర్పిస్తున్నారు; నాకు కోపం తెప్పించడానికే వాళ్లు ఇవన్నీ చేస్తున్నారు.+ 19 ‘వాళ్లు నన్ను దుఃఖపెడుతున్నారా?’* అని యెహోవా అంటున్నాడు. ‘కాదు, తమను తామే దుఃఖపెట్టుకుంటున్నారు, తమకే అవమానం తెచ్చుకుంటున్నారు.’+ 20 కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో! నా కోపం, నా ఉగ్రత ఈ స్థలం మీద కుమ్మరించబడుతుంది; మనుషుల మీద, జంతువుల మీద, పొలంలోని చెట్ల మీద, భూమి పంట మీద కుమ్మరించబడుతుంది; అది ఆరిపోకుండా మండుతూనే ఉంటుంది.’+

21 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇలాగే చేయండి, వేరే బలులతో పాటు సంపూర్ణ దహనబలులు కూడా అర్పించండి, ఆ మాంసం మీరే తినండి.+ 22 ఐగుప్తు దేశం నుండి నేను మీ పూర్వీకుల్ని బయటికి తీసుకొచ్చిన రోజున సంపూర్ణ దహనబలుల గురించి, బలుల గురించి నేను వాళ్లకు చెప్పలేదు, వాటి గురించి ఆజ్ఞాపించలేదు.+ 23 కానీ నేను వాళ్లకు ఈ ఆజ్ఞ ఇచ్చాను: “నా మాటకు లోబడండి, అప్పుడు నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు.+ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిట్లో మీరు నడవాలి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.” ’+ 24 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు;+ బదులుగా తమ దుష్ట హృదయాన్ని మొండిగా అనుసరిస్తూ+ సొంత ఆలోచనల ప్రకారం నడుచుకున్నారు, ముందుకు కాదు వెనక్కే వెళ్లారు, 25 మీ పూర్వీకులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు వాళ్లు అలాగే చేశారు.+ కాబట్టి నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ రోజూ, పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ వచ్చాను.+ 26 కానీ వాళ్లు నా మాటలు వినడానికి ఇష్టపడలేదు, పట్టించుకోలేదు.+ బదులుగా, వాళ్లు మొండిగా ప్రవర్తించారు, తమ పూర్వీకుల కన్నా ఘోరంగా నడుచుకున్నారు!

27 “ఈ మాటలన్నీ నువ్వు వాళ్లకు చెప్తావు,+ కానీ వాళ్లు వినరు; నువ్వు వాళ్లను పిలుస్తావు, కానీ వాళ్లు పలకరు. 28 నువ్వు వాళ్లతో ఇలా అంటావు: ‘తమ దేవుడైన యెహోవా స్వరానికి లోబడని, క్రమశిక్షణను స్వీకరించడానికి ఇష్టపడని దేశం ఇదే. నమ్మకత్వం నశించిపోయింది, దాని గురించి ఎవ్వరూ కనీసం మాట్లాడుకోవట్లేదు కూడా.’+

29 “పొడవైన నీ వెంట్రుకల్ని కత్తిరించి, పారేయి; చెట్లులేని కొండల మీద శోకగీతం పాడు. ఎందుకంటే, తనకు కోపం తెప్పించిన ఈ తరాన్ని యెహోవా తిరస్కరించాడు, ఆయన దాన్ని విడిచిపెట్టేస్తాడు. 30 ‘ఎందుకంటే, యూదా ప్రజలు నా దృష్టిలో చెడ్డవైనవి చేశారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నా పేరు పెట్టబడిన మందిరంలో తమ అసహ్యమైన విగ్రహాల్ని పెట్టి, దాన్ని అపవిత్రపర్చారు.+ 31 వాళ్లు బెన్‌హిన్నోము* లోయలో+ తోఫెతు దగ్గర ఉన్నత స్థలాలు నిర్మించి తమ కుమారుల్ని, కూతుళ్లను మంటల్లో కాల్చారు;+ అలా చేయమని నేను వాళ్లకు ఆజ్ఞాపించలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.’+

32 “ ‘కాబట్టి ఇదిగో! అది ఇక తోఫెతు అని గానీ, బెన్‌హిన్నోము* లోయ అని గానీ కాకుండా వధ లోయ అని పిలవబడే రోజులు వస్తున్నాయి’ అని యెహోవా అంటున్నాడు. ‘తోఫెతులో ఇక స్థలం లేకుండా పోయేవరకు శవాల్ని పాతిపెడుతూ ఉంటారు.+ 33 ఈ ప్రజల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి, వాటిని అదిలించి వెళ్లగొట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ 34 యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం ఇక వినిపించకుండా చేస్తాను,+ ఎందుకంటే దేశం శిథిలాలుగా మారుతుంది.’ ”+

8 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ సమయంలో యూదా రాజుల ఎముకలు, దాని అధిపతుల ఎముకలు, యాజకుల ఎముకలు, ప్రవక్తల ఎముకలు, యెరూషలేము నివాసుల ఎముకలు వాళ్ల సమాధుల్లో నుండి బయటికి తీయబడతాయి. 2 వాళ్లు ప్రేమిస్తూ, సేవిస్తూ, అనుసరిస్తూ, సంప్రదిస్తూ, వంగి నమస్కారం చేస్తూ వచ్చిన సూర్యచంద్ర నక్షత్రాల* ముందు అవి పరచబడతాయి.+ వాటిని ఎవ్వరూ పోగుచేయరు, పాతిపెట్టరు. అవి నేలమీద ఎరువు అవుతాయి.”+

3 “నేను వాళ్లను చెదరగొట్టే స్థలాలన్నిటిలో, ఈ దుష్ట కుటుంబంలో మిగిలినవాళ్లు తాము బ్రతికుండడం కన్నా చనిపోవడమే నయం అనుకుంటారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

4 “నువ్వు వాళ్లతో ఏం చెప్పాలంటే, ‘యెహోవా ఇలా అంటున్నాడు:

“ఎవరైనా పడిపోతే మళ్లీ లేవరా?

ఒక వ్యక్తి వెనక్కి తిరిగితే, ఇంకో వ్యక్తి కూడా వెనక్కి తిరగడా?

 5 మరి యెరూషలేము ప్రజలు ఎందుకని మారకుండా నాకు నమ్మకద్రోహం చేస్తున్నారు?

వాళ్లు మోసాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నారు;

వెనక్కి తిరగడానికి ఇష్టపడట్లేదు.+

 6 నేను శ్రద్ధగా వింటూ ఉన్నాను, కానీ వాళ్లు మాట్లాడిన పద్ధతి సరిగ్గా లేదు.

‘నేను చేసిందేంటి?’ అని అంటూ తన దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడే వ్యక్తి ఒక్కడు కూడా లేడు.+

గుర్రం యుద్ధానికి దౌడు తీసినట్టు, ప్రతీ ఒక్కరు అందరూ నడిచే దారిలోకి వెళ్తున్నారు.

 7 ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగకు కూడా దాని నియమిత సమయాలు తెలుసు;

గువ్వ, మంగలకత్తి పిట్ట, మైనా పిట్ట* సరైన సమయంలో వలస వెళ్తాయి.

కానీ నా సొంత ప్రజలకు యెహోవా తీర్పు అర్థం కావట్లేదు.” ’+

 8 ‘ “మేము తెలివిగలవాళ్లం, మా దగ్గర యెహోవా ధర్మశాస్త్రం* ఉంది” అని మీరెలా అనగలరు?

నిజానికి, లేఖికుల* అబద్ధ కలం+ అబద్ధాలు రాయడానికే ఉపయోగించబడింది.

 9 తెలివిగలవాళ్లు అవమానపర్చబడ్డారు.+

వాళ్లు బెదిరిపోతారు, పట్టబడతారు.

వాళ్లు యెహోవా వాక్యాన్ని తిరస్కరించారు,

వాళ్ల తెలివి ఏపాటిది?

10 కాబట్టి నేను వాళ్ల భార్యల్ని వేరేవాళ్లకు ఇచ్చేస్తాను,

వాళ్ల పొలాల్ని ఇతరులకు అప్పగిస్తాను;+

ఎందుకంటే సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ అక్రమంగా సంపాదిస్తున్నారు;+

ప్రవక్తల నుండి యాజకుల వరకు అందరూ మోసం చేస్తున్నారు.+

11 శాంతి లేకపోయినా “శాంతి ఉంది! శాంతి ఉంది!”+ అని చెప్తూ

వాళ్లు నా ప్రజల కూతురి గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.

12 వాళ్లు తమ అసహ్యమైన పనుల్ని బట్టి సిగ్గుపడుతున్నారా?

ఏమాత్రం సిగ్గుపడట్లేదు!

సిగ్గుపడడం అంటే ఏమిటో కూడా వాళ్లకు తెలీదు!+

కాబట్టి కూలిపోయినవాళ్లతో పాటు వాళ్లూ కూలిపోతారు.

నేను వాళ్లను శిక్షించినప్పుడు వాళ్లు పడిపోతారు’+ అని యెహోవా అంటున్నాడు.

13 ‘నేను వాళ్లను సమకూర్చినప్పుడు, వాళ్లను అంతం చేస్తాను’ అని యెహోవా అంటున్నాడు.

‘ద్రాక్షచెట్టు మీద ఒక్క ద్రాక్ష కూడా ఉండదు, అంజూర చెట్టు మీద ఒక్క అంజూర పండు కూడా ఉండదు, ఆకులు వాడిపోతాయి.

నేను వాళ్లకు ఇచ్చినవి వాళ్లవి కాకుండాపోతాయి.’ ”

14 “మనం ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నాం?

పదండి, అందరం కలిసి ప్రాకారాలుగల నగరాల్లోకి వెళ్లి+ అక్కడ చచ్చిపోదాం.

ఎందుకంటే, మన దేవుడైన యెహోవా మనల్ని చంపేస్తాడు,

ఆయన మనకు విషం కలిపిన నీళ్లు ఇస్తాడు,+

ఎందుకంటే, మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం.

15 మనం శాంతి కోసం ఎదురుచూశాం, కానీ ఏ మంచీ జరగలేదు,

బాగౌతుందని ఎదురుచూశాం, కానీ భయం అలుముకుంది!+

16 దాను నుండి శత్రువుల గుర్రాల సకిలింపు వినిపిస్తోంది.

మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా కంపిస్తోంది.

వాళ్లు వచ్చి దేశాన్ని, దానిలో ఉన్న సమస్తాన్ని,

నగరాన్ని, దాని నివాసుల్ని మింగేస్తారు.”

17 “నేను మీ మధ్యకు పాముల్ని,

పాము మంత్రానికి లొంగని విషసర్పాల్ని పంపిస్తున్నాను,

అవి ఖచ్చితంగా మిమ్మల్ని కాటేస్తాయి” అని యెహోవా అంటున్నాడు.

18 నా దుఃఖానికి మందు లేదు;

నా గుండె బలహీనపడింది.

19 దూరదేశం నుండి నా ప్రజల కూతురు,

“సీయోనులో యెహోవా లేడా?

ఆమె రాజు అందులో లేడా?”

అంటూ మొరపెడుతోంది.

“వాళ్లు తమ చెక్కుడు విగ్రహాలతో, వేరే దేశాల వ్యర్థమైన దేవుళ్లతో

ఎందుకు నాకు కోపం తెప్పించారు?”

20 “కోతకాలం ముగిసింది, వేసవికాలం వెళ్లిపోయింది,

కానీ మనం మాత్రం కాపాడబడలేదు!”

21 నా ప్రజల కూతురి పతనాన్ని బట్టి నాకు చాలా దుఃఖం కలుగుతోంది;+

నేను కృంగిపోయాను.

నాకు భయం పట్టుకుంది.

22 గిలాదులో సాంబ్రాణి* లేదా?+

అక్కడ వైద్యుడే లేడా?+

మరి నా ప్రజల కూతురి ఆరోగ్యం ఎందుకు బాగవ్వలేదు?+

9 నా తల బావిలా,

నా కళ్లు కన్నీటి ఊటలా ఉంటే ఎంత బావుండు!+

అప్పుడు నా ప్రజల్లో హతులైనవాళ్ల గురించి

నేను రాత్రింబగళ్లు ఏడుస్తాను.

 2 బస చేయడానికి ఎడారిలో నాకో స్థలం ఉంటే ఎంత బావుండు!

అప్పుడు నేను నా ప్రజల్ని విడిచి దూరంగా వెళ్తాను;

ఎందుకంటే వాళ్లంతా వ్యభిచారులు,+ మోసగాళ్ల ముఠా.

 3 వాళ్లు తమ నాలుకను విల్లులా వంచుతారు;

దేశంలో నమ్మకత్వానికి బదులు అబద్ధమే రాజ్యమేలుతోంది.+

“వాళ్లు అంతకంతకూ నీచంగా తయారౌతున్నారు,

నన్ను ఏమాత్రం లెక్కచేయట్లేదు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

 4 “ప్రతీ ఒక్కరు తమ పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండండి,

సొంత సహోదరుణ్ణి కూడా నమ్మకండి.

ఎందుకంటే ప్రతీ సహోదరుడు నమ్మకద్రోహి,+

ప్రతీ పొరుగువాడు లేనిపోనివి కల్పించి చెప్పేవాడు.+

 5 ప్రతీ వ్యక్తి తన పొరుగువాణ్ణి మోసం చేస్తున్నాడు,

ఒక్కరూ నిజం మాట్లాడట్లేదు.

వాళ్లు తమ నాలుకకు అబద్ధాలాడడం నేర్పించారు.+

తప్పులు చేసీచేసీ అలసిపోతున్నారు.

 6 నువ్వు మోసం మధ్య జీవిస్తున్నావు.

వాళ్లు మోసం చేయడంలో మునిగిపోయి నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడలేదు” అని యెహోవా అంటున్నాడు.

 7 కాబట్టి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“నేను వాళ్లను కొలిమిలో వేసి శుద్ధి చేస్తాను,+

నా ప్రజల కూతురికి నేను ఇంతకన్నా ఏం చేయగలను?

 8 వాళ్ల నాలుక ప్రాణాలు తీసే బాణం, అది మోసపు మాటలు మాట్లాడుతుంది.

ఒక వ్యక్తి తన పొరుగువానితో పైకి శాంతిగా మాట్లాడతాడు,

కానీ లోపల అతని మీద కుట్ర పన్నుతాడు.”

 9 యెహోవా ఇలా అంటున్నాడు: “ఇలాంటి పనులు చేసినందుకు నేను వాళ్లను లెక్క అడగవద్దా?

ఇలాంటి దేశం మీద నేను పగ తీర్చుకోవద్దా?+

10 నేను పర్వతాల గురించి ఏడుస్తాను, విలపిస్తాను,

ఎడారిలోని పచ్చిక మైదానాల గురించి శోకగీతం పాడతాను,

ఎందుకంటే అవి కాల్చేయబడ్డాయి,

ఏ మనిషీ వాటి మీదుగా వెళ్లట్లేదు, పశువుల అరుపులు వినబడట్లేదు,

ఆకాశపక్షులు ఎగిరిపోయాయి, జంతువులు పారిపోయాయి; ఇక లేవు.+

11 నేను యెరూషలేమును రాళ్లకుప్పలా,+ నక్కలకు నివాస స్థలంగా చేస్తాను,+

యూదా నగరాల్ని ఒక్క నివాసి కూడా లేని నిర్జన ప్రదేశాలుగా మారుస్తాను.+

12 దీన్ని అర్థం చేసుకునేంత తెలివి ఎవరికుంది?

ఈ మాటల్ని ప్రకటించేలా యెహోవా వాటిని ఎవరికి చెప్పాడు?

దేశం ఎందుకు నశించిపోయింది?

ఎవ్వరూ దాని గుండా వెళ్లకుండా

ఎడారిలా ఎందుకు ఎండిపోయింది?”

13 యెహోవా ఇలా జవాబిచ్చాడు: “ఎందుకంటే నేను వాళ్లకు ఇచ్చిన నా ధర్మశాస్త్రాన్ని* వాళ్లు తిరస్కరించారు, దాన్ని అనుసరించలేదు, నా మాట వినలేదు. 14 బదులుగా వాళ్లు మొండిగా తమకు నచ్చిందే చేశారు,+ తమ తండ్రులు నేర్పించినట్టు బయలు విగ్రహాల్ని అనుసరించారు.+ 15 కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ ప్రజలతో మాచిపత్రి* తినిపిస్తాను, విషం కలిపిన నీళ్లు తాగిస్తాను.+ 16 వాళ్లకు గానీ వాళ్ల తండ్రులకు గానీ తెలియని దేశాల మధ్యకు వాళ్లను చెదరగొడతాను,+ నేను వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేంతవరకు వాళ్ల వెనక ఖడ్గాన్ని పంపిస్తాను.’+

17 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

‘అవగాహనతో ప్రవర్తించండి.

శోకగీతాలు పాడే స్త్రీలను,+

నైపుణ్యంగల స్త్రీలను పిలిపించండి.

18 వాళ్లు త్వరగా వచ్చి మన కోసం విలాపగీతం పాడాలి.

అప్పుడు మన కళ్లలో నుండి కన్నీళ్లు ధారలా ప్రవహిస్తాయి,

మన కనురెప్పల నుండి కన్నీటి చుక్కలు రాలతాయి.+

19 ఎందుకంటే సీయోను నుండి విలాప శబ్దం వినిపిస్తోంది:+

“అయ్యో, మనం నశించిపోయామే!

మనం ఇంత ఘోరంగా అవమానం పొందామే!

మనం దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందే, శత్రువులు మన ఇళ్లను కూలగొట్టారే.”+

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి.

మీ చెవి ఆయన నోటి మాటను అంగీకరించాలి.

మీ కూతుళ్లకు ఈ విలాపగీతం నేర్పించండి,

ఒకరికొకరు ఈ శోకగీతం నేర్పించుకోండి.+

21 ఎందుకంటే వీధుల్లో నుండి పిల్లల్ని,

సంతవీధుల్లో నుండి యువకుల్ని తీసుకెళ్లిపోవడానికి+

మన కిటికీల గుండా మరణం వచ్చింది;

అది మన పటిష్ఠమైన బురుజుల్లోకి ప్రవేశించింది.’

22 నువ్విలా చెప్పు, ‘యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు:

“ప్రజల శవాలు పొలంలో పెంటలా పడివుంటాయి,

కోతకోస్తున్న వాడి వెనక పనలు వరుసగా పడివున్నట్టు అవి పడివుంటాయి.

వాటిని పోగుచేసేవాళ్లు ఎవరూ ఉండరు.” ’ ”+

23 యెహోవా ఇలా చెప్తున్నాడు:

“తెలివిగలవాడు తన తెలివి గురించి,

బలవంతుడు తన బలం గురించి,

ధనవంతుడు తన ధనం గురించి గొప్పలు చెప్పుకోకూడదు.”+

24 “గొప్పలు చెప్పుకునేవాడు,

నా గురించిన లోతైన అవగాహన, నా గురించిన జ్ఞానం కలిగి ఉండడాన్ని బట్టి,+

భూమ్మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ నీతిన్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే+ అని తెలుసుకోవడాన్ని బట్టి గొప్పలు చెప్పుకోవాలి,

ఈ విషయాల్లో నేను సంతోషిస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.

25 “ఇదిగో! నేను లెక్క అడిగే రోజులు వస్తున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు; “సున్నతి చేయించుకుని కూడా సున్నతిలేని వాళ్లలా ఉన్నవాళ్లను నేను లెక్క అడుగుతాను;+ 26 ఐగుప్తును,+ యూదాను,+ ఎదోమును,+ అమ్మోనీయుల్ని,+ మోయాబును,+ కణతల పక్క వెంట్రుకల్ని గొరిగించుకున్న ఎడారి నివాసులందర్నీ+ నేను లెక్క అడుగుతాను; ఎందుకంటే దేశాల ప్రజలందరూ సున్నతి లేనివాళ్లు, ఇశ్రాయేలు ఇంటివాళ్లంతా హృదయ సున్నతి లేనివాళ్లు.”+

10 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీకు వ్యతిరేకంగా యెహోవా చెప్పిన మాట వినండి. 2 యెహోవా ఇలా అంటున్నాడు:

“దేశాల పద్ధతుల్ని నేర్చుకోకండి,+

దేశాలు భయపడినట్టు ఆకాశ సూచనలకు భయపడకండి.+

 3 ఎందుకంటే, దేశదేశాల ప్రజల ఆచారాలు వ్యర్థమైనవి.

అది కేవలం అడవిలో నరికిన ఒక చెట్టు,

చేతిపనివాడు తన పనిముట్టుతో* దాన్ని చెక్కుతాడు.+

 4 వెండిబంగారాలతో దాన్ని అలంకరిస్తారు,+

కింద పడిపోకుండా సుత్తితో, మేకులతో దాన్ని దిగగొడతారు.+

 5 అవి దోస చేనులో పక్షులు రాకుండా పెట్టిన బొమ్మలాంటివి, అవి మాట్లాడలేవు;+

వాటిని ఎవరో ఒకరు మోసుకెళ్లాలి, ఎందుకంటే అవి నడవలేవు.+

వాటికి భయపడకండి, అవి ఏ హానీ చేయలేవు,

మంచి కూడా చేయలేవు.”+

 6 యెహోవా, నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+

నువ్వు గొప్పవాడివి, నీ పేరు గొప్పది, బలమైనది.

 7 దేశాల ప్రభువా,+ నీకు భయపడనివాళ్లు ఎవరు? అందుకు నువ్వు అర్హుడివి;

దేశాల్లోని తెలివిగల వాళ్లందరిలో, వాళ్ల రాజ్యాలన్నిట్లో

నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+

 8 వాళ్లంతా బుద్ధిలేనివాళ్లు, మూర్ఖులు.+

చెట్టు ఇచ్చే ఉపదేశం వ్యర్థమైనది.+

 9 తర్షీషు నుండి వెండి రేకులు,+ ఉపాజు నుండి బంగారం తెస్తారు,

అవి చేతిపనివాడు చేసినవి, కంసాలి మలిచినవి.

వాటి బట్టలు నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో చేసినవి.

అవన్నీ నైపుణ్యంగల పనివాళ్లు చేసినవి.

10 కానీ యెహోవా నిజమైన దేవుడు.

ఆయన మాత్రమే జీవంగల దేవుడు,+ శాశ్వతకాల రాజు.+

ఆయన కోపానికి భూమి వణుకుతుంది,+

ఆయన ఉగ్రతను దేశాలు తట్టుకోలేవు.

11 * నువ్వు వాళ్లతో ఇలా చెప్పాలి:

“ఆకాశాన్ని, భూమిని చేయని దేవుళ్లు

భూమ్మీద, ఆకాశం కింద లేకుండాపోతారు.”+

12 ఆయన తన శక్తితో భూమిని చేశాడు,

తన తెలివితో పంటభూమిని స్థిరపర్చాడు,+

తన అవగాహనతో ఆకాశాన్ని పరిచాడు.+

13 ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు,

ఆకాశ జలాల్లో అలజడి రేగుతుంది,+

ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు.+

వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు,

తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+

14 ప్రతీ మనిషి బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.

తాను చెక్కిన విగ్రహాన్ని బట్టి ప్రతీ కంసాలి అవమానాలపాలు అవుతాడు;+

ఎందుకంటే, అతను పోతపోసిన విగ్రహం అబద్ధం,

వాటిలో ఊపిరే* లేదు.+

15 అవి వ్యర్థమైనవి, ఎగతాళికి తగినవి.+

వాటిని లెక్క అడిగే రోజు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

16 యాకోబు దేవుడు* వీటి లాంటివాడు కాదు,

ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు,

ఇశ్రాయేలు ఆయన స్వాస్థ్యంలో అత్యంత విలువైన భాగం.+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.+

17 ముట్టడి వేయబడిన స్థలంలో నివసిస్తున్న ఓ స్త్రీ,

నేల మీద నుండి నీ మూట తీసుకో.

18 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:

“ఈ సమయంలో నేను దేశ నివాసుల్ని బయటికి విసిరేస్తున్నాను,+

నేను వాళ్లను కష్టాలపాలు చేస్తాను.”

19 అయ్యో, నా పతనాన్ని బట్టి నాకు శ్రమ!+

నా గాయం నయం కానిది.

నేను ఇలా అన్నాను: “ఇది నా జబ్బు, నేను దీన్ని భరించక తప్పదు.

20 నా డేరా పాడైపోయింది, నా డేరా తాళ్లన్నీ తెగిపోయాయి.+

నా కుమారులు నన్ను విడిచి వెళ్లిపోయారు, వాళ్లు ఇక లేరు.+

నా డేరాను పరచడానికి గానీ, నా డేరా తెరల్ని లేపడానికి గానీ ఎవ్వరూ మిగల్లేదు.

21 ఎందుకంటే, కాపరులు అవివేకుల్లా ప్రవర్తించారు,+

వాళ్లు యెహోవా దగ్గర విచారణ చేయలేదు.+

అందుకే వాళ్లు లోతైన అవగాహనతో ప్రవర్తించలేదు,

వాళ్ల మందలన్నీ చెల్లాచెదురయ్యాయి.”+

22 ఇప్పుడే అందిన వార్త వినండి!

ఉత్తర దేశం నుండి గొప్ప అలజడి వినిపిస్తోంది,+

వాళ్లు యూదా నగరాల్ని నిర్మానుష్యంగా, నక్కలకు నివాస స్థలంగా చేస్తారు.+

23 యెహోవా, తాను వెళ్లాల్సిన దారిని మనిషి సొంతగా కనుక్కోలేడని నాకు బాగా తెలుసు.

తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.+

24 యెహోవా, నీ కోపంతో కాదు న్యాయంగా నన్ను సరిదిద్దు,+

లేదంటే నేను పూర్తిగా నశించిపోతాను.+

25 నిన్ను నిర్లక్ష్యం చేసే దేశాల మీద,

నీ పేరున ప్రార్థించని కుటుంబాల మీద నీ ఉగ్రతను కుమ్మరించు.+

ఎందుకంటే వాళ్లు యాకోబును మింగేశారు,+

అవును, అతన్ని మింగేసి పూర్తిగా నాశనం చేశారు,+

అతని స్వదేశాన్ని నిర్మానుష్యం చేశారు.+

11 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “ప్రజలారా, ఈ ఒప్పంద మాటలు వినండి!

“నువ్వు* యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో మాట్లాడి, 3 వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ఒప్పంద మాటలకు లోబడని వ్యక్తి శాపగ్రస్తుడు,+ 4 ఐగుప్తు అనే ఇనుప కొలిమి నుండి మీ పూర్వీకుల్ని బయటికి రప్పించిన+ రోజున నేను ఆ మాటల్ని వాళ్లకు ఆజ్ఞాపించాను,+ అప్పుడు నేను ఇలా అన్నాను: ‘నా మాటకు లోబడండి, నేను ఆజ్ఞాపించేవన్నీ చేయండి; అప్పుడు మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవునిగా ఉంటాను,+ 5 పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని నేను మీ పూర్వీకులకు ఒట్టేసి చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాను.’+ ఈ రోజు వరకు మీరు అక్కడే నివసిస్తున్నారు.” ’ ”

అప్పుడు నేను ఇలా అన్నాను: “ఆమేన్‌,* యెహోవా.”

6 తర్వాత యెహోవా నాకు ఇలా చెప్పాడు: “యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో ఈ మాటలన్నీ ప్రకటించు: ‘ఈ ఒప్పంద మాటలు వినండి, వాటిని పాటించండి. 7 నేను మీ పూర్వీకుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన రోజు, “నా మాటకు లోబడండి” అంటూ వాళ్లను హెచ్చరించాను. ఈ రోజు వరకు వాళ్లను పదేపదే* హెచ్చరిస్తూ ఉన్నాను.+ 8 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు; బదులుగా ప్రతీ ఒక్కరు తమ దుష్ట హృదయాన్ని మొండిగా అనుసరిస్తూ వచ్చారు.+ కాబట్టి నేను ఏ ఒప్పందాన్ని పాటించమని వాళ్లకు చెప్పానో, ఏ ఒప్పందాన్ని వాళ్లు పాటించలేదో ఆ ఒప్పంద మాటలన్నీ వాళ్లమీదికి రప్పించాను.’ ”

9 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు కుట్ర పన్నుతున్నారు. 10 వాళ్లు, గతంలో తమ పూర్వీకులు చేసిన తప్పుల వైపు తిరిగారు. వాళ్ల పూర్వీకులు నా మాటలకు లోబడడానికి ఇష్టపడలేదు.+ వాళ్లు కూడా వేరే దేవుళ్లను అనుసరించారు, పూజించారు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు తమ పూర్వీకులతో నేను చేసిన ఒప్పందాన్ని మీరారు.+ 11 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్లమీదికి ఒక విపత్తును తీసుకొస్తున్నాను,+ దాన్నుండి వాళ్లు తప్పించుకోలేరు. వాళ్లు సహాయం కోసం నాకు మొరపెట్టినప్పుడు, నేను వినను.+ 12 అప్పుడు యూదా నగరాలు, యెరూషలేము నివాసులు తాము బలులు అర్పిస్తున్న దేవుళ్ల దగ్గరికి వెళ్లి సహాయం కోసం మొరపెడతారు,+ కానీ విపత్తు సమయంలో అవి ఏవిధంగానూ వాళ్లను కాపాడలేవు. 13 ఎందుకంటే యూదా, నీ నగరాలు ఎన్ని ఉన్నాయో నీకు అంతమంది దేవుళ్లు ఉన్నారు; యెరూషలేములో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని బలిపీఠాల్ని ఆ పనికిరాని* దేవుని కోసం కట్టావు, వాటిమీద బయలుకు బలులు అర్పించావు.’+

14 “నువ్వైతే,* ఈ ప్రజల కోసం ప్రార్థించకు. వాళ్ల కోసం మొరపెట్టకు, ప్రార్థన చేయకు,+ ఎందుకంటే విపత్తును బట్టి వాళ్లు పెట్టే మొరను నేను వినను.

15 వాళ్లలో ఇంతమంది దుష్ట పన్నాగాలు పన్నాక,

ఇక నా మందిరంలో ఉండే హక్కు నా ప్రియమైన ప్రజలకు ఎక్కడుంది?

విపత్తు వచ్చినప్పుడు పవిత్ర మాంసంతో* నువ్వు దాన్ని తప్పించగలవా?

ఆ సమయంలో నువ్వు ఉల్లసిస్తావా?

16 యెహోవా ఒకప్పుడు నిన్ను శ్రేష్ఠమైన పండ్లు ఉన్న

అందమైన, పచ్చని ఒలీవ చెట్టు అని పిలిచాడు.

ఇప్పుడు మహా గర్జన శబ్దంతో ఆయన దానికి నిప్పంటించాడు,

వాళ్లు దాని కొమ్మల్ని విరగ్గొట్టారు.

17 “నిన్ను నాటిన+ సైన్యాలకు అధిపతైన యెహోవా నీమీదికి విపత్తు వస్తుందని ప్రకటించాడు. బయలుకు బలులు అర్పించి ఆయనకు కోపం తెప్పించిన ఇశ్రాయేలు ఇంటివాళ్లు, యూదా ఇంటివాళ్లు చేసిన చెడును బట్టి ఆ విపత్తు నీమీదికి వస్తుంది.”+

18 యెహోవా చెప్పడం వల్ల అది నాకు తెలిసింది;

ఆ సమయంలో, వాళ్లు ఏం చేస్తున్నారో నువ్వు నాకు చూపించావు.

19 నేను వధకు తేబడుతున్న సాధువైన గొర్రెపిల్లలా ఉన్నాను.

వాళ్లు నా మీద ఇలా కుట్ర పన్నుతున్నారని నాకు తెలీదు:+

“పండ్లతో సహా చెట్టును నాశనం చేద్దాం,

అతని పేరు ఇక వినిపించకుండా

సజీవుల దేశంలో నుండి అతన్ని నిర్మూలిద్దాం.”

20 కానీ సైన్యాలకు అధిపతైన యెహోవా నీతితో తీర్పు తీరుస్తాడు;

ఆయన అంతరంగాన్ని,* హృదయాన్ని పరిశీలిస్తాడు.+

నువ్వు వాళ్లమీద పగ తీర్చుకోవడం నన్ను చూడనివ్వు,

ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను.

21 కాబట్టి నీ ప్రాణం తీయాలని చూస్తూ, “యెహోవా పేరున నువ్వు ప్రవచించకూడదు,+ లేదంటే నువ్వు మా చేతుల్లో చస్తావు” అని అంటున్న అనాతోతు+ మనుషుల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: 22 సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, “నేను వాళ్లను లెక్క అడగబోతున్నాను. వాళ్ల యువకులు కత్తి వల్ల చనిపోతారు,+ వాళ్ల కుమారులూ కూతుళ్లూ కరువు వల్ల చనిపోతారు.+ 23 వాళ్లలో ఎవ్వరూ మిగలరు, ఎందుకంటే అనాతోతు+ వాళ్లను నేను లెక్క అడిగే సంవత్సరంలో వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాను.”

12 యెహోవా, నువ్వు నీతిమంతుడివి.+

నేను నీకు ఫిర్యాదు చేసినప్పుడు,

న్యాయం గురించిన విషయాలు నీతో మాట్లాడినప్పుడు

నువ్వు న్యాయంగా వ్యవహరిస్తావు.

కానీ దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు?+

మోసగాళ్లు ఎందుకు చీకూచింతా లేకుండా ఉంటున్నారు?

 2 నువ్వు వాళ్లను నాటావు, వాళ్లు వేళ్లూనుకున్నారు.

ఎదిగి కాయలు కాస్తున్నారు.

వాళ్లు తరచూ నీ గురించి మాట్లాడతారు,

కానీ వాళ్ల అంతరంగం* నీకు చాలా దూరంగా ఉంది.+

 3 కానీ యెహోవా, నేను నీకు బాగా తెలుసు,+ నువ్వు నన్ను చూస్తున్నావు;

నా హృదయాన్ని పరిశీలించి, అది నీతో ఐక్యంగా ఉందని తెలుసుకున్నావు.+

వధ కోసం గొర్రెల్ని వేరుచేసినట్టు వాళ్లను వేరుచేయి,

వధించే రోజు కోసం వాళ్లను ప్రత్యేకంగా ఉంచు.

 4 ఇంకా ఎంతకాలం దేశం ఎండిపోవాలి,

మైదానాల్లోని పచ్చిక వాడిపోవాలి?+

దానిలోని నివాసుల చెడుతనాన్ని బట్టి

జంతువులు, పక్షులు తుడిచిపెట్టుకుపోయాయి.

వాళ్లు ఇలా అన్నారు: “మనకు ఏం జరగబోతుందో ఆయన చూడడు.”

 5 మనుషులతో పరుగెత్తినప్పుడే నువ్వు అలసిపోతే,

గుర్రాలతో ఎలా పరుగెత్తగలవు?+

శాంతికరమైన దేశంలో సురక్షితంగా ఉండడానికి అలవాటుపడ్డావు,

మరి యొర్దాను వెంబడి దట్టమైన పొదల్లో ఉన్నప్పుడు నువ్వు ఏమి చేస్తావు?

 6 ఎందుకంటే నీ సొంత అన్నదమ్ములే, నీ తండ్రి ఇంటివాళ్లే

నీతో మోసపూరితంగా ప్రవర్తించారు.+

నీమీద గట్టిగా అరిచారు.

వాళ్లు నీతో మంచిగా మాట్లాడినా వాళ్లను నమ్మకు.

 7 “నేను నా మందిరాన్ని విడిచిపెట్టేశాను;+ నా స్వాస్థ్యాన్ని వదిలేశాను.+

నాకెంతో ప్రియమైనదాన్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించాను.+

 8 నా స్వాస్థ్యం నాకు అడవిలోని సింహంలా తయారైంది.

ఆమె నామీద గర్జించింది.

అందుకే నేను ఆమెను అసహ్యించుకోవడం మొదలుపెట్టాను.

 9 నా స్వాస్థ్యం నాకు రంగురంగుల* వేటాడే పక్షిలా ఉంది;

వేటాడే ఇతర పక్షులు దాన్ని చుట్టుముట్టి, దానిమీద దాడిచేస్తున్నాయి.+

జంతువులారా, తినడానికి మీరంతా కలిసి రండి.+

10 చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు;+

నా భూభాగాన్ని తొక్కేశారు.+

నా ప్రియమైన భూభాగాన్ని పాడుబడ్డ ఎడారిలా చేశారు.

11 అది పనికిరాని భూమిలా తయారైంది.

ఎండిపోయింది;*

నా ముందు నిర్మానుష్యంగా పడివుంది.+

దేశమంతా పాడైపోయింది,

కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించట్లేదు.+

12 నాశనం చేసేవాళ్లు ఎడారిలోని అన్ని దారుల* గుండా వచ్చారు,

ఎందుకంటే, యెహోవా ఖడ్గం దేశ ప్రజలందర్నీ మింగేస్తోంది.+

ఎవ్వరికీ శాంతి లేదు.

13 వాళ్లు గోధుమల్ని విత్తారు, కానీ ముళ్లను కోశారు.+

చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం లేదు.

తమ పంటను చూసి వాళ్లు సిగ్గుపడతారు,

ఎందుకంటే యెహోవా కోపాగ్ని వాళ్లమీద రగులుకుంది.”

14 యెహోవా ఇలా అంటున్నాడు: “దుష్టులైన నా పొరుగువాళ్ల విషయానికొస్తే, అంటే నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని స్వాధీనం చేసుకోనిచ్చిన స్వాస్థ్యాన్ని ముట్టుకుంటున్న వాళ్ల విషయానికొస్తే,+ నేను వాళ్ల దేశంలో నుండి వాళ్లను పెల్లగిస్తాను,+ వాళ్ల మధ్య నుండి యూదా ఇంటివాళ్లను పెల్లగిస్తాను. 15 కానీ వాళ్లను పెల్లగించిన తర్వాత, మళ్లీ వాళ్లమీద కరుణ చూపిస్తాను, వాళ్లలో ప్రతీ ఒక్కర్ని తన స్వాస్థ్యానికి, తన దేశానికి తిరిగి తీసుకొస్తాను.”

16 “వాళ్లు నా ప్రజల మార్గాల్ని నేర్చుకుని, గతంలో నా ప్రజలకు బయలును బట్టి ప్రమాణం చేయడం నేర్పించినట్టే, ‘యెహోవా జీవం తోడు!’ అని నా పేరున ప్రమాణం చేయడం నేర్చుకుంటే, వాళ్లు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు. 17 కానీ వాళ్లు లోబడడానికి ఇష్టపడకపోతే, నేను ఆ దేశాన్ని కూడా పెల్లగిస్తాను, నాశనం చేస్తాను” అని యెహోవా అంటున్నాడు.+

13 యెహోవా నాకు ఇలా చెప్పాడు: “వెళ్లి, ఒక నార దట్టీ కొనుక్కొని, దాన్ని నీ నడుముకు కట్టుకో, కానీ దాన్ని నీళ్లలో తడపకు.” 2 దాంతో నేను యెహోవా మాట ప్రకారం ఒక దట్టీ కొనుక్కొని నడుముకు కట్టుకున్నాను. 3 రెండోసారి యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 4 “నువ్వు కొనుక్కొని నడుముకు కట్టుకున్న దట్టీ తీసుకొని, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, అక్కడ ఒక బండ సందులో దాన్ని దాచిపెట్టు.” 5 యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టే, నేను వెళ్లి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.

6 చాలా రోజుల తర్వాత యెహోవా నాతో, “నువ్వు లేచి, యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, దాచిపెట్టమని నేను నీకు ఆజ్ఞాపించిన దట్టీని తీసుకో” అన్నాడు. 7 అప్పుడు నేను యూఫ్రటీసు దగ్గరికి వెళ్లి, ఆ దట్టీని దాచిపెట్టిన స్థలంలో నుండి దాన్ని తవ్వి తీశాను, ఆ దట్టీ పాడైపోయి ఎందుకూ పనికిరాకుండా తయారైంది.

8 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 9 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘యూదా గర్వాన్ని, యెరూషలేము మహా గర్వాన్ని నేను ఇలాగే నాశనం చేస్తాను.+ 10 నా మాటలకు లోబడడానికి ఇష్టపడకుండా,+ మొండిగా తమ హృదయాన్ని అనుసరిస్తూ,+ వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాటిని పూజిస్తూ, వాటికి వంగి నమస్కారం చేసే ఈ దుష్ట ప్రజలు కూడా ఎందుకూ పనికిరాని ఈ దట్టీలాగే తయారౌతారు.’ 11 ‘ఒక వ్యక్తి నడుముకు దట్టీ కట్టుకున్నట్టే, నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లందర్నీ, యూదా ఇంటివాళ్లందర్నీ నా నడుముకు కట్టుకున్నాను. వాళ్లు నాకు ప్రజలుగా,+ నాకు కీర్తిని,+ స్తుతిని, ఘనతను తీసుకొచ్చే వాళ్లుగా ఉండాలని అలా చేశాను. కానీ వాళ్లు లోబడలేదు’+ అని యెహోవా అంటున్నాడు.

12 “నువ్వు వాళ్లకు ఈ సందేశాన్ని కూడా చెప్పాలి: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలి.” ’ అప్పుడు వాళ్లు, ‘ప్రతీ పెద్ద కూజా ద్రాక్షారసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని నీతో అంటారు. 13 అప్పుడు నువ్వు వాళ్లకిలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఈ దేశ నివాసులందర్నీ, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, యెరూషలేము నివాసులందర్నీ మత్తులుగా చేయబోతున్నాను.+ 14 నేను వాళ్లను ఒకరి మీద ఒకర్ని పడేస్తాను, తండ్రుల్నీ కుమారుల్నీ ఒకేలా నాశనం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ “నేను వాళ్లమీద కనికరం చూపించను, బాధపడను, కరుణ చూపించను; వాళ్లను నాశనం చేయకుండా ఏదీ నన్ను ఆపలేదు.” ’+

15 వినండి, శ్రద్ధపెట్టండి.

అహంకారం చూపించకండి, ఎందుకంటే యెహోవా మాట్లాడాడు.

16 ఆయన చీకటిని తీసుకురాకముందే,

చీకటిపడి పర్వతాల మీద మీ పాదాలు తడబడకముందే,

మీ దేవుడైన యెహోవాను మహిమపర్చండి.

మీరు వెలుగు వస్తుందనుకుంటారు,

కానీ ఆయన చీకటిని తెస్తాడు;

దాన్ని చిమ్మచీకటిగా మారుస్తాడు.+

17 మీరు వినడానికి ఇష్టపడకపోతే,

మీ గర్వాన్ని బట్టి నేను చాటుగా ఏడుస్తాను.

కన్నీరుమున్నీరుగా విలపిస్తాను,+

ఎందుకంటే యెహోవా మంద+ చెరగా తీసుకెళ్లబడింది.

18 రాజుతో, రాజమాతతో+ ఇలా చెప్పు: ‘అవమానంతో కింద కూర్చోండి,

ఎందుకంటే, అందమైన మీ కిరీటం మీ తలమీద నుండి పడిపోతుంది.’

19 దక్షిణ దేశ నగరాలు మూయబడ్డాయి,* వాటిని తెరిచేవాళ్లు ఎవ్వరూ లేరు.

యూదా ప్రజలంతా చెరగా తీసుకెళ్లబడ్డారు.+

20 నీ* తల ఎత్తి, ఉత్తరం నుండి వస్తున్నవాళ్లను చూడు.+

నీకు ఇచ్చిన మంద, నీ అందమైన గొర్రెలు ఎక్కడ?+

21 నువ్వు మొదటి నుండి శిక్షణ ఇచ్చిన నీ సన్నిహిత స్నేహితుల ద్వారానే

నీకు శిక్ష వస్తే+ నువ్వు ఏమంటావు?

ప్రసవించే స్త్రీ లాంటి వేదన నీకు కలగదా?+

22 ‘ఇవన్నీ ఎందుకు నా మీదికి వచ్చాయి?’ అని నీకు అనిపిస్తే,+

నీ గొప్ప దోషం వల్లే నీ బట్టలు తీసేయబడ్డాయని,+

నీ మడిమెలకు ఇంత నొప్పి కలిగిందని తెలుసుకో.

23 కూషీయుడు* తన చర్మాన్ని మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా?+

అది సాధ్యమైతే, చెడు చేయడానికి అలవాటుపడిన నువ్వు

మంచి చేయడం కూడా సాధ్యమౌతుంది.

24 కాబట్టి ఎడారి గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను మిమ్మల్ని చెదరగొడతాను.+

25 నేను నీ కోసం కొలిచి ఉంచిన భాగం, నీ వంతు ఇదే” అని యెహోవా అంటున్నాడు.

“ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయావు,+ అబద్ధాల మీద నమ్మకం పెట్టుకుంటున్నావు.+

26 కాబట్టి, నేను నీ వస్త్రాన్ని ముఖం వరకు పైకెత్తుతాను,

ప్రజలు నీ మానం చూస్తారు,+

27 నీ వ్యభిచార క్రియల్ని,+ కామంతో నువ్వు చేసే సకిలింపుల్ని,

నీచమైన* నీ వేశ్యా ప్రవర్తనను చూస్తారు.

కొండల మీద, పొలంలో

నీ అసహ్యమైన ప్రవర్తనను నేను చూశాను.+

యెరూషలేమా, నీకు శ్రమ!

ఇంకా ఎంతకాలం నువ్వు అపవిత్రంగా ఉంటావు?”+

14 అనావృష్టి గురించి యిర్మీయా దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం:+

 2 యూదా ఏడుస్తోంది,+ దాని ద్వారాలు పడిపోయాయి.

అవి విచారంతో నేలలోకి దిగిపోతున్నాయి,

యెరూషలేము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

 3 యజమానులు నీళ్ల కోసం సేవకుల్ని పంపిస్తున్నారు.

వాళ్లు బావుల* దగ్గరికి వెళ్లి, నీళ్లు లేకపోవడంతో

ఖాళీ కూజాలతో తిరిగొస్తున్నారు.

వాళ్లు సిగ్గుతో, నిరాశతో తలలు కప్పుకుంటున్నారు.

 4 దేశంలో వర్షం లేక నేల బీటలు వారింది,+

రైతులు దిగులుతో తలలు కప్పుకుంటున్నారు.

 5 చివరికి మైదానంలో పిల్లను ఈనిన దుప్పి కూడా

గడ్డి లేనందువల్ల దాన్ని వదిలేస్తోంది.

 6 అడవి గాడిదలు చెట్లులేని కొండలమీద నిలబడుతున్నాయి.

అవి నక్కల్లా రొప్పుతున్నాయి;

పచ్చిక లేకపోవడం వల్ల వాటి కళ్లు క్షీణించిపోతున్నాయి.+

 7 యెహోవా, మా తప్పులే మామీద సాక్ష్యం చెప్తున్నా,

నీ పేరు కోసం చర్య తీసుకో.+

ఎందుకంటే మా నమ్మకద్రోహ కార్యాలకు లెక్కేలేదు,+

మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.

 8 ఇశ్రాయేలుకు నిరీక్షణగా ఉన్న దేవా, కష్టకాలంలో రక్షించే దేవా,+

నువ్వు దేశంలో అపరిచితుడిలా,

కేవలం ఒక రాత్రి బస చేయడానికి ఆగే యాత్రికుడిలా ఎందుకు ఉన్నావు?

 9 నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోయిన వ్యక్తిలా,

రక్షించలేని శూరుడిలా ఎందుకున్నావు?

యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు,+

మేము నీ పేరుతో పిలవబడుతున్నాం.+

మమ్మల్ని విడిచిపెట్టకు.

10 ఈ ప్రజల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “వాళ్లకు అటూఇటూ తిరగడమంటే చాలా ఇష్టం;+ వాళ్లు తమ పాదాల్ని అదుపులో పెట్టుకోలేదు. కాబట్టి యెహోవా వాళ్ల విషయంలో సంతోషించట్లేదు. ఇప్పుడు ఆయన వాళ్ల తప్పును గుర్తు చేసుకుంటాడు, వాళ్ల పాపాల్ని బట్టి లెక్క అడుగుతాడు.”+

11 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఈ ప్రజలకు మంచి జరగాలని ప్రార్థించకు.+ 12 వాళ్లు ఉపవాసం ఉన్నప్పుడు నేను వాళ్ల మొరల్ని వినను;+ వాళ్లు సంపూర్ణ దహనబలులు, ధాన్యార్పణలు అర్పించినప్పుడు వాటిని బట్టి సంతోషించను;+ నేను వాళ్లను ఖడ్గంతో, కరువుతో, తెగులుతో నిర్మూలిస్తాను.”+

13 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ప్రవక్తలు వాళ్లతో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, కరువు మీ మీదికి రాదు, దేవుడు ఈ స్థలంలో మీకు నిజమైన శాంతిని దయచేస్తాడు’ అని చెప్తున్నారు.”+

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఆ ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు.+ నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు, వాళ్లతో మాట్లాడనూ లేదు.+ వాళ్లు అబద్ధ దర్శనాన్ని, వ్యర్థమైన సోదెను, తమ హృదయాల్లో ఉన్న మోసాన్ని మీకు ప్రవచిస్తున్నారు.+ 15 నేను పంపకపోయినా నా పేరున ప్రవచిస్తూ, ఈ దేశం మీదికి ఖడ్గం గానీ కరువు గానీ రాదని చెప్తున్న ఆ ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు.+ 16 వాళ్లు ఎవరికైతే ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు, అంటే వాళ్లు, వాళ్ల భార్యలు, కుమారులు, కూతుళ్లు కరువు వల్ల, ఖడ్గం వల్ల యెరూషలేము వీధుల్లో పడేయబడతారు, వాళ్లను పాతిపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+ ఎందుకంటే, నేను వాళ్లమీదికి తగిన విపత్తును రప్పిస్తాను.’+

17 “నువ్వు వాళ్లతో ఈ మాట చెప్పాలి:

‘రాత్రింబగళ్లు నా కళ్లలో నుండి ఆగకుండా కన్నీళ్లు ప్రవహిస్తూ ఉండాలి,+

ఎందుకంటే, నా ప్రజల కన్య పూర్తిగా నలగ్గొట్టబడింది, విరగ్గొట్టబడింది,+

ఆమెకు చాలా తీవ్రమైన గాయమైంది.

18 నేను పొలంలోకి వెళ్లి చూస్తే,

ఖడ్గం వల్ల హతమైనవాళ్లు కనిపిస్తున్నారు!+

నగరంలోకి వస్తే,

కరువు బాధితులు+ కనిపిస్తున్నారు!

ప్రవక్తలూ యాజకులూ తమకు తెలియని దేశంలో సంచరిస్తున్నారు.’ ”+

19 నువ్వు యూదాను పూర్తిగా తిరస్కరించావా? సీయోనును అసహ్యించుకున్నావా?+

మేము బాగవ్వలేనంతగా ఎందుకు మమ్మల్ని శిక్షించావు?+

మేము శాంతి కోసం ఎదురుచూశాం, కానీ ఏ మంచీ జరగలేదు,

బాగౌతుందని ఎదురుచూశాం, కానీ భయం అలుముకుంది!+

20 యెహోవా, మా దుష్టత్వాన్ని,

మా పూర్వీకుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం.

మేము నీకు వ్యతిరేకంగా పాపం చేశాం.+

21 నీ పేరు కోసం, దయచేసి మమ్మల్ని తిరస్కరించకు;+

మహిమగల నీ సింహాసనాన్ని నీచంగా చూడకు.

నువ్వు మాతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకో, దాన్ని రద్దు చేయకు.+

22 దేశాలు పూజించే వ్యర్థమైన విగ్రహాల్లో ఏవైనా వర్షాన్ని కురిపించగలవా?

కనీసం ఆకాశమైనా దానంతటదే వర్షాన్ని కురిపించగలదా?

యెహోవా, మా దేవా, నువ్వు మాత్రమే దాన్ని చేయగలవు.+

మేము నీ మీదే ఆశపెట్టుకున్నాం,

ఎందుకంటే నువ్వే ఇవన్నీ చేస్తున్నావు.

15 తర్వాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “చివరికి మోషే, సమూయేలు నా ముందు నిలబడినా,+ ఈ ప్రజల మీద నేను దయ చూపించను. వాళ్లను నా ముందు నుండి వెళ్లగొట్టు, వాళ్లు వెళ్లిపోవాలి. 2 ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని వాళ్లు నిన్ను అడిగితే, నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘యెహోవా ఏమంటున్నాడంటే,

“ప్రాణాంతకమైన తెగులు కోసం నియమించబడినవాళ్లు ప్రాణాంతకమైన తెగులుకు!

ఖడ్గం కోసం నియమించబడినవాళ్లు ఖడ్గానికి!+

కరువు కోసం నియమించబడినవాళ్లు కరువుకు!

చెర కోసం నియమించబడినవాళ్లు చెరకు వెళ్లాలి!” ’+

3 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను వాళ్లమీద నాలుగు విపత్తుల్ని* నియమిస్తాను.+ చంపడానికి ఖడ్గాన్ని, శవాల్ని లాక్కెళ్లడానికి కుక్కల్ని, మింగేసి నాశనం చేయడానికి ఆకాశపక్షుల్ని, భూమ్మీది జంతువుల్ని నియమిస్తాను.+ 4 హిజ్కియా కుమారుడూ యూదా రాజూ అయిన మనష్షే యెరూషలేములో చేసినదాన్ని బట్టి+ భూమ్మీది రాజ్యాలన్నీ వాళ్లను చూసి భయపడేలా చేస్తాను.+

 5 యెరూషలేమా, నీమీద కనికరం చూపించేది ఎవరు?

నీమీద సానుభూతి చూపించేది ఎవరు?

నువ్వు ఎలా ఉన్నావని అడగడానికి ఆగేది ఎవరు?’

 6 యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు నన్ను వదిలేశావు.+

నువ్వు నన్ను విడిచివెళ్తూ* ఉన్నావు.+

కాబట్టి నీమీద నా చెయ్యి చాపి, నిన్ను నాశనం చేస్తాను.+

నీమీద జాలి చూపించీ చూపించీ నేను విసిగిపోయాను.*

 7 నేను దేశ ద్వారాల దగ్గర ముళ్లపారతో వాళ్లను తూర్పారబడతాను.

వాళ్ల పిల్లల్ని చంపేస్తాను.+

నా ప్రజల్ని నాశనం చేస్తాను,

ఎందుకంటే, వాళ్లు తమ మార్గాల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు.+

 8 వాళ్ల విధవరాళ్ల సంఖ్య నా ముందు సముద్రపు ఇసుక రేణువుల కన్నా ఎక్కువగా ఉంటుంది.

మిట్టమధ్యాహ్నం నేను వాళ్ల మీదికి, అంటే తల్లుల మీదికి, యువకుల మీదికి నాశకుడిని రప్పిస్తాను.

నేను హఠాత్తుగా వాళ్లను భయాందోళనలకు గురిచేస్తాను.

 9 ఏడుగురు పిల్లల్ని కన్న స్త్రీ మూర్ఛపోయింది;

ఆమెకు ఊపిరాడట్లేదు.

ఆమె సూర్యుడు పగటిపూటే అస్తమించాడు,

దానివల్ల* సిగ్గు, అవమానం కలిగాయి.’

‘వాళ్లలో మిగిలిన కొంతమందిని నేను శత్రువుల ఖడ్గానికి అప్పగిస్తాను’ అని యెహోవా అంటున్నాడు.”+

10 అయ్యో, నాకు శ్రమ! అమ్మా, నన్నెందుకు కన్నావు?+

దేశంలోని వాళ్లందరూ నాతో గొడవపడుతున్నారు, వాదిస్తున్నారు.

నేను ఎవరికీ అప్పు ఇవ్వలేదు, తీసుకోలేదు;

అయినా వాళ్లంతా నన్ను శపిస్తున్నారు.

11 యెహోవా ఇలా అన్నాడు: “నేను ఖచ్చితంగా నీకు మంచి చేస్తాను;

విపత్తు సమయంలో, కష్టకాలంలో

శత్రువు ముందు నీ తరఫున జోక్యం చేసుకుంటాను.

12 ఎవరైనా ఇనుమును, ఉత్తరం నుండి వచ్చిన ఇనుమును, రాగిని విరగ్గొట్టగలరా?

13 నీ* వనరుల్ని, నీ సంపదల్ని నేను దోపుడుసొమ్ముగా ఇచ్చేస్తాను,+

డబ్బులకు కాదు, నీ ప్రాంతాలన్నిట్లో నువ్వు చేసిన పాపాల్ని బట్టి ఇచ్చేస్తాను.

14 వాటిని నీ శత్రువులకు ఇస్తాను,

వాళ్లు నీకు తెలియని దేశానికి వాటిని తీసుకెళ్తారు.+

ఎందుకంటే నా కోపం అగ్నిని రాజేసింది,

అది నీకు వ్యతిరేకంగా మండుతోంది.”+

15 యెహోవా, నీకు తెలుసు,

నన్ను గుర్తుచేసుకో, నా మీద దృష్టిపెట్టు.

నన్ను హింసించేవాళ్ల మీద నా తరఫున పగతీర్చుకో.+

కోప్పడే విషయంలో నిదానిస్తూ నన్ను నశించిపోనివ్వకు.

నీ కోసమే నేను ఈ నిందను భరిస్తున్నానని గుర్తుంచుకో.+

16 నీ మాటలు నాకు దొరికాయి, నేను వాటిని తిన్నాను;+

నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఉల్లాసాన్ని ఇచ్చాయి,

ఎందుకంటే సైన్యాలకు దేవుడివైన యెహోవా, నేను నీ పేరుతో పిలవబడుతున్నాను.

17 నేను నవ్వేవాళ్ల మధ్య కూర్చుని సంతోషించట్లేదు.+

నీ చెయ్యి నామీద ఉండడం వల్ల నేను ఒంటరిగా కూర్చుంటున్నాను,

ఎందుకంటే, నువ్వు నన్ను కోపంతో* నింపేశావు.+

18 నా నొప్పి ఎందుకు తగ్గట్లేదు? నా గాయం ఎందుకు మానట్లేదు?

అది తగ్గనంటోంది.

నువ్వు నాకు నమ్మలేని, నీళ్లులేని ఊటలా తయారౌతావా?

19 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“నువ్వు తిరిగొస్తే, నేను నిన్ను పునరుద్ధరిస్తాను,

అప్పుడు నువ్వు నా ముందు నిలబడతావు.

నువ్వు వ్యర్థమైన వాటి నుండి అమూల్యమైన వాటిని వేరుచేస్తే,

నాకు నోరువి* అవుతావు.

వాళ్లే నీ వైపు తిరుగుతారు, నువ్వు వాళ్ల వైపు తిరగాల్సిన అవసరం లేదు.”

20 “నేను నిన్ను ఈ ప్రజలకు రాగి ప్రాకారంగా చేస్తాను.+

వాళ్లు ఖచ్చితంగా నీతో పోరాడతారు,

కానీ నీమీద గెలవరు,+

ఎందుకంటే నిన్ను కాపాడడానికి, రక్షించడానికి నేను నీతో ఉన్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

21 “నేను దుష్టుల చేతి నుండి నిన్ను కాపాడతాను,

క్రూరుల అరచేతి నుండి నిన్ను విడిపిస్తాను.”

16 యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “నువ్వు ఈ స్థలంలో పెళ్లి చేసుకోకూడదు; కుమారుల్ని, కూతుళ్లను కనకూడదు. 3 ఎందుకంటే, ఇక్కడ పుట్టే కుమారుల గురించి, కూతుళ్ల గురించి, ఈ దేశంలో వాళ్లను కనే తల్లిదండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నాడు: 4 ‘వాళ్లు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు,+ వాళ్ల కోసం ఎవరూ ఏడ్వరు, వాళ్లను పాతిపెట్టరు; వాళ్లు నేలమీద ఎరువు అవుతారు.+ వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు;+ వాళ్ల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి.’

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

‘నువ్వు ఏడ్చేవాళ్ల ఇంట్లో అడుగుపెట్టకు,

ఏడ్వడానికి గానీ, ఓదార్చడానికి గానీ వెళ్లకు.’+

యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఎందుకంటే, నేను ఈ ప్రజల మధ్య నుండి నా శాంతిని,

నా విశ్వసనీయ ప్రేమను, కరుణను తీసేశాను.+

 6 గొప్పవాళ్లు, సామాన్యులు అందరూ ఈ దేశంలో చనిపోతారు.

ఎవరూ వాళ్లను పాతిపెట్టరు,

వాళ్ల గురించి ఏడ్వరు,

వాళ్ల కోసం తమ శరీరాన్ని కోసుకోరు, తల బోడి చేసుకోరు.*

 7 చనిపోయినవాళ్ల కోసం ఏడుస్తున్నవాళ్లను ఓదార్చడానికి

ఎవరూ ఆహారం పెట్టరు;

చనిపోయిన తమ తండ్రి లేదా తల్లి కోసం ఏడుస్తున్నవాళ్లను ఊరడించడానికి

ఎవరూ ద్రాక్షారసం గిన్నెను ఇవ్వరు.

 8 విందు జరిగే ఇంటికి వెళ్లకు,

వాళ్లతో కూర్చుని తినకు, తాగకు.’

9 “ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ స్థలంలో, మీ రోజుల్లో, మీ కళ్ల ముందే నేను సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం వినిపించకుండా చేస్తాను.’+

10 “నువ్వు ఈ ప్రజలకు ఈ మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్లు నిన్ను ఇలా అడుగుతారు: ‘యెహోవా ఇంత గొప్ప విపత్తును మా మీదికి తెస్తానని ఎందుకు చెప్పాడు? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేం చేసిన తప్పేంటి, పాపమేంటి?’+ 11 అప్పుడు నువ్వు ఇలా జవాబివ్వాలి: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఎందుకంటే, మీ పూర్వీకులు నన్ను విడిచిపెట్టారు,+ వాళ్లు వేరే దేవుళ్లను అనుసరిస్తూ, వాటిని పూజిస్తూ, వాటికి వంగి నమస్కారం చేస్తూ వచ్చారు.+ నన్ను మాత్రం వాళ్లు విడిచిపెట్టేశారు, నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.+ 12 మీరు మీ పూర్వీకుల కన్నా చాలా ఘోరంగా ప్రవర్తించారు,+ నాకు లోబడకుండా ప్రతీ ఒక్కరు మొండిగా మీ దుష్ట హృదయాన్ని అనుసరిస్తున్నారు.+ 13 కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశంలో నుండి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి విసిరేస్తాను,+ అక్కడ మీరు రాత్రింబగళ్లు వేరే దేవుళ్లను పూజిస్తారు.+ ఎందుకంటే, నేను మీ మీద ఏమాత్రం అనుగ్రహం చూపించను.” ’

14 “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘అయితే ఒక కాలం రాబోతుంది. అప్పుడు ప్రజలు, “ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!” అని ఇక అనరు;+ 15 బదులుగా, “ఉత్తర దేశం నుండి, తాను ఏయే దేశాలకు వాళ్లను చెదరగొట్టాడో ఆ దేశాలన్నిటి నుండి ఇశ్రాయేలీయుల్ని తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!” అని అంటారు. నేను వాళ్లను తమ దేశానికి, అంటే వాళ్ల పూర్వీకులకు నేనిచ్చిన దేశానికి తిరిగి తీసుకొస్తాను.’+

16 ‘నేను చాలామంది జాలరుల్ని పిలిపిస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,

‘వాళ్లు వాళ్లను వెదికి పట్టుకుంటారు.

ఆ తర్వాత నేను చాలామంది వేటగాళ్లను పిలిపిస్తాను,

వాళ్లు ప్రతీ పర్వతం మీద, ప్రతీ కొండ మీద, బండల సందుల్లో వాళ్లను వేటాడతారు.

17 ఎందుకంటే వాళ్లు చేసే ప్రతీదాన్ని నా కళ్లు చూస్తున్నాయి.

వాటిని నాకు కనబడకుండా దాచలేరు,

వాళ్ల దోషం నా కళ్లకు కనిపిస్తూనే ఉంది.

18 అయితే ముందుగా వాళ్ల అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి వాళ్లను తగినవిధంగా శిక్షిస్తాను,+

ఎందుకంటే వాళ్లు ప్రాణంలేని అసహ్యమైన విగ్రహాలతో నా దేశాన్ని అపవిత్రపర్చారు,

నా స్వాస్థ్యాన్ని హేయమైన వాటితో నింపేశారు.’ ”+

19 యెహోవా, నా బలమా, నా బలమైన దుర్గమా,

కష్టకాలంలో నా ఆశ్రయమా,+

భూమి అంచుల నుండి దేశాలు నీ దగ్గరికి వస్తాయి,

వాళ్లు ఇలా అంటారు: “మా పూర్వీకులు విగ్రహాల్ని,* వ్యర్థతను, ఎందుకూ పనికిరానివాటిని స్వాస్థ్యంగా పొందారు.”+

20 మనిషి దేవుళ్లను చేసుకోగలడా?

అవి దేవుళ్లే కాదు.+

21 “కాబట్టి నేను వాళ్లకు తెలిసేలా చేస్తాను,

నా శక్తిని, నా బలాన్ని ఈ సమయంలో వాళ్లకు తెలిసేలా చేస్తాను,

నా పేరు యెహోవా అని వాళ్లు తెలుసుకుంటారు.”

17 “యూదా ప్రజల పాపం ఇనుప కలంతో రాయబడింది,

అది వజ్రం మొనతో వాళ్ల హృదయమనే పలక మీద,

వాళ్ల బలిపీఠాల కొమ్ముల మీద చెక్కబడింది.

 2 వాళ్ల కుమారులేమో వాళ్ల బలిపీఠాల్ని, పూజా కర్రల్ని* గుర్తుచేసుకుంటున్నారు,+

అవి పచ్చని చెట్ల పక్కన, ఎత్తైన కొండల మీద,+

 3 పల్లెల్లోని పర్వతాల మీద ఉన్నాయి.

నీ ప్రాంతాలన్నిట్లో నువ్వు చేసిన పాపాల్ని బట్టి

నీ వనరుల్ని, నీ సంపదలన్నిటినీ

అవును, నీ ఉన్నత స్థలాల్ని+ నేను దోపుడుసొమ్ముగా ఇస్తాను.+

 4 నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నీ అంతట నువ్వే వదులుకుంటావు.+

నీకు తెలియని దేశంలో నువ్వు నీ శత్రువుల్ని సేవించేలా చేస్తాను,+

ఎందుకంటే మీరు నా కోపాగ్నిని రాజేశారు.*+

అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

“మనుషుల మీద నమ్మకం పెట్టుకునేవాడు,

మనుషుల శక్తిమీద ఆధారపడేవాడు,+

తన హృదయం యెహోవా నుండి పక్కకు మళ్లినవాడు శాపగ్రస్తుడు.+

 6 అతను ఎడారిలో ఒంటరి చెట్టులా ఉంటాడు.

మంచి జరగడాన్ని అతను చూడడు.

అతను ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో,

ఎవరూ నివసించలేని చవిటి* నేలలో నివసిస్తాడు.

 7 యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాడు,

యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు.*+

 8 అతను నీటి కాలువల పక్కన నాటబడి,

నీళ్లలోకి వేరుపారే చెట్టులా ఉంటాడు.

ఎండ వచ్చినా అతనికి తెలీదు,

అతని ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి.+

అనావృష్టి సంవత్సరంలో అతను ఆందోళనపడడు,

ఫలించడం మానడు.

 9 హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, ప్రమాదకరమైంది.*+

దాన్ని ఎవరు తెలుసుకోగలరు?

10 యెహోవా అనే నేను, ప్రతీ ఒక్కరికి వాళ్ల మార్గాల్ని బట్టి,

పనుల్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి+

హృదయాన్ని పరిశీలిస్తున్నాను,+

అంతరంగాన్ని* పరిశోధిస్తున్నాను.

11 మోసం చేసి* ఆస్తిని సంపాదించుకునేవాడు,+

తాను పెట్టని గుడ్లను పొదిగే కౌజుపిట్ట లాంటివాడు.

ఆ ఆస్తి మధ్యలోనే పోతుంది,

చివరికి అతను బుద్ధిలేని వాడని తేలుతుంది.”

12 మన పవిత్రమైన స్థలం, మొదటి నుండి హెచ్చించబడిన మహిమాన్విత సింహాసనం.+

13 ఇశ్రాయేలు నిరీక్షణవైన యెహోవా,

నిన్ను విడిచిపెట్టేవాళ్లంతా అవమానాలపాలు అవుతారు.

నీకు* దూరంగా వెళ్లే వాళ్ల పేర్లు మట్టిలో రాయబడతాయి,+

ఎందుకంటే, వాళ్లు జీవజలాల ఊట అయిన యెహోవాను విడిచిపెట్టారు.+

14 యెహోవా, నన్ను బాగుచేయి, నేను బాగౌతాను.

నన్ను కాపాడు, నేను కాపాడబడతాను,+

ఎందుకంటే నేను స్తుతించేది నిన్నే.

15 ఇదిగో! కొందరు నాతో ఇలా అంటున్నారు:

“యెహోవా వాక్యం ఎక్కడ?+

అది ఇంకా ఎందుకు నెరవేరలేదు?”

16 కానీ నేనైతే, కాపరిలా నిన్ను అనుసరించడం మానలేదు,

విపత్తు రోజు కోసం ఆత్రంగా ఎదురుచూడలేదు.

నా పెదాలు మాట్లాడిందంతా నీకు బాగా తెలుసు;

ఇదంతా నీ కళ్ల ముందే జరిగింది!

17 నన్ను విడిచిపెట్టి భయపెట్టకు.

విపత్తు రోజున నువ్వే నా ఆశ్రయం.

18 నన్ను హింసించేవాళ్లను అవమానాలపాలు కానివ్వు,+

కానీ నన్ను అవమానాలపాలు కానివ్వకు.

వాళ్లను భయపడనివ్వు,

కానీ నన్ను భయపడనివ్వకు.

వాళ్లమీదికి విపత్తు రోజును తీసుకొచ్చి+

వాళ్లను నలగ్గొట్టి, పూర్తిగా* నాశనం చేయి.

19 యెహోవా నాకు ఇలా చెప్పాడు: “నువ్వు వెళ్లి, యూదా రాజులు వస్తూపోతూ ఉండే ప్రజల ద్వారం దగ్గర, యెరూషలేము ద్వారాలన్నిటి దగ్గర నిలబడి+ 20 వాళ్లకు ఇలా చెప్పు: ‘ఈ ద్వారాల గుండా ప్రవేశించే యూదా రాజులారా, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరంతా యెహోవా చెప్పేది వినండి. 21 యెహోవా ఇలా అంటున్నాడు: “జాగ్రత్తపడండి, విశ్రాంతి రోజున* ఏ బరువూ మోయకండి, దాన్ని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకండి.+ 22 విశ్రాంతి రోజున మీరు మీ ఇళ్లలో నుండి ఏ బరువునూ బయటికి తీసుకురాకూడదు; మీరు ఏ పనీ చేయకూడదు.+ నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టే విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించండి.+ 23 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు; మొండిగా నాకు లోబడలేదు, క్రమశిక్షణను స్వీకరించలేదు.” ’+

24 “ ‘యెహోవా ఇలా అంటున్నాడు: “అయితే మీరు నిష్ఠగా నాకు లోబడితే, విశ్రాంతి రోజున ఈ నగర ద్వారాల గుండా ఏ బరువూ తీసుకురాకుండా ఉంటే, విశ్రాంతి రోజున ఏ పనీ చేయకుండా దాన్ని పవిత్రంగా ఆచరిస్తే,+ 25 అప్పుడు దావీదు సింహాసనం+ మీద కూర్చునే రాజులు, అధిపతులు కూడా రథం మీద, గుర్రాల మీద ఈ నగర ద్వారాల గుండా ప్రవేశిస్తారు; రాజులు, వాళ్ల అధిపతులు, యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు ఈ నగర ద్వారాల గుండా వస్తూపోతూ ఉంటారు;+ ఈ నగరంలో ఎప్పటికీ ప్రజలు నివసిస్తారు. 26 యూదా నగరాల నుండి, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి,+ మైదానం నుండి,+ పర్వత ప్రాంతం నుండి, నెగెబు* నుండి ప్రజలు వస్తారు; వాళ్లు సంపూర్ణ దహనబలులు,+ బలులు,+ ధాన్యార్పణలు,+ సాంబ్రాణి, కృతజ్ఞతార్పణలు తీసుకొని యెహోవా మందిరంలోకి వస్తారు.+

27 “ ‘ “కానీ వాళ్లు నాకు లోబడకుండా, విశ్రాంతి రోజును పవిత్రంగా ఆచరించకుండా, ఆ రోజు బరువులు మోస్తూ వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకొస్తూ ఉంటే నేను దాని ద్వారాలకు నిప్పు అంటిస్తాను. అది యెరూషలేము పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది,+ ఎవరూ దాన్ని ఆర్పలేరు.” ’ ”+

18 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “నువ్వు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు,+ అక్కడ నీకు నా మాటలు వినిపిస్తాను.”

3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అతను సారె* మీద పనిచేస్తున్నాడు. 4 అతను బంకమట్టితో చేస్తున్న పాత్ర అతని చేతుల్లో పాడైంది, అప్పుడు ఆ మట్టితో ఏ పాత్ర చేయడం అతనికి మంచిదని* అనిపించిందో ఆ పాత్రను చేశాడు.

5 అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 6 “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఈ కుమ్మరి చేసినట్టే నేను మీకు చేయలేనా?’ అని యెహోవా అంటున్నాడు. ‘ఇదిగో! కుమ్మరి చేతిలో బంకమట్టి ఎలా ఉందో, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరూ నా చేతిలో అలానే ఉన్నారు.+ 7 నేను ఒక దేశం గానీ రాజ్యం గానీ పెల్లగించబడుతుందని, కూలగొట్టబడుతుందని, నాశనం చేయబడుతుందని చెప్పినప్పుడు+ 8 ఆ దేశం తన దుష్టత్వాన్ని విడిచిపెడితే, నేను కూడా దాని మీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+ 9 అయితే ఒక దేశం గానీ రాజ్యం గానీ కట్టబడుతుందని, నాటబడుతుందని నేను చెప్పినప్పుడు 10 అది నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తే, నా మాట వినకపోతే, నేను దానికి చేయాలనుకున్న మంచి విషయంలో నా మనసు మార్చుకుంటాను.’*

11 “దయచేసి ఇప్పుడు నువ్వు యూదా ప్రజలకు, యెరూషలేము నివాసులకు ఇలా చెప్పు: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “నేను మీకు వ్యతిరేకంగా ఒక విపత్తును సిద్ధం చేస్తున్నాను, ఒక పథకాన్ని రూపొందిస్తున్నాను. దయచేసి మీ చెడు మార్గాల నుండి వెనక్కి తిరగండి; మీ మార్గాల్ని, పనుల్ని సరిచేసుకోండి.” ’ ”+

12 కానీ వాళ్లు ఇలా అన్నారు: “అలా కాదు,+ మేము మా సొంత ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం, మేమంతా మా దుష్ట హృదయాన్నే మొండిగా అనుసరిస్తాం.”+

13 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“దయచేసి దేశాల్ని అడిగి తెలుసుకోండి.

ఇలాంటిది ఎవరైనా విన్నారా?

ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.+

14 లెబానోను బండల మీద మంచు లేకుండా పోతుందా?

దూరం నుండి ప్రవహించే చల్లని వాగులు ఎండిపోతాయా?

15 కానీ నా ప్రజలు నన్ను మర్చిపోయారు.+

వాళ్లు వ్యర్థమైనవాటికి బలులు అర్పిస్తున్నారు,+

వాళ్లు ఇతరుల్ని తడబడేలా చేస్తూ, పురాతన దారుల్లో నడవకుండా చేస్తున్నారు,+

సమతలంగా, చదునుగా లేని* పక్కదారుల్లో నడిపిస్తున్నారు.

16 కాబట్టి వాళ్ల దేశం భయంకరంగా తయారౌతుంది,+

దాన్ని చూసి ప్రజలు ఎప్పటికీ ఎగతాళి చేస్తారు, ఈల వేస్తారు.+

ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి దాన్ని చూసి ఆశ్చర్యంతో తల ఊపుతాడు.+

17 తూర్పు గాలిలా, నేను వాళ్లను శత్రువు ముందు చెదరగొడతాను.

విపత్తు రోజున నేను వాళ్లకు నా ముఖాన్ని కాదు వీపునే చూపిస్తాను.”+

18 అప్పుడు వాళ్లు ఇలా అన్నారు: “రండి, మనం యిర్మీయా మీద కుట్ర పన్నుదాం.+ ఎందుకంటే మన యాజకుల దగ్గర ధర్మశాస్త్రం,* జ్ఞానుల దగ్గర సలహా, ప్రవక్తల దగ్గర వాక్యం ఉండని పరిస్థితి ఎప్పటికీ రాదు. రండి అతనికి వ్యతిరేకంగా మాట్లాడదాం,* అతను చెప్పేది మనం అస్సలు పట్టించుకోవద్దు.”

19 యెహోవా, నామీద దృష్టిపెట్టు,

నా వ్యతిరేకులు ఏమంటున్నారో విను.

20 మంచి చేస్తే ప్రతిఫలంగా చెడు చేయవచ్చా?

కానీ వాళ్లు నా ప్రాణం తీయడానికి గొయ్యి తవ్వారు.+

నీ కోపాన్ని వాళ్లమీద నుండి తీసేయడానికి

నేను నీ ముందు నిలబడి వాళ్ల గురించి ఎలా మంచిగా మాట్లాడానో గుర్తుచేసుకో.

21 కాబట్టి వాళ్ల కుమారుల్ని కరువుకు, వాళ్లను ఖడ్గానికి అప్పగించు.+

వాళ్ల భార్యలు భర్తల్ని, పిల్లల్ని పోగొట్టుకోవాలి.+

వాళ్ల పురుషులు ప్రాణాంతకమైన తెగులుతో చనిపోవాలి.

వాళ్ల యువకులు యుద్ధంలో కత్తితో చంపబడాలి.+

22 నువ్వు వాళ్లమీదికి హఠాత్తుగా బందిపోటుల్ని రప్పించినప్పుడు

వాళ్ల ఇళ్లలో నుండి ఆర్తనాదాలు వినిపించాలి.

ఎందుకంటే, వాళ్లు నన్ను పట్టుకోవడానికి గొయ్యి తవ్వారు,

నా పాదాల కోసం ఉచ్చు పెట్టారు.+

23 కానీ యెహోవా,

నన్ను చంపడానికి వాళ్లు నామీద పన్నే కుట్రలన్నీ నీకు బాగా తెలుసు.+

వాళ్ల దోషాన్ని కప్పేయకు,

వాళ్ల పాపాన్ని నీ ముందు నుండి తుడిచేయకు.

నువ్వు కోపంతో వాళ్లమీద చర్య తీసుకున్నప్పుడు+

వాళ్లు నీ ముందు తడబడి పడిపోవాలి.+

19 యెహోవా ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి, కుమ్మరి దగ్గర ఒక మట్టి కూజా కొను.+ ప్రజల పెద్దల్లో, యాజకుల పెద్దల్లో కొందర్ని తీసుకొని 2 కుమ్మరి ద్వారం దగ్గరున్న బెన్‌హిన్నోము* లోయకు+ వెళ్లు. అక్కడ నేను నీకు చెప్పే మాటలు ప్రకటించు. 3 నువ్విలా చెప్పాలి: ‘యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“ ‘ “నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తు తీసుకురాబోతున్నాను, దాని గురించి వినేవాళ్ల చెవులు గింగురుమంటాయి. 4 ఎందుకంటే, వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+ ఈ స్థలాన్ని గుర్తుపట్టకుండా చేశారు.+ తమకు గానీ, తమ పూర్వీకులకు గానీ, యూదా రాజులకు గానీ తెలియని వేరే దేవుళ్లకు ఈ స్థలంలో బలులు అర్పిస్తున్నారు. వాళ్లు ఈ స్థలాన్ని అమాయకుల రక్తంతో నింపేశారు.+ 5 వాళ్లు ఉన్నత స్థలాలు కట్టి తమ కుమారుల్ని అగ్నిలో కాల్చి బయలుకు సంపూర్ణ దహనబలులుగా అర్పించారు.+ అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు, చెప్పలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.” ’+

6 “ ‘ “కాబట్టి ఇదిగో! అది ఇక తోఫెతు అని గానీ, బెన్‌హిన్నోము* లోయ అని గానీ కాకుండా వధ లోయ అని పిలవబడే రోజులు వస్తున్నాయి” అని యెహోవా అంటున్నాడు.+ 7 “నేను ఈ స్థలంలో యూదా, యెరూషలేముల ఆలోచనలు వ్యర్థమైపోయేలా చేస్తాను. వాళ్లు తమ ప్రాణాల్ని తీయాలని చూస్తున్న శత్రువుల ఖడ్గానికి చిక్కి చనిపోయేలా చేస్తాను. వాళ్ల శవాల్ని ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారంగా ఇస్తాను.+ 8 నేను ఈ నగరాన్ని భయంకరంగా మారుస్తాను, ప్రజలు దాన్ని చూసి ఈల వేసేలా చేస్తాను. ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండిపోతాడు, దాని తెగుళ్లన్నిటినీ చూసి ఈలవేస్తాడు.+ 9 వాళ్లు తమ కుమారుల, కూతుళ్ల మాంసాన్ని తినేలా చేస్తాను; వాళ్ల శత్రువులు, వాళ్ల ప్రాణాలు తీయాలని చూసేవాళ్లు చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఆ ముట్టడిని బట్టి, దానివల్ల కలిగిన ఇబ్బందిని బట్టి వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ తోటివాడి మాంసం తింటారు.” ’+

10 “తర్వాత నువ్వు, నీతోపాటు వచ్చినవాళ్ల కళ్లముందు ఆ కూజాను పగలగొట్టి 11 వాళ్లకు ఇలా చెప్పు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే: “ఒక వ్యక్తి, తిరిగి బాగుచేయలేనంతగా మట్టి పాత్రను పగలగొట్టినట్టే నేను ఈ ప్రజల్ని, ఈ నగరాన్ని పగలగొడతాను; తోఫెతులో ఇక స్థలం లేకుండా పోయేవరకు శవాల్ని పాతిపెడుతూ ఉంటారు.” ’+

12 “ ‘ఈ నగరాన్ని తోఫెతులా మార్చడానికి నేను ఈ స్థలానికీ, దాని నివాసులకూ అలానే చేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 13 ‘యెరూషలేములోని ఇళ్లు, యూదా రాజుల ఇళ్లు, అవును ఏయే ఇళ్లమీద వాళ్లు ఆకాశ సైన్యమంతటికీ బలులు అర్పించారో,+ ఇతర దేవుళ్లకు పానీయార్పణలు అర్పించారో+ ఆ ఇళ్లన్నీ ఈ తోఫెతులాగే అపవిత్రమౌతాయి.’ ”+

14 యిర్మీయా తోఫెతు నుండి, అంటే ప్రవచించమని యెహోవా తనను పంపించిన స్థలం నుండి తిరిగొచ్చిన తర్వాత, అతను యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి ప్రజలందరికీ ఇలా చెప్పాడు: 15 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నగరం మీదికి, దాని పట్టణాలన్నిటి మీదికి నేను చెప్పిన విపత్తు అంతటినీ రప్పిస్తున్నాను. ఎందుకంటే, వాళ్లు మొండిగా నా మాటలు వినడానికి ఇష్టపడలేదు.’ ”+

20 యిర్మీయా ఈ మాటలు ప్రవచిస్తున్నప్పుడు ఇమ్మేరు కుమారుడూ యాజకుడూ అయిన పషూరు విన్నాడు. అతను యెహోవా మందిరంలో ముఖ్య అధికారి కూడా. 2 పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, అతన్ని యెహోవా మందిరంలో బెన్యామీను పైద్వారం దగ్గరున్న బొండలో బిగించాడు.+ 3 తర్వాతి రోజు పషూరు యిర్మీయాను బొండలో నుండి విడిపించినప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు:

“యెహోవా నీకు పషూరు అని కాదు, మాగోర్‌మిస్సాబీబ్‌*+ అని పేరుపెట్టాడు. 4 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వూ, నీ స్నేహితులంతా నిన్ను చూసి భయపడిపోయేలా చేస్తాను. నీ కళ్లముందే వాళ్లు తమ శత్రువుల ఖడ్గానికి చిక్కి చనిపోతారు;+ నేను యూదా అంతటినీ బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతను వాళ్లను బబులోనుకు బందీలుగా తీసుకెళ్లి ఖడ్గంతో చంపేస్తాడు.+ 5 నేను ఈ నగరంలోని సంపదంతటినీ, దాని వనరులన్నిటినీ, అమూల్యమైన వాటన్నిటినీ, యూదా రాజుల సంపదలన్నిటినీ వాళ్ల శత్రువుల చేతికి అప్పగిస్తాను.+ వాళ్లు వాటిని కొల్లగొట్టి, లాక్కుని బబులోనుకు తీసుకెళ్తారు.+ 6 అయితే పషూరూ, నువ్వూ, నీ ఇంట్లో నివసించే వాళ్లంతా బందీలుగా వెళ్తారు. నువ్వు బబులోనుకు వెళ్లి అక్కడే చనిపోతావు, అక్కడే నీ స్నేహితులందరితో పాటు పాతిపెట్టబడతావు, ఎందుకంటే నువ్వు వాళ్లకు అబద్ధాలు ప్రవచించావు.’ ”+

 7 యెహోవా, నువ్వు నన్ను వెర్రివాణ్ణి చేశావు, నేను వెర్రివాణ్ణి అయ్యాను.

నాకు వ్యతిరేకంగా నీ బలాన్ని ఉపయోగించావు, గెలిచావు.+

ప్రజలు రోజంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు;

ప్రతీ ఒక్కరు నన్ను ఎగతాళి చేస్తున్నారు.+

 8 ఎందుకంటే నేను మాట్లాడే ప్రతీసారి,

“దౌర్జన్యం, నాశనం!” అని అరుస్తూ ప్రకటించాల్సి వస్తోంది.

యెహోవా వాక్యం వల్ల నేను రోజంతా అవమానాలపాలు అవుతున్నాను, ఎగతాళికి గురౌతున్నాను.+

 9 కాబట్టి నేను, “ఇక ఆయన గురించి మాట్లాడను,

ఆయన పేరున ప్రకటించను” అని అనుకున్నాను.+

కానీ అది నా ఎముకల్లో మూయబడిన అగ్నిలా

నా హృదయంలో మండుతోంది,

దాన్ని ఓర్చుకునీ ఓర్చుకునీ అలసిపోయాను;

ఇక మౌనంగా ఉండలేకపోయాను.+

10 నేను చెడ్డ పుకార్లు చాలా విన్నాను;

నా చుట్టూ భయం అలుముకుంది.+

“అతన్ని నిందించండి; రండి, అతన్ని నిందిద్దాం!”

నేను క్షేమంగా ఉండాలని కోరుకునేవాళ్లంతా నా పతనం కోసం చూస్తూ,+

“అతను మోసపోయి ఏదోక తప్పు చేస్తాడేమో,

అప్పుడు మనం అతనిమీద గెలిచి, పగ తీర్చుకోవచ్చు” అని అనుకుంటున్నారు.

11 అయితే పరాక్రమంగల యోధునిలా యెహోవా నాతో ఉన్నాడు.+

కాబట్టి నన్ను హింసిస్తున్నవాళ్లు తడబడతారు, గెలవలేరు.+

వాళ్లు ఘోరంగా అవమానించబడతారు, ఎందుకంటే వాళ్లు విజయం సాధించలేరు.

వాళ్లకు శాశ్వత అవమానం కలుగుతుంది, అది ఎప్పటికీ మరవబడదు.+

12 కానీ సైన్యాలకు అధిపతివైన యెహోవా, నువ్వు నీతిమంతుణ్ణి పరిశీలిస్తావు;

అంతరంగాన్ని,* హృదయాన్ని చూస్తావు.+

నువ్వు వాళ్లమీద పగతీర్చుకోవడం నన్ను చూడనివ్వు,+

ఎందుకంటే, నీకే నా వ్యాజ్యాన్ని అప్పగించాను.+

13 యెహోవాకు పాటలు పాడండి! యెహోవాను స్తుతించండి!

ఎందుకంటే ఆయన, కీడు చేసేవాళ్ల చేతిలో నుండి దీనుణ్ణి కాపాడాడు.

14 నేను పుట్టిన రోజు శపించబడాలి!

మా అమ్మ నన్ను కన్న రోజును ఎవరూ దీవించకూడదు!+

15 “నీకు కుమారుడు పుట్టాడు, మగబిడ్డ పుట్టాడు!” అనే తీపి కబురు తెచ్చి

మా నాన్నకు ఎంతో సంతోషం కలిగించిన వ్యక్తి శపించబడాలి!

16 అతను, యెహోవా ఏమాత్రం విచారపడకుండా నాశనం చేసిన నగరాల్లా అవ్వాలి.

అతను పొద్దున ఆర్తనాదాలు, మధ్యాహ్నం యుద్ధ ధ్వని వినాలి.

17 నేను గర్భంలోనే ఎందుకు చనిపోలేదు?

అప్పుడు నా తల్లే నాకు సమాధి స్థలం అయ్యేది,

నేను అసలు గర్భంలో నుండి బయటికి వచ్చేవాణ్ణే కాదు.+

18 కష్టాన్ని, దుఃఖాన్ని చూడడానికి,

అవమానంతో చనిపోవడానికి

నా తల్లి గర్భంలో నుండి అసలు ఎందుకు బయటికి వచ్చాను?+

21 సిద్కియా+ రాజు మల్కీయా కుమారుడైన పషూరును, మయశేయా కుమారుడూ యాజకుడూ అయిన జెఫన్యాను+ యిర్మీయా దగ్గరికి పంపించినప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది; సిద్కియా వాళ్లను ఇలా అడగమని పంపించాడు: 2 “మా తరఫున యెహోవా దగ్గర విచారణ చేయి, ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు* మన మీద యుద్ధానికి వస్తున్నాడు.+ అతను మన దగ్గర నుండి వెళ్లిపోయేలా యెహోవా మన తరఫున ఏదైనా ఆశ్చర్యకార్యం* చేస్తాడేమో.”+

3 అప్పుడు యిర్మీయా వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు సిద్కియాతో ఇలా చెప్పాలి: 4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు బబులోను రాజుతో, ప్రాకారం బయట ముట్టడి వేస్తున్న కల్దీయులతో ఏ ఆయుధాలతో పోరాడుతున్నారో,+ మీ చేతుల్లో ఉన్న ఆ యుద్ధాయుధాల్ని మీకు వ్యతిరేకంగా తిప్పుతున్నాను. నేను వాటిని* ఈ నగరం మధ్య పోగుచేస్తాను. 5 చాచిన చేతితో, శక్తివంతమైన బాహువుతో, కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేనే స్వయంగా మీతో పోరాడతాను.+ 6 మనుషులు, జంతువులతో సహా ఈ నగరవాసులందర్నీ నేను చంపుతాను. గొప్ప తెగులు వల్ల వాళ్లు చనిపోతారు.” ’+

7 “ ‘యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ తర్వాత నేను యూదా రాజైన సిద్కియాను, అతని సేవకుల్ని, ఈ నగర ప్రజల్ని అంటే తెగులును, ఖడ్గాన్ని, కరువును తప్పించుకున్నవాళ్లను బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తాను.+ అతను వాళ్లను ఖడ్గంతో చంపేస్తాడు. అతను వాళ్లమీద జాలిపడడు, కనికరం గానీ కరుణ గానీ చూపించడు.” ’+

8 “అయితే ఈ ప్రజలతో నువ్విలా చెప్పాలి: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “జీవ మార్గాన్ని, మరణ మార్గాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. 9 ఎవరైతే ఈ నగరంలోనే ఉండిపోతారో వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు. కానీ ఎవరైతే బయటికి వెళ్లి, మిమ్మల్ని ముట్టడిస్తున్న కల్దీయులకు లొంగిపోతారో వాళ్లు ప్రాణాలతో ఉంటారు, దోపుడుసొమ్ముగా తమ ప్రాణాన్ని దక్కించుకుంటారు.” ’*+

10 “ ‘ “ఎందుకంటే నేను ఈ నగరాన్ని తిరస్కరించాను. మంచికి బదులు విపత్తే దానిమీదికి వస్తుంది” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది,+ అతను అగ్నితో దాన్ని కాల్చేస్తాడు.”+

11 “ ‘యూదా రాజు ఇంటివాళ్లారా, యెహోవా మాట వినండి. 12 దావీదు ఇంటివాళ్లారా, యెహోవా ఏమంటున్నాడంటే:

“ప్రతీ ఉదయం న్యాయాన్ని సమర్థించండి,

మోసం చేసేవాడి చేతి నుండి దోచుకోబడుతున్నవాణ్ణి కాపాడండి,+

లేకపోతే మీ చెడ్డపనుల్ని బట్టి

నా ఉగ్రత అగ్నిలా రగులుకుంటుంది,+

దాన్ని ఎవరూ ఆర్పలేరు.” ’+

13 ‘లోయలో నివసిస్తున్నదానా,

చదును నేలమీదున్న బండరాయీ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘ “మన మీదికి ఎవరు వస్తారు?

మన నివాసాల్లోకి ఎవరు చొరబడతారు” అని అంటున్నవాళ్లారా,

14 మీ పనులకు తగినట్టు

నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను.+

నేను ఆమె అడవికి నిప్పంటిస్తాను,

అది ఆమె చుట్టూ ఉన్న వాటన్నిటినీ దహించేస్తుంది’ అని యెహోవా అంటున్నాడు.”+

22 యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు యూదా రాజు రాజభవనానికి వెళ్లి, ఈ సందేశాన్ని ప్రకటించు. 2 నువ్వు ఇలా చెప్పాలి: ‘దావీదు సింహాసనం మీద కూర్చునే యూదా రాజా, నువ్వూ ఈ ద్వారాల గుండా ప్రవేశించే నీ సేవకులూ నీ ప్రజలూ యెహోవా చెప్తున్న మాట వినండి. 3 యెహోవా ఏమంటున్నాడంటే, “న్యాయాన్ని, నీతిని సమర్థించండి. మోసం చేసేవాడి చేతి నుండి దోచుకోబడుతున్న వాళ్లను కాపాడండి. పరదేశితో చెడుగా వ్యవహరించకండి, అనాథకు* గానీ, విధవరాలికి గానీ హాని చేయకండి.+ ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకండి.+ 4 మీరు ఈ మాటల్ని జాగ్రత్తగా పాటిస్తే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులు+ రథాల మీద, గుర్రాల మీద తమ సేవకులతో పాటు, ప్రజలతో పాటు ఈ రాజభవన ద్వారాల గుండా ప్రవేశిస్తారు.” ’+

5 “ ‘అయితే మీరు ఈ మాటలకు లోబడకపోతే ఈ రాజభవనం నాశనమైపోతుంది,+ నా తోడని ప్రమాణం చేస్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

6 “యూదా రాజు రాజభవనం గురించి యెహోవా ఇలా అంటున్నాడు:

‘నువ్వు నాకు గిలాదులా,

లెబానోను శిఖరంలా ఉన్నావు.

కానీ నేను నిన్ను ఎడారిలా చేస్తాను;

నీ నగరాల్లో ఎవ్వరూ నివసించరు.+

 7 నేను నీమీద నాశకుల్ని నియమిస్తాను.*

వాళ్లు ఆయుధాలతో వస్తారు.+

వాళ్లు నీ శ్రేష్ఠమైన దేవదారు చెట్లను నరికేసి

వాటిని మంటల్లో పడేస్తారు.+

8 “ ‘చాలా దేశాల ప్రజలు ఈ నగరం పక్కగా వెళ్తూ, “యెహోవా ఈ గొప్ప నగరానికి ఎందుకిలా చేశాడు?” అని అడుగుతారు.+ 9 వాళ్లు ఇలా అంటారు: “ఎందుకంటే వాళ్లు తమ దేవుడైన యెహోవా ఒప్పందాన్ని విడిచిపెట్టి వేరే దేవుళ్లకు వంగి నమస్కారం చేశారు, వాటిని పూజించారు.” ’+

10 చనిపోయిన వ్యక్తి కోసం ఏడ్వకండి,

అతని కోసం దుఃఖించకండి.

బదులుగా, చెరలోకి వెళ్తున్న వ్యక్తి కోసం వెక్కివెక్కి ఏడ్వండి;

ఎందుకంటే తాను పుట్టిన దేశాన్ని చూడడానికి అతను ఇక తిరిగిరాడు.

11 “తన తండ్రైన యోషీయాకు బదులు పరిపాలిస్తూ ఈ స్థలం నుండి వెళ్లిపోయిన యూదా రాజూ, యోషీయా+ కుమారుడూ అయిన షల్లూము*+ గురించి యెహోవా ఏమంటున్నాడంటే: ‘అతను ఇక్కడికి ఇక తిరిగిరాడు. 12 వాళ్లు అతన్ని బందీగా తీసుకెళ్లిన చోటే అతను చనిపోతాడు, మళ్లీ ఈ దేశాన్ని చూడడు.’+

13 నీతి లేకుండా తన ఇంటిని,

న్యాయం లేకుండా తన పైగదుల్ని కట్టించుకునే వాడికి శ్రమ!

తన తోటివానితో ఊరికే సేవ చేయించుకుంటూ

కూలి ఇవ్వడానికి నిరాకరించే వాడికి శ్రమ!+

14 ‘నేను విశాలమైన పైగదులతో పెద్ద ఇల్లు కట్టించుకుంటాను,

దానికి కిటికీలు చేయిస్తాను,

దేవదారు పలకలు అమర్చి, ఎర్ర రంగు వేయిస్తాను’ అని అనుకునే వాడికి శ్రమ!

15 దేవదారు కలపను ఉపయోగించే విషయంలో అందర్నీ మించిపోయావు కాబట్టి నువ్వు పరిపాలిస్తూనే ఉంటావా?

నీ తండ్రి కూడా తిన్నాడు, తాగాడు,

కానీ అతను నీతిని, న్యాయాన్ని సమర్థించాడు,+

అతనికి మంచి జరిగింది.

16 అతను బాధించబడినవాళ్ల తరఫున, పేదవాళ్ల తరఫున వాదించాడు,

దానివల్ల అతనికి మంచి జరిగింది.

‘నన్ను తెలుసుకోవడం అంటే అదే కదా?’ అని యెహోవా అంటున్నాడు.

17 ‘కానీ నీ దృష్టి, ధ్యాస అంతా అక్రమ సంపాదన మీద,

నిర్దోషుల రక్తం చిందించడం మీద,

మోసం చేయడం మీద, లాక్కోవడం మీదే ఉంది.’

18 “కాబట్టి యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ గురించి యెహోవా ఇలా చెప్తున్నాడు:

‘వాళ్లు, “అయ్యో, నా సహోదరుడా! అయ్యో, నా తోబుట్టువా!”* అంటూ అతని కోసం ఏడ్వరు.

“అయ్యో, నా యజమానీ! అయ్యో, అతని ఘనత!” అంటూ అతని కోసం దుఃఖించరు.

19 అతన్ని యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకెళ్లి, పారేస్తారు.+

గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు.’+

20 లెబానోనుకు వెళ్లి కేకలు వేయి,

బాషానులో బిగ్గరగా అరువు,

అబారీము+ నుండి కేకలు వేయి,

ఎందుకంటే నీ ప్రియులంతా నలగ్గొట్టబడ్డారు.+

21 నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడాను.

కానీ నువ్వు, ‘నేను లోబడను’ అన్నావు.+

చిన్నప్పటి నుండి నువ్వు అలానే ప్రవర్తించావు,

నువ్వు నా మాట వినలేదు.+

22 నీ కాపరులంతా గాలికి కొట్టుకుపోతారు,+

నీ ప్రియులంతా బందీలుగా వెళ్తారు.

అప్పుడు నీ విపత్తు అంతటిని బట్టి నువ్వు సిగ్గుపడతావు, అవమానాలపాలు అవుతావు.

23 లెబానోనులో+ దేవదారు చెట్ల మధ్య సురక్షితంగా నివసించేవాడా,+

నీకు పురిటినొప్పులు వచ్చినప్పుడు,

ప్రసవించే స్త్రీ వేదనలాంటి వేదన నీకు కలిగినప్పుడు నువ్వు ఎంతగా మూలుగుతావో కదా!”+

24 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా జీవం తోడు, యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన కొన్యా,*+ నువ్వు నా కుడిచేతికి ముద్ర ఉంగరంలా ఉన్నాసరే, నేను నిన్ను అక్కడి నుండి తీసేస్తాను! 25 నీ ప్రాణాన్ని తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, నువ్వు భయపడేవాళ్ల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగిస్తాను.+ 26 నిన్నూ, నిన్ను కన్న నీ తల్లినీ మీరు పుట్టని వేరే దేశంలోకి విసిరేస్తాను, మీరు అక్కడే చనిపోతారు. 27 వాళ్లు ఎంతో కోరుకునే దేశానికి వాళ్లు ఇక తిరిగిరారు.+

28 కొన్యా అనే ఇతను పగిలిపోయి తిరస్కరించబడిన కుండ మాత్రమేనా?

ఎవరికీ అవసరం లేని పాత్రనా?

ఇతను, ఇతని వంశస్థులు ఎందుకు విసిరేయబడ్డారు?

తమకు తెలియని దేశంలోకి ఎందుకు పడేయబడ్డారు?’+

29 దేశమా,* దేశమా, దేశమా, యెహోవా మాట విను.

30 యెహోవా ఇలా అంటున్నాడు:

‘ఇతను పిల్లలు లేనివాడు అని,

తన జీవితకాలంలో ఎలాంటి విజయమూ సాధించలేనివాడు అని రాయండి,

ఎందుకంటే, ఇతని వంశస్థుల్లో ఎవ్వరూ దావీదు సింహాసనం మీద కూర్చుని మళ్లీ యూదాను పరిపాలించరు.’ ”+

23 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నా మందలోని గొర్రెల్ని నాశనం చేస్తూ, వాటిని చెదరగొడుతున్న కాపరులకు శ్రమ!”+

2 కాబట్టి తన ప్రజల్ని కాస్తున్న కాపరుల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు నా గొర్రెల్ని చెదరగొట్టారు; వాటిని వెళ్లగొడుతూ వచ్చారు, వాటిని పట్టించుకోలేదు.”+

“కాబట్టి మీ చెడ్డపనుల్ని బట్టి నేను మీ మీద దృష్టిపెడతాను” అని యెహోవా అంటున్నాడు.

3 “తర్వాత నేను నా గొర్రెల్లో మిగిలినవాటిని సమకూరుస్తాను, నేను వాటిని చెదరగొట్టిన దేశాలన్నిటి నుండి వాటిని సమకూర్చి+ తిరిగి వాటి పచ్చికబయళ్ల దగ్గరికి తీసుకొస్తాను.+ అవి పిల్లల్ని కని, వృద్ధి చెందుతాయి.+ 4 వాటిని నిజంగా సంరక్షించే* కాపరుల్ని నేను వాటిమీద నియమిస్తాను.+ అవి ఇక భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

5 “ఇదిగో! నేను దావీదుకు నీతి మొలకను* పుట్టించే రోజులు రాబోతున్నాయి”+ అని యెహోవా అంటున్నాడు. “ఆయన రాజుగా పరిపాలిస్తాడు,+ లోతైన అవగాహన చూపిస్తాడు, దేశంలో నీతిన్యాయాలు జరిగిస్తాడు.+ 6 ఆయన రోజుల్లో యూదా రక్షించబడుతుంది, ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.+ ఆయన, ‘యెహోవాయే మన నీతి’ అని పిలవబడతాడు.”+

7 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “అయితే ఒక కాలం రాబోతుంది. అప్పుడు ప్రజలు, ‘ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!’ అని ఇక అనరు; 8 బదులుగా, ‘ఉత్తర దేశం నుండి, తాను ఏయే దేశాలకు వాళ్లను చెదరగొట్టాడో ఆ దేశాలన్నిటి నుండి ఇశ్రాయేలు ఇంటివాళ్ల వంశస్థుల్ని తిరిగి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు!’ అని అంటారు. వాళ్లు తమ స్వదేశంలో నివసిస్తారు.”+

9 ప్రవక్తల విషయానికొస్తే:

నా హృదయం విరిగిపోయింది.

నా ఎముకలన్నీ వణుకుతున్నాయి.

యెహోవా వల్ల, పవిత్రమైన ఆయన మాటల వల్ల

నేను మత్తుగా తాగినవాడిలా,

ద్రాక్షారసం వశంలో ఉన్నవాడిలా ఉన్నాను.

10 దేశం వ్యభిచారులతో నిండిపోయింది;+

శాపం వల్ల దేశం దుఃఖిస్తోంది,+

ఎడారిలోని పచ్చికబయళ్లు ఎండిపోయాయి.

వాళ్ల మార్గం చెడ్డది, వాళ్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

11 “ప్రవక్తలూ, యాజకులూ అపవిత్రులయ్యారు.*+

చివరికి నా మందిరంలో కూడా వాళ్ల దుష్టత్వం కనిపిస్తోంది”+ అని యెహోవా అంటున్నాడు.

12 “కాబట్టి వాళ్ల మార్గం జారుడు నేలలా తయారౌతుంది, చీకటైపోతుంది;

వాళ్లు నెట్టేయబడి పడిపోతారు.

ఎందుకంటే, లెక్క అడిగే సంవత్సరంలో

నేను వాళ్లమీదికి విపత్తు తీసుకొస్తాను” అని యెహోవా అంటున్నాడు.

13 “సమరయ+ ప్రవక్తల్లో నేను అసహ్యమైనది చూశాను.

వాళ్లు బయలు ప్రేరేపణతో ప్రవచనాలు చెప్తున్నారు,

నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని పక్కదారి పట్టిస్తున్నారు.

14 యెరూషలేము ప్రవక్తల్లో నేను భయంకరమైన విషయాలు చూశాను.

వాళ్లు వ్యభిచారం చేస్తున్నారు,+ అబద్ధాలు చెప్తున్నారు;+

చెడ్డవాళ్లను ప్రోత్సహిస్తున్నారు,*

వాళ్లు తమ దుష్టత్వం నుండి పక్కకు తొలగట్లేదు.

వాళ్లంతా నాకు సొదొమలా ఉన్నారు,+

ఆమె నివాసులు గొమొర్రాలా ఉన్నారు.”+

15 కాబట్టి ఆ ప్రవక్తల గురించి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“ఇదిగో నేను వాళ్లకు తినడానికి మాచిపత్రిని,

తాగడానికి విషం కలిపిన నీళ్లను ఇస్తున్నాను.+

ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల వల్ల మతభ్రష్టత్వం దేశమంతటా వ్యాపించింది.”

16 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు:

“మీకు ప్రవచనాలు చెప్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+

వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తున్నారు.*

వాళ్లు చెప్పే దర్శనాలు వాళ్ల హృదయాల్లో నుండి వచ్చినవి,+

యెహోవా నోటి నుండి వచ్చినవి కావు.+

17 నేనంటే గౌరవం లేనట్టు ప్రవర్తించేవాళ్లతో వాళ్లు పదేపదే ఇలా చెప్తున్నారు:

‘ “మీరు శాంతిని అనుభవిస్తారు” అని యెహోవా అన్నాడు.’+

తమ మొండి హృదయాన్ని అనుసరించే ప్రతీ ఒక్కరితో,

‘మీ మీదికి ఏ విపత్తూ రాదు’ అని చెప్తున్నారు.+

18 యెహోవా వాక్యాన్ని చూడడానికి, వినడానికి

ఆయన సన్నిహిత ప్రజల మధ్య నిలబడింది ఎవరు?

ఆయన వాక్యం మీద మనసుపెట్టింది ఎవరు? దాన్ని విన్నది ఎవరు?

19 ఇదిగో! యెహోవా ఆగ్రహం తుఫానులా విరుచుకుపడబోతుంది;

భీకరమైన సుడిగాలిలా అది దుష్టుల తలమీద విరుచుకుపడుతుంది.+

20 తన హృదయంలో అనుకున్నది నెరవేర్చే వరకు, దాన్ని పూర్తిచేసే వరకు

యెహోవా కోపం వెనక్కి తిరగదు.

చివరి రోజుల్లో మీరు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు.

21 ఆ ప్రవక్తలు నేను పంపకపోయినా పరుగెత్తుకుంటూ వచ్చారు.

నేను వాళ్లతో మాట్లాడకపోయినా ప్రవచించారు.+

22 ఒకవేళ వాళ్లు నా సన్నిహితుల మధ్య నిలబడివుంటే,

నా ప్రజలకు నా మాటలు వినిపించి,

తమ చెడు మార్గాలు, చెడు పనులు విడిచిపెట్టేలా చేసేవాళ్లు.”+

23 “నేను దగ్గర్లో మాత్రమే దేవుణ్ణా? దూరంలో కాదా?” అని యెహోవా అంటున్నాడు.

24 “నాకు కనబడకుండా రహస్య స్థలంలో ఎవరైనా దాక్కోగలరా?”+ అని యెహోవా అంటున్నాడు.

“ఆకాశంలో గానీ భూమ్మీద గానీ నేను చూడలేనిదంటూ ఏదైనా ఉందా?”+ అని యెహోవా అంటున్నాడు.

25 “నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్న ప్రవక్తలు ‘నాకో కల వచ్చింది! నాకో కల వచ్చింది!’ అని అనడం నేను విన్నాను.+ 26 అబద్ధాల్ని ప్రవచించాలనే ఆలోచన ఇంకా ఎంతకాలం ఆ ప్రవక్తల హృదయాల్లో ఉంటుంది? వాళ్లు తమ హృదయంలో ఉన్న మోసాన్ని ప్రవచించే ప్రవక్తలు.+ 27 నా ప్రజలు నా పేరును మర్చిపోయేలా చేయడానికి ఆ ప్రవక్తలు తమ కలల్ని ఒకరికొకరు వివరించుకుంటున్నారు. వాళ్ల తండ్రులు కూడా బయలు వల్ల నా పేరును అలాగే మర్చిపోయారు.+ 28 కల కన్న ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు, అయితే నా మాట కలిగివున్న వ్యక్తి నా మాటను ఉన్నదున్నట్టు చెప్పాలి.”

“గడ్డికి, ధాన్యానికి ఏమి పోలిక?” అని యెహోవా అంటున్నాడు.

29 “నా మాట అగ్ని లాంటిది కాదా?+ బండను పగలగొట్టే సుత్తి లాంటిది కాదా?”+ అని యెహోవా అంటున్నాడు.

30 “నా మాటల్ని ఒకరి దగ్గర నుండి ఒకరు దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.+

31 “తమ సొంత మాటలు చెప్పి, ‘ఆయన ఇలా అంటున్నాడు!’ అనే ప్రవక్తలకు+ నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.

32 “అబద్ధ కలలు కని, వాటిని వివరించి, అబద్ధాలు చెప్తూ గొప్పలు చెప్పుకుంటూ నా ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రవక్తలకు+ నేను వ్యతిరేకంగా ఉన్నాను” అని యెహోవా అంటున్నాడు.

“నేను వాళ్లను పంపలేదు, వాళ్లకు ఆజ్ఞాపించలేదు. కాబట్టి వాళ్ల వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు”+ అని యెహోవా అంటున్నాడు.

33 “ఈ ప్రజలు గానీ ఒక ప్రవక్త గానీ యాజకుడు గానీ ‘యెహోవా భారం* ఏమిటి?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ “మీరే ఆ భారం! నేను మిమ్మల్ని ఎత్తి పారేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు’ అని నువ్వు వాళ్లతో చెప్పాలి. 34 ఏ ప్రవక్తయినా, యాజకుడైనా, ప్రజల్లో ఎవరైనా, ‘ఇదే యెహోవా భారం!’* అని అంటే, నేను ఆ వ్యక్తి మీదికి, అతని ఇంటివాళ్ల మీదికి నా దృష్టి మళ్లిస్తాను. 35 మీలో ప్రతీ ఒక్కరు మీ పొరుగువానితో, మీ సహోదరునితో, ‘యెహోవా ఏమని జవాబిచ్చాడు? యెహోవా ఏమన్నాడు?’ అని అంటున్నారు. 36 అయితే యెహోవా భారం* అనే మాట ఇంకెప్పుడూ మీరు అనకూడదు, ఎందుకంటే ఒక వ్యక్తి మాటే అతని భారం.* మీరు జీవంగల దేవుడూ సైన్యాలకు అధిపతీ మన దేవుడూ అయిన యెహోవా మాటల్ని మార్చారు.

37 “నువ్వు ఆ ప్రవక్తతో ఇలా అనాలి: ‘యెహోవా నీకు ఏమని జవాబిచ్చాడు? యెహోవా ఏమన్నాడు? 38 ఒకవేళ మీరు “యెహోవా భారం!”* అని అంటూ ఉంటే, యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘ “యెహోవా భారం!”* అని మీరు అనకూడదు’ అని నేను చెప్పిన తర్వాత కూడా మీరు ‘ఈ మాటే యెహోవా భారం!’* అని అంటున్నారు కాబట్టి 39 ఇదిగో! నేను మిమ్మల్ని, మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన ఈ నగరాన్ని నా ముందు నుండి ఎత్తి పారేస్తాను. 40 మీ మీదికి శాశ్వతమైన తలవంపును, శాశ్వతమైన అవమానాన్ని తీసుకొస్తాను, అది ఎప్పటికీ మరవబడదు.” ’ ”+

24 బబులోను రాజు నెబుకద్నెజరు* యెరూషలేము నుండి యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను,*+ అతనితో పాటు యూదా అధిపతుల్ని, చేతిపనివాళ్లను, కమ్మరి వాళ్లను* బబులోనుకు బందీలుగా తీసుకెళ్లిన తర్వాత,+ యెహోవా మందిరం ముందున్న రెండు అంజూర పండ్ల గంపల్ని యెహోవా నాకు చూపించాడు. 2 ఒక గంపలో తొలి అంజూర పండ్ల లాంటి చాలా మంచి అంజూర పండ్లు ఉన్నాయి, మరో గంపలో తినడానికి వీలుకానంత చెడ్డ అంజూర పండ్లు ఉన్నాయి.

3 అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకేం కనిపిస్తోంది?” అని అడిగాడు. అందుకు నేను, “అంజూర పండ్లు కనిపిస్తున్నాయి; మంచి అంజూర పండ్లు చాలా బాగున్నాయి, కానీ చెడ్డవి తినలేనంత చెడ్డగా ఉన్నాయి” అన్నాను.

4 తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 5 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ స్థలం నుండి కల్దీయుల దేశానికి బందీలుగా పంపించిన యూదా వాళ్లను ఈ మంచి అంజూర పండ్లలా ఎంచుతాను, వాళ్లకు మంచి చేస్తాను. 6 వాళ్లకు మంచి చేయడానికి నేను వాళ్లమీద దృష్టి నిలుపుతాను, వాళ్లను ఈ దేశానికి తిరిగి రప్పిస్తాను.+ నేను వాళ్లను కడతాను గానీ కూలగొట్టను; నాటుతాను గానీ పెల్లగించను.+ 7 నేను యెహోవానని తెలుసుకునే హృదయాన్ని వాళ్లకు ఇస్తాను.+ వాళ్లు నిండు హృదయంతో నా దగ్గరికి తిరిగొస్తారు కాబట్టి, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.+

8 “ ‘అయితే తినడానికి వీలుకానంత చెడ్డగా ఉన్న చెడ్డ అంజూర పండ్ల గురించి+ యెహోవా ఇలా అంటున్నాడు: “నేను యూదా రాజైన సిద్కియాను,+ అతని అధిపతుల్ని, ఈ దేశంలో గానీ ఐగుప్తు దేశంలో గానీ నివసిస్తున్న మిగిలిన యెరూషలేము ప్రజల్ని+ ఈ అంజూర పండ్లలా ఎంచుతాను. 9 నేను వాళ్లమీదికి తీసుకొచ్చే విపత్తును చూసి భూమ్మీది రాజ్యాలన్నీ భయపడతాయి.+ ప్రజలు వాళ్లను నిందిస్తారు; వాళ్లమీద సామెత చెప్పుకుంటారు; నేను వాళ్లను చెదరగొట్టే స్థలాలన్నిటిలో+ ప్రజలు వాళ్లను ఎగతాళి చేస్తారు, శపిస్తారు.+ 10 నేను వాళ్లకూ వాళ్ల పూర్వీకులకూ ఇచ్చిన దేశం నుండి వాళ్లు తుడిచిపెట్టుకుపోయేంత వరకు వాళ్లమీదికి ఖడ్గాన్ని, కరువును, తెగులును+ పంపిస్తాను.” ’ ”+

25 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన నాలుగో సంవత్సరంలో యూదా ప్రజలందరి గురించి దేవుని వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.+ అది బబులోను రాజు నెబుకద్నెజరు* పరిపాలనలో మొదటి సంవత్సరం. 2 యూదా ప్రజలందరి గురించి,* యెరూషలేము నివాసులందరి గురించి యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటలు ఇవి:

3 “ఆమోను కుమారుడూ యూదా రాజూ అయిన యోషీయా పరిపాలనలోని 13వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు, ఈ 23 సంవత్సరాలు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చింది, నేను పదేపదే* మీతో మాట్లాడుతూ వచ్చాను, కానీ మీరు వినలేదు.+ 4 యెహోవా తన సేవకులైన ప్రవక్తలందర్నీ మీ దగ్గరికి పంపించాడు, వాళ్లను పదేపదే* పంపించాడు, కానీ మీరు వినలేదు, పట్టించుకోలేదు. 5 వాళ్లు ఇలా చెప్పేవాళ్లు: ‘దయచేసి మీరంతా మీ చెడ్డమార్గాల్ని, మీ చెడ్డపనుల్ని విడిచిపెట్టండి;+ అప్పుడు మీరు, చాలాకాలం క్రితం మీకూ మీ పూర్వీకులకూ యెహోవా ఇచ్చిన ఈ దేశంలో ఎక్కువకాలం పాటు నివసిస్తూ ఉంటారు. 6 వేరే దేవుళ్లను అనుసరించకండి, పూజించకండి, వాటికి వంగి నమస్కారం చేయకండి; మీ చేతులతో చేసినవాటితో నాకు కోపం తెప్పించకండి; లేదంటే నేను మీ మీదికి విపత్తు రప్పిస్తాను.’

7 “ ‘కానీ మీరు నా మాట వినలేదు. బదులుగా మీ చేతులతో చేసినవాటితో నాకు కోపం తెప్పించి, మీ మీదికి విపత్తు తెచ్చుకున్నారు’+ అని యెహోవా అంటున్నాడు.

8 “అందుకే సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ “మీరు నా మాటలకు లోబడలేదు కాబట్టి 9 నేను ఉత్తర దేశ కుటుంబాలన్నిటినీ, నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును*+ రప్పిస్తున్నాను”+ అని యెహోవా అంటున్నాడు. “నేను వాళ్లను ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, ఈ చుట్టుపక్కల దేశాలన్నిటి మీదికి+ రప్పిస్తాను.+ నేను వాటిని సమూలనాశనం చేస్తాను, ప్రజలు వాటిని చూసి భయపడతారు, ఈలలు వేస్తారు. అవి ఎప్పటికీ పాడుబడ్డ స్థితిలోనే ఉంటాయి. 10 సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని, పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం, తిరుగలి చప్పుడు ఇక వాటిలో వినిపించకుండా చేస్తాను,+ దీపం వెలుగు కనిపించకుండా చేస్తాను. 11 ఈ దేశమంతా శిథిలాల కుప్పలా, భయంకరంగా తయారౌతుంది. ఈ దేశాలు బబులోను రాజును 70 సంవత్సరాలు సేవించాల్సి ఉంటుంది.” ’+

12 “ ‘అయితే 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత,+ నేను బబులోను రాజును, ఆ దేశాన్ని వాళ్ల దోషాన్ని బట్టి లెక్క అడుగుతాను’*+ అని యెహోవా అంటున్నాడు. ‘నేను కల్దీయుల దేశాన్ని ఎప్పటికీ పాడుబడిన స్థలంగా ఉండేలా చేస్తాను.+ 13 నేను ఆ దేశానికి వ్యతిరేకంగా పలికిన, దేశాలన్నిటి గురించి యిర్మీయా ప్రవచించిన, ఈ పుస్తకంలో రాయబడిన మాటలన్నిటినీ ఆ దేశం మీదికి రప్పిస్తాను. 14 వాళ్లను చాలా దేశాలవాళ్లు, గొప్పగొప్ప రాజులు+ బానిసలుగా చేసుకుంటారు;+ వాళ్ల పనుల్ని బట్టి, వాళ్లు తమ చేతులతో చేసినవాటిని బట్టి నేను వాళ్లకు ప్రతీకారం చేస్తాను.’ ”+

15 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలా చెప్పాడు: “నా చేతిలో నుండి ఉగ్రత అనే ఈ ద్రాక్షారసం గిన్నెను తీసుకొని, నేను నిన్ను పంపించే దేశాలన్నిటితో దాన్ని తాగించు. 16 వాళ్లు తాగి, తూలుతారు; నేను వాళ్ల మధ్యకు పంపిస్తున్న ఖడ్గాన్ని బట్టి పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తారు.”+

17 కాబట్టి నేను యెహోవా చేతిలో నుండి ఆ గిన్నె తీసుకుని, యెహోవా నన్ను పంపించిన దేశాలన్నిటితో దాన్ని తాగించాను.+ 18 ముందుగా యెరూషలేముతో, యూదా నగరాలతో,+ వాటి రాజులతో, వాటి అధిపతులతో దాన్ని తాగించాను. వాటిని, వాళ్లను నాశనం చేయాలని, భయంకరంగా మార్చాలని, ప్రజలు ఈలలు వేసేలా చేయాలని, శాపంగా చేయాలని అలా తాగించాను. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది; 19 తర్వాత ఐగుప్తు రాజు ఫరోతో, అతని సేవకులతో, అధిపతులతో, అతని ప్రజలందరితో,+ 20 వాళ్ల మధ్య నివసించే పరదేశులందరితో; ఊజు దేశపు రాజులందరితో; ఫిలిష్తీయుల+ దేశపు రాజులందరితో, అంటే అష్కెలోను+ రాజుతో, గాజా రాజుతో, ఎక్రోను రాజుతో, అష్డోదులో మిగిలినవాళ్ల రాజుతో; 21 ఎదోముతో,+ మోయాబుతో,+ అమ్మోనీయులతో;+ 22 తూరు రాజులందరితో, సీదోను రాజులందరితో,+ సముద్రంలోని ద్వీపాల రాజులతో; 23 దెదానుతో,+ తేమాతో, బూజుతో, కణతల పక్క వెంట్రుకలు గొరిగించుకున్న వాళ్లందరితో;+ 24 అరబీయుల+ రాజులందరితో, ఎడారిలో నివసించే రకరకాల ప్రజల రాజులందరితో; 25 జిమ్రీ రాజులందరితో, ఏలాము+ రాజులందరితో, మాదీయుల రాజులందరితో;+ 26 దగ్గర్లో గానీ దూరంలో గానీ ఉన్న ఉత్తర రాజులందరితో ఒకరి తర్వాత ఒకరితో, భూమ్మీదున్న ఇతర రాజ్యాలన్నిటితో దాన్ని తాగించాను; వాళ్ల తర్వాత షేషకు*+ రాజు దాన్ని తాగుతాడు.

27 “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, “తాగండి, మత్తెక్కే దాకా తాగి కక్కుకోండి, పడిపోయి మళ్లీ లేవకండి.+ ఎందుకంటే, నేను మీ మధ్యకు ఖడ్గాన్ని పంపిస్తున్నాను.” ’ 28 ఒకవేళ వాళ్లు నీ చేతిలో నుండి ఆ గిన్నెను తీసుకుని తాగడానికి ఇష్టపడకపోతే నువ్వు వాళ్లతో ఇలా అనాలి: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “మీరు ఖచ్చితంగా దీన్ని తాగాలి! 29 ఎందుకంటే, నేను నా పేరు పెట్టబడిన నగరం మీదికే ముందుగా విపత్తు తీసుకొస్తుంటే,+ మీరు శిక్షను తప్పించుకుంటారా?” ’+

“ ‘మీరు శిక్షను తప్పించుకోరు, ఎందుకంటే భూనివాసులందరి మీదికి నేను ఖడ్గాన్ని రప్పిస్తున్నాను’ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.

30 “నువ్వు వాళ్ల దగ్గర ఈ మాటలన్నీ ప్రవచించి, వాళ్లతో ఇలా అనాలి:

‘పైనుండి యెహోవా గర్జిస్తాడు,

తన పవిత్ర నివాస స్థలం నుండి ఆయన తన స్వరం వినిపిస్తాడు.

ఆయన తన నివాస స్థలం మీద బిగ్గరగా గర్జిస్తాడు.

ద్రాక్షల్ని తొక్కేవాళ్లలా అరుస్తూ,

భూనివాసులందరికీ వ్యతిరేకంగా విజయ గీతం పాడతాడు.’

31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘భూమి అంచుల వరకు ఒక శబ్దం మారుమోగుతుంది,

ఎందుకంటే, దేశాలతో యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది.

ఆయనే స్వయంగా మనుషులందరి మీద తీర్పు ప్రకటిస్తాడు.+

దుష్టుల్ని ఖడ్గానికి అప్పగిస్తాడు.’

32 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

‘ఇదిగో! దేశం నుండి దేశానికి విపత్తు వ్యాపిస్తుంది,+

భూమి సుదూర ప్రాంతాల నుండి భయంకరమైన తుఫాను బయల్దేరుతుంది.+

33 “ ‘ఆ రోజు యెహోవా చేత హతులైన వాళ్లు భూమి ఈ చివరి నుండి ఆ చివరి వరకు పడి ఉంటారు. ఎవరూ వాళ్ల గురించి ఏడ్వరు, వాళ్లను పోగుచేయరు, పాతిపెట్టరు. వాళ్లు నేలమీద ఎరువు అవుతారు.’

34 కాపరులారా, ఏడ్వండి, కేకలు వేయండి!

మందలోని ప్రధానులారా, బూడిదలో పడి దొర్లండి,

ఎందుకంటే మిమ్మల్ని వధించే సమయం, మీరు చెదిరిపోయే సమయం వచ్చేసింది,

మీరు అమూల్యమైన పాత్రలా పగలగొట్టబడతారు!

35 కాపరులు పారిపోవడానికి స్థలం లేదు,

మందలోని ప్రధానులు తప్పించుకోలేరు.

36 ఇదిగో! కాపరుల ఆర్తనాదాలు,

మందలోని ప్రధానుల ఏడ్పులు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే, యెహోవా వాళ్ల పచ్చికబయళ్లను నాశనం చేస్తున్నాడు.

37 యెహోవా కోపాగ్ని వల్ల

ప్రశాంతమైన నివాస స్థలాలు నిర్జీవంగా తయారయ్యాయి.

38 ఆయన కొదమ సింహంలా తన విశ్రాంతి స్థలం నుండి బయల్దేరాడు,+

ఎందుకంటే క్రూరమైన ఖడ్గం వల్ల,

ఆయన కోపాగ్ని వల్ల

దేశం భయంకరంగా తయారైంది.”

26 యోషీయా కుమారుడూ, యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన ఆరంభంలో యెహోవా వాక్యం ఇలా చెప్పింది: 2 “యెహోవా ఇలా అంటున్నాడు, ‘నువ్వు యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి, యెహోవా మందిరంలో ఆరాధించడానికి* లోపలికి వస్తున్న యూదా నగరాల ప్రజలందరి గురించి* ప్రకటించు. నేను నీకు ఆజ్ఞాపించేదంతా వాళ్లకు చెప్పు; ఒక్కమాట కూడా విడిచిపెట్టకు. 3 బహుశా వాళ్లు విని, ప్రతీ ఒక్కరు తమ చెడ్డ మార్గం నుండి పక్కకు మళ్లుతారేమో. అప్పుడు నేను, వాళ్ల చెడ్డపనుల్ని బట్టి వాళ్లమీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+ 4 వాళ్లకు ఇలా చెప్పు: “యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీరు నా మాట వినకపోతే, అంటే నేను మీ ముందు ఉంచిన నా ధర్మశాస్త్రాన్ని* పాటించకుండా, 5 నేను మీ దగ్గరికి పదేపదే* పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటల్ని ఇప్పటిలాగే వినకుండా ఉంటే,+ 6 నేను ఈ మందిరాన్ని షిలోహులా+ చేస్తాను, ఈ నగరాన్ని భూమ్మీదున్న దేశాలన్నీ శపించేలా చేస్తాను.’ ” ’ ”+

7 యిర్మీయా యెహోవా మందిరంలో ఈ మాటలు చెప్పడం యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు విన్నారు.+ 8 యిర్మీయా యెహోవా ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పడం పూర్తయిన తర్వాత, యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరు అతన్ని పట్టుకుని ఇలా అన్నారు: “నువ్వు ఖచ్చితంగా చస్తావు. 9 నువ్వు, ‘ఈ మందిరం షిలోహులా అవుతుంది, ఈ నగరం నాశనమైపోతుంది, దీనిలో ఎవ్వరూ నివసించరు’ అంటూ యెహోవా పేరున ఎందుకు ప్రవచించావు?” అప్పుడు ప్రజలందరూ యెహోవా మందిరంలో యిర్మీయా చుట్టూ గుమికూడారు.

10 యూదా అధిపతులు ఈ విషయం గురించి విన్నప్పుడు, వాళ్లు యూదా రాజు రాజభవనం నుండి యెహోవా మందిరానికి వచ్చి, యెహోవా మందిర కొత్త ద్వారం ప్రవేశం దగ్గర+ కూర్చున్నారు. 11 అప్పుడు యాజకులు, ప్రవక్తలు అధిపతులతో, ప్రజలందరితో ఇలా అన్నారు: “ఈ మనిషి మరణశిక్షకు అర్హుడు.+ ఎందుకంటే, ఇతను ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. ఆ మాటలు మీరే చెవులారా విన్నారు.”+

12 అప్పుడు యిర్మీయా అధిపతులందరితో, ప్రజలందరితో ఇలా అన్నాడు: “మీరు విన్న మాటల్ని, అంటే ఈ మందిరానికి, ఈ నగరానికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన మాటలన్నిటినీ ప్రవచించడానికి యెహోవాయే నన్ను పంపాడు.+ 13 కాబట్టి, ఇప్పుడు మీరు మీ మార్గాల్ని, మీ ప్రవర్తనను మార్చుకుని మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడండి. అప్పుడు యెహోవా మీకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకుంటాడు.*+ 14 ఇక నా విషయానికొస్తే, నేను మీ చేతుల్లో ఉన్నాను. మీకు ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది నాకు చేయండి. 15 అయితే ఒక్క విషయం తెలుసుకోండి: మీరు నన్ను చంపితే, ఒక నిర్దోషి రక్తాపరాధం మీ మీదికి, ఈ నగరం మీదికి, దాని నివాసుల మీదికి వస్తుంది. ఎందుకంటే, మీరు వింటుండగా ఈ మాటలన్నిటినీ చెప్పడానికి యెహోవాయే మీ దగ్గరికి నన్ను పంపించాడు, ఇది వాస్తవం.”

16 అప్పుడు అధిపతులు, ప్రజలందరు యాజకులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు: “ఇతను మరణశిక్షకు తగినవాడు కాదు, ఎందుకంటే ఇతను మన దేవుడైన యెహోవా పేరున మనతో మాట్లాడాడు.”

17 అంతేకాదు, దేశంలోని పెద్దల్లో కొందరు లేచి, ప్రజలందరితో ఇలా అన్నారు: 18 “యూదా రాజైన హిజ్కియా+ రోజుల్లో మోరష్తీకి చెందిన మీకా+ ప్రవచించాడు, అతను యూదా ప్రజలందరితో ఇలా అన్నాడు, ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది,

యెరూషలేము శిథిలాల కుప్పల్లా మారుతుంది,+

మందిర* పర్వతం అడవిలోని ఎత్తైన స్థలాల్లా అవుతుంది.” ’+

19 “అప్పుడు యూదా రాజైన హిజ్కియా, యూదా ప్రజలందరూ అతన్ని చంపేశారా? అతను యెహోవాకు భయపడి, యెహోవా అనుగ్రహం కోసం వేడుకోలేదా? అప్పుడు యెహోవా వాళ్లకు వ్యతిరేకంగా చెప్పిన విపత్తు విషయంలో తన మనసు మార్చుకోలేదా?*+ కాబట్టి మనం మనమీదికి గొప్ప విపత్తును తెచ్చుకోబోతున్నాం.

20 “ఇంకో వ్యక్తి కూడా యెహోవా పేరున ప్రవచించాడు, అతను కిర్యత్యారీముకు+ చెందిన షెమయా కుమారుడైన ఊరియా. అతను కూడా యిర్మీయా లాంటి మాటలే అంటూ ఈ నగరానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా ప్రవచించాడు. 21 అతని మాటల్ని యెహోయాకీము+ రాజు, అతని శూరులందరూ, అధిపతులందరూ విన్నారు; రాజు అతన్ని చంపాలని చూశాడు.+ ఊరియా దాని గురించి విన్నప్పుడు భయపడి ఐగుప్తుకు పారిపోయాడు. 22 అప్పుడు యెహోయాకీము రాజు అక్బోరు కుమారుడైన ఎల్నాతానును,+ అతనితో పాటు ఇంకొంతమందిని ఐగుప్తుకు పంపాడు. 23 వాళ్లు ఊరియాను ఐగుప్తు నుండి యెహోయాకీము రాజు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడతను ఊరియాను కత్తితో చంపి,+ అతని శవాన్ని సామాన్యుల సమాధి స్థలంలో పడేశాడు.”

24 అయితే షాఫాను+ కుమారుడైన అహీకాము+ యిర్మీయాకు సహాయం చేశాడు, కాబట్టి వాళ్లు అతన్ని చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.+

27 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన ఆరంభంలో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “యెహోవా నాకు ఇలా చెప్పాడు: ‘నీ కోసం కట్లను, కాడి మానుల్ని చేసుకుని నీ మెడమీద పెట్టుకో. 3 తర్వాత వాటిని యెరూషలేములోని యూదా రాజైన సిద్కియా దగ్గరికి వచ్చిన సందేశకుల ద్వారా ఎదోము+ రాజు దగ్గరికి, మోయాబు+ రాజు దగ్గరికి, అమ్మోనీయుల+ రాజు దగ్గరికి, తూరు+ రాజు దగ్గరికి, సీదోను+ రాజు దగ్గరికి పంపించు. 4 వాళ్ల యజమానులకు ఈ ఆజ్ఞను చెప్పమను:

“ ‘ “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు; మీరు మీ యజమానులకు చెప్పాల్సింది ఇదే: 5 ‘నా గొప్ప శక్తితో, చాచిన బాహువుతో భూమిని, మనుషుల్ని, నేలమీదున్న జంతువుల్ని చేసింది నేనే; నేను వీటన్నిటినీ నాకు నచ్చిన* వాళ్ల చేతికి అప్పగించాను.+ 6 ఇప్పుడు నేను ఈ దేశాలన్నిటినీ నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాను;+ అతన్ని సేవించేలా చివరికి జంతువుల్ని కూడా నేను అతనికి అప్పగించాను. 7 అతని దేశం వంతు వచ్చేవరకు దేశాలన్నీ అతనికి, అతని కుమారుడికి, అతని మనవడికి సేవచేస్తాయి;+ అప్పుడు చాలా దేశాలు, గొప్పగొప్ప రాజులు అతన్ని బానిసగా చేసుకుంటారు.’+

8 “ ‘ “ ‘ఏ దేశమైనా, రాజ్యమైనా బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవచేయడానికి, బబులోను రాజు కాడి కింద మెడ వంచడానికి ఒప్పుకోకపోతే నేను ఆ దేశాన్ని ఖడ్గంతో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను;+ అతని ద్వారా వాళ్లను పూర్తిగా నాశనం చేసేవరకు అలా చేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

9 “ ‘ “ ‘కాబట్టి, “మీరు బబులోను రాజుకు సేవచేయరు” అని మీ ప్రవక్తలు, సోదెగాళ్లు, కలలు కనేవాళ్లు, ఇంద్రజాలకులు, మాంత్రికులు చెప్తున్న మాటలు వినకండి. 10 ఎందుకంటే వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. మీరు వాళ్ల మాట వింటే, మీరు మీ దేశం నుండి దూరంగా తీసుకెళ్లబడతారు; నేను మిమ్మల్ని చెదరగొడతాను, మీరు నశించిపోతారు.

11 “ ‘ “ ‘అయితే బబులోను రాజు కాడి కింద మెడను వంచి, అతనికి సేవచేసే జనాన్ని తమ దేశంలోనే ఉండనిస్తాను, వాళ్లు దాన్ని సేద్యం చేసుకుంటూ, అక్కడే నివసిస్తారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ”

12 యూదా రాజైన సిద్కియాతో+ కూడా నేను అలాగే చెప్పాను: “మీరు ప్రాణాలతో ఉండాలంటే, బబులోను రాజు కాడి కింద మెడలు వంచి అతనికి, అతని ప్రజలకు సేవచేయండి.+ 13 బబులోను రాజుకు సేవచేయని దేశాల గురించి యెహోవా చెప్పినట్టు, నువ్వూ నీ ప్రజలూ ఖడ్గం వల్ల,+ కరువు వల్ల,+ తెగులు వల్ల+ ఎందుకు చనిపోవాలి? 14 ‘మీరు బబులోను రాజుకు సేవచేయరు’ అని మీతో చెప్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+ ఎందుకంటే, వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు.+

15 “ ‘నేను వాళ్లను పంపలేదు, అయినా వాళ్లు నా పేరున అబద్ధాలు ప్రవచిస్తున్నారు. మీరు వాళ్ల మాటలు వింటే, నేను మిమ్మల్ని చెదరగొడతాను, మీరూ మీకు ప్రవచనాలు చెప్తున్న ఆ ప్రవక్తలూ నశించిపోతారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

16 యాజకులతో, ప్రజలందరితో నేను ఇలా అన్నాను: “యెహోవా ఇలా అంటున్నాడు: ‘ “ఇదిగో! యెహోవా మందిరంలోని పాత్రలు త్వరలోనే బబులోను నుండి తీసుకురాబడతాయి!” అని ప్రవచిస్తున్న ప్రవక్తల మాటలు వినకండి.+ ఎందుకంటే వాళ్లు మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు.+ 17 వాళ్ల మాటలు వినకండి. బబులోను రాజుకు సేవచేయండి, అప్పుడు మీరు ప్రాణాలతో ఉంటారు.+ ఈ నగరం ఎందుకు పాడైపోవాలి? 18 వాళ్లు నిజంగా ప్రవక్తలైతే, యెహోవా వాక్యం వాళ్ల దగ్గర ఉంటే, యెహోవా మందిరంలో, యూదా రాజు రాజభవనంలో, యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తీసుకెళ్లబడకుండా ఉండేలా వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవాను వేడుకోవాలి.’

19 “ఎందుకంటే స్తంభాల+ గురించి, సముద్రం*+ గురించి, బండ్ల+ గురించి, ఈ నగరంలో మిగిలిన ఇతర పాత్రల గురించి సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు. 20 అవి బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము నుండి యెహోయాకీము కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను, యూదా, యెరూషలేముల ప్రముఖులందర్నీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లినప్పుడు పట్టుకెళ్లని పాత్రలు;+ 21 అవును, యెహోవా మందిరంలో, యూదా రాజు రాజభవనంలో, యెరూషలేములో మిగిలిన పాత్రల గురించి, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: 22 ‘ “వాటిని బబులోనుకు తీసుకెళ్తారు,+ నేను వాటిమీద దృష్టిపెట్టే రోజు వరకు అవి అక్కడే ఉంటాయి. తర్వాత నేను వాటిని వెనక్కి తీసుకొచ్చి, ఈ స్థలంలో ఉంచుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”+

28 అదే సంవత్సరం, అంటే యూదా రాజైన సిద్కియా+ పరిపాలన ఆరంభంలోని నాలుగో సంవత్సరం, ఐదో నెలలో గిబియోనుకు+ చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకుల ముందు, ప్రజలందరి ముందు నాతో ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను.+ 3 బబులోను రాజు నెబుకద్నెజరు ఈ స్థలం నుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటినీ నేను రెండు సంవత్సరాల్లోనే వెనక్కి తీసుకొస్తున్నాను.’ ”+ 4 “ ‘యెహోయాకీము+ కుమారుడూ యూదా రాజూ అయిన యెకొన్యాను,+ బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదా వాళ్లందర్నీ+ నేను వెనక్కి తీసుకొస్తాను. ఎందుకంటే, నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

5 అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడివున్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు హనన్యా ప్రవక్తతో మాట్లాడాడు. 6 యిర్మీయా ప్రవక్త ఇలా అన్నాడు: “ఆమేన్‌!* యెహోవా అలాగే చేయాలి! యెహోవా మందిరంలోని పాత్రల్ని, బందీలుగా వెళ్లిన ప్రజలందర్నీ బబులోను నుండి ఈ స్థలానికి తీసుకురావడం ద్వారా నువ్వు చెప్పిన ప్రవచనాన్ని యెహోవా నెరవేర్చాలి! 7 అయితే, దయచేసి నీ ముందు, ఈ ప్రజలందరి ముందు నేను చెప్తున్న ఈ సందేశాన్ని విను. 8 చాలాకాలం క్రితం, నాకన్నా, నీకన్నా ముందున్న ప్రవక్తలు ఎన్నో దేశాల మీదికి, గొప్ప రాజ్యాల మీదికి యుద్ధం, విపత్తు, తెగులు రావడం గురించి ప్రవచించారు. 9 ఒక ప్రవక్త శాంతి గురించి ప్రవచించినప్పుడు, ఆ ప్రవక్త మాట నెరవేరితే, అప్పుడు యెహోవాయే నిజంగా ఆ ప్రవక్తను పంపించాడని రుజువౌతుంది.”

10 అప్పుడు హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని తీసేసి, దాన్ని విరగ్గొట్టాడు.+ 11 హనన్యా ప్రజలందరి ముందు ఇలా అన్నాడు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదేవిధంగా నేను రెండు సంవత్సరాల్లోనే బబులోను రాజు నెబుకద్నెజరు కాడిని దేశాలన్నిటి మెడ మీది నుండి విరగ్గొడతాను.’ ”+ తర్వాత యిర్మీయా ప్రవక్త తన దారిన వెళ్లిపోయాడు.

12 హనన్యా ప్రవక్త యిర్మీయా ప్రవక్త మెడ మీది నుండి కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా నుండి యిర్మీయా దగ్గరికి ఈ సందేశం వచ్చింది: 13 “నువ్వు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు చెక్కతో చేసిన కాడిని విరగ్గొట్టావు,+ అయితే దాని స్థానంలో ఇనుప కాడి వస్తుంది.” 14 ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “బబులోను రాజు నెబుకద్నెజరుకు సేవచేయడానికి ఈ దేశాలన్నిటి మెడ మీద నేను ఇనుప కాడిని పెడతాను, వాళ్లు ఖచ్చితంగా అతనికి సేవచేయాలి.+ చివరికి జంతువుల్ని కూడా అతనికి అప్పగిస్తాను.” ’ ”+

15 తర్వాత యిర్మీయా ప్రవక్త హనన్యా+ ప్రవక్తతో ఇలా అన్నాడు: “హనన్యా, దయచేసి విను! యెహోవా నిన్ను పంపలేదు, అయితే నువ్వు ఈ ప్రజలు అబద్ధాన్ని నమ్మేలా చేశావు.+ 16 కాబట్టి యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదిగో! నేను నిన్ను భూమ్మీద లేకుండా చేయబోతున్నాను. ఈ సంవత్సరం నువ్వు చనిపోతావు. ఎందుకంటే, నువ్వు యెహోవా మీదికి తిరుగుబాటును రేపావు.’ ”+

17 కాబట్టి హనన్యా ప్రవక్త ఆ సంవత్సరం, ఏడో నెలలో చనిపోయాడు.

29 బందీలుగా వెళ్లిన ప్రజల్లోని మిగతా పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ప్రజలందరికీ యిర్మీయా ప్రవక్త యెరూషలేము నుండి రాసిన ఉత్తరంలోని మాటలు ఇవి. నెబుకద్నెజరు వాళ్లను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు. 2 యెకొన్యా+ రాజు, రాజమాత,+ ఆస్థాన అధికారులు, యూదా యెరూషలేముల అధిపతులు, చేతిపనివాళ్లు, కమ్మరి వాళ్లు* యెరూషలేము నుండి వెళ్లిపోయిన తర్వాత+ అతను ఈ ఉత్తరం రాశాడు. 3 యూదా రాజైన సిద్కియా+ బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి షాఫాను+ కుమారుడైన ఎల్యాశాను, హిల్కీయా కుమారుడైన గెమర్యాను పంపాడు. యిర్మీయా వాళ్ల ద్వారానే ఈ ఉత్తరాన్ని బబులోనుకు పంపించాడు. అందులో ఇలా ఉంది:

4 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా, బందీలుగా ఉన్న ప్రజలందరితో, అంటే తాను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా వెళ్లేలా చేసిన ప్రజలందరితో ఇలా అంటున్నాడు: 5 ‘మీరు ఇళ్లు కట్టుకుని వాటిలో నివసించండి. తోటలు నాటుకుని వాటి పండ్లను తినండి. 6 పెళ్లి చేసుకుని కుమారుల్ని, కూతుళ్లను కనండి; వాళ్లు కూడా కుమారుల్ని, కూతుళ్లను కనేలా వాళ్లకు కూడా పెళ్లిళ్లు చేయండి. అక్కడ మీ సంఖ్య పెరగాలి కానీ తగ్గకూడదు. 7 నేను మిమ్మల్ని బందీలుగా పంపించిన నగర క్షేమాన్ని కోరుకోండి, దాని కోసం యెహోవాకు ప్రార్థించండి. ఎందుకంటే దాని క్షేమమే మీ క్షేమం.+ 8 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ మధ్య ఉన్న మీ ప్రవక్తల్ని, మీ సోదెగాళ్లను నమ్మి మోసపోకండి,+ కలలు కనేవాళ్ల మాటలు వినకండి. 9 ఎందుకంటే, ‘వాళ్లు నా పేరున మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. నేను వాళ్లను పంపలేదు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ”

10 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘బబులోనులో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, నేను మీ మీద దృష్టి పెడతాను,+ మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి తీసుకురావడం ద్వారా నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను.’+

11 “ ‘ఎందుకంటే, నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను.+ మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’+ అని యెహోవా అంటున్నాడు. 12 ‘మీరు నాకు మొరపెడతారు, వచ్చి నాకు ప్రార్థిస్తారు, నేను మీ ప్రార్థన వింటాను.’+

13 “ ‘మీరు నన్ను వెదుకుతారు, కనుగొంటారు.+ ఎందుకంటే, మీరు నిండు హృదయంతో నన్ను వెదుకుతారు.+ 14 నేను మీకు దొరుకుతాను’+ అని యెహోవా అంటున్నాడు. ‘నేను చెరలో ఉన్న మిమ్మల్ని పోగుచేస్తాను, నేను ఏయే దేశాలకు, ప్రాంతాలకు మిమ్మల్ని చెదరగొట్టానో వాటన్నిట్లో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను’+ అని యెహోవా అంటున్నాడు. ‘మీరు ఏ స్థలం నుండి బందీలుగా వెళ్లేలా చేశానో ఆ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.’+

15 “కానీ మీరు, ‘యెహోవా మా కోసం బబులోనులో ప్రవక్తల్ని నియమించాడు’ అని అన్నారు.

16 “అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో,+ ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలందరితో, అంటే మీతోపాటు చెరలోకి వెళ్లని మీ సహోదరులతో యెహోవా ఇలా అంటున్నాడు: 17 ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, “నేను వాళ్ల మీదికి ఖడ్గాన్ని, కరువును, తెగులును రప్పించి,+ తినలేనంతగా కుళ్లిపోయిన* చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.” ’+

18 “ ‘నేను వాళ్లను ఖడ్గంతో, కరువుతో, తెగులుతో వెంటాడతాను.+ భూమ్మీది రాజ్యాలన్నీ వాళ్లను చూసి భయపడేలా చేస్తాను.+ నేను వాళ్లను దేశాల మధ్యకు చెదరగొడతాను, ఆ దేశాలు వాళ్లను శపిస్తాయి, వాళ్లను చూసి ఆశ్చర్యపోతాయి, ఈల వేస్తాయి,+ నిందిస్తాయి.+ 19 ఎందుకంటే నా సేవకులైన ప్రవక్తల్ని పదేపదే* పంపిస్తూ నేను చెప్పిన మాటల్ని వాళ్లు వినలేదు’ అని యెహోవా అంటున్నాడు.+

“ ‘మీరు కూడా నా మాట వినలేదు’+ అని యెహోవా అంటున్నాడు.

20 “కాబట్టి, నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపించిన మీరంతా యెహోవా చెప్పే మాట వినండి. 21 నా పేరున మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్న+ కోలాయా కుమారుడైన అహాబు గురించి, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను వాళ్లను బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగిస్తున్నాను, అతను మీ కళ్లముందే వాళ్లను చంపేస్తాడు. 22 వాళ్లకు జరిగేది బబులోనులో బందీలుగా ఉన్న యూదా ప్రజలందరి మధ్య ఒక శాపంగా మారుతుంది; వాళ్లు ఇలా శపిస్తారు: “యెహోవా నిన్ను బబులోను రాజు మంటల్లో కాల్చేసిన సిద్కియాలా, అహాబులా చేయాలి!” 23 ఎందుకంటే వాళ్లు తమ పొరుగువాళ్ల భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను ఆజ్ఞాపించని అబద్ధపు మాటల్ని నా పేరున చెప్తూ+ ఇశ్రాయేలులో అవమానకరంగా నడుచుకున్నారు.+

“ ‘ “అదంతా నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ”

24 “నెహెలాము వాడైన షెమయాతో+ నువ్వు ఇలా చెప్పాలి: 25 ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, మయశేయా కుమారుడూ యాజకుడూ అయిన జెఫన్యాకు,+ యాజకులందరికీ నీ పేరున ఇలా ఉత్తరాలు రాశావు: 26 ‘యాజకుడైన యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా చేసి, యెహోవా మందిరం మీద పర్యవేక్షకునిగా నియమించాడు, ప్రవక్తలా నటించే ప్రతీ పిచ్చివాణ్ణి బొండలో వేసే అధికారం నీకు ఇచ్చాడు;+ 27 మరి మీకు ప్రవక్తలా నటిస్తున్న+ అనాతోతు వాడైన యిర్మీయాను+ నువ్వు ఎందుకు గద్దించలేదు? 28 ఎందుకంటే చివరికి అతను బబులోనులో ఉన్న మాకు కూడా ఇలా సందేశం పంపాడు: “మీరు అక్కడ చాలాకాలం ఉంటారు! ఇళ్లు కట్టుకుని వాటిలో నివసించండి. తోటలు నాటుకుని వాటి పండ్లు తినండి,+ —” ’ ” ’ ”

29 యాజకుడైన జెఫన్యా+ యిర్మీయా ప్రవక్త ముందు ఆ ఉత్తరం చదివినప్పుడు, 30 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 31 “బందీలుగా ఉన్న వాళ్లందరికీ ఈ సందేశం పంపు: ‘నెహెలాము వాడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “నేను షెమయాను పంపకపోయినా అతను మీకు ప్రవచించి, మీరు అబద్ధాల్ని నమ్మేలా చేయడానికి ప్రయత్నించాడు.+ 32 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నెహెలాము వాడైన షెమయా మీదికి, అతని వంశస్థుల మీదికి నా దృష్టి మళ్లిస్తున్నాను. అతని వంశస్థుల్లో ఎవ్వరూ ఈ ప్రజల మధ్య బ్రతికి బయటపడరు, నా ప్రజలకు నేను చేసే మంచిని అతను చూడడు. ఎందుకంటే, అతను యెహోవా మీదికి తిరుగుబాటును రేపాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ”

30 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నీకు చెప్పే మాటలన్నీ ఒక పుస్తకంలో రాయి. 3 ఎందుకంటే, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, “ఇదిగో! బందీలుగా వెళ్లిన నా ప్రజల్ని, అంటే ఇశ్రాయేలు, యూదా ప్రజల్ని నేను సమకూర్చే రోజులు రాబోతున్నాయి”+ అని యెహోవా అంటున్నాడు. “నేను వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన దేశానికి వాళ్లను తిరిగి తీసుకొస్తాను, వాళ్లు మళ్లీ దాన్ని సొంతం చేసుకుంటారు.” ’ ”+

4 ఇశ్రాయేలు, యూదాలతో యెహోవా మాట్లాడిన మాటలు ఇవి.

 5 యెహోవా ఇలా అంటున్నాడు:

“భయంతో అరిచే అరుపులు మాకు వినిపించాయి;

భయమే గానీ శాంతి లేదు.

 6 దయచేసి ఈ విషయం అడిగి తెలుసుకోండి: పురుషుడు బిడ్డను కనగలడా?

మరైతే ప్రతీ బలమైన పురుషుడు బిడ్డను కనే స్త్రీలా+

తన కడుపు* మీద ఎందుకు చేతులు పెట్టుకుని ఉన్నాడు?

ప్రతీ వ్యక్తి ముఖం ఎందుకు పాలిపోయింది?

 7 అయ్యో! అది చాలా భయంకరమైన రోజు.+

అలాంటి రోజు ఇంకొకటి లేదు,

అది యాకోబుకు వేదన కలిగే రోజు.

అయితే అతను దాన్నుండి రక్షించబడతాడు.”

8 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజు, నేను నీ మెడ మీది నుండి కాడిని విరగ్గొడతాను, నీ కట్లను తెంపేస్తాను; ఇక పరదేశులు అతన్ని* బానిసగా చేసుకోరు. 9 వాళ్లు తమ దేవుడైన యెహోవాను, నేను వాళ్లమీద నియమించే తమ రాజైన దావీదును సేవిస్తారు.”+

10 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నా సేవకుడివైన యాకోబూ, భయపడకు;

ఇశ్రాయేలూ, బెదిరిపోకు.+

ఎందుకంటే నేను, దూరం నుండి నిన్ను,

తాము బందీలుగా ఉన్న దేశం నుండి నీ సంతానాన్ని కాపాడతాను.+

యాకోబు తిరిగొస్తాడు, ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా ఉంటాడు,

వాళ్లను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.”+

11 “ఎందుకంటే, నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“అయితే నేను నిన్ను ఏయే దేశాల మధ్యకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటినీ పూర్తిగా నాశనం చేస్తాను;+

నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను.+

అయితే తగిన మోతాదులో నీకు క్రమశిక్షణ ఇస్తాను,*

నిన్ను శిక్షించకుండా మాత్రం ఉండను.”+

12 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:

“నీ దెబ్బకు మందు లేదు,+

నీ గాయం నయం కానిది.

13 నీ వ్యాజ్యాన్ని వాదించేవాళ్లు ఎవరూ లేరు,

నీ పుండు ఏ విధంగానూ నయం కాదు.

నీకు చికిత్స లేదు.

14 నీ ప్రియులు నిన్ను మర్చిపోయారు.+

వాళ్లు ఇక నీ కోసం వెదకట్లేదు.

ఎందుకంటే నీ గొప్ప దోషాన్ని బట్టి, నువ్వు చేసిన లెక్కలేనన్ని పాపాల్ని బట్టి+

నేను, శత్రువు కొట్టినట్టు నిన్ను కొట్టాను,+

క్రూరుడు శిక్షించినట్టు శిక్షించాను.

15 నీ గాయాన్ని బట్టి ఎందుకు అరుస్తున్నావు?

నీ నొప్పి నయం కానిది!

నీ గొప్ప దోషాన్ని బట్టి, నువ్వు చేసిన లెక్కలేనన్ని పాపాల్ని బట్టి+

నేను నీకు అలా చేశాను.

16 అయితే నిన్ను మింగేసేవాళ్లంతా మింగేయబడతారు,+

నీ శత్రువులు కూడా చెరలోకి వెళ్తారు.+

నిన్ను కొల్లగొట్టేవాళ్లు కొల్లగొట్టబడతారు,

నిన్ను దోచుకునే వాళ్లంతా దోచుకోబడేలా చేస్తాను.”+

17 “ ‘సీయోను కోసం వెదికేవాళ్లే లేరు’+ అని అంటూ

వాళ్లు నిన్ను తిరస్కరించినా,

నేను మళ్లీ నిన్ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను, నీ గాయాల్ని నయం చేస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

18 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో నేను యాకోబు డేరాల దగ్గరికి వచ్చి, చెరలో ఉన్నవాళ్లను సమకూర్చబోతున్నాను,+

నేను అతని గుడారాల మీద జాలిపడతాను.

ఆ నగరం దాని కొండ మీద మళ్లీ కట్టబడుతుంది,+

పటిష్ఠమైన బురుజు దాని స్థానంలో నిలబడుతుంది.

19 వాళ్లు కృతజ్ఞతలు చెప్తారు, సంతోషంతో కేకలు వేస్తారు.+

నేను వాళ్ల సంఖ్యను ఎక్కువ చేస్తాను, వాళ్లు కొద్దిమందిగా ఉండరు;+

నేను వాళ్లను చాలా ఎక్కువమందిని* చేస్తాను,

వాళ్లు తక్కువవాళ్లుగా ఉండరు.+

20 అతని కుమారులు మళ్లీ ఒకప్పటిలా తయారౌతారు,

అతని సమాజం నా ముందు స్థిరంగా స్థాపించబడుతుంది.+

అతన్ని అణచివేసే వాళ్లందర్నీ నేను శిక్షిస్తాను.+

21 అతని నాయకుడు అతని ప్రజల నుండే వస్తాడు,

అతని పరిపాలకుడు అతని ప్రజల నుండే వస్తాడు.

నేను అతన్ని నా దగ్గరికి రానిస్తాను, అతను నా దగ్గరికి వస్తాడు.”

“లేదంటే, నా దగ్గరికి వచ్చే సాహసం ఎవరు చేస్తారు?” అని యెహోవా అంటున్నాడు.

22 “మీరు నాకు ప్రజలుగా ఉంటారు,+ నేను మీకు దేవునిగా ఉంటాను.”+

23 ఇదిగో! యెహోవా ఆగ్రహం తుఫానులా విరుచుకుపడబోతుంది;+

భయంకరమైన సుడిగాలిలా అది గిరగిరా తిరుగుతూ దుష్టుల తలమీద విరుచుకుపడుతుంది.

24 తన హృదయంలో అనుకున్నది నెరవేర్చే వరకు, దాన్ని పూర్తిచేసే వరకు

యెహోవా కోపాగ్ని వెనక్కి తిరగదు.+

చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.+

31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ సమయంలో, నేను ఇశ్రాయేలు కుటుంబాలన్నిటికీ దేవునిగా ఉంటాను, వాళ్లు నా ప్రజలుగా ఉంటారు.”+

 2 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఖడ్గాన్ని తప్పించుకున్న ప్రజలు ఎడారిలో దేవుని అనుగ్రహం పొందారు,

అప్పుడు ఇశ్రాయేలు తన విశ్రాంతి స్థలానికి వెళ్తున్నాడు.”

 3 దూరం నుండి యెహోవా నాకు కనిపించి ఇలా అన్నాడు:

“నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాను.

అందుకే విశ్వసనీయ ప్రేమతో నిన్ను దగ్గరికి తెచ్చుకున్నాను.*+

 4 నేను ఇంకొకసారి నిన్ను కడతాను, నువ్వు తిరిగి కట్టబడతావు.+

ఇశ్రాయేలు కూతురా,* నువ్వు మళ్లీ కంజీరలు* పట్టుకుని,

సంతోషంతో* నాట్యం చేస్తూ బయల్దేరతావు.+

 5 సమరయ పర్వతాల్లో నువ్వు మళ్లీ ద్రాక్షతోటలు నాటుతావు;+

నాటే వాళ్లు నాటుతారు, పండ్లను తింటారు.+

 6 ఎందుకంటే, ఎఫ్రాయిము పర్వతాల్లోని కావలివాళ్లు,

‘లెండి, మనం సీయోనుకు, మన దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్దాం పదండి’ అని చాటే రోజు రాబోతుంది.”+

 7 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు:

“సంతోషంతో యాకోబుకు పాటలు పాడండి.*

ఆనందంతో కేకలు వేయండి, ఎందుకంటే మీరు దేశాలకు తలగా ఉన్నారు.+

దాన్ని చాటించండి;

స్తుతులు చెల్లిస్తూ, ‘యెహోవా, నీ ప్రజల్ని, ఇశ్రాయేలులో మిగిలినవాళ్లను కాపాడు’ అని అనండి.+

 8 నేను ఉత్తర దేశం నుండి వాళ్లను వెనక్కి తీసుకొస్తున్నాను.+

భూమి సుదూర ప్రాంతాల నుండి వాళ్లను పోగుచేస్తాను.+

వాళ్లలో గుడ్డివాళ్లు, కుంటివాళ్లు,

గర్భిణీ స్త్రీలు, ప్రసవిస్తున్న స్త్రీలు అందరూ ఉంటారు.+

వాళ్లంతా గొప్ప సమాజంగా ఇక్కడికి తిరిగొస్తారు.+

 9 వాళ్లు ఏడుస్తూ వస్తారు.+

వాళ్లు అనుగ్రహం కోసం వేడుకుంటుండగా, నేను వాళ్లను నడిపిస్తాను.

నేను వాళ్లను నీటి ప్రవాహాల* దగ్గరికి నడిపిస్తాను,+

వాళ్లు తడబడకుండా చదునైన దారిలో నడిపిస్తాను.

ఎందుకంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని, ఎఫ్రాయిము నా మొదటి సంతానం.”+

10 దేశాల్లారా, యెహోవా చెప్పే ఈ మాట వినండి,

సుదూర ద్వీపాల మధ్య దీన్ని చాటించండి:+

“ఇశ్రాయేలును చెదరగొట్టిన దేవుడే అతన్ని మళ్లీ పోగుచేస్తాడు.

కాపరి తన మందను సంరక్షించినట్టు, అతన్ని సంరక్షిస్తాడు.+

11 ఎందుకంటే, యెహోవా యాకోబును విడిపిస్తాడు,+

అతనికన్నా బలమైనవాడి చేతిలో నుండి అతన్ని కాపాడతాడు.*+

12 వాళ్లు వచ్చి, సీయోను పర్వతం మీద సంతోషంతో కేకలు వేస్తారు,+

యెహోవా మంచితనాన్ని* బట్టి,

ధాన్యాన్ని బట్టి, కొత్త ద్రాక్షారసాన్ని బట్టి,+ నూనెను బట్టి,

మందల పిల్లల్ని బట్టి, పశువుల పిల్లల్ని బట్టి+ వాళ్ల ముఖాలు ప్రకాశిస్తాయి.

వాళ్లు బాగా నీళ్లుపెట్టిన తోటలా తయారౌతారు,+

ఇంకెప్పుడూ నీరసించిపోరు.”+

13 “ఆ సమయంలో కన్యలు, యువకులు, వృద్ధులు అందరూ సంతోషంతో నాట్యం చేస్తారు.+

నేను వాళ్ల వేదనను సంతోషంగా మారుస్తాను.+

వాళ్లను ఓదార్చి, దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇస్తాను.+

14 యాజకుల్ని సమృద్ధితో తృప్తిపరుస్తాను,

నా ప్రజలు నా మంచితనంతో తృప్తి చెందుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

15 “యెహోవా ఇలా అంటున్నాడు:

‘రామాలో+ రోదన, ఎంతో ఏడ్పు వినిపిస్తోంది:

రాహేలు తన కుమారుల* కోసం ఏడుస్తోంది.+

వాళ్లు ఇక లేకపోవడంతో

ఆమెను ఎవరూ ఓదార్చలేకపోతున్నారు.’ ”+

16 యెహోవా ఇలా అంటున్నాడు:

“ ‘ఇక ఏడ్వకు, కన్నీళ్లు పెట్టుకోకు,

ఎందుకంటే, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం దక్కుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘వాళ్లు శత్రుదేశం నుండి తిరిగొస్తారు.’+

17 ‘భవిష్యత్తులో నీకు మంచి జరుగుతుంది’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘నీ కుమారులు తమ ప్రాంతానికి తిరిగొస్తారు.’ ”+

18 “ఎఫ్రాయిము రోదనను నేను ఖచ్చితంగా విన్నాను,

‘కాడి మోయని దూడను సరిదిద్దినట్టు నువ్వు నన్ను సరిదిద్దావు, నేను సరిదిద్దబడ్డాను.

నువ్వు నన్ను వెనక్కి తిప్పు, నేను వెంటనే తిరుగుతాను,

ఎందుకంటే, నువ్వు నా దేవుడైన యెహోవావు.

19 నేను వెనక్కి తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడ్డాను;+

నాకు అర్థమయ్యాక వేదనతో తొడ చరుచుకున్నాను.

యౌవనంలో నేను చేసిన పనుల్ని బట్టి

సిగ్గుతో, అవమానంతో బాధపడ్డాను.’ ”+

20 “ఎఫ్రాయిము నాకు అమూల్యమైన కుమారుడు, ముద్దుబిడ్డ కాడా?+

నేను ఎన్నిసార్లు అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంకా అతన్ని గుర్తు చేసుకుంటాను.

అందుకే, అతని విషయంలో నా కడుపు తరుక్కుపోతోంది.+

నేను తప్పకుండా అతని మీద జాలిపడతాను” అని యెహోవా అంటున్నాడు.+

21 “నీకోసం దారిలో గుర్తులు పెట్టుకో,

దారి చూపించే స్తంభాలు పాతుకో.+

రహదారి మీద, అంటే నువ్వు వెళ్లాల్సిన దారి మీద దృష్టిపెట్టు.+

ఇశ్రాయేలు కూతురా,* తిరిగి రా, ఈ నీ నగరాలకు తిరిగి రా.

22 నమ్మకద్రోహివైన కూతురా, ఎంతకాలం నువ్వు అటూఇటూ తిరుగుతావు?

యెహోవా భూమ్మీద కొత్తది ఒకటి సృష్టించాడు:

ఒక స్త్రీ పురుషుని కోసం ఆత్రంగా వెతుకుతుంది.”

23 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను వాళ్ల బందీలను తిరిగి తీసుకొచ్చినప్పుడు యూదా దేశంలో, దాని నగరాల్లో వాళ్లు మళ్లీ ఇలా అంటారు: ‘నీతికి నివాసమా,+ పవిత్ర పర్వతమా,+ యెహోవా నిన్ను దీవించాలి.’ 24 అక్కడ యూదా, దాని నగరాలన్నీ నివసిస్తాయి; రైతులు, కాపరులు అందరూ కలిసి నివసిస్తారు.+ 25 ఎందుకంటే, నేను అలసిపోయినవాణ్ణి సేదదీరుస్తాను, ఆకలితో అలమటిస్తున్న వాళ్లందరికీ కడుపునిండా ఆహారం పెడతాను.”+

26 అప్పుడు నాకు మెలకువ వచ్చి కళ్లు తెరిచాను, ఆ నిద్ర నాకు హాయిగా అనిపించింది.

27 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లను, యూదా ఇంటివాళ్లను ఎక్కువమందిని చేసే రోజులు రాబోతున్నాయి, అప్పుడు వాళ్ల పశువుల సంఖ్యను కూడా ఎక్కువ చేస్తాను.”+

28 “వాళ్లను పెకిలించడానికి, పడగొట్టడానికి, కూలగొట్టడానికి, నాశనం చేయడానికి, హాని చేయడానికి నేను ఎలాగైతే వాళ్లమీద దృష్టిపెట్టానో+ అలాగే వాళ్లను కట్టడానికి, నాటడానికి వాళ్లమీద దృష్టిపెడతాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 29 “ఆ రోజుల్లో ప్రజలు, ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్లు పులిశాయి’ అని ఇక అనరు.+ 30 ప్రతీ వ్యక్తి తన సొంత అపరాధం వల్లే చనిపోతాడు. ఎవరు పుల్లని ద్రాక్షకాయలు తింటే వాళ్ల పళ్లే పులుస్తాయి.”

31 “ఇదిగో! నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లతో, యూదా ఇంటివాళ్లతో ఒక కొత్త ఒప్పందం చేసే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ 32 “అది, నేను వాళ్ల పూర్వీకుల చెయ్యి పట్టుకొని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్లతో చేసిన ఒప్పందంలా ఉండదు.+ ‘నేను వాళ్ల నిజమైన యజమానిని* అయినా వాళ్లు నా ఒప్పందానికి కట్టుబడి ఉండలేదు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

33 “ఆ రోజుల తర్వాత ఇశ్రాయేలు ఇంటివాళ్లతో నేను చేసే ఒప్పందం ఇదే: నేను నా నియమాల్ని వాళ్ల మనసుల్లో పెడతాను,+ వాళ్ల హృదయాల మీద వాటిని రాస్తాను.+ నేను వాళ్లకు దేవుణ్ణి అవుతాను, వాళ్లు నాకు ప్రజలౌతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

34 “ఇకమీదట వాళ్లలో ఎవ్వరూ, ‘యెహోవాను తెలుసుకో!’ అంటూ తమ పొరుగువానికి గానీ సహోదరునికి గానీ బోధించరు.+ ఎందుకంటే, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు.+ నేను వాళ్ల అపరాధాన్ని క్షమిస్తాను, వాళ్ల పాపాన్ని ఇక గుర్తుచేసుకోను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+

35 పగటి వెలుగు కోసం సూర్యుణ్ణి,

రాత్రి వెలుగు కోసం చంద్ర, నక్షత్రాల నియమాల్ని* ఏర్పాటుచేసిన,

సముద్రంలో అలజడి రేపి, దాని అలలు ఎగసిపడేలా చేస్తున్న,

సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న+

యెహోవా ఇలా అంటున్నాడు:

36 “ ‘ఈ నియమాలు ఎప్పటికైనా తప్పిపోతే,

అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు సంతానం నా కళ్లముందు ఒక జనంగా ఉండకుండా పోతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

37 యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘పైనున్న ఆకాశాన్ని కొలవడం, కిందున్న భూమి పునాదుల్ని పరిశోధించడం ఎంత అసాధ్యమో, ఇశ్రాయేలు సంతానం చేసిన దానంతటిని బట్టి నేను వాళ్లందర్నీ తిరస్కరించడం కూడా అంతే అసాధ్యం’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”+

38 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో! హనన్యేలు గోపురం+ నుండి మూల ద్వారం+ వరకు యెహోవా కోసం నగరం కట్టబడే రోజులు రాబోతున్నాయి.+ 39 కొలనూలు+ నేరుగా గారేబు కొండ వరకు వెళ్లి, గోయా వైపు తిరుగుతుంది. 40 శవాలను, బూడిదను* వేసే లోయ అంతా, కిద్రోను లోయ+ వరకు, అంటే తూర్పున గుర్రపు ద్వారం+ మూల వరకు ఉన్న పొలాలన్నీ యెహోవాకు ప్రతిష్ఠితం అవుతాయి.+ అది ఇంకెప్పుడూ పెకిలించబడదు, కూలగొట్టబడదు.”

32 యూదా రాజు సిద్కియా పరిపాలన 10వ సంవత్సరంలో, అంటే నెబుకద్నెజరు* పరిపాలన 18వ సంవత్సరంలో యెహోవా నుండి ఈ వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది.+ 2 ఆ సమయంలో బబులోను రాజు సైన్యాలు యెరూషలేమును ముట్టడిస్తున్నాయి, యిర్మీయా ప్రవక్త యూదా రాజు రాజభవనంలోని కాపలాదారుల ప్రాంగణంలో+ బంధించబడి ఉన్నాడు. 3 యూదా రాజు సిద్కియా ఇలా అంటూ అతన్ని బంధించాడు:+ “నువ్వు ఎందుకు ఇలా ప్రవచిస్తున్నావు? ఎందుకు ఇలా అంటున్నావు, ‘యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను ఈ నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తాను, అతను దాన్ని జయిస్తాడు,+ 4 యూదా రాజు సిద్కియా కల్దీయుల నుండి తప్పించుకోడు, అతను ఖచ్చితంగా బబులోను రాజు చేతికి అప్పగించబడతాడు, అతను బబులోను రాజును కళ్లారా చూస్తాడు, అతనితో ముఖాముఖిగా మాట్లాడతాడు.” ’+ 5 ‘అతను సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని మీద దృష్టిపెట్టే వరకు అతను అక్కడే ఉంటాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘నువ్వు కల్దీయులతో పోరాడుతూనే ఉన్నా విజయం సాధించవు.’ ”+

6 యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 7 ‘ఇదిగో, నీ తండ్రి సహోదరుడైన షల్లూము కుమారుడు హనమేలు నీ దగ్గరికి వచ్చి, “అనాతోతులో+ ఉన్న నా పొలాన్ని కొనుక్కో, ఎందుకంటే దాన్ని తిరిగి కొనే హక్కు మొదట నీకే ఉంది” అని అంటాడు.’ ”+

8 యెహోవా చెప్పినట్టే నా తండ్రి సహోదరుడి కుమారుడైన హనమేలు, కాపలాదారుల ప్రాంగణంలో ఉన్న నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అన్నాడు: “దయచేసి బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను, ఎందుకంటే దాన్ని తిరిగి కొనుక్కుని సొంతం చేసుకునే హక్కు నీకే ఉంది. నువ్వే దాన్ని కొనుక్కో.” దాంతో యెహోవాయే అలా జరగాలని అనుకుంటున్నాడని నాకు అర్థమైంది.

9 కాబట్టి నేను నా తండ్రి సహోదరుని కుమారుడైన హనమేలుకు ఏడు షెకెల్‌లు,* పది వెండి రూకలు తూచి ఇచ్చి+ అనాతోతులోని ఆ పొలం కొన్నాను. 10 తర్వాత నేను ఒక దస్తావేజులో దాన్ని రాయించి,+ ముద్రవేసి, సాక్షుల్ని పిలిపించి,+ డబ్బును త్రాసులో కొలిచాను. 11 తర్వాత నేను ఆ క్రయపత్రాన్ని, అంటే నిబంధనల ప్రకారం, చట్టప్రకారం ముద్రవేసిన దస్తావేజును, అలాగే ముద్రవేయని దస్తావేజును తీసుకుని, 12 నా తండ్రి సహోదరుని కుమారుడైన హనమేలు సమక్షంలో, క్రయపత్రం మీద సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కాపలాదారుల ప్రాంగణం+ దగ్గర కూర్చున్న యూదులందరి సమక్షంలో మహసేయా మనవడూ నేరీయా+ కుమారుడూ అయిన బారూకుకు+ ఆ క్రయపత్రాన్ని ఇచ్చాను.

13 తర్వాత నేను వాళ్ల సమక్షంలో బారూకుకు ఇలా ఆజ్ఞాపించాను: 14 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు ఈ క్రయపత్రాన్ని, అంటే ముద్రవేసిన దస్తావేజును, ముద్రవేయని దస్తావేజును రెండిటినీ తీసుకొని, అవి చాలాకాలం ఉండేలా వాటిని ఒక మట్టి కుండలో పెట్టు.’ 15 ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ దేశంలో ప్రజలు మళ్లీ ఇళ్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’ ”+

16 నేను ఆ క్రయపత్రాన్ని నేరీయా కుమారుడైన బారూకుకు ఇచ్చిన తర్వాత యెహోవాకు ఇలా ప్రార్థించాను: 17 “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! ఇదిగో! నువ్వు నీ గొప్ప శక్తితో, చాచిన బాహువుతో భూమ్యాకాశాల్ని సృష్టించావు.+ నీకు అసాధ్యమైనదేదీ లేదు; 18 నువ్వు వేలమంది పట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తావు; అయితే తండ్రుల దోషశిక్షను వాళ్ల తర్వాత వాళ్ల పిల్లల మీదికి రప్పిస్తావు;+ నువ్వు సత్యదేవుడివి, గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, సైన్యాలకు అధిపతైన యెహోవా నీ పేరు. 19 నీ ఆలోచన* గొప్పది, నువ్వు గొప్ప శక్తితో పనిచేస్తావు;+ ప్రతీ ఒక్కరికి వాళ్ల మార్గాల్ని బట్టి, పనుల్ని బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి+ నీ కనుదృష్టి మనుషుల మార్గాలన్నిటి మీద ఉంది.+ 20 నువ్వు ఐగుప్తు దేశంలో సూచనలు, అద్భుతాలు చేశావు, ఇప్పటికీ ప్రజలకు వాటి గురించి తెలుసు; అలా నువ్వు ఇశ్రాయేలులో, మనుషులందరి మధ్య కీర్తిని* సంపాదించుకున్నావు.+ 21 నువ్వు సూచనలు, అద్భుతాలు, భీకర కార్యాలు చేసి, బలమైన చేతితో, చాచిన బాహువుతో నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చావు.+

22 “చివరికి, నువ్వు వాళ్ల పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన పాలుతేనెలు ప్రవహించే ఈ దేశాన్ని+ వాళ్లకు ఇచ్చావు.+ 23 వాళ్లు వచ్చి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు; కానీ నీ మాట వినలేదు, నీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. నువ్వు వాళ్లకు ఆజ్ఞాపించినదేదీ వాళ్లు చేయలేదు, అందుకే నువ్వు ఈ విపత్తు అంతా వాళ్లమీదికి రప్పించావు.+ 24 ఇదిగో! నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి మనుషులు నగరం చుట్టూ ముట్టడిదిబ్బలు కట్టారు.+ ఈ నగరం ఖచ్చితంగా ఖడ్గం వల్ల,+ కరువు వల్ల, తెగులు వల్ల+ దానితో పోరాడుతున్న కల్దీయుల చేతుల్లోకి వెళ్లిపోతుంది; నువ్వు చెప్పినదంతా జరిగింది. అది నువ్వు చూస్తూనే ఉన్నావు. 25 అయితే సర్వోన్నత ప్రభువైన యెహోవా, నగరం ఖచ్చితంగా కల్దీయుల చేతికి అప్పగించబడుతున్నా నువ్వు నాతో, ‘డబ్బులిచ్చి పొలం కొనుక్కో, సాక్షుల్ని పిలువు’ అన్నావు.”

26 అప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 27 “ఇదిగో నేను యెహోవాను, మనుషులందరికీ దేవుణ్ణి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? 28 యెహోవా అనే నేను ఇలా చెప్తున్నాను: ‘ఇదిగో, నేను ఈ నగరాన్ని కల్దీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగిస్తున్నాను, అతను దాన్ని జయిస్తాడు.+ 29 ఈ నగరంతో పోరాడుతున్న కల్దీయులు వచ్చి, దానికి నిప్పంటించి, కాల్చేస్తారు.+ అలాగే ప్రజలు ఏయే ఇళ్ల పైకప్పుల మీద బయలుకు బలులు, ఇతర దేవుళ్లకు పానీయార్పణలు అర్పించి నాకు కోపం తెప్పించారో+ ఆ ఇళ్లన్నిటినీ వాళ్లు కాల్చేస్తారు.’

30 “ ‘ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు చిన్నప్పటి నుండి నా దృష్టిలో చెడ్డవైనవి తప్ప ఇంకేమీ చేయలేదు;+ ఇశ్రాయేలు ప్రజలు తమ చేతుల పనులతో నాకు కోపం తెప్పిస్తూ ఉన్నారు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 31 ‘వాళ్లు ఈ నగరాన్ని కట్టిన రోజు నుండి ఈ రోజు వరకు అది నాకు కోపం, ఆగ్రహం తెప్పించడం తప్ప ఇంకేమీ చేయలేదు,+ కాబట్టి అది ఖచ్చితంగా నా ఎదుట నుండి తీసేయబడాలి;+ 32 ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అంటే వాళ్లు, వాళ్ల రాజులు,+ వాళ్ల అధిపతులు,+ వాళ్ల యాజకులు, వాళ్ల ప్రవక్తలు,+ యూదా ప్రజలు, యెరూషలేము నివాసులు నాకు కోపం తెప్పించడానికి చేసిన చెడు అంతటిని బట్టి అది తీసేయబడాలి. 33 వాళ్లు నాకు ముఖం చూపించే బదులు వీపునే చూపించారు;+ నేను వాళ్లకు పదేపదే* బోధించడానికి ప్రయత్నించినా ఎవ్వరూ వినలేదు, క్రమశిక్షణను స్వీకరించలేదు.+ 34 నా పేరు పెట్టబడిన మందిరంలో వాళ్లు తమ అసహ్యమైన విగ్రహాల్ని పెట్టి దాన్ని అపవిత్రం చేశారు.+ 35 అంతేకాదు బెన్‌హిన్నోము* లోయలో+ బయలుకు ఉన్నత స్థలాలు కట్టి, తమ కుమారుల్ని, కూతుళ్లను మోలెకు కోసం అగ్నిలో వేసి కాల్చారు.*+ అలాంటి అసహ్యమైన పని చేయమని నేను వాళ్లకు ఆజ్ఞాపించలేదు,+ కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు. అలా యూదా ఘోరమైన పాపం చేసింది.’

36 “ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల బబులోను రాజు చేతికి అప్పగించబడుతుందని మీరు అంటున్న ఈ నగరం గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: 37 ‘కోపంతో, ఆగ్రహంతో, గొప్ప ఉగ్రతతో నేను వాళ్లను ఏయే దేశాలకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటి నుండి నేను వాళ్లను సమకూర్చి,+ ఈ స్థలానికి తిరిగి తీసుకొచ్చి, ఇక్కడ సురక్షితంగా నివసించేలా చేస్తాను.+ 38 వాళ్లు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వాళ్లకు దేవునిగా ఉంటాను.+ 39 వాళ్ల మంచి కోసం, వాళ్ల తర్వాత వాళ్ల పిల్లల మంచి కోసం వాళ్లు నాకు ఎప్పుడూ భయపడుతూ ఉండేలా నేను వాళ్లకు ఒకే హృదయాన్ని ఇస్తాను,+ ఒకే మార్గంలో నడిచేలా చేస్తాను.+ 40 వాళ్లకు మంచి చేయడం మానను+ అని వాళ్లతో ఒక శాశ్వత ఒప్పందం చేస్తాను;+ వాళ్లు నాకు దూరమవ్వకుండా వాళ్ల హృదయాల్లో నా పట్ల భయాన్ని పెడతాను. 41 నేను వాళ్లకు మంచి చేయడానికి సంతోషిస్తాను,+ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* వాళ్లను ఈ దేశంలో స్థిరంగా నాటతాను.’ ”+

42 “ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఈ ప్రజల మీదికి ఈ గొప్ప విపత్తు అంతటినీ తీసుకొచ్చినట్టే, నేను వాళ్లకు వాగ్దానం చేస్తున్న మంచివన్నీ వాళ్లకు ఇస్తాను.*+ 43 “ఇది మనుషులు గానీ జంతువులు గానీ లేని పాడుబడ్డ భూమి, ఇది కల్దీయుల చేతికి అప్పగించబడింది” అని మీరు అంటున్నా, ఈ దేశంలో ప్రజలు మళ్లీ పొలాలు కొంటారు.’

44 “ ‘బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో, యూదా నగరాల్లో,+ పర్వత ప్రాంతంలోని నగరాల్లో, మైదానంలోని నగరాల్లో,+ దక్షిణ ప్రాంతంలోని నగరాల్లో ప్రజలు డబ్బులిచ్చి పొలాలు కొంటారు,+ క్రయపత్రాల్ని రాసి ముద్ర వేస్తారు, సాక్షుల్ని పిలిపిస్తారు. ఎందుకంటే, బందీలుగా వెళ్లిన ఈ ప్రజల్ని నేను తిరిగి తీసుకొస్తాను’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

33 యిర్మీయా ఇంకా కాపలాదారుల ప్రాంగణంలో+ బందీగా ఉన్నప్పుడే యెహోవా వాక్యం రెండోసారి అతని దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “భూమిని సృష్టించిన యెహోవా, దాన్ని తయారుచేసి, స్థిరంగా స్థాపించిన యెహోవా ఇలా అంటున్నాడు; ఆయన పేరు యెహోవా, 3 ‘నాకు ప్రార్థించు, నేను నీకు జవాబిస్తాను, నీకు తెలియని గొప్పగొప్ప విషయాల్ని, అర్థం చేసుకోలేని విషయాల్ని నీకు తెలియజేస్తాను.’ ”+

4 “ముట్టడిదిబ్బల వల్ల, ఖడ్గం వల్ల పడగొట్టబడిన ఈ నగరంలోని ఇళ్ల గురించి, యూదా రాజుల ఇళ్ల గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు;+ 5 కల్దీయులతో పోరాడడానికి వస్తున్న వాళ్ల గురించి, కోపంతో ఆగ్రహంతో నేను చంపినవాళ్ల శవాలతో నింపబడుతున్న ఈ స్థలాల గురించి, నేను ఈ నగరాన్ని విడిచిపెట్టేంత చెడ్డగా ప్రవర్తించినవాళ్ల గురించి ఆయన ఇలా అంటున్నాడు: 6 ‘ఇదిగో, నేను ఆమెను బాగుచేసి ఆరోగ్యవంతురాలిగా చేస్తాను,+ నేను వాళ్లను బాగుచేసి సమృద్ధిగా శాంతిని, సత్యాన్ని దయచేస్తాను.+ 7 బందీలుగా వెళ్లిన యూదావాళ్లను, ఇశ్రాయేలువాళ్లను నేను వెనక్కి తీసుకొచ్చి,+ మొదట్లో కట్టినట్టు కడతాను.+ 8 వాళ్లు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాల వల్ల కలిగిన దోషమంతటినీ కడిగేస్తాను,+ వాళ్లు నాకు వ్యతిరేకంగా చేసిన పాపాల వల్ల, అపరాధాల వల్ల కలిగిన దోషమంతటినీ క్షమిస్తాను.+ 9 నేను వాళ్లమీద చూపించే మంచితనం అంతటి గురించి భూమ్మీది ఏయే దేశాలు వింటాయో, వాటన్నిటి ముందు ఆమె వల్ల నాకు కీర్తి, సంతోషం, స్తుతి, మహిమ కలుగుతాయి.+ నేను ఆమెమీద చూపించే మంచితనం అంతటిని బట్టి, ఆమెకు దయచేసే శాంతిని బట్టి వాళ్లు భయపడతారు, వణికిపోతారు.’ ”+

10 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘మనుషులు గానీ పశువులు గానీ లేని పాడుబడ్డ భూమి అని మీరు చెప్పే ఈ స్థలంలో, మనుషులు గానీ నివాసులు గానీ పశువులు గానీ లేకుండా నాశనమైపోయిన యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో మళ్లీ ఈ శబ్దాలు వినిపిస్తాయి: 11 సంతోష ధ్వని, ఉల్లాస ధ్వని,+ పెళ్లికుమారుడి స్వరం, పెళ్లికూతురి స్వరం; “సైన్యాలకు అధిపతైన యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, యెహోవా మంచివాడు;+ ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది!” అని చెప్పేవాళ్ల స్వరం వినిపిస్తాయి.’+

“ ‘వాళ్లు యెహోవా మందిరంలోకి కృతజ్ఞతార్పణలు తీసుకొస్తారు,+ ఎందుకంటే దేశం నుండి బందీలుగా వెళ్లిన వాళ్లను నేను వెనక్కి తీసుకొస్తాను, వాళ్లు మళ్లీ మొదట్లో ఉన్నట్టే ఉంటారు’ అని యెహోవా అంటున్నాడు.”

12 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మనుషులు గానీ పశువులు గానీ లేని ఈ పాడుబడ్డ భూమిలో, దాని నగరాలన్నిట్లో మళ్లీ పచ్చికబయళ్లు ఉంటాయి, కాపరులు తమ మందల్ని అక్కడ పడుకోబెడతారు.’+

13 “ ‘పర్వత ప్రాంతంలోని నగరాల్లో, మైదానంలోని నగరాల్లో, దక్షిణ ప్రాంతంలోని నగరాల్లో, బెన్యామీను ప్రాంతంలో, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో,+ యూదా నగరాల్లో మందలు మళ్లీ వాటిని లెక్కపెట్టే వాళ్ల చేతుల కింది నుండి వెళ్తాయి’ అని యెహోవా అంటున్నాడు.”

14 “ ‘ఇదిగో, నేను ఇశ్రాయేలు ఇంటివాళ్ల గురించి, యూదా ఇంటివాళ్ల గురించి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే రోజులు వస్తున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+ 15 ‘ఆ రోజుల్లో, ఆ సమయంలో నేను దావీదుకు ఒక నీతి మొలకను* పుట్టిస్తాను,+ అతను దేశంలో నీతిన్యాయాలు జరిగిస్తాడు.+ 16 ఆ రోజుల్లో యూదా రక్షించబడుతుంది,+ యెరూషలేము సురక్షితంగా నివసిస్తుంది.+ ఆమె, “యెహోవాయే మన నీతి” అని పిలవబడుతుంది.’ ”+

17 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇశ్రాయేలు ఇంటివాళ్ల సింహాసనం మీద కూర్చునే వ్యక్తి దావీదు వంశంలో ఎప్పుడూ ఉంటాడు,+ 18 అలాగే నా ముందు నిలబడి సంపూర్ణ దహనబలులు అర్పించడానికి, ధాన్యార్పణలు కాల్చడానికి, బలులు అర్పించడానికి లేవీయులైన యాజకులు ఎప్పటికీ ఉంటారు.’ ”

19 యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 20 “యెహోవా ఇలా అంటున్నాడు, ‘పగలు, రాత్రి వాటివాటి సమయాల్లో రాకుండా నువ్వు పగటి గురించిన నా ఒప్పందాన్ని, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని భంగం చేయగలిగితే,+ 21 అప్పుడు మాత్రమే నా సేవకుడైన దావీదుతో నేను చేసిన ఒప్పందం భంగమై,+ అతని సింహాసనం మీద కూర్చుని రాజుగా పరిపాలించడానికి అతనికి ఒక కుమారుడు లేకుండా పోతాడు;+ అప్పుడు మాత్రమే నా పరిచారకులైన లేవి యాజకుల గురించిన నా ఒప్పందం కూడా భంగమౌతుంది.+ 22 ఆకాశంలో నక్షత్రాల్ని లెక్కపెట్టడం, సముద్రంలోని ఇసుకను కొలవడం అసాధ్యం అనే మాట ఎంత ఖచ్చితమో, నేను నా సేవకుడైన దావీదు సంతానాన్ని,* నాకు పరిచారం చేస్తున్న లేవీయుల్ని వృద్ధి చేయడం కూడా అంతే ఖచ్చితం.’ ”

23 యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 24 “ఈ ప్రజలు, ‘యెహోవా తాను ఎంచుకున్న రెండు కుటుంబాల్ని తిరస్కరిస్తాడు’ అని అంటున్న మాటను నువ్వు గమనించలేదా? వాళ్లు నా ప్రజలతో గౌరవం లేనట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్లను ఇక ఏమాత్రం ఒక జనంగా చూడట్లేదు.

25 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘పగలు, రాత్రి గురించిన నా ఒప్పందాన్ని,+ భూమ్యాకాశాల నియమాల్ని*+ నేను స్థిరపర్చాను అనే మాట ఎంత ఖచ్చితమో, 26 యాకోబు సంతానాన్ని,* నా సేవకుడైన దావీదు సంతానాన్ని* ఎప్పటికీ తిరస్కరించను అనే మాట కూడా అంతే ఖచ్చితం; అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల వంశస్థుల్ని* పరిపాలించడానికి అతని సంతానం* నుండి నేను పరిపాలకుల్ని తీసుకోకుండా ఉండను. ఎందుకంటే వాళ్లలో బందీలుగా వెళ్లిన వాళ్లను నేను సమకూరుస్తాను,+ వాళ్లమీద జాలిపడతాను.’ ”+

34 బబులోను రాజు నెబుకద్నెజరు,* అతని సైన్యమంతా, భూమ్మీద అతని ఆధిపత్యం కింద ఉన్న రాజ్యాలన్నీ, జనాలన్నీ యెరూషలేముతో, దాని నగరాలన్నిటితో పోరాడుతున్నప్పుడు+ యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది:

2 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు వెళ్లి, యూదా రాజు సిద్కియాతో+ ఇలా చెప్పు: “యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఇదిగో, నేను ఈ నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగిస్తున్నాను, అతను దాన్ని అగ్నితో కాల్చేస్తాడు.+ 3 నువ్వు అతని చేతిలో నుండి తప్పించుకోవు, ఖచ్చితంగా నిన్ను పట్టుకొని అతనికి అప్పగిస్తారు.+ నువ్వు బబులోను రాజును కళ్లారా చూస్తావు, ముఖాముఖిగా అతనితో మాట్లాడతావు, నువ్వు బబులోనుకు వెళ్తావు.’+ 4 అయితే యూదా రాజైన సిద్కియా, యెహోవా చెప్పే మాట విను, ‘నీ గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు ఖడ్గం వల్ల చనిపోవు. 5 నువ్వు ప్రశాంతంగా చనిపోతావు,+ వాళ్లు నీ తండ్రుల కోసం, అంటే నీకు ముందున్న రాజుల కోసం కాల్చినట్టే నీ కోసం పరిమళ ద్రవ్యాల్ని కాలుస్తారు, ‘అయ్యో, మా యజమానీ!’ అంటూ నీ కోసం ఏడుస్తారు. ఎందుకంటే ‘నేనే ఈ మాట చెప్తున్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ” ’ ”

6 తర్వాత యిర్మీయా ప్రవక్త యెరూషలేములో ఈ మాటలన్నిటిని యూదా రాజైన సిద్కియాతో చెప్పాడు. 7 అప్పుడు బబులోను రాజు సైన్యాలు యెరూషలేముతో, మిగిలిన యూదా నగరాలన్నిటితో అంటే లాకీషుతో,+ అజేకాతో+ పోరాడుతున్నాయి;+ ఎందుకంటే ప్రాకారాలుగల యూదా నగరాల్లో మిగిలినవి అవే.

8 విడుదలను ప్రకటించమని+ చెప్తూ సిద్కియా రాజు యెరూషలేములో ఉన్న ప్రజలందరితో ఒప్పందం చేసిన తర్వాత యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది. 9 ఆ ఒప్పందం ప్రకారం ప్రతీ వ్యక్తి హెబ్రీయులైన తన దాసుల్ని, దాసురాళ్లను విడుదల చేయాలి, ఎవరూ తోటి యూదుణ్ణి దాసునిగా ఉంచుకోకూడదు. 10 దానికి అధిపతులందరూ, ప్రజలందరూ లోబడ్డారు. ప్రతీ వ్యక్తి తన దాసుల్ని, దాసురాళ్లను విడుదల చేయాలి, వాళ్లను ఇక నుండి దాసులుగా ఉంచుకోకూడదు అనే ఒప్పందంలో వాళ్లు చేరారు. వాళ్లు దానికి లోబడి వాళ్లను విడిచిపెట్టారు. 11 కానీ ఆ తర్వాత, తాము విడిచిపెట్టిన దాసుల్ని, దాసురాళ్లను వెనక్కి తెచ్చుకొని, వాళ్లను మళ్లీ బానిసల్ని చేసుకున్నారు. 12 కాబట్టి యెహోవా నుండి యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:

13 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను మీ పూర్వీకుల్ని దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చిన రోజున+ వాళ్లతో ఇలా ఒప్పందం చేశాను:+ 14 “మీలో ప్రతీ ఒక్కరు మీకు అమ్మబడి, ఆరు సంవత్సరాలు మీకు సేవచేసిన హెబ్రీయుడైన మీ సహోదరుణ్ణి ఏడు సంవత్సరాల చివర్లో విడిచిపెట్టాలి. మీరు ఖచ్చితంగా అతన్ని విడుదల చేయాలి.”+ అయితే మీ పూర్వీకులు నా మాట వినలేదు, పట్టించుకోలేదు. 15 ఈ మధ్యే మీరు మనసు మార్చుకుని మీ తోటివాళ్లకు విడుదల ప్రకటించి నా దృష్టిలో సరైనది చేశారు, నా పేరు పెట్టబడిన మందిరంలో నా ముందు ఒక ఒప్పందం చేశారు. 16 అయితే మీరు మళ్లీ మనసు మార్చుకున్నారు; మీ దాసుల్ని, దాసురాళ్లను వాళ్ల ఇష్టప్రకారం వెళ్లనిచ్చిన తర్వాత మళ్లీ వాళ్లను వెనక్కి తెచ్చుకుని బానిసల్ని చేసుకున్నారు; అలా నా పేరును అపవిత్రపర్చారు.’+

17 “కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘తన సహోదరునికి, తోటివానికి విడుదల ప్రకటించే విషయంలో మీరు నాకు లోబడలేదు.+ కాబట్టి ఇప్పుడు నేను మీకు విడుదల ప్రకటిస్తాను’ అని యెహోవా చెప్తున్నాడు; ‘నేను మిమ్మల్ని ఖడ్గానికి, తెగులుకు, కరువుకు అప్పగిస్తాను;+ భూమ్మీదున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని చూసి భయపడేలా చేస్తాను.+ 18 దూడను రెండు ముక్కలు చేసి వాటి మధ్య నడిచినప్పుడు నా ముందు చేసిన ఒప్పంద మాటల్ని+ పాటించకుండా ఎవరైతే నా ఒప్పందాన్ని మీరారో వాళ్లకు ఇలా జరుగుతుంది, 19 అంటే దూడ రెండు ముక్కల మధ్య నడిచిన యూదా అధిపతులకు, యెరూషలేము అధిపతులకు, ఆస్థాన అధికారులకు, యాజకులకు, దేశ ప్రజలందరికీ ఇలా జరుగుతుంది: 20 నేను వాళ్లను వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తాను, వాళ్ల శవాలు ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారమౌతాయి.+ 21 యూదా రాజు సిద్కియాను, అతని అధిపతుల్ని వాళ్ల శత్రువుల చేతికి, వాళ్ల ప్రాణాలు తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, మీతో పోరాడడం ఆపి వెనక్కి వెళ్లిపోతున్న+ బబులోను రాజు సైన్యాల చేతికి అప్పగిస్తాను.’+

22 “యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను ఆజ్ఞ ఇచ్చి వాళ్లను మళ్లీ ఈ నగరానికి రప్పిస్తాను, వాళ్లు దీనితో పోరాడతారు, దీన్ని ఆక్రమించి, అగ్నితో కాల్చేస్తారు;+ నేను యూదా నగరాల్ని నివాసులు లేని పాడుబడ్డ భూమిలా చేస్తాను.’ ”+

35 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ రోజుల్లో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “నువ్వు రేకాబీయుల ఇంటివాళ్ల+ దగ్గరికి వెళ్లి, వాళ్లతో మాట్లాడి, వాళ్లను యెహోవా మందిరంలోని ఒక భోజనాల గదిలోకి తీసుకురా; తర్వాత, తాగడానికి వాళ్లకు ద్రాక్షారసం ఇవ్వు.”

3 కాబట్టి నేను హబజ్జిన్యా మనవడూ యిర్మీయా కుమారుడూ అయిన యజన్యాను, అతని సహోదరుల్ని, అతని కుమారులందర్నీ, రేకాబీయుల ఇంటివాళ్లందర్నీ 4 యెహోవా మందిరంలోకి తీసుకొచ్చాను. నేను వాళ్లను యిగ్దల్యా కుమారుడూ సత్యదేవుని సేవకుడూ అయిన హానాను కుమారుల భోజనాల గదిలోకి తీసుకొచ్చాను. ఆ గది అధిపతుల భోజనాల గదికి పక్కన, ద్వారపాలకుడైన షల్లూము కుమారుడు మయశేయా భోజనాల గదికి పైన ఉంది. 5 అప్పుడు నేను ద్రాక్షారసంతో నిండిన గిన్నెల్ని, పాత్రల్ని ఆ రేకాబీయుల ఇంటివాళ్ల ముందు పెట్టి, “ద్రాక్షారసం తాగండి” అన్నాను.

6 కానీ వాళ్లు ఇలా అన్నారు: “మేము ద్రాక్షారసం తాగం, ఎందుకంటే మా పూర్వీకుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు*+ మాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ‘మీరు గానీ మీ కుమారులు గానీ ఎప్పటికీ ద్రాక్షారసం తాగకూడదు. 7 మీరు ఇల్లు కట్టుకోకూడదు; విత్తనాలు విత్తకూడదు; ద్రాక్షతోట నాటకూడదు, అది మీకు ఉండకూడదు. మీరు ఎప్పుడూ డేరాల్లోనే నివసించాలి. అలాగైతేనే మీరు పరదేశులుగా నివసిస్తున్న దేశంలో ఎక్కువకాలం జీవిస్తారు.’ 8 కాబట్టి మేము మా పూర్వీకుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాటకు లోబడి, అతను మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటిస్తూ మేము గానీ మా భార్యలు గానీ మా కుమారులు గానీ మా కూతుళ్లు గానీ ఎప్పటికీ ద్రాక్షారసం తాగం. 9 మేము నివసించడానికి ఇళ్లు కట్టుకోం, మా దగ్గర ద్రాక్షతోటలు గానీ పొలాలు గానీ విత్తనాలు గానీ లేవు. 10 మేము డేరాల్లోనే నివసిస్తూ, మా పూర్వీకుడైన యెహోనాదాబు* మాకు ఆజ్ఞాపించినవన్నీ పాటిస్తూ ఉన్నాం. 11 అయితే బబులోను రాజు నెబుకద్నెజరు* ఈ దేశం మీదికి వచ్చినప్పుడు+ మేము, ‘రండి, కల్దీయుల సైన్యం నుండి, సిరియన్ల సైన్యం నుండి తప్పించుకోవడానికి యెరూషలేముకు పారిపోదాం’ అని అనుకున్నాం. ఇప్పుడు మేము యెరూషలేములో ఉంటున్నాం. ”

12 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 13 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘నువ్వు వెళ్లి, యూదా ప్రజలతో, యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు: “నా మాటలకు లోబడమని నేను మిమ్మల్ని పదేపదే ప్రోత్సహించలేదా?”+ అని యెహోవా అంటున్నాడు. 14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన వంశస్థులకు ద్రాక్షారసం తాగకూడదని ఆజ్ఞాపించాడు, వాళ్లు అతని మాటను పాటిస్తూ ఈ రోజు వరకు ద్రాక్షారసం తాగట్లేదు, అలా తమ పూర్వీకుడి ఆదేశానికి లోబడుతున్నారు.+ కానీ మీరు మాత్రం, నేను మీతో పదేపదే* మాట్లాడినా నాకు లోబడలేదు.+ 15 నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ,+ ‘దయచేసి, మీరంతా మీ చెడ్డ మార్గాలు విడిచిపెట్టి సరైనది చేయండి!+ వేరే దేవుళ్లను అనుసరించకండి, వాటిని పూజించకండి. అప్పుడు మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తూ ఉంటారు’ అని చెప్తూ వచ్చాను.+ కానీ మీరు నా మాట వినలేదు, పట్టించుకోలేదు. 16 రేకాబు కుమారుడైన యెహోనాదాబు వంశస్థులు తమ పూర్వీకుడు ఇచ్చిన ఆదేశాన్ని పాటించారు,+ కానీ ఈ ప్రజలు నా మాట వినలేదు.” ’ ”

17 “కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో, నేను యూదా మీదికి, యెరూషలేము నివాసులందరి మీదికి తెస్తానని హెచ్చరించిన విపత్తు అంతటినీ వాళ్లమీదికి రప్పిస్తున్నాను.+ ఎందుకంటే నేను వాళ్లతో మాట్లాడాను, కానీ వాళ్లు వినలేదు; నేను వాళ్లను పిలుస్తూ వచ్చాను, కానీ వాళ్లు పలకలేదు.’ ”+

18 యిర్మీయా ఆ రేకాబీయులతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘మీరు మీ పూర్వీకుడైన యెహోనాదాబు ఆదేశానికి లోబడుతూ వచ్చారు, అతని ఆదేశాలన్నిటినీ పాటిస్తూ సరిగ్గా అతను ఆజ్ఞాపించినట్టే చేస్తున్నారు కాబట్టి 19 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నా సన్నిధిలో సేవచేయడానికి రేకాబు కుమారుడైన యెహోనాదాబు* వంశస్థుల్లో ఒకడు ఎప్పటికీ ఉంటాడు.” ’ ”

36 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన నాలుగో సంవత్సరంలో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 2 “ఒక గ్రంథపు చుట్టను తీసుకుని, యోషీయా రోజుల్లో నేను నీతో మాట్లాడిన మొదటి రోజు నుండి+ ఈ రోజు వరకు ఇశ్రాయేలుకు, యూదాకు,+ దేశాలన్నిటికీ వ్యతిరేకంగా నేను నీతో చెప్పిన మాటలన్నీ రాయి.+ 3 నేను వాళ్లమీదికి తీసుకురావాలని అనుకుంటున్న విపత్తు అంతటి గురించి విన్నప్పుడు, యూదా ఇంటివాళ్లు బహుశా తమ చెడ్డ మార్గాల్ని విడిచిపెడతారేమో; అప్పుడు నేను వాళ్ల దోషాన్ని, పాపాన్ని క్షమిస్తాను.”+

4 అప్పుడు యిర్మీయా, నేరీయా కుమారుడైన బారూకును+ పిలిపించి యెహోవా తనకు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పాడు, బారూకు వాటిని ఆ గ్రంథపు చుట్టలో రాశాడు.+ 5 తర్వాత యిర్మీయా బారూకుకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేను బంధించబడి ఉన్నాను, యెహోవా మందిరంలోకి వెళ్లలేను. 6 కాబట్టి నువ్వు మందిరంలోకి వెళ్లి, నేను చెప్తుండగా నువ్వు గ్రంథపు చుట్టలో రాసిన యెహోవా మాటల్ని చదివి వినిపించు. ఉపవాస రోజున యెహోవా మందిరంలో ప్రజలు వింటుండగా వాటిని చదువు; అలా నువ్వు తమ నగరాల నుండి అక్కడికి వచ్చే యూదా ప్రజలందరికీ వాటిని చదివి వినిపిస్తావు. 7 అనుగ్రహం కోసం వాళ్లు చేసే విన్నపం యెహోవాను చేరుకుంటుందేమో, ప్రతీ ఒక్కరు తమ చెడ్డ మార్గాల్ని విడిచిపెడతారేమో; ఎందుకంటే యెహోవా ఈ ప్రజలకు వ్యతిరేకంగా చాలా భయంకరమైన కోపాన్ని, ఉగ్రతను ప్రకటించాడు.”

8 కాబట్టి నేరీయా కుమారుడైన బారూకు యిర్మీయా ప్రవక్త తనకు ఆజ్ఞాపించినదంతా చేశాడు; అతను యెహోవా మందిరంలో గ్రంథపు చుట్ట నుండి యెహోవా మాటల్ని బిగ్గరగా చదివాడు.+

9 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన ఐదో సంవత్సరం తొమ్మిదో నెలలో యెరూషలేము ప్రజలందరూ, యూదా నగరాల నుండి యెరూషలేముకు వచ్చిన ప్రజలందరూ యెహోవా ముందు ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు.+ 10 అప్పుడు బారూకు యెహోవా మందిరంలోని గెమర్యా గదిలో* ప్రజలందరూ వింటుండగా గ్రంథపు చుట్ట నుండి యిర్మీయా మాటల్ని బిగ్గరగా చదివాడు. ఈ గెమర్యా,+ శాస్త్రి* అయిన షాఫాను+ కుమారుడు; ఆ గది యెహోవా మందిరంలోని కొత్త ద్వారం ప్రవేశం దగ్గర+ ఉన్న పై ప్రాంగణంలో ఉంది.

11 షాఫాను మనవడూ గెమర్యా కుమారుడూ అయిన మీకాయా గ్రంథపు చుట్టలోని యెహోవా మాటలన్నిటినీ విన్నప్పుడు 12 అతను యూదా రాజు రాజభవనంలోని కార్యదర్శి గదిలోకి వెళ్లాడు. అధిపతులు* అందరూ, అంటే కార్యదర్శి అయిన ఎలీషామా,+ షెమయా కుమారుడు దెలాయ్యా, అక్బోరు+ కుమారుడు ఎల్నాతాను,+ షాఫాను కుమారుడు గెమర్యా, హనన్యా కుమారుడు సిద్కియా, మిగతా అధిపతులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. 13 బారూకు ప్రజల ముందు గ్రంథపు చుట్టలో నుండి చదువుతుండగా తాను విన్న మాటలన్నిటినీ మీకాయా వాళ్లకు చెప్పాడు.

14 అప్పుడు అధిపతులందరూ కూషీ మునిమనవడూ షెలెమ్యా మనవడూ నెతన్యా కుమారుడూ అయిన యెహూదిని బారూకు దగ్గరికి పంపించి, “నువ్వు ప్రజలకు చదివి వినిపించిన గ్రంథపు చుట్టను తీసుకుని రా” అని చెప్పమన్నారు. అప్పుడు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథపు చుట్టను చేతితో పట్టుకుని వాళ్ల దగ్గరికి వెళ్లాడు. 15 వాళ్లు అతనితో, “దయచేసి కూర్చో, దాన్ని మాకు చదివి వినిపించు” అన్నారు. బారూకు వాళ్లకు చదివి వినిపించాడు.

16 వాళ్లు ఈ మాటలన్నీ విన్న వెంటనే, భయంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుని, “మేము ఈ మాటలన్నీ ఖచ్చితంగా రాజుకు చెప్పాలి” అని బారూకుతో అన్నారు. 17 తర్వాత వాళ్లు, “దయచేసి, నువ్వు ఈ మాటలన్నీ ఎలా రాశావో చెప్పు. యిర్మీయా చెప్తుంటే రాశావా?” అని బారూకును అడిగారు. 18 దానికి బారూకు, “అవును, అతనే ఈ మాటలన్నీ నాకు చెప్పాడు, నేను వాటిని సిరాతో ఈ గ్రంథపు చుట్టలో రాశాను” అని చెప్పాడు. 19 అప్పుడు అధిపతులు బారూకుతో ఇలా అన్నారు: “వెళ్లి నువ్వూ యిర్మీయా దాక్కోండి; మీరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియనివ్వకండి.”+

20 తర్వాత ఆ అధిపతులు ప్రాంగణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, గ్రంథపు చుట్టను కార్యదర్శి అయిన ఎలీషామా గదిలో పెట్టి, తాము విన్నదంతా రాజుకు చెప్పారు.

21 కాబట్టి రాజు గ్రంథపు చుట్టను తీసుకురావడానికి యెహూదిని పంపించాడు,+ అతను కార్యదర్శి అయిన ఎలీషామా గదిలో నుండి దాన్ని తీసుకొచ్చాడు. రాజూ, రాజు దగ్గర నిల్చున్న అధిపతులందరూ వింటుండగా యెహూది దాన్ని చదవడం మొదలుపెట్టాడు. 22 తొమ్మిదో నెలలో* రాజు, చలికాలపు ఇంటిలో కూర్చొని ఉన్నాడు, అతని ముందు కుంపటిలో అగ్ని మండుతోంది. 23 యెహూది మూడునాలుగు వరుసలు చదవగానే, కార్యదర్శి కత్తితో రాజు గ్రంథపు చుట్టలోని ఆ భాగాన్ని కోసేసి, కుంపటిలో మండుతున్న అగ్నిలో వేశాడు. ఆ గ్రంథపు చుట్ట అంతా కుంపటిలో కాలిపోయే వరకు అతను అలా చేశాడు. 24 వాళ్లు ఏమాత్రం భయపడలేదు; రాజు గానీ, ఆ మాటలన్నీ విన్న అతని సేవకులు గానీ తమ బట్టలు చింపుకోలేదు. 25 గ్రంథపు చుట్టను కాల్చేయవద్దని ఎల్నాతాను,+ దెలాయ్యా,+ గెమర్యా+ వేడుకున్నా రాజు వాళ్ల మాట వినలేదు. 26 అంతేకాదు అతను కార్యదర్శి అయిన బారూకును, యిర్మీయా ప్రవక్తను పట్టుకోమని రాజు కుమారుడైన యెరహ్మెయేలుకు, అజ్రీయేలు కుమారుడైన శెరాయాకు, అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకు ఆజ్ఞాపించాడు, కానీ యెహోవా వాళ్లను దాచివుంచాడు.+

27 యిర్మీయా చెప్తుండగా బారూకు రాసిన గ్రంథపు చుట్టను రాజు కాల్చేసిన తర్వాత, యెహోవా వాక్యం మళ్లీ యిర్మీయా దగ్గరికి వచ్చి+ ఇలా అంది: 28 “ఇంకొక గ్రంథపు చుట్ట తీసుకుని, యూదా రాజైన యెహోయాకీము కాల్చేసిన మొదటి గ్రంథపు చుట్టలో+ ఉన్న మాటలన్నిటినీ మళ్లీ దానిలో రాయి. 29 యూదా రాజైన యెహోయాకీముకు ఇలా చెప్పు: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘ “బబులోను రాజు తప్పకుండా వస్తాడు, మనుషులు గానీ జంతువులు గానీ లేకుండా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు”+ అని నువ్వు దీనిలో ఎందుకు రాశావు?’ అంటూ ఈ గ్రంథపు చుట్టను కాల్చేశావు కదా, 30 కాబట్టి యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి అతని వంశస్థుల్లో ఎవ్వరూ మిగలరు,+ అతని శవం పగలు ఎండకు ఎండుతుంది, రాత్రి మంచుకు తడుస్తుంది.+ 31 నేను అతన్ని, అతని వంశస్థుల్ని, అతని సేవకుల్ని వాళ్ల దోషాన్ని బట్టి లెక్క అడుగుతాను; వాళ్లమీదికి, యెరూషలేము నివాసుల మీదికి, యూదా ప్రజల మీదికి నేను తీసుకొస్తానన్న విపత్తు అంతటినీ తీసుకొస్తాను,+ ఎందుకంటే వాళ్లు నా మాట వినలేదు.’ ” ’ ”+

32 అప్పుడు యిర్మీయా ఇంకో గ్రంథపు చుట్టను తీసుకుని నేరీయా కుమారుడూ కార్యదర్శీ అయిన బారూకుకు ఇచ్చాడు.+ యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చేసిన గ్రంథపు చుట్టలో+ ఉన్న మాటలన్నీ యిర్మీయా చెప్తుండగా అతను అందులో రాశాడు. అలాంటి ఇంకా చాలా మాటలు అందులో చేర్చబడ్డాయి.

37 యెహోయాకీము కుమారుడైన కొన్యా*+ స్థానంలో యోషీయా కుమారుడైన సిద్కియా+ పరిపాలించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే, బబులోను రాజు నెబుకద్నెజరు* అతన్ని యూదా దేశంలో రాజుగా చేశాడు.+ 2 అయితే అతను గానీ అతని సేవకులు గానీ దేశ ప్రజలు గానీ యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన మాటల్ని వినలేదు.

3 సిద్కియా రాజు, షెలెమ్యా కుమారుడైన యెహుకలునూ+ యాజకుడైన మయశేయా కుమారుడు జెఫన్యానూ+ యిర్మీయా ప్రవక్త దగ్గరికి పంపించి ఇలా చెప్పాడు: “దయచేసి మా తరఫున మన దేవుడైన యెహోవాకు ప్రార్థించు.” 4 అప్పటికింకా యిర్మీయాను చెరసాలలో వేయలేదు,+ కాబట్టి అతను ప్రజల మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. 5 ఫరో సైన్యం ఐగుప్తు నుండి బయల్దేరింది.+ యెరూషలేమును ముట్టడి వేస్తున్న కల్దీయులు ఆ సంగతి విని, యెరూషలేము నుండి వెనక్కి వెళ్లిపోయారు.+ 6 అప్పుడు యెహోవా వాక్యం యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా అంది: 7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏమంటున్నాడంటే, ‘నా దగ్గర విచారణ చేయమని మిమ్మల్ని పంపించిన యూదా రాజుకు మీరిలా చెప్పాలి: “ఇదిగో! మీకు సహాయం చేయడానికి వస్తున్న ఫరో సైన్యం తమ దేశానికి, అంటే ఐగుప్తుకు తిరిగెళ్లిపోతుంది.+ 8 కల్దీయులు తిరిగొచ్చి, ఈ నగరంతో పోరాడి, దాన్ని జయించి, అగ్నితో కాల్చేస్తారు.”+ 9 యెహోవా ఇలా అంటున్నాడు: “ ‘కల్దీయులు ఖచ్చితంగా మన దగ్గర నుండి వెళ్లిపోతారు’ అని అనుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే, వాళ్లు వెళ్లిపోరు. 10 మీరు మీతో పోరాడుతున్న కల్దీయుల సైన్యమంతటినీ చంపేసి, కేవలం వాళ్లలో గాయపడ్డవాళ్లు మాత్రమే మిగిలినా, అప్పటికీ వాళ్లు తమ డేరాల్లో నుండి వచ్చి ఈ నగరాన్ని అగ్నితో కాల్చేస్తారు.” ’ ”+

11 ఫరో సైన్యం వల్ల కల్దీయుల సైన్యం యెరూషలేము నుండి వెనక్కి వెళ్లినప్పుడు+ 12 యిర్మీయా తన ప్రజల మధ్య తన భాగాన్ని తీసుకోవడానికి యెరూషలేము నుండి బెన్యామీను ప్రాంతానికి+ బయల్దేరాడు. 13 కానీ అతను బెన్యామీను ద్వారం దగ్గరికి చేరుకున్నప్పుడు, కాపలాదారుల అధికారీ హనన్యా మనవడూ షెలెమ్యా కుమారుడూ అయిన ఇరీయా యిర్మీయా ప్రవక్తను పట్టుకుని, “నువ్వు కల్దీయుల దగ్గరికి పారిపోతున్నావు!” అన్నాడు. 14 అందుకు యిర్మీయా, “అది నిజం కాదు! నేను కల్దీయుల దగ్గరికి పారిపోవట్లేదు” అన్నాడు. కానీ ఇరీయా యిర్మీయా మాట వినకుండా అతన్ని బంధించి అధిపతుల దగ్గరికి తీసుకొచ్చాడు. 15 అధిపతులకు యిర్మీయా మీద చాలా కోపం వచ్చింది.+ అప్పుడు వాళ్లు అతన్ని కొట్టి, చెరసాలగా మార్చబడిన కార్యదర్శి యెహోనాతాను ఇంట్లో బంధించి ఉంచారు.+ 16 యిర్మీయాను నేలకింద ఉన్న చెరసాల గదుల్లో ఒకదానిలో ఉంచారు, అతను అక్కడ చాలా రోజులు ఉన్నాడు.

17 అప్పుడు సిద్కియా రాజు అతన్ని పిలిపించుకొని తన రాజభవనంలో రహస్యంగా ప్రశ్నించాడు.+ అతను, “యెహోవా నుండి ఏమైనా సందేశం ఉందా?” అని అడిగాడు. అందుకు యిర్మీయా, “ఉంది! నువ్వు బబులోను రాజు చేతికి అప్పగించబడతావు!” అన్నాడు.+

18 యిర్మీయా సిద్కియా రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు నన్ను చెరసాలలో వేయడానికి నేను నీకు, నీ సేవకులకు, నీ ప్రజలకు వ్యతిరేకంగా ఏం పాపం చేశాను? 19 ‘బబులోను రాజు మీ మీదికి, ఈ దేశం మీదికి రాడు’ అని ప్రవచించిన మీ ప్రవక్తలు ఏమయ్యారు?+ 20 నా ప్రభువా, రాజా, దయచేసి నా విన్నపం విను. దయచేసి నా మనవి అంగీకరించు. నన్ను తిరిగి కార్యదర్శి యెహోనాతాను+ ఇంటికి పంపించకు, పంపిస్తే నేను అక్కడే చనిపోతాను.”+ 21 కాబట్టి సిద్కియా రాజు యిర్మీయాను కాపలాదారుల ప్రాంగణంలో బందీగా ఉంచమని ఆజ్ఞాపించాడు.+ నగరంలో రొట్టెలు లేకుండా పోయేవరకు,+ రొట్టెలు కాల్చేవాళ్ల వీధి నుండి ప్రతీరోజు అతనికి ఒక గుండ్రటి రొట్టెను ఇచ్చారు.+ యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉండిపోయాడు.

38 యిర్మీయా ప్రజలందరితో ఇలా అనడం మత్తాను కుమారుడు షెఫట్య, పషూరు+ కుమారుడు గెదల్యా, షెలెమ్యా కుమారుడు యూకలు,+ మల్కీయా కుమారుడు పషూరు విన్నారు: 2 “యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఈ నగరంలోనే ఉండిపోయే వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు.+ అయితే కల్దీయులకు లొంగిపోయే* వాళ్లు ప్రాణాలతో ఉంటారు, తమ ప్రాణాల్ని దోపుడుసొమ్ముగా దక్కించుకుంటారు,* జీవిస్తారు.’+ 3 యెహోవా ఏమంటున్నాడంటే, ‘ఈ నగరం ఖచ్చితంగా బబులోను రాజు సైన్యానికి అప్పగించబడుతుంది, అతను దీన్ని జయిస్తాడు.’ ”+

4 ఆ అధిపతులు రాజుతో ఇలా అన్నారు: “దయచేసి అతన్ని చంపించేయి,+ ఎందుకంటే అతను ఇలాంటి మాటలు చెప్తూ నగరంలో మిగిలిన సైనికుల మనోధైర్యాన్ని, ప్రజలందరి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు. అతను ఈ ప్రజల క్షేమాన్ని కాదుగానీ నాశనాన్నే కోరుకుంటున్నాడు.” 5 అందుకు సిద్కియా ఇలా అన్నాడు: “ఇదిగో! అతను మీ చేతుల్లో ఉన్నాడు, రాజు మిమ్మల్ని ఏ విధంగానూ ఆపలేడు.”

6 కాబట్టి వాళ్లు యిర్మీయాను పట్టుకుని కాపలాదారుల ప్రాంగణంలో ఉన్న, రాజు కుమారుడైన మల్కీయాకు చెందిన గోతిలో పడేశారు.+ వాళ్లు తాళ్లతో యిర్మీయాను ఆ గోతిలోకి దించారు. అప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో కూరుకుపోసాగాడు.

7 వాళ్లు యిర్మీయాను గోతిలో వేశారన్న సంగతి ఇతియోపీయుడూ రాజభవనంలో ఆస్థాన అధికారీ* అయిన ఎబెద్మెలెకు+ విన్నాడు. అప్పుడు రాజు బెన్యామీను ద్వారం+ దగ్గర కూర్చొని ఉన్నాడు, 8 ఎబెద్మెలెకు రాజభవనంలో నుండి బయటికి వెళ్లి, రాజుతో ఇలా అన్నాడు: 9 “నా ప్రభువా, రాజా, వాళ్లు యిర్మీయా ప్రవక్త విషయంలో చేసిన పని చాలా చెడ్డది! వాళ్లు అతన్ని గోతిలో పడేశారు, కరువు వల్ల అతను అక్కడే చనిపోతాడు, ఎందుకంటే నగరంలో ఇక రొట్టెలు మిగల్లేదు.”+

10 అప్పుడు రాజు ఇతియోపీయుడైన ఎబెద్మెలెకుకు ఇలా ఆజ్ఞాపించాడు: “ఇక్కడి నుండి 30 మందిని నీతోపాటు తీసుకెళ్లి, యిర్మీయా ప్రవక్త చనిపోకముందే అతన్ని గోతిలో నుండి పైకి లాగు.” 11 కాబట్టి ఎబెద్మెలెకు వాళ్లను తీసుకుని రాజభవనంలో ఖజానా+ కింద ఉన్న స్థలానికి వెళ్లాడు, వాళ్లు అక్కడి నుండి చీకిపోయిన కొన్ని గుడ్డ పీలికల్ని, గుడ్డ ముక్కల్ని తీసుకుని వాటిని గోతిలో ఉన్న యిర్మీయా దగ్గరికి తాళ్లతో దింపారు. 12 అప్పుడు ఇతియోపీయుడైన ఎబెద్మెలెకు యిర్మీయాతో, “దయచేసి ఈ గుడ్డ పీలికల్ని, గుడ్డ ముక్కల్ని నీ చంకలకు తాళ్లకు మధ్య పెట్టుకో” అన్నాడు. యిర్మీయా అలాగే పెట్టుకున్నాడు, 13 వాళ్లు ఆ తాళ్లతో యిర్మీయాను గోతిలో నుండి బయటికి లాగారు. అప్పటినుండి యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉండిపోయాడు.+

14 తర్వాత సిద్కియా రాజు యెహోవా మందిరంలోని మూడో ప్రవేశ ద్వారం దగ్గరికి రమ్మని యిర్మీయాకు కబురు పంపాడు. రాజు యిర్మీయాతో, “నేను నిన్ను ఒకటి అడగాలి. నా దగ్గర ఏదీ దాచకు” అన్నాడు. 15 అప్పుడు యిర్మీయా సిద్కియాతో, “ఒకవేళ నేను నీకు చెప్తే, నువ్వు నన్ను ఖచ్చితంగా చంపేస్తావు. నేను నీకు సలహా ఇచ్చినా, నువ్వు వినవు” అన్నాడు. 16 అప్పుడు సిద్కియా రాజు యిర్మీయాతో రహస్యంగా ఇలా ప్రమాణం చేశాడు: “మనకు ఈ జీవాన్ని ఇచ్చిన యెహోవా జీవం తోడు, నేను నిన్ను చంపను, నీ ప్రాణం తీయాలని చూస్తున్న వీళ్లకు నిన్ను అప్పగించను.”

17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నువ్వు బబులోను రాజు అధిపతులకు లొంగిపోతే,* నీ ప్రాణాలు కాపాడుకుంటావు, ఈ నగరం అగ్నితో కాల్చేయబడదు, నువ్వూ నీ ఇంటివాళ్లూ బ్రతుకుతారు.+ 18 కానీ నువ్వు బబులోను రాజు అధిపతులకు లొంగిపోకపోతే,* ఈ నగరం కల్దీయులకు అప్పగించబడుతుంది, వాళ్లు దీన్ని అగ్నితో కాల్చేస్తారు,+ నువ్వు వాళ్ల చేతి నుండి తప్పించుకోలేవు.’ ”+

19 అప్పుడు సిద్కియా రాజు యిర్మీయాతో ఇలా అన్నాడు: “కల్దీయుల దగ్గరికి వెళ్లిపోయిన యూదులకు నేను భయపడుతున్నాను, నేను వాళ్ల చేతికి అప్పగించబడితే, వాళ్లు నాతో క్రూరంగా ప్రవర్తిస్తారేమో.” 20 అయితే యిర్మీయా ఇలా అన్నాడు: “నువ్వు వాళ్లకు అప్పగించబడవు. దయచేసి నేను నీకు చెప్తున్న యెహోవా మాటకు* లోబడు, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, నువ్వు ప్రాణాలతో ఉంటావు. 21 అయితే నువ్వు లొంగిపోవడానికి* ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో యెహోవా నాకు తెలియజేశాడు: 22 ఇదిగో! యూదా రాజు రాజభవనంలో మిగిలిన స్త్రీలంతా బబులోను రాజు అధిపతుల+ దగ్గరికి తీసుకురాబడుతున్నారు, వాళ్లు ఇలా అంటున్నారు:

‘నువ్వు నమ్మిన మనుషులు మోసం చేసి నిన్ను గెలిచారు.+

నీ పాదం బురదలో కూరుకుపోయేలా చేశారు.

ఇప్పుడు వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు.’

23 నీ భార్యలందర్నీ, నీ కుమారులందర్నీ వాళ్లు కల్దీయుల దగ్గరికి తీసుకొస్తున్నారు, నువ్వు కూడా వాళ్ల చేతిలో నుండి తప్పించుకోలేవు, బబులోను రాజు నిన్ను పట్టుకుంటాడు,+ నీ కారణంగా ఈ నగరం అగ్నితో కాల్చబడుతుంది.”+

24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నువ్వు చావకుండా ఉండాలంటే ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియనివ్వకు. 25 నేను నీతో మాట్లాడానని తెలుసుకుని అధిపతులు నీ దగ్గరికి వచ్చి, ‘దయచేసి, నువ్వు రాజుకు ఏం చెప్పావో చెప్పు. ఏదీ దాచకు, మేము నిన్ను చంపము.+ రాజు నీతో ఏమన్నాడు?’ అని అంటే, 26 నువ్వు వాళ్లతో, ‘నేను చావకుండా ఉండేలా నన్ను మళ్లీ యెహోనాతాను ఇంటికి పంపొద్దని రాజుకు మనవి చేసుకున్నాను’ అని చెప్పాలి.”+

27 తర్వాత అధిపతులందరూ యిర్మీయా దగ్గరికి వచ్చి అతన్ని ప్రశ్నించారు. రాజు తనకు ఆజ్ఞాపించిన మాటలే అతను వాళ్లకు చెప్పాడు. కాబట్టి వాళ్లు అతనితో ఇంకేమీ అనలేదు. ఎందుకంటే రాజు, యిర్మీయా ఏం మాట్లాడుకున్నారో ఎవరూ వినలేదు. 28 యెరూషలేము పట్టబడిన రోజు వరకు యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలోనే ఉన్నాడు;+ యెరూషలేము పట్టబడినప్పుడు+ అతను ఇంకా అక్కడే ఉన్నాడు.

39 యూదా రాజైన సిద్కియా పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరం పదో నెలలో, బబులోను రాజైన నెబుకద్నెజరు* తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడించాడు.+

2 సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున వాళ్లు నగర ప్రాకారాన్ని కూలగొట్టారు.+ 3 బబులోను రాజు అధిపతులందరూ లోపలికి ప్రవేశించి మధ్య ద్వారం దగ్గర కూర్చున్నారు.+ వాళ్లెవరంటే: నేర్గల్‌-షరేజరు అనే సమ్గరు, నెబో-శర్సెకీము అనే రబ్సారీసు,* నేర్గల్‌-షరేజరు అనే రబ్మగు,* బబులోను రాజు మిగతా అధిపతులందరూ.

4 వాళ్లను చూసినప్పుడు యూదా రాజైన సిద్కియా, సైనికులందరూ పారిపోయారు.+ వాళ్లు రాత్రిపూట రాజు తోట మీదుగా, రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా నగరం నుండి పారిపోయారు. వాళ్లు అరాబా మార్గంలో ముందుకు సాగారు.+ 5 అయితే కల్దీయుల సైన్యం వాళ్లను తరుముకుంటూ వెళ్లి, యెరికో ఎడారి మైదానాల్లో సిద్కియాను పట్టుకున్నారు.+ వాళ్లు అతన్ని బంధించి, హమాతు+ దేశంలో రిబ్లా+ దగ్గరున్న బబులోను రాజు నెబుకద్నెజరు* దగ్గరికి తీసుకొచ్చారు. బబులోను రాజు అక్కడ అతనికి శిక్ష విధించాడు. 6 బబులోను రాజు అక్కడే రిబ్లా దగ్గర సిద్కియా కళ్లముందు అతని కుమారుల్ని చంపించాడు; అంతేకాదు అతను యూదా ప్రముఖులందర్నీ చంపించాడు.+ 7 తర్వాత అతను సిద్కియాను గుడ్డివాణ్ణి చేశాడు, బబులోనుకు తీసుకెళ్లడానికి అతన్ని రాగి సంకెళ్లతో బంధించాడు.+

8 కల్దీయులు ఆ తర్వాత రాజభవనాన్ని, ప్రజల ఇళ్లను కాల్చేశారు,+ వాళ్లు యెరూషలేము ప్రాకారాల్ని కూలగొట్టారు.+ 9 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ ఆ నగరంలో మిగిలిన ప్రజల్ని, తన దగ్గరికి చేరినవాళ్లను, మిగతా వాళ్లందర్నీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.

10 అయితే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను అసలేమీ లేని కొంతమంది నిరుపేదల్ని యూదా దేశంలో ఉండనిచ్చాడు. ఆ రోజు అతను వాళ్లకు ద్రాక్షతోటలు, పొలాలు ఇచ్చి, వాళ్లను పనిలో* పెట్టాడు.+

11 అప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు* యిర్మీయా గురించి రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదానుకు ఈ ఆదేశాలు ఇచ్చాడు: 12 “వెళ్లి, అతను ఎక్కడున్నాడో కనుక్కుని, అతని బాగోగులు చూసుకో; అతనికి ఏ హానీ చేయకు, అతను నిన్ను ఏమి అడిగినా ఇవ్వు.”+

13 దాంతో రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను, నెబూషజ్బాను అనే రబ్సారీసు,* నేర్గల్‌-షరేజరు అనే రబ్మగు,* బబులోను రాజు ప్రధానులందరూ మనుషుల్ని పంపి 14 కాపలాదారుల ప్రాంగణం నుండి యిర్మీయాను బయటికి తెప్పించి,+ షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యాకు+ అప్పగించి, వాళ్ల ఇంటికి తీసుకెళ్లమని చెప్పారు. కాబట్టి అతను తన ప్రజల మధ్య జీవించాడు.

15 యిర్మీయా కాపలాదారుల ప్రాంగణంలో బందీగా ఉన్నప్పుడు,+ యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి ఇలా అంది: 16 “నువ్వు వెళ్లి, ఇతియోపీయుడైన ఎబెద్మెలెకుతో+ ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను ఈ నగరం విషయంలో నా మాటల్ని నెరవేరుస్తున్నాను, మంచి చేయడానికి కాదు విపత్తు తీసుకురావడానికే. అది జరిగిన రోజున నువ్వు దాన్ని చూస్తావు.” ’

17 “ ‘అయితే ఆ రోజున నేను నిన్ను కాపాడతాను, నువ్వు భయపడేవాళ్ల చేతికి నువ్వు అప్పగించబడవు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

18 “ ‘నువ్వు ఖచ్చితంగా తప్పించుకునేలా చేస్తాను, నువ్వు ఖడ్గం వల్ల చనిపోవు. నీ ప్రాణాన్ని దోపుడుసొమ్ముగా పొందుతావు,*+ ఎందుకంటే నువ్వు నామీద నమ్మకం పెట్టుకున్నావు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

40 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ యిర్మీయాను రామా+ నుండి విడుదల చేసిన తర్వాత, యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది. అంతకుముందు అతను యిర్మీయాను సంకెళ్లతో బంధించి అక్కడికి తీసుకొచ్చాడు. అప్పుడు యిర్మీయా యెరూషలేము నుండి, యూదా నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడుతున్న వాళ్లందరితో పాటు ఉన్నాడు. 2 అప్పుడు రాజ సంరక్షకుల అధిపతి యిర్మీయాను పక్కకు తీసుకెళ్లి అతనితో ఇలా అన్నాడు: “నీ దేవుడైన యెహోవా ఈ స్థలం మీదికి ఈ విపత్తు వస్తుందని ముందే చెప్పాడు, 3 యెహోవా తాను చెప్పినట్టే ఆ విపత్తును తీసుకొచ్చాడు, ఎందుకంటే మీరు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు, ఆయన మాట వినలేదు. అందుకే మీకిలా జరిగింది.+ 4 ఇదిగో, ఈ రోజు నేను నీ చేతులకు ఉన్న సంకెళ్లను తీసేసి నిన్ను విడుదల చేస్తున్నాను. నాతోపాటు బబులోనుకు రావడం నీకు మంచిదనిపిస్తే నాతో రా, నేను నీ బాగోగులు చూసుకుంటాను. కానీ నీకు బబులోనుకు రావడం ఇష్టం లేకపోతే, రాకు. ఇదిగో! దేశమంతా నీ ముందు ఉంది. నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లు.”+

5 యిర్మీయా ఇంకా తిరిగెళ్లాలని నిర్ణయించుకోకముందే నెబూజరదాను ఇలా అన్నాడు: “షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యా+ దగ్గరికి వెళ్లు. బబులోను రాజు అతన్ని యూదా నగరాల మీద నియమించాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్లి, అతనితోపాటు ప్రజల మధ్య నివసించు; లేదా నీకు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్లు.”

తర్వాత రాజ సంరక్షకుల అధిపతి అతనికి కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి పంపించేశాడు. 6 కాబట్టి యిర్మీయా మిస్పాలో+ ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వెళ్లి, దేశంలో మిగిలిన ప్రజల మధ్య నివసిస్తూ అతనితోపాటే ఉండిపోయాడు.

7 బబులోను రాజు యూదా దేశం మీద, అంటే బబులోనుకు బందీలుగా తీసుకెళ్లబడని ఆ దేశంలోని నిరుపేద పురుషుల మీద, స్త్రీల మీద, పిల్లల మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడని+ కొంతకాలానికి పల్లెటూళ్లలో ఉన్న సైన్యాధిపతులందరికీ, వాళ్లతో పాటు ఉన్న మనుషులకు తెలిసింది. 8 దాంతో వాళ్లు మిస్పాలో+ ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్లు ఎవరంటే: నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు;+ కారేహ కుమారులైన యోహానాను,+ యోనాతాను; తన్హుమెతు కుమారుడైన శెరాయా; నెటోపాతీయుడైన ఏపయి కుమారులు; మాయకాతీయుడి కుమారుడైన యెజన్యా;+ వాళ్ల మనుషులు. 9 షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యా వాళ్లతో, వాళ్ల మనుషులతో ప్రమాణం చేసి ఇలా అన్నాడు: “కల్దీయులకు సేవ చేయడానికి భయపడకండి. ఈ దేశంలో నివసిస్తూ బబులోను రాజుకు సేవ చేయండి, అప్పుడు మీకు మంచి జరుగుతుంది.+ 10 నేనైతే, మన దగ్గరికి వచ్చే కల్దీయుల ముందు మీకు ప్రాతినిధ్యం వహించడానికి మిస్పాలోనే ఉంటాను. అయితే మీరు ద్రాక్షారసాన్ని, వేసవికాల పండ్లను, నూనెను సమకూర్చుకుంటూ, వాటిని పాత్రల్లో నిల్వ చేసుకుంటూ మీరు స్వాధీనం చేసుకున్న నగరాల్లో స్థిరపడండి.”+

11 బబులోను రాజు యూదా దేశంలో కొంతమందిని ఉండనిచ్చాడని, వాళ్లమీద షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యాను అధికారిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము దేశాల్లో, అలాగే మిగతా దేశాలన్నిటిలో ఉన్న యూదులందరు విన్నారు. 12 కాబట్టి యూదులందరూ తాము చెదిరిపోయిన ప్రాంతాలన్నిటి నుండి యూదా దేశానికి తిరిగిరావడం మొదలుపెట్టారు, వాళ్లు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్లు ద్రాక్షారసాన్ని, వేసవికాల పండ్లను చాలా పెద్దమొత్తంలో సమకూర్చారు.

13 కారేహ కుమారుడైన యోహానాను, పల్లెటూళ్లలో ఉన్న సైన్యాధిపతులందరూ మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. 14 వాళ్లు అతనితో, “అమ్మోనీయుల+ రాజైన బయలీసు నిన్ను చంపడానికి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపాడని నీకు తెలీదా?”+ అన్నారు. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వాళ్ల మాట నమ్మలేదు.

15 అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో ఉన్న గెదల్యాతో రహస్యంగా ఇలా అన్నాడు: “నేను వెళ్లి నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపాలనుకుంటున్నాను, ఆ విషయం ఎవ్వరూ కనిపెట్టలేరు. లేదంటే అతను నిన్ను చంపేస్తాడు, నీ దగ్గరికి సమకూడిన యూదా ప్రజలందరు చెదిరిపోతారు, మిగిలిన యూదా ప్రజలు నశించిపోతారు.” 16 కానీ అహీకాము కుమారుడైన గెదల్యా+ కారేహ కుమారుడైన యోహానానుతో ఇలా అన్నాడు: “అలా చేయొద్దు, ఇష్మాయేలు గురించి నువ్వు చెప్పేది అబద్ధం.”

41 ఏడో నెలలో, ఎలీషామా మనవడూ నెతన్యా కుమారుడూ అయిన ఇష్మాయేలు+ పదిమందిని తీసుకుని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి వచ్చాడు. ఈ ఇష్మాయేలు రాజవంశానికి* చెందినవాడు, రాజు ఆస్థానంలో ఉన్నతాధికారి. వాళ్లంతా కలిసి మిస్పాలో+ భోంచేస్తున్నప్పుడు 2 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితోపాటు ఉన్న పదిమంది లేచి షాఫాను మనవడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యాను కత్తితో చంపారు. అలా అతను, బబులోను రాజు ఆ దేశం మీద అధికారిగా నియమించిన వ్యక్తిని చంపేశాడు. 3 ఇష్మాయేలు గెదల్యాతో పాటు మిస్పాలో ఉన్న యూదులందర్నీ, అక్కడున్న కల్దీయ సైనికుల్ని కూడా చంపేశాడు.

4 గెదల్యా చంపబడిన తర్వాతి రోజు, ఆ విషయం ఇంకా ఎవరికీ తెలియకముందు 5 గడ్డం గొరిగించుకొని, బట్టలు చింపుకొని, శరీరాన్ని కోసుకున్న+ 80 మంది షెకెము+ నుండి, షిలోహు+ నుండి, సమరయ+ నుండి వచ్చారు. యెహోవా మందిరంలోకి తీసుకురావడానికి వాళ్ల చేతుల్లో ధాన్యార్పణలు, సాంబ్రాణి+ ఉన్నాయి. 6 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వాళ్లను కలుసుకోవడానికి ఏడుస్తూ, నడుచుకుంటూ మిస్పా నుండి బయల్దేరాడు. అతను వాళ్లను కలుసుకున్నప్పుడు, “అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి రండి” అన్నాడు. 7 అయితే వాళ్లు నగరంలోకి వచ్చినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని మనుషులు వాళ్లను చంపి గోతిలో పడేశారు.

8 అయితే వాళ్లలో పదిమంది ఇష్మాయేలుతో ఇలా అన్నారు: “మమ్మల్ని చంపొద్దు, ఎందుకంటే మా దగ్గర గోధుమలు, బార్లీ, నూనె, తేనె ఉన్నాయి, మేము వాటిని పొలంలో దాచిపెట్టాం.” కాబట్టి అతను వాళ్ల సహోదరులతో పాటు వాళ్లను చంపలేదు. 9 ఇష్మాయేలు తాను చంపినవాళ్ల శవాలన్నిటినీ పెద్ద గోతిలో పడేశాడు. అది ఇశ్రాయేలు రాజైన బయెషా+ కారణంగా ఆసా రాజు తవ్వించిన గోతి. ఆ గోతినే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు శవాలతో నింపేశాడు.

10 ఇష్మాయేలు మిస్పాలో+ మిగిలిన ప్రజలందర్నీ, అంటే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యా కింద ఉంచిన మిస్పాలోని మిగతా ప్రజలందర్నీ,+ అలాగే రాజు కూతుళ్లను బందీలుగా తీసుకెళ్లాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వాళ్లను బందీలుగా తీసుకొని అమ్మోనీయుల దగ్గరికి బయల్దేరాడు.+

11 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన చెడు అంతటి గురించి కారేహ కుమారుడైన యోహానాను,+ అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందరూ విన్నప్పుడు 12 వాళ్లు తమ మనుషులందర్నీ తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో పోరాడడానికి బయల్దేరారు; అతను గిబియోనులో ఉన్న మహా జలాల* దగ్గర వాళ్లకు కనిపించాడు.

13 ఇష్మాయేలుతో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును, అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందర్నీ చూసినప్పుడు చాలా సంతోషించారు. 14 ఇష్మాయేలు మిస్పా నుండి బందీలుగా తీసుకొచ్చిన ప్రజలందరూ+ తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లిపోయారు. 15 అయితే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని మనుషుల్లో ఎనిమిదిమంది యోహానాను నుండి తప్పించుకుని అమ్మోనీయుల దగ్గరికి వెళ్లిపోయారు.

16 కారేహ కుమారుడైన యోహానాను, అతనితోపాటు ఉన్న సైన్యాధిపతులందరూ మిస్పాకు చెందిన మిగతా ప్రజలందర్నీ, అంటే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత,+ తాము అతని దగ్గర నుండి రక్షించిన వాళ్లందర్నీ తమతోపాటు తీసుకెళ్లారు. వాళ్లు పురుషుల్ని, సైనికుల్ని, స్త్రీలను, పిల్లల్ని, ఆస్థాన అధికారుల్ని గిబియోను నుండి వెనక్కి తీసుకొచ్చారు. 17 వాళ్లు బయల్దేరి ఐగుప్తుకు వెళ్లాలనే ఉద్దేశంతో+ బేత్లెహేము+ పక్కనున్న కింహాము విడిది స్థలంలో ఆగారు. 18 బబులోను రాజు యూదా దేశం మీద అధికారిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపేశాడు+ కాబట్టి కల్దీయులకు భయపడి వాళ్లు అలా వెళ్లాలనుకున్నారు.

42 అప్పుడు సైన్యాధిపతులందరూ, అలాగే కారేహ కుమారుడైన యోహానాను,+ హోషయా కుమారుడైన యెజన్యా, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు ప్రజలందరూ వచ్చి 2 యిర్మీయా ప్రవక్తతో ఇలా అన్నారు: “దయచేసి, మా మనవి అంగీకరించి, మా తరఫున, మిగిలిన ఈ ప్రజలందరి తరఫున నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే, ఒకప్పుడు మేము ఎంతమందిమి ఉండేవాళ్లమో, ఇప్పుడు ఎంత తక్కువమందిమి మిగిలామో+ నువ్వు చూస్తున్నావు కదా. 3 మేము ఏ మార్గంలో నడవాలో, ఏంచేయాలో నీ దేవుడైన యెహోవా మాకు చెప్పాలి.”

4 అప్పుడు యిర్మీయా ప్రవక్త వాళ్లతో ఇలా అన్నాడు: “సరే, మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు కోరినట్టే మీ దేవుడైన యెహోవాకు ప్రార్థిస్తాను; యెహోవా మీకు చెప్పమన్న ప్రతీమాట మీకు చెప్తాను. ఒక్కమాట కూడా దాచను.”

5 దానికి వాళ్లు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ ద్వారా నీ దేవుడైన యెహోవా మాకు నిర్దేశించిందంతా మేము చేయకపోతే, యెహోవా మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండాలి. 6 మాకు నచ్చినా నచ్చకపోయినా, మేము నిన్ను పంపిస్తున్న మా దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం; ఎందుకంటే మా దేవుడైన యెహోవా స్వరానికి లోబడితే మాకు మంచి జరుగుతుంది.”

7 పది రోజుల తర్వాత యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చింది. 8 కాబట్టి అతను కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్యాధిపతులందర్నీ, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు ప్రజలందర్నీ పిలిపించాడు.+ 9 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “మీ తరఫున వేడుకోమని మీరు నన్ను ఎవరి దగ్గరికైతే పంపించారో, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 10 ‘మీరు ఈ దేశంలోనే ఉండిపోతే, నేను మిమ్మల్ని కడతాను గానీ పడగొట్టను, నాటుతాను గానీ పెల్లగించను. ఎందుకంటే మీ మీదికి రప్పించిన విపత్తు విషయంలో నేను విచారపడతాను.*+ 11 మీరు బబులోను రాజుకు భయపడుతున్నారు, అలా భయపడకండి.’+

“యెహోవా ఇలా అంటున్నాడు: ‘అతనికి భయపడకండి, ఎందుకంటే అతని చేతిలో నుండి మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని తప్పించడానికి నేను మీకు తోడుగా ఉన్నాను. 12 నేను మీ మీద కరుణ చూపిస్తాను,+ అతను మీ మీద కరుణ చూపించి, మీ దేశానికి మిమ్మల్ని తిరిగి పంపిస్తాడు.

13 “ ‘అయితే మీరు, “లేదు, మేము ఈ దేశంలో ఉండము!” అని అంటే, మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడకుండా, 14 “లేదు, మేము ఐగుప్తు దేశానికి వెళ్తాం,+ అక్కడ మాకు యుద్ధం చూడాల్సిన, బూర* శబ్దం వినాల్సిన, ఆహారం కోసం అలమటించాల్సిన పరిస్థితి రాదు; మేము అక్కడే నివసిస్తాం” అని అంటే, 15 యూదాలో మిగిలినవాళ్లారా, యెహోవా చెప్పే మాట వినండి. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు ఐగుప్తుకు వెళ్లాలని బలంగా తీర్మానించుకొని ఉంటే, అక్కడ నివసించడానికి* వెళ్తే, 16 మీరు ఏ ఖడ్గానికైతే భయపడుతున్నారో ఆ ఖడ్గం అక్కడ ఐగుప్తు దేశంలో మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు ఏ కరువుకైతే భయపడుతున్నారో ఆ కరువు మీ వెనకే ఐగుప్తుకు వస్తుంది, అక్కడే మీరు చనిపోతారు.+ 17 ఐగుప్తుకు వెళ్లి అక్కడ నివసించాలని తీర్మానించుకున్న వాళ్లంతా ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు. నేను వాళ్లమీదికి తీసుకొచ్చే విపత్తును వాళ్లలో ఏ ఒక్కరూ తప్పించుకోరు.” ’

18 “ఎందుకంటే, ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఒకవేళ మీరు ఐగుప్తుకు వెళ్తే, యెరూషలేము నివాసుల మీద నా కోపం, నా ఆగ్రహం ఎలా కుమ్మరించబడ్డాయో+ అలాగే మీ మీద కూడా నా ఆగ్రహం కుమ్మరించబడుతుంది; మీరు శాపానికి గురౌతారు, ప్రజలు మిమ్మల్ని చూసి భయపడతారు, మీరు అవమానానికి, నిందకు గురౌతారు.+ ఈ స్థలాన్ని మీరు ఇంకెప్పుడూ చూడరు.’

19 “యూదాలో మిగిలినవాళ్లారా, యెహోవా మిమ్మల్ని ఐగుప్తుకు వెళ్లొద్దని అన్నాడు. దాని గురించి ఈ రోజు నేను మిమ్మల్ని హెచ్చరించానని మర్చిపోకండి. 20 మీరు అక్కడికి వెళ్తే, మీ దోషాన్ని బట్టి మీ ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరికి నన్ను పంపిస్తూ, ‘మా తరఫున మా దేవుడైన యెహోవాకు ప్రార్థించు, మా దేవుడైన యెహోవా చెప్పే ప్రతీమాట మాకు చెప్పు, మేము దాన్ని పాటిస్తాం’ అన్నారు.+ 21 ఇదిగో ఈ రోజు నేను మీకు చెప్పాను, కానీ మీరు మీ దేవుడైన యెహోవా స్వరానికి లోబడరు, నా ద్వారా ఆయన మీకు చెప్పినదేదీ మీరు చేయరు.+ 22 కాబట్టి ఈ విషయం తెలుసుకోండి, మీరు ఎక్కడికైతే వెళ్లి నివసించాలని అనుకుంటున్నారో అక్కడ మీరు ఖడ్గం వల్ల, కరువు వల్ల, తెగులు వల్ల చనిపోతారు, ఇది ఖచ్చితం.”+

43 యిర్మీయా ఆ ప్రజలందరితో వాళ్ల దేవుడైన యెహోవా నుండి వచ్చిన ఈ మాటలన్నీ, అంటే వాళ్లతో ఏ మాటలైతే చెప్పమని వాళ్ల దేవుడైన యెహోవా తనను పంపించాడో ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత, 2 హోషయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను,+ అహంకారులైన మనుషులంతా యిర్మీయాతో ఇలా అన్నారు: “నువ్వు చెప్పేది అబద్ధం! మా దేవుడైన యెహోవా, ‘ఐగుప్తులో నివసించడానికి అక్కడికి వెళ్లకండి’ అని చెప్పమని నిన్ను పంపలేదు. 3 మమ్మల్ని కల్దీయుల చేతికి అప్పగించి చంపించాలనో, బబులోనుకు బందీలుగా పంపించాలనో నేరీయా కుమారుడైన బారూకు+ నిన్ను మాకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నాడు.”+

4 కాబట్టి కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ, ప్రజలందరూ యూదా దేశంలో ఉండిపొమ్మని చెప్పిన యెహోవా స్వరానికి లోబడలేదు. 5 బదులుగా కారేహ కుమారుడైన యోహానాను, సైన్యాధిపతులందరూ యూదా ప్రజల్లో మిగిలినవాళ్లందర్నీ, అంటే తాము చెదిరిపోయిన దేశాలన్నిటి నుండి యూదా దేశంలో నివసించడానికి తిరిగొచ్చిన వాళ్లందర్నీ తమ వెంట తీసుకెళ్లారు.+ 6 వాళ్లు పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని, రాజు కూతుళ్లను, ప్రతీ ఒక్కర్ని, అంటే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను+ ఎవరినైతే షాఫాను+ మనవడూ అహీకాము+ కుమారుడూ అయిన గెదల్యా+ కింద ఉంచాడో వాళ్లందర్నీ, అలాగే యిర్మీయా ప్రవక్తను, నేరీయా కుమారుడైన బారూకును తీసుకెళ్లారు. 7 వాళ్లు యెహోవా స్వరానికి లోబడకుండా ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి, తహపనేసు+ వరకు వెళ్లారు.

8 అప్పుడు తహపనేసులో యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా అంది: 9 “నువ్వు ఆ యూదులు చూస్తుండగా నీ చేతిలో పెద్దరాళ్లు తీసుకుని, తహపనేసులో ఫరో ఇంటి ప్రవేశం దగ్గర ఇటుకలతో కట్టిన బాటలో పాతిపెట్టి, సున్నంతో కప్పేయి. 10 తర్వాత వాళ్లకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను నా సేవకుడైన బబులోను రాజు నెబుకద్నెజరును* పిలిపిస్తున్నాను,+ నేను పాతిపెట్టిన ఈ రాళ్లమీద అతని సింహాసనాన్ని ఉంచుతాను, అతను తన రాచ తివాచీని వాటిమీద పరుస్తాడు.+ 11 అతను వచ్చి, ఐగుప్తు దేశం మీద దాడిచేస్తాడు.+ ప్రాణాంతకమైన తెగులుకు నిర్ణయించబడినవాళ్లు ప్రాణాంతకమైన తెగులు వల్ల చనిపోతారు, బందీలుగా ఉండడానికి నిర్ణయించబడినవాళ్లు బందీలుగా వెళ్తారు, ఖడ్గానికి నిర్ణయించబడినవాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు.+ 12 నేను ఐగుప్తు దేవుళ్ల గుళ్లకు నిప్పు అంటిస్తాను,+ అతను వాటిని కాల్చేసి, వాళ్లను బందీలుగా తీసుకెళ్తాడు. కాపరి తన వస్త్రాన్ని చుట్టుకున్నట్టు, అతను ఐగుప్తు దేశాన్ని చుట్టుకుని ప్రశాంతంగా* వెళ్లిపోతాడు. 13 అతను ఐగుప్తు దేశంలోని బేత్షెమెషు* స్తంభాల్ని* ముక్కలుముక్కలు చేస్తాడు, ఐగుప్తు దేవుళ్ల గుళ్లను అగ్నితో కాల్చేస్తాడు.” ’ ”

44 ఐగుప్తు దేశంలో నివసిస్తున్న యూదులందరి కోసం,+ అంటే మిగ్దోలులో,+ తహపనేసులో,+ నోఫులో,*+ అలాగే పత్రోసు ప్రాంతంలో+ నివసిస్తున్న యూదులందరి కోసం యిర్మీయా దగ్గరికి వచ్చిన వాక్యం: 2 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘యెరూషలేము మీదికి, యూదా నగరాలన్నిటి మీదికి నేను తీసుకొచ్చిన విపత్తును మీరు చూశారు,+ ఈ రోజు అవి నివాసులు లేకుండా శిథిలాలుగా ఉన్నాయి.+ 3 వాళ్లు తమకు తెలియని వేరే దేవుళ్ల దగ్గరికి, అంటే మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని వేరే దేవుళ్ల దగ్గరికి వెళ్లి, బలులు అర్పించి, వాటిని పూజించి+ నాకు కోపం తెప్పించేలా చెడ్డపనులు చేసినందువల్లే అలా జరిగింది.+ 4 నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదేపదే* మీ దగ్గరికి పంపిస్తూ, “దయచేసి, నేను అసహ్యించుకునే ఈ నీచమైన పని చేయకండి” అని చెప్తూ వచ్చాను.+ 5 కానీ వాళ్లు వినలేదు, పట్టించుకోలేదు, మారకుండా వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ చెడ్డగా ప్రవర్తించారు.+ 6 కాబట్టి నా ఆగ్రహం, కోపం కుమ్మరించబడి యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో రగులుకున్నాయి. దాంతో అవి ఈ రోజు ఉన్నట్టు శిథిలాలుగా, పాడుబడ్డ భూమిగా తయారయ్యాయి.’+

7 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాల దేవుడూ అయిన యెహోవా ఏమంటున్నాడంటే, ‘మీలో ఇంకెవ్వరూ మిగలకుండా పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసికందులు అందరూ యూదా నుండి తుడిచిపెట్టుకుపోయేలా మీరు మీ మీదికి ఎందుకు గొప్ప విపత్తును తెచ్చుకుంటున్నారు? 8 మీరు నివసించడానికి వెళ్లిన ఐగుప్తు దేశంలో వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తూ మీ చేతుల పనులతో నాకు కోపం తెప్పించడం ఎందుకు? మీరు నశించిపోతారు, భూమ్మీది దేశాలన్నిటి మధ్య శాపానికి, నిందకు గురౌతారు.+ 9 యూదా దేశంలో, యెరూషలేము వీధుల్లో మీ పూర్వీకులు, యూదా రాజులు,+ వాళ్ల భార్యలు చేసిన చెడ్డపనుల్ని,+ మీరు చేసిన చెడ్డపనుల్ని, మీ భార్యలు చేసిన చెడ్డపనుల్ని+ మీరు మర్చిపోయారా? 10 ఈ రోజు వరకు వాళ్లు తమను తాము తగ్గించుకోలేదు, నాకు భయపడలేదు,+ మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, శాసనాల ప్రకారం నడుచుకోలేదు.’+

11 “కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో యూదా అంతటినీ నాశనం చేయడానికి నేను మీ మీదికి విపత్తును తీసుకురావాలని నిశ్చయించుకున్నాను. 12 ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడ నివసించాలని తీర్మానించుకున్న మిగిలిన యూదా ప్రజల్ని నేను పట్టుకుంటాను, వాళ్లంతా ఐగుప్తు దేశంలో నశించిపోతారు. వాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు, కరువు వల్ల నశించిపోతారు;+ సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు వాళ్లు ఖడ్గం వల్ల, కరువు వల్ల చనిపోతారు. వాళ్లు శాపానికి గురౌతారు, ప్రజలు వాళ్లను చూసి భయపడతారు, వాళ్లు అవమానానికి, నిందకు గురౌతారు.+ 13 నేను యెరూషలేమును శిక్షించినట్టే ఖడ్గంతో, కరువుతో, తెగులుతో ఐగుప్తు దేశంలో నివసిస్తున్న వాళ్లను శిక్షిస్తాను.+ 14 ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్లిన మిగిలిన యూదా ప్రజలు యూదా దేశానికి తిరిగిరావడానికి తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడరు. వాళ్లు యూదా దేశానికి తిరిగిరావాలని, అక్కడ నివసించాలని ఎంతో కోరుకుంటారు కానీ వాళ్లు తిరిగిరారు. చాలా కొద్దిమంది మాత్రమే తప్పించుకుని తిరిగొస్తారు.’ ”

15 తమ భార్యలు వేరే దేవుళ్లకు బలులు అర్పిస్తున్నారని తెలిసిన పురుషులందరూ, అక్కడ నిలబడిన వాళ్ల భార్యలందరూ ఒక పెద్ద గుంపుగా ఏర్పడ్డారు. వాళ్లూ, ఐగుప్తు దేశంలో,+ పత్రోసులో నివసిస్తున్న ప్రజలందరూ+ యిర్మీయాతో ఇలా అన్నారు: 16 “యెహోవా పేరున నువ్వు మాతో మాట్లాడిన మాటను మేము వినం. 17 బదులుగా ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పిస్తామని+ మా నోటితో చెప్పిన ప్రతీమాటను మేము నెరవేరుస్తాం; మేము, మా పూర్వీకులు, మా రాజులు, మా అధిపతులు యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్టే చేస్తాం; అప్పుడు మాకు కడుపునిండా ఆహారం ఉండేది, మాకు ఏదీ తక్కువ కాలేదు, మేము ఏ విపత్తునూ చూడలేదు. 18 మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పించడం మానేసినప్పటి నుండి మాకు ప్రతీది తక్కువైంది; ఖడ్గం వల్ల, కరువు వల్ల మేము నశించిపోయాం.”

19 అప్పుడు స్త్రీలు ఇలా అన్నారు: “మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పించినప్పుడు మా భర్తల అనుమతి లేకుండానే ఆమె రూపంలో రొట్టెలు చేసి ఆమెకు బలులు అర్పించామా? వాళ్ల అనుమతి లేకుండానే ఆమెకు పానీయార్పణలు అర్పించామా?”

20 అప్పుడు యిర్మీయా ప్రజలందరితో, అంటే ఆ పురుషులతో, వాళ్ల భార్యలతో, తనతో మాట్లాడుతున్న ప్రజలందరితో ఇలా అన్నాడు: 21 “మీరు, మీ పూర్వీకులు, మీ రాజులు, మీ అధిపతులు, దేశ ప్రజలు యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో అర్పించిన బలుల్ని+ యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, అవి ఆయనకు గుర్తుకొచ్చాయి! 22 మీ చెడ్డపనుల్ని, మీ అసహ్యమైన కార్యాల్ని యెహోవా ఇక సహించలేకపోయాడు, దాంతో ఈ రోజు ఉన్నట్టుగా మీ దేశం ఎవరూ నివసించని పాడుబడ్డ భూమిగా, భయంకరమైన, శపించబడిన నేలగా తయారైంది.+ 23 మీరు ఈ బలుల్ని అర్పించినందువల్లే, యెహోవా స్వరానికి లోబడకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని, శాసనాల్ని, జ్ఞాపికల్ని పాటించకుండా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లే ఈ రోజు ఉన్నట్టుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”+

24 ఆ ప్రజలందరితో, స్త్రీలందరితో యిర్మీయా ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తు దేశంలో ఉన్న యూదా ప్రజలారా, మీరంతా యెహోవా చెప్పే మాట వినండి. 25 ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీరూ మీ భార్యలూ, “మేము ఆకాశరాణికి* బలులు, పానీయార్పణలు అర్పిస్తామని చేసుకున్న మొక్కుబళ్లను తప్పకుండా చెల్లిస్తాం” అని అన్నారు. మీ నోటితో అన్న మాటల్ని చేతులతో నెరవేర్చారు.+ స్త్రీలారా, మీరు ఖచ్చితంగా మీ మొక్కుబళ్లను చెల్లిస్తారు, మీరు మొక్కుకున్నట్టే చేస్తారు.’

26 “కాబట్టి ఐగుప్తు దేశంలో నివసిస్తున్న యూదా ప్రజలారా, మీరంతా యెహోవా చెప్పే మాట వినండి: ‘యెహోవా ఇలా అంటున్నాడు: “నేను నా గొప్ప పేరును బట్టి ప్రమాణం చేస్తున్నాను, ఐగుప్తు దేశమంతట్లో ఉన్న యూదుల్లో ఏ ఒక్కరూ ఇక ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా జీవం తోడు!’+ అంటూ నా పేరున ఒట్టేయరు.+ 27 నేను ఇప్పుడు వాళ్లను కనిపెట్టుకొని ఉన్నాను అయితే మంచి చేయడానికి కాదు, వాళ్లమీదికి విపత్తు తీసుకురావడానికే;+ ఐగుప్తు దేశంలో ఉన్న యూదా ప్రజలందరూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే వరకు ఖడ్గం వల్ల, కరువు వల్ల నశించిపోతారు.+ 28 చాలా కొద్దిమంది మాత్రమే ఖడ్గాన్ని తప్పించుకుని ఐగుప్తు దేశం నుండి యూదా దేశానికి తిరిగెళ్తారు.+ అప్పుడు ఐగుప్తు దేశంలో నివసించడానికి వచ్చిన మిగిలిన యూదా ప్రజలందరికీ నా మాట నెరవేరిందో, వాళ్ల మాట నెరవేరిందో తెలుస్తుంది!” ’ ”

29 “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘మీ మీదికి విపత్తు వస్తుందని నేను చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుందని మీరు తెలుసుకునేలా, నేను ఈ స్థలంలో మిమ్మల్ని శిక్షిస్తాను అనడానికి ఇదే మీకు సూచన: 30 యెహోవా ఇలా అంటున్నాడు, “ఇదిగో నేను యూదా రాజైన సిద్కియాను అతని ప్రాణం తీయాలని చూసిన అతని శత్రువైన బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగించినట్టే, ఐగుప్తు రాజైన ఫరో హొఫ్రను అతని శత్రువుల చేతికి, అతని ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి అప్పగిస్తున్నాను.” ’ ”+

45 యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము పరిపాలన నాలుగో సంవత్సరంలో+ నేరీయా కుమారుడైన బారూకు+ యిర్మీయా చెప్పిన మాటల్ని ఒక పుస్తకంలో రాసినప్పుడు, యిర్మీయా ప్రవక్త బారూకుతో చెప్పిన మాట ఇది:+

2 “బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ గురించి ఇలా అంటున్నాడు: 3 ‘నువ్వు, “అయ్యో నాకు శ్రమ! ఎందుకంటే యెహోవా నా నొప్పికి దుఃఖాన్ని చేర్చాడు! నేను మూలిగీ మూలిగీ అలసిపోయాను, నాకు విశ్రాంతి స్థలమే దొరకలేదు” అని అన్నావు.’

4 “నువ్వు అతనికి ఇలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నేను కట్టినదాన్ని పడగొడుతున్నాను, నేను నాటినదాన్ని పెల్లగిస్తున్నాను, దేశమంతటికీ ఇలాగే చేస్తాను.+ 5 కానీ నువ్వు నీకోసం గొప్పవాటిని వెతుకుతున్నావు.* అలాంటివి వెతకడం ఆపేయి.” ’

“ ‘ఎందుకంటే నేను మనుషులందరి మీదికి విపత్తు తీసుకురాబోతున్నాను,+ అయితే నువ్వు వెళ్లే ప్రతీచోట నీ ప్రాణాన్ని నీకు దోపుడుసొమ్ముగా ఇస్తాను’* అని యెహోవా అంటున్నాడు.”+

46 దేశాల గురించి యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.+ 2 ఇది ఐగుప్తు+ గురించి, ఐగుప్తు రాజైన ఫరో+ నెకో సైన్యం గురించి వచ్చిన వాక్యం; యోషీయా కుమారుడూ యూదా రాజూ అయిన యెహోయాకీము+ పరిపాలన నాలుగో సంవత్సరంలో యూఫ్రటీసు నది పక్కన కర్కెమీషు దగ్గర బబులోను రాజైన నెబుకద్నెజరు* ఫరోను ఓడించాడు:

 3 “చిన్న డాళ్లను,* పెద్ద డాళ్లను సిద్ధం చేసుకోండి,

యుద్ధం కోసం ముందుకు సాగండి.

 4 రౌతులారా, గుర్రాలకు జీను* కట్టి ఎక్కి కూర్చోండి.

శిరస్త్రాణం* పెట్టుకుని, మీ మీ స్థానాల్లో ఉండండి.

ఈటెలకు పదును పెట్టండి, కవచాలు ధరించుకోండి.

 5 ‘వాళ్లు ఎందుకు హడలిపోయినట్టు కనిపిస్తున్నారు?

వాళ్లు వెనుతిరుగుతున్నారు, వాళ్ల యోధులు నలగ్గొట్టబడ్డారు.

వాళ్లు భయంతో పారిపోయారు, వాళ్ల యోధులు వెనక్కి తిరిగి చూడలేదు.

అంతటా భయం అలుముకుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

 6 ‘వేగంగా పరుగెత్తేవాళ్లు పారిపోలేరు, యోధులు తప్పించుకోలేరు.

ఉత్తరం వైపు, యూఫ్రటీసు నది ఒడ్డున

వాళ్లు తడబడి పడిపోయారు.’+

 7 నైలు నదిలా, ఉప్పొంగే నదీ ప్రవాహాల్లా

పైకి వస్తున్న ఇతను ఎవరు?

 8 నైలు నదిలా,+ ఉప్పొంగే నదీ ప్రవాహాల్లా

ఐగుప్తు పైకి వస్తోంది,

అది ఇలా అంటోంది: ‘నేను పొంగిపొర్లి భూమిని కప్పేస్తాను.

ఆ నగరాన్ని, దాని నివాసుల్ని నాశనం చేస్తాను.’

 9 గుర్రాల్లారా, ముందుకు సాగండి!

రథాల్లారా, పిచ్చిగా పరుగులు తీయండి!

యోధులు ముందుకు సాగాలి;

డాలును పట్టుకునే కూషు, పూతు వాళ్లు,+

విల్లును వంచే లూదీయులు+ ముందుకు సాగాలి.+

10 “అది సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు చెందిన రోజు, ఆయన తన శత్రువుల మీద పగ తీర్చుకునే ప్రతీకార రోజు. ఖడ్గం కడుపునిండా తింటుంది, వాళ్ల రక్తంతో దాహం తీర్చుకుంటుంది. ఎందుకంటే ఉత్తర దేశంలో, యూఫ్రటీసు నది+ ఒడ్డున సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు ఒక బలి* ఉంది.

11 ఐగుప్తు కన్యా,

సాంబ్రాణి తెచ్చుకోవడానికి గిలాదుకు వెళ్లు.+

నువ్వు అనవసరంగా చాలా ఔషధాలు వాడావు,

కానీ నీకు చికిత్స లేదు.+

12 దేశాలు నీ అవమానం గురించి విన్నాయి,+

దేశం నీ ఆర్తనాదాలతో నిండిపోయింది.

ఎందుకంటే, యోధులు ఒకరికొకరు తగిలి పడిపోతున్నారు.”

13 ఐగుప్తు దేశాన్ని ఓడించడానికి బబులోను రాజు నెబుకద్నెజరు* రావడం గురించి యిర్మీయా ప్రవక్తకు యెహోవా చెప్పిన వాక్యం:+

14 “ఐగుప్తులో చాటించండి, మిగ్దోలులో+ ప్రకటించండి.

నోఫులో,* తహపనేసులో+ చాటిచెప్పండి.

ఇలా చెప్పండి: ‘మీ మీ స్థానాల్లో నిలబడి, సిద్ధంగా ఉండండి,

ఎందుకంటే, ఖడ్గం మీ చుట్టూరా నాశనం చేస్తుంది.

15 నీ బలాఢ్యులు ఎందుకు తుడిచిపెట్టబడ్డారు?

వాళ్లు నిలబడలేకపోయారు

ఎందుకంటే, యెహోవా వాళ్లను కిందికి తోసేశాడు.

16 వాళ్లు పెద్ద సంఖ్యలో తడబడి పడిపోతున్నారు.

వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అంటున్నారు:

“లెండి! క్రూరమైన ఖడ్గాన్ని తప్పించుకుని

మన ప్రజల దగ్గరికి, మన స్వదేశానికి తిరిగెళ్దాం.” ’

17 వాళ్లు అక్కడ ఇలా ప్రకటించారు,

‘ఐగుప్తు రాజు ఫరో ఊరికే గొప్పలు చెప్పుకుంటాడు,

అతను అవకాశాన్ని* చేజార్చుకున్నాడు.’+

18 సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు ఇలా ప్రకటిస్తున్నాడు:

‘నా జీవం తోడు,

అతను* పర్వతాల మధ్య ఉన్న తాబోరులా,+

సముద్రం పక్కన ఉన్న కర్మెలులా+ వస్తాడు.

19 ఐగుప్తులో నివసిస్తున్న కూతురా,

చెరలోకి వెళ్లడానికి నీ సంచి సిద్ధం చేసుకో,

ఎందుకంటే, నోఫు* భయంకరంగా తయారౌతుంది;

అది అగ్నితో కాల్చేయబడుతుంది,* దానిలో ఎవ్వరూ నివసించరు.+

20 ఐగుప్తు అందమైన ఆవుదూడ లాంటిది,

అయితే ఉత్తర దిక్కు నుండి కందిరీగలు దానిమీదికి వస్తాయి.

21 దాని కిరాయి సైనికులు సైతం కొవ్విన దూడల్లా ఉన్నారు,

అయితే వాళ్లు కూడా వెన్నుచూపి పారిపోయారు.

వాళ్లు నిలబడలేకపోయారు,+

ఎందుకంటే వాళ్లమీదికి ఆపద వచ్చే రోజు,

వాళ్లను లెక్క అడిగే సమయం వచ్చేసింది.’

22 ‘దాని శబ్దం బుసలు కొడుతూ పారిపోతున్న పాము శబ్దంలా ఉంది,

ఎందుకంటే శత్రువులు చెట్లను నరికేవాళ్లలా

గొడ్డళ్లతో దానిమీదికి వస్తున్నారు.’

23 యెహోవా ఇలా అంటున్నాడు: ‘దాని అడవి చొరబడలేని విధంగా ఉన్నా, వాళ్లు దాన్ని నరికేస్తారు.

ఎందుకంటే వాళ్లు మిడతల కన్నా ఎక్కువ సంఖ్యలో, లెక్కపెట్టలేనంత మంది ఉన్నారు.

24 ఐగుప్తు కూతురు అవమానాలపాలు అవుతుంది.

ఆమె ఉత్తర దేశ ప్రజలకు అప్పగించబడుతుంది.’+

25 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇప్పుడు నేను నా దృష్టిని నోలో*+ ఉన్న ఆమోను+ మీదికి, ఫరో మీదికి, ఐగుప్తు మీదికి, దాని దేవుళ్ల మీదికి,+ దాని రాజుల మీదికి, అవును ఫరో మీదికి, అతని మీద నమ్మకం పెట్టుకున్న వాళ్లందరి మీదికి మళ్లిస్తున్నాను.’+

26 “ ‘నేను వాళ్లను వాళ్ల ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల చేతికి, అంటే బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి, అతని సేవకుల చేతికి అప్పగిస్తాను.+ అయితే కొంతకాలానికి అది మళ్లీ ఒకప్పటిలా నివాస స్థలం అవుతుంది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.+

27 ‘నా సేవకుడివైన యాకోబూ, నువ్వైతే భయపడకు,

ఇశ్రాయేలూ, బెదిరిపోకు.+

ఎందుకంటే నేను దూరం నుండి నిన్ను,

తాము బందీలుగా ఉన్న దేశం నుండి నీ సంతానాన్ని* కాపాడతాను.+

యాకోబు తిరిగొస్తాడు, ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా ఉంటాడు,

వాళ్లను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+

28 కాబట్టి నా సేవకుడివైన యాకోబూ, భయపడకు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘నిన్ను ఏయే దేశాల మధ్యకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటినీ నేను పూర్తిగా నాశనం చేస్తాను;+

కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను.+

అయితే తగిన మోతాదులో నీకు క్రమశిక్షణ ఇస్తాను,*+

నిన్ను శిక్షించకుండా మాత్రం ఉండను.’ ”

47 ఫిలిష్తీయుల గురించి యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం.+ ఫరో గాజాను ఓడించక ముందు అది వచ్చింది. 2 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో! ఉత్తర దిక్కు నుండి జలాలు వస్తున్నాయి.

అవి వరదలై పారతాయి.

దేశం మీద, దానిలో ఉన్నవాటన్నిటి మీద,

నగరం మీద, దాని నివాసుల మీద ప్రవహిస్తాయి.

మనుషులు ఆర్తనాదాలు పెడతారు,

దేశంలో నివసిస్తున్న వాళ్లంతా విలపిస్తారు.

 3 అతని మగ గుర్రాల డెక్కల చప్పుడు,

అతని యుద్ధ రథాల ధ్వని,

అతని చక్రాల శబ్దం వినబడినప్పుడు

తండ్రులు తమ కుమారుల కోసం కూడా వెనక్కి తిరిగి చూడరు,

వాళ్ల చేతులు చచ్చుబడిపోతాయి,

 4 ఎందుకంటే వస్తున్న ఆ రోజు ఫిలిష్తీయులందర్నీ నాశనం చేస్తుంది;+

తూరు,+ సీదోనులతో+ సంధి చేసుకున్న మిగతా దేశాలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది.

ఎందుకంటే యెహోవా ఫిలిష్తీయుల్ని,

కఫ్తోరు*+ ద్వీపం నుండి వచ్చిన వాళ్లలో మిగిలినవాళ్లను నాశనం చేస్తాడు.

 5 గాజా తల బోడి అవుతుంది.*

అష్కెలోను నిశ్శబ్దమైంది.+

వాటి లోయ మైదానంలో మిగిలినవాళ్లారా,

ఎంతకాలం మీరు మీ శరీరాల్ని కోసుకుంటూ ఉంటారు?+

 6 యెహోవా ఖడ్గమా!+

ఎంతకాలం నువ్వు నిమ్మళించవు?

తిరిగి నీ ఒరలోకి వెళ్లు.

విశ్రాంతి తీసుకో, మౌనంగా ఉండు.

 7 యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు,

అది ఎలా మౌనంగా ఉంటుంది?

అష్కెలోను మీద, సముద్రతీర ప్రాంతం మీద+

ఆయన దాన్ని నియమించాడు.”

48 ఇది మోయాబు+ గురించిన సందేశం. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“నెబోకు+ శ్రమ, అది నాశనం చేయబడింది!

కిర్యతాయిము+ అవమానాలపాలైంది, పట్టబడింది.

సురక్షిత స్థలం* అవమానాలపాలైంది, పడగొట్టబడింది.+

 2 వాళ్లు ఇక మోయాబును పొగడరు.

‘రండి, దాన్ని ఒక దేశంగా ఉండకుండా చేద్దాం’

అంటూ దాన్ని పడగొట్టడానికి వాళ్లు హెష్బోనులో+ కుట్రపన్నారు.

మద్మేనా, నువ్వు కూడా మౌనంగా ఉండాలి,

ఎందుకంటే ఖడ్గం నిన్ను వెంటాడుతోంది.

 3 కొల్లగొట్టడం వల్ల, గొప్ప నాశనం వల్ల

హొరొనయీములో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.+

 4 మోయాబు ధ్వంసం చేయబడింది.

దాని చిన్నపిల్లలు ఏడుస్తున్నారు.

 5 లూహీతుకు ఎక్కివెళ్లే మార్గంలో వాళ్లు ఏడుస్తూ నడుస్తున్నారు.

హొరొనయీము నుండి దిగివెళ్లే మార్గంలో విపత్తును బట్టి వాళ్లకు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.+

 6 పారిపోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి!

మీరు ఎడారిలోని సరళవృక్షంలా* తయారవ్వాలి.

 7 నువ్వు నీ పనుల్ని, సంపదల్ని నమ్ముకున్నావు కాబట్టి,

నువ్వు కూడా పట్టబడతావు.

అలాగే కెమోషు+ తన యాజకులతో పాటు, అధిపతులతో పాటు చెరలోకి వెళ్తాడు.

 8 నాశనం చేసేవాడు ప్రతీ నగరం మీదికి వస్తాడు,

ఏ నగరమూ తప్పించుకోదు.+

యెహోవా చెప్పినట్టే లోయ నశించిపోతుంది,

చదునైన నేల* సమూలంగా నాశనమౌతుంది.

 9 మోయాబు కోసం దారిలో గుర్తులు పెట్టండి,

ఎందుకంటే దాని నగరాలు పాడై శిథిలాలుగా మారినప్పుడు, దాని ప్రజలు పారిపోతారు,

దాని నగరాలు భయంకరంగా తయారౌతాయి,

వాటిలో ఎవ్వరూ నివసించరు.+

10 యెహోవా ఇచ్చిన పనిని నిర్లక్ష్యంగా చేసేవాడు శాపగ్రస్తుడు!

రక్తం చిందించకుండా తన ఖడ్గాన్ని వెనక్కి తీసుకునేవాడు శాపగ్రస్తుడు!

11 మడ్డి మీద కదలకుండా ఉన్న ద్రాక్షారసంలా

మోయాబీయులు చిన్నప్పటి నుండి ప్రశాంతంగా ఉన్నారు.

వాళ్లు ఒక పాత్రలో నుండి మరో పాత్రలోకి పోయబడలేదు,

ఎప్పుడూ చెరలోకి వెళ్లలేదు.

అందుకే వాళ్ల రుచి మారలేదు,

వాళ్ల వాసన అలాగే ఉంది.

12 “ ‘కాబట్టి ఇదిగో! నేను వాళ్లను బోర్లించడానికి మనుషుల్ని పంపే రోజులు రాబోతున్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. ‘ఆ మనుషులు వాళ్లను బోర్లించి, వాళ్ల పాత్రల్ని ఖాళీ చేస్తారు, వాళ్ల పెద్దపెద్ద జాడీల్ని ముక్కలుముక్కలుగా పగలగొడతారు. 13 ఇశ్రాయేలు ఇంటివాళ్లు తాము నమ్ముకున్న బేతేలును బట్టి అవమానాలపాలు అయినట్టే,+ మోయాబీయులు కెమోషును బట్టి అవమానాలపాలు అవుతారు.

14 “మేము యోధులం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం” అని అనడానికి మీకెంత ధైర్యం?’+

15 ‘మోయాబు నాశనం చేయబడింది,

దాని నగరాల మీద శత్రువులు దాడిచేశారు,+

దాని యువకుల్లో శ్రేష్ఠులు వధించబడ్డారు’+

అని సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు+ ప్రకటిస్తున్నాడు.

16 మోయాబీయుల మీదికి త్వరలోనే విపత్తు రాబోతోంది,

వాళ్ల పతనం వేగంగా ముంచుకొస్తోంది.+

17 వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లంతా,

వాళ్ల పేరు తెలిసినవాళ్లంతా వాళ్లమీద సానుభూతి చూపించాల్సి వస్తుంది,

వాళ్లతో ఇలా అనండి: ‘అయ్యో, బలమైన దండం, అందమైన కర్ర విరిగిపోయాయే!’

18 దీబోనులో+ నివసిస్తున్న కూతురా,

నీ ఘనతను విడిచి కిందికి రా, దాహంతో కింద* కూర్చో,

ఎందుకంటే, మోయాబును నాశనం చేసేవాడు నీ మీదికి వచ్చాడు,

అతను ప్రాకారాలుగల నీ స్థలాల్ని శిథిలాలుగా మారుస్తాడు.+

19 అరోయేరు+ నివాసీ, దారిపక్కన నిలబడి చూస్తూ ఉండు.

‘ఏం జరిగింది?’ అని పారిపోతున్న మనిషిని, తప్పించుకుంటున్న స్త్రీని అడుగు.

20 మోయాబు అవమానాలపాలైంది, బెదిరిపోయింది.

ఏడ్వండి, కేకలు వేయండి.

మోయాబు నాశనమైందని అర్నోనులో+ ప్రకటించండి.

21 “చదునైన నేల* మీదికి తీర్పు వచ్చింది:+ హోలోను మీదికి, యాహజు+ మీదికి, మేఫాతు+ మీదికి, 22 దీబోను+ మీదికి, నెబో+ మీదికి, బేత్‌-దిబ్లాతయీము మీదికి, 23 కిర్యతాయిము+ మీదికి, బేత్‌-గామూలు మీదికి, బేత్‌-మెయోను+ మీదికి, 24 కెరీయోతు+ మీదికి, బొస్రా మీదికి, దగ్గర్లో గానీ దూరంలో గానీ ఉన్న మోయాబు దేశ నగరాలన్నిటి మీదికి తీర్పు వచ్చింది.

25 ‘మోయాబు కొమ్ము* నరికేయబడింది;

అతని బాహువు విరగ్గొట్టబడింది’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

26 ‘అతనికి మత్తెక్కేదాకా తాగించండి,+ ఎందుకంటే అతను యెహోవాకు వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు.+

మోయాబు తన వాంతిలో దొర్లుతున్నాడు,

ప్రజలు అతన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు.

27 నువ్వు ఇశ్రాయేలును చూసి ఎగతాళి చేయలేదా?+

నువ్వు అతన్ని చూసి తల ఆడించడానికి,

అతనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి

అతను ఏమైనా దొంగా?

28 మోయాబు నివాసులారా, నగరాల్ని విడిచిపెట్టి కొండల్లో నివసించండి.

కొండ సందుల్లో గూడు కట్టుకునే పావురాల్లా తయారవ్వండి.’ ”

29 “మోయాబు గర్వం గురించి మేము విన్నాం, అతను చాలా అహంకారి;

అతని పొగరు గురించి, గర్వం గురించి, అహంకారం గురించి, అతని పొగరుబోతు హృదయం గురించి మేము విన్నాం.”+

30 “ ‘అతని కోపం గురించి నాకు తెలుసు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,

‘కానీ అతని పనికిరాని మాటలు వ్యర్థమౌతాయి.

వాళ్లు ఏమీ చేయలేరు.

31 అందుకే నేను మోయాబు గురించి విలపిస్తాను,

మోయాబు అంతటి గురించి నేను ఏడుస్తాను,

కీర్హరెశు మనుషుల కోసం దుఃఖిస్తాను.+

32 సిబ్మా+ ద్రాక్షతీగా, యాజెరు+ కోసం ఏడ్చినదాని కన్నా

ఎక్కువగా నీ కోసం ఏడుస్తాను.

విస్తరిస్తున్న నీ కొమ్మలు సముద్రాన్ని దాటాయి.

అవి సముద్రాన్ని, యాజెరును చేరుకున్నాయి.

నాశనం చేసేవాడు నీ వేసవికాల పండ్ల మీదికి, నీ ద్రాక్ష కోత మీదికి వచ్చాడు.+

33 పండ్ల తోట నుండి, మోయాబు దేశం నుండి

సంతోషం, ఆనందం తీసేయబడ్డాయి.+

నేను ద్రాక్షతొట్టి నుండి ద్రాక్షారసం ప్రవహించకుండా చేశాను.

సంతోషంతో కేకలు వేస్తూ ఎవరూ ద్రాక్షల్ని తొక్కరు.

వేరే రకమైన కేకలు వినిపిస్తాయి.’ ”+

34 “ ‘హెష్బోనులో+ పెట్టే ఆర్తనాదాలు ఏలాలే+ వరకు వినిపిస్తున్నాయి.

వాళ్ల స్వరం యాహజు+ వరకు వినిపిస్తోంది,

సోయరులో పెట్టే కేకలు హొరొనయీము+ వరకు, ఎగ్లాత్‌-షలీషియా వరకు వినిపిస్తున్నాయి.

చివరికి నిమ్రీము జలాలు కూడా ఎండిపోతాయి.’+

35 యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఉన్నత స్థలం మీదికి అర్పణలు తీసుకొచ్చేవాళ్లు,

తమ దేవునికి బలులు అర్పించేవాళ్లు

ఇక మోయాబులో లేకుండా చేస్తాను.

36 అందుకే మోయాబు కోసం నా హృదయం పిల్లనగ్రోవిలా* విలపిస్తుంది,*+

అలాగే కీర్హరెశు మనుషుల కోసం నా హృదయం పిల్లనగ్రోవిలా* విలపిస్తుంది.*

ఎందుకంటే అతను సంపాదించినదంతా నశించిపోతుంది.

37 ప్రతీ తల బోడి అయింది,+

ప్రతీ గడ్డం కత్తిరించబడింది.

ప్రతీ చేతి మీద గాట్లు ఉన్నాయి,+

వాళ్ల నడుముల మీద గోనెపట్ట ఉంది!’ ”+

38 “ ‘మోయాబు పైకప్పులన్నిటి మీద,

దాని సంతవీధులన్నిట్లో

ఏడ్పు తప్ప ఇంకేమీ లేదు.

ఎందుకంటే నేను మోయాబును పనికిరాని కుండలా పగలగొట్టాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

39 ‘అది ఎంతగా భయపడిపోయింది! ప్రజలారా, ఏడ్వండి!

మోయాబు అవమానంతో ఎలా వెనుతిరిగాడు!

మోయాబును చూసి అతని చుట్టూ ఉన్నవాళ్లంతా ఎగతాళి చేస్తున్నారు,

భయపడుతున్నారు.’ ”

40 “ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:

‘ఇదిగో! వేగంగా దూసుకొచ్చే గద్దలా,+

అతను మోయాబు మీద తన రెక్కలు చాపుతాడు.+

41 దాని పట్టణాలు ఆక్రమించబడతాయి,

దాని బలమైన దుర్గాలు పట్టబడతాయి.

ఆ రోజు మోయాబు యోధుల గుండెలు

ప్రసవిస్తున్న స్త్రీ గుండెలా ఉంటాయి.’ ”

42 “ ‘మోయాబు ఒక జనంగా ఉండకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాడు,+

ఎందుకంటే అతను యెహోవాకు వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు.+

43 మోయాబు నివాసీ,

నీ ముందు భయం, గొయ్యి, ఉచ్చు ఉన్నాయి’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

44 ‘భయాన్ని తప్పించుకునే వ్యక్తి గోతిలో పడతాడు,

గోతిలో నుండి పైకి వచ్చే వ్యక్తి ఉచ్చులో చిక్కుకుంటాడు.’

‘ఎందుకంటే, నేను మోయాబు మీదికి వాళ్ల శిక్షా సంవత్సరాన్ని తీసుకొస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

45 ‘పారిపోయేవాళ్లు హెష్బోను నీడలో శక్తిలేకుండా నిలబడి ఉంటారు.

ఎందుకంటే, హెష్బోనులో నుండి ఒక అగ్ని,

సీహోనులో నుండి ఒక మంట వస్తుంది.+

అది మోయాబు నుదుటిని,

అల్లరిమూక పుర్రెల్ని దహించేస్తుంది.’+

46 ‘మోయాబూ, నీకు శ్రమ!

కెమోషు+ ప్రజలు నశించిపోయారు.

నీ కుమారులు బందీలుగా తీసుకెళ్లబడ్డారు,

నీ కూతుళ్లు చెరలోకి వెళ్లారు.+

47 అయితే చివరి రోజుల్లో నేను చెరలోకి వెళ్లిన మోయాబు ప్రజల్ని సమకూరుస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘ఇక్కడితో మోయాబు గురించిన తీర్పు సందేశం ముగిసింది.’ ”+

49 అమ్మోనీయుల+ గురించిన సందేశం. యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇశ్రాయేలుకు కుమారులు లేరా?

అతనికి వారసుడు లేడా?

మరి మల్కాము+ గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు?+

అతని ప్రజలు ఇశ్రాయేలు నగరాల్లో ఎందుకు నివసిస్తున్నారు?”

 2 “ ‘కాబట్టి ఇదిగో! నేను అమ్మోనీయుల రబ్బాకు+ వ్యతిరేకంగా యుద్ధ ఘంటికను* వినిపించే రోజులు రాబోతున్నాయి’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

‘అది మట్టిదిబ్బ అవుతుంది,

దాని చుట్టుపక్కల పట్టణాలు అగ్నితో కాల్చేయబడతాయి.’

‘ఇశ్రాయేలు, తన దేశాన్ని స్వాధీనం చేసుకున్నవాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు’+ అని యెహోవా అంటున్నాడు.

 3 ‘హెష్బోనూ, ఏడ్వు, హాయి నాశనం చేయబడింది!

రబ్బా చుట్టుపక్కల పట్టణాల్లారా, కేకలు వేయండి.

గోనెపట్ట కట్టుకోండి.

ఏడుస్తూ, రాతి దొడ్ల* మధ్య అటూఇటూ తిరగండి,

మల్కాము తన యాజకులతో పాటు, అధిపతులతో పాటు చెరలోకి వెళ్తాడు.+

 4 నీ సంపదల్ని నమ్ముకుంటూ,

“నా మీదికి ఎవరొస్తారు?” అని అనుకుంటున్న నమ్మకద్రోహివైన కూతురా,

నీ లోయల గురించి, నీ సారవంతమైన మైదానాల గురించి

ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నావు?’ ”

 5 “సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు:

‘ఇదిగో, నేను నలుమూలల నుండి నీ మీదికి భయాన్ని రప్పిస్తున్నాను,

నువ్వు అన్నివైపులా చెదరగొట్టబడతావు,

పారిపోయినవాళ్లను ఎవ్వరూ సమకూర్చరు.’ ”

 6 “ ‘కానీ ఆ తర్వాత నేను చెరలోకి వెళ్లిన అమ్మోనీయుల్ని సమకూరుస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.”

7 ఎదోము గురించిన సందేశం. సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“తేమానులో ఇక తెలివి లేదా?+

అవగాహన గలవాళ్ల దగ్గర మంచి సలహానే లేదా?

వాళ్ల తెలివి వ్యర్థమైపోయిందా?

 8 దెదాను+ నివాసులారా, వెనక్కి తిరిగి పారిపోండి!

వెళ్లి, లోతైన స్థలాల్లో దాక్కోండి!

ఎందుకంటే ఏశావు మీదికి దృష్టి మళ్లించే సమయం వచ్చినప్పుడు

నేను అతని మీదికి ఆపద తీసుకొస్తాను.

 9 ద్రాక్షలు సమకూర్చేవాళ్లు నీ దగ్గరికి వస్తే,

వాళ్లు కొంత పరిగె విడిచిపెడతారు కదా?

రాత్రివేళ దొంగలు వస్తే,

వాళ్లు తమకు కావాల్సినంత మాత్రమే దోచుకుంటారు.+

10 కానీ నేను ఏశావును పూర్తిగా దోచుకుంటాను.

దాక్కునే వీలు లేకుండా అతని చాటైన స్థలాల్ని బట్టబయలు చేస్తాను.

అతని పిల్లలు, సహోదరులు, పొరుగువాళ్లు అందరూ నాశనమౌతారు,+

అతను ఇక ఉండడు.+

11 తండ్రిలేని నీ పిల్లల్ని నాకు విడిచిపెట్టు,

నేను వాళ్లను కాపాడతాను,

నీ విధవరాళ్లు నామీద నమ్మకం పెట్టుకుంటారు.”

12 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! గిన్నెలోది తాగడానికి నిర్ణయించబడనివాళ్లే దాన్ని తాగాల్సి వస్తే, నువ్వు పూర్తిగా శిక్ష తప్పించుకుంటావా? నువ్వు శిక్ష తప్పించుకోలేవు, నువ్వు తప్పకుండా దాన్ని తాగాలి.”+

13 “నా తోడు, బొస్రా భయంకరంగా, నిందగా, నిర్జనంగా, శాపంగా తయారౌతుంది;+ దాని నగరాలన్నీ ఎప్పటికీ శిథిలాలుగా ఉండిపోతాయి”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

14 నేను యెహోవా నుండి ఒక వార్త విన్నాను,

“మీరంతా సమకూడి, దానిమీదికి రండి;

యుద్ధానికి సిద్ధంకండి” అని చెప్పడానికి

దేశాల మధ్యకు ఒక రాయబారి పంపబడ్డాడు.+

15 “ఎందుకంటే ఇదిగో! నేను దేశాల మధ్య నిన్ను తక్కువవాడిగా చేశాను,

మనుషుల మధ్య నీచుడిగా చేశాను.+

16 బండ సందుల్లో,

కొండ శిఖరాల మీద నివసించేవాడా,

నువ్వు పుట్టించిన భయం,

నీ అహంకార హృదయం నిన్ను మోసం చేశాయి.

నువ్వు గద్దలా ఎత్తైన స్థలంలో గూడు కట్టుకున్నా

అక్కడి నుండి నేను నిన్ను కిందికి పడేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

17 “ఎదోము భయంకరంగా తయారవ్వాలి.+ ఆ దారిన వెళ్లే ప్రతీ ఒక్కరు దాన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు, దాని తెగుళ్లన్నిటినీ చూసి ఈల వేస్తారు. 18 సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపక్కల పట్టణాలు నాశనమైనప్పుడు జరిగినట్టే,+ అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు”+ అని యెహోవా అంటున్నాడు.

19 “ఇదిగో! యొర్దాను పక్కనున్న దట్టమైన పొదల్లో నుండి సింహం వచ్చినట్టు,+ సురక్షితమైన పచ్చికబయళ్ల మీదికి ఒకవ్యక్తి వస్తాడు, అయితే నేను ఒక్క క్షణంలో అతన్ని దాని దగ్గర నుండి వెళ్లగొడతాను. ఎంచుకోబడిన వ్యక్తిని దానిమీద నియమిస్తాను. ఎందుకంటే, నాలాంటివాళ్లు ఎవరున్నారు? నన్ను సవాలు చేసేదెవరు? నా ముందు ఏ కాపరి నిలబడగలడు?+ 20 కాబట్టి మనుషులారా, ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని,* తేమాను నివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిన ఆలోచనను వినండి:+

ఖచ్చితంగా మందలోని గొర్రెపిల్లలు ఈడ్చుకెళ్లబడతాయి.

వాళ్లను బట్టి వాటి నివాస స్థలం నిర్జనంగా మారుతుంది.+

21 వాళ్లు పడిపోయినప్పుడు ఆ శబ్దానికి భూమి కంపించింది.

ఆర్తనాదాలు వినిపించాయి!

ఆ శబ్దం ఎర్రసముద్రం+ దాకా వినిపించింది.

22 ఇదిగో! అతను గద్దలా లేచి దూసుకొస్తాడు,+

బొస్రా మీద తన రెక్కలు చాపుతాడు.+

ఆ రోజు ఎదోము యోధుల గుండెలు

ప్రసవించే స్త్రీ గుండెలా ఉంటాయి.”

23 దమస్కు గురించిన సందేశం:+

“హమాతు,+ అర్పాదు అవమానాలపాలు అయ్యాయి,

ఎందుకంటే అవి చెడ్డ వార్త విన్నాయి.

అవి భయంతో నీరుగారిపోయాయి.

సముద్రం అల్లకల్లోలంగా ఉంది, అది నిమ్మళించట్లేదు.

24 దమస్కు ధైర్యం కోల్పోయింది.

అది పారిపోవడానికి వెనక్కి తిరిగింది, కానీ దానికి భయం పట్టుకుంది.

ప్రసవిస్తున్న స్త్రీలా

వేదన, నొప్పి దాన్ని పట్టుకున్నాయి.

25 మహిమాన్విత నగరం,

సంతోషం కలిగించే పట్టణం విడవబడలేదేంటి?

26 దాని యువకులు దాని సంతవీధుల్లో పడిపోతారు,

ఆ రోజు సైనికులందరూ నశించిపోతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రకటిస్తున్నాడు.

27 “నేను దమస్కు ప్రాకారాల్ని అగ్నితో కాల్చేస్తాను,

అది బెన్హదదు పటిష్ఠమైన బురుజుల్ని దహించేస్తుంది.”+

28 బబులోను రాజు నెబుకద్నెజరు* పడగొట్టిన కేదారు,+ హాసోరు రాజ్యాల గురించిన సందేశం. యెహోవా ఇలా అంటున్నాడు:

“లెండి, కేదారు మీదికి వెళ్లండి,

తూర్పు దేశ ప్రజల్ని నాశనం చేయండి.

29 శత్రువులు వాళ్ల డేరాల్ని, మందల్ని,

డేరా తెరల్ని, వాళ్ల సామానంతటినీ తీసుకెళ్తారు.

వాళ్ల ఒంటెల్ని ఎత్తుకెళ్తారు,

ప్రజలు, ‘చుట్టూ భయం అలుముకుంది!’ అని కేకలు వేస్తారు.”

30 “హాసోరు నివాసులారా, పారిపోండి, దూరంగా వెళ్లండి!

వెళ్లి లోతైన స్థలాల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు* మీకు వ్యతిరేకంగా ఒక వ్యూహం రచించాడు, పథకం పన్నాడు.”

31 “లెండి, ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్న దేశం మీదికి వెళ్లండి!” అని

యెహోవా ప్రకటిస్తున్నాడు.

“దానికి తలుపులు గానీ అడ్డగడియలు గానీ లేవు; వాళ్లు ఒంటరిగా నివసిస్తున్నారు.

32 వాళ్ల ఒంటెలు దోచుకోబడతాయి,

విస్తారమైన వాళ్ల పశుసంపద కొల్లగొట్టబడుతుంది.

తమ కణతల పక్క వెంట్రుకల్ని గొరిగించుకునే వాళ్లను+

నేను అన్నివైపులకు* చెదరగొడతాను,

అన్నివైపుల నుండి వాళ్లమీదికి ఆపద తీసుకొస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

33 “హాసోరు నక్కలకు విశ్రాంతి స్థలం అవుతుంది,

అది ఎప్పటికీ నిర్జనంగా ఉండిపోతుంది.

అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు.”

34 యూదా రాజైన సిద్కియా+ పరిపాలన ఆరంభంలో, ఏలాము గురించి+ యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం: 35 “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘ఇదిగో నేను ఏలాము విల్లును,+ వాళ్ల బలానికి మూలమైన దాన్ని* విరగ్గొడుతున్నాను. 36 నేను ఏలాము మీదికి ఆకాశం నలుమూలల నుండి నాలుగు గాలుల్ని రప్పించి, ఆ నాలుగు దిక్కులకు వాళ్లను చెదరగొడతాను. చెదిరిపోయిన ఏలాము ప్రజలు వెళ్లని దేశమంటూ ఏదీ ఉండదు.’ ”

37 “నేను ఏలామీయుల్ని వాళ్ల శత్రువుల ముందు, వాళ్ల ప్రాణం తీయాలని చూస్తున్నవాళ్ల ముందు బెదిరిపోయేలా చేస్తాను; నేను వాళ్లమీదికి విపత్తును, నా కోపాగ్నిని రప్పిస్తాను; వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు వాళ్ల వెనక ఖడ్గాన్ని పంపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

38 “నేను ఏలాములో+ నా సింహాసనం వేసుకుని వాళ్ల రాజును, అధిపతుల్ని నాశనం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

39 “అయితే నేను చివరి రోజుల్లో చెరలోకి వెళ్లిన ఏలాము ప్రజల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

50 బబులోను గురించి, కల్దీయుల దేశం గురించి యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా చెప్పిన వాక్యం:+

 2 “దేశాల మధ్య చాటించండి, ప్రకటించండి.

ధ్వజం* ఎత్తి చాటించండి.

ఏదీ దాచకండి!

ఇలా చెప్పండి: ‘బబులోను పట్టబడింది.+

బేలు అవమానాలపాలు అయ్యాడు.+

మెరోదకు బెదిరిపోయాడు.

ఆమె ప్రతిమలు అవమానాలపాలు అయ్యాయి.

ఆమె అసహ్యమైన విగ్రహాలు* బెదిరిపోయాయి.’

 3 ఎందుకంటే ఉత్తర దిక్కు నుండి ఒక దేశం ఆమె మీదికి వచ్చింది.+

అది ఆమె దేశాన్ని భయంకరంగా మారుస్తోంది;

అందులో ఎవరూ నివసించట్లేదు.

మనుషులు పారిపోయారు, జంతువులు పారిపోయాయి;

వాళ్లు ఇక లేరు.”

4 “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి వస్తారు.+ వాళ్లు ఏడుస్తూ నడుస్తారు,+ అందరూ కలిసి తమ దేవుడైన యెహోవా నిర్దేశాన్ని వెదుకుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 5 “వాళ్లు సీయోను వైపు తిరిగి సీయోనుకు దారి అడుగుతూ,+ ‘రండి, ఎప్పటికీ మరవబడని శాశ్వత ఒప్పందం ద్వారా యెహోవాకు కట్టుబడి ఉందాం’+ అని అంటారు. 6 నా ప్రజలు తప్పిపోయిన గొర్రెల మంద అయ్యారు.+ వాటి కాపరులే వాటిని తప్పుదారి పట్టించారు.+ వాళ్లు పర్వతాల మీదికి వాటిని తీసుకొచ్చారు. అవి పర్వతాల మీద, కొండల మీద తిరుగుతూ తమ విశ్రాంతి స్థలాన్ని మర్చిపోయాయి. 7 వాటిని చూసిన వాళ్లంతా వాటిని మింగేశారు.+ వాళ్ల శత్రువులు, ‘మేము నిర్దోషులం. వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు; నీతి నివసించే స్థలం, తమ పూర్వీకుల నిరీక్షణ అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు’ అని అన్నారు.”

 8 “బబులోను నుండి పారిపోండి,

కల్దీయుల దేశం నుండి వెళ్లిపోండి,+

మంద ముందు నడిచే మేకపోతుల్లా, పొట్టేళ్లలా ఉండండి.

 9 ఎందుకంటే ఇదిగో నేను ఉత్తర దేశం నుండి గొప్పగొప్ప జనాల సమూహాన్ని రేపి,

వాటిని బబులోను మీదికి రప్పిస్తున్నాను.+

వాళ్లు యుద్ధ పంక్తులు తీరి ఆమె మీదికి వస్తారు;

ఆమె పట్టబడుతుంది.

వాళ్ల బాణాలు యోధుల బాణాల్లాంటివి,

అవి కరుణ లేకుండా పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేస్తాయి;+

అవి గురి తప్పవు.

10 కల్దీయ దేశం దోపుడుసొమ్ము అవుతుంది.+

దాన్ని కొల్లగొట్టే వాళ్లంతా పూర్తిగా తృప్తి చెందుతారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

11 “ఎందుకంటే నా స్వాస్థ్యాన్ని దోచుకుంటున్నప్పుడు+

మీరు సంతోషిస్తూ, ఉల్లసిస్తూ ఉన్నారు.+

పచ్చగడ్డి మీద ఆవుదూడలా గంతులు వేస్తూ ఉన్నారు,

మగ గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు.

12 మీ అమ్మ అవమానాలపాలైంది.+

మిమ్మల్ని కన్న తల్లి నిరాశకు గురైంది.

ఇదిగో! దేశాల్లో ఆమె అల్పమైనది,

అది నీళ్లులేని నిర్జన ప్రాంతం, ఎడారి.+

13 యెహోవా ఉగ్రత వల్ల దానిలో ఎవ్వరూ నివసించరు;+

అది పూర్తిగా నిర్మానుష్యమౌతుంది.

బబులోను పక్కగా వెళ్లే వాళ్లంతా

ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు, ఆమె తెగుళ్లన్నిటినీ చూసి ఈల వేస్తారు.+

14 విల్లు వంచే వాళ్లారా, మీరంతా యుద్ధ పంక్తులు తీరి

అన్నివైపుల నుండి బబులోను మీదికి రండి.

ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా మీ బాణాలన్నీ ఆమె మీదికి వేయండి,+

ఎందుకంటే, ఆమె యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది.+

15 అన్నివైపుల నుండి ఆమె మీద యుద్ధకేకలు వేయండి.

ఆమె లొంగిపోయింది.

ఆమె స్తంభాలు పడిపోయాయి, ఆమె ప్రాకారాలు కూలిపోయాయి,+

అది యెహోవా చేసే ప్రతీకారం.+

ఆమె మీద పగతీర్చుకోండి.

ఆమె చేసినట్టే ఆమెకూ చేయండి.+

16 బబులోనులో విత్తేవాళ్లు,

కోతకాలంలో కొడవలి పట్టుకునేవాళ్లు లేకుండా చేయండి.+

క్రూరమైన ఖడ్గంవల్ల ప్రతీ వ్యక్తి తన సొంత ప్రజల దగ్గరికి తిరిగెళ్లిపోతాడు,

ప్రతీ వ్యక్తి తన స్వదేశానికి పారిపోతాడు.+

17 “ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయిన గొర్రెలు.+ సింహాలు వాటిని చెదరగొట్టాయి. ముందు అష్షూరు రాజు వాళ్లను మింగేశాడు;+ తర్వాత బబులోను రాజు నెబుకద్నెజరు* వాళ్ల ఎముకల్ని నలగ్గొట్టాడు.+ 18 కాబట్టి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను అష్షూరు రాజును శిక్షించినట్టే బబులోను రాజును, అతని దేశాన్ని శిక్షిస్తాను.+ 19 నేను ఇశ్రాయేలును అతని పచ్చిక మైదానానికి తిరిగి తీసుకొస్తాను;+ అతను కర్మెలు మీద, బాషాను మీద మేస్తాడు;+ ఎఫ్రాయిము+ పర్వతాల మీద, గిలాదు+ పర్వతాల మీద తృప్తిగా తింటాడు.’ ”

20 “ఆ రోజుల్లో, ఆ సమయంలో

ఇశ్రాయేలులో దోషం కోసం వెతికినా కనబడదు,

యూదాలో ఏ పాపాలు కనబడవు,

ఎందుకంటే, నేను మిగిలిపోనిచ్చిన వాళ్లను క్షమిస్తాను” అని యెహోవా అంటున్నాడు.+

21 “మెరాతయీము దేశం మీదికి, పెకోదు నివాసుల మీదికి వెళ్లు.+

వాళ్లు హతమవ్వాలి, సమూలంగా నాశనమవ్వాలి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయి.

22 దేశంలో యుద్ధ ధ్వని,

గొప్ప నాశన ధ్వని వినిపిస్తోంది.

23 భూమ్మీది దేశాలన్నిటినీ చితగ్గొట్టిన సుత్తి ఎలా విరగ్గొట్టబడి, ముక్కలైంది!+

దేశాల మధ్య బబులోను ఎలా భయంకరంగా తయారైంది!+

24 బబులోనూ, నేను నీ కోసం ఒక ఉచ్చు పన్నాను, నువ్వు చిక్కుకున్నావు,

నీకు ఆ విషయం తెలీదు.

నువ్వు దొరికిపోయావు, పట్టబడ్డావు,+

ఎందుకంటే, నువ్వు యెహోవాను ఎదిరించావు.

25 యెహోవా తన ఆయుధశాలను తెరిచి,

తన ఉగ్రతను వెళ్లగక్కే ఆయుధాల్ని బయటికి తెస్తున్నాడు.+

ఎందుకంటే, కల్దీయుల దేశంలో

సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాకు ఒక పని ఉంది.

26 దూర ప్రాంతాల నుండి ఆమె మీదికి రండి.+

ఆమె ధాన్యపు గోదాముల్ని తెరవండి.+

ఆమె దోపుడుసొమ్మును ధాన్యపు కుప్పల్లా పోగుచేయండి.

ఆమెను పూర్తిగా నాశనం చేయండి.+

ఆమెకు ఎవ్వరూ మిగలకూడదు.

27 ఆమె ఎద్దులన్నిటినీ* వధించండి;+

అవి వధకు వెళ్లాలి.

వాళ్లకు శ్రమ, ఎందుకంటే వాళ్ల రోజు,

వాళ్లను లెక్క అడిగే సమయం వచ్చేసింది!

28 బబులోను దేశం నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ల శబ్దం వినిపిస్తోంది.

వాళ్లు సీయోనులో మన దేవుడైన యెహోవా ప్రతీకారాన్ని,

ఆయన ఆలయం గురించిన ప్రతీకారాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు.+

29 బబులోను మీదికి విలుకాండ్రను,

విల్లు వంచే వాళ్లందర్నీ పిలిపించండి.+

ఆమె చుట్టూ ముట్టడి వేయండి; ఎవ్వర్నీ తప్పించుకోనివ్వకండి.

ఆమె చేసిన పనుల్ని బట్టి ఆమెకు ప్రతీకారం చేయండి.+

ఆమె చేసినట్టే ఆమెకూ చేయండి.+

ఎందుకంటే ఆమె యెహోవాకు వ్యతిరేకంగా,

ఇశ్రాయేలు పవిత్ర దేవునికి వ్యతిరేకంగా అహంకారంతో ప్రవర్తించింది.+

30 కాబట్టి ఆమె యువకులు ఆమె సంతవీధుల్లో పడిపోతారు,+

ఆ రోజు ఆమె సైనికులందరూ నశించిపోతారు” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

31 “ఎదిరించేవాడా,+ ఇదిగో! నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను”+ అని సర్వోన్నత ప్రభువూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ప్రకటిస్తున్నాడు,

“నీ రోజు, నేను నిన్ను లెక్క అడిగే సమయం తప్పకుండా వస్తుంది.

32 ఎదిరించేవాడా, నువ్వు తడబడి పడిపోతావు,

నిన్ను లేపేవాళ్లు ఎవ్వరూ ఉండరు.+

నేను నీ నగరాలకు నిప్పంటిస్తాను,

అది నీ చుట్టూ ఉన్నవాటన్నిటినీ దహించేస్తుంది.”

33 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అణచివేయబడుతున్నారు,

వాళ్లను బందీలుగా తీసుకెళ్లినవాళ్లంతా వాళ్లను గట్టిగా పట్టుకున్నారు.+

వాళ్లను విడిచిపెట్టట్లేదు.+

34 అయితే వాళ్ల విమోచకుడు బలవంతుడు.+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.+

వాళ్ల దేశానికి విశ్రాంతిని ఇవ్వడానికి,+

బబులోను నివాసుల్ని కలవరపెట్టడానికి+

ఆయన తప్పకుండా వాళ్ల వ్యాజ్యాన్ని వాదిస్తాడు.”+

35 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “కల్దీయులకు వ్యతిరేకంగా,

బబులోను నివాసులకు, ఆమె అధిపతులకు, జ్ఞానులకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది.+

36 పనికిరాని మాటలు మాట్లాడేవాళ్లకు* వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, వాళ్లు తెలివితక్కువగా ప్రవర్తిస్తారు.

ఆమె యోధులకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, వాళ్లు బెదిరిపోతారు.+

37 వాళ్ల గుర్రాలకు, యుద్ధ రథాలకు,

ఆమె మధ్య ఉన్న రకరకాల ప్రజలకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది.

వాళ్లు స్త్రీలలా అవుతారు.+

ఆమె సంపదలకు వ్యతిరేకంగా ఒక ఖడ్గం ఉంది, అవి దోచుకోబడతాయి.+

38 ఆమె జలాల మీద ఒక నాశనం ఉంది, అవి ఎండిపోతాయి.+

ఎందుకంటే, అది చెక్కిన విగ్రహాలున్న దేశం,+

భయపెట్టే తమ దర్శనాల వల్ల వాళ్లు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు.

39 కాబట్టి, ఎడారి ప్రాణులు ఊల వేసే జంతువులతో పాటు నివసిస్తాయి,

నిప్పుకోళ్లు దానిలో నివసిస్తాయి.+

అయితే ఇంకెప్పుడూ ప్రజలు దానిలో నివసించరు,

తరతరాలపాటు అది ఎప్పటికీ నివాస స్థలంగా ఉండదు.”+

40 “దేవుడు సొదొమ గొమొర్రాల్ని, వాటి చుట్టుపక్కల పట్టణాల్ని+ నాశనం చేసినప్పుడు జరిగినట్టే,+ అక్కడ ఎవ్వరూ నివసించరు, ఎవ్వరూ స్థిరపడరు”+ అని యెహోవా అంటున్నాడు.

41 “ఇదిగో! ఉత్తర దిక్కు నుండి ఒక జనం వస్తోంది;

భూమి సుదూర ప్రాంతాల నుండి+

ఒక గొప్ప దేశం, మహిమగల రాజులు+ లేస్తారు.

42 వాళ్ల దగ్గర విల్లు, ఈటె ఉన్నాయి.+

వాళ్లు క్రూరులు, కరుణ చూపించరు.+

వాళ్లు గుర్రాలమీద స్వారీ చేస్తున్నప్పుడు

ఆ శబ్దం సముద్ర ఘోషలా ఉంది.+

బబులోను కూతురా, వాళ్లంతా కలిసి యుద్ధ పంక్తులు తీరి నీమీదికి వస్తున్నారు.+

43 బబులోను రాజు వాళ్ల గురించిన వార్త విన్నాడు,+

అతని చేతులు చచ్చుబడిపోయాయి.+

ఆందోళన, ప్రసవిస్తున్న స్త్రీలాంటి వేదన అతన్ని పట్టుకున్నాయి.

44 “ఇదిగో! యొర్దాను పక్కనున్న దట్టమైన పొదల్లో నుండి సింహం వచ్చినట్టు, సురక్షితమైన పచ్చికబయళ్ల మీదికి ఒకవ్యక్తి వస్తాడు, అయితే నేను ఒక్క క్షణంలో వాళ్లను ఆమె దగ్గర నుండి వెళ్లగొడతాను. ఎంచుకోబడిన వ్యక్తిని ఆమె మీద నియమిస్తాను.+ ఎందుకంటే, నాలాంటివాళ్లు ఎవరున్నారు? నన్ను సవాలు చేసేదెవరు? నా ముందు ఏ కాపరి నిలబడగలడు?+ 45 కాబట్టి మనుషులారా, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా తీసుకున్న నిర్ణయాన్ని,*+ కల్దీయుల దేశానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఆలోచనను వినండి:

ఖచ్చితంగా మందలోని గొర్రెపిల్లలు ఈడ్చుకెళ్లబడతాయి.

వాళ్లను బట్టి వాటి నివాస స్థలం నిర్జనంగా మారుతుంది.+

46 బబులోను పట్టబడినప్పుడు, ఆ శబ్దానికి భూమి కంపిస్తుంది,

దేశాల మధ్య ఆర్తనాదాలు వినిపిస్తాయి.”+

51 యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో నేను బబులోను మీదికి,+ లెబ్‌-కమై* నివాసుల మీదికి

నాశనకరమైన గాలిని రేపుతున్నాను.

 2 నేను బబులోను మీదికి తూర్పారబట్టే వాళ్లను పంపుతాను,

వాళ్లు ఆమెను తూర్పారబట్టి, ఆమె దేశాన్ని ఖాళీచేస్తారు;

విపత్తు రోజున వాళ్లు అన్నివైపుల నుండి ఆమె మీదికి వస్తారు.+

 3 బబులోను విలుకాండ్రు తమ విల్లును వంచరు.

ఆమె సైనికులు కవచాలు వేసుకుని నిలబడరు.

ఆమె యువకుల మీద మీరు కనికరం చూపించకూడదు.+

ఆమె సైన్యమంతటినీ నాశనం చేయండి.

 4 వాళ్లు కల్దీయుల దేశంలో హతులై పడివుంటారు,

ఆమె వీధుల్లో పొడవబడతారు.+

 5 ఎందుకంటే ఇశ్రాయేలును, యూదాను వాళ్ల దేవుడు, అంటే సైన్యాలకు అధిపతైన యెహోవా విడిచిపెట్టలేదు.+ వాళ్లు విధవరాళ్లు అవ్వలేదు.

అయితే ఇశ్రాయేలు పవిత్ర దేవుని దృష్టిలో వాళ్ల దేశం* దోషంతో నిండిపోయింది.

 6 బబులోను నుండి పారిపోండి,

తప్పించుకుని మీ ప్రాణాలు కాపాడుకోండి.+

ఆమె దోషం వల్ల నశించిపోకండి.

ఎందుకంటే ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం.

ఆమె చేసినదాన్ని బట్టి ఆయన ఆమెకు ప్రతిఫలం ఇస్తున్నాడు.+

 7 బబులోను యెహోవా చేతిలో బంగారు పాత్రగా ఉండేది;

ఆమె భూమంతటికీ మత్తెక్కేదాకా తాగించింది.

దేశాలు మత్తెక్కేదాకా ఆమె ద్రాక్షారసాన్ని తాగాయి;+

అందుకే వాటికి పిచ్చి పట్టింది.+

 8 ఉన్నట్టుండి బబులోను కూలిపోయింది, ముక్కలైపోయింది.+

ఆమె కోసం ఏడ్వండి!+

ఆమె నొప్పి కోసం సాంబ్రాణి తీసుకురండి; బహుశా ఆమె బాగౌతుందేమో.”

 9 “మనం బబులోనును బాగుచేయడానికి ప్రయత్నించాం, కానీ ఆమె బాగవ్వలేదు.

పదండి ఆమెను వదిలేసి, మనం మన స్వదేశాలకు వెళ్లిపోదాం.+

ఎందుకంటే, ఆమె తీర్పు ఆకాశం వరకు చేరుకుంది;

అది మేఘాలంత ఎత్తులో ఉంది.+

10 యెహోవా మనకు న్యాయం చేశాడు.+

రండి, మన దేవుడైన యెహోవా చేసినదాన్ని సీయోనులో ప్రకటిద్దాం.”+

11 “బాణాలకు పదునుపెట్టండి,+ గుండ్రటి డాళ్లు తీసుకోండి.*

బబులోనును శిథిలాలుగా మార్చడానికి

యెహోవా మాదీయుల రాజుల హృదయాన్ని రేపాడు.+

ఇది యెహోవా చేసే ప్రతీకారం, తన ఆలయం కోసం ఆయన చేసే ప్రతీకారం.

12 బబులోను ప్రాకారాలకు వ్యతిరేకంగా ధ్వజం* ఎత్తండి.+

కాపలాను పటిష్ఠం చేయండి, కావలివాళ్లను నిలబెట్టండి.

మాటువేసేవాళ్లను సిద్ధం చేయండి.

ఎందుకంటే యెహోవా ఒక వ్యూహం రచించాడు,

బబులోను నివాసులకు వ్యతిరేకంగా తాను చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు.”+

13 “విస్తారమైన సంపదలు కలిగి+

అనేక జలాల మీద నివసించే ఓ స్త్రీ,+

నీ అంతం వచ్చేసింది, నీ అక్రమ సంపాదన హద్దును చేరుకుంది.+

14 తన జీవం తోడని సైన్యాలకు అధిపతైన యెహోవా ప్రమాణం చేశాడు,

‘నేను మిడతలంత విస్తారంగా ఉన్న మనుషులతో నిన్ను నింపేస్తాను,

వాళ్లు నిన్ను ఓడించి విజయోత్సాహంతో కేకలు వేస్తారు.’+

15 ఆయన తన శక్తితో భూమిని చేశాడు,

తన తెలివితో పంటభూమిని స్థిరపర్చాడు,+

తన అవగాహనతో ఆకాశాన్ని పరిచాడు.+

16 ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు,

ఆకాశ జలాల్లో అలజడి రేగుతుంది,

ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు.

వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు,

తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+

17 ప్రతీ మనిషి బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.

తాను చెక్కిన విగ్రహాన్ని బట్టి ప్రతీ కంసాలి అవమానాలపాలు అవుతాడు;+

ఎందుకంటే, అతను పోతపోసిన విగ్రహం అబద్ధం,

వాటిలో ఊపిరే* లేదు.+

18 అవి వ్యర్థమైనవి,+ ఎగతాళికి తగినవి.

వాటిని లెక్క అడిగే రోజు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

19 యాకోబు దేవుడు* వీటి లాంటివాడు కాదు,

ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు,

ఆయన తన స్వాస్థ్యంలో అత్యంత విలువైన భాగం.+

ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.”+

20 “నువ్వు నాకు యుద్ధ ఆయుధానివి, దుడ్డుకర్రవి,

నేను నీతో దేశాల్ని చితగ్గొడతాను.

నీతో రాజ్యాల్ని నాశనం చేస్తాను.

21 నేను నీతో గుర్రాన్ని, దాని రౌతును చితగ్గొడతాను.

నీతో యుద్ధ రథాన్ని, దాన్ని నడిపేవాణ్ణి చితగ్గొడతాను.

22 నేను నీతో పురుషుణ్ణి, స్త్రీని,

ముసలివాణ్ణి, పిల్లవాణ్ణి,

యువకుణ్ణి, యువతిని చితగ్గొడతాను.

23 నేను నీతో కాపరిని, అతని మందను చితగ్గొడతాను.

నీతో రైతును, అతని పొలం దున్నే పశువుల్ని చితగ్గొడతాను.

నీతో పాలకుల్ని, ఉప పాలకుల్ని చితగ్గొడతాను.

24 బబులోను, కల్దీయ నివాసులు సీయోనులో మీ కళ్లముందు చేసిన చెడు అంతటిని బట్టి

నేను వాళ్లకు ప్రతీకారం చేస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

25 “నాశన పర్వతమా, భూమంతటినీ నాశనం చేసేదానా,+

నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు,

“నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, బండల మీద నుండి నిన్ను కిందికి దొర్లిస్తాను,

నిన్ను కాలిపోయిన పర్వతంగా చేస్తాను.”

26 “ప్రజలు నీ నుండి మూలరాయిని గానీ పునాదిరాయిని గానీ తీసుకోరు,

ఎందుకంటే నువ్వు ఎప్పటికీ నిర్జనంగా ఉంటావు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

27 “దేశంలో ధ్వజం* ఎత్తండి.+

దేశాల మధ్య బూర* ఊదండి.

ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని నియమించండి.*

ఆమె మీదికి అరారాతు,+ మిన్నీ, అష్కనజు+ రాజ్యాల్ని పిలవండి.

ఆమె మీద ఒక సైనికాధికారిని నియమించండి.

మిడతపిల్లల దండులా గుర్రాల్ని రప్పించండి.

28 ఆమెకు వ్యతిరేకంగా దేశాల్ని,

మాదీయ రాజుల్ని,+ దాని పాలకుల్ని, ఉప పాలకులందర్నీ,

వాళ్లు పరిపాలించే దేశాలన్నిటినీ నియమించండి.*

29 భూమి కంపిస్తుంది, వణికిపోతుంది,

ఎందుకంటే బబులోను దేశాన్ని నివాసులు లేకుండా భయంకరంగా మార్చాలని+

బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా చేసిన ఆలోచన నెరవేరుతుంది.

30 బబులోను యోధులు పోరాడడం ఆపేశారు.

వాళ్లు తమ కోటల్లో కూర్చున్నారు.

వాళ్ల బలం క్షీణించింది.+

వాళ్లు స్త్రీలలా అయ్యారు.+

ఆమె ఇళ్లు తగలబెట్టబడ్డాయి.

ఆమె అడ్డగడియలు విరగ్గొట్టబడ్డాయి.+

31 తన నగరం అన్నివైపుల పట్టబడిందని బబులోను రాజుకు చెప్పడానికి

వార్తాహరుడి వెంట వార్తాహరుడు,

సందేశకుడి వెంట సందేశకుడు పరుగెత్తుకుంటూ వస్తున్నారు;+

32 రేవులు పట్టబడ్డాయని,+

జమ్ము* పడవలు అగ్నితో కాల్చేయబడ్డాయని,

సైనికులు హడలిపోయారని చెప్పడానికి వాళ్లు వస్తున్నారు.”

33 ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“బబులోను కూతురు కళ్లం* లాంటిది.

ఆమెను తొక్కి చదును చేయాల్సిన సమయం వచ్చింది.

అతి త్వరలోనే ఆమెకు కోతకాలం వస్తుంది.”

34 “బబులోను రాజు నెబుకద్నెజరు* నన్ను మింగేశాడు;+

అతను నన్ను అయోమయంలో పడేశాడు.

నన్ను ఖాళీ పాత్రగా చేశాడు.

పెద్ద పాములా నన్ను మింగేశాడు;+

నా ప్రశస్తమైన వాటితో తన కడుపు నింపుకున్నాడు.

నన్ను అవతల పారేశాడు.

35 ‘నాకు, నా శరీరానికి చేసిన హాని బబులోను మీదికి రావాలి!’ అని సీయోను నివాసి అంటున్నాడు.+

‘నా రక్తం కల్దీయ నివాసుల మీదికి రావాలి!’ అని యెరూషలేము అంటుంది.”

36 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“ఇదిగో నేను నీ వ్యాజ్యాన్ని వాదిస్తున్నాను,+

నీ తరఫున ప్రతీకారం చేస్తాను.+

ఆమె సముద్రాన్ని, బావుల్ని ఎండిపోజేస్తాను.+

37 బబులోను రాళ్లకుప్పగా,+

నక్కలకు విశ్రాంతి స్థలంగా,+

ఎవ్వరూ నివసించని భయంకర స్థలంగా తయారౌతుంది,

ప్రజలు దాన్ని చూసి ఈల వేస్తారు.+

38 వాళ్లంతా కొదమ సింహాల్లా గర్జిస్తారు.

సింహం పిల్లల్లా గుర్రుమంటారు.”

39 “వాళ్ల కోరికలు బలంగా ఉన్నప్పుడు,

నేను వాళ్లకు విందు సిద్ధం చేస్తాను, వాళ్లకు మత్తెక్కేలా తాగించి వాళ్లు ఉల్లసించేలా చేస్తాను,+

అప్పుడు వాళ్లు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు,

తిరిగి లేవరు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

40 “గొర్రెపిల్లల్ని, పొట్టేళ్లను, మేకపోతుల్ని వధకు తీసుకెళ్లినట్టు

నేను వాళ్లను తీసుకెళ్తాను.”

41 “షేషకు* ఎలా పట్టబడింది!+

ప్రజలందరి పొగడ్తలు అందుకున్న నగరం ఎలా పట్టబడింది!+

దేశాల మధ్య బబులోను ఎలా భయంకరంగా తయారైంది!

42 సముద్రం బబులోను మీదికి ఉప్పొంగింది.

విస్తారమైన అలలతో దాన్ని కప్పేసింది.

43 ఆమె నగరాలు భయంకరంగా, నీళ్లులేని ప్రదేశంలా, ఎడారిలా తయారయ్యాయి.

అక్కడ ఎవ్వరూ నివసించరు, దాని గుండా ఎవ్వరూ ప్రయాణించరు.+

44 నేను బబులోనులోని బేలు+ మీదికి నా దృష్టి మళ్లిస్తాను,

అతను మింగేసినదాన్ని అతని నోటిలో నుండి బయటికి తీస్తాను.+

ఇక జనాలు ప్రవాహంలా అతని దగ్గరికి వెళ్లవు,

బబులోను ప్రాకారం పడిపోతుంది.+

45 నా ప్రజలారా, దానిలో నుండి బయటికి రండి!+

యెహోవా కోపాగ్ని రగులుకుంటోంది,+ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోండి!+

46 దేశంలో వినబడబోయే వార్తను బట్టి ధైర్యం కోల్పోకండి, భయపడకండి.

ఒక సంవత్సరం ఒక వార్త వస్తుంది,

తర్వాతి సంవత్సరం ఇంకో వార్త వస్తుంది,

దేశంలో దౌర్జన్యం జరుగుతుంది, ఒక పరిపాలకుని మీదికి ఇంకో పరిపాలకుడు లేస్తాడు.

47 కాబట్టి ఇదిగో! బబులోను చెక్కుడు విగ్రహాల మీదికి నా దృష్టిని మళ్లించే రోజులు రాబోతున్నాయి.

ఆమె దేశమంతా అవమానాలపాలు అవుతుంది,

దాని ప్రజలు హతులై దానిమధ్య పడివుంటారు.+

48 భూమ్యాకాశాలు, వాటిలో ఉన్నవన్నీ

బబులోను కూలిపోవడాన్ని బట్టి సంతోషంతో కేకలు వేస్తాయి,+

ఎందుకంటే నాశనం చేసేవాళ్లు ఉత్తర దిక్కు నుండి ఆమె దగ్గరికి వస్తారు”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

49 “బబులోను వల్ల ఇశ్రాయేలు ప్రజలు హతులై పడివున్నారు,+

అంతేకాదు, భూమ్మీది ప్రజలందరూ బబులోనులో హతులై పడివున్నారు.

50 ఖడ్గాన్ని తప్పించుకున్న వాళ్లారా, నిలబడకండి, పారిపోండి!+

దూరం నుండి యెహోవాను జ్ఞాపకం చేసుకోండి,

మీ హృదయాల్లో యెరూషలేమును తలచుకోండి.”+

51 “మేము నిందల్ని విన్నాం, అందుకే సిగ్గుపడుతున్నాం.

అవమానం మా ముఖాల్ని కప్పేసింది.

ఎందుకంటే, పరదేశులు* యెహోవా మందిర పవిత్ర స్థలాల మీదికి వచ్చారు.”+

52 “కాబట్టి ఇదిగో! నేను ఆమె చెక్కుడు విగ్రహాల మీదికి దృష్టి మళ్లించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

“ఆమె దేశమంతటా గాయపడినవాళ్లు మూల్గుతారు.”+

53 “బబులోను ఆకాశానికి ఎక్కిపోయినా,+

తన ఎత్తైన కోటల్ని పటిష్ఠం చేసుకున్నా,

నేను ఆమెను నాశనం చేసేవాళ్లను పంపిస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.

54 “ఇదిగో! బబులోను నుండి ఆర్తనాదాలు,+

కల్దీయుల దేశం నుండి గొప్ప నాశన ధ్వని వినిపిస్తున్నాయి.+

55 ఎందుకంటే యెహోవా బబులోనును నాశనం చేస్తున్నాడు,

ఆయన ఆమె గొప్ప స్వరాన్ని అణచివేస్తాడు,

ఆమె శత్రువులు చేసే శబ్దం సముద్ర తరంగాల ఘోషలా ఉంటుంది.

వాళ్ల స్వరం వినిపిస్తుంది.

56 ఎందుకంటే నాశనం చేసేవాడు బబులోను మీదికి వస్తాడు;+

ఆమె యోధులు పట్టబడతారు,+

వాళ్ల బాణాలు విరగ్గొట్టబడతాయి,

ఎందుకంటే యెహోవా ప్రతీకారం చేసే దేవుడు.+

ఆయన తప్పకుండా తిరిగి చెల్లిస్తాడు.+

57 నేను ఆమె అధిపతులకు, జ్ఞానులకు,

ఆమె పాలకులకు, ఉప పాలకులకు, యోధులకు మత్తెక్కేదాకా తాగిస్తాను,+

వాళ్లు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు,

మళ్లీ లేవరు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అనే పేరున్న రాజు ప్రకటిస్తున్నాడు.

58 సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు:

“బబులోను ప్రాకారం వెడల్పుగానే ఉన్నా అది పూర్తిగా నేలమట్టం అవుతుంది,+

దాని ద్వారాలు ఎత్తైనవే అయినా అవి కాల్చేయబడతాయి.

దేశదేశాల ప్రజలు వ్యర్థంగా కష్టపడతారు;

దేశాల ప్రయాస అంతా మంటలపాలు అవుతుంది.”+

59 ఇది యిర్మీయా ప్రవక్త మహసేయా మనవడూ నేరీయా+ కుమారుడూ అయిన శెరాయాకు ఆజ్ఞాపించిన సందేశం. యూదా రాజైన సిద్కియా పరిపాలన నాలుగో సంవత్సరంలో అతను సిద్కియాతోపాటు బబులోనుకు వెళ్లినప్పుడు అలా ఆజ్ఞాపించాడు; ఈ శెరాయా రాజుకు సంబంధించిన వాటిమీద అధికారిగా ఉండేవాడు. 60 బబులోను మీదికి రాబోయే విపత్తు అంతటి గురించి, బబులోనుకు వ్యతిరేకంగా రాయబడిన ఈ మాటలన్నిటినీ యిర్మీయా ఒక పుస్తకంలో రాశాడు. 61 అంతేకాదు, యిర్మీయా శెరాయాకు ఇలా చెప్పాడు: “నువ్వు బబులోనుకు వెళ్లి ఆ నగరాన్ని చూసినప్పుడు, ఈ మాటలన్నిటినీ బిగ్గరగా చదవాలి. 62 తర్వాత ఇలా అనాలి, ‘యెహోవా, ఈ స్థలం నాశనమౌతుందని, మనుషులు గానీ జంతువులు గానీ నివసించని నిర్జన ప్రదేశంగా తయారై ఎప్పటికీ అలాగే ఉంటుందని నువ్వు చెప్పావు.’+ 63 నువ్వు ఈ పుస్తకాన్ని చదవడం పూర్తైన తర్వాత, దానికి ఒక రాయి కట్టి యూఫ్రటీసు నది మధ్యలోకి విసిరేయి. 64 తర్వాత ఇలా అను: ‘నేను బబులోను మీదికి తీసుకొచ్చే విపత్తును బట్టి అది ఇలాగే మునిగిపోతుంది, ఇంకెప్పుడూ లేవదు;+ దాని నివాసులు అలసిపోతారు.’ ”+

ఇక్కడి వరకు యిర్మీయా మాటలు.

52 సిద్కియా+ రాజైనప్పుడు అతని వయసు 21 ఏళ్లు, అతను యెరూషలేములో 11 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు,+ ఆమె లిబ్నాకు చెందిన యిర్మీయా కూతురు. 2 అతను యెహోయాకీములాగే యెహోవా దృష్టిలో చెడ్డపనులు చేస్తూ వచ్చాడు.+ 3 యెహోవా కోపం వల్లే యెరూషలేములో, యూదాలో ఇవన్నీ జరిగాయి. చివరికి ఆయన వాటిని తన ఎదుట నుండి వెళ్లగొట్టాడు.+ సిద్కియా బబులోను రాజుకు ఎదురుతిరిగాడు.+ 4 సిద్కియా పరిపాలనలోని తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున, బబులోను రాజు నెబుకద్నెజరు* తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చాడు. వాళ్లు దానికి ఎదురుగా మకాం వేసి, దాని చుట్టూ ముట్టడిదిబ్బ కట్టారు.+ 5 రాజైన సిద్కియా పరిపాలనలోని 11వ సంవత్సరం వరకు నగరం ముట్టడి కింద ఉంది.

6 నాలుగో నెల తొమ్మిదో రోజున+ నగరంలో కరువు తీవ్రమైంది. దేశ ప్రజలకు ఆహారం లేకుండా పోయింది.+ 7 చివరికి నగర ప్రాకారం పడగొట్టబడింది; కల్దీయులు నగరాన్ని చుట్టుముడుతుండగా, రాత్రిపూట సైనికులందరూ రాజు తోట దగ్గర రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పారిపోయారు; వాళ్లు అరాబా మార్గంలో ముందుకు సాగారు.+ 8 కానీ కల్దీయుల సైన్యం సిద్కియా రాజును తరిమి యెరికో ఎడారి మైదానాల్లో అతన్ని పట్టుకుంది,+ దాంతో అతని సైన్యాలన్నీ అతని దగ్గర నుండి చెదిరిపోయాయి. 9 వాళ్లు సిద్కియా రాజును పట్టుకుని హమాతు దేశంలో రిబ్లా దగ్గరున్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. బబులోను రాజు అతనికి శిక్ష విధించాడు. 10 బబులోను రాజు అక్కడే రిబ్లా దగ్గర సిద్కియా కళ్లముందు అతని కుమారుల్ని చంపించాడు; అలాగే యూదా అధిపతులందర్నీ చంపించాడు. 11 తర్వాత బబులోను రాజు సిద్కియాను గుడ్డివాణ్ణి చేసి,+ అతన్ని రాగి సంకెళ్లతో బంధించి బబులోనుకు తీసుకొచ్చాడు; సిద్కియా చనిపోయే రోజు వరకు అతన్ని చెరసాలలోనే ఉంచాడు.

12 ఐదో నెల పదో రోజున, అంటే బబులోను రాజైన నెబుకద్నెజరు* పరిపాలన 19వ సంవత్సరంలో, రాజ సంరక్షకుల అధిపతీ బబులోను రాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేములోకి వచ్చాడు.+ 13 అతను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని, యెరూషలేములోని ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు;+ అంతేకాదు అతను పెద్దపెద్ద ఇళ్లన్నిటినీ తగలబెట్టాడు. 14 రాజ సంరక్షకుల అధిపతితో ఉన్న కల్దీయుల సైన్యమంతా యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాల్ని పడగొట్టింది.+

15 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను కొంతమంది పేదవాళ్లను, ఆ నగరంలో మిగిలిన ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లాడు. అలాగే అతను బబులోను రాజు దగ్గరికి చేరినవాళ్లను, నైపుణ్యంగల మిగతా చేతిపనివాళ్లను కూడా తీసుకెళ్లాడు.+ 16 అయితే రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను కొంతమంది నిరుపేదల్ని దేశంలో ఉండనిచ్చి, వాళ్లను ద్రాక్షతోటల్లో పనికి పెట్టాడు, వాళ్లతో వెట్టిచాకిరి చేయించాడు.+

17 కల్దీయులు యెహోవా మందిరంలో ఉన్న రాగి స్తంభాల్ని, యెహోవా మందిరంలో ఉన్న బండ్లను,+ రాగి సముద్రాన్ని+ ముక్కలుముక్కలు చేసి+ ఆ రాగినంతా బబులోనుకు తీసుకెళ్లారు.+ 18 అంతేకాదు, ఆలయ సేవ కోసం ఉపయోగించే బాల్చీల్ని, పారల్ని, ఒత్తులు కత్తిరించే కత్తెరల్ని, పాత్రల్ని,+ గిన్నెల్ని,+ రాగి పాత్రలన్నిటినీ తీసుకెళ్లారు. 19 రాజ సంరక్షకుల అధిపతి మేలిమి బంగారంతో, వెండితో చేయబడిన పళ్లేల్ని,+ నిప్పు పాత్రల్ని, పాత్రల్ని, బాల్చీల్ని, దీపస్తంభాల్ని,+ గిన్నెల్ని, అర్పణల కోసం ఉపయోగించే పాత్రల్ని తీసుకెళ్లాడు.+ 20 యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, సముద్రం, సముద్రం కింద ఉన్న 12 రాగి ఎద్దులు,+ బండ్ల విషయానికొస్తే, వాటన్నిటి రాగి బరువు ఎంతో తూచడం సాధ్యం కాదు.

21 స్తంభాల విషయానికొస్తే, ఒక్కో స్తంభం ఎత్తు 18 మూరలు.* దాని చుట్టుకొలత 12 మూరలు;+ దాని మందం బెత్తెడు;* అది లోపల ఖాళీగా ఉండేది. 22 దాని మీద ఉండే స్తంభ శీర్షం రాగిది; శీర్షం ఎత్తు ఐదు మూరలు.+ శీర్షం చుట్టూ ఉన్న అల్లిక, దానిమ్మ పండ్లు రాగితో చేసినవి. రెండో స్తంభం, దాని దానిమ్మ పండ్లు అచ్చం మొదటిదానిలాగే ఉండేవి. 23 దాని పక్కలకు 96 దానిమ్మ పండ్లు ఉండేవి; మొత్తం, అల్లిక చుట్టూ 100 దానిమ్మ పండ్లు ఉండేవి.+

24 రాజ సంరక్షకుల అధిపతి ముఖ్య యాజకుడైన శెరాయాను,+ రెండో యాజకుడైన జెఫన్యాను,+ ముగ్గురు ద్వారపాలకుల్ని కూడా తీసుకెళ్లాడు.+ 25 అతను సైనికుల మీద అధికారిగా ఉన్న ఆస్థాన అధికారినీ, నగరంలో ఉన్న ఏడుగురు రాజు సలహాదారుల్నీ, ప్రజల్ని సైన్యంలో చేర్చే సైన్యాధిపతి కార్యదర్శినీ, నగరంలో కనిపించిన 60 మంది సామాన్య ప్రజల్నీ తీసుకెళ్లాడు. 26 రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను వాళ్లను రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. 27 బబులోను రాజు, హమాతు దేశంలో ఉన్న రిబ్లాలో వాళ్లను చంపించాడు.+ అలా యూదావాళ్లు తమ దేశంలో నుండి చెరలోకి వెళ్లారు.+

28 నెబుకద్నెజరు* బందీలుగా తీసుకెళ్లిన ప్రజలు వీళ్లు: అతని పరిపాలన ఏడో సంవత్సరంలో 3,023 మంది యూదులు తీసుకెళ్లబడ్డారు.+

29 నెబుకద్నెజరు* పరిపాలన 18వ సంవత్సరంలో,+ యెరూషలేము నుండి 832 మంది తీసుకెళ్లబడ్డారు.

30 నెబుకద్నెజరు* పరిపాలన 23వ సంవత్సరంలో, రాజ సంరక్షకుల అధిపతైన నెబూజరదాను 745 మంది యూదుల్ని బందీలుగా తీసుకెళ్లాడు.+

మొత్తం 4,600 మంది బందీలుగా తీసుకెళ్లబడ్డారు.

31 యూదా రాజైన యెహోయాకీను+ బందీగా వెళ్లిన 37వ సంవత్సరం, 12వ నెల, 25వ రోజున, అంటే బబులోను రాజు ఎవీల్మెరోదకు తాను రాజైన సంవత్సరంలో, యూదా రాజైన యెహోయాకీనును విడుదల చేసి చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు.+ 32 అతను యెహోయాకీనుతో దయగా మాట్లాడి, బబులోనులో తన దగ్గరున్న ఇతర రాజుల సింహాసనాల కన్నా అతనికి ఉన్నతమైన సింహాసనాన్ని ఇచ్చాడు. 33 కాబట్టి యెహోయాకీను తన ఖైదీ వస్త్రాల్ని తీసేసి, తాను బ్రతికున్నంత కాలం రాజు బల్ల దగ్గర భోజనం చేస్తూ వచ్చాడు. 34 యెహోయాకీను చనిపోయే రోజు వరకు, అతను బ్రతికున్నంత కాలం ప్రతీరోజు బబులోను రాజు అతనికి ఆహారం ఇస్తూ వచ్చాడు.

బహుశా “యెహోవా హెచ్చిస్తాడు” అనే అర్థం ఉండవచ్చు.

లేదా “నిన్ను ఎంచుకున్నాను.”

లేదా “పవిత్రపర్చాను.”

అక్ష., “మెలకువగా ఉండేదాని.”

లేదా “వెడల్పాటి మూతిగల వంటపాత్ర.”

అంటే, దక్షిణం వైపుకు.

మూలభాష పదం ధూపం వేయడాన్ని కూడా సూచించవచ్చు.

లేదా “విశ్వసనీయ ప్రేమ.”

పదకోశం చూడండి.

లేదా “ఈజిప్టు.”

లేదా “ద్వీపాలకు.”

బహుశా రాతిలో నుండి కావచ్చు.

లేదా “మెంఫిస్‌.”

అంటే, నైలు నది శాఖ.

అంటే, యూఫ్రటీసు.

లేదా “చాకలి సోడాతో.”

లేదా “వేరే దేవుళ్లతో.”

లేదా “దేశదిమ్మరిలా.”

కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.

అక్ష., “భార్య నుదురు నీకు ఉంది.”

లేదా “వేరే దేవుళ్లతో.”

అక్ష., “కుమారులారా.”

లేదా “భర్తను” అయ్యుంటుంది.

అక్ష., “హృదయం.”

లేదా “నిబంధన.”

లేదా “పెద్దపెట్టె.”

అక్ష., “అది హృదయంలోకి రాదు.”

అక్ష., “కుమారులారా.”

లేదా “అవమానకరమైన.”

అంటే, యెహోవా.

అక్ష., “కొమ్ము.”

లేదా “ధ్వజస్తంభం.”

బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.

అక్ష., “నా పేగులు.”

లేదా “యుద్ధకేక శబ్దం” అయ్యుంటుంది.

లేదా “ధ్వజస్తంభాన్ని.”

లేదా “విచారపడను.”

అక్ష., “వాళ్లు బలహీనపడలేదు.”

లేదా “ఆయన ఉనికిలోనే లేడు” అయ్యుంటుంది.

అక్ష., “హృదయం.”

తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.

కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.

అక్ష., “కుమారులారా.”

అక్ష., “కొమ్ము.”

లేదా “చెవులు సున్నతి పొందలేదు.”

లేదా “ఉపదేశాన్ని.”

అంటే, యిర్మీయా.

అక్ష., “అవి,” ఈ పదం ఆలయ భవన సముదాయంలోని భవనాలన్నిటినీ సూచిస్తుంది.

లేదా “తండ్రిలేని పిల్లల్ని.”

లేదా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు.”

అక్ష., “పెందలకడే లేచి.”

మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.

లేదా “కోపం తెప్పిస్తున్నారా; రెచ్చగొడుతున్నారా.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.

అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.

అక్ష., “ఆకాశ సైన్యమంతటి.”

లేదా “కొంగ” అయ్యుంటుంది.

లేదా “ఉపదేశం.”

లేదా “కార్యదర్శుల.”

లేదా “ఉపశమనాన్ని ఇచ్చే లేపనం.”

లేదా “ఉపదేశాన్ని.”

పదకోశం చూడండి.

అంటే, పెద్దవంపు కత్తి.

11వ వచనం మొదట్లో అరామిక్‌లో రాయబడింది.

లేదా “ఆవిర్లు.”

లేదా “ప్రవాహ ద్వారాల్ని” అయ్యుంటుంది.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

అక్ష., “వంతు.”

యిర్మీయాతో అంటున్నాడని తెలుస్తోంది.

లేదా “అలాగే జరగాలి.”

అక్ష., “పెందలకడే లేచి.”

లేదా “అవమానకరమైన.”

అంటే, యిర్మీయా.

అంటే, ఆలయంలో అర్పించే బలులతో.

లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”

లేదా “లోతైన భావోద్వేగాలు.” అక్ష., “మూత్రపిండాలు.”

లేదా “మచ్చలు గల.”

లేదా “దుఃఖిస్తోంది” అయ్యుంటుంది.

లేదా “అరిగిపోయిన దారుల.”

లేదా “ముట్టడి వేయబడ్డాయి.”

బహుశా యెరూషలేము కావచ్చు.

లేదా “ఇతియోపీయుడు.”

లేదా “అవమానకరమైన.”

లేదా “నీటి మడుగుల.”

లేదా “నాలుగు రకాల తీర్పును” అయ్యుంటుంది. అక్ష., “నాలుగు జాతుల్ని.”

లేదా “వెనక్కి నడుస్తూ” అయ్యుంటుంది.

లేదా “విచారపడుతున్నాను.”

లేదా “దానికి” అయ్యుంటుంది.

యూదాను సూచిస్తుందని తెలుస్తోంది.

లేదా “తీర్పు సందేశంతో.”

లేదా “ప్రతినిధివి.”

ఇవి మతభ్రష్ట ఇశ్రాయేలులో దుఃఖిస్తున్నప్పుడు పాటించిన అన్యమత ఆచారాలని తెలుస్తోంది.

అక్ష., “అబద్ధాన్ని.”

పదకోశం చూడండి.

లేదా “నా కోపంలో మీరు అగ్నిలా రాజేయబడ్డారు” అయ్యుంటుంది.

లేదా “ఉప్పు.”

లేదా “సంతోషంగా ఉంటాడు.”

లేదా “బాగు చేయలేనిది” అయ్యుంటుంది.

లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”

లేదా “అన్యాయంగా.”

అక్ష., “నాకు.” యెహోవాను సూచిస్తుందని తెలుస్తోంది.

లేదా “రెండుసార్లు.”

లేదా “సబ్బాతు రోజున.”

లేదా “దక్షిణం.”

లేదా “చక్రం.”

లేదా “సరైనదని.”

లేదా “విచారపడతాను.”

లేదా “విచారపడతాను.”

లేదా “కట్టబడని.”

లేదా “ఉపదేశం.”

అక్ష., “నాలుకతో అతన్ని కొడదాం.”

అక్ష., “హిన్నోము కుమారుడి.”

అక్ష., “హిన్నోము కుమారుడి.”

“అంతటా భయం” అని అర్థం.

లేదా “లోతైన భావోద్వేగాల్ని.” అక్ష., “మూత్రపిండాల్ని.”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “అద్భుతమైన పని.”

లేదా “వాళ్లను” అయ్యుంటుంది.

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “ప్రాణాలతో తప్పించుకుంటారు.”

లేదా “తండ్రిలేని పిల్లవాడికి.”

అక్ష., “ప్రతిష్ఠిస్తాను.”

యెహోయాహాజు అని కూడా పిలవబడ్డాడు.

అక్ష., “నా సహోదరీ!”

యెహోయాకీను, యెకొన్యా అని కూడా పిలవబడ్డాడు.

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “భూమీ.”

లేదా “కాసే.”

లేదా “వారసుణ్ణి.”

లేదా “మతభ్రష్టులయ్యారు.”

అక్ష., “చేతుల్ని బలపరుస్తున్నారు.”

లేదా “వ్యర్థమైన ఆశలతో నింపుతున్నారు.”

లేదా “భారమైన సందేశం.” మూలభాష పదానికి రెండు అర్థాలున్నాయి: “బరువైన దైవిక సందేశం” లేదా “ఏదైనా భారమైనది.”

లేదా “భారమైన సందేశం.”

లేదా “భారమైన సందేశం.”

లేదా “భారమైన సందేశం.”

లేదా “భారమైన సందేశం.”

లేదా “భారమైన సందేశం.”

లేదా “భారమైన సందేశం.”

అక్ష., “నెబుకద్రెజరు.”

యెహోయాకీను, కొన్యా అని కూడా పిలవబడ్డాడు.

లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లను” అయ్యుంటుంది.

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “ప్రజలందరికి.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “నెబుకద్రెజరును.”

లేదా “శిక్షిస్తాను.”

బాబెలుకు (బబులోనుకు) రహస్య పేరు అని అనిపిస్తుంది.

లేదా “వంగి నమస్కరించడానికి.”

లేదా “ప్రజలందరికి.”

లేదా “విచారపడతాను.”

లేదా “ఉపదేశాన్ని.”

అక్ష., “పెందలకడే లేచి.”

లేదా “విచారపడతాడు.”

లేదా “ఆలయ.”

లేదా “విచారపడలేదా?”

అక్ష., “నా దృష్టికి సరైనదని అనిపించిన.”

అంటే, ఆలయానికి చెందిన రాగి సముద్రం.

లేదా “అలాగే జరగాలి!”

లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లు” అయ్యుంటుంది.

లేదా “చితికిపోయిన” అయ్యుంటుంది.

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “నడుము.”

లేదా “వాళ్లను.”

లేదా “నిన్ను సరిదిద్దుతాను.”

లేదా “గౌరవించబడేలా” అయ్యుంటుంది.

లేదా “నీ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉన్నాను.”

లేదా “కన్యా.”

అంటే, గిలకల తప్పెట.

లేదా “నవ్వేవాళ్లతో కలిసి.”

లేదా “కేకలు వేయండి.”

లేదా “వాగుల.”

లేదా “తిరిగి తెచ్చుకుంటాడు.”

లేదా “ఇచ్చే మంచివాటిని.”

లేదా “పిల్లల.”

లేదా “కన్యా.”

లేదా “భర్తను” అయ్యుంటుంది.

లేదా “శాసనాల్ని.”

లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.

అక్ష., “నెబుకద్రెజరు.”

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “ఉద్దేశాలు.”

అక్ష., “పేరును.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “హిన్నోము కుమారుడి.” పదకోశంలో “గెహెన్నా” చూడండి.

అక్ష., “అగ్ని గుండా దాటించారు.”

పదకోశం చూడండి.

లేదా “మంచితనమంతా వాళ్లమీద చూపిస్తాను.”

లేదా “వారసుణ్ణి.”

అక్ష., “విత్తనాన్ని.”

లేదా “శాసనాల్ని.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.

అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “పెందలకడే లేచి.”

అక్ష., “యోనాదాబు.” ఇది యెహోనాదాబుకు సంక్షిప్త రూపం.

లేదా “భోజనాల గదిలో.”

లేదా “నకలు రాసే వ్యక్తి.”

లేదా “ఆస్థాన అధికారులు.”

నవంబరు మధ్య నుండి డిసెంబరు మధ్య వరకు. అనుబంధం B15 చూడండి.

యెహోయాకీను, యెకొన్యా అని కూడా పిలవబడ్డాడు.

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “దగ్గరికి వెళ్లే.”

లేదా “ప్రాణాలతో తప్పించుకుంటారు.”

అక్ష., “నపుంసకుడూ.” పదకోశం చూడండి.

అక్ష., “దగ్గరికి వెళ్తే.”

అక్ష., “దగ్గరికి వెళ్లకపోతే.”

అక్ష., “స్వరానికి.”

అక్ష., “దగ్గరికి వెళ్లడానికి.”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా హీబ్రూ ప్రతుల్లో పదాల్ని ఇంకో విధంగా విడగొడితే, “నేర్గల్‌-షరేజరు, సమ్గర్‌-నెబో, శర్సెకీము, రబ్సారీసు.”

లేదా “ముఖ్య ఇంద్రజాలకుడు (జ్యోతిష్యుడు).”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “వెట్టిచాకిరిలో” అయ్యుంటుంది.

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “ముఖ్య ఆస్థాన అధికారి.”

లేదా “ముఖ్య ఇంద్రజాలకుడు (జ్యోతిష్యుడు).”

లేదా “ప్రాణాలతో తప్పించుకుంటావు.”

అక్ష., “రాజ్య విత్తనానికి.”

లేదా “పెద్ద చెరువు” అయ్యుంటుంది.

లేదా “దుఃఖపడతాను.”

అక్ష., “కొమ్ము.”

లేదా “కొంతకాలం నివసించడానికి.”

అక్ష., “నెబుకద్రెజరును.”

లేదా “సురక్షితంగా.”

లేదా “సూర్య దేవాలయం,” అంటే హీలియోపొలిస్‌.

లేదా “స్తూపాల్ని.”

లేదా “మెంఫిస్‌లో.”

అక్ష., “పెందలకడే లేచి.”

మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.

మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.

మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.

మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు పూజించిన ఒక దేవత బిరుదు; సంతాన సాఫల్య దేవత కావచ్చు.

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “గొప్పవాటి కోసం ఎదురుచూస్తున్నావు.”

లేదా “నిన్ను ప్రాణాలతో తప్పించుకోనిస్తాను.”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “కేడెములను.” ఎక్కువగా విలుకాండ్రు వీటిని తీసుకెళ్లేవాళ్లు.

ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.

అంటే, హెల్మెట్‌.

లేదా “వధ.”

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “మెంఫిస్‌లో.”

అక్ష., “నియమిత సమయం.”

అంటే, ఐగుప్తును జయించేవాడు.

లేదా “మెంఫిస్‌.”

లేదా “పాడుబడ్డ భూమి అవుతుంది” అయ్యుంటుంది.

అంటే, థీబ్స్‌.

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “విత్తనాన్ని.”

లేదా “నిన్ను సరిదిద్దుతాను.”

అంటే, క్రేతు.

అంటే, వాళ్లు దుఃఖంతో, అవమానంతో గుండు చేసుకుంటారు.

లేదా “ఎత్తైన స్థలం.”

అంటే, జూనిపర్‌ చెట్టు.

లేదా “పీఠభూమి.”

లేదా “ఎండిన నేలమీద” అయ్యుంటుంది.

లేదా “పీఠభూమి.”

లేదా “బలం.”

అంటే, అంత్యక్రియల సమయంలో ఏడుస్తూ ఊదే ఫ్లూటు.

లేదా “అల్లకల్లోలంగా ఉంది.”

అంటే, అంత్యక్రియల సమయంలో ఏడుస్తూ ఊదే ఫ్లూటు.

లేదా “అల్లకల్లోలంగా ఉంది.”

లేదా “యుద్ధకేక” అయ్యుంటుంది.

లేదా “గొర్రెల దొడ్ల.”

లేదా “ఆలోచనను.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “ప్రతీ గాలికి.”

అక్ష., “ఆరంభాన్ని.”

లేదా “ధ్వజస్తంభం.”

ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.

అక్ష., “నెబుకద్రెజరు.”

లేదా “కోడెదూడలన్నిటినీ.”

లేదా “అబద్ధ ప్రవక్తలకు.”

లేదా “ఆలోచనను.”

కల్దీయకు రహస్య పేరు అని అనిపిస్తుంది.

అంటే, కల్దీయుల దేశం.

లేదా “అంబులపొదుల్ని నింపుకోండి” అయ్యుంటుంది.

లేదా “ధ్వజస్తంభం.”

లేదా “ఆవిర్లు.”

లేదా “ప్రవాహ ద్వారాల్ని” అయ్యుంటుంది.

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

అక్ష., “వంతు.”

లేదా “ధ్వజస్తంభం.”

అక్ష., “కొమ్ము.”

అక్ష., “ప్రతిష్ఠించండి.”

అక్ష., “ప్రతిష్ఠించండి.”

లేదా “పపైరస్‌.”

పదకోశం చూడండి.

అక్ష., “నెబుకద్రెజరు.”

బాబెలుకు (బబులోనుకు) రహస్య పేరు అని అనిపిస్తుంది.

లేదా “అపరిచితులు.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

దాదాపు 7.4 సెంటీమీటర్లు (2.9 అంగుళాలు). అక్ష., “4 వేలి వెడల్పులు.” అనుబంధం B14 చూడండి.

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “నెబుకద్రెజరు.”

అక్ష., “నెబుకద్రెజరు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి