కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt ఆదికాండము 1:1-50:26
  • ఆదికాండం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆదికాండం
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ఆదికాండం

ఆదికాండం

1 మొదట్లో దేవుడు ఆకాశాన్ని,* భూమిని సృష్టించాడు.+

2 భూమి ఖాళీగా, పనికిరాకుండా ఉండేది; చీకటి అగాధ జలాల్ని*+ కమ్ముకొని ఉండేది; దేవుని చురుకైన శక్తి*+ నీళ్ల మీద+ అటూఇటూ కదులుతూ ఉండేది.

3 దేవుడు, “వెలుగు కలగాలి” అన్నాడు. అప్పుడు వెలుగు కలిగింది.+ 4 ఆ తర్వాత, దేవుడు వెలుగును చూసినప్పుడు అది బాగుంది. దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు. 5 దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి+ అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మొదటి రోజు.

6 తర్వాత దేవుడు, “జలాల మధ్య విశాలం+ ఏర్పడాలి; ఆ జలాలు, ఈ జలాలు వేరవ్వాలి” అన్నాడు.+ 7 ఆ తర్వాత దేవుడు విశాలాన్ని చేసి, దానికి కింద ఉన్న జలాల్ని దానికి పైనున్న జలాల నుండి వేరు చేయడం మొదలుపెట్టాడు.+ అది అలాగే జరిగింది. 8 దేవుడు ఆ విశాలాన్ని ఆకాశం అని పిలిచాడు. సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది రెండో రోజు.

9 తర్వాత దేవుడు, “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకచోటికి చేరాలి, ఆరిన నేల కనిపించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 10 దేవుడు ఆరిన నేలను భూమి అని,+ ఒకచోటికి చేరిన జలాల్ని సముద్రాలు అని పిలిచాడు.+ దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది.+ 11 తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని, చెట్లను మొలిపించాలి. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇస్తాయి” అన్నాడు. అది అలాగే జరిగింది. 12 అప్పుడు భూమి వాటివాటి జాతుల ప్రకారం గడ్డిని, మొక్కల్ని,+ చెట్లను మొలిపించడం మొదలుపెట్టింది. మొక్కలు విత్తనాల్ని, చెట్లు విత్తనాలున్న పండ్లను ఇచ్చాయి. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 13 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది మూడో రోజు.

14 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “పగటిని, రాత్రిని వేరు చేయడానికి+ ఆకాశ విశాలంలో జ్యోతులు+ కలగాలి; అవి కాలాల్ని, రోజుల్ని, సంవత్సరాల్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి.+ 15 భూమ్మీద ప్రకాశించడానికి అవి ఆకాశ విశాలంలో జ్యోతులుగా ఉంటాయి.” అది అలాగే జరిగింది. 16 దేవుడు రెండు గొప్ప జ్యోతుల్ని చేశాడు. వాటిలో పెద్ద జ్యోతినేమో పగటిని ఏలడానికి,+ చిన్న జ్యోతినేమో రాత్రిని ఏలడానికి చేశాడు, అలాగే నక్షత్రాల్ని కూడా చేశాడు.+ 17 అవి భూమ్మీద ప్రకాశించడానికి దేవుడు వాటిని ఆకాశ విశాలంలో పెట్టాడు; 18 అంతేకాదు పగటినీ రాత్రినీ ఏలడానికి, వెలుగునూ చీకటినీ వేరు చేయడానికి+ దేవుడు వాటిని అలా పెట్టాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 19 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది నాలుగో రోజు.

20 తర్వాత దేవుడు, “జలాలు జలచరాలతో* నిండిపోవాలి; ఎగిరే ప్రాణులు భూమికి పైన ఆకాశ విశాలంలో ఎగరాలి” అన్నాడు.+ 21 దేవుడు గొప్ప సముద్ర జీవుల్ని, నీళ్లలో కదిలే ప్రాణుల్ని, అలాగే నీళ్లలో గుంపులుగుంపులుగా తిరిగే ప్రాణుల్ని వాటివాటి జాతుల ప్రకారం సృష్టించాడు; అలాగే రెక్కలతో ఎగిరే ప్రతీ ప్రాణిని దానిదాని జాతి ప్రకారం సృష్టించాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది. 22 ఇక అప్పుడు దేవుడు వాటిని ఇలా దీవించాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువయ్యి, సముద్ర జలాల్ని నింపండి;+ భూమ్మీద ఎగిరే ప్రాణుల సంఖ్య పెరగాలి.” 23 సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఐదో రోజు.

24 తర్వాత దేవుడు, “భూమి వాటివాటి జాతుల ప్రకారం జీవుల్ని పుట్టించాలి; సాధు జంతువుల్ని, పాకే జంతువుల్ని,* అడవి జంతువుల్ని వాటివాటి జాతుల ప్రకారం పుట్టించాలి” అన్నాడు.+ అది అలాగే జరిగింది. 25 దేవుడు వాటివాటి జాతుల ప్రకారం అడవి జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం సాధు జంతువుల్ని, వాటివాటి జాతుల ప్రకారం పాకే జంతువులన్నిటినీ చేశాడు. దేవుడు దాన్ని చూసినప్పుడు అది బాగుంది.

26 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “మన+ స్వరూపంలో,+ మనలా+ మనిషిని తయారుచేద్దాం. వాళ్లు సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, సాధు జంతువుల్ని, భూమినంతటినీ, అలాగే భూమ్మీద కదిలే ప్రతీ పాకే జంతువును ఏలాలి.”+ 27 దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు, దేవుని స్వరూపంలో అతన్ని సృష్టించాడు; పురుషునిగా, స్త్రీగా వాళ్లను సృష్టించాడు.+ 28 అంతేకాదు దేవుడు వాళ్లను దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి,+ దాన్ని లోబర్చుకోండి;+ సముద్రంలోని చేపల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని, భూమ్మీద కదిలే ప్రతీ జీవిని ఏలండి.”+

29 తర్వాత దేవుడు ఇలా అన్నాడు: “భూమంతటా ఉన్న విత్తనాలుగల ప్రతీ మొక్కను, విత్తనాలుగల పండ్లున్న ప్రతీ చెట్టును నేను మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారంగా ఉంటాయి.+ 30 భూమ్మీదున్న ప్రతీ అడవి జంతువుకు, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణికి, భూమ్మీద జీవంతో కదిలే ప్రతీదానికి పచ్చని మొక్కలన్నిటినీ నేను ఆహారంగా ఇచ్చాను.”+ అది అలాగే జరిగింది.

31 ఆ తర్వాత దేవుడు తాను చేసిన ప్రతీదాన్ని చూసినప్పుడు, ఇదిగో! అది చాలా బాగుంది.+ సాయంకాలమైంది, ఉదయమైంది; ఇది ఆరో రోజు.

2 అలా ఆకాశాన్ని, భూమిని, వాటిలోని సమస్తాన్ని* చేయడం పూర్తయింది.+ 2 ఏడో రోజుకల్లా, దేవుడు అప్పటివరకు తాను చేస్తూ వచ్చిన పనిని పూర్తిచేశాడు; తాను అప్పటివరకు చేస్తూ వచ్చిన పని నుండి ఆయన ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ 3 దేవుడు ఏడో రోజును దీవించి, దాన్ని పవిత్రమైనదిగా ప్రకటించాడు; ఎందుకంటే, అప్పటివరకు తన ఉద్దేశం ప్రకారం చేసిన సృష్టి పనులన్నిటి నుండి దేవుడు ఆ రోజున విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.

4 భూమ్యాకాశాలు సృష్టించబడినప్పుడు, యెహోవా* దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన+ రోజున* వాటి చరిత్ర ఇది.

5 అప్పటికి భూమ్మీద ఏ పొదలూ లేవు, మొక్కలు మొలవడం ఇంకా మొదలవ్వలేదు. ఎందుకంటే యెహోవా దేవుడు అప్పటికింకా భూమ్మీద వర్షాన్ని కురిపించలేదు, నేలను సాగుచేయడానికి ఏ మనిషీ లేడు. 6 అయితే భూమ్మీది నుండి ఆవిరి పైకి లేచి, నేల అంతటినీ తడిపేది.

7 యెహోవా దేవుడు నేల మట్టితో మనిషిని చేసి,+ అతని ముక్కు రంధ్రాల్లో జీవ వాయువును* ఊదాడు;+ అప్పుడు మనిషి జీవించే వ్యక్తి* అయ్యాడు.+ 8 అంతేకాదు, యెహోవా దేవుడు తూర్పున ఏదెనులో ఒక తోట+ వేసి, తాను తయారుచేసిన మనిషిని+ అక్కడ ఉంచాడు. 9 అలా, చూడడానికి చక్కగా, తినడానికి మంచిగా ఉండే ప్రతీ చెట్టును యెహోవా దేవుడు మొలిపించాడు; అంతేకాదు ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని,+ అలాగే మంచిచెడుల తెలివినిచ్చే* చెట్టును+ మొలిపించాడు.

10 ఆ తోటను తడపడానికి ఏదెనులో నుండి ఒక నది ప్రవహించేది. అది అక్కడి నుండి నాలుగు నదులుగా చీలిపోయింది. 11 మొదటి నది పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టూ ప్రవహించేది, అక్కడ బంగారం ఉంది. 12 ఆ దేశపు బంగారం మంచిది. అక్కడ బోళం, సులిమాని రాళ్లు కూడా ఉన్నాయి. 13 రెండో నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టూ ప్రవహించేది. 14 మూడో నది పేరు హిద్దెకెలు;*+ అది అష్షూరుకు+ తూర్పు వైపున ప్రవహించేది; నాలుగో నది యూఫ్రటీసు.+

15 యెహోవా దేవుడు మనిషిని తీసుకుని ఏదెను తోటను సేద్యం చేయడానికి, దాన్ని చూసుకోవడానికి అతన్ని అందులో పెట్టాడు.+ 16 అంతేకాదు యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ తోటలోని ప్రతీ చెట్టు పండ్లను నువ్వు తృప్తిగా తినొచ్చు.+ 17 కానీ, మంచిచెడుల తెలివినిచ్చే* చెట్టు పండ్లను మాత్రం నువ్వు తినకూడదు; ఎందుకంటే దాని పండ్లను తిన్న రోజున నువ్వు ఖచ్చితంగా చనిపోతావు.”+

18 తర్వాత యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “మనిషి ఇలా ఒంటరిగా ఉండడం మంచిదికాదు. నేను అతనికి సాటియైన సహాయకారిని చేస్తాను.”+ 19 అంతకుముందు, యెహోవా దేవుడు నేల నుండి ప్రతీ అడవి జంతువును, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణిని చేసి, వాటిలో ప్రతీదాన్ని మనిషి ఏమని పిలుస్తాడో చూడడానికి వాటిని అతని దగ్గరికి తేవడం మొదలుపెట్టాడు; ప్రతీ ప్రాణిని మనిషి ఏమని పిలిచాడో, అదే దాని పేరు అయింది.+ 20 అలా మనిషి సాధు జంతువులన్నిటికీ, ఆకాశంలో ఎగిరే ప్రాణులకు, ప్రతీ అడవి జంతువుకు పేరు పెట్టాడు. అయితే మనిషికి మాత్రం సాటియైన సహాయకారి ఎవరూ లేరు. 21 కాబట్టి యెహోవా దేవుడు మనిషికి గాఢనిద్ర కలిగించి, అతను నిద్రపోతున్నప్పుడు, అతని పక్కటెముకల్లో ఒక ఎముకను తీసి, ఆ చోటును మాంసంతో పూడ్చేశాడు. 22 యెహోవా దేవుడు ఆ పురుషుని నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా చేసి, ఆమెను అతని దగ్గరికి తీసుకొచ్చాడు.+

23 అప్పుడు పురుషుడు ఇలా అన్నాడు:

“ఇది నిజంగా నా ఎముకల్లో ఎముక,

నా మాంసంలో మాంసం.

ఇది నరుని నుండి తీయబడింది కాబట్టి,

నారి అని పిలవబడుతుంది.”+

24 అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి, తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు,* వాళ్లు ఒక్క శరీరం అవుతారు.+ 25 ఆ పురుషుడు, అతని భార్య ఇద్దరూ నగ్నంగానే ఉన్నారు;+ అయినా వాళ్లకు సిగ్గు అనిపించలేదు.

3 యెహోవా దేవుడు చేసిన అడవి జంతువులన్నిట్లో సర్పం+ అత్యంత యుక్తిగలది.* కాబట్టి అది స్త్రీని, “ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లనూ మీరు తినకూడదని దేవుడు నిజంగా చెప్పాడా?”+ అని అడిగింది. 2 దానికి స్త్రీ ఆ సర్పంతో ఇలా అంది: “మేము ఈ తోటలోని చెట్ల పండ్లను తినొచ్చు.+ 3 కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు+ పండ్ల గురించి దేవుడు, ‘మీరు దాని పండ్లను తినకూడదు, అసలు దాన్ని ముట్టకూడదు; లేకపోతే మీరు చనిపోతారు’ అని చెప్పాడు.” 4 అందుకు సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావనే చావరు.+ 5 మీరు దాని పండ్లను తిన్న రోజునే మీ కళ్లు తెరుచుకుంటాయని, మీకు మంచిచెడులు తెలిసి మీరు దేవునిలా అవుతారని+ దేవునికి తెలుసు.”

6 స్త్రీ ఆ చెట్టు పండ్లను చూసినప్పుడు అవి ఆహారానికి మంచిగా, కంటికి ఇంపుగా ఉన్నాయి; అవును, ఆ చెట్టు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. కాబట్టి, ఆమె దాని పండును తీసుకొని తినడం మొదలుపెట్టింది.+ ఆ తర్వాత ఆమె, తన భర్త తనతో ఉన్నప్పుడు అతనికి కూడా ఇచ్చింది, అతను కూడా దాన్ని తినడం మొదలుపెట్టాడు.+ 7 అప్పుడు వాళ్లిద్దరి కళ్లు తెరుచుకున్నాయి, తాము నగ్నంగా ఉన్నామని వాళ్లకు అర్థమైంది. కాబట్టి వాళ్లు అంజూర చెట్టు ఆకుల్ని కుట్టుకొని తమ నడుము చుట్టూ కట్టుకున్నారు.+

8 తర్వాత, చల్లగాలి వీచే సమయంలో* దేవుడు ఆ తోటలో నడుస్తున్నప్పుడు పురుషుడు, అతని భార్య యెహోవా దేవుని స్వరం విని, యెహోవా దేవునికి* కనిపించకుండా ఉండాలని తోట చెట్ల మధ్య దాక్కున్నారు. 9 యెహోవా దేవుడు అతన్ని పదేపదే పిలుస్తూ, “నువ్వు ఎక్కడ ఉన్నావు?” అని అంటూ ఉన్నాడు. 10 చివరికి అతను, “నేను తోటలో నీ స్వరం విన్నాను, కానీ నేను నగ్నంగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11 అప్పుడు దేవుడు, “నువ్వు నగ్నంగా ఉన్నావని+ నీకు ఎవరు చెప్పారు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన చెట్టు పండ్లను+ నువ్వు తిన్నావా?” అని అడిగాడు. 12 అందుకు పురుషుడు ఇలా అన్నాడు: “నాతోపాటు ఉండడానికి నువ్వు ఇచ్చిన స్త్రీయే ఆ చెట్టు పండును నాకు ఇచ్చింది, కాబట్టి నేను తిన్నాను.” 13 అప్పుడు యెహోవా దేవుడు స్త్రీని, “నువ్వు చేసిన పనేంటి?” అని అడిగాడు. దానికి స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది, అందుకే నేను తిన్నాను”+ అని చెప్పింది.

14 తర్వాత యెహోవా దేవుడు సర్పంతో+ ఇలా అన్నాడు: “నువ్వు ఈ పని చేశావు కాబట్టి, సాధు జంతువులన్నిట్లో, అడవి జంతువులన్నిట్లో నువ్వు శపించబడినదానివి. నువ్వు నీ పొట్టతో పాకుతావు, బ్రతికినన్ని రోజులు మట్టి తింటావు. 15 అంతేకాదు నేను నీకూ+ స్త్రీకీ,+ నీ సంతానానికీ*+ ఆమె సంతానానికీ*+ మధ్య శత్రుత్వం+ పెడతాను. ఆయన నీ తలను చితగ్గొడతాడు,+ నువ్వు ఆయన మడిమె మీద కొడతావు.”+

16 దేవుడు స్త్రీతో ఇలా అన్నాడు: “నీ గర్భవేదనను నేను విపరీతంగా పెంచుతాను; నువ్వు వేదనతోనే పిల్లల్ని కంటావు, నువ్వు నీ భర్త కోసం తపిస్తావు, అతను నీ మీద అధికారం చెలాయిస్తాడు.”

17 దేవుడు ఆదాముతో* ఇలా అన్నాడు: “నువ్వు ఆ చెట్టు పండ్లను తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించినా,+ నువ్వు నీ భార్య మాట విని తిన్నావు కాబట్టి నీ వల్ల నేల శపించబడింది.+ నువ్వు బ్రతికినన్ని రోజులు ఎంతో కష్టపడి దాని పంట తింటావు.+ 18 నేల నీకు ముళ్ల తుప్పల్ని, గచ్చపొదల్ని మొలిపిస్తుంది; నువ్వు పొలంలో పండిన పంటను తినాలి. 19 నువ్వు ఏ నేల నుండైతే తీయబడ్డావో+ ఆ నేలకు తిరిగి చేరేవరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. నువ్వు మట్టే కాబట్టి తిరిగి మట్టికి చేరుతావు.”+

20 ఆ తర్వాత ఆదాము తన భార్యకు హవ్వ* అని పేరు పెట్టాడు. ఎందుకంటే, జీవించే ప్రతీ ఒక్కరికి ఆమె తల్లి అవుతుంది.+ 21 ఆదాము, అతని భార్య వేసుకోవడానికి యెహోవా దేవుడు వాళ్ల కోసం జంతు చర్మాలతో పొడవాటి వస్త్రాలు చేశాడు.+ 22 తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “మంచిచెడులు తెలుసుకునే విషయంలో మనిషి మనలా* అయ్యాడు.+ ఇప్పుడు అతను తన చెయ్యి చాపి జీవవృక్షం+ పండును కూడా తీసుకొని, తిని, నిరంతరం జీవించకుండా ఉండేలా ఏదోకటి చేయాలి.” 23 దాంతో యెహోవా దేవుడు, మనిషి ఏ నేల నుండైతే తీయబడ్డాడో+ ఆ నేలను సేద్యం చేయడానికి అతన్ని ఏదెను తోట+ నుండి వెళ్లగొట్టాడు. 24 ఆయన ఆ మనిషిని బయటికి గెంటేసి, ఏదెను తోటకు తూర్పున కెరూబుల్ని+ నిలబెట్టాడు; అలాగే జీవవృక్షం దగ్గరికి వెళ్లే దారికి కాపలాగా, మండుతూ గుండ్రంగా తిరిగే ఖడ్గాన్ని పెట్టాడు.

4 ఆదాము తన భార్య హవ్వతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది.+ ఆమె కయీనును+ కన్నప్పుడు, “నేను యెహోవా సహాయంతో ఒక మగబిడ్డను కన్నాను” అంది. 2 తర్వాత ఆమె కయీను తమ్ముడు హేబెలును+ కన్నది.

హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు, కయీను రైతు అయ్యాడు. 3 కొంతకాలానికి కయీను, పొలంలోని కొంత పంటను యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు. 4 అయితే హేబెలు తన మందలో మొదటపుట్టిన వాటిలో+ కొన్నిటిని, వాటి కొవ్వుతో సహా తీసుకొచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను ఆమోదించాడు;+ 5 కానీ కయీనును, అతని అర్పణను ఏమాత్రం ఆమోదించలేదు. దాంతో కయీను కోపంతో రగిలిపోయి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. 6 అప్పుడు యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? 7 నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయడం మొదలుపెడితే, నేను నిన్ను ఆమోదించనా? కానీ నువ్వు నీ ప్రవర్తన మార్చుకుని మంచి చేయకపోతే, పాపం నీ వాకిట్లో పొంచి ఉంటుంది, అది నీ మీద అధికారం చెలాయించాలని తపిస్తుంది; నువ్వు దాన్ని జయించాలి.”

8 తర్వాత కయీను తన తమ్ముడు హేబెలుతో, “మనం పొలంలోకి వెళ్దాం, రా” అన్నాడు. వాళ్లు పొలంలో ఉన్నప్పుడు, కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడిచేసి అతన్ని చంపేశాడు.+ 9 ఆ తర్వాత యెహోవా కయీనును, “నీ తమ్ముడు హేబెలు ఎక్కడ?” అని అడిగాడు. అందుకు కయీను, “నాకు తెలీదు, నేనేమైనా నా తమ్ముడికి కాపలావాణ్ణా?” అన్నాడు. 10 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నువ్వు చేసిన పనేంటి? ఇదిగో! నీ తమ్ముడి రక్తం నేల నుండి నాకు మొరపెడుతోంది.+ 11 కాబట్టి ఇప్పుడు నువ్వు శపించబడ్డావు, నువ్వు చిందించిన నీ తమ్ముడి రక్తాన్ని తాగడానికి నోరు తెరిచిన ఈ నేల నుండి నువ్వు బహిష్కరించబడ్డావు.+ 12 నువ్వు నేలను సాగుచేసినప్పుడు, అది నీకు దాని పంటను* ఇవ్వదు. నువ్వు దేశదిమ్మరిగా ఉంటూ, భూమ్మీద ఒకచోటి నుండి ఇంకోచోటికి తిరుగుతూ ఉంటావు.” 13 అప్పుడు కయీను యెహోవాతో ఇలా అన్నాడు: “నా దోషశిక్ష నేను భరించలేనంత పెద్దది. 14 ఈ రోజు నువ్వు నన్ను ఈ నేల నుండి వెళ్లగొడుతున్నావు, ఇక నేను నీ కళ్లముందు ఉండను; నేను దేశదిమ్మరిగా ఉంటూ, భూమ్మీద ఒకచోటి నుండి ఇంకోచోటికి తిరుగుతూ ఉంటాను, నేను ఎవరి కంటైనా పడితే వాళ్లు ఖచ్చితంగా నన్ను చంపేస్తారు.” 15 అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “కాబట్టి, ఎవరైనా కయీనును చంపితే, వాళ్లు ఏడు రెట్లు శిక్ష అనుభవిస్తారు.”

అందుకే, కయీను ఎవరి కంటైనా పడినప్పుడు వాళ్లు అతన్ని చంపకుండా ఉండేలా యెహోవా కయీనుకు ఒక గుర్తును ఏర్పాటుచేశాడు. 16 తర్వాత కయీను యెహోవా ముందు నుండి వెళ్లిపోయి, ఏదెనుకు+ తూర్పున ఉన్న నోదు* దేశంలో నివసించడం మొదలుపెట్టాడు.

17 ఆ తర్వాత కయీను తన భార్యతో+ కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యి హనోకును కన్నది. తర్వాత కయీను ఒక నగరాన్ని నిర్మించి దానికి తన కుమారుడైన హనోకు పేరే పెట్టాడు. 18 ఆ తర్వాత హనోకుకు ఈరాదు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు పుట్టాడు, మహూయాయేలుకు మతూషాయేలు పుట్టాడు, మతూషాయేలుకు లెమెకు పుట్టాడు.

19 లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్య పేరు ఆదా, రెండో భార్య పేరు సిల్లా. 20 ఆదా యాబాలును కన్నది. డేరాల్లో నివసిస్తూ, పశువుల్ని పెంచేవాళ్లకు అతను మూలపురుషుడు. 21 అతని సహోదరుడి పేరు యూబాలు; వీణ* వాయించే, పిల్లనగ్రోవి* ఊదే వాళ్లందరికీ ఇతను మూలపురుషుడు. 22 సిల్లా తూబల్‌-కయీనును కన్నది. అతను అన్నిరకాల రాగి, ఇనుప పనిముట్లు తయారు చేసేవాడు. తూబల్‌-కయీను సహోదరి పేరు నయమా. 23 తర్వాత లెమెకు తన భార్యలైన ఆదా, సిల్లాల కోసం ఈ పద్యాన్ని కూర్చాడు:

“లెమెకు భార్యలారా, నా మాట వినండి;

నేను చెప్పేది ఆలకించండి:

నన్ను గాయపర్చినందుకు ఒక మనిషిని చంపాను,

అవును, నన్ను కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను.

24 కయీనును చంపేవాళ్లకు పడే శిక్ష 7 రెట్లు+ అయితే,

లెమెకును చంపేవాళ్లకు పడే శిక్ష 77 రెట్లు.”

25 ఆదాము మళ్లీ తన భార్యతో కలిసినప్పుడు, ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె అతనికి షేతు*+ అని పేరు పెట్టింది. ఆమె, “కయీను హేబెలును చంపాడు+ కాబట్టి హేబెలు స్థానంలో దేవుడు నాకు ఇంకో కుమారుణ్ణి* నియమించాడు” అంటూ అతనికి ఆ పేరు పెట్టింది. 26 షేతుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. షేతు అతనికి ఎనోషు+ అని పేరు పెట్టాడు. ఆ సమయంలో, ప్రజలు యెహోవా పేరును వాడడం మొదలుపెట్టారు.

5 ఇది ఆదాము చరిత్రను తెలిపే వృత్తాంతం. దేవుడు ఆదామును సృష్టించిన రోజున, తన పోలికలో అతన్ని సృష్టించాడు.+ 2 ఆయన వాళ్లను పురుషునిగా, స్త్రీగా సృష్టించాడు.+ వాళ్లు సృష్టించబడిన+ రోజున దేవుడు వాళ్లను దీవించి, వాళ్లకు మనుషులు* అని పేరు పెట్టాడు.

3 ఆదాము 130 ఏళ్లు బ్రతికి తన పోలికలో, తనలా ఉన్న కుమారుణ్ణి కని అతనికి షేతు+ అని పేరు పెట్టాడు. 4 షేతును కన్న తర్వాత ఆదాము 800 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 5 ఆదాము మొత్తం 930 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.+

6 షేతు 105 ఏళ్లు బ్రతికి ఎనోషును+ కన్నాడు. 7 ఎనోషును కన్న తర్వాత షేతు 807 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 8 షేతు మొత్తం 912 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

9 ఎనోషు 90 ఏళ్లు బ్రతికి కేయినానును కన్నాడు. 10 కేయినానును కన్న తర్వాత ఎనోషు 815 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 11 ఎనోషు మొత్తం 905 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

12 కేయినాను 70 ఏళ్లు బ్రతికి మహలలేలును+ కన్నాడు. 13 మహలలేలును కన్న తర్వాత కేయినాను 840 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 14 కేయినాను మొత్తం 910 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

15 మహలలేలు 65 ఏళ్లు బ్రతికి యెరెదును+ కన్నాడు. 16 యెరెదును కన్న తర్వాత మహలలేలు 830 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 17 మహలలేలు మొత్తం 895 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

18 యెరెదు 162 ఏళ్లు బ్రతికి హనోకును+ కన్నాడు. 19 హనోకును కన్న తర్వాత యెరెదు 800 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 20 యెరెదు మొత్తం 962 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

21 హనోకు 65 ఏళ్లు బ్రతికి మెతూషెలను+ కన్నాడు. 22 మెతూషెలను కన్న తర్వాత హనోకు 300 ఏళ్లు సత్యదేవునితో* నడుస్తూ ఉన్నాడు. అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు. 23 హనోకు మొత్తం 365 ఏళ్లు బ్రతికాడు. 24 హనోకు సత్యదేవునితో నడుస్తూ ఉన్నాడు.+ ఆ తర్వాత అతను ఇక లేడు, ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకెళ్లిపోయాడు.+

25 మెతూషెల 187 ఏళ్లు బ్రతికి లెమెకును+ కన్నాడు. 26 లెమెకును కన్న తర్వాత మెతూషెల 782 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 27 మెతూషెల మొత్తం 969 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

28 లెమెకు 182 ఏళ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కన్నాడు. 29 లెమెకు అతనికి నోవహు*+ అని పేరు పెట్టాడు; “యెహోవా శపించిన ఈ నేల+ వల్ల మనం పడుతున్న ప్రయాస నుండి, వేదనతో కూడిన మన చేతుల కష్టం నుండి ఇతను మనకు ఊరటను* ఇస్తాడు” అని అంటూ అతనికి ఆ పేరు పెట్టాడు. 30 నోవహును కన్న తర్వాత లెమెకు 595 ఏళ్లు బ్రతికి కుమారులను, కూతుళ్లను కన్నాడు. 31 లెమెకు మొత్తం 777 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

32 నోవహుకు 500 ఏళ్లు వచ్చిన తర్వాత షేమును,+ హామును,+ యాపెతును+ కన్నాడు.

6 భూమ్మీద మనుషుల సంఖ్య పెరగడం మొదలై వాళ్లకు కూతుళ్లు పుట్టినప్పుడు, 2 సత్యదేవుని కుమారులు*+ మనుషుల కూతుళ్లు అందంగా ఉన్నారని గమనించి, వాళ్లలో తమకు నచ్చిన వాళ్లందర్నీ భార్యలుగా చేసుకున్నారు. 3 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను* మనుషుల్ని ఎల్లకాలం సహించను,+ ఎందుకంటే వాళ్లు కేవలం శరీరులు.* కాబట్టి వాళ్లు ఇంక 120 ఏళ్లే బ్రతుకుతారు.”+

4 ఆ రోజుల్లో, అలాగే ఆ తర్వాతి రోజుల్లో భూమ్మీద నెఫీలీయులు* ఉండేవాళ్లు. ఆ కాలంలో సత్యదేవుని కుమారులు మనుషుల కూతుళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు; అప్పుడు ఆ స్త్రీలకు కుమారులు పుట్టారు. పూర్వం పేరుగాంచిన బలశాలులు వాళ్లే.

5 కాబట్టి, భూమ్మీద మనుషుల దుష్టత్వం చాలా ఎక్కువగా ఉందని, వాళ్ల హృదయంలోని ఆలోచనలన్నీ ఎప్పుడూ చెడువైపే మొగ్గుచూపుతాయని+ యెహోవా గమనించాడు. 6 తాను భూమ్మీద మనుషుల్ని చేసినందుకు యెహోవా విచారపడ్డాడు,* హృదయంలో నొచ్చుకున్నాడు.+ 7 కాబట్టి యెహోవా ఇలా అన్నాడు: “నేను సృష్టించిన మనుషుల్ని భూమ్మీద నుండి తుడిచిపెట్టబోతున్నాను. మనుషుల్నే కాదు సాధు జంతువుల్ని, పాకే జంతువుల్ని, ఆకాశంలో ఎగిరే ప్రాణుల్ని కూడా తుడిచిపెట్టబోతున్నాను. ఎందుకంటే నేను వాళ్లను చేసినందుకు విచారపడుతున్నాను.” 8 అయితే నోవహు యెహోవా అనుగ్రహం పొందాడు.

9 ఇది నోవహు చరిత్ర.

నోవహు నీతిమంతుడు.+ అతను తన సమకాలీనుల్లో* మచ్చలేని* మనిషిగా ఉన్నాడు. నోవహు సత్యదేవునితో నడిచాడు.+ 10 కొంతకాలానికి నోవహుకు ముగ్గురు కుమారులు పుట్టారు; వాళ్ల పేర్లు షేము, హాము, యాపెతు.+ 11 అయితే సత్యదేవుని దృష్టిలో భూమి పాడైపోయింది, అది దౌర్జన్యంతో నిండిపోయింది. 12 అవును, దేవుడు భూమిని చూసినప్పుడు అది పాడైపోయి ఉంది;+ భూమ్మీద ఉన్న ప్రజలందరూ చాలా చెడిపోయారు.+

13 ఆ తర్వాత దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: “నేను మనుషులందర్నీ తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వాళ్ల వల్ల భూమి దౌర్జన్యంతో నిండిపోయింది. కాబట్టి వాళ్లను, వాళ్లతోపాటు భూమిని నాశనం చేస్తాను.+ 14 నీ కోసం చితిసారకపు కలపతో ఒక ఓడ* తయారుచేసుకో.+ ఆ ఓడలో గదులు చేసి, దాని లోపలా బయటా తారు*+ పూయి. 15 ఆ ఓడను నువ్వు ఇలా తయారు చేయాలి: అది 300 మూరల* పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. 16 ఓడలోకి వెలుగు వచ్చేలా, దాని పైకప్పు నుండి ఒక మూర కిందికి ఒక కిటికీ* చేయాలి. ఓడకు ఒకవైపు ప్రవేశ ద్వారాన్ని పెట్టాలి;+ ఓడకు మూడు అంతస్తులు ఉండాలి.

17 “నేనైతే ఆకాశం కింద, ఊపిరి తీసుకుంటున్న* ప్రాణులన్నిటినీ నాశనం చేయడానికి భూమ్మీదికి జలప్రళయాన్ని+ రప్పించబోతున్నాను. భూమ్మీదున్న ప్రతీది నాశనమౌతుంది.+ 18 నేను నీతో నా ఒప్పందాన్ని* చేస్తున్నాను. నువ్వు, నీతోపాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు ఓడలోకి వెళ్లాలి.+ 19 అంతేకాదు, నీతోపాటు సజీవంగా ఉండేలా ప్రతీ జాతి జంతువుల్లో+ రెండిటిని, అంటే ఆడదాన్ని, మగదాన్ని ఓడలోకి తీసుకురావాలి;+ 20 అవి సజీవంగా ఉండేలా వాటివాటి జాతి ప్రకారం ఎగిరే ప్రాణులు, వాటివాటి జాతి ప్రకారం సాధు జంతువులు, వాటివాటి జాతి ప్రకారం పాకే జంతువులు నీ దగ్గరికి వచ్చి ఓడలోకి వెళ్తాయి.+ 21 నువ్వైతే అన్నిరకాల ఆహారాన్ని+ సమకూర్చి ఓడలోకి తీసుకెళ్లాలి; అది నీకు, జంతువులకు ఆహారంగా ఉంటుంది.”

22 దేవుడు ఆజ్ఞాపించినదంతా నోవహు చేశాడు. అతను దేవుడు చెప్పినట్టే చేశాడు.+

7 తర్వాత యెహోవా నోవహుతో ఇలా చెప్పాడు: “నువ్వూ, నీ ఇంటివాళ్లందరూ ఓడలోకి వెళ్లండి. ఎందుకంటే ఈ తరంవాళ్లలో నువ్వు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు.+ 2 అన్నిరకాల పవిత్ర జంతువుల్లో ఏడేడు* చొప్పున మగవాటిని, ఆడవాటిని నీతోపాటు ఓడలోకి తీసుకెళ్లాలి;+ అన్నిరకాల అపవిత్ర జంతువుల్లో రెండిటిని మాత్రమే అంటే ఒక మగదాన్ని, ఒక ఆడదాన్ని తీసుకెళ్లాలి; 3 అలాగే, ఆకాశంలో ఎగిరే ప్రాణుల సంతతి భూమంతటా సజీవంగా ఉండేలా వాటిని కూడా ఏడేడు* చొప్పున మగవాటిని, ఆడవాటిని ఓడలోకి తీసుకెళ్లాలి.+ 4 ఎందుకంటే, కేవలం ఏడురోజుల్లో నేను భూమ్మీద 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురిపిస్తాను.+ నేను చేసిన ప్రతీ ప్రాణిని నేలమీద నుండి తుడిచేస్తాను.”+ 5 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రతీది నోవహు చేశాడు.

6 భూమ్మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏళ్లు.+ 7 జలప్రళయం రాకముందే నోవహు తన కుమారులతో, భార్యతో, కోడళ్లతో కలిసి ఓడలోకి వెళ్లాడు.+ 8 అన్నిరకాల పవిత్ర జంతువుల్లో నుండి, అన్నిరకాల అపవిత్ర జంతువుల్లో నుండి, ఎగిరే ప్రాణుల్లో నుండి, నేలమీద కదిలే ప్రతీదానిలో నుండి+ 9 రెండేసి చొప్పున మగవి, ఆడవి ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్లాయి. అంతా దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే జరిగింది. 10 ఏడురోజుల తర్వాత భూమ్మీదికి జలప్రళయం వచ్చింది.

11 నోవహు జీవితంలోని 600వ సంవత్సరం, రెండో నెల, 17వ రోజున, సరిగ్గా అదే రోజున పెద్దపెద్ద అగాధ జలాల ఊటలన్నీ పెల్లుబికాయి, ఆకాశ తూములు* తెరవబడ్డాయి.+ 12 అప్పుడు భూమ్మీద 40 పగళ్లు, 40 రాత్రులు కుండపోతగా వర్షం కురిసింది. 13 సరిగ్గా అదే రోజున నోవహు తన కుమారులు షేము, హాము, యాపెతులతో,+ తన భార్యతో, తన ముగ్గురు కోడళ్లతో కలిసి ఓడలోకి వెళ్లాడు.+ 14 దానిదాని జాతి ప్రకారం ప్రతీ అడవి జంతువును, దానిదాని జాతి ప్రకారం ప్రతీ సాధు జంతువును, దానిదాని జాతి ప్రకారం భూమ్మీద పాకే ప్రతీ జంతువును, దానిదాని జాతి ప్రకారం ఎగిరే ప్రతీ ప్రాణిని, అంటే ప్రతీ పక్షిని, రెక్కలున్న ప్రతీ జీవిని తీసుకొని వాళ్లు ఓడలోకి వెళ్లారు. 15 ఊపిరి తీసుకునే* ప్రతీ రకమైన ప్రాణులు రెండేసి చొప్పున ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. 16 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే ప్రతీ రకమైన ప్రాణుల్లో మగవి, ఆడవి లోపలికి వెళ్లాయి. ఆ తర్వాత యెహోవా ఓడ తలుపును మూసేశాడు.

17 భూమ్మీద 40 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది, దానివల్ల నీటిమట్టం అంతకంతకూ పెరిగి ఆ ఓడను పైకెత్తింది, ఓడ చాలా ఎత్తులో నీళ్ల మీద తేలుతూ ఉంది. 18 నీటి ఉధృతి పెరిగి భూమ్మీద నీళ్లు చాలాచాలా ఎక్కువౌతూ ఉన్నాయి, కానీ ఓడ నీళ్ల మీద తేలుతూ ఉంది. 19 నీటి ప్రవాహం భూమ్మీద ఎంత ఎక్కువైందంటే, ఆకాశమంతటి కింద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి.+ 20 నీటిమట్టం పర్వత శిఖరాల నుండి 15 మూరల* ఎత్తుకు చేరింది.

21 దాంతో ఎగిరే ప్రాణులు, సాధు జంతువులు, అడవి జంతువులు, గుంపులుగుంపులుగా తిరిగే చిన్నచిన్న ప్రాణులు, మనుషులందరూ, అంటే భూమ్మీద కదిలే ప్రాణులన్నీ నాశనమయ్యాయి.+ 22 ఆరిన నేల మీద, జీవశక్తి ఉండి ఊపిరి తీసుకునే* ప్రతీది చనిపోయింది.+ 23 అలా మనుషులు, జంతువులు, పాకే జీవులు, ఆకాశంలో ఎగిరే ప్రాణులతో సహా భూమ్మీదున్న ప్రాణులన్నిటినీ ఆయన తుడిచేశాడు. అవన్నీ భూమ్మీద లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి;+ కేవలం నోవహు కుటుంబం, వాళ్లతో పాటు ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే తప్పించుకున్నాయి.+ 24 భూమ్మీద నీటి ఉధృతి 150 రోజుల పాటు అలాగే కొనసాగింది.+

8 ఆ తర్వాత దేవుడు నోవహును, అతనితో పాటు ఓడలో ఉన్న అడవి జంతువులన్నిటినీ, సాధు జంతువులన్నిటినీ గుర్తుచేసుకున్నాడు.+ అప్పుడు దేవుడు భూమంతటా గాలి వీచేలా చేశాడు, దాంతో నీళ్లు తగ్గిపోసాగాయి. 2 అగాధ జలాల ఊటలు, ఆకాశ తూములు* మూయబడ్డాయి; ఆకాశం నుండి వర్షం కురవడం ఆగిపోయింది.+ 3 అప్పుడు భూమ్మీదున్న నీళ్లు మెల్లమెల్లగా తగ్గిపోసాగాయి. 150 రోజుల తర్వాత నీటిమట్టం తగ్గింది. 4 ఏడో నెల, 17వ రోజున ఓడ అరారాతు పర్వతాల మీద ఆగింది. 5 పదో నెల వరకు నీళ్లు నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నాయి. పదో నెల, మొదటి రోజున పర్వత శిఖరాలు కనిపించాయి.+

6 కాబట్టి 40 రోజులు గడిచాక నోవహు ఓడ కిటికీ+ తెరిచి, 7 ఒక కాకిని బయటికి పంపించాడు; భూమ్మీద నీళ్లు ఎండిపోయే వరకు అది బయట ఎగురుతూ, తిరిగొస్తూ ఉంది.

8 తర్వాత నోవహు, నేలమీద నీళ్లు తగ్గిపోయాయో లేదో తెలుసుకోవడానికి ఒక పావురాన్ని బయటికి పంపించాడు. 9 భూమంతటా ఇంకా నీళ్లు ఉండడంతో,+ వాలడానికి* ఎక్కడా చోటు లేక ఆ పావురం ఓడలో ఉన్న నోవహు దగ్గరికి తిరిగొచ్చింది. అప్పుడు నోవహు తన చెయ్యి బయటికి చాపి దాన్ని ఓడలోకి తీసుకున్నాడు. 10 అతను ఇంకో ఏడురోజులు ఆగి, మళ్లీ ఆ పావురాన్ని ఓడ బయటికి వదిలాడు. 11 సాయంత్రం కావస్తున్నప్పుడు ఆ పావురం అతని దగ్గరికి వచ్చింది, దాని నోట్లో అప్పుడే తెంపిన ఒక ఒలీవ ఆకు ఉంది! దాంతో, భూమ్మీద నీళ్లు తగ్గిపోయాయని+ నోవహుకు అర్థమైంది. 12 అతను మరో ఏడురోజులు ఆగి, మళ్లీ ఆ పావురాన్ని బయటికి వదిలాడు. ఈసారి అది అతని దగ్గరికి తిరిగిరాలేదు.

13 చివరికి 601వ సంవత్సరం,+ మొదటి నెల, మొదటి రోజున భూమ్మీది నీళ్లు ఇంకిపోయాయి; నోవహు ఓడ పైకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరిపోతూ ఉందని గమనించాడు. 14 రెండో నెల, 27వ రోజున భూమి పూర్తిగా ఆరిపోయింది.

15 అప్పుడు దేవుడు నోవహుతో ఇలా అన్నాడు: 16 “నువ్వు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఓడలో నుండి బయటికి రండి.+ 17 అలాగే అన్నిరకాల ప్రాణులు భూమ్మీద విస్తరించి, పిల్లల్ని కని, వాటి సంఖ్య పెరిగేలా+ ఎగిరే ప్రాణుల్ని, జంతువుల్ని, భూమ్మీద పాకే జంతువులన్నిటినీ మీతోపాటు బయటికి తీసుకురండి.”+

18 కాబట్టి నోవహు తన కుమారులతో,+ భార్యతో, కోడళ్లతో కలిసి ఓడ బయటికి వచ్చాడు. 19 ప్రతీ ప్రాణి, పాకే ప్రతీ జంతువు, ఎగిరే ప్రతీ ప్రాణి, భూమ్మీద కదిలే ప్రతీది దానిదాని జాతి ప్రకారం ఓడ బయటికి వచ్చాయి.+ 20 తర్వాత నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ పవిత్రమైన జంతువులన్నిట్లో నుండి, పవిత్రమైన ఎగిరే ప్రాణులన్నిట్లో నుండి+ కొన్ని తీసుకొని వాటిని ఆ బలిపీఠం మీద దహనబలులుగా అర్పించాడు.+ 21 అప్పుడు యెహోవా ఆ ఇంపైన* సువాసనను ఆఘ్రాణించడం మొదలుపెట్టాడు. కాబట్టి యెహోవా తన హృదయంలో ఇలా అనుకున్నాడు: “ఇంకెప్పుడూ నేను మనుషుల్ని బట్టి నేలను శపించను.+ మనిషి హృదయం చిన్నప్పటి నుండి చెడువైపే మొగ్గుచూపుతుంది;+ అంతేకాదు ఇప్పుడు చేసినట్టుగా ఇంకెప్పుడూ నేను ప్రతీ ప్రాణిని చంపను.+ 22 ఇప్పటినుండి భూమ్మీద విత్తడం-కోయడం, చలి-వేడి, ఎండాకాలం-చలికాలం, పగలు-రాత్రి అనేవి ఎప్పటికీ ఉంటాయి.”+

9 దేవుడు నోవహును, అతని కుమారుల్ని దీవిస్తూ ఇలా అన్నాడు: “మీరు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమిని నింపండి.+ 2 భూమ్మీదున్న ప్రతీ ప్రాణి, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణి, నేలమీద కదిలే ప్రతీ ప్రాణి, సముద్రంలోని చేపలన్నీ మీకు భయపడతాయి, మీరంటే హడలిపోతాయి. ఇప్పుడు అవన్నీ మీ చేతికి అప్పగించబడ్డాయి.*+ 3 ప్రాణంతో కదిలే ప్రతీ జంతువు మీకు ఆహారంగా ఉంటుంది.+ పచ్చని కూరమొక్కల్ని ఇచ్చినట్టు వాటన్నిటినీ మీకు ఇస్తున్నాను.+ 4 అయితే, మాంసాన్ని దాని రక్తంతో తినకూడదు,+ ఎందుకంటే రక్తమే దాని ప్రాణం.*+ 5 అంతేకాదు మీ ప్రాణమైన రక్తం విషయంలో నేను మిమ్మల్ని లెక్క అడుగుతాను. ప్రతీ ప్రాణిని నేను లెక్క అడుగుతాను; ప్రతీ మనిషిని తన సహోదరుని ప్రాణం విషయంలో నేను లెక్క అడుగుతాను.+ 6 ఎవరైనా మనిషి రక్తాన్ని చిందిస్తే, వాళ్ల రక్తం కూడా మనిషి చేతనే చిందించబడుతుంది;+ ఎందుకంటే, దేవుడు మనిషిని తన పోలికలో తయారుచేశాడు.+ 7 మీరైతే పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యి, భూమ్మీద విస్తరించండి.”+

8 తర్వాత దేవుడు నోవహుతో, అతని కుమారులతో ఇలా అన్నాడు: 9 “నేను ఇప్పుడు మీతో, మీ తర్వాత వచ్చే మీ సంతానంతో నా ఒప్పందం చేస్తున్నాను.+ 10 మీతో ఉన్న ప్రతీ ప్రాణితో, అంటే మీతో ఉన్న పక్షులతో, జంతువులతో, భూమ్మీది ప్రాణులన్నిటితో, ఓడలో నుండి బయటికి వచ్చిన వాటన్నిటితో+ నా ఒప్పందం చేస్తున్నాను. 11 అవును, నేను మీతో నా ఒప్పందం చేస్తున్నాను: ఇంకెప్పుడూ నేను జలప్రళయంతో ప్రాణులన్నిటినీ నాశనం చేయను, ఇంకెప్పుడూ జలప్రళయంతో భూమిని నాశనం చేయను.”+

12 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “మీతో, అలాగే మీతోపాటు ఉన్న ప్రతీ ప్రాణితో నేను చేస్తున్న ఒప్పందానికి గుర్తు* ఇదే. ఈ ఒప్పందం తరతరాలు నిలిచి ఉంటుంది. 13 నేను మేఘంలో నా ఇంద్రధనుస్సును పెడుతున్నాను. అది నాకు, భూమికి మధ్య ఒప్పందానికి గుర్తుగా ఉంటుంది. 14 నేను భూమ్మీదికి మేఘాన్ని తెచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఆ ఇంద్రధనుస్సు మేఘంలో కనిపిస్తుంది. 15 అప్పుడు నేను మీతో, ప్రతీ జాతికి చెందిన ప్రతీ ప్రాణితో చేసిన ఒప్పందాన్ని ఖచ్చితంగా గుర్తుచేసుకుంటాను; ఇంకెప్పుడూ నీళ్లు ప్రళయంగా మారి ప్రాణులన్నిటినీ నాశనం చేయవు.+ 16 మేఘంలో ఇంద్రధనుస్సు వస్తుంది, నేను ఖచ్చితంగా దాన్ని చూసి నాకూ, భూమ్మీదున్న ప్రతీ జాతికి చెందిన ప్రతీ ప్రాణికీ మధ్య ఉన్న శాశ్వత ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను.”

17 దేవుడు మళ్లీ నోవహుతో, “నేను భూమ్మీదున్న ప్రాణులన్నిటితో చేస్తున్న ఒప్పందానికి గుర్తు ఇదే” అన్నాడు.+

18 ఓడలో నుండి బయటికి వచ్చిన నోవహు కుమారులు ఎవరంటే: షేము, హాము, యాపెతు.+ హాము ఆ తర్వాత కనానుకు తండ్రి అయ్యాడు.+ 19 వీళ్లు ముగ్గురు నోవహు కుమారులు; భూమ్మీద ఉన్న జనాభా అంతా వీళ్ల నుండే వచ్చి, ప్రపంచమంతటా విస్తరించింది.+

20 నోవహు వ్యవసాయం మొదలుపెట్టి, ద్రాక్షతోటను నాటాడు. 21 ఒకరోజు నోవహు ద్రాక్షారసం ఎక్కువగా తాగి, ఆ మత్తులో బట్టల్లేకుండా తన డేరాలో పడుకున్నాడు. 22 కనాను తండ్రి హాము తన తండ్రైన నోవహు బట్టల్లేకుండా ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు చెప్పాడు. 23 అప్పుడు షేము, యాపెతు ఒక వస్త్రాన్ని తీసుకొని తమ ఇద్దరి భుజాల మీద పెట్టుకొని వెనక్కి నడుచుకుంటూ వెళ్లి, తమ తండ్రి వైపు చూడకుండా దాన్ని అతని మీద కప్పారు. తమ తండ్రి బట్టల్లేకుండా ఉండడాన్ని వాళ్లు చూడలేదు.

24 నోవహు ద్రాక్షారసం మత్తులో నుండి తేరుకొని, తన చిన్న కుమారుడు తనకు చేసినదాని గురించి తెలుసుకున్నప్పుడు, 25 ఇలా అన్నాడు:

“కనాను శాపగ్రస్తుడిగా ఉండాలి.+

అతను తన సహోదరులకు దాసుడు* అవ్వాలి.”+

26 నోవహు ఇంకా ఇలా అన్నాడు:

“షేము దేవుడైన యెహోవా స్తుతించబడాలి,

కనాను అతనికి దాసుడు అవ్వాలి.+

27 దేవుడు యాపెతుకు చాలా స్థలం ఇవ్వాలి,

అతను షేము డేరాల్లో నివసించాలి.

కనాను అతనికి కూడా దాసుడు అవ్వాలి.”

28 జలప్రళయం తర్వాత నోవహు 350 ఏళ్లు బ్రతికాడు.+ 29 అలా నోవహు మొత్తం 950 ఏళ్లు బ్రతికి చనిపోయాడు.

10 నోవహు కుమారులైన షేము,+ హాము, యాపెతుల చరిత్ర ఇది.

జలప్రళయం తర్వాత వాళ్లకు కుమారులు పుట్టారు. 2 యాపెతు కుమారులు: గోమెరు,+ మాగోగు,+ మాదయి, యావాను, తుబాలు,+ మెషెకు,+ తీరసు.

3 గోమెరు కుమారులు: అష్కనజు,+ రీఫతు, తోగర్మా.+

4 యావాను కుమారులు: ఎలీషా,+ తర్షీషు, కిత్తీము,+ దాదోనీము.

5 వీళ్లు ద్వీపాల్లో* నివసించేవాళ్లకు మూలపురుషులు. ప్రజలు తమతమ భాషల ప్రకారం, కుటుంబాల ప్రకారం, దేశాల ప్రకారం వాటిలో స్థిరపడ్డారు.

6 హాము కుమారులు: కూషు, మిస్రాయిము, పూతు,+ కనాను.+

7 కూషు కుమారులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా,+ సబ్తకా.

రాయమా కుమారులు: షేబ, దెదాను.

8 కూషు నిమ్రోదును కన్నాడు. భూమ్మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఇతనే. 9 ఇతను యెహోవాకు వ్యతిరేకంగా గొప్ప వేటగాడు అయ్యాడు. అందుకే “యెహోవాకు వ్యతిరేకంగా గొప్ప వేటగాడైన నిమ్రోదులా” అనే సామెత పుట్టింది. 10 అతని రాజ్యంలోని మొదటి నగరాలు ఏవంటే: బాబెలు,*+ ఎరెకు, అక్కదు, కల్నే; ఇవి షీనారు దేశంలో+ ఉన్నాయి. 11 అతను ఆ దేశం నుండి అష్షూరుకు+ వెళ్లి అక్కడ ఈ నగరాల్ని నిర్మించాడు: నీనెవె,+ రహోబోతీరు, కాలహు, 12 రెసెను. ఈ రెసెను నీనెవెకు, కాలహుకు మధ్య ఉంది. ఇవన్నీ కలిసి ఒక గొప్ప నగరంగా తయారయ్యాయి.*

13 మిస్రాయిము కుమారులు: లూదు,+ అనాము, లెహాబు, నప్తుహు, 14 పత్రుసు,+ కస్లూహు (ఇతని నుండే ఫిలిష్తీయులు+ వచ్చారు), కఫ్తోరు.+

15 కనాను కుమారులు: మొదటి కుమారుడైన సీదోను,+ హేతు;+ 16 అలాగే యెబూసీయులు, అమోరీయులు,+ గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వదీయులు,+ సెమారీయులు, హమాతీయులు. ఆ తర్వాత కనానీయుల కుటుంబాలు చెదిరిపోయాయి. 19 కాబట్టి కనానీయుల సరిహద్దు సీదోను నుండి గాజా+ దగ్గరున్న గెరారు వరకు, లాషా దగ్గరున్న సొదొమ, గొమొర్రా,+ అద్మా, సెబోయీము+ వరకు ఉంది. 20 వీళ్లు తమతమ కుటుంబాల ప్రకారం, భాషల ప్రకారం, దేశాల ప్రకారం, జాతుల ప్రకారం హాము వంశస్థులు.

21 షేముకు కూడా కుమారులు పుట్టారు. ఈ షేము ఏబెరు వంశస్థులందరికీ పూర్వీకుడు, యాపెతుకు తమ్ముడు.* 22 షేము కుమారులు: ఏలాము,+ అస్సూరు,+ అర్పక్షదు,+ లూదు, అరాము.+

23 అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మాష.

24 అర్పక్షదు షేలహును+ కన్నాడు, షేలహు ఏబెరును కన్నాడు.

25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకతని పేరు పెలెగు.*+ అతని జీవితకాలంలోనే ప్రపంచ జనాభా చెదిరిపోయింది* కాబట్టి అతనికి ఆ పేరు పెట్టారు. అతని సహోదరుని పేరు యొక్తాను.+

26 యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,+ 27 హదోరము, ఊజాలు, దిక్లాను, 28 ఓబాలు, అబీమాయేలు, షేబ, 29 ఓఫీరు,+ హవీలా, యోబాబు; వీళ్లంతా యొక్తాను కుమారులు.

30 వీళ్ల నివాస స్థలం, మేషా నుండి తూర్పున ఉన్న కొండ ప్రాంతమైన సపారా వరకు ఉండేది.

31 వీళ్లు తమతమ కుటుంబాల ప్రకారం, భాషల ప్రకారం, దేశాల ప్రకారం, జాతుల ప్రకారం షేము వంశస్థులు.+

32 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం, జాతుల ప్రకారం నోవహు కుమారుల కుటుంబాలు. జలప్రళయం తర్వాత వాళ్ల నుండే ఆయా జాతుల ప్రజలు ప్రపంచమంతటా విస్తరించారు.+

11 అప్పటికింకా భూమంతటా ఒకే భాష, ఒకే పదజాలం ఉంది. 2 ప్రజలు తూర్పు వైపుగా ప్రయాణిస్తూ షీనారు దేశంలో+ ఒక లోయ మైదానాన్ని కనుగొని, అక్కడే నివసించడం మొదలుపెట్టారు. 3 తర్వాత వాళ్లు, “రండి! మనం ఇటుకలు తయారు చేసి వాటిని మంటల్లో కాలుద్దాం” అని ఒకరితో ఒకరు అనుకున్నారు. వాళ్లు రాళ్లకు బదులు ఇటుకల్ని, అడుసుకు* బదులు తారును* ఉపయోగించారు. 4 అప్పుడు వాళ్లు ఇలా అనుకున్నారు: “రండి! మనకోసం ఒక నగరాన్ని, ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని కట్టుకుందాం; పేరుప్రఖ్యాతులు సంపాదించుకుందాం. దానివల్ల మనం భూమంతటా చెదిరిపోకుండా ఉంటాం.”+

5 మనుషులు కట్టిన ఆ నగరాన్ని, గోపురాన్ని చూడడానికి యెహోవా దిగివచ్చాడు.* 6 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “ఇదిగో! ఈ ప్రజలు ఐక్యంగా ఉన్నారు, వాళ్ల భాష కూడా ఒక్కటే.+ ఇప్పుడేమో వాళ్లు ఈ పని చేయడం మొదలుపెట్టారు. వాళ్లు చేయాలనుకున్నది ఏదైనాసరే, దాన్ని చేయగలుగుతారు. 7 మనం+ ఇప్పుడు కిందికి వెళ్లి, వాళ్లకు ఒకరి భాష ఒకరికి అర్థంకాకుండా ఉండేలా వాళ్ల భాషను తారుమారు చేద్దాం.” 8 కాబట్టి యెహోవా వాళ్లను అక్కడి నుండి భూమంతటికీ చెదరగొట్టాడు,+ దాంతో వాళ్లు మెల్లమెల్లగా ఆ నగరాన్ని కట్టే పనిని ఆపేశారు. 9 అందుకే దానికి బాబెలు*+ అనే పేరు వచ్చింది. ఎందుకంటే అక్కడ యెహోవా భూమంతటా ఉన్న భాషను తారుమారు చేశాడు, అలాగే యెహోవా వాళ్లను అక్కడి నుండి భూమంతటికీ చెదరగొట్టాడు.

10 ఇది షేము+  చరిత్ర.

జలప్రళయం వచ్చిన రెండేళ్ల తర్వాత షేముకు అర్పక్షదు+ పుట్టాడు. అప్పుడు షేము వయసు 100 ఏళ్లు. 11 అర్పక్షదు పుట్టిన తర్వాత షేము 500 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతనికి కుమారులు, కూతుళ్లు పుట్టారు.+

12 అర్పక్షదు 35 ఏళ్లు బ్రతికి, షేలహును+ కన్నాడు. 13 షేలహును కన్న తర్వాత అర్పక్షదు 403 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

14 షేలహు 30 ఏళ్లు బ్రతికి, ఏబెరును+ కన్నాడు. 15 ఏబెరును కన్న తర్వాత షేలహు 403 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

16 ఏబెరు 34 ఏళ్లు బ్రతికి, పెలెగును+ కన్నాడు. 17 పెలెగును కన్న తర్వాత ఏబెరు 430 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

18 పెలెగు 30 ఏళ్లు బ్రతికి, రయూను+ కన్నాడు. 19 రయూను కన్న తర్వాత పెలెగు 209 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

20 రయూ 32 ఏళ్లు బ్రతికి, సెరూగును కన్నాడు. 21 సెరూగును కన్న తర్వాత రయూ 207 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

22 సెరూగు 30 ఏళ్లు బ్రతికి, నాహోరును కన్నాడు. 23 నాహోరును కన్న తర్వాత సెరూగు 200 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

24 నాహోరు 29 ఏళ్లు బ్రతికి, తెరహును+ కన్నాడు. 25 తెరహును కన్న తర్వాత నాహోరు 119 ఏళ్లు బ్రతికాడు, ఆ కాలంలో అతను కుమారులను, కూతుళ్లను కన్నాడు.

26 తెరహు 70 ఏళ్లు బ్రతికి, ఆ తర్వాత అబ్రామును,+ నాహోరును, హారానును కన్నాడు.

27 ఇది తెరహు చరిత్ర.

తెరహు అబ్రామును, నాహోరును, హారానును కన్నాడు; హారాను లోతును+ కన్నాడు. 28 తన తండ్రి తెరహు ఇంకా బ్రతికి ఉండగానే, హారాను తాను పుట్టిన కల్దీయుల దేశంలోని+ ఊరు+ నగరంలో చనిపోయాడు. 29 అబ్రాము, నాహోరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అబ్రాము భార్య పేరు శారయి;+ నాహోరు భార్య పేరు మిల్కా,+ ఈమె హారాను కూతురు. హారాను మిల్కాకు, ఇస్కాకు తండ్రి. 30 శారయి గొడ్రాలు;+ ఆమెకు పిల్లలు లేరు.

31 తెరహు తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడూ తన మనవడూ అయిన లోతును, అబ్రాము భార్యయైన తన కోడలు శారయిని తీసుకొని కల్దీయుల దేశంలోని ఊరు నగరం నుండి బయల్దేరాడు. వాళ్లు అతనితో కలిసి కనాను దేశం+ వైపు ప్రయాణం మొదలుపెట్టారు. కొంతకాలానికి వాళ్లు హారానుకు చేరుకొని,+ అక్కడే నివసించడం మొదలుపెట్టారు. 32 తెరహు మొత్తం 205 ఏళ్లు బ్రతికి, హారానులో చనిపోయాడు.

12 యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటివాళ్లను విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు.+ 2 నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు దీవెనగా ఉంటావు.+ 3 నిన్ను దీవించేవాళ్లను దీవిస్తాను, నిన్ను శపించేవాణ్ణి శపిస్తాను,+ భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ నీ ద్వారా ఖచ్చితంగా దీవించబడతాయి.”*+

4 కాబట్టి అబ్రాము యెహోవా చెప్పినట్టే వెళ్లాడు, అతనితో పాటు లోతు కూడా వెళ్లాడు. హారానును విడిచి వెళ్లినప్పుడు అబ్రాముకు 75 ఏళ్లు.+ 5 అబ్రాము తన భార్య శారయిని, తన సహోదరుడి కుమారుడు లోతును, హారానులో తాము సమకూర్చుకున్న వస్తువులన్నిటినీ,+ తాము సంపాదించుకున్న సేవకుల్ని తీసుకొని కనాను దేశానికి+ బయల్దేరాడు. వాళ్లు కనాను దేశానికి చేరుకున్నప్పుడు, 6 అబ్రాము మోరే మహా వృక్షాల+ దగ్గర ఉన్న షెకెము+ వరకు ప్రయాణించాడు. అప్పటికి ఆ దేశంలో కనానీయులు నివసిస్తున్నారు. 7 తర్వాత యెహోవా అబ్రాముకు కనిపించి, “నేను ఈ దేశాన్ని నీ సంతానానికి*+ ఇవ్వబోతున్నాను” అన్నాడు.+ కాబట్టి అబ్రాము తనకు కనిపించిన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. 8 ఆ తర్వాత అతను బేతేలుకు+ తూర్పున ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ తన డేరా వేసుకున్నాడు; ఆ డేరాకు పడమటి దిక్కున బేతేలు, తూర్పు దిక్కున హాయి+ ఉన్నాయి. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ యెహోవా పేరును స్తుతించాడు. 9 తర్వాత అబ్రాము అక్కడి నుండి తన డేరాల్ని తీసేసి, ఒక చోటి నుండి ఇంకో చోటికి తన నివాసాన్ని మార్చుకుంటూ నెగెబు+ వైపు ప్రయాణించాడు.

10 అప్పుడు కనాను దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు చాలా తీవ్రంగా ఉండడంతో,+ అబ్రాము కొంతకాలం* ఉండివద్దామని ఐగుప్తు* వైపు ప్రయాణించాడు.+ 11 అతను ఐగుప్తులోకి అడుగుపెట్టబోతుండగా, తన భార్య శారయితో ఇలా అన్నాడు: “దయచేసి నా మాట విను! నువ్వు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు.+ 12 ఐగుప్తీయులు నాతోపాటు నిన్ను చూసినప్పుడు ఖచ్చితంగా, ‘ఈమె ఇతని భార్యే’ అని అంటారు. తర్వాత నన్ను చంపేసి, నిన్ను మాత్రం బ్రతకనిస్తారు. 13 కాబట్టి నీ వల్ల నాకు ఏ హానీ కలగకుండా ఉండేలా, దయచేసి నువ్వు నా చెల్లెలివని చెప్పు. అలాచేస్తే నువ్వు నా ప్రాణాన్ని కాపాడినదానివి అవుతావు.”+

14 అబ్రాము ఐగుప్తులోకి అడుగుపెట్టిన వెంటనే, ఐగుప్తీయులు శారయి చాలా అందగత్తె అని గమనించారు. 15 ఫరో ఉన్నతాధికారులు కూడా ఆమెను చూసి, ఫరో ముందు ఆమెను పొగడడం మొదలుపెట్టారు. దాంతో ఆమెను ఫరో భవనానికి తీసుకొచ్చారు. 16 ఆమె తనకు బాగా నచ్చడం వల్ల ఫరో అబ్రాముతో మంచిగా వ్యవహరించాడు; అతనికి గొర్రెల్ని, పశువుల్ని, మగ గాడిదల్ని, ఆడ గాడిదల్ని, దాసుల్ని, దాసురాళ్లను, ఒంటెల్ని ఇచ్చాడు.+ 17 తర్వాత అబ్రాము భార్య శారయిని+ బట్టి యెహోవా ఫరోను, అతని ఇంటివాళ్లను తీవ్రమైన జబ్బులతో బాధించాడు. 18 కాబట్టి ఫరో అబ్రామును పిలిచి ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఈమె నీ భార్య అని నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? 19 ‘ఈమె నా చెల్లెలు’+ అని ఎందుకు చెప్పావు? దానివల్ల నేను ఈమెను నా భార్యగా చేసుకోబోయాను. ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకొని వెళ్లిపో!” 20 కాబట్టి ఫరో అబ్రాము గురించి తన మనుషులకు ఆదేశాలిచ్చాడు. వాళ్లు అతని భార్యను, అతనికున్న వాటన్నిటిని అతనితో పాటు పంపించేశారు.+

13 అప్పుడు అబ్రాము తన భార్యను, తనకున్న వాటన్నిటినీ, లోతును తీసుకొని ఐగుప్తు నుండి బయల్దేరి నెగెబుకు+ వచ్చాడు. 2 అబ్రాముకు పశువులు, వెండిబంగారాలు చాలా ఎక్కువగా ఉండేవి.+ 3 అతను నెగెబు నుండి బేతేలుకు వచ్చేవరకు ఒకచోటి నుండి ఇంకోచోటికి తన నివాసాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. అలా వెళ్తూవెళ్తూ అంతకుముందు తాను బేతేలుకు, హాయికి మధ్య+ డేరా వేసుకున్న చోటికి వచ్చాడు, 4 అంతకుముందు అతను బలిపీఠం కట్టింది కూడా అక్కడే. అబ్రాము అక్కడ యెహోవా పేరును స్తుతించాడు.

5 అబ్రాముతో ప్రయాణం చేస్తున్న లోతుకు కూడా గొర్రెలు, పశువులు, డేరాలు ఉన్నాయి. 6 కాబట్టి అవన్నీ ఒకేచోట ఉండడానికి ఆ స్థలం సరిపోలేదు; వాళ్లిద్దరి దగ్గర ఎంత ఆస్తి ఉందంటే ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకేచోట ఉండడం కుదరలేదు. 7 దానివల్ల, అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య గొడవ వచ్చింది. (అప్పటికి ఆ దేశంలో కనానీయులు, పెరిజ్జీయులు నివసిస్తున్నారు.)+ 8 కాబట్టి అబ్రాము లోతుతో+ ఇలా అన్నాడు: “దయచేసి నా మాట విను. నీకూ నాకూ మధ్య, నీ పశువుల కాపరులకూ నా పశువుల కాపరులకూ మధ్య గొడవలు ఉండకూడదు. ఎందుకంటే మనం బంధువులం. 9 ఇదిగో, ఈ దేశమంతా నీ ముందు ఉంది. కాబట్టి దయచేసి నా దగ్గర నుండి వెళ్లిపోయి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే, నేను కుడివైపు వెళ్తాను; నువ్వు కుడివైపు వెళ్తే, నేను ఎడమవైపు వెళ్తాను.” 10 అప్పుడు లోతు తల ఎత్తి యొర్దాను నదీ పరీవాహక ప్రాంతాన్ని+ చూశాడు. సోయరు+ వరకు ఆ ప్రాంతమంతా (యెహోవా సొదొమ, గొమొర్రా నగరాల్ని నాశనం చేయకముందు) చక్కగా నీళ్లు పారుతూ యెహోవా తోటలా,+ ఐగుప్తు దేశంలా ఉందని అతను గమనించాడు. 11 దాంతో లోతు యొర్దాను నదీ పరీవాహక ప్రాంతమంతటినీ ఎంచుకొని, తూర్పు వైపుకు తన నివాసాన్ని మార్చుకున్నాడు. అలా వాళ్లిద్దరూ వేరైపోయారు. 12 అబ్రాము కనాను దేశంలో నివసించాడు, కానీ లోతు మాత్రం యొర్దాను నదీ పరీవాహక ప్రాంతంలోని నగరాల మధ్య నివసించాడు.+ చివరికి లోతు సొదొమకు దగ్గర్లో తన డేరా వేసుకున్నాడు. 13 సొదొమలోని మనుషులు చాలా చెడ్డవాళ్లు, యెహోవా దృష్టిలో ఘోరమైన పాపులు.+

14 లోతు అబ్రాము నుండి వేరైపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో ఇలా అన్నాడు: “దయచేసి నీ తల ఎత్తి, నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమటి వైపు చూడు. 15 ఎందుకంటే, నీకు కనిపించే ఈ దేశాన్నంతటినీ నీకు, నీ సంతానానికి* శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను.+ 16 నేను నీ సంతానం* ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను; ఎవరైనా ఇసుక రేణువుల్ని లెక్కపెట్టగలిగితే, నీ సంతానాన్ని* కూడా లెక్కపెట్టవచ్చు.+ 17 లేచి, ఈ దేశమంతా* తిరిగి చూడు. ఎందుకంటే నేను దీన్ని నీకు ఇవ్వబోతున్నాను.” 18 కాబట్టి అబ్రాము డేరాల్లో నివసిస్తూ ఒక్కో చోటికి వెళ్లాడు. ఆ తర్వాత అతను హెబ్రోనులో+ ఉన్న మమ్రే+ మహా వృక్షాల దగ్గరికి వచ్చి అక్కడ నివసించాడు. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.+

14 ఆ రోజుల్లో అమ్రాపేలు షీనారుకు+ రాజుగా, అర్యోకు ఎల్లాసరుకు రాజుగా, కదొర్లాయోమెరు+ ఏలాముకు+ రాజుగా, తిదాలు గోయీముకు రాజుగా ఉన్నారు. 2 వీళ్లు సొదొమ+ రాజు బెరాతో, గొమొర్రా+ రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీము+ రాజు షెమేబెరుతో, బెల (అంటే, సోయరు) రాజుతో యుద్ధం చేశారు. 3 వీళ్లంతా సిద్దీము లోయలో+ అంటే ఉప్పు సముద్రం*+ దగ్గర తమ సైన్యాలతో కలుసుకున్నారు.

4 వీళ్లు* 12 ఏళ్లపాటు కదొర్లాయోమెరు రాజుకు లోబడి ఉన్నారు, కానీ 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. 5 కాబట్టి 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌-కర్నాయిములో రెఫాయీయులను, హాములో జూజీయులను, షావే-కిర్యతాయిములో ఏమీయులను+ ఓడించారు. 6 అలాగే, హోరీయులతో+ వాళ్ల కొండైన శేయీరు+ నుండి ఎడారి* దగ్గరున్న ఏల్పారాను వరకు యుద్ధం చేసి వాళ్లను ఓడించారు. 7 తర్వాత వాళ్లు వెనక్కి తిరిగి ఏన్మిష్పతుకు అంటే కాదేషుకు+ వచ్చి, అమాలేకీయుల+ ప్రాంతమంతటినీ, అలాగే హససోన్‌-తామారులో+ నివసిస్తున్న అమోరీయులను+ జయించారు.

8 ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల (అంటే, సోయరు) రాజు బయల్దేరి సిద్దీము లోయలో యుద్ధ పంక్తులు తీరి, వాళ్లతో 9 అంటే ఏలాము రాజు కదొర్లాయోమెరుతో, గోయీము రాజు తిదాలుతో, షీనారు రాజు అమ్రాపేలుతో, ఎల్లాసరు రాజు అర్యోకుతో యుద్ధం చేశారు.+ అలా ఆ ఐదుగురు రాజులు, ఈ నలుగురు రాజులతో యుద్ధం చేశారు. 10 సిద్దీము లోయ అంతా తారు గుంటలతో నిండిపోయి ఉంది. సొదొమ, గొమొర్రా రాజులు పారిపోవడానికి ప్రయత్నించి వాటిలో పడిపోయారు, మిగిలినవాళ్లు కొండ ప్రాంతానికి పారిపోయారు. 11 గెలిచినవాళ్లు సొదొమ, గొమొర్రా ప్రజల వస్తువులన్నిటినీ, వాళ్ల ఆహారమంతటినీ తీసుకొని తమ దారిన వెళ్లిపోయారు.+ 12 వాళ్లు వెళ్తూవెళ్తూ సొదొమలో నివసిస్తున్న అబ్రాము సహోదరుని కుమారుడైన లోతును,+ అతని వస్తువుల్ని కూడా తీసుకొని వెళ్లారు.

13 ఆ తర్వాత, వాళ్ల నుండి తప్పించుకున్న ఒకతను హెబ్రీయుడైన అబ్రాము దగ్గరికి వచ్చి జరిగింది చెప్పాడు. ఆ సమయంలో అబ్రాము అమోరీయుడైన మమ్రేకు చెందిన మహా వృక్షాల దగ్గర నివసిస్తున్నాడు.*+ ఈ మమ్రేకు ఎష్కోలు, ఆనేరు+ అనే ఇద్దరు సహోదరులు ఉన్నారు. వీళ్లు అబ్రాముతో సంధి చేసుకున్నవాళ్లు. 14 తన బంధువును*+ బందీగా తీసుకెళ్లారని అబ్రాము విన్నప్పుడు, యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన తన మనుషుల్ని అంటే, తన ఇంట్లో పుట్టి పెరిగిన 318 మంది సేవకుల్ని వెంటబెట్టుకొని ఆ రాజుల్ని పట్టుకోవడానికి దాను+ వరకు వెళ్లాడు. 15 రాత్రిపూట అతను తన బలగాల్ని గుంపులుగా విడగొట్టాడు; అతను, అతని సేవకులు ఆ రాజుల మీద దాడిచేసి వాళ్లను ఓడించారు. తర్వాత అతను దమస్కుకు ఉత్తరాన ఉన్న హోబా వరకు వాళ్లను తరిమాడు. 16 అతను తన బంధువైన లోతును, అతని వస్తువుల్ని, అలాగే మిగతా వస్తువులన్నిటినీ, స్త్రీలను, ఇతర ప్రజల్ని వెనక్కి తీసుకొచ్చాడు.

17 అబ్రాము కదొర్లాయోమెరును, అతనితో పాటు ఉన్న రాజుల్ని ఓడించి తిరిగొచ్చినప్పుడు, సొదొమ రాజు అబ్రామును కలవడానికి షావే లోయకు అంటే ‘రాజు లోయకు’+ వచ్చాడు. 18 అప్పుడు షాలేము రాజైన+ మెల్కీసెదెకు+ రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు, అతను సర్వోన్నత దేవుని యాజకుడు.+

19 అతను అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు:

“ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వోన్నత దేవుడు అబ్రామును దీవించాలి;

20 నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవునికి స్తుతి కలగాలి!”

అప్పుడు అబ్రాము తన దగ్గరున్న ప్రతీదానిలో పదోవంతును అతనికి ఇచ్చాడు.+

21 ఆ తర్వాత సొదొమ రాజు అబ్రాముతో, “ప్రజల్ని నాకు ఇచ్చేసి, వస్తువుల్ని నువ్వు తీసుకో” అన్నాడు. 22 కానీ అబ్రాము సొదొమ రాజుతో ఇలా అన్నాడు: “ఆకాశాన్ని, భూమిని సృష్టించిన సర్వోన్నత దేవుడైన యెహోవా ముందు చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. 23 దారం పోగు దగ్గర నుండి చెప్పుల తాడు వరకు నీకు చెందిందేదీ నేను తీసుకోను. ‘నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను’ అని నువ్వు చెప్పకుండా ఉండేలా నీదేదీ నేను తీసుకోను. 24 ఇప్పటికే ఈ యువకులు తిన్నది తప్ప నేను ఇంకేమీ తీసుకోను. అయితే నాతో వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రేలను+ మాత్రం వాళ్ల భాగం వాళ్లను తీసుకోనివ్వు.”

15 ఆ తర్వాత ఒక దర్శనంలో యెహోవా* అబ్రాముతో ఇలా అన్నాడు: “అబ్రామూ, భయపడకు.+ నేను నీకు డాలును.+ నీ ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది.”+ 2 దానికి అబ్రాము ఇలా అన్నాడు: “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు నాకు ఏమి ఇస్తావు? నాకు ఇప్పటికీ పిల్లలు లేరు, దమస్కువాడైన ఎలీయెజెరు+ నా ఇంటికి వారసుడు కాబోతున్నాడు.” 3 అబ్రాము ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నాకు సంతానం*+ ఇవ్వలేదు. ఇదిగో! నా ఇంట్లోని సేవకుడు* నాకు వారసుడు కాబోతున్నాడు.” 4 కానీ యెహోవా అతనితో ఇలా అన్నాడు: “ఇతను నీకు వారసుడు అవ్వడు. నీ సొంత కుమారుడే నీకు వారసుడు అవుతాడు.”+

5 తర్వాత దేవుడు అబ్రామును బయటికి తీసుకొచ్చి, “దయచేసి, ఆకాశం వైపు చూసి నీకు చేతనైతే ఆ నక్షత్రాల్ని లెక్కపెట్టు” అన్నాడు. ఆ తర్వాత దేవుడు, “నీ సంతానం* కూడా వాటిలాగే అవుతుంది” అన్నాడు.+ 6 అబ్రాము యెహోవా మీద విశ్వాసం ఉంచాడు,+ దానివల్ల దేవుడు అతన్ని నీతిమంతునిగా ఎంచాడు.*+ 7 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నేను యెహోవాను, ఈ దేశాన్ని నీకు ఆస్తిగా ఇవ్వడానికి నిన్ను కల్దీయుల ప్రాంతమైన ఊరు నుండి ఇక్కడికి తీసుకొచ్చింది నేనే.”+ 8 అందుకు అబ్రాము, “సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను ఈ దేశాన్ని ఆస్తిగా పొందుతానని నేనెలా నమ్మాలి?” అని అడిగాడు. 9 అప్పుడు దేవుడు అతనికి ఇలా చెప్పాడు: “నాకోసం ఒక మూడేళ్ల ఆవుదూడను, మూడేళ్ల మేకను, మూడేళ్ల పొట్టేలును, ఒక గువ్వను, ఒక పావురం పిల్లను తీసుకో.” 10 కాబట్టి అబ్రాము అవన్నీ తీసుకొని, వాటిని రెండుగా కోసి ఆ ముక్కల్ని ఎదురెదురుగా పెట్టాడు, కానీ పక్షుల్ని మాత్రం అతను కోయలేదు. 11 అప్పుడు, వేటాడే పక్షులు వాటి దగ్గరికి రావడం మొదలుపెట్టాయి, కానీ అబ్రాము ఆ పక్షుల్ని వెళ్లగొడుతూ ఉన్నాడు.

12 సూర్యాస్తమయం కాబోతుండగా, అబ్రాముకు గాఢనిద్ర పట్టింది. భయంకరమైన చిమ్మచీకటి అతన్ని అలుముకుంది. 13 తర్వాత దేవుడు అబ్రాముతో ఇలా అన్నాడు: “నువ్వు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీ సంతానం* తమది కాని దేశంలో పరదేశులుగా జీవిస్తారు, అక్కడి ప్రజలు వీళ్లను బానిసలుగా చేసుకొని, 400 సంవత్సరాల పాటు వీళ్లను బాధిస్తారు.+ 14 కానీ వీళ్లు ఎవరి కిందైతే బానిసలుగా ఉంటారో ఆ జనానికి నేను తీర్పుతీరుస్తాను,+ తర్వాత వీళ్లు చాలా వస్తువులతో బయటికి వస్తారు.+ 15 నువ్వైతే, నెమ్మదితో నీ పూర్వీకుల దగ్గరికి వెళ్తావు; మంచి వృద్ధాప్యంలో పాతిపెట్టబడతావు.+ 16 అయితే నీ వంశస్థులు నాలుగో తరంలో ఇక్కడికి తిరిగొస్తారు,+ ఎందుకంటే అమోరీయుల పాపం ఇంకా సంపూర్ణం కాలేదు.”+

17 సూర్యుడు అస్తమించి, చాలా చీకటైనప్పుడు పొగ లేస్తున్న ఒక కొలిమి కనిపించింది, అబ్రాము కోసి ఉంచిన భాగాల మధ్య నుండి ఒక దివిటీ* వెళ్లింది. 18 ఆ రోజు యెహోవా అబ్రాముతో ఒక ఒప్పందం చేశాడు.+ ఆయన ఇలా అన్నాడు: “ఐగుప్తు నది నుండి యూఫ్రటీసు మహానది+ వరకు ఈ దేశాన్ని నీ సంతానానికి* ఇస్తాను.+ 19 అంటే కేనీయుల+ ప్రాంతాన్ని, కనిజ్జీయుల ప్రాంతాన్ని, కద్మోనీయుల ప్రాంతాన్ని, 20 హిత్తీయుల ప్రాంతాన్ని,+ పెరిజ్జీయుల ప్రాంతాన్ని,+ రెఫాయీయుల ప్రాంతాన్ని,+ 21 అమోరీయుల ప్రాంతాన్ని, కనానీయుల ప్రాంతాన్ని, గిర్గాషీయుల ప్రాంతాన్ని, యెబూసీయుల ప్రాంతాన్ని+ నీ వంశస్థులకు ఇస్తాను.”

16 అబ్రాము భార్య శారయికి పిల్లలు లేరు.+ అయితే ఆమెకు హాగరు+ అనే సేవకురాలు ఉంది, ఈ హాగరు ఐగుప్తీయురాలు. 2 కాబట్టి శారయి అబ్రాముతో ఇలా అంది: “దయచేసి నా మాట విను! యెహోవా నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు. దయచేసి నా సేవకురాలిని తీసుకో.* బహుశా ఆమె ద్వారా నాకు పిల్లలు కలుగుతారు.”+ అప్పుడు అబ్రాము శారయి మాట విన్నాడు. 3 అబ్రాము కనాను దేశంలో పదేళ్లు ఉన్న తర్వాత, అతని భార్య శారయి ఐగుప్తీయురాలైన తన సేవకురాలు హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది. 4 అతను హాగరుతో కలిసినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. ఆమె తాను గర్భవతిని అయ్యానని గ్రహించినప్పుడు తన యజమానురాలిని హీనంగా చూడడం మొదలుపెట్టింది.

5 అప్పుడు శారయి అబ్రాముతో ఇలా అంది: “నీ వల్లే నాకు ఈ హాని జరిగింది. నా సేవకురాలిని నీ కౌగిటికి అప్పగించింది నేనే, కానీ తాను గర్భవతి అయ్యిందని తెలుసుకున్నప్పుడు ఆమె నన్ను హీనంగా చూడడం మొదలుపెట్టింది. నీకు, నాకు మధ్య యెహోవాయే తీర్పు తీర్చాలి.” 6 కాబట్టి అబ్రాము శారయితో ఇలా అన్నాడు: “ఇదిగో! నీ సేవకురాలు నీ చేతి కిందే ఉంది. ఆమె విషయంలో నీకు ఏది మంచిదనిపిస్తే అది చేయి.” అప్పుడు శారయి హాగరును అవమానించింది, దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది.

7 తర్వాత యెహోవా దూత, ఎడారిలో షూరుకు+ వెళ్లే దారిలో ఉన్న ఒక నీటి ఊట దగ్గర ఆమెను కనుగొన్నాడు. 8 ఆ దూత, “శారయి సేవకురాలివైన హాగరూ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె, “నేను నా యజమానురాలైన శారయి నుండి పారిపోతున్నాను” అంది. 9 అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరికి తిరిగెళ్లి, ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు” అన్నాడు. 10 యెహోవా దూత ఇంకా ఇలా అన్నాడు: “నేను నీ సంతానాన్ని* చాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, వాళ్లు లెక్కపెట్టలేనంతమంది అవుతారు.”+ 11 తర్వాత యెహోవా దూత ఇలా అన్నాడు: “నువ్వు ఇప్పుడు గర్భవతివి, నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, అతనికి నువ్వు ఇష్మాయేలు* అని పేరు పెట్టాలి, ఎందుకంటే యెహోవా నీ గోడు విన్నాడు. 12 ఆ పిల్లవాడు అడవి గాడిద* లాంటివాడు అవుతాడు. అతని చెయ్యి ప్రతీ ఒక్కరికి విరోధంగా ఉంటుంది, ప్రతీ ఒక్కరి చెయ్యి అతనికి విరోధంగా ఉంటుంది, అతను తన సహోదరులందరి ఎదుట* నివసిస్తాడు.”

13 అప్పుడు ఆమె తనతో మాట్లాడుతున్న యెహోవా పేరును స్తుతిస్తూ, “నువ్వు చూసే దేవుడివి”+ అంది. అంతేకాదు, “నేను ఇక్కడ నిజంగా నన్ను చూసే వ్యక్తిని చూశాను” అని అంది. 14 అందుకే ఆ బావికి బెయేర్‌-లహాయిరోయి* అనే పేరొచ్చింది. (అది కాదేషుకు, బెరెదుకు మధ్య ఉంది.) 15 హాగరు అబ్రాముకు ఒక కుమారుణ్ణి కన్నది, అబ్రాము తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టాడు.+ 16 హాగరు తనకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయసు 86 ఏళ్లు.

17 అబ్రాముకు 99 ఏళ్లు ఉన్నప్పుడు, యెహోవా అతనికి కనిపించి ఇలా అన్నాడు: “నేను సర్వశక్తిగల దేవుణ్ణి. నువ్వు నా మార్గాల్లో నడుస్తూ నిందలేని* వ్యక్తిగా ఉండు. 2 నేను నీతో చేసిన నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను,+ నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను.”+

3 అందుకు అబ్రాము సాష్టాంగపడ్డాడు, దేవుడు ఇంకా అతనితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: 4 “ఇదిగో! నేను నీతో ఒప్పందం చేశాను,+ నువ్వు ఖచ్చితంగా అనేక జనాలకు తండ్రివౌతావు.+ 5 ఇప్పటినుండి నీ పేరు అబ్రాము* కాదు, అబ్రాహాము.* ఎందుకంటే, నేను నిన్ను అనేక జనాలకు తండ్రిని చేస్తాను. 6 నేను నీ వంశస్థుల్ని చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, నీ నుండి అనేక జనాలు వస్తారు; రాజులు నీ నుండి వస్తారు.+

7 “నేను నీతో, అలాగే నీ తర్వాత తరతరాలపాటు నీ సంతానంతో* చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాను;+ నీకు, నీ తర్వాత నీ సంతానానికి* నేను దేవుడిగా ఉండేందుకు ఇదొక శాశ్వత ఒప్పందం. 8 నువ్వు ఏ దేశంలోనైతే పరదేశిగా జీవించావో+ ఆ కనాను దేశమంతటినీ నీకు, నీ తర్వాత నీ సంతానానికి* శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను, నేను వాళ్లకు దేవుడిగా ఉంటాను.”+

9 దేవుడు అబ్రాహాముతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు, నీ తర్వాత తరతరాలపాటు నీ సంతానం* నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. 10 నేను మీతో చేసే నా ఒప్పందం ఇదే; నువ్వు, నీ తర్వాత నీ సంతానం* దీనికి కట్టుబడి ఉండాలి: మీలో ఉన్న మగవాళ్లందరూ సున్నతి చేయించుకోవాలి.+ 11 మీరు మీ ముందోలును* కోసి సున్నతి చేసుకోవాలి; ఇది నాకూ మీకూ మధ్య ఉన్న ఒప్పందానికి గుర్తుగా ఉంటుంది.+ 12 మీలో ఎనిమిది రోజుల వయసు ఉన్న మగవాళ్లందరికీ సున్నతి చేయించాలి.+ మీ ఇంట్లో పుట్టినవాళ్లలో, నీ సంతానం* కాని వాళ్లలో, డబ్బు ఇచ్చి పరదేశి దగ్గర కొన్నవాళ్లలో మగవాళ్లందరికీ సున్నతి చేయించాలి. తరతరాలు మీరు దీన్ని పాటించాలి. 13 మీ ఇంట్లో పుట్టిన ప్రతీ పురుషునికి, మీ డబ్బుతో కొన్న ప్రతీ పురుషునికి సున్నతి చేయించాలి.+ మీ శరీరంలో కనిపించే నా ఒప్పందం శాశ్వతమైన ఒప్పందంగా ఉంటుంది. 14 మగవాళ్లలో ఎవరైనా సున్నతి చేయించుకోకపోతే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* ఎందుకంటే అతను నా ఒప్పందాన్ని మీరాడు.”

15 తర్వాత దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నీ భార్య శారయి*+ విషయానికొస్తే, నువ్వు ఆమెను శారయి అని పిలవకూడదు. ఎందుకంటే ఇప్పటినుండి ఆమె పేరు శారా.* 16 నేను ఆమెను దీవిస్తాను, ఆమె ద్వారా నీకు ఒక కుమారుణ్ణి కూడా ఇస్తాను;+ అవును, నేను ఆమెను దీవిస్తాను, ఆమె నుండి జనాలు వస్తారు; రాజులు ఆమె నుండి వస్తారు.” 17 అందుకు అబ్రాహాము సాష్టాంగపడి, నవ్వుకుంటూ తన హృదయంలో ఇలా అనుకున్నాడు:+ “100 ఏళ్ల ముసలివాడికి పిల్లలు పుడతారా? 90 ఏళ్ల శారా పిల్లల్ని కంటుందా?”+

18 కాబట్టి అబ్రాహాము సత్యదేవునితో ఇలా అన్నాడు: “ఇష్మాయేలు మీద నీ దీవెన ఉండాలి!”+ 19 అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నీ భార్య శారా ఖచ్చితంగా నీకు ఒక కుమారుణ్ణి కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు*+ అని పేరు పెట్టాలి. నేను అతనితో నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను, అది అతనికి, అతని తర్వాత అతని సంతానానికి* శాశ్వత ఒప్పందంగా ఉంటుంది.+ 20 ఇష్మాయేలు విషయానికొస్తే, అతని గురించి నువ్వు చేసిన విన్నపాన్ని నేను విన్నాను. ఇదిగో! నేను అతన్ని దీవిస్తాను; అతనికి పిల్లలు పుట్టేలా, అతని వంశస్థులు చాలాచాలా ఎక్కువమంది అయ్యేలా చేస్తాను. అతని నుండి 12 మంది ప్రధానులు వస్తారు, నేను అతన్ని ఒక గొప్ప జనంగా చేస్తాను.+ 21 అయితే, నేను నా ఒప్పందాన్ని ఇస్సాకుతో స్థిరపరుస్తాను.+ వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా అతన్ని కంటుంది.”+

22 అబ్రాహాముతో మాట్లాడడం పూర్తయిన తర్వాత దేవుడు అక్కడి నుండి పైకి వెళ్లిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము తన కుమారుడు ఇష్మాయేలును, తన ఇంట్లో పుట్టిన మగవాళ్లందర్నీ, తాను డబ్బుతో కొన్న మగవాళ్లందర్నీ, తన ఇంట్లో ఉన్న మగవాళ్లందర్నీ తీసుకొని దేవుడు తనకు చెప్పినట్టు అదే రోజున వాళ్లకు సున్నతి చేయించాడు.+ 24 అబ్రాహాము సున్నతి చేయించుకున్నప్పుడు+ అతని వయసు 99 ఏళ్లు. 25 అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలుకు సున్నతి చేయబడినప్పుడు అతని వయసు 13 ఏళ్లు.+ 26 అదే రోజున అబ్రాహాముకు, అతని కుమారుడు ఇష్మాయేలుకు సున్నతి చేయబడింది. 27 అతనితోపాటే అతని ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ, అంటే అతని ఇంట్లో పుట్టిన మగవాళ్లందరికీ, డబ్బు ఇచ్చి పరదేశి దగ్గర కొన్న మగవాళ్లందరికీ సున్నతి చేయబడింది.

18 ఆ తర్వాత, అబ్రాహాము మిట్టమధ్యాహ్న సమయంలో మమ్రే మహా వృక్షాల+ దగ్గర తన డేరా ప్రవేశ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా+ అతనికి కనిపించాడు. 2 అతను తల ఎత్తి చూసినప్పుడు కొంత దూరంలో ముగ్గురు మనుషులు కనిపించారు.+ అతను వాళ్లను చూడగానే, వాళ్లను కలవడానికి తన డేరా ప్రవేశ ద్వారం దగ్గర నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి, వాళ్లకు వంగి నమస్కారం చేశాడు. 3 తర్వాత అతను ఇలా అన్నాడు: “యెహోవా, నీ అనుగ్రహం నా మీద ఉంటే, దయచేసి నీ సేవకుణ్ణి దాటి వెళ్లకు. 4 కొన్ని నీళ్లు తెప్పిస్తాను, వాటితో మీ కాళ్లు కడుక్కొని,+ దయచేసి ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. 5 మీరు మీ సేవకుని దగ్గరికి వచ్చారు కాబట్టి, నేను వెళ్లి కొంత ఆహారం తీసుకొస్తాను. మీరు సేదదీరి,* ఆ తర్వాత మీ దారిన వెళ్లొచ్చు.” అప్పుడు వాళ్లు, “సరే, అలాగే కానివ్వు” అన్నారు.

6 కాబట్టి అబ్రాహాము పరుగుపరుగున డేరాలో ఉన్న శారా దగ్గరికి వెళ్లి, “వెంటనే మూడు కొలతల* మెత్తని పిండి తీసుకొని, దాన్ని పిసికి, రొట్టెలు చేయి” అన్నాడు. 7 తర్వాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి, మంచి లేత దూడను తీసుకొచ్చి తన పనివాడికి ఇచ్చాడు. అతను త్వరత్వరగా దాన్ని కోసి, వండాడు. 8 ఆ తర్వాత అబ్రాహాము వెన్నను, పాలను, తాను వండించిన లేత దూడను తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టాడు. వాళ్లు తింటూ ఉండగా అతను వాళ్ల దగ్గరే చెట్టు కింద నిలబడి ఉన్నాడు.+

9 వాళ్లు అబ్రాహామును, “నీ భార్య శారా+ ఎక్కడుంది?” అని అడిగారు. అందుకతను, “ఇక్కడే డేరాలో ఉంది” అన్నాడు. 10 అప్పుడు వాళ్లలో ఒకరు, “నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఖచ్చితంగా నీ దగ్గరికి తిరిగొస్తాను. ఇదిగో! అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు పుడతాడు”+ అన్నారు. శారా ఆ సమయంలో అతని వెనకున్న డేరా ద్వారం దగ్గర ఉండి వింటూ ఉంది. 11 అప్పటికి అబ్రాహాము, శారాలు చాలా ముసలివాళ్లు.+ శారాకు పిల్లల్ని కనే వయసు దాటిపోయింది.*+ 12 కాబట్టి శారా, “నేను ముసలిదాన్ని అయిపోయాను, నా ప్రభువు కూడా ముసలివాడైపోయాడు. ఇప్పుడు నిజంగా నాకు ఈ సంతోషం కలుగుతుందా?” అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంది.+ 13 తర్వాత యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: “శారా ఎందుకు నవ్వింది? ‘నేను ముసలిదాన్ని కదా, నిజంగా నాకు పిల్లలు పుడతారా’ అని ఎందుకు అంది? 14 యెహోవాకు సాధ్యంకానిది అంటూ ఏదైనా ఉందా?+ వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను తిరిగొస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు.” 15 కానీ శారా భయపడి, “లేదు! నేను నవ్వలేదు” అంది. అప్పుడు ఆయన, “లేదు! నువ్వు నవ్వావు” అన్నాడు.

16 తర్వాత ఆ మనుషులు వెళ్లిపోవడానికి లేచారు, వాళ్లను సాగనంపడానికి అబ్రాహాము వాళ్లతోపాటే నడుస్తున్నాడు. అప్పుడు ఆ మనుషులు సొదొమ వైపు చూశారు.+ 17 యెహోవా ఇలా అన్నాడు: “నేను చేయబోయేదాన్ని అబ్రాహాముకు తెలీకుండా దాస్తానా?+ 18 ఖచ్చితంగా అబ్రాహాము బలమైన గొప్ప జనం అవుతాడు. భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు అతని ద్వారా దీవించబడతారు.*+ 19 ఎందుకంటే సరైనది, న్యాయమైనది చేస్తూ యెహోవా మార్గంలో నడుస్తూ ఉండమని అబ్రాహాము తన కుమారులకు, తన ఇంటివాళ్లకు ఆజ్ఞాపించేలా నేను అతన్ని ఎంచుకున్నాను.*+ అప్పుడు యెహోవానైన నేను అబ్రాహాము విషయంలో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను.”

20 తర్వాత యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ, గొమొర్రాల పాపం చాలా భారంగా ఉంది.+ ఆ నగరాల గురించిన మొర నాకు చాలా బిగ్గరగా వినిపిస్తోంది.+ 21 నేను కిందికి వెళ్లి, నాకు వినబడిన మొర నిజమో కాదో, వాళ్ల పనులు నిజంగా అంత చెడ్డగా ఉన్నాయో లేదో చూస్తాను. నాకు అది తెలుసుకోవాలనుంది.”+

22 తర్వాత ఆ మనుషులు అక్కడి నుండి సొదొమ వైపు వెళ్లారు, కానీ యెహోవా+ అబ్రాహాముతోనే ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నువ్వు నిజంగా దుష్టులతో పాటు నీతిమంతుల్ని తుడిచిపెడతావా?+ 24 ఒకవేళ ఆ నగరంలో 50 మంది నీతిమంతులు ఉన్నారనుకో. అప్పుడు కూడా నువ్వు వాళ్లను తుడిచిపెట్టేస్తావా? ఆ 50 మంది కోసం ఆ నగరాన్ని క్షమించవా? 25 నువ్వు ఎన్నడూ దుష్టునితో పాటు నీతిమంతున్ని చంపేయవు! అలాచేస్తే నీతిమంతునికి, దుష్టునికి దొరికే ప్రతిఫలం ఒక్కటే అవుతుంది.+ నువ్వు ఎన్నడూ అలా చేయవు.+ భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”+ 26 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ నగరంలో నాకు 50 మంది నీతిమంతులు కనిపిస్తే, వాళ్లకోసం నేను ఆ నగరాన్నంతా క్షమిస్తాను.” 27 కానీ అబ్రాహాము మళ్లీ ఇలా అన్నాడు: “ధూళిని, బూడిదను అయిన నేను యెహోవాతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, దయచేసి నన్ను మాట్లాడనివ్వు. 28 ఒకవేళ 50 మంది నీతిమంతుల్లో ఒక ఐదుగురు తగ్గారనుకో. అలా ఐదుగురు తగ్గినందుకు మొత్తం నగరాన్ని నాశనం చేస్తావా?” దానికి దేవుడు, “నాకు అక్కడ 45 మంది కనిపించినా నేను దాన్ని నాశనం చేయను”+ అన్నాడు.

29 కానీ అబ్రాహాము మళ్లీ దేవునితో, “ఒకవేళ 40 మందే కనిపించారనుకో” అన్నాడు. దానికి దేవుడు, “ఆ 40 మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 30 అబ్రాహాము మళ్లీ మాట్లాడుతూ ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి కోపంతో మండిపడకుండా,+ నన్ను మాట్లాడనివ్వు. అక్కడ 30 మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “నాకు 30 మంది కనిపిస్తే, నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 31 కానీ అబ్రాహాము మళ్లీ ఇలా అన్నాడు: “నేను యెహోవాతో మాట్లాడడానికి తెగిస్తున్నాను, దయచేసి నన్ను మాట్లాడనివ్వు. అక్కడ 20 మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “ఆ 20 మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 32 చివరిగా అబ్రాహాము ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి కోపంతో మండిపడకు, ఇంకొక్కసారి నన్ను మాట్లాడనివ్వు. అక్కడ పది మందే కనిపించారనుకో.” దానికి దేవుడు, “ఆ పది మంది కోసం నేను దాన్ని నాశనం చేయను” అన్నాడు. 33 అబ్రాహాముతో మాట్లాడడం అయిపోయినప్పుడు యెహోవా అక్కడి నుండి వెళ్లిపోయాడు,+ అబ్రాహాము తిరిగి తన డేరా దగ్గరికి వెళ్లిపోయాడు.

19 సాయంకాలానికల్లా ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరుకున్నారు, అప్పుడు లోతు సొదొమ నగర ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు వాళ్లను చూసినప్పుడు లేచి, వాళ్లను కలవడానికి వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.+ 2 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నా ప్రభువులారా, దయచేసి మీ సేవకుని ఇంటికి వచ్చి ఈ రాత్రి అక్కడే బస చేయండి, మీ పాదాల్ని కడగనివ్వండి. ఆ తర్వాత తెల్లవారుజామునే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” దానికి వాళ్లు, “లేదు, మేము ఈ రాత్రి వీధిలోనే ఉంటాం” అన్నారు. 3 కానీ లోతు చాలా పట్టుబట్టడంతో వాళ్లు అతని ఇంటికి వెళ్లారు. అతను వాళ్లకు విందు ఏర్పాటు చేసి, పులవని రొట్టెలు కాల్చాడు, వాళ్లు తిన్నారు.

4 వాళ్లు పడుకోకముందు, సొదొమ నగరంలోని పురుషులంతా అంటే పిల్లవాడి నుండి ముసలివాడి వరకు అందరూ మూకుమ్మడిగా వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు. 5 వాళ్లు లోతును పిలుస్తూ, “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన మనుషులు ఏరి? వాళ్లను బయటికి తీసుకురా, మేము వాళ్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలి” అన్నారు.+

6 అప్పుడు లోతు బయటికి వచ్చి ఇంటి తలుపు వేసేశాడు. 7 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నా సహోదరులారా, దయచేసి చెడుగా ప్రవర్తించకండి. 8 దయచేసి నా మాట వినండి, నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు, వాళ్లు కన్యలు. వాళ్లను బయటికి తీసుకొస్తాను, వాళ్లతో మీకు ఇష్టమొచ్చినట్టు చేయండి. కానీ ఈ మనుషులు నా నీడన చేరారు కాబట్టి వాళ్లను ఏమీ చేయకండి.”+ 9 దానికి వాళ్లు అతనితో, “నువ్వు పక్కకు తప్పుకో!” అని, “ఈ ఏకాకి పరదేశిగా నివసించడానికి ఇక్కడికి వచ్చాడు. అయినా మనకే తీర్పు తీర్చడానికి తెగిస్తున్నాడు! మేము నీకిప్పుడు వాళ్లకు చేయాలనుకున్న దానికన్నా ఎక్కువ చెడు చేస్తాం” అన్నారు. వాళ్లు గుంపుగా లోతు మీదికి ఎగబడి, అతన్ని నెట్టుకుంటూ తలుపు బద్దలుగొట్టడానికి ప్రయత్నించారు. 10 అప్పుడు లోతు ఇంట్లో ఉన్న మనుషులు తమ చేతులు చాపి లోతును లోపలికి లాగి తలుపు వేసేశారు. 11 అయితే వాళ్లు గుమ్మం దగ్గరున్న పురుషులకు, అంటే చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ గుడ్డితనం కలగజేశారు. దాంతో బయట ఉన్నవాళ్లు తలుపు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ప్రయత్నించీ ప్రయత్నించీ అలసిపోయారు.

12 ఆ తర్వాత, లోతు ఇంట్లో ఉన్న ఇద్దరు మనుషులు అతనితో ఇలా అన్నారు: “ఇక్కడ నీవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కూతుళ్లు, నీవాళ్లు ఇంకెవరైనా ఈ నగరంలో ఉంటే వాళ్లందర్నీ ఈ చోటు నుండి బయటికి తీసుకెళ్లు! 13 ఎందుకంటే మేము ఈ నగరాన్ని నాశనం చేయబోతున్నాం. యెహోవా ముందు వీళ్ల గురించిన మొర చాలా బిగ్గరగా వినిపిస్తోంది,+ అందుకే ఈ నగరాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు.” 14 కాబట్టి లోతు బయటికి వెళ్లి, తనకు కాబోయే అల్లుళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతను వాళ్లతో, “లెండి! ఈ చోటు నుండి బయటికి వచ్చేయండి. ఎందుకంటే యెహోవా ఈ నగరాన్ని నాశనం చేస్తాడు!” అని అంటూ ఉన్నాడు. కానీ అతను చెప్పేది అతని అల్లుళ్లకు నవ్వులాటలా అనిపించింది.+

15 తెల్లవారుతున్నప్పుడు ఆ దేవదూతలు లోతును తొందరపెడుతూ, “లే! ఈ నగర పాపంలో మీరు కూడా కొట్టుకొనిపోకుండా ఉండేలా నీ భార్యను, ఇద్దరు కూతుళ్లను తీసుకొని వెళ్లు!” అన్నారు.+ 16 లోతు ఆలస్యం చేస్తుండడంతో, అతని మీద యెహోవాకు ఉన్న కనికరం వల్ల,+ ఆ దేవదూతలు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కూతుళ్ల చేతుల్ని పట్టుకొని వాళ్లను బయటికి తీసుకొచ్చి, నగరం బయట నిలబెట్టారు.+ 17 వాళ్లను నగర పొలిమేర్లకు తీసుకొచ్చిన వెంటనే, ఆ ఇద్దరు దూతల్లో ఒక దూత, “నీ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో! వెనక్కి తిరిగి చూడకు,+ ఈ ప్రాంతంలో+ ఇంకెక్కడా ఆగకు! నువ్వు తుడిచిపెట్టబడకుండా ఉండేలా కొండ ప్రాంతానికి పారిపో!” అన్నాడు.

18 అప్పుడు లోతు వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవా, దయచేసి నన్ను అక్కడికి పంపించకు! 19 నీ సేవకుడు నీ అనుగ్రహం పొందాడు, నన్ను ప్రాణాలతో ఉంచడం+ ద్వారా నువ్వు నా మీద గొప్ప దయ* చూపిస్తున్నావు. కానీ నేను ఆ కొండ ప్రాంతానికి పారిపోలేను, ఎందుకంటే నేను పారిపోయేలోగా ఆ విపత్తు నా మీదికి కూడా వచ్చి చనిపోతానేమో అని భయంగా ఉంది.+ 20 ఈ పట్టణం దగ్గరగా ఉంది, నేను అక్కడికి పారిపోగలను; అది చిన్న పట్టణమే. దయచేసి, నేను అక్కడికి పారిపోవచ్చా? అది చిన్న పట్టణమే. అక్కడికి వెళ్తే నేను తప్పించుకోగలను.”* 21 అప్పుడు ఆ దూత అతనితో ఇలా అన్నాడు: “సరే, నేను నీ విన్నపాన్ని అంగీకరిస్తాను,+ నువ్వు చెప్తున్న ఆ పట్టణాన్ని నాశనం చేయను.+ 22 త్వరగా అక్కడికి పారిపో! ఎందుకంటే నువ్వు అక్కడికి చేరుకునే వరకు నేను ఏమీ చేయలేను!”+ అందుకే ఆ పట్టణానికి సోయరు*+ అనే పేరు వచ్చింది.

23 లోతు సోయరుకు చేరుకునేసరికల్లా సూర్యుడు ఉదయించాడు. 24 తర్వాత యెహోవా సొదొమ, గొమొర్రాల మీద అగ్నిగంధకాల్ని కురిపించాడు. అవి యెహోవా దగ్గర నుండి, ఆకాశం నుండి కురిశాయి.+ 25 ఆయన ఆ నగరాల్ని, ఆ ప్రాంతమంతటినీ, ఆ నగరాల్లో ఉన్న ప్రజలందర్నీ, మొక్కల్నీ నాశనం చేశాడు.+ 26 అయితే లోతు వెనకాలే వస్తున్న అతని భార్య మాత్రం వెనక్కి చూడడం మొదలుపెట్టింది, దాంతో ఆమె ఉప్పు స్తంభం అయ్యింది.+

27 అబ్రాహాము తెల్లవారుజామునే లేచి, అంతకుముందు తాను యెహోవా ఎదుట నిలబడిన చోటికి వెళ్లాడు.+ 28 అతను కింది వైపు సొదొమను, గొమొర్రాను, ఆ ప్రాంతమంతటినీ చూసినప్పుడు, ఇదిగో! కొలిమిలో* నుండి లేచినట్టు ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగ పైకి లేస్తోంది!+ 29 అలా దేవుడు ఆ ప్రాంతంలోని నగరాల్ని నాశనం చేసినప్పుడు అబ్రాహామును మనసులో ఉంచుకున్నాడు. ఎలాగంటే, దేవుడు తాను నాశనం చేసిన నగరాల నుండి, అంటే లోతు ఏ నగరాల్లోనైతే నివసిస్తున్నాడో వాటి నుండి అతన్ని బయటికి పంపించాడు.+

30 ఆ తర్వాత లోతు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి సోయరు నుండి కొండ ప్రాంతానికి+ వెళ్లిపోయి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు, ఎందుకంటే సోయరులో+ జీవించడానికి అతను భయపడ్డాడు. అలా అతను తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక గుహలో నివసించడం మొదలుపెట్టాడు. 31 అప్పుడు పెద్ద కూతురు తన చెల్లితో ఇలా అంది: “మన తండ్రి ముసలివాడు. మనం అందరిలా పెళ్లి చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఒక్క పురుషుడు కూడా లేడు. 32 కాబట్టి, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి, ఆ తర్వాత అతనితో పడుకొని మన తండ్రి ద్వారా వంశాన్ని నిలబెడదాం.”

33 కాబట్టి ఆ రాత్రి వాళ్లు తమ తండ్రికి ద్రాక్షారసం ఇస్తూనే ఉన్నారు; తర్వాత పెద్ద కూతురు లోపలికి వెళ్లి తన తండ్రితో పడుకుంది. కానీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు. 34 ఆ తర్వాతి రోజు పెద్దామె తన చెల్లితో ఇలా అంది: “నిన్న రాత్రి నేను మన తండ్రితో పడుకున్నాను. ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసం ఇద్దాం. ఆ తర్వాత నువ్వు వెళ్లి అతనితో పడుకో. అలా మన తండ్రి ద్వారా వంశాన్ని నిలబెడదాం.” 35 కాబట్టి ఆ రాత్రి కూడా వాళ్లు తమ తండ్రికి అదేపనిగా ద్రాక్షారసం ఇస్తూ ఉన్నారు; ఆ తర్వాత చిన్న కూతురు వెళ్లి అతనితో పడుకుంది. కానీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు. 36 అలా లోతు ఇద్దరు కూతుళ్లూ తమ తండ్రి ద్వారా గర్భవతులయ్యారు. 37 పెద్దామె ఒక కుమారుణ్ణి కని, అతనికి మోయాబు+ అని పేరు పెట్టింది. అతను నేటి మోయాబీయులకు+ తండ్రి. 38 చిన్నామె కూడా ఒక కుమారుణ్ణి కని, అతనికి బెన్నమ్మి అని పేరు పెట్టింది. అతను నేటి అమ్మోనీయులకు+ తండ్రి.

20 అబ్రాహాము అక్కడి నుండి+ నెగెబుకు వెళ్లి కాదేషుకు,+ షూరుకు+ మధ్య డేరాలు వేసుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. అతను గెరారులో+ నివసిస్తున్నప్పుడు,* 2 అబ్రాహాము మళ్లీ తన భార్య శారా గురించి, “ఈమె నా చెల్లి” అని చెప్పాడు.+ కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు మనుషుల్ని పంపించి శారాను తన ఇంటికి తెప్పించుకున్నాడు.+ 3 తర్వాత దేవుడు ఒక కలలో అబీమెలెకు దగ్గరికి వచ్చి అతనితో ఇలా అన్నాడు: “నువ్వు ఇంటికి తెచ్చుకున్న స్త్రీకి పెళ్లయింది, ఆమె ఇంకొకరి భార్య,+ కాబట్టి ఆమె కారణంగా నువ్వు చనిపోతావు.”+ 4 అయితే అప్పటికింకా అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్లలేదు.* కాబట్టి అతను ఇలా అన్నాడు: “యెహోవా, నిర్దోషులైన* జనాన్ని నువ్వు చంపేస్తావా? 5 ‘ఈమె నా చెల్లి’ అని అతను, ‘ఇతను నా అన్న’ అని ఆమె చెప్పలేదా? ఆమెను తీసుకొచ్చినప్పుడు నా మనసులో ఎలాంటి చెడు ఆలోచనా లేదు, నేను తప్పు చేస్తున్నాననే విషయం కూడా నాకు తెలీదు.” 6 తర్వాత సత్యదేవుడు కలలో అతనితో ఇలా అన్నాడు: “నువ్వు అలా చేసినప్పుడు నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనా లేదని నాకు తెలుసు, కాబట్టే నాకు వ్యతిరేకంగా పాపం చేయకుండా నిన్ను ఆపాను. అందుకే నిన్ను ఆమెను ముట్టనివ్వలేదు కూడా. 7 ఇప్పుడు అతని భార్యను అతనికి ఇచ్చేయి; అతను ఒక ప్రవక్త,+ అతను నీ కోసం వేడుకుంటాడు,+ అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉంటావు. కానీ నువ్వు ఆమెను తిరిగి ఇచ్చేయకపోతే నువ్వు, నీ వాళ్లంతా ఖచ్చితంగా చనిపోతారని తెలుసుకో.”

8 అబీమెలెకు తెల్లవారుజామునే లేచి, తన సేవకులందర్నీ పిలిచి ఈ విషయాలన్నీ వాళ్లకు చెప్పాడు. దాంతో వాళ్లు చాలా భయపడ్డారు. 9 తర్వాత అబీమెలెకు అబ్రాహామును పిలిపించి అతనితో ఇలా అన్నాడు: “నువ్వు మాకు చేసింది ఏంటి? నువ్వు నాకూ నా రాజ్యానికీ ఇంత పెద్ద పాపాన్ని అంటగట్టడానికి నేను నీ విషయంలో ఏం పాపం చేశాను? నువ్వు నాకు చేసింది సరైనది కాదు.” 10 తర్వాత అబీమెలెకు అబ్రాహామును, “నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా చేశావు?” అని అడిగాడు.+ 11 దానికి అబ్రాహాము ఇలా చెప్పాడు: “ఎందుకంటే, ‘ఖచ్చితంగా ఈ ప్రాంతంలోని ప్రజలకు దైవభయం లేదు; నా భార్య కోసం వీళ్లు నన్ను చంపేస్తారు’ అని నాకు అనిపించింది.+ 12 అంతేకాదు, నిజంగానే ఈమె నాకు చెల్లి అవుతుంది. మా ఇద్దరికీ తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు; ఈమెను నేను పెళ్లి చేసుకున్నాను.+ 13 కాబట్టి, దేవుడు నన్ను నా తండ్రి ఇంటి నుండి ప్రయాణమై వెళ్లమన్నప్పుడు+ నేను ఆమెతో ఇలా అన్నాను: ‘మనం వెళ్లే ప్రతీచోట, నా గురించి “ఇతను నా అన్న” అని చెప్పు.+ అలా నువ్వు నా పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించిన దానివౌతావు.’ ”

14 తర్వాత అబీమెలెకు గొర్రెల్ని, పశువుల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను అబ్రాహాముకు ఇచ్చాడు; అతని భార్య శారాను కూడా అతనికి తిరిగి ఇచ్చేశాడు. 15 అంతేకాదు అబీమెలెకు ఇలా అన్నాడు: “ఇదిగో, నా దేశమంతా నీ ముందు ఉంది. నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు.” 16 అతను శారాతో ఇలా అన్నాడు: “ఇదిగో, నీ అన్నకు+ 1,000 వెండి రూకలు ఇస్తున్నాను. నీతో ఉన్నవాళ్లందరి కళ్లముందు, అలాగే ప్రతీ ఒక్కరి కళ్లముందు నువ్వు నిర్దోషివి అనడానికి ఇది గుర్తుగా ఉంది. నీ మీద ఇక ఏ నిందా ఉండదు.” 17 తర్వాత అబ్రాహాము సత్యదేవుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాడు. దాంతో దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసురాళ్లను బాగుచేశాడు. అప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టడం మొదలైంది; 18 ఎందుకంటే, అప్పటిదాకా అబ్రాహాము భార్య శారా కారణంగా+ యెహోవా అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరికీ పిల్లలు పుట్టకుండా చేశాడు.*

21 యెహోవా తాను చెప్పినట్టే శారాను గుర్తుచేసుకున్నాడు. ఆమె విషయంలో యెహోవా తన వాగ్దానాన్ని నెరవేర్చాడు.+ 2 కాబట్టి ఆమె గర్భవతి అయ్యి,+ అబ్రాహాము ముసలితనంలో అతనికి ఒక కుమారుణ్ణి కన్నది. దేవుడు చెప్పిన సమయంలోనే అది జరిగింది.+ 3 అబ్రాహాము అప్పుడే పుట్టిన తన కుమారునికి, అంటే శారా తనకు కనిన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.+ 4 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే, అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకుకు ఎనిమిదో రోజున సున్నతి చేయించాడు.+ 5 తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయసు 100 ఏళ్లు. 6 తర్వాత శారా ఇలా అంది: “దేవుడు నన్ను సంతోషంతో నవ్వేలా చేశాడు; ఇది విన్నవాళ్లంతా నాతో కలిసి నవ్వుతారు.”* 7 ఆమె ఇంకా ఇలా అంది: “ ‘శారా తప్పకుండా పిల్లలకు పాలిస్తుంది’ అని అబ్రాహాముతో ఎవరు అనివుండగలిగేవాళ్లు? అయినా, నేను అతని ముసలితనంలో అతని కోసం ఒక కుమారుణ్ణి కన్నాను.”

8 తర్వాత ఆ పిల్లవాడు పెరిగి, పాలు విడిచాడు. ఆ పిల్లవాడు పాలు విడిచిన రోజున అబ్రాహాము పెద్ద విందు ఏర్పాటు చేశాడు. 9 అయితే, ఐగుప్తీయురాలైన హాగరు అబ్రాహాముకు కన్న కుమారుడు,+ ఇస్సాకును ఎగతాళి చేస్తుండడం+ శారా చాలాసార్లు గమనించింది. 10 కాబట్టి శారా అబ్రాహాముతో ఇలా అంది: “ఈ దాసురాలిని, ఈమె కుమారుణ్ణి వెళ్లగొట్టు. ఎందుకంటే ఈ దాసురాలి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతోపాటు వారసుడిగా ఉండబోడు.”+ 11 కానీ అబ్రాహాముకు, తన కుమారుని గురించి శారా చెప్పింది అస్సలు నచ్చలేదు.+ 12 అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు: “ఆ అబ్బాయి గురించి, నీ దాసురాలి గురించి శారా నీకు చెప్తున్న మాటను బట్టి నొచ్చుకోకు. ఆమె మాట విను. ఎందుకంటే ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానం* అనబడుతుంది.+ 13 ఆ దాసురాలి కుమారుని+ విషయానికొస్తే, అతను కూడా నీ సంతానమే* కాబట్టి అతని వంశస్థుల్ని కూడా ఒక జనం అయ్యేలా చేస్తాను.”+

14 కాబట్టి అబ్రాహాము తెల్లవారుజామునే లేచి రొట్టెను, నీళ్లున్న తోలుసంచిని తీసుకొని హాగరుకు ఇచ్చాడు. వాటిని ఆమె భుజం మీద పెట్టి ఆ అబ్బాయితో పాటు ఆమెను పంపించేశాడు.+ కాబట్టి ఆమె అక్కడి నుండి వెళ్లిపోయి, బెయేర్షెబా+ ఎడారిలో తిరుగుతూ ఉంది. 15 చివరికి, ఆ తోలుసంచిలోని నీళ్లు అయిపోయాయి. అప్పుడామె ఆ అబ్బాయిని అక్కడున్న పొదల్లో ఒకదాని కిందికి నెట్టింది. 16 ఆ తర్వాత ఆమె, “వీడు చనిపోతుంటే నేను చూడలేను” అనుకొని, బాణం వెళ్లేంత దూరం వెళ్లి ఒక్కతే కూర్చొని గట్టిగట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది.

17 అప్పుడు దేవుడు ఆ అబ్బాయి ఏడ్పును విన్నాడు.+ పరలోకం నుండి ఒక దేవదూత హాగరును పిలిచి ఇలా అన్నాడు:+ “హాగరూ, ఎందుకు ఏడుస్తున్నావు? భయపడకు. ఆ అబ్బాయి ఏడ్పును దేవుడు విన్నాడు. 18 లే, ఆ అబ్బాయిని పైకి లేపి, గట్టిగా పట్టుకో. ఎందుకంటే నేను అతన్ని ఒక గొప్ప జనంగా చేస్తాను.”+ 19 తర్వాత దేవుడు ఆమె కళ్లను తెరిచినప్పుడు, ఆమె అక్కడ ఒక నీళ్ల బావిని చూసింది. అప్పుడు ఆమె అక్కడికి వెళ్లి తన తోలుసంచిలో నీళ్లు నింపి, ఆ అబ్బాయికి తాగించింది. 20 ఆ అబ్బాయి+ పెరిగి పెద్దవాడౌతుండగా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఎడారిలో నివసిస్తూ విలుకాడు అయ్యాడు. 21 అతను పారాను ఎడారిలో+ నివాసం ఏర్పర్చుకున్నాడు. వాళ్ల అమ్మ ఒక ఐగుప్తీయురాలితో అతనికి పెళ్లి చేసింది.

22 ఆ సమయంలో అబీమెలెకు తన సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నువ్వు చేసే ప్రతీ పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.+ 23 కాబట్టి నువ్వు నాతో, నా సంతానంతో, నా వంశస్థులతో మోసపూరితంగా వ్యవహరించననీ; నేను నీతో వ్యవహరించినట్టే+ నువ్వు కూడా నాతో, నువ్వు నివసిస్తున్న ప్రాంతంలోని ప్రజలతో విశ్వసనీయ ప్రేమతో వ్యవహరిస్తాననీ దేవుని ముందు నాకు ప్రమాణం చేయి.” 24 దానికి అబ్రాహాము, “నేను ప్రమాణం చేస్తున్నాను” అన్నాడు.

25 అయితే, అబీమెలెకు సేవకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న నీళ్ల బావి+ గురించి అబ్రాహాము అబీమెలెకుకు ఫిర్యాదు చేశాడు. 26 అందుకు అబీమెలెకు ఇలా అన్నాడు: “ఈ పని ఎవరు చేశారో నాకు తెలీదు; నువ్వు కూడా దాని గురించి నాకు చెప్పలేదు, ఈ రోజు వరకు దాని గురించి ఎవ్వరూ నాతో ఒక్కమాట కూడా అనలేదు.” 27 అప్పుడు అబ్రాహాము గొర్రెల్ని, పశువుల్ని తీసుకొని అబీమెలెకుకు ఇచ్చాడు. అలా వాళ్లిద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. 28 అబ్రాహాము, మందలో నుండి ఏడు ఆడ గొర్రెపిల్లల్ని పక్కకు తీసి ఉంచాడు. 29 అప్పుడు అబీమెలెకు, “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఎందుకు పక్కకు తీసి ఉంచావు?” అని అబ్రాహామును అడిగాడు. 30 దానికి అబ్రాహాము, “ఈ బావిని నేనే తవ్వాను అనడానికి సాక్ష్యంగా నువ్వు ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి తీసుకోవాలి” అన్నాడు. 31 అక్కడ వాళ్లిద్దరు ప్రమాణం చేసుకున్నారు కాబట్టి అతను ఆ చోటును బెయేర్షెబా* అని పిలిచాడు.+ 32 అలా వాళ్లు బెయేర్షెబా దగ్గర ఒప్పందం చేసుకున్న+ తర్వాత అబీమెలెకు తన సైన్యాధిపతి ఫీకోలుతో కలిసి ఫిలిష్తీయుల+ దేశానికి వెళ్లిపోయాడు. 33 తర్వాత అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పిచుల చెట్టును నాటి, నిత్య దేవుడైన+ యెహోవా పేరును స్తుతించాడు.+ 34 అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో చాలాకాలం* ఉన్నాడు.*+

22 అది జరిగిన తర్వాత సత్యదేవుడు అబ్రాహామును పరీక్షించాడు.+ దేవుడు అతన్ని, “అబ్రాహామూ!” అని పిలిచాడు, దానికి అతను, “చెప్పు ప్రభువా!” అన్నాడు. 2 దేవుడు అతనితో ఇలా అన్నాడు: “దయచేసి, నీ కుమారుణ్ణి, అంటే నువ్వు ఎంతగానో ప్రేమించే+ నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును+ తీసుకొని, మోరీయా+ దేశానికి వెళ్లు. అక్కడ నేను నీకు చూపించబోయే కొండ మీద అతన్ని దహనబలిగా అర్పించు.”

3 కాబట్టి అబ్రాహాము తెల్లవారుజామునే లేచి, గాడిదకు జీను* కట్టి తనతోపాటు ఇద్దరు సేవకుల్ని, తన కుమారుడు ఇస్సాకును తీసుకొని, దహనబలి కోసం కట్టెలు కొట్టి, లేచి, సత్యదేవుడు తనకు చెప్పిన చోటికి ప్రయాణమయ్యాడు. 4 మూడో రోజున అబ్రాహాము తల ఎత్తి దూరంలో ఉన్న ఆ చోటును చూశాడు. 5 అప్పుడు అబ్రాహాము తన సేవకులతో ఇలా అన్నాడు: “మీరు గాడిదతోపాటు ఇక్కడే ఉండండి. నేనూ, అబ్బాయి అక్కడికి వెళ్లి, ఆరాధించి, మీ దగ్గరికి తిరిగొస్తాం.”

6 అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెల్ని తీసి తన కుమారుడు ఇస్సాకు భుజాల మీద పెట్టాడు. తర్వాత అబ్రాహాము నిప్పుల్ని, కత్తిని* తీసుకున్నాడు. అలా వాళ్లిద్దరూ కలిసి నడుచుకుంటూ ముందుకు సాగారు. 7 అప్పుడు ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును, “నాన్నా!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు బాబు!” అన్నాడు. అప్పుడు ఇస్సాకు, “ఇక్కడ నిప్పులు, కట్టెలు ఉన్నాయి కానీ దహనబలి కోసం గొర్రె ఏది?” అని అడిగాడు. 8 దానికి అబ్రాహాము, “దహనబలికి కావాల్సిన గొర్రెను+ దేవుడే ఇస్తాడు బాబు” అన్నాడు. అలా వాళ్లిద్దరూ కలిసి నడుచుకుంటూ ముందుకు సాగారు.

9 చివరికి, వాళ్లు సత్యదేవుడు తనకు చెప్పిన చోటికి చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం కట్టి, దానిమీద కట్టెలు పేర్చాడు. తర్వాత అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకు చేతుల్ని, కాళ్లను కట్టేసి బలిపీఠంపై తాను పేర్చిన కట్టెల మీద అతన్ని పడుకోబెట్టాడు.+ 10 తర్వాత అబ్రాహాము తన చెయ్యి చాపి తన కుమారుణ్ణి చంపడానికి కత్తి* తీసుకున్నాడు.+ 11 కానీ పరలోకం నుండి యెహోవా దూత, “అబ్రాహామూ, అబ్రాహామూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు, ప్రభువా!” అన్నాడు. 12 అప్పుడు దూత ఇలా అన్నాడు: “ఆ అబ్బాయిని చంపకు, అతనికి ఏ హానీ చేయకు. నువ్వు దైవభయం ఉన్న వ్యక్తివని నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనకాడలేదు.”+ 13 అప్పుడు అబ్రాహాము తల ఎత్తి చూశాడు. కొంతదూరంలో, పొదలో కొమ్ములు చిక్కుకున్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. కాబట్టి అబ్రాహాము వెళ్లి, ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దాన్ని దహనబలిగా అర్పించాడు. 14 అబ్రాహాము ఆ చోటికి యెహోవా-యీరే* అని పేరు పెట్టాడు. అందుకే, “యెహోవా పర్వతం మీద అది ఇవ్వబడుతుంది”+ అని ప్రజలు నేటికీ అంటుంటారు.

15 యెహోవా దూత రెండోసారి పరలోకం నుండి మాట్లాడుతూ అబ్రాహాముతో 16 ఇలా అన్నాడు: “యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, ‘నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు.+ నువ్వు ఇలా చేశావు కాబట్టి నామీద ఒట్టు వేసుకొని చెప్తున్నాను,+ 17 నేను నిన్ను ఖచ్చితంగా దీవిస్తాను, నీ సంతానాన్ని* ఖచ్చితంగా ఆకాశ నక్షత్రాలంతమంది, సముద్రతీరాన ఉండే ఇసుక రేణువులంతమంది అయ్యేలా చేస్తాను.+ నీ సంతానం* శత్రువుల నగరాల్ని స్వాధీనపర్చుకుంటుంది.+ 18 నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానం* ద్వారా+ భూమ్మీదున్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.’ ”*+

19 తర్వాత అబ్రాహాము తన సేవకుల దగ్గరికి తిరిగొచ్చాడు. అప్పుడు వాళ్లంతా కలిసి బెయేర్షెబాకు+ తిరిగెళ్లిపోయారు; అబ్రాహాము బెయేర్షెబాలోనే నివసిస్తూ ఉన్నాడు.

20 ఆ తర్వాత అబ్రాహాముకు ఈ కబురు అందింది: “మిల్కా కూడా నీ సహోదరుడైన నాహోరుకు+ కుమారుల్ని కన్నది. వాళ్లు ఎవరంటే: 21 పెద్ద కుమారుడు ఊజు, అతని తమ్ముడు బూజు, అరాము తండ్రి కెమూయేలు, 22 కెసెదు, హజో, పిల్దాషు, యిద్లాపు, బెతూయేలు.”+ 23 బెతూయేలుకు రిబ్కా+ పుట్టింది. అబ్రాహాము సహోదరుడైన నాహోరుకు మిల్కా ఈ ఎనిమిది మందిని కన్నది. 24 నాహోరు ఉపపత్ని రయూమా కూడా కుమారుల్ని కన్నది. వాళ్లు ఎవరంటే: తెబహు, గహము, తహషు, మయకా.

23 శారా 127 ఏళ్లు బ్రతికి చనిపోయింది.+ 2 ఆమె కనాను దేశంలోని+ కిర్యతర్బాలో+ అంటే హెబ్రోనులో+ చనిపోయింది. ఆమె చనిపోయినందుకు అబ్రాహాము చాలా దుఃఖించాడు, ఏడ్చాడు. 3 తర్వాత అబ్రాహాము తన భార్య మృతదేహం దగ్గర నుండి లేచి, హేతు+ కుమారులతో ఇలా అన్నాడు: 4 “నేను పరదేశిగా వచ్చి మీ మధ్య స్థిరపడ్డాను.+ నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీ ప్రాంతంలో నాకు కొంత స్థలాన్ని ఇవ్వండి.” 5 అప్పుడు హేతు కుమారులు అబ్రాహాముతో ఇలా అన్నారు: 6 “ప్రభూ, మా మాట విను. నువ్వు మా మధ్య దేవుడు ఎంచుకున్న ప్రధానుడివి.*+ మా సమాధుల స్థలాల్లో శ్రేష్ఠమైన దానిలో నువ్వు నీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టుకోవచ్చు. మాలో ఎవరి సమాధుల స్థలంలోనైనా నువ్వు నీ భార్యను పాతిపెట్టుకోవచ్చు, మేము ఎవ్వరం అడ్డుచెప్పం.”

7 దానికి అబ్రాహాము లేచి ఆ దేశ ప్రజలైన హేతు+ కుమారులకు వంగి నమస్కారం చేసి, 8 వాళ్లతో ఇలా అన్నాడు: “నా భార్య మృతదేహాన్ని ఇక్కడి నుండి తీసి పాతిపెట్టడానికి మీరు ఒప్పుకుంటే, నా మాట విని సోహరు కుమారుడు ఎఫ్రోనును వేడుకొని, 9 అతని పొలం చివర ఉన్న మక్పేలా గుహను నాకు అమ్మమనండి; ఆ భూమి ఎంత వెండి పలికితే అంతకు మీ సమక్షంలో దాన్ని నాకు అమ్మమనండి.+ అప్పుడు నాకు కూడా ఒక సమాధుల స్థలం ఉంటుంది.”+

10 ఆ సమయంలో ఎఫ్రోను హేతు కుమారుల మధ్య కూర్చొని ఉన్నాడు. కాబట్టి, హిత్తీయుడైన ఎఫ్రోను హేతు కుమారుల ముందు, ఆ నగర ద్వారం+ దగ్గరున్న వాళ్లందరి ముందు ఇలా అన్నాడు: 11 “లేదు ప్రభూ! నా మాట విను. నీకు ఆ పొలాన్ని, అందులోని గుహను ఇచ్చేస్తాను. నా ప్రజల సమక్షంలో దాన్ని నీకు ఇచ్చేస్తాను. నీ భార్యను పాతిపెట్టుకో.” 12 అప్పుడు అబ్రాహాము ఆ దేశ ప్రజల ముందు వంగి నమస్కారం చేసి, 13 వాళ్లు వింటుండగా ఎఫ్రోనుతో ఇలా అన్నాడు: “లేదు, దయచేసి నా మాట విను. నీ పొలం ఎంత వెండి పలికితే అంత నేను నీకు ఇస్తాను. ఆ వెండిని నా దగ్గర తీసుకో, అప్పుడే నా భార్యను అక్కడ పాతిపెట్టుకుంటాను.”

14 దానికి ఎఫ్రోను అబ్రాహాముతో ఇలా అన్నాడు: 15 “నా ప్రభూ! నా మాట విను. ఈ భూమి విలువ 400 షెకెల్‌ల* వెండి. కానీ మన మధ్య డబ్బుదేముంది? నీ భార్యను పాతిపెట్టుకో.” 16 అబ్రాహాము ఎఫ్రోను మాట విని, హేతు కుమారుల ముందు ఎఫ్రోను చెప్పినంత వెండిని, అంటే అప్పటి వర్తకుల ప్రమాణాల ప్రకారం 400 షెకెల్‌ల* వెండిని తూచి అతనికి ఇచ్చాడు.+ 17 అలా మమ్రే దగ్గర మక్పేలాలో ఉన్న ఎఫ్రోను పొలాన్ని, అంటే ఆ పొలాన్ని, అందులోని గుహను, ఆ పొలం సరిహద్దుల లోపలున్న చెట్లన్నిటినీ అబ్రాహాము ఆస్తిగా ఖరారు చేశారు. 18 హేతు కుమారుల సమక్షంలో, ఆ నగర ద్వారం దగ్గరున్న వాళ్లందరి ముందు అబ్రాహాము దాన్ని కొన్నట్టు ఖరారు అయ్యింది. 19 ఆ తర్వాత అబ్రాహాము తన భార్య శారాను కనాను దేశంలో మమ్రే దగ్గర అంటే హెబ్రోను దగ్గర మక్పేలాలో ఉన్న పొలంలోని గుహలో పాతిపెట్టాడు. 20 అలా హేతు కుమారుల సమక్షంలో ఆ పొలం, అందులోని గుహ అబ్రాహాముకు చెందిన సమాధుల స్థలం అయ్యింది.+

24 అబ్రాహాము ఏళ్లు నిండిన ముసలివాడయ్యాడు. యెహోవా ప్రతీ విషయంలో అబ్రాహామును దీవించాడు.+ 2 అబ్రాహాము తన ఆస్తి అంతటినీ చూసుకుంటున్న తన పెద్ద సేవకునితో+ ఇలా అన్నాడు: “దయచేసి, నీ చెయ్యి నా తొడ కింద పెట్టి, 3 భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా ముందు ఒట్టేయి. నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో ఆ కనానీయుల్లో నుండి నువ్వు నా కుమారుని కోసం భార్యను తీసుకురాకూడదు.+ 4 బదులుగా నువ్వు నా దేశానికి, నా బంధువుల+ దగ్గరికి వెళ్లి నా కుమారుడు ఇస్సాకు కోసం భార్యను తీసుకురావాలి.”

5 అయితే, ఆ సేవకుడు అతనితో ఇలా అన్నాడు: “ఒకవేళ ఈ దేశానికి రావడం ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఏమి చేయాలి? నీ కుమారుణ్ణి నీ దేశానికి+ తిరిగి తీసుకెళ్లాలా?” 6 అందుకు అబ్రాహాము తన సేవకునితో ఇలా అన్నాడు: “నా కుమారుణ్ణి అక్కడికి తీసుకెళ్లకుండా చూసుకో.+ 7 నా తండ్రి ఇంటి నుండి, నా బంధువుల దేశం నుండి నన్ను తీసుకొచ్చి,+ నాతో మాట్లాడి, ‘నీ సంతానానికి*+ ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాను’+ అని నాతో ప్రమాణం చేసిన+ పరలోక దేవుడైన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు.+ నువ్వు ఖచ్చితంగా నా కుమారునికి అక్కడి నుండి+ భార్యను తీసుకొస్తావు. 8 ఒకవేళ ఆ అమ్మాయికి నీతో రావడం ఇష్టంలేకపోతే, ఈ ఒట్టు నుండి నీకు విడుదల లభిస్తుంది. కానీ నువ్వు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకెళ్లకూడదు.” 9 దాంతో ఆ సేవకుడు తన యజమాని అబ్రాహాము తొడ కింద చెయ్యి పెట్టి దాని గురించి ఒట్టేశాడు.+

10 ఆ సేవకుడు తన యజమాని ఒంటెల్లో నుండి పది ఒంటెల్ని, తన యజమాని దగ్గరున్న అన్నిరకాల మంచి వస్తువుల్ని తీసుకొని ప్రయాణమయ్యాడు. అలా అతను నాహోరు నగరానికి అంటే మెసొపొతమియకు చేరుకున్నాడు. 11 అతను నగరం బయట ఉన్న బావి దగ్గర ఒంటెల్ని కూర్చోబెట్టాడు. అది దాదాపు సాయంకాల సమయం; ఆ సమయానికి ఊళ్లోని స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తారు. 12 అప్పుడు అతను ఇలా అన్నాడు: “యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, దయచేసి, ఈ రోజు నా పనిని సఫలం చేయి. నా యజమాని అబ్రాహాము పట్ల నీ విశ్వసనీయ ప్రేమ చూపించు. 13 నేను ఇక్కడ ఒక బావి దగ్గర నిలబడి ఉన్నాను. ఈ నగరంలోని యువతులు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. 14 నేను ఒక యువతితో, ‘దయచేసి నీ కుండ దించి తాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అన్నప్పుడు, ఆమె ‘తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను’ అనాలి. ఆ యువతే నీ సేవకుడైన ఇస్సాకు కోసం నువ్వు నిర్ణయించిన యువతి అయ్యుండాలి; అలా, నువ్వు నా యజమాని పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించావని నాకు తెలుస్తుంది.”

15 అతను అలా అనడం పూర్తికాకముందే, రిబ్కా నీళ్ల కుండ భుజం మీద పెట్టుకొని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు.+ ఈ బెతూయేలు అబ్రాహాము సహోదరుడైన నాహోరు+ భార్య మిల్కా+ కుమారుడు. 16 రిబ్కా చాలా అందగత్తె, కన్య; ఏ పురుషుడూ ఆమెతో ఎప్పుడూ లైంగిక సంబంధం పెట్టుకోలేదు. ఆమె బావిలోకి దిగి తన కుండ నింపుకొని పైకి వచ్చింది. 17 వెంటనే ఆ సేవకుడు ఆమెను కలవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెతో, “దయచేసి, నేను తాగడానికి నీ కుండలో నుండి నాకు కొన్ని నీళ్లు ఇవ్వు” అన్నాడు. 18 దానికి ఆమె, “అయ్యా, తాగు” అంటూ వెంటనే తన కుండను భుజాల మీద నుండి చేతుల మీదికి దించి, అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చింది. 19 అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చాక, “నేను నీ ఒంటెల కోసం కూడా కావాల్సినన్ని నీళ్లు చేదుకొస్తాను” అంది. 20 కాబట్టి ఆమె వెంటనే తన కుండలోని నీళ్లు తొట్టిలో పోసి, బావి దగ్గరికి చాలాసార్లు పరుగెత్తుకుంటూ వెళ్లి అతని ఒంటెలన్నిటి కోసం నీళ్లు చేదుకొస్తూ ఉంది. 21 ఆ సమయమంతట్లో, ఆ సేవకుడు ఆశ్చర్యంలో మునిగిపోయి మౌనంగా ఆమెనే చూస్తూ, యెహోవా తన ప్రయాణాన్ని సఫలం చేశాడా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

22 ఒంటెలు నీళ్లు తాగడం అయిపోయాక, ఆ సేవకుడు ఆమెకు ఇవ్వడానికి అర షెకెల్‌* బరువున్న ఒక బంగారు ముక్కు పోగును, పది షెకెల్‌ల* బరువున్న రెండు బంగారు కడియాల్ని బయటికి తీశాడు. 23 తర్వాత అతను ఇలా అన్నాడు: “దయచేసి, నువ్వు ఎవరి కూతురివో చెప్పు. ఈ రాత్రి మేము ఉండడానికి మీ తండ్రి ఇంట్లో చోటు ఉందా?” 24 దానికి ఆమె ఇలా అంది: “నేను నాహోరు భార్య మిల్కా+ కుమారుడైన బెతూయేలు కూతుర్ని.”+ 25 ఆమె ఇంకా ఇలా అంది: “మీరు ఈ రాత్రి ఉండడానికి స్థలం, మీ ఒంటెల కోసం గడ్డి, కావాల్సినంత మేత మా దగ్గర ఉన్నాయి.” 26 అప్పుడు ఆ సేవకుడు వంగి, యెహోవా ముందు సాష్టాంగ నమస్కారం చేసి, 27 ఇలా అన్నాడు: “నా యజమాని అబ్రాహాముకు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఎందుకంటే ఆయన నా యజమాని పట్ల తన విశ్వసనీయ ప్రేమను, తన నమ్మకత్వాన్ని చూపించడం మానలేదు. యెహోవా నా యజమాని సహోదరుల ఇంటికి నన్ను నడిపించాడు.”

28 అప్పుడు ఆ యువతి ఈ విషయాల గురించి వాళ్ల అమ్మ ఇంటివాళ్లకు చెప్పడానికి పరుగెత్తుకుంటూ వెళ్లింది. 29 రిబ్కాకు ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాబాను.+ అతను ఊరి బయట బావి దగ్గరున్న ఆ సేవకుని దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. 30 లాబాను తన సహోదరి రిబ్కా ముక్కు పోగునూ ఆమె చేతులకున్న కడియాల్నీ చూసి, అలాగే తన సహోదరి “అతను నాతో ఇలా మాట్లాడాడు” అని చెప్పడం విని అతన్ని కలవడానికి వెళ్లాడు. ఆ వ్యక్తి ఇంకా బావి దగ్గరే ఒంటెల పక్కన నిలబడి ఉన్నాడు. 31 వెంటనే లాబాను ఇలా అన్నాడు: “యెహోవా చేత దీవెన పొందినవాడా, రా! నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? నేను నీ కోసం ఇంటిని, ఒంటెల కోసం స్థలాన్ని సిద్ధం చేశాను.” 32 దాంతో ఆ వ్యక్తి వాళ్లింటికి వచ్చాడు. అతను* ఒంటెలకున్న జీనులు విప్పి, వాటికి గడ్డిని, మేతను పెట్టి, ఇంటికి వచ్చిన ఆ వ్యక్తి, అతనితోపాటు ఉన్నవాళ్లు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. 33 అయితే, భోజనం తెచ్చి అతని ముందు పెట్టినప్పుడు అతను, “నేను చెప్పాల్సింది చెప్పేవరకు భోజనం చేయను” అన్నాడు. దానికి లాబాను, “సరే, చెప్పు!” అన్నాడు.

34 అప్పుడు అతను ఇలా అన్నాడు: “నేను అబ్రాహాము సేవకుణ్ణి.+ 35 యెహోవా నా యజమానిని ఎంతగానో ఆశీర్వదించాడు; గొర్రెల్ని, పశువుల్ని, వెండిబంగారాల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను, ఒంటెల్ని, గాడిదల్ని ఇచ్చి నా యజమానిని చాలా ధనవంతుణ్ణి చేశాడు.+ 36 అంతేకాదు, నా యజమాని భార్య శారా తన ముసలితనంలో నా యజమానికి ఒక కుమారుణ్ణి కన్నది.+ నా యజమాని తనకున్న ప్రతీది అతనికి ఇస్తాడు.+ 37 అందుకే నా యజమాని నాతో ఒట్టు వేయించుకుంటూ ఇలా అన్నాడు: ‘నేను ఎవరి మధ్యైతే నివసిస్తున్నానో ఆ కనానీయుల్లో నుండి నా కుమారుని కోసం భార్యను తీసుకురాకూడదు.+ 38 బదులుగా నా తండ్రి ఇంటికి, నా కుటుంబం+ దగ్గరికి వెళ్లి నా కుమారుని కోసం భార్యను తీసుకురావాలి.’+ 39 కానీ నేను నా యజమానిని, ‘ఒకవేళ ఆ అమ్మాయికి నాతో రావడం ఇష్టం లేకపోతే ఏమి చేయాలి?’ అని అడిగాను.+ 40 అప్పుడు అతను నాతో ఇలా అన్నాడు: ‘నేను ఎవరి ముందైతే విధేయతతో నడుచుకున్నానో+ ఆ యెహోవా నీతో తన దూతను పంపిస్తాడు,+ ఖచ్చితంగా నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు; నువ్వు నా కుటుంబం నుండి, నా తండ్రి ఇంటి నుండి+ నా కుమారునికి భార్యను తీసుకురావాలి. 41 నువ్వు నా కుటుంబం దగ్గరికి వెళ్లినప్పుడు, వాళ్లు ఆమెను నీకు ఇవ్వకపోతే, నువ్వు నాకు వేసిన ఒట్టు నుండి విడుదల పొందుతావు. అలా నీ ఒట్టు+ నుండి నీకు విడుదల లభిస్తుంది.’

42 “నేను ఈ రోజు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నాను: ‘యెహోవా, నా యజమాని అబ్రాహాము దేవా, నువ్వు నా ప్రయాణాన్ని సఫలం చేస్తే ఇలా జరగాలి: 43 నేను ఇక్కడ ఒక బావి దగ్గర నిలబడి ఉన్నాను. నీళ్లు చేదుకోవడానికి ఒక యువతి+ వచ్చినప్పుడు, “దయచేసి, నేను తాగడానికి నీ కుండలో నుండి కొన్ని నీళ్లు ఇవ్వు” అని అంటాను. 44 అప్పుడు ఆమె నాతో, “ఇదిగో తాగు, నీ ఒంటెల కోసం కూడా నీళ్లు చేదుకొస్తాను” అనాలి. నా యజమాని కుమారునికి భార్య అవ్వడానికి యెహోవా ఎంచుకున్న స్త్రీ ఆ యువతే అయ్యుండాలి.’+

45 “నేను నా హృదయంలో అలా అనుకోవడం పూర్తికాకముందే, రిబ్కా తన భుజం మీద కుండతో వచ్చి, బావిలోకి దిగి నీళ్లు చేదుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆమెను, ‘దయచేసి, తాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.+ 46 ఆమె వెంటనే భుజం మీద నుండి తన కుండను దించి, ‘తాగు,+ నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను’ అంది. దాంతో నేను నీళ్లు తాగాను, ఆమె నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టింది. 47 తర్వాత నేను ఆమెను, ‘నువ్వు ఎవరి కూతురివి?’ అని అడిగాను. దానికి ఆమె, ‘మిల్కా నాహోరుకు కన్న బెతూయేలు కూతుర్ని’ అని చెప్పింది. అప్పుడు నేను ఆమెకు ముక్కు పోగు పెట్టాను, చేతులకు కడియాలు తొడిగాను.+ 48 తర్వాత నేను వంగి యెహోవా ముందు సాష్టాంగ నమస్కారం చేశాను, నా యజమాని దేవుడైన యెహోవాను స్తుతించాను.+ ఎందుకంటే, నా యజమాని సహోదరుడి కూతుర్ని* అతని కుమారుని కోసం తీసుకెళ్లడానికి దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపించాడు. 49 నా యజమాని పట్ల విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించడం మీకు ఇష్టమైతే నాకు చెప్పండి; ఇష్టం లేకపోతే, అది కూడా చెప్పండి, అప్పుడు నేను ఏమి చేయాలో* ఆలోచించుకుంటాను.”+

50 అప్పుడు లాబాను, బెతూయేలు ఇలా అన్నారు: “ఇది యెహోవా నుండి వచ్చింది కాబట్టి మేము నీతో అవునని గానీ, కాదని గానీ చెప్పలేము. 51 ఇదిగో, రిబ్కా నీ ముందు ఉంది. ఈమెను తీసుకొని వెళ్లు. యెహోవా చెప్పినట్టే ఈమె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది.” 52 అబ్రాహాము సేవకుడు వాళ్ల మాటలు విన్నప్పుడు, వెంటనే నేలమీద పడి యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. 53 తర్వాత అతను వెండి వస్తువుల్ని, బంగారు వస్తువుల్ని, వస్త్రాల్ని బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు; అలాగే ఆమె సహోదరునికి, వాళ్ల అమ్మకు విలువైన వస్తువుల్ని ఇచ్చాడు. 54 ఆ తర్వాత అతను, అతని మనుషులు తిని, తాగి ఆ రాత్రి అక్కడే బస చేశారు.

తర్వాతి రోజు ఉదయం అతను లేచినప్పుడు, “నన్ను నా యజమాని దగ్గరికి పంపించేయండి” అని వాళ్లతో అన్నాడు. 55 అందుకు ఆమె సహోదరుడు, వాళ్ల అమ్మ, “మా అమ్మాయిని పది రోజులైనా మాతో ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు” అన్నారు. 56 కానీ అతను, “యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు, నన్ను ఆపకండి. నేను నా యజమాని దగ్గరికి తిరిగెళ్లేలా నన్ను పంపించేయండి” అని వాళ్లతో అన్నాడు. 57 దానికి వాళ్లు, “అమ్మాయిని పిలిచి, ఆమె ఏమంటుందో అడిగి చూద్దాం” అన్నారు. 58 వాళ్లు రిబ్కాను పిలిచి, “నువ్వు ఇతనితో వెళ్తావా?” అని అడిగారు. అందుకామె, “నాకిష్టమే, నేను వెళ్తాను” అంది.

59 అలా వాళ్లు తమ సహోదరి రిబ్కాను,+ ఆమె దాదిని,*+ అబ్రాహాము సేవకుణ్ణి, అతని మనుషుల్ని పంపించేశారు. 60 వాళ్లు రిబ్కాను దీవించి ఇలా అన్నారు: “మా సహోదరీ, నువ్వు లక్షలమందికి తల్లివి కావాలి. నీ సంతానం* తమను ద్వేషించేవాళ్ల నగరాల్ని స్వాధీనం చేసుకోవాలి.”+ 61 అప్పుడు రిబ్కా, ఆమె సేవకురాళ్లు లేచి ఒంటెల మీద ఎక్కి కూర్చొని, అబ్రాహాము సేవకుని వెంట వెళ్లారు. అలా ఆ సేవకుడు రిబ్కాను తీసుకొని వెళ్లిపోయాడు.

62 ఇస్సాకు నెగెబులో+ నివసిస్తున్నాడు. ఒకరోజు, అతను బెయేర్‌-లహాయిరోయికి+ వెళ్లే దారి నుండి పక్కకు తిరిగి, 63 ధ్యానించడానికి+ పొలంలోకి వెళ్లాడు. అప్పటికే సాయంకాలమై చీకటి కావస్తోంది, అతను తల ఎత్తి చూసినప్పుడు, అదిగో, ఒంటెలు వస్తున్నాయి! 64 రిబ్కా తల ఎత్తి చూసినప్పుడు ఇస్సాకు కనిపించాడు. వెంటనే ఆమె ఒంటె మీద నుండి కిందికి దిగింది. 65 తర్వాత ఆమె అబ్రాహాము సేవకుణ్ణి, “పొలంలో నుండి మనల్ని కలవడానికి వస్తున్నది ఎవరు?” అని అడిగింది. అందుకు ఆ సేవకుడు, “అతను నా యజమాని” అన్నాడు. కాబట్టి ఆమె తలమీద ముసుగు వేసుకుంది. 66 తర్వాత, ఆ సేవకుడు తాను చేసిందంతా ఇస్సాకుకు చెప్పాడు. 67 ఆ తర్వాత ఇస్సాకు ఆమెను తన తల్లి శారా డేరాలోకి+ తీసుకొచ్చాడు. అలా అతను రిబ్కాను తన భార్యగా చేసుకున్నాడు; అతను ఆమెను చాలా ప్రేమించాడు,+ తన తల్లి లేని బాధ+ నుండి ఊరట పొందాడు.

25 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, ఆ స్త్రీ పేరు కెతూరా. 2 ఆమె అతనికి కన్న పిల్లలు ఎవరంటే: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను,+ ఇష్బాకు, షూవహు.+

3 యొక్షానుకు షేబ, దెదాను పుట్టారు.

దెదాను కుమారులు ఎవరంటే: అష్షూరీ, లెతూషీ, లెయుమీ.

4 మిద్యాను కుమారులు ఎవరంటే: ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.

వీళ్లంతా కెతూరా మనవళ్లు.

5 తర్వాత అబ్రాహాము తనకు ఉన్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు.+ 6 అయితే తన ఉపపత్నుల ద్వారా పుట్టిన కుమారులకు అబ్రాహాము బహుమతులు ఇచ్చాడు. ఆ తర్వాత అబ్రాహాము తాను ఇంకా బ్రతికి ఉండగానే, వాళ్లను ఇస్సాకుకు దూరంగా తూర్పు వైపుగా తూర్పు దేశానికి పంపించేశాడు.+ 7 అబ్రాహాము మొత్తం 175 ఏళ్లు బ్రతికాడు. 8 అబ్రాహాము చాలా ఏళ్లు బ్రతికి, మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* 9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు అతన్ని మమ్రే ఎదురుగావున్న మక్పేలా గుహలో పాతిపెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఉంది.+ 10 అబ్రాహాము ఆ పొలాన్ని హేతు కుమారుల దగ్గర కొన్నాడు. అబ్రాహాము అక్కడే తన భార్య శారా దగ్గర పాతిపెట్టబడ్డాడు.+ 11 అబ్రాహాము చనిపోయిన తర్వాత కూడా దేవుడు అతని కుమారుడు ఇస్సాకును దీవిస్తూనే ఉన్నాడు.+ ఇస్సాకు బెయేర్‌-లహాయిరోయి+ దగ్గర నివసించేవాడు.

12 శారా సేవకురాలు, ఐగుప్తీయురాలు అయిన హాగరు+ అబ్రాహాముకు కన్న ఇష్మాయేలు+ చరిత్ర ఇది:

13 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం ఇష్మాయేలు కుమారుల పేర్లు: ఇష్మాయేలు పెద్ద కుమారుడు నెబాయోతు,+ ఆ తర్వాత కేదారు,+ అద్బయేలు, మిబ్శాము,+ 14 మిష్మా, దూమా, మశ్శా, 15 హదదు, తేమా, యెతూరు, నాపీషు, కెదెమా. 16 ఇవి వాళ్లవాళ్ల గ్రామాల ప్రకారం, శిబిరాల* ప్రకారం ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఈ 12 మంది వాళ్లవాళ్ల వంశాల ప్రధానులు.+ 17 ఇష్మాయేలు మొత్తం 137 ఏళ్లు బ్రతికి, తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* 18 వాళ్లు ఐగుప్తుకు సమీపాన షూరు+ దగ్గర ఉన్న హవీలా+ నుండి అష్షూరు వరకున్న ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకున్నారు. అతను తన సహోదరులందరి ఎదుట* స్థిరపడ్డాడు.+

19 ఇది అబ్రాహాము కుమారుడు ఇస్సాకు+ చరిత్ర.

అబ్రాహాము ఇస్సాకును కన్నాడు. 20 ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు 40 ఏళ్లు. ఈ రిబ్కా పద్దనరాముకు చెందిన అరామీయుడైన బెతూయేలు కూతురు,+ అరామీయుడైన లాబాను సహోదరి. 21 తన భార్య గొడ్రాలిగా ఉంది కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాను వేడుకుంటూ ఉన్నాడు; యెహోవా అతని ప్రార్థనకు జవాబిచ్చాడు; అతని భార్య రిబ్కా గర్భవతి అయ్యింది. 22 ఆమె గర్భంలో ఉన్న కుమారులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు.+ దాంతో ఆమె, “పరిస్థితి ఇలా ఉంటే, ఇక నేను ఎందుకు బ్రతకాలి?” అంది. అందుకే ఆమె దాని గురించి యెహోవాను అడిగింది. 23 అప్పుడు యెహోవా ఆమెతో ఇలా అన్నాడు: “నీ గర్భంలో+ రెండు జనాలు ఉన్నాయి. నీలో నుండి రెండు వేర్వేరు జనాలు పుడతాయి;+ ఒక జనం ఇంకో జనం కన్నా బలమైనదిగా ఉంటుంది;+ పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు.”+

24 ఆమె ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఇదిగో, ఆమె గర్భంలో కవలలు ఉన్నారు! 25 మొదటివాడు బయటికి వచ్చాడు. వాడు మొత్తం ఎర్రగా, వెంట్రుకలతో నేసిన వస్త్రంలా ఉన్నాడు.+ కాబట్టి అతనికి ఏశావు*+ అని పేరు పెట్టారు. 26 ఆ తర్వాత అతని తమ్ముడు బయటికి వచ్చాడు, అతను ఏశావు మడిమెను పట్టుకొని ఉన్నాడు.+ కాబట్టి అతనికి యాకోబు* అని పేరు పెట్టారు.+ రిబ్కా వాళ్లను కన్నప్పుడు ఇస్సాకుకు 60 ఏళ్లు.

27 ఆ అబ్బాయిలు ఎదిగినప్పుడు, ఏశావు నైపుణ్యంగల వేటగాడు అయ్యాడు,+ అతను వేటాడుతూ ఎక్కువగా బయటే ఉండేవాడు; అయితే యాకోబు డేరాల్లో నివసించేవాడు,+ ఇతను ఏ నిందా లేని వ్యక్తి. 28 ఇస్సాకు ఏశావును ప్రేమించాడు, ఎందుకంటే అతను తెచ్చే వేటమాంసం అంటే ఇస్సాకుకు ఇష్టం. కానీ రిబ్కా మాత్రం యాకోబును ప్రేమించింది.+ 29 ఒకసారి, ఏశావు బాగా అలసిపోయి ఇంటికి వచ్చేసరికి యాకోబు ఒక కూర వండుతున్నాడు. 30 ఏశావు యాకోబుతో, “నేను బాగా అలసిపోయాను,* దయచేసి త్వరగా నీ దగ్గరున్న ఆ ఎర్రని కూరలో కొంచెం నాకు పెట్టు!” అన్నాడు. అందుకే అతనికి ఎదోము* అని పేరొచ్చింది.+ 31 అప్పుడు యాకోబు, “ముందు నీ జ్యేష్ఠత్వపు హక్కును+ నాకు అమ్ము” అన్నాడు. 32 అందుకు ఏశావు, “ఇక్కడ నేను ఆకలితో చచ్చిపోతున్నాను! జ్యేష్ఠత్వపు హక్కు వల్ల నాకేం ఉపయోగం?” అన్నాడు. 33 దానికి యాకోబు, “ముందు నాకు ఒట్టేయి!” అన్నాడు. కాబట్టి ఏశావు ఒట్టేసి తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మేశాడు.+ 34 అప్పుడు యాకోబు ఏశావుకు రొట్టెను, చిక్కుడుకాయల కూరను ఇచ్చాడు. ఏశావు తిని, తాగి, లేచి వెళ్లిపోయాడు. అలా ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించాడు.

26 అబ్రాహాము రోజుల్లో వచ్చిన కరువు+ కాకుండా ఇంకో కరువు ఆ దేశంలో వచ్చింది. దాంతో ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్లాడు. 2 అప్పుడు యెహోవా ఇస్సాకుకు కనిపించి ఇలా అన్నాడు: “నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్లకు. నేను నీకు చూపించే దేశంలో నివసించు. 3 ఈ దేశంలో పరదేశిగా ఉండు,+ నేను ఎప్పటిలాగే నీకు తోడుగా ఉండి, నిన్ను ఆశీర్వదిస్తాను; ఎందుకంటే ఈ ప్రాంతాలన్నిటినీ నీకు, నీ సంతానానికి* ఇస్తాను;+ నేను నీ తండ్రి అబ్రాహాముకు ఒట్టేసి చేసిన ఈ ప్రమాణాన్ని నెరవేరుస్తాను:+ 4 ‘నేను నీ సంతానాన్ని* ఆకాశ నక్షత్రాలంతమంది అయ్యేలా చేస్తాను;+ నేను ఈ ప్రాంతాలన్నిటినీ నీ సంతానానికి* ఇస్తాను;+ నీ సంతానం* ద్వారా భూమ్మీద ఉన్న అన్నిదేశాల ప్రజలు దీవెన సంపాదించుకుంటారు.’*+ 5 ఎందుకంటే అబ్రాహాము నా మాట విన్నాడు; నేను కోరినవాటిని చేస్తూ, నా ఆజ్ఞల్ని, నా శాసనాల్ని, నా నియమాల్ని పాటిస్తూ వచ్చాడు.”+ 6 కాబట్టి ఇస్సాకు గెరారులోనే నివసిస్తూ ఉన్నాడు.+

7 ఆ ప్రాంతంలోని ప్రజలు తన భార్య గురించి అదేపనిగా అడుగుతున్నప్పుడు అతను, “ఈమె నా చెల్లెలు” అని చెప్పేవాడు.+ ఆమె తన భార్య అని చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. అతను, “రిబ్కా కోసం ఈ ప్రాంతంలోని ప్రజలు నన్ను చంపేస్తారేమో” అని అనుకున్నాడు. ఎందుకంటే రిబ్కా చాలా అందంగా ఉండేది.+ 8 కొన్నిరోజుల తర్వాత, ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు కిటికీ గుండా బయటికి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య రిబ్కాతో సరసాలాడడం* గమనించాడు.+ 9 వెంటనే అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, “నిజానికి ఆమె నీ భార్య! కానీ నువ్వు ‘ఆమె నా చెల్లెలు’ అని ఎందుకు చెప్పావు?” అని అడిగాడు. అందుకు ఇస్సాకు, “ఆమె వల్ల నేను చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో అలా చెప్పాను”+ అన్నాడు. 10 కానీ అబీమెలెకు ఇలా అన్నాడు: “నువ్వు ఎందుకు ఇలా చేశావు?+ నా ప్రజల్లో ఎవరైనా ఇట్టే నీ భార్యతో పడుకొని ఉండేవాళ్లు; నువ్వు మాకు పాపాన్ని అంటగట్టి ఉండేవాడివి!”+ 11 ఆ తర్వాత అబీమెలెకు ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు: “ఎవరైనా ఇతని జోలికి, ఇతని భార్య జోలికి వెళ్తే వాళ్లకు ఖచ్చితంగా మరణశిక్ష పడుతుంది!”

12 ఇస్సాకు ఆ ప్రాంతంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ ఏడాది అతను విత్తిన దానికి 100 రెట్లు రాబడి వచ్చింది, ఎందుకంటే యెహోవా అతన్ని దీవిస్తూ ఉన్నాడు.+ 13 అతను సంపన్నుడు అయ్యాడు, అంతకంతకూ వర్ధిల్లుతూ చాలా ధనవంతుడయ్యాడు. 14 అతను గొర్రెల మందల్ని, పశువుల మందల్ని, చాలామంది సేవకుల్ని సంపాదించుకున్నాడు.+ దాంతో ఫిలిష్తీయులు అతన్ని చూసి ఈర్ష్యపడడం మొదలుపెట్టారు.

15 కాబట్టి ఆ ఫిలిష్తీయులు, ఇస్సాకు తండ్రి అబ్రాహాము బ్రతికున్న రోజుల్లో అతని సేవకులు తవ్విన బావులన్నిటినీ+ మట్టితో పూడ్చేశారు. 16 అప్పుడు అబీమెలెకు ఇస్సాకుతో ఇలా అన్నాడు: “నువ్వు మా ప్రాంతం నుండి వెళ్లిపో. ఎందుకంటే నువ్వు మాకన్నా చాలా బలవంతుడివి అయ్యావు.” 17 కాబట్టి ఇస్సాకు అక్కడి నుండి వెళ్లిపోయి, గెరారు+ లోయలో* డేరాలు వేసుకొని అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. 18 ఇస్సాకు తండ్రి అబ్రాహాము బ్రతికున్న రోజుల్లో అక్కడ తవ్వించిన బావుల్ని ఇస్సాకు మళ్లీ తవ్వించాడు; ఎందుకంటే అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులు ఆ బావుల్ని పూడ్చేశారు.+ ఇస్సాకు ఆ బావులకు తన తండ్రి పెట్టిన పేర్లే  పెట్టాడు.+

19 ఇస్సాకు సేవకులు ఆ లోయలో* తవ్వుతున్నప్పుడు, వాళ్లకు ఒక మంచినీళ్ల ఊట కనిపించింది. 20 అప్పుడు గెరారులోని కాపరులు, “ఈ నీళ్లు మావి!” అని అంటూ ఇస్సాకు కాపరులతో గొడవకు దిగారు. వాళ్లు తనతో గొడవపడ్డారు కాబట్టి ఇస్సాకు ఆ ఊటకు ఏశెకు* అని పేరు పెట్టాడు. 21 ఇస్సాకు మనుషులు ఇంకో బావి తవ్వడం మొదలుపెట్టినప్పుడు దాని గురించి కూడా వాళ్లు గొడవకు దిగారు. అందుకే ఇస్సాకు దానికి శిత్నా* అని పేరు పెట్టాడు. 22 తర్వాత ఇస్సాకు అక్కడి నుండి వెళ్లిపోయి ఇంకో బావి తవ్వాడు. అయితే ఈసారి వాళ్లు దాని గురించి గొడవపడలేదు. కాబట్టి ఇస్సాకు దానికి రహెబోతు* అని పేరు పెట్టి ఇలా అన్నాడు: “ఇప్పుడు యెహోవా మనకు చాలా స్థలం ఇచ్చాడు, మనల్ని ఈ ప్రాంతంలో ఎక్కువమంది అయ్యేలా చేశాడు.”+

23 తర్వాత ఇస్సాకు అక్కడి నుండి బెయేర్షెబాకు+ వెళ్లాడు. 24 ఆ రాత్రి యెహోవా అతనికి కనిపించి ఇలా అన్నాడు: “నేను నీ తండ్రి అబ్రాహాముకు దేవుణ్ణి.+ భయపడకు,+ నేను నీకు తోడుగా ఉన్నాను; నా సేవకుడైన అబ్రాహామును బట్టి నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని* ఎక్కువమంది అయ్యేలా చేస్తాను.”+ 25 కాబట్టి అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి, యెహోవా పేరును స్తుతించాడు.+ అక్కడ అతను తన డేరా వేసుకున్నాడు,+ అతని సేవకులు అక్కడే ఒక బావి తవ్వారు.

26 తర్వాత గెరారు నుండి అబీమెలెకు తన వ్యక్తిగత సలహాదారుడైన అహుజతుతో, తన సైన్యాధిపతి ఫీకోలుతో+ కలిసి ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. 27 అప్పుడు ఇస్సాకు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నన్ను ద్వేషించి, మీ ప్రాంతం నుండి వెళ్లగొట్టారు. ఇప్పుడెందుకు నా దగ్గరికి వచ్చారు?” 28 దానికి వాళ్లు ఇలా అన్నారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని+ మాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే మేము ఇలా అనుకున్నాం: ‘మనం ఒక ప్రమాణం చేసుకొని, ఒప్పందం కుదుర్చుకుందాం.+ 29 అదేంటంటే, మేము నీకు ఏ హానీ చేయకుండా నిన్ను సమాధానంగా పంపించి, నీకు మంచే చేశాం కాబట్టి, నువ్వు కూడా మాకు ఏ హానీ చేయకూడదు. ఇప్పుడు నువ్వు యెహోవా చేత దీవించబడినవాడివి.’ ” 30 తర్వాత అతను వాళ్లకు విందు ఏర్పాటు చేశాడు, వాళ్లు తిని తాగారు. 31 వాళ్లు తెల్లవారుజామునే లేచి, ఒకరితో ఒకరు ఒట్టేసి ప్రమాణం చేసుకున్నారు.+ ఆ తర్వాత ఇస్సాకు వాళ్లను పంపించేశాడు, వాళ్లు అతని దగ్గర నుండి సమాధానంగా వెళ్లిపోయారు.

32 ఆ రోజు ఇస్సాకు సేవకులు వచ్చి, తాము తవ్విన బావిలో+ నీళ్లు పడ్డాయని అతనికి చెప్పారు. 33 కాబట్టి అతను దానికి షేబ అని పేరు పెట్టాడు. అందుకే నేటికీ ఆ నగరం పేరు బెయేర్షెబా.+

34 ఏశావుకు 40 ఏళ్లు వచ్చినప్పుడు, అతను హిత్తీయుడైన బేయేరీ కూతురు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కూతురు బాశెమతును పెళ్లి చేసుకున్నాడు.+ 35 వాళ్లు ఇస్సాకుకు, రిబ్కాకు ఎంతో మనోవేదన కలిగించారు.+

27 ఇస్సాకు ముసలివాడై అతని కంటిచూపు బాగా మందగించినప్పుడు, తన పెద్ద కుమారుడు ఏశావును తన దగ్గరికి పిలిచి,+ “నా కుమారుడా!” అన్నాడు. దానికి ఏశావు, “చెప్పు నాన్నా!” అన్నాడు. 2 అప్పుడు ఇస్సాకు ఇలా అన్నాడు: “నేను ముసలివాణ్ణి అయిపోయాను, ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు. 3 కాబట్టి ఇప్పుడు నువ్వు దయచేసి నీ ఆయుధాల్ని అంటే నీ అంబులపొదిని, విల్లును తీసుకొని అడవికి వెళ్లి నాకోసం ఒక జంతువును వేటాడి తీసుకురా.+ 4 దానితో నాకిష్టమైన రుచిగల వంటకం తయారుచేసి నా దగ్గరికి తీసుకురా. నేను దాన్ని తిని, చనిపోకముందే నిన్ను దీవిస్తాను.”

5 ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రిబ్కా వింటూ ఉంది. తర్వాత ఏశావు ఒక జంతువును వేటాడి తేవడానికి అడవికి వెళ్లాడు.+ 6 అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబుతో ఇలా అంది:+ “ఇప్పుడే మీ నాన్న మీ అన్న ఏశావుతో ఇలా అంటుంటే విన్నాను: 7 ‘నాకోసం ఏదోక జంతువును వేటాడి తీసుకొచ్చి, రుచికరమైన వంటకాన్ని తయారుచేయి. నేను దాన్ని తిని, చనిపోకముందే యెహోవా ఎదుట నిన్ను దీవిస్తాను.’+ 8 నా కుమారుడా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విని, నేను చెప్పినట్టు చేయి.+ 9 దయచేసి, వెళ్లి మందలో నుండి రెండు శ్రేష్ఠమైన మేకపిల్లల్ని తీసుకురా. నేను వాటితో మీ నాన్నకు నచ్చే విధంగా రుచికరమైన వంటకం చేస్తాను. 10 నువ్వు దాన్ని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్లు. అప్పుడు మీ నాన్న దాన్ని తిని, తాను చనిపోకముందే నిన్ను దీవిస్తాడు.”

11 యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా అన్నాడు: “నా అన్న ఏశావు ఒంటినిండా వెంట్రుకలే,+ నేనేమో నున్నగా ఉంటాను. 12 ఒకవేళ నాన్న నన్ను తడిమి చూస్తే+ ఎలా? అప్పుడు నేను అతన్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంటుంది; దానివల్ల నేను దీవెనను కాదు, శాపాన్ని కొనితెచ్చుకుంటాను.” 13 దానికి ఆమె యాకోబుతో ఇలా అంది: “నా కుమారుడా, ఆ శాపం నా మీదికి రానివ్వు. నువ్వైతే నేను చెప్పినట్టు చేయి, వెళ్లి వాటిని తీసుకురా.”+ 14 కాబట్టి అతను వెళ్లి వాటిని తీసుకొచ్చి వాళ్లమ్మకు ఇచ్చాడు. ఆమె వాళ్ల నాన్నకు నచ్చేలా రుచికరమైన వంటకం చేసింది. 15 ఆ తర్వాత రిబ్కా తన ఇంట్లో నుండి తన పెద్ద కుమారుడు ఏశావు వస్త్రాల్లో శ్రేష్ఠమైనవి తీసుకొచ్చి, తన చిన్న కుమారుడు యాకోబుకు తొడిగింది.+ 16 అంతేకాదు ఆ మేకపిల్లల చర్మాల్ని తెచ్చి యాకోబు చేతుల మీద, మెడ మీద కప్పింది.+ 17 తర్వాత ఆమె తాను చేసిన రుచికరమైన వంటకాన్ని, రొట్టెను తన కుమారుడు యాకోబుకు ఇచ్చింది.+

18 అప్పుడు యాకోబు లోపలున్న వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి, “నాన్నా!” అన్నాడు. దానికి అతను, “చెప్పు బాబు, నువ్వు ఎవరు?” అన్నాడు. 19 యాకోబు అతనితో ఇలా అన్నాడు: “నేను నీ పెద్ద కుమారుడు ఏశావును.+ నువ్వు నాకు చెప్పినట్టే చేశాను. దయచేసి లేచి కూర్చో, నేను వేటాడి తెచ్చిన మాంసాన్ని తిని, నన్ను దీవించు.”+ 20 అప్పుడు ఇస్సాకు తన కుమారుణ్ణి, “నా కుమారుడా, అది నీకు ఇంత త్వరగా ఎలా దొరికింది?” అని అడిగాడు. దానికి అతను, “నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు” అన్నాడు. 21 అప్పుడు ఇస్సాకు యాకోబుతో, “నా కుమారుడా, దయచేసి నా దగ్గరికి రా, నిన్ను తడిమి నువ్వు నిజంగా నా కుమారుడు ఏశావువో కాదో తెలుసుకుంటాను” అన్నాడు.+ 22 దాంతో అతను వాళ్ల నాన్న ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇస్సాకు అతన్ని తడిమి చూసి, “గొంతు యాకోబు గొంతు, కానీ చేతులేమో ఏశావు చేతులు”+ అన్నాడు. 23 అతని చేతులు వాళ్ల అన్న ఏశావు చేతుల్లా వెంట్రుకలతో నిండివుండడంతో ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేదు. కాబట్టి అతన్ని దీవించాడు.+

24 ఇస్సాకు అతన్ని, “నువ్వు నిజంగా నా కుమారుడు ఏశావువేనా?” అని అడిగాడు. అందుకు అతను, “అవును, నేను ఏశావునే” అన్నాడు. 25 అప్పుడు ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుడా, నువ్వు అడవిలో వేటాడి తెచ్చిన మాంసంలో కొంచెం నాకు పెట్టు; తర్వాత నేను నిన్ను దీవిస్తాను.” దాంతో అతను దాన్ని తెచ్చి ఇస్సాకుకు పెట్టాడు, ఇస్సాకు తిన్నాడు. ఆ తర్వాత అతను ద్రాక్షారసాన్ని కూడా తెచ్చాడు, ఇస్సాకు తాగాడు. 26 అప్పుడు వాళ్ల నాన్న ఇస్సాకు అతనితో, “నా కుమారుడా, దయచేసి దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టు” అన్నాడు.+ 27 దాంతో అతను ఇస్సాకు దగ్గరికి వచ్చి అతనికి ముద్దు పెట్టాడు. అప్పుడు ఇస్సాకు అతను వేసుకున్న వస్త్రాల సువాసన చూసి,+ అతన్ని దీవిస్తూ ఇలా అన్నాడు:

“ఇదిగో, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన పొలం సువాసనలా ఉంది. 28 సత్యదేవుడు నీకు ఆకాశపు మంచును,+ సారవంతమైన నేలల్ని,+ విస్తారమైన ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని+ ఇవ్వాలి. 29 జనాలు నీకు సేవ చేయాలి, దేశాలు నీకు వంగి నమస్కారం చేయాలి. నువ్వు నీ సహోదరులకు యజమానిగా ఉండు, నీ తల్లి కుమారులు నీకు వంగి నమస్కారం చేయాలి.+ నిన్ను శపించే ప్రతీ ఒక్కరు శపించబడాలి, నిన్ను దీవించే ప్రతీ ఒక్కరు దీవించబడాలి.”+

30 ఇస్సాకు యాకోబును దీవించడం పూర్తయ్యి, అతను వాళ్ల నాన్న దగ్గర నుండి అలా వెళ్లాడో లేదో, అతని అన్న ఏశావు వేట నుండి తిరిగొచ్చాడు.+ 31 ఏశావు కూడా రుచికరమైన వంటకం తయారు చేసి వాళ్ల నాన్న దగ్గరికి తీసుకొచ్చి, ఇలా అన్నాడు: “నాన్నా, లేచి నేను తెచ్చిన మాంసం కొంచెం తిని, నన్ను దీవించు.” 32 దాంతో వాళ్ల నాన్న ఇస్సాకు అతన్ని, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. దానికి అతను, “నేను ఏశావును, నీ పెద్ద కుమారుణ్ణి” అన్నాడు.+ 33 అప్పుడు ఇస్సాకు భయంకరంగా వణికిపోతూ, “మరి, ఇంతకుముందు జంతువును వేటాడి నా దగ్గరికి తెచ్చింది ఎవరు? నువ్వు రాకముందే నేను దాన్ని తిన్నాను, అతన్ని దీవించాను. అతను ఖచ్చితంగా దీవించబడిన వాడిగా ఉంటాడు!” అన్నాడు.

34 వాళ్ల నాన్న మాటలు విన్నప్పుడు ఏశావు విపరీతమైన బాధతో బోరున ఏడుస్తూ, “నాన్నా, నన్ను కూడా దీవించు!” అన్నాడు.+ 35 కానీ ఇస్సాకు, “నీ తమ్ముడు నా దగ్గరికి వచ్చి నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవెనను తీసుకెళ్లిపోయాడు” అన్నాడు. 36 దానికి ఏశావు, “అందుకే కదా, వాడికి యాకోబు* అని పేరు పెట్టింది! ఈ రెండుసార్లు వాడు నా స్థానాన్ని లాక్కున్నాడు.+ ముందేమో నా జ్యేష్ఠత్వపు హక్కును చేజిక్కించుకున్నాడు,+ ఇప్పుడేమో నాకు రావాల్సిన దీవెనను తీసుకెళ్లిపోయాడు!”+ అన్నాడు. తర్వాత ఏశావు ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నాకోసం ఒక్క దీవెనను కూడా ఉంచలేదా?” 37 కానీ ఇస్సాకు ఏశావుతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను అతన్ని నీ మీద యజమానిగా నియమించాను;+ అతని సహోదరులందర్నీ అతనికి సేవకులుగా ఇచ్చాను; అతనికి ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని ఇచ్చాను.+ నా కుమారుడా, నీకు ఇవ్వడానికి ఇంక నా దగ్గర ఏమి మిగిలింది?”

38 ఏశావు వాళ్ల నాన్నతో, “నాన్నా, నీ దగ్గర కేవలం ఆ ఒక్క దీవెనే ఉందా? నన్ను కూడా దీవించు నాన్నా!” అన్నాడు. ఆ మాట అని ఏశావు బోరున ఏడుస్తూ కన్నీరుమున్నీరు అయ్యాడు.+ 39 అప్పుడు వాళ్ల నాన్న ఇస్సాకు అతనితో ఇలా అన్నాడు:

“ఇదిగో, నీ నివాసం సారవంతమైన నేలలకు, ఆకాశపు మంచుకు దూరంగా ఉంటుంది.+ 40 నువ్వు నీ కత్తి వల్లే బ్రతుకుతావు.+ నువ్వు నీ తమ్ముడికి సేవ చేస్తావు.+ కానీ నువ్వు విసిగిపోయినప్పుడు, నీ మెడ మీది నుండి అతని కాడిని విరగ్గొడతావు.”+

41 అయితే, వాళ్ల నాన్న ఇస్సాకు యాకోబుకు ఇచ్చిన దీవెనను బట్టి ఏశావు యాకోబు మీద పగ పెంచుకున్నాడు.+ ఏశావు తన హృదయంలో ఇలా అనుకుంటూ ఉన్నాడు: “మా నాన్న గురించి ఏడ్వాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయి.+ ఆ తర్వాత, నేను నా తమ్ముడు యాకోబును చంపేస్తా.” 42 ఏశావు మాటల గురించి రిబ్కాకు తెలిసినప్పుడు, ఆమె వెంటనే తన చిన్న కుమారుడు యాకోబును పిలిపించి, అతనితో ఇలా అంది: “ఇదిగో! నీ అన్న ఏశావు నిన్ను చంపి నీ మీద పగతీర్చుకోవాలని అనుకుంటున్నాడు.* 43 నా కుమారుడా, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. లేచి, హారానులో ఉన్న నా సహోదరుడు లాబాను దగ్గరికి పారిపో.+ 44 నీ అన్న కోపం చల్లారేవరకు కొంతకాలం అక్కడే ఉండు. 45 నీ అన్నకు నీమీద ఉన్న కోపం తగ్గి, నువ్వు అతనికి చేసింది అతను మర్చిపోయిన తర్వాత, నేను నిన్ను అక్కడి నుండి పిలిపిస్తాను. ఒకేరోజు నేను మీ ఇద్దర్నీ ఎందుకు పోగొట్టుకోవాలి?”

46 ఆ తర్వాత రిబ్కా ఇస్సాకుతో ఇలా అంటూ ఉంది: “హేతు కూతుళ్ల వల్ల నా ప్రాణం విసిగిపోయింది.+ యాకోబు కూడా హేతు కూతుళ్లలో ఒకర్ని, అంటే ఈ దేశంలో ఉంటున్న వీళ్లలాంటి ఒకర్ని పెళ్లి చేసుకుంటే, ఇక నేను బ్రతికి ఏం లాభం?”+

28 కాబట్టి ఇస్సాకు యాకోబును పిలిచి, అతన్ని దీవించి, ఇలా ఆజ్ఞాపించాడు: “నువ్వు కనానీయుల కూతుళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోకూడదు.+ 2 నువ్వు పద్దనరాములో ఉన్న మీ తాత* బెతూయేలు ఇంటికి వెళ్లి, అక్కడ మీ మేనమామ లాబాను కూతుళ్లలో+ ఒకర్ని పెళ్లి చేసుకో. 3 సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను దీవిస్తాడు; నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యేలా చేస్తాడు; నువ్వు ఖచ్చితంగా ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం అవుతావు.+ 4 ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేసిన దీవెనల్ని+ నీకు, నీతోపాటు నీ సంతానానికి* ఇస్తాడు. దానివల్ల, నువ్వు ఎక్కడైతే పరదేశిగా జీవిస్తూ ఉన్నావో, దేవుడు అబ్రాహాముకు ఏ దేశాన్నైతే ఇస్తానని వాగ్దానం చేశాడో+ ఆ దేశాన్ని సొంతం చేసుకుంటావు.”

5 ఇస్సాకు యాకోబును పంపించేశాడు. అతను పద్దనరాములో ఉన్న అరామీయుడైన బెతూయేలు కుమారుడు లాబాను+ దగ్గరికి ప్రయాణమయ్యాడు. ఈ లాబాను ఏశావు, యాకోబుల తల్లియైన రిబ్కాకు సహోదరుడు.+

6 ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాముకు చెందిన ఒకామెను పెళ్లి చేసుకోమని చెప్పి అతన్ని అక్కడికి పంపించాడనీ; అతన్ని దీవిస్తున్నప్పుడు, “కనానీయుల కూతుళ్లలో ఎవర్నీ పెళ్లి చేసుకోకూడదు”+ అని ఆజ్ఞాపించాడనీ ఏశావు గమనించాడు. 7 యాకోబు తన అమ్మానాన్నల మాట విని పద్దనరాముకు బయల్దేరాడని+ కూడా ఏశావు గమనించాడు. 8 కనానీయుల కూతుళ్లంటే తన తండ్రి ఇస్సాకుకు ఇష్టంలేదని+ ఏశావుకు అప్పుడు అర్థమైంది. 9 కాబట్టి ఏశావు తనకు అప్పటికే భార్యలు ఉన్నా, ఇష్మాయేలు దగ్గరికి వెళ్లి, మాహలతును పెళ్లి చేసుకున్నాడు; ఈమె అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలుకు కూతురు, నెబాయోతుకు సహోదరి.+

10 యాకోబు బెయేర్షెబా నుండి బయల్దేరి హారాను వైపుగా వెళ్తూ ఉన్నాడు.+ 11 అలా వెళ్తూవెళ్తూ అతను ఒక చోటికి చేరుకున్నాడు. అప్పటికే సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రి అక్కడే గడపడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి అతను అక్కడున్న ఒక రాయి తీసుకొని, దానిమీద తల వాల్చి పడుకున్నాడు.+ 12 అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఇదిగో! భూమ్మీద ఒక నిచ్చెన* వేసి ఉంది, దాని పైకొన పరలోకం వరకు ఉంది; దేవదూతలు దానిమీద పైకి ఎక్కుతూ, కిందికి దిగుతూ ఉన్నారు.+ 13 అప్పుడు ఇదిగో! యెహోవా దానికి పైన కూర్చొని ఉన్నాడు, ఆయన ఇలా అన్నాడు:

“నేను యెహోవాను, నీ పూర్వీకుడైన అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి.+ నువ్వు ఇప్పుడు పడుకున్న ఈ దేశాన్ని నేను నీకు, నీ సంతానానికి* ఇవ్వబోతున్నాను.+ 14 నీ సంతానం* ఖచ్చితంగా భూమ్మీది ధూళి కణాలంతమంది అవుతారు.+ నువ్వు ఈ దేశంలో పడమటి వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు విస్తరిస్తావు. నీ ద్వారా, నీ సంతానం* ద్వారా భూమ్మీద ఉన్న కుటుంబాలన్నీ ఖచ్చితంగా దీవించబడతాయి.*+ 15 నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్లే ప్రతీచోట నిన్ను సంరక్షిస్తాను, నిన్ను మళ్లీ ఈ దేశానికి రప్పిస్తాను.+ నేను నీకు చేసిన వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టను.”+

16 అప్పుడు యాకోబు నిద్ర లేచి, “నిజంగా, ఈ స్థలంలో యెహోవా ఉన్నాడు. కానీ నాకు ఆ విషయం తెలియలేదు” అన్నాడు. 17 అతను భయపడిపోయి, ఇంకా ఇలా అన్నాడు: “ఇది సంభ్రమాశ్చర్యాలు పుట్టించే చోటు! ఇది దేవుని ఇల్లే అయ్యుండాలి,+ ఇది పరలోక ద్వారం.”+ 18 కాబట్టి యాకోబు తెల్లవారుజామునే లేచి, తాను తల వాల్చి పడుకున్న రాయిని తీసుకొని, దాన్ని స్మారక చిహ్నంగా పాతి, దానిమీద తైలం పోశాడు.+ 19 అతను ఆ స్థలానికి బేతేలు* అని పేరు పెట్టాడు, అంతకుముందు ఆ నగరం పేరు లూజు.+

20 తర్వాత యాకోబు ఇలా ప్రమాణం చేశాడు: “దేవుడు ఇలాగే నాకు తోడుగా ఉండి, నా ప్రయాణంలో నన్ను కాపాడి, నేను తినడానికి రొట్టెను, వేసుకోవడానికి బట్టల్ని ఇచ్చి, 21 నేను క్షేమంగా నా తండ్రి ఇంటికి తిరిగొస్తే, ఖచ్చితంగా యెహోవాయే నా దేవుడని నాకు రుజువౌతుంది. 22 అలాగే, నేను ఇక్కడ స్మారక చిహ్నంగా పాతిన ఈ రాయి దేవుని ఇల్లు అవుతుంది.+ నువ్వు నాకు ఇచ్చే ప్రతీదానిలో నేను నీకు ఖచ్చితంగా పదోవంతును ఇస్తాను.”

29 ఆ తర్వాత యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించి తూర్పు ప్రజల దేశానికి వెళ్లాడు. 2 అక్కడ అతను పచ్చిక మైదానంలో ఒక బావిని చూశాడు. ఆ బావి పక్కనే మూడు గొర్రెల మందలు పడుకొని ఉన్నాయి. ఎందుకంటే కాపరులు సాధారణంగా ఆ గొర్రెలకు అక్కడే నీళ్లు పెడతారు. ఆ బావి ఒక పెద్ద రాయితో మూసేసి ఉంది. 3 గొర్రెల మందలన్నీ ఒక దగ్గరికి చేరాక, వాళ్లు ఆ బావి మీదున్న రాయిని పక్కకు దొర్లించి ఆ మందలకు నీళ్లు పెట్టి, ఆ తర్వాత మళ్లీ ఆ రాయితో బావిని మూసేస్తారు.

4 యాకోబు వాళ్లను, “నా సహోదరులారా, మీరు ఎక్కడివాళ్లు?” అని అడిగాడు. దానికి వాళ్లు, “మేము హారాను+ వాళ్లం” అని జవాబిచ్చారు. 5 అప్పుడు యాకోబు వాళ్లను, “మీకు నాహోరు+ మనవడు లాబాను+ తెలుసా?” అని అడిగాడు. దానికి వాళ్లు, “తెలుసు” అన్నారు. 6 తర్వాత యాకోబు వాళ్లను, “అతను బాగున్నాడా?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “అతను బాగున్నాడు. ఇదిగో, అతని కూతురు రాహేలు+ గొర్రెలతో వస్తోంది!” అన్నారు. 7 అతను వాళ్లతో, “ఇది ఇంకా మధ్యాహ్నమే, మందల్ని ఒకచోటికి చేర్చే సమయం కాదు. కాబట్టి గొర్రెలకు నీళ్లు పెట్టి, వెళ్లి వాటిని మేపండి” అన్నాడు. 8 దానికి వాళ్లు, “మందలన్నీ ఒకచోటికి చేరి, బావి మీది రాయి దొర్లించబడే వరకు వాటికి నీళ్లు పెట్టడానికి మాకు అనుమతి లేదు. ఆ తర్వాతే మేము వాటికి నీళ్లు పెడతాం” అన్నారు.

9 అతను ఇంకా వాళ్లతో మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది; ఆమె గొర్రెల్ని కాసేది. 10 యాకోబు తన మేనమామ లాబాను కూతురు రాహేలును, అతని గొర్రెల్ని చూసినప్పుడు, వెంటనే బావి దగ్గరికి వెళ్లి దాని మీదున్న రాయిని పక్కకు దొర్లించి, తన మేనమామ గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11 తర్వాత యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని, గట్టిగా ఏడ్చాడు. 12 తాను ఆమె తండ్రి బంధువునని,* రిబ్కా కుమారుణ్ణని యాకోబు రాహేలుకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది.

13 లాబాను+ తన మేనల్లుడు యాకోబు గురించి విన్న వెంటనే, అతన్ని కలవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. లాబాను అతన్ని కౌగిలించుకొని, ముద్దుపెట్టుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు అతను లాబానుకు ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. 14 లాబాను అతనితో, “నిజంగా నువ్వు నా రక్తసంబంధివి”* అన్నాడు. కాబట్టి అతను లాబాను దగ్గర ఒక నెలంతా ఉన్నాడు.

15 ఆ తర్వాత లాబాను యాకోబుతో, “నువ్వు నా బంధువు*+ అయినంత మాత్రాన, జీతం తీసుకోకుండా నా దగ్గర పని చేయాలా? చెప్పు, నీకు జీతంగా ఏమివ్వమంటావు?”+ అన్నాడు. 16 లాబానుకు ఇద్దరు కూతుళ్లు. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.+ 17 అయితే లేయా కళ్లు ఆకర్షణీయంగా ఉండేవి కావు, కానీ రాహేలు మాత్రం చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉండేది. 18 యాకోబు రాహేలును ప్రేమించాడు, కాబట్టి ఇలా అన్నాడు: “నీ చిన్న కూతురు రాహేలు కోసం నేను నీ దగ్గర ఏడేళ్లు పనిచేస్తాను.”+ 19 దానికి లాబాను, “నా కూతుర్ని ఇంకెవరికో ఇచ్చే బదులు నీకు ఇవ్వడమే మంచిది, నా దగ్గరే ఉండు” అన్నాడు. 20 దాంతో యాకోబు రాహేలు కోసం లాబాను దగ్గర ఏడేళ్లు పనిచేశాడు.+ కానీ, ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆ ఏడేళ్లు అతనికి కేవలం కొన్ని రోజుల్లా అనిపించాయి.

21 తర్వాత యాకోబు లాబానుతో, “నేను నీ దగ్గర పనిచేయాల్సిన రోజులు అయిపోయాయి, కాబట్టి నా భార్యను నాకు ఇచ్చేయి. నేను ఆమెతో కలవాలి”* అన్నాడు. 22 దాంతో లాబాను ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లందర్నీ పిలిచి విందు ఏర్పాటు చేశాడు. 23 కానీ సాయంకాలమైనప్పుడు లాబాను తన కూతురు లేయాను యాకోబు దగ్గరికి తీసుకొచ్చాడు, యాకోబు లేయాతో కలవాలని* అతను అలా చేశాడు. 24 అంతేకాదు లాబాను తన సేవకురాలు జిల్పాను లేయాకు సేవకురాలిగా ఇచ్చాడు.+ 25 తెల్లవారినప్పుడు, యాకోబు లేచి చూసేసరికి అతని పక్కన ఉన్నది లేయా! అప్పుడు అతను లాబానుతో, “నువ్వు చేసిందేంటి? నేను నీకు సేవ చేసింది రాహేలు కోసం కాదా? నన్ను ఎందుకు మోసం చేశావు?”+ అన్నాడు. 26 అందుకు లాబాను ఇలా అన్నాడు: “పెద్ద కూతురు కన్నా ముందు చిన్న కూతురికి పెళ్లి చేయడం ఇక్కడి ఆచారం కాదు. 27 ఈ వారమంతా ఆమెతో సంతోషించు, ఆ తర్వాత చిన్నామెను కూడా నీకు ఇస్తాను. కాకపోతే నువ్వు నాకు ఇంకో ఏడు సంవత్సరాలు సేవ చేయాలి.”+ 28 లాబాను చెప్పినట్టే యాకోబు ఆమెతో ఆ వారమంతా సంతోషించాడు. ఆ తర్వాత లాబాను తన కూతురు రాహేలును యాకోబుకు ఇచ్చి పెళ్లి చేశాడు. 29 అంతేకాదు, లాబాను తన సేవకురాలు బిల్హాను+ తన కూతురు రాహేలుకు సేవకురాలిగా ఇచ్చాడు.+

30 యాకోబు రాహేలుతో కూడా కలిశాడు.* అతను లేయా కన్నా రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. అతను ఇంకో ఏడు సంవత్సరాలు లాబానుకు సేవచేశాడు.+ 31 యాకోబు లేయాను ప్రేమించట్లేదని* యెహోవా చూసి ఆమె గర్భవతి అయ్యేలా చేశాడు;*+ కానీ రాహేలు గొడ్రాలిగా ఉంది.+ 32 కాబట్టి లేయా గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కని, అతనికి రూబేను*+ అని పేరు పెట్టింది. “ఎందుకంటే యెహోవా నా బాధను చూశాడు,+ ఇప్పుడు నా భర్త నన్ను ప్రేమించడం మొదలుపెడతాడు” అని ఆమె అనుకుంది. 33 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి, కుమారుణ్ణి కని, “నా భర్త నన్ను ప్రేమించట్లేదని నేను పెట్టిన మొర యెహోవా విన్నాడు, అందుకే ఈ కుమారుణ్ణి కూడా అనుగ్రహించాడు” అనుకుంటూ అతనికి షిమ్యోను*+ అని పేరు పెట్టింది. 34 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఇప్పుడు నా భర్త నన్ను అంటిపెట్టుకొని ఉంటాడు, ఎందుకంటే నేను అతనికి ముగ్గురు కుమారుల్ని కన్నాను” అనుకుంటూ, ఆ పిల్లవాడికి లేవి*+ అని పేరు పెట్టింది. 35 ఆమె మళ్లీ ఇంకోసారి గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కని, “ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను” అనుకుంటూ, అతనికి యూదా*+ అని పేరు పెట్టింది. ఆ తర్వాత కొంతకాలం ఆమెకు పిల్లలు పుట్టలేదు.

30 తాను యాకోబుకు పిల్లల్ని కనట్లేదని రాహేలు చూసినప్పుడు, ఆమె తన అక్క మీద అసూయపడి యాకోబుతో ఇలా అనడం మొదలుపెట్టింది: “నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను.” 2 అప్పుడు యాకోబు రాహేలు మీద కోపంతో మండిపడి, “నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? దేవుడే నీకు పిల్లలు పుట్టకుండా* చేశాడు” అన్నాడు. 3 దానికి ఆమె ఇలా అంది: “ఇదిగో, నా దాసురాలు బిల్హా.+ ఆమె నాకోసం* పిల్లల్ని కనేలా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకో. అప్పుడు ఆమె ద్వారా నాకు కూడా పిల్లలు ఉంటారు.” 4 అలా రాహేలు తన సేవకురాలు బిల్హాను యాకోబుకు భార్యగా ఇచ్చింది, అతను ఆమెతో కలిశాడు.+ 5 బిల్హా గర్భవతి అయ్యి, ఒక కుమారుణ్ణి కన్నది. 6 అప్పుడు రాహేలు, “దేవుడు నాకు న్యాయమూర్తిగా వ్యవహరించాడు, నా మొర విన్నాడు. అందుకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అనుకుంటూ ఆ పిల్లవాడికి దాను*+ అని పేరు పెట్టింది. 7 రాహేలు సేవకురాలు బిల్హా మళ్లీ గర్భవతి అయ్యి, యాకోబుకు రెండో కుమారుణ్ణి కన్నది. 8 అప్పుడు రాహేలు, “నేను మా అక్కతో గట్టిగా కుస్తీపడి గెలిచాను!” అంటూ ఆ పిల్లవాడికి నఫ్తాలి*+ అని పేరు పెట్టింది.

9 లేయా తనకు పిల్లలు పుట్టడం లేదని గమనించినప్పుడు, తన సేవకురాలు జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది.+ 10 లేయా సేవకురాలు జిల్పా యాకోబుకు ఒక కుమారుణ్ణి కన్నది. 11 అప్పుడు లేయా, “ఎంతటి భాగ్యం!” అని అంటూ ఆ పిల్లవాడికి గాదు*+ అని పేరు పెట్టింది. 12 ఆ తర్వాత లేయా సేవకురాలు జిల్పా యాకోబుకు రెండో కుమారుణ్ణి కన్నది. 13 అప్పుడు లేయా, “ఎంత సంతోషం! స్త్రీలు తప్పకుండా నన్ను సంతోషవంతురాలని పిలుస్తారు”+ అంటూ, ఆ పిల్లవాడికి ఆషేరు*+ అని పేరు  పెట్టింది.

14 గోధుమ పంట కోతకోసే రోజుల్లో, రూబేను+ పొలంలో నడుస్తున్నప్పుడు పుత్రదాత చెట్టు పండ్లు చూశాడు. అతను వాటిని తెచ్చి తన తల్లి లేయాకు ఇచ్చాడు. అప్పుడు రాహేలు లేయాను, “దయచేసి, నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు కొన్ని నాకు ఇవ్వు” అని అడిగింది. 15 దానికి ఆమె, “నువ్వు నా భర్తను తీసేసుకున్నావు,+ అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు కూడా కావాలా?” అంది. అప్పుడు రాహేలు, “సరే మంచిది. నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లు నాకు ఇస్తే, ఈ రాత్రి యాకోబు నీతో గడుపుతాడు” అంది.

16 సాయంకాలం యాకోబు పచ్చిక మైదానం నుండి వస్తున్నప్పుడు, లేయా అతనికి ఎదురెళ్లి, “నువ్వు ఈ రాత్రి నాతో గడపాలి, ఎందుకంటే నేను నా కుమారుడు తెచ్చిన పుత్రదాత చెట్టు పండ్లతో నిన్ను కొన్నాను” అంది. కాబట్టి అతను ఆ రాత్రి ఆమెతో గడిపాడు. 17 దేవుడు లేయా మొర విన్నాడు. దాంతో ఆమె గర్భవతి అయ్యి, యాకోబుకు ఐదో కుమారుణ్ణి కన్నది. 18 తర్వాత లేయా, “నేను నా సేవకురాల్ని నా భర్తకు ఇచ్చినందుకు దేవుడు నా జీతం* నాకు ఇచ్చాడు” అంటూ ఆ పిల్లవాడికి ఇశ్శాఖారు*+ అని పేరు పెట్టింది. 19 లేయా మళ్లీ గర్భవతి అయ్యి యాకోబుకు ఆరో కుమారుణ్ణి కన్నది.+ 20 అప్పుడు లేయా, “దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు, ఇప్పుడు నా భర్త నన్ను సహిస్తాడు.+ ఎందుకంటే నేను అతనికి ఆరుగురు కుమారుల్ని కన్నాను”+ అంటూ ఆ పిల్లవాడికి జెబూలూను*+ అని పేరు పెట్టింది. 21 తర్వాత లేయా ఒక కూతుర్ని కని, ఆమెకు దీనా+ అని పేరు పెట్టింది.

22 చివరికి దేవుడు రాహేలును గుర్తుచేసుకున్నాడు. దేవుడు ఆమె మొర విని, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశాడు.*+ 23 దాంతో ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు ఆమె ఇలా అనుకుంది: “దేవుడు నా మీద ఉన్న నిందను తీసేశాడు!”+ 24 కాబట్టి ఆమె, “యెహోవా నాకు ఇంకో కుమారుణ్ణి ఇచ్చాడు” అంటూ ఆ పిల్లవాడికి యోసేపు*+ అని పేరు పెట్టింది.

25 రాహేలు యోసేపును కన్న తర్వాత, యాకోబు ఆలస్యం చేయకుండా లాబానుతో ఇలా అన్నాడు: “నన్ను ఇక్కడి నుండి పంపించేయి. నేను నా ఊరికి, నా దేశానికి వెళ్లిపోతాను.+ 26 నా భార్యల్ని, నా పిల్లల్ని నాకు ఇచ్చి పంపించు. నేను నీ దగ్గర పనిచేసింది వాళ్ల కోసమే. నేను నీకు ఎలా సేవచేశానో నీకు బాగా తెలుసు.”+ 27 అప్పుడు లాబాను అతనితో, “నీ దయ నా మీద ఉంటే, దయచేసి నా దగ్గరే ఉండు. నీ వల్లే యెహోవా నన్ను దీవిస్తున్నాడని నేను శకునాలు* చూసి తెలుసుకున్నాను” అని అన్నాడు. 28 లాబాను ఇంకా ఇలా అన్నాడు: “నీకు జీతంగా ఏమి కావాలో చెప్పు, నేను ఇస్తాను.”+ 29 దానికి యాకోబు ఇలా అన్నాడు: “నేను నీకు ఎలా సేవచేశానో, నా వల్ల నీ మంద ఎలా వర్ధిల్లిందో+ నీకు తెలుసు; 30 నేను రాకముందు నీ మంద చాలా చిన్నది, కానీ ఇప్పుడు అది చాలా రెట్లు పెరిగింది. నేను వచ్చిన దగ్గర నుండి యెహోవా నిన్ను దీవించాడు. ఇప్పుడు నేను నా కుటుంబం కోసం ఏదోకటి చేయాలనుకుంటున్నాను.”+

31 దానికి లాబాను, “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. అప్పుడు యాకోబు ఇలా అన్నాడు: “నువ్వు నాకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు! నాకోసం ఈ ఒక్క పని చేయి చాలు, నేను ఎప్పటిలాగే నీ మందల్ని కాస్తూ సంరక్షిస్తాను.+ 32 నేను ఈ రోజు నీ మంద అంతటి మధ్య నడుస్తాను. నువ్వు పొడలు, మచ్చలు ఉన్న ప్రతీ గొర్రెను; ముదురు గోధుమ* రంగులోవున్న ప్రతీ మగ గొర్రెపిల్లను; పొడలు, మచ్చలు ఉన్న ప్రతీ మేకను వేరు చేసి పెట్టు. ఇప్పటినుండి అవి నాకు జీతం అవుతాయి.+ 33 నువ్వు నా జీతాన్ని చూడడం కోసం వచ్చే రోజున నా నీతి* నా తరఫున మాట్లాడుతుంది; మేకల్లో పొడలు, మచ్చలు లేనిది ఏదైనా, గొర్రెపిల్లల్లో ముదురు గోధుమ రంగులో లేని మగది ఏదైనా నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్టే లెక్క.”

34 దానికి లాబాను, “మంచిది! నువ్వు చెప్పినట్టే కానివ్వు” అన్నాడు.+ 35 ఆ రోజు అతను చారలు, మచ్చలు ఉన్న మేకపోతుల్ని; పొడలు, మచ్చలు ఉన్న మేకలన్నిటిని, అంటే ఏ కాస్తయినా తెలుపున్న ప్రతీదాన్ని; అలాగే ముదురు గోధుమ రంగులో ఉన్న మగ గొర్రెపిల్లల్ని వేరుచేసి తన కుమారులకు అప్పగించాడు. 36 తర్వాత అతను యాకోబు నుండి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లిపోయాడు. యాకోబు మిగిలివున్న లాబాను మందల్ని కాస్తూ ఉన్నాడు.

37 ఆ తర్వాత యాకోబు గుగ్గిలం, బాదం, సాల చెట్ల పచ్చి కర్రల్ని తీసుకొని, అక్కడక్కడ వాటి బెరడు ఒలిచి, వాటిలోని తెల్లని భాగం బయటికి కనిపించేలా చేశాడు. 38 తాను ఒలిచిన ఆ కర్రల్ని మందలు నీళ్లు తాగడానికి వచ్చే చోట అంటే కాలువల్లో, నీటి తొట్లలో వాటికి కనిపించేలా వాటి ఎదుట పెట్టాడు. మంద నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ కర్రల ఎదుట జతకట్టాలనే ఉద్దేశంతో అతను అలా చేశాడు.

39 అలా మందలు ఆ కర్రల ఎదుట జతకట్టేవి. దానివల్ల వాటికి చారలు, పొడలు, మచ్చలు ఉన్న పిల్లలు పుట్టేవి. 40 అప్పుడు యాకోబు మందల్లోని మగ గొర్రెపిల్లల్ని వేరు చేసి, మిగతావాటిని లాబాను మందల్లోని చారలు ఉన్నవాటికి, ముదురు గోధుమ రంగులో ఉన్న వాటన్నిటికి ఎదురుగా పెట్టేవాడు. ఆ తర్వాత తన మందలు లాబాను మందలతో కలిసిపోకుండా వేరు చేసి పెట్టేవాడు. 41 బలమైన జంతువులు జతకట్టే ప్రతీసారి, అవి ఆ కర్రల పక్కనే జతకట్టేలా యాకోబు ఆ కర్రల్ని కాలువల్లో వాటి కళ్లముందు పెట్టేవాడు. 42 కానీ బలహీనమైనవి జతకట్టేటప్పుడు, అతను ఆ కర్రల్ని అక్కడ పెట్టేవాడు కాదు. దానివల్ల ప్రతీసారి బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చేవి.+

43 అలా యాకోబు చాలా ధనవంతుడయ్యాడు; అతను పెద్దపెద్ద మందల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను, ఒంటెల్ని, గాడిదల్ని సంపాదించుకున్నాడు.+

31 లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి చెందిన ప్రతీది తీసేసుకున్నాడు, మన తండ్రికి చెందిన వాటితోనే ఈ ఆస్తంతా కూడబెట్టుకున్నాడు”+ అని అనుకుంటున్నారని కొంతకాలానికి యాకోబు విన్నాడు. 2 యాకోబు లాబాను ముఖం చూసినప్పుడు, తన విషయంలో లాబాను వైఖరి ఒకప్పటిలా లేదని గమనించాడు.+ 3 చివరికి, యెహోవా యాకోబుతో ఇలా అన్నాడు: “నువ్వు నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగెళ్లు.+ ఎప్పటిలానే నేను నీకు తోడుగా ఉంటాను.” 4 అప్పుడు యాకోబు, పచ్చిక మైదానంలో ఉన్న తన మంద దగ్గరికి రమ్మని రాహేలుకు, లేయాకు కబురు పంపాడు. 5 యాకోబు వాళ్లతో ఇలా అన్నాడు:

“నా విషయంలో మీ నాన్న వైఖరి మారిపోయిందని+ నేను గమనించాను, కానీ నా తండ్రి ఆరాధించిన దేవుడు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు.+ 6 నేను నా శక్తినంతా ఉపయోగించి మీ నాన్నకు సేవ చేశానని మీకు బాగా తెలుసు.+ 7 మీ నాన్న నన్ను మోసం చేయడానికి ప్రయత్నించాడు, పదిసార్లు నా జీతం మార్చాడు; కానీ దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు. 8 అతను, ‘మచ్చలు ఉన్నవి నీ జీతం’ అని చెప్పినప్పుడు మందంతటికీ మచ్చలు ఉన్న పిల్లలే పుట్టాయి; ‘చారలు ఉన్నవి నీ జీతం’ అని చెప్పినప్పుడు మందంతటికీ చారలు ఉన్న పిల్లలే పుట్టాయి.+ 9 అలా దేవుడు మీ నాన్న పశువుల్ని అతని దగ్గర నుండి తీసేసి నాకు ఇస్తూ ఉన్నాడు. 10 ఒకసారి మందలోని జంతువులు జతకట్టే సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో చారలు, మచ్చలు, పొడలు ఉన్న మేకపోతులు మందతో జతకట్టడం చూశాను.+ 11 ఆ కలలో సత్యదేవుని దూత నన్ను, ‘యాకోబూ!’ అని పిలిచాడు. దానికి నేను, ‘చెప్పు ప్రభువా’ అన్నాను. 12 అప్పుడు ఆ దూత ఇలా అన్నాడు: ‘దయచేసి నీ తల ఎత్తి చూడు, మందతో జతకడుతున్న మేకపోతులన్నిటికీ చారలు, మచ్చలు, పొడలు ఉన్నాయి. లాబాను నీకు చేస్తున్నదంతా నేను చూశాను.+ 13 బేతేలు+ దగ్గర నీకు కనిపించిన సత్యదేవుణ్ణి నేనే; అక్కడ నువ్వు ఒక రాయిని స్మారక చిహ్నంగా నిలబెట్టి దానిమీద తైలం పోశావు,* అక్కడే నాతో ప్రమాణం చేశావు.+ ఇప్పుడు నువ్వు లేచి, ఈ దేశం నుండి బయల్దేరి నీ స్వదేశానికి తిరిగెళ్లు.’ ”+

14 అప్పుడు రాహేలు, లేయా యాకోబుతో ఇలా అన్నారు: “మా నాన్న ఇంట్లో మాకు వారసత్వంగా రావాల్సిన వాటా ఇంకేమైనా మిగిలి ఉందా? 15 అతను మమ్మల్ని అమ్మేసి, వచ్చిన డబ్బంతా తనే వాడుకుంటూ మమ్మల్ని పరదేశులుగా చూడట్లేదా?+ 16 దేవుడు మా నాన్న నుండి తీసేసుకున్న సంపదలన్నీ మనవి, మన పిల్లలవి.+ కాబట్టి, దేవుడు నీకు చెప్పిన ప్రతీది చేయి.”+

17 అప్పుడు యాకోబు లేచి తన పిల్లల్ని, భార్యల్ని ఒంటెల మీదికి ఎక్కించి,+ 18 తన మందంతటినీ తోలుకుంటూ, పద్దనరాములో తాను సంపాదించుకున్న వస్తువులన్నిటినీ,+ పశువుల్ని తీసుకొని కనాను దేశంలో ఉన్న తన తండ్రి ఇస్సాకు దగ్గరికి బయల్దేరాడు.+

19 లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లినప్పుడు, రాహేలు తన తండ్రికి చెందిన+ గృహదేవతల విగ్రహాల్ని+ దొంగిలించింది. 20 అంతేకాదు, యాకోబు తెలివిగా ప్రవర్తించి అరామీయుడైన లాబానుకు చెప్పకుండా పారిపోయాడు. 21 అతను పారిపోయి, తనకున్న వాటన్నిటితో నది*+ దాటాడు. ఆ తర్వాత అతను గిలాదు కొండ ప్రాంతం+ వైపుగా ప్రయాణించాడు. 22 మూడో రోజున, యాకోబు పారిపోయాడన్న విషయం ఎవరో లాబానుకు చెప్పారు. 23 కాబట్టి అతను తన బంధువుల్ని వెంటబెట్టుకొని యాకోబును వెతుక్కుంటూ ఏడురోజులు ప్రయాణం చేశాడు. చివరికి, గిలాదు కొండ ప్రాంతం దగ్గర యాకోబు వాళ్లకు కనిపించాడు. 24 దేవుడు ఆ రాత్రి అరామీయుడైన లాబానుకు+ కలలో కనిపించి+ ఇలా అన్నాడు: “మంచేగానీ, చెడేగానీ నువ్వు యాకోబుతో ఏమి మాట్లాడినా జాగ్రత్తగా ఉండు.”+

25 యాకోబు ఆ కొండ మీద డేరా వేసుకున్నాడు. లాబాను కూడా తన బంధువులతో కలిసి గిలాదు కొండ ప్రాంతంలో డేరాలు వేసుకున్నాడు. అప్పుడు లాబాను యాకోబు దగ్గరికి వెళ్లి, 26 అతనితో ఇలా అన్నాడు: “నువ్వు చేసిందేంటి? నన్ను ఎందుకు మోసం చేశావు? నా కూతుళ్లను కత్తితో చెరపట్టుకుపోయినట్టు ఎందుకు తీసుకుపోయావు? 27 నన్ను మోసం చేసి, నాకు ఒక్కమాట కూడా చెప్పకుండా, రహస్యంగా ఎందుకు పారిపోయావు? నువ్వు నాకు చెప్పివుంటే, నేను సంబరాలు జరిపి, కంజీరను,* వీణను* వాయిస్తూ పాటలతో నిన్ను సాగనంపేవాణ్ణి. 28 కానీ నువ్వు నా మనవళ్లను-మనవరాళ్లను,* కూతుళ్లను ముద్దుపెట్టుకునే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. నువ్వు తెలివితక్కువ పని చేశావు. 29 నేను తలచుకుంటే నీకు హాని చేయగలను, కానీ నీ తండ్రి ఆరాధించిన దేవుడు నిన్న రాత్రి కలలో నాతో మాట్లాడి, ‘మంచేగానీ, చెడేగానీ నువ్వు యాకోబుతో ఏమి మాట్లాడినా జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాడు.+ 30 నువ్వు నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని ఎప్పటినుండో కోరుకుంటున్నావు కాబట్టి నా దగ్గర నుండి వచ్చేశావు సరే, కానీ నా గృహదేవతల్ని ఎందుకు దొంగిలించావు?”+

31 అందుకు యాకోబు లాబానుతో ఇలా అన్నాడు: “నువ్వు నీ కూతుళ్లను బలవంతంగా నా దగ్గర నుండి లాగేసుకుంటావని భయపడి నేను అలా వచ్చేశాను. 32 నీ గృహదేవతలు ఎవరి దగ్గరైనా దొరికితే, వాళ్లు బ్రతకరు. మన బంధువుల ముందు నా వస్తువులన్నీ గాలించి, నీవి ఏమైనా దొరికితే తీసేసుకో.” అయితే రాహేలు వాటిని దొంగిలించిన విషయం యాకోబుకు తెలీదు. 33 కాబట్టి లాబాను యాకోబు డేరాలోకి, లేయా డేరాలోకి, ఇద్దరు దాసురాళ్ల+ డేరాలోకి వెళ్లి వెదికాడు, కానీ అవి దొరకలేదు. తర్వాత అతను లేయా డేరాలో నుండి బయటికి వచ్చి రాహేలు డేరాలోకి వెళ్లాడు. 34 అయితే ఈలోగా రాహేలు ఆ గృహదేవతల విగ్రహాల్ని తీసుకొని ఒంటె జీనుకు ఉండే పెట్టెలో పెట్టి, దాని మీద కూర్చుంది. అప్పుడు లాబాను రాహేలు డేరా అంతా వెదికాడు కానీ అవి దొరకలేదు. 35 తర్వాత ఆమె వాళ్ల నాన్నతో, “నా ప్రభువా, నేను నీ ముందు లేచి నిలబడలేక పోతున్నందుకు కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను ఇప్పుడు కడగా* ఉన్నాను”+ అంది. కాబట్టి అతను జాగ్రత్తగా వెదికాడు, కానీ ఆ గృహదేవతల విగ్రహాలు+ అతనికి దొరకలేదు.

36 అప్పుడు యాకోబుకు కోపమొచ్చి లాబానును విమర్శిస్తూ ఇలా అన్నాడు: “నేను ఏం తప్పు చేశాను? నేను ఏ పాపం చేశానని నువ్వు ఇంత ఆవేశంగా నన్ను వెతుక్కుంటూ వచ్చావు? 37 నువ్వు నా సామానంతా వెదికావు కదా, నీ వస్తువులు ఏమైనా దొరికాయా? వాటిని తీసుకొచ్చి నా బంధువుల ముందు, నీ బంధువుల ముందు పెట్టు. వాళ్లే నీకూ నాకూ మధ్య న్యాయం చెప్తారు. 38 నేను నీ దగ్గరున్న ఈ 20 ఏళ్లలో నీ గొర్రెలకు, మేకలకు ఎన్నడూ గర్భపాతం కలగలేదు;+ నీ మందలోని పొట్టేళ్లను నేను ఎన్నడూ తినలేదు. 39 అడవి మృగాలు చీల్చేసిన ఏ జంతువునూ+ నేను నీ దగ్గరికి తీసుకురాలేదు. ఆ నష్టాన్ని నేనే భరించాను. ఒక జంతువును పగలు గానీ, రాత్రి గానీ ఎవరైనా దొంగిలిస్తే, నష్ట పరిహారం చెల్లించమని నువ్వు నన్ను అడిగేవాడివి. 40 పగటిపూట ఎండకు, రాత్రిపూట చలికి కృశించిపోయాను, నిద్ర ఉండేది కాదు.+ 41 అలా నీ ఇంట్లో 20 ఏళ్లు సేవచేశాను. 14 ఏళ్లు నీ ఇద్దరు కూతుళ్ల కోసం, 6 ఏళ్లు నీ మంద కోసం సేవచేశాను. నువ్వు నా జీతాన్ని పదిసార్లు మార్చావు.+ 42 ఒకవేళ నా తండ్రి దేవుడు,+ అంటే అబ్రాహాము సేవించిన దేవుడు, ఇస్సాకు భయపడే దేవుడు+ నా వైపు లేకపోయుంటే, ఇప్పుడు నువ్వు నన్ను వట్టి చేతులతో పంపించి ఉండేవాడివి. నేను పడిన బాధను, నా చేతుల కష్టాన్ని దేవుడు చూశాడు, అందుకే నిన్న రాత్రి నిన్ను గద్దించాడు.”+

43 అప్పుడు లాబాను యాకోబుతో ఇలా అన్నాడు: “వీళ్లు నా కూతుళ్లు, ఈ పిల్లలు నా పిల్లలు, ఈ మంద నా మంద; నువ్వు చూస్తున్న ప్రతీది నాది, నా కూతుళ్లది. అలాంటిది ఈ రోజు వీళ్లకు గానీ, వీళ్ల పిల్లలకు గానీ నేనెలా హాని చేయగలను? 44 రా, ఇప్పుడు మనిద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం. అది మన మధ్య సాక్ష్యంగా ఉంటుంది.” 45 కాబట్టి యాకోబు ఒక రాయి తీసుకొని, దాన్ని స్మారక చిహ్నంగా నిలబెట్టాడు.+ 46 తర్వాత యాకోబు, “రాళ్లు తీసుకురండి!” అని తన బంధువులకు చెప్పాడు. వాళ్లు రాళ్లు తెచ్చి కుప్పగా వేశారు. తర్వాత వాళ్లు ఆ రాళ్లకుప్ప దగ్గర భోజనం చేశారు. 47 లాబాను ఆ చోటుకు యగర్‌శాహదూతా* అని పేరు పెట్టాడు, కానీ యాకోబు దానికి గలేదు* అని పేరు పెట్టాడు.

48 తర్వాత లాబాను, “ఈ రోజు మనిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఈ రాళ్లకుప్పే సాక్ష్యంగా ఉంటుంది” అన్నాడు. అందుకే యాకోబు దానికి గలేదు+ అని పేరు పెట్టాడు. 49 అంతేకాదు, దాన్ని కావలిబురుజు అని పిలిచాడు. ఎందుకంటే లాబాను ఇలా అన్నాడు: “మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పుడు యెహోవాయే మనిద్దరి మధ్య కాపలాగా ఉంటాడు. 50 నువ్వు నా కూతుళ్లను బాధపెట్టినా, ఇంకా వేరే స్త్రీలను భార్యలుగా చేసుకున్నా, ఇది గుర్తుంచుకో: ఏ మనిషీ చూడకపోయినా, మనిద్దరి మధ్య సాక్షిగా ఉన్న దేవుడు చూస్తాడు.” 51 లాబాను యాకోబుతో ఇంకా ఇలా అన్నాడు: “ఇదిగో ఈ రాళ్లకుప్పనూ, మనిద్దరి మధ్య సాక్ష్యంగా ఉండడానికి నేను నిలబెట్టిన స్మారక చిహ్నాన్నీ చూడు. 52 నీకు హాని తలపెట్టడానికి నేనూ, నాకు హాని తలపెట్టడానికి నువ్వూ వీటిని దాటిరాము అనడానికి ఈ రాళ్లకుప్ప, ఈ స్మారక చిహ్నం సాక్ష్యంగా ఉంటాయి.+ 53 అబ్రాహాము దేవుడు,+ నాహోరు దేవుడు, వాళ్ల తండ్రి దేవుడు నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చాలి.” అప్పుడు యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని+ ముందు ఒట్టేశాడు.

54 ఆ తర్వాత యాకోబు ఆ కొండ మీద ఒక బలి అర్పించి, రొట్టె తినడానికి తన బంధువుల్ని ఆహ్వానించాడు. వాళ్లు తిని, ఆ రాత్రి ఆ కొండ మీదే బస చేశారు. 55 అయితే, లాబాను తెల్లవారుజామునే లేచి, తన మనవళ్లను-మనవరాళ్లను,* తన కూతుళ్లను ముద్దు పెట్టుకొని+ వాళ్లను దీవించాడు.+ తర్వాత లాబాను అక్కడి నుండి బయల్దేరి తన ఇంటికి తిరిగెళ్లిపోయాడు.+

32 యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు, దారిలో అతనికి దేవదూతలు ఎదురయ్యారు. 2 అతను వాళ్లను చూసిన వెంటనే, “ఇది దేవుని శిబిరం!” అంటూ ఆ చోటుకు మహనయీము* అని పేరు పెట్టాడు.

3 యాకోబు ఆ తర్వాత శేయీరు దేశంలో,+ అంటే ఎదోము+ ప్రాంతంలో ఉంటున్న తన అన్న ఏశావు దగ్గరికి సందేశకుల్ని పంపాడు. 4 అతను వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఏమనాలంటే, ‘నీ సేవకుడైన యాకోబు ఇలా చెప్తున్నాడు: “నేను ఇప్పటివరకు లాబాను దగ్గర చాలాకాలం నివసించాను.*+ 5 నేను ఎద్దుల్ని, గాడిదల్ని, గొర్రెల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను సంపాదించుకున్నాను.+ నీ దృష్టిలో అనుగ్రహం పొందేలా, నేను వస్తున్నానని నా ప్రభువుకు చెప్పడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను.” ’ ”

6 కొన్ని రోజులకు ఆ సందేశకులు తిరిగొచ్చి యాకోబుకు ఇలా చెప్పారు: “మేము మీ అన్న ఏశావును కలిశాం. ఇదిగో, అతను నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో పాటు 400 మంది మనుషులు ఉన్నారు.”+ 7 అది విన్నప్పుడు యాకోబు చాలా భయపడ్డాడు, ఆందోళన చెందాడు.+ కాబట్టి అతను తనతో ఉన్నవాళ్లను, మందల్ని, పశువుల్ని, ఒంటెల్ని రెండు గుంపులుగా విడగొట్టాడు. 8 యాకోబు ఇలా అన్నాడు: “ఒకవేళ ఏశావు మొదటి గుంపు మీద దాడిచేస్తే, రెండో గుంపు తప్పించుకోవచ్చు.”

9 ఆ తర్వాత యాకోబు ఇలా అన్నాడు: “నా పూర్వీకుడైన అబ్రాహాముకు దేవా, నా తండ్రైన ఇస్సాకుకు దేవా, యెహోవా, ‘నీ దేశానికి, నీ బంధువుల దగ్గరికి తిరిగెళ్లు, నేను నీకు మేలు చేస్తాను’+ అని నాతో చెప్తున్న దేవా, 10 నువ్వు నీ సేవకుని మీద చూపిస్తున్న విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని పొందడానికి నేను అర్హుణ్ణి కాదు.+ నేను ఈ యొర్దాను నది దాటినప్పుడు, నా దగ్గర చేతికర్ర మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు రెండు గుంపులు చేయగలిగేంత పెద్ద కుటుంబం నాకుంది.+ 11 నా అన్న ఏశావు చేతిలో నుండి నన్ను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను.+ అతను వచ్చి నా మీద, ఈ తల్లుల మీద, వాళ్ల పిల్లల మీద దాడి చేస్తాడేమోనని+ భయంగా ఉంది. 12 నువ్వు నాతో ఇలా అన్నావు: ‘నేను నీకు ఖచ్చితంగా మేలు చేస్తాను, నీ సంతానాన్ని* సముద్రపు ఇసుక రేణువుల్లా లెక్కపెట్టలేనంత మంది అయ్యేలా చేస్తాను.’ ”+

13 అతను ఆ రాత్రి అక్కడే బస చేశాడు. తర్వాత అతను తన దగ్గరున్న వాటిలో కొన్నిటిని తన అన్న ఏశావుకు బహుమతిగా ఇవ్వడానికి పక్కకు తీసిపెట్టాడు.+ 14 అవేమిటంటే: 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 15 అలాగే 30 ఆడ ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఎద్దులు, 20 ఆడ గాడిదలు, పూర్తిగా ఎదిగిన 10 మగ గాడిదలు.+

16 అతను వాటిని తన సేవకులకు అప్పగించి, ఒక మంద తర్వాత ఇంకో మంద పంపిస్తూ తన సేవకులతో ఇలా అన్నాడు: “మీరు నాకన్నా ముందు వాగు దాటండి. మందకీ మందకీ మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోండి.” 17 అతను మొదటి సేవకునితో ఇలా అన్నాడు: “ఒకవేళ మా అన్న ఏశావు నిన్ను కలిసి, ‘నువ్వు ఎవరి మనిషివి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ ముందు వెళ్తున్న ఈ మంద ఎవరిది?’ అని అడిగితే, 18 నువ్వు ఇలా చెప్పాలి: ‘నేను నీ సేవకుడైన యాకోబు మనిషిని. ఇవి నా ప్రభువైన ఏశావుకు అతను పంపించిన బహుమతి.+ అతను కూడా మా వెనక వస్తున్నాడు.’ ” 19 అతను రెండో సేవకునికి, మూడో సేవకునికి, అలాగే ఆ మందల వెనక నడుస్తున్న వాళ్లందరికీ ఇలా చెప్పాడు: “ఏశావును కలిసినప్పుడు మీరు కూడా ఇలాగే చెప్పాలి. 20 అంతేకాదు, ‘నీ సేవకుడైన యాకోబు మా వెనక వస్తున్నాడు’ అని చెప్పాలి.” ఎందుకంటే ‘నా కన్నా ముందు ఒక బహుమతి పంపించి నేను అతన్ని శాంతింపజేస్తే,+ తర్వాత నేను అతన్ని కలిసినప్పుడు, నన్ను దయతో చేర్చుకుంటాడు’ అని యాకోబు అనుకున్నాడు. 21 కాబట్టి, బహుమతి తీసుకెళ్లినవాళ్లు అతని కన్నా ముందు వాగు దాటారు, అతను మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే ఉండిపోయాడు.

22 రాత్రిపూట అతను లేచి తన ఇద్దరు భార్యల్ని,+ తన ఇద్దరు సేవకురాళ్లను,+ చిన్న పిల్లలైన తన 11 మంది కుమారుల్ని తీసుకొని యబ్బోకు+ రేవు* దాటాడు. 23 అతను వాళ్లను తీసుకొని ఆ వాగు దాటించాడు, ఆ తర్వాత తనకున్న ప్రతీ వస్తువును తీసుకొచ్చాడు.

24 చివరికి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఒక వ్యక్తి* వచ్చి తెల్లారేవరకు యాకోబుతో కుస్తీ పడుతూ ఉన్నాడు.+ 25 అతను యాకోబు మీద గెలవలేదని గమనించినప్పుడు, అతను యాకోబు తుంటి గూటిని ముట్టుకున్నాడు; యాకోబు అతనితో కుస్తీ పడుతున్నప్పుడు యాకోబు తుంటి గూడు పక్కకు జరిగింది.+ 26 తర్వాత అతను యాకోబుతో, “తెల్లవారుతోంది, నన్ను వెళ్లనివ్వు” అన్నాడు. అందుకు యాకోబు, “నువ్వు నన్ను దీవించే వరకు నిన్ను వెళ్లనివ్వను” అన్నాడు.+ 27 అప్పుడు అతను యాకోబును, “నీ పేరేంటి?” అని అడిగాడు. అందుకు అతను “యాకోబు” అని చెప్పాడు. 28 అప్పుడు అతను యాకోబుతో, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు.*+ ఎందుకంటే నువ్వు దేవునితో, మనుషులతో పోరాడావు,+ చివరికి గెలిచావు” అన్నాడు. 29 అప్పుడు యాకోబు అతన్ని, “దయచేసి, నీ పేరేంటో చెప్పు” అని అడిగాడు. కానీ అతను, “నువ్వు నా పేరు ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నావు?”+ అన్నాడు. ఆ తర్వాత అక్కడ యాకోబును దీవించాడు. 30 కాబట్టి యాకోబు, “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నేను ప్రాణాలతో బయటపడ్డాను”+ అంటూ ఆ చోటుకు పెనీయేలు*+ అని  పేరు పెట్టాడు.

31 యాకోబు పెనూయేలు* దాటిన వెంటనే సూర్యోదయం అయ్యింది. అయితే, తుంటికి తగిలిన దెబ్బవల్ల అతను కుంటుకుంటూ నడిచాడు.+ 32 అందుకే, నేటివరకు ఇశ్రాయేలీయులు తుంటి గూటి మీద ఉన్న తొడ నరాన్ని తినరు. ఎందుకంటే ఆ వ్యక్తి యాకోబు తుంటి గూటి మీద ఉన్న తొడ నరాన్ని ముట్టుకున్నాడు.

33 యాకోబు తల ఎత్తి చూసినప్పుడు ఏశావు రావడం గమనించాడు. అతనితోపాటు 400 మంది మనుషులు ఉన్నారు.+ కాబట్టి యాకోబు తమ పిల్లల్ని దగ్గర ఉంచుకోమని లేయాకు, రాహేలుకు, ఇద్దరు సేవకురాళ్లకు చెప్పాడు.+ 2 అతను సేవకురాళ్లను, వాళ్ల పిల్లల్ని ముందు ఉంచాడు;+ వాళ్ల వెనక లేయాను, ఆమె పిల్లల్ని ఉంచాడు;+ చివర్లో రాహేలును,+ యోసేపును ఉంచాడు. 3 తర్వాత అతను వాళ్లందరి కన్నా ముందు నడుస్తూ, తన అన్నను సమీపిస్తుండగా ఏడుసార్లు నేలకు వంగి నమస్కారం చేశాడు.

4 అయితే ఏశావు అతన్ని కలవడానికి పరుగెత్తుకుంటూ వచ్చి, అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. వాళ్లిద్దరు చాలా ఏడ్చారు. 5 ఏశావు తల ఎత్తి ఆ స్త్రీలను, పిల్లల్ని చూసి, “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అడిగాడు. అందుకు యాకోబు, “నీ సేవకునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు”+ అని చెప్పాడు. 6 అప్పుడు ఆ సేవకురాళ్లు తమ పిల్లలతోపాటు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు. 7 తర్వాత లేయా, ఆమె పిల్లలు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు. వాళ్ల తర్వాత రాహేలు, యోసేపు ముందుకొచ్చి, వంగి నమస్కారం చేశారు.+

8 ఏశావు, “నాకు ఎదురొచ్చిన ఈ మనుషుల్ని, మందల్ని ఎందుకు పంపించావు?”+ అని అడిగాడు. దానికి యాకోబు, “నా ప్రభువు దయ పొందడానికి”+ అని చెప్పాడు. 9 అప్పుడు ఏశావు, “తమ్ముడూ, నాకు చాలా ఆస్తి ఉంది.+ నీవి నీ దగ్గరే ఉంచుకో” అన్నాడు. 10 కానీ యాకోబు ఇలా అన్నాడు: “దయచేసి అలా అనకు. నేను నీ దయ పొందితే, నేను ఇచ్చే ఈ బహుమతి నువ్వు తీసుకోవాలి. ఎందుకంటే నీ ముఖం చూడాలని నేను ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు నేను నీ ముఖం చూశాను, నీ ముఖం చూస్తే నాకు దేవుని ముఖం చూసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చేర్చుకున్నావు.+ 11 దయచేసి, నిన్ను దీవించడానికి నేను తెచ్చిన ఈ బహుమతిని తీసుకో.+ ఎందుకంటే దేవుడు నాపై అనుగ్రహం చూపించాడు, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి.”+ అతను పదేపదే బ్రతిమాలడంతో ఏశావు దాన్ని తీసుకున్నాడు.

12 తర్వాత ఏశావు, “పద, మనం ఇక్కడి నుండి వెళ్దాం. నేను నీకు ముందుగా వెళ్తాను” అన్నాడు. 13 దానికి యాకోబు ఇలా అన్నాడు: “నా ప్రభువా, నా పిల్లలు చాలా చిన్నవాళ్లనీ బలహీనులనీ+ నా దగ్గర పాలిచ్చే గొర్రెలు, పశువులు కూడా ఉన్నాయనీ నీకు తెలుసు. వాటిని ఒక్కరోజు వేగంగా నడిపించినా, మందంతా చచ్చిపోతుంది. 14 కాబట్టి నా ప్రభువా, దయచేసి నువ్వు నాకు ముందుగా వెళ్లు. నేను నా మందకు, పిల్లలకు ఏమీ కాకుండా నెమ్మదిగా నడిపించుకుంటూ శేయీరులో+ ఉన్న నా ప్రభువు దగ్గరికి వస్తాను.” 15 తర్వాత ఏశావు, “దయచేసి, నా మనుషుల్లో కొందర్ని నీ దగ్గర వదిలి వెళ్లనివ్వు” అన్నాడు. దానికి యాకోబు, “అలా ఎందుకు? నా ప్రభువు దయ నా మీద ఉంటే చాలు” అన్నాడు. 16 కాబట్టి ఆ రోజు ఏశావు బయల్దేరి తిరిగి శేయీరుకు వెళ్లిపోయాడు.

17 యాకోబు సుక్కోతుకు+ వెళ్లి, అక్కడ తన కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడు, తన మంద కోసం పశువుల సాలలు కట్టించాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు* అని పేరు పెట్టాడు.

18 యాకోబు పద్దనరాము+ నుండి ప్రయాణమైన తర్వాత, కనాను దేశంలోని+ షెకెము+ నగరానికి సురక్షితంగా చేరుకొని, దానికి దగ్గర్లో డేరాలు వేసుకున్నాడు. 19 తర్వాత అతను తాను డేరా వేసుకున్న చోట కొంత భూమిని హమోరు కుమారుల దగ్గర 100 వెండి రూకలకు కొన్నాడు.+ హమోరు కుమారుల్లో షెకెము ఒకడు. 20 అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టి, దానికి ‘దేవుడు, ఇశ్రాయేలు దేవుడు’ అని పేరు పెట్టాడు.+

34 యాకోబు, లేయాల కూతురు దీనా+ ఆ దేశంలోని అమ్మాయిలతో+ సమయం గడపడానికి* వెళ్తూ ఉండేది. 2 ఆ దేశ ప్రధానుల్లో హివ్వీయుడైన+ హమోరు ఒకడు. అతని కుమారుడు షెకెము దీనాను చూసినప్పుడు ఆమెను తీసుకెళ్లి, ఆమెతో పడుకొని, ఆమెను చెరిచాడు. 3 అతను యాకోబు కూతురు దీనా మీద మనసు పారేసుకున్నాడు. అతను ఆ యువతిని ప్రేమించి, ఆమెను ఒప్పించేలా* మాట్లాడాడు. 4 చివరికి షెకెము, “ఈ యువతితో నాకు పెళ్లి చేయి” అని వాళ్ల నాన్న హమోరును+ అడిగాడు.

5 షెకెము తన కూతురు దీనాను చెరిపాడనే సంగతి యాకోబుకు తెలిసింది. ఆ సమయంలో అతని కుమారులు అతని మందను కాస్తూ పచ్చిక మైదానంలో ఉన్నారు. కాబట్టి వాళ్లు ఇంటికి వచ్చే వరకు యాకోబు ఆ సంగతి గురించి ఎవ్వరికీ చెప్పలేదు. 6 తర్వాత షెకెమువాళ్ల నాన్న హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు. 7 అయితే యాకోబు కుమారులు ఆ సంగతి గురించి విని, వెంటనే పచ్చిక మైదానం నుండి తిరిగొచ్చారు. అతను చేయకూడని పని చేసి+ అంటే యాకోబు కూతురితో పడుకొని ఇశ్రాయేలును అవమానించాడు కాబట్టి వాళ్లు బాగా నొచ్చుకున్నారు, వాళ్లకు చాలా కోపం వచ్చింది.+

8 హమోరు వాళ్లతో ఇలా అన్నాడు: “మా అబ్బాయి షెకెము మీ కూతుర్ని ఎంతగానో కోరుకుంటున్నాడు. దయచేసి, ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి. 9 మాతో పెళ్లి సంబంధాలు కలుపుకోండి. మీ కూతుళ్లను మాకు ఇవ్వండి, మా కూతుళ్లను మీరు తీసుకోండి.+ 10 ఇదిగో, మా దేశమంతా మీ ముందు ఉంది. మాతోపాటు నివసించండి, ఇక్కడే వ్యాపారం చేయండి, స్థిరపడండి.” 11 తర్వాత షెకెము దీనావాళ్ల నాన్నతో, సహోదరులతో ఇలా అన్నాడు: “నా మీద అనుగ్రహం చూపించండి, మీరు నన్ను ఏమి అడిగినా ఇస్తాను. 12 కట్న* కానుకలు+ ఎంతైనా అడగండి, ఇవ్వడానికి నేను సిద్ధమే. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి చాలు.”

13 షెకెము తమ సహోదరి దీనాను చెరిచాడు కాబట్టి యాకోబు కుమారులు షెకెముకు, వాళ్ల నాన్న హమోరుకు మోసపూరితంగా జవాబిచ్చారు. 14 యాకోబు కుమారులు వాళ్లతో ఇలా అన్నారు: “అది కుదరకపోవచ్చు, సున్నతి చేయించుకోని వ్యక్తికి+ మా సహోదరిని ఇచ్చి పెళ్లి చేయలేం, ఎందుకంటే అది మాకు అవమానం. 15 అయితే ఈ ఒక్క షరతు మీద మేము ఒప్పుకోగలం: మీరు కూడా మాలా అవ్వాలి, మీ పురుషులందరూ సున్నతి చేయించుకోవాలి.+ 16 అప్పుడు మేము మా కూతుళ్లను మీకు ఇస్తాం, మీ కూతుళ్లను మేము చేసుకుంటాం. మేము మీతోపాటు నివసించి, ఒకే జనం అవుతాం. 17 కానీ మేము చెప్పినట్టు మీరు సున్నతి చేయించుకోకపోతే, మా సహోదరిని తీసుకొని వెళ్లిపోతాం.”

18 వాళ్ల మాటలు హమోరుకు,+ అతని కుమారుడు షెకెముకు+ నచ్చాయి. 19 ఆ యువకుడు వాళ్లు చెప్పినట్టు చేయడానికి వెంటనే చర్యలు తీసుకున్నాడు.+ ఎందుకంటే అతను యాకోబు కూతుర్ని చాలా ఇష్టపడ్డాడు; అంతేకాదు అతను వాళ్ల నాన్న ఇంటివాళ్లందరిలో అత్యంత గౌరవనీయుడు.

20 కాబట్టి హమోరు, అతని కుమారుడు షెకెము వాళ్ల నగర ద్వారం దగ్గరికి వెళ్లి, నగరంలోని పురుషులతో+ ఇలా అన్నారు: 21 “ఈ ప్రజలు మనతో శాంతిగా ఉండాలనుకుంటున్నారు. వాళ్లను మన దేశంలో ఉండనిద్దాం, ఇక్కడ వ్యాపారం చేసుకోనిద్దాం, ఎందుకంటే మన దేశం వాళ్లకు కూడా సరిపోయేంత పెద్దది. వాళ్ల కూతుళ్లను మనం పెళ్లి చేసుకోవచ్చు, మన కూతుళ్లను వాళ్లకు ఇవ్వవచ్చు.+ 22 వాళ్లు మన మధ్య నివసించి ఒకే జనం అవ్వడానికి ఈ ఒక్క షరతు పెట్టారు: వాళ్లలాగే మనలో ప్రతీ పురుషుడు సున్నతి చేయించుకోవాలి.+ 23 తర్వాత వాళ్ల ఆస్తిపాస్తులు, పశువులు అన్నీ మనవే కదా? కాబట్టి వాళ్లు మనతో పాటు నివసించేలా వాళ్ల షరతుకు ఒప్పుకుందాం.” 24 అతని నగర ద్వారం గుండా వెళ్లేవాళ్లంతా హమోరు మాట, అతని కుమారుడు షెకెము మాట విన్నారు. ఆ నగర ద్వారం గుండా బయటికి వెళ్తున్న పురుషులందరూ సున్నతి చేయించుకున్నారు.

25 అయితే మూడో రోజున, ఆ పురుషులు ఇంకా నొప్పితో బాధపడుతున్నప్పుడు, యాకోబు ఇద్దరు కుమారులు అంటే దీనా సహోదరులైన+ షిమ్యోను, లేవి తమ కత్తులు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా నగరంలోకి ప్రవేశించి, ప్రతీ పురుషుణ్ణి చంపేశారు.+ 26 వాళ్లు హమోరును, అతని కుమారుడు షెకెమును కత్తితో చంపి, తమ సహోదరి దీనాను షెకెము ఇంటి నుండి తీసుకెళ్లిపోయారు. 27 యాకోబు మిగతా కుమారులు చచ్చిపడివున్న వాళ్ల దగ్గరికి వచ్చి నగరాన్నంతా దోచుకున్నారు, ఎందుకంటే వాళ్లు తమ సహోదరిని అపవిత్రపర్చారు.+ 28 యాకోబు కుమారులు వాళ్ల మందల్ని, పశువుల్ని, గాడిదల్ని, అలాగే నగరంలో, పొలంలో ఉన్నదంతా తీసుకెళ్లిపోయారు. 29 అంతేకాదు వాళ్ల ఆస్తిపాస్తులన్నీ తీసుకుపోయారు; వాళ్ల చిన్నపిల్లలందర్నీ, వాళ్ల భార్యల్ని చెరపట్టుకుపోయారు; వాళ్ల ఇళ్లలో ఉన్నదంతా దోచుకున్నారు.

30 అప్పుడు షిమ్యోనుతో, లేవితో+ యాకోబు ఇలా అన్నాడు: “ఈ దేశవాసులైన కనానీయులు, పెరిజ్జీయులు నన్ను అసహ్యించుకునేలా చేసి, మీరు నా మీదికి పెద్ద కష్టం తెచ్చిపెట్టారు. నా దగ్గర కొద్దిమందే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్లందరూ ఒక్కటై నా మీద దాడి చేస్తారు; అప్పుడు నేను నాశనమౌతాను, నా కుటుంబం నాశనమౌతుంది.” 31 దానికి వాళ్లు, “ఎవరైనా వేశ్యతో వ్యవహరించినట్టు మా చెల్లితో వ్యవహరించవచ్చా?” అన్నారు.

35 తర్వాత దేవుడు యాకోబుతో ఇలా అన్నాడు: “లేచి, బేతేలుకు+ వెళ్లి అక్కడ నివసించు. నువ్వు నీ అన్న ఏశావు నుండి పారిపోతున్నప్పుడు+ నీకు కనిపించిన సత్యదేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టు.”

2 అప్పుడు యాకోబు తన ఇంటివాళ్లకు, తన దగ్గరున్న వాళ్లందరికీ ఇలా చెప్పాడు: “మీ మధ్య ఉన్న అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయండి.+ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ బట్టలు మార్చుకోండి. 3 మనం లేచి, బేతేలుకు వెళ్దాం. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ప్రార్థనకు జవాబిచ్చి, నేను వెళ్లిన ప్రతీచోట* నాకు తోడుగా ఉన్న సత్యదేవునికి+ అక్కడ నేను ఒక బలిపీఠం కడతాను.” 4 కాబట్టి వాళ్లు తమ దగ్గరున్న అన్యదేవతల విగ్రహాలన్నిటినీ, తమ చెవులకు ఉన్న పోగుల్ని యాకోబుకు ఇచ్చారు. అతను వాటిని షెకెముకు దగ్గర్లో ఉన్న పెద్ద చెట్టు కింద పాతిపెట్టాడు.*

5 వాళ్లు ప్రయాణమై వెళ్తున్నప్పుడు, చుట్టుపక్కల నగరాల వాళ్లకు దేవుడు భయం పుట్టించాడు. అందువల్ల వాళ్లు యాకోబు కుమారుల్ని వెంటాడలేదు. 6 చివరికి యాకోబు, అతనితో పాటు ఉన్నవాళ్లంతా కనాను దేశంలోని లూజుకు+ అంటే బేతేలుకు చేరుకున్నారు. 7 అతను అక్కడ ఒక బలిపీఠం కట్టి, ఆ చోటుకు ఏల్‌-బేతేలు* అని పేరు పెట్టాడు. ఎందుకంటే అతను తన అన్న దగ్గర నుండి పారిపోతున్నప్పుడు అక్కడ సత్యదేవుడు తనను తాను అతనికి బయల్పర్చుకున్నాడు.+ 8 తర్వాత రిబ్కా దాది దెబోరా+ చనిపోయింది. ఆమెను బేతేలుకు దిగువన సింధూర చెట్టు కింద పాతిపెట్టారు. కాబట్టి అతను దానికి అల్లోను-బాకూత్‌* అని పేరు పెట్టాడు.

9 యాకోబు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు దేవుడు అతనికి ఇంకొకసారి కనిపించి, అతన్ని దీవించాడు. 10 దేవుడు అతనితో ఇలా అన్నాడు: “నీ పేరు యాకోబు.+ ఇకమీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు.” దాంతో దేవుడు అతన్ని ఇశ్రాయేలు అని పిలవడం మొదలుపెట్టాడు.+ 11 దేవుడు అతనితో ఇంకా ఇలా అన్నాడు: “నేను సర్వశక్తిగల దేవుణ్ణి.+ నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అవ్వు. జనాలు, ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం నీ నుండి వస్తాయి.+ రాజులు నీలో* నుండి వస్తారు.+ 12 నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకు, నీ తర్వాత నీ సంతానానికి* ఇస్తాను.”+ 13 తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన చోటు నుండి పైకి వెళ్లిపోయాడు.

14 కాబట్టి దేవుడు తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక రాయిని స్మారక చిహ్నంగా నిలబెట్టి, దానిమీద పానీయార్పణను, తైలాన్ని పోశాడు.+ 15 దేవుడు తనతో మాట్లాడిన ఆ చోటును యాకోబు మళ్లీ బేతేలు అని పిలిచాడు.+

16 తర్వాత వాళ్లు బేతేలు నుండి బయల్దేరారు. వాళ్లు ఎఫ్రాత్‌కు కాస్త దూరంలో ఉండగానే రాహేలుకు పురిటినొప్పులు మొదలయ్యాయి, ప్రసవం ఆమెకు చాలా కష్టమైంది. 17 బిడ్డను కనడానికి ఆమె కష్టపడుతుండగా, మంత్రసాని ఆమెతో, “భయపడకు, ఈ కుమారుణ్ణి కూడా నువ్వు కంటావు”+ అంది. 18 అయితే రాహేలు ప్రాణం పోతుండగా చివరి క్షణాల్లో తన పిల్లవాడికి బెనోని* అని పేరు పెట్టింది, కానీ అతని తండ్రి బెన్యామీను*+ అని పేరు పెట్టాడు. 19 చివరికి రాహేలు చనిపోయింది. ఆమెను ఎఫ్రాత్‌కు వెళ్లే దారిలో, అంటే బేత్లెహేముకు+ వెళ్లే దారిలో పాతిపెట్టారు. 20 యాకోబు ఒక రాయి తీసుకొని ఆమె సమాధి మీద స్మారక చిహ్నంగా నిలబెట్టాడు; నేటికీ అది రాహేలు సమాధికి గుర్తుగా ఉంది.

21 తర్వాత ఇశ్రాయేలు అక్కడి నుండి ప్రయాణమై వెళ్లి, ఏదెరు బురుజు అవతల కొంతదూరంలో డేరా వేసుకున్నాడు. 22 ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒకరోజు, రూబేను వెళ్లి వాళ్ల నాన్న ఉపపత్ని బిల్హాతో పడుకున్నాడు. ఆ విషయం ఇశ్రాయేలుకు తెలిసింది.+

యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు. 23 లేయా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యాకోబు పెద్ద కుమారుడు రూబేను,+ తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను. 24 రాహేలు ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: యోసేపు, బెన్యామీను. 25 రాహేలు సేవకురాలైన బిల్హా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: దాను, నఫ్తాలి. 26 లేయా సేవకురాలైన జిల్పా ద్వారా పుట్టిన కుమారులు ఎవరంటే: గాదు, ఆషేరు. వీళ్లంతా యాకోబుకు పద్దనరాములో పుట్టిన కుమారులు.

27 యాకోబు చివరికి మమ్రేలో వాళ్ల నాన్న ఉన్న చోటికి వచ్చాడు.+ అది కిర్యతర్బాలో అంటే హెబ్రోనులో ఉంది. అబ్రాహాము, ఇస్సాకులు పరదేశులుగా నివసించింది అక్కడే.+ 28 ఇస్సాకు మొత్తం 180 ఏళ్లు బ్రతికాడు.+ 29 అలా ఇస్సాకు చాలా ఏళ్లు బ్రతికి, మంచి వృద్ధాప్యంలో సంతృప్తితో తుదిశ్వాస విడిచాడు; తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.* అతని కుమారులు ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.+

36 ఇది ఏశావు చరిత్ర. ఇతనికి ఎదోము+ అనే పేరు కూడా ఉంది.

2 ఏశావు ఆదా,+ అహోలీబామా అనే కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆదా హిత్తీయుడైన ఏలోను కూతురు;+ అహోలీబామా+ హివ్వీయుడైన సిబ్యోను మనవరాలు, అనా కూతురు. 3 ఇష్మాయేలు కూతురు బాశెమతును+ కూడా ఏశావు పెళ్లి చేసుకున్నాడు. ఆమె నెబాయోతు సహోదరి.+

4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది; బాశెమతు రగూయేలును కన్నది.

5 అహోలీబామా యూషును, యాలామును, కోరహును+ కన్నది.

వీళ్లు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కుమారులు. 6 తర్వాత ఏశావు తన భార్యల్ని, కుమారుల్ని, కూతుళ్లను, తన ఇంటివాళ్లందర్నీ, తన మందను, తనకున్న ఇతర జంతువులన్నిటినీ, కనాను దేశంలో తాను సంపాదించిన ఆస్తంతటినీ+ తీసుకొని తన తమ్ముడు యాకోబు నివసిస్తున్న చోటుకు కొంతదూరంలో ఉన్న మరో ప్రాంతానికి వెళ్లాడు.+ 7 వాళ్లకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయంటే, వాళ్లిద్దరూ ఒకేచోట ఉండడం కుదరలేదు; వాళ్ల మందల కారణంగా, వాళ్లు నివసిస్తున్న* ఆ ప్రాంతం వాళ్లిద్దరూ జీవనం సాగించడానికి సరిపోలేదు. 8 కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో+ నివాసం ఏర్పర్చుకున్నాడు. ఈ ఏశావే ఎదోము.+

9 శేయీరు+ కొండ ప్రాంతంలో నివసించే ఎదోమీయుల మూలపురుషుడైన ఏశావు చరిత్ర ఇది.

10 ఇవి ఏశావు కుమారుల పేర్లు: ఏశావు భార్య ఆదా కుమారుడు ఎలీఫజు; ఏశావు భార్య బాశెమతు కుమారుడు రగూయేలు.+

11 ఎలీఫజు కుమారులు: తేమాను,+ ఓమారు, సెపో, గాతాము, కనజు.+ 12 ఏశావు కుమారుడైన ఎలీఫజు ఉపపత్ని పేరు తిమ్నా. ఆమె ఎలీఫజుకు అమాలేకును+ కన్నది. వీళ్లు ఏశావు భార్య ఆదా మనవళ్లు.*

13 రగూయేలు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. వీళ్లు ఏశావు భార్య బాశెమతు+ మనవళ్లు.*

14 సిబ్యోను మనవరాలూ, అనా కూతురూ అయిన అహోలీబామా కుమారులు: యూషు, యాలాము, కోరహు. ఏశావు భార్య అహోలీబామా వీళ్లను కన్నది.

15 ఏశావు కుమారుల్లో షేక్‌లు*+ వీళ్లు. ఏశావు పెద్ద కుమారుడైన ఎలీఫజు కుమారులు: షేక్‌ తేమాను, షేక్‌ ఓమారు, షేక్‌ సెపో, షేక్‌ కనజు,+ 16 షేక్‌ కోరహు, షేక్‌ గాతాము, షేక్‌ అమాలేకు. వీళ్లు ఎదోము దేశంలో ఎలీఫజు వంశంలోని షేక్‌లు.+ వీళ్లు ఆదా మనవళ్లు.*

17 ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు: షేక్‌ నహతు, షేక్‌ జెరహు, షేక్‌ షమ్మా, షేక్‌ మిజ్జ. వీళ్లు ఎదోము దేశంలో+ రగూయేలు వంశంలోని షేక్‌లు. వీళ్లు ఏశావు భార్య బాశెమతు మనవళ్లు.*

18 చివరిగా, ఏశావు భార్య అహోలీబామా కుమారులు: షేక్‌ యూషు, షేక్‌ యాలాము, షేక్‌ కోరహు. వీళ్లు అనా కూతురూ, ఏశావు భార్యా అయిన అహోలీబామాకు పుట్టిన షేక్‌లు.

19 వీళ్లంతా ఏశావు కుమారులు, వాళ్ల నుండి వచ్చిన షేక్‌లు. ఈ ఏశావే ఎదోము.+

20 హోరీయుడైన శేయీరు కుమారులు, ఆ దేశ నివాసులు+ వీళ్లు: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,+ 21 దిషోను, ఏసెరు, దీషాను.+ వీళ్లు ఎదోము దేశంలో హోరీయుల షేక్‌లు, శేయీరు కుమారులు.

22 లోతాను కుమారులు: హోరీ, హేమీము. లోతాను సహోదరి పేరు తిమ్నా.+

23 శోబాలు కుమారులు: అల్వాను, మానహతు, ఏబాలు, షెపో, ఓనాము.

24 సిబ్యోను+ కుమారులు: అయ్యా, అనా. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదల్ని కాస్తున్నప్పుడు, అతనికి ఎడారిలో వేడి నీళ్ల ఊటలు కనిపించాయి.

25 అనా పిల్లలు: కుమారుడు దిషోను, కూతురు అహోలీబామా.

26 దిషోను కుమారులు: హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.+

27 ఏసెరు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.

28 దీషాను కుమారులు: ఊజు, అరాను.+

29 వీళ్లు హోరీయుల షేక్‌లు: షేక్‌ లోతాను, షేక్‌ శోబాలు, షేక్‌ సిబ్యోను, షేక్‌ అనా, 30 షేక్‌ దిషోను, షేక్‌ ఏసెరు, షేక్‌ దీషాను.+ వీళ్లు శేయీరు దేశంలో హోరీయుల షేక్‌లు.

31 ఇశ్రాయేలీయుల్ని* ఏ రాజూ పరిపాలించక ముందు ఎదోము దేశంలో పరిపాలించిన రాజులు+ వీళ్లు.+ 32 బెయోరు కుమారుడు బెల ఎదోములో పరిపాలించాడు. అతని నగరం పేరు దిన్హాబా. 33 బెల చనిపోయాక, అతని స్థానంలో బొస్రాకు చెందిన జెరహు కుమారుడు యోబాబు రాజయ్యాడు. 34 యోబాబు చనిపోయాక, అతని స్థానంలో తేమానీయుల దేశానికి చెందిన హుషాము రాజయ్యాడు. 35 హుషాము చనిపోయాక, అతని స్థానంలో బెదెదు కుమారుడైన హదదు రాజయ్యాడు. మోయాబు ప్రాంతంలో మిద్యానీయుల్ని+ ఓడించింది అతనే. హదదు నగరం పేరు అవీతు. 36 హదదు చనిపోయాక, అతని స్థానంలో మశ్రేకాకు చెందిన శమ్లా రాజయ్యాడు. 37 శమ్లా చనిపోయాక, నది తీరాన ఉన్న రహెబోతుకు చెందిన షావూలు అతని స్థానంలో రాజయ్యాడు. 38 షావూలు చనిపోయాక, అతని స్థానంలో అక్బోరు కుమారుడైన బయల్‌-హానాను రాజయ్యాడు. 39 అక్బోరు కుమారుడు బయల్‌-హానాను చనిపోయాక, అతని స్థానంలో హదరు రాజయ్యాడు. అతని నగరం పేరు పాయు, అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కూతురు. మత్రేదు మేజాహాబు కూతురు.

40 ఇవి వాళ్లవాళ్ల కుటుంబాలవారీగా, ప్రాంతాలవారీగా ఏశావు నుండి వచ్చిన షేక్‌ల పేర్లు: షేక్‌ తిమ్నా, షేక్‌ అల్వా, షేక్‌ యతేతు,+ 41 షేక్‌ అహోలీబామా, షేక్‌ ఏలా, షేక్‌ పీనోను, 42 షేక్‌ కనజు, షేక్‌ తేమాను, షేక్‌ మిబ్సారు, 43 షేక్‌ మగ్దీయేలు, షేక్‌ ఈరాము. వీళ్లు తమ దేశంలో తమతమ ప్రాంతాల వారీగా ఎదోములోని షేక్‌లు. ఎదోమీయుల మూలపురుషుడు ఏశావు.+

37 యాకోబు తన తండ్రి పరదేశిగా జీవించిన+ కనాను దేశంలోనే నివసించసాగాడు.

2 ఇది యాకోబు చరిత్ర.

యోసేపుకు+ 17 ఏళ్లున్నప్పుడు, అతను తన తండ్రి భార్యలైన బిల్హా, జిల్పాల కుమారులతో+ కలిసి మందను కాసేవాడు.+ ఒకసారి, అతను వచ్చి వాళ్లు చేస్తున్న చెడ్డపనుల గురించి తన తండ్రికి చెప్పాడు. 3 ఇశ్రాయేలు తన మిగతా కుమారులందరి+ కన్నా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు, ఎందుకంటే యోసేపు అతని ముసలితనంలో పుట్టిన కుమారుడు. యోసేపు కోసం ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన అంగీ* కూడా తయారు చేయించాడు. 4 వాళ్ల నాన్న వాళ్లందరి కన్నా యోసేపునే ఎక్కువగా ప్రేమించడం చూసి అతని సహోదరులు అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. దాంతో వాళ్లు యోసేపుతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాళ్లు.

5 తర్వాత యోసేపుకు ఒక కల వచ్చింది, అతను దాని గురించి తన సహోదరులకు చెప్పాడు.+ దాంతో వాళ్లు అతన్ని ఇంకా ఎక్కువగా ద్వేషించారు. 6 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “నాకు ఒక కల వచ్చింది, అదేంటో చెప్తాను దయచేసి వినండి. 7 మనమంతా పొలం మధ్యలో ఉండి పనల్ని* కడుతుండగా, నా పన లేచి నిటారుగా నిలబడింది. అప్పుడు మీ పనలన్నీ నా పన చుట్టూ చేరి, దానికి వంగి నమస్కారం చేశాయి.”+ 8 అతని సహోదరులు అతనితో, “అంటే నువ్వు నిజంగా మా మీద రాజువై, మాపై అధికారం చెలాయించబోతున్నావా?”+ అన్నారు. అతని కలల్ని బట్టి, మాటల్ని బట్టి వాళ్లు అతన్ని ఇంకా ఎక్కువగా ద్వేషించారు.

9 తర్వాత అతనికి ఇంకో కల వచ్చింది. అతను దాని గురించి తన సహోదరులకు చెప్తూ ఇలా అన్నాడు: “నాకు ఇంకో కల వచ్చింది. ఈసారి సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు వంగి నమస్కారం చేస్తున్నాయి.”+ 10 అతను ఆ కలను వాళ్ల నాన్నకు, సహోదరులకు చెప్పినప్పుడు, వాళ్ల నాన్న అతన్ని గద్దించి, “నీ కలకు అర్థమేంటి? నేను, మీ అమ్మ, నీ సహోదరులు నిజంగా నీ దగ్గరికి వచ్చి నీకు వంగి నమస్కారం చేస్తామా?” అన్నాడు. 11 అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు.+ వాళ్ల నాన్న మాత్రం ఆ మాటను మనసులో ఉంచుకున్నాడు.

12 ఒకసారి యోసేపు సహోదరులు షెకెముకు+ దగ్గర్లో వాళ్ల నాన్న మందను మేపడానికి వెళ్లారు. 13 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో, “నీ సహోదరులు షెకెముకు దగ్గర్లో మందల్ని కాస్తున్నారు కదా? నిన్ను కూడా వాళ్ల దగ్గరికి పంపిస్తాను, రా” అన్నాడు. దానికి అతను, “నేను వెళ్లడానికి సిద్ధమే!” అన్నాడు. 14 కాబట్టి ఇశ్రాయేలు యోసేపుతో, “దయచేసి వెళ్లి, నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో, మంద ఎలా ఉందో చూసి వచ్చి నాకు చెప్పు” అన్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు హెబ్రోను+ లోయ నుండి యోసేపును పంపించాడు. అతను షెకెము వైపుగా వెళ్లాడు. 15 కాసేపటికి అతను పొలంలో అటూఇటూ తిరగడం ఒకతను చూసి, “నువ్వు దేనికోసం వెతుకుతున్నావు?” అని అడిగాడు. 16 దానికి యోసేపు, “నేను నా సహోదరుల కోసం వెతుకుతున్నాను. దయచేసి, వాళ్లు మందల్ని ఎక్కడ కాస్తున్నారో చెప్పు” అన్నాడు. 17 అప్పుడు అతను, “వాళ్లు ఇక్కడి నుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వాళ్లు చెప్పుకుంటుంటే నేను విన్నాను” అన్నాడు. కాబట్టి యోసేపు తన సహోదరుల కోసం ఆ దారిన వెళ్లాడు, చివరికి వాళ్లు దోతానులో అతనికి కనిపించారు.

18 అతను కొంతదూరంలో ఉన్నప్పుడు వాళ్లు అతన్ని చూసి, అతను వాళ్ల దగ్గరికి వచ్చేలోపే, అతన్ని చంపడానికి కుట్ర పన్నడం మొదలుపెట్టారు. 19 వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “అదిగో! ఆ కలలు కనేవాడు వస్తున్నాడు.+ 20 రండి, ఇప్పుడు మనం వాణ్ణి చంపి, ఒక నీటి గుంటలో పారేద్దాం; తర్వాత, ఒక క్రూరమృగం వచ్చి వాణ్ణి మింగేసిందని చెప్దాం. అప్పుడు వాడి కలల సంగతి ఏమౌతుందో చూద్దాం.” 21 రూబేను+ ఆ మాట విన్నప్పుడు వాళ్ల నుండి అతన్ని తప్పించడానికి ప్రయత్నించాడు. అందుకే రూబేను, “మనం ఇతని ప్రాణాలు తీయొద్దు”+ అన్నాడు. 22 రూబేను వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “రక్తం చిందించకండి.+ ఎడారిలో ఉన్న ఈ నీటి గుంటలో అతన్ని పారేయండి, అంతేగానీ అతనికి హాని చేయకండి.”+ యోసేపును వాళ్ల నుండి తప్పించి తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రూబేను అలా అన్నాడు.

23 యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చిన వెంటనే, వాళ్లు అతను వేసుకున్న ప్రత్యేకమైన అంగీని+ ఊడదీశారు. 24 తర్వాత వాళ్లు అతన్ని ఎత్తి ఒక నీటి గుంటలో పారేశారు. ఆ సమయంలో ఆ గుంట ఖాళీగా ఉంది, అందులో నీళ్లు లేవు.

25 తర్వాత వాళ్లు భోజనం చేయడానికి కూర్చున్నారు. వాళ్లు తల ఎత్తి చూసినప్పుడు, గిలాదు నుండి ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీయులైన+ వర్తకుల గుంపు ఒకటి కనిపించింది. వాళ్ల ఒంటెలు సువాసనగల జిగురును, సాంబ్రాణిని, గుగ్గిలం బెరడును+ మోసుకెళ్తున్నాయి. 26 అప్పుడు యూదా తన సహోదరులతో ఇలా అన్నాడు: “మన సహోదరుణ్ణి చంపి, ఆ విషయాన్ని*+ కప్పిపుచ్చడం వల్ల మనకేమి లాభం? 27 రండి, అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేద్దాం.+ మనం అతనికి హాని చేయొద్దు. ఎంతైనా, అతను మన సహోదరుడు, మన రక్తం.”* దాంతో వాళ్లు తమ సహోదరుడైన యూదా మాట విన్నారు. 28 మిద్యానీయులైన+ వర్తకులు అటుగా వచ్చినప్పుడు, వాళ్లు యోసేపును ఆ నీటి గుంటలో నుండి పైకి తీసి, 20 వెండి రూకలకు అతన్ని ఆ ఇష్మాయేలీయులకు అమ్మేశారు.+ ఆ వర్తకులు యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లిపోయారు.

29 తర్వాత రూబేను ఆ నీటి గుంట దగ్గరికి వచ్చి చూసేసరికి అందులో యోసేపు లేడు. దాంతో అతను తన బట్టలు చింపుకున్నాడు. 30 అతను తన సహోదరుల దగ్గరికి వచ్చి, “ఆ పిల్లవాడు అక్కడ లేడు! ఇప్పుడు నేను ఏమి చేయాలి?” అన్నాడు.

31 కాబట్టి వాళ్లు ఒక మేకపోతును వధించి, యోసేపు అంగీని ఆ రక్తంలో ముంచారు. 32 తర్వాత వాళ్లు ఆ ప్రత్యేకమైన అంగీని వాళ్ల నాన్న దగ్గరికి పంపించి, ఇలా చెప్పమన్నారు: “మాకు ఇది దొరికింది. దయచేసి, ఇది నీ కుమారుని అంగీనో కాదో చూడు.”+ 33 అప్పుడు యాకోబు దాన్ని పరిశీలనగా చూసి, “ఇది నా కుమారుని అంగీనే! ఒక క్రూరమృగం నా కుమారుని మీద పడి, అతన్ని చీల్చేసి ముక్కలుముక్కలు చేసివుంటుంది!” అన్నాడు. 34 వెంటనే యాకోబు తన బట్టలు చింపుకొని, నడుముకు గోనెపట్ట కట్టుకొని, తన కుమారుని గురించి చాలా రోజులు ఏడ్చాడు. 35 అతని కుమారులందరు, కూతుళ్లందరు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ అతను ఓదార్పు పొందడానికి ఇష్టపడకుండా, “నేను ఇలాగే నా కుమారుని గురించి ఏడుస్తూ ఏడుస్తూ సమాధిలోకి*+ వెళ్లిపోతాను!” అనేవాడు. యోసేపు తండ్రి అతని గురించి ఏడుస్తూనే ఉన్నాడు.

36 తర్వాత మిద్యానీయులు యోసేపును ఐగుప్తులో పోతీఫరు అనే వ్యక్తికి అమ్మేశారు. అతను ఫరో ఆస్థాన అధికారి,+ రాజ సంరక్షకుల అధిపతి.+

38 ఆ రోజుల్లో, యూదా తన సహోదరుల నుండి దూరంగా వెళ్లి అదుల్లామీయుడైన హీరా నివసించే చోటుకు దగ్గర్లో డేరా వేసుకున్నాడు. 2 యూదా అక్కడ షూయ అనే ఒక కనానీయుడి+ కూతుర్ని చూశాడు. అతను ఆమెను పెళ్లి చేసుకొని, ఆమెతో కలిశాడు. 3 ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. యూదా అతనికి ఏరు+ అని పేరు పెట్టాడు. 4 ఆమె మళ్లీ గర్భవతి అయ్యి కుమారుణ్ణి కని, అతనికి ఓనాను అని పేరు పెట్టింది. 5 తర్వాత ఆమె మళ్లీ ఒక కుమారుణ్ణి కని, అతనికి షేలహు అని పేరు పెట్టింది. ఆమె అతన్ని కన్నప్పుడు అతను* అక్జీబులో*+ ఉన్నాడు.

6 కొంతకాలానికి యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు+ అనే స్త్రీతో పెళ్లి చేశాడు. 7 కానీ యూదా పెద్ద కుమారుడైన ఏరు ప్రవర్తన యెహోవా దృష్టికి చెడుగా ఉండడంతో యెహోవా అతన్ని చంపేశాడు. 8 కాబట్టి యూదా ఓనానుతో ఇలా అన్నాడు: “మీ అన్న భార్యను పెళ్లి చేసుకొని, మరిదిగా నీ బాధ్యతను నిర్వర్తించు, మీ అన్న వంశాన్ని నిలబెట్టు.”+ 9 కానీ ఆ సంతానం తనదిగా ఎంచబడదని ఓనానుకు తెలుసు.+ అందుకే అతను తన అన్న భార్యతో కలిసినప్పుడు, తన అన్నకు సంతానాన్ని ఇవ్వకూడదనే ఉద్దేశంతో తన వీర్యాన్ని నేల మీద పడిపోనిచ్చాడు.+ 10 అతను చేసిన పని యెహోవా దృష్టిలో చెడ్డది కాబట్టి ఆయన అతన్ని చంపేశాడు.+ 11 యూదా తన కోడలు తామారుతో, “నా కుమారుడైన షేలహు పెద్దవాడయ్యే వరకు నువ్వు మీ నాన్న ఇంట్లో విధవరాలిగా ఉండు” అన్నాడు. ఎందుకంటే ‘ఇతను కూడా తన సహోదరుల్లా చనిపోతాడేమో’+ అని యూదా అనుకున్నాడు. దాంతో తామారు వెళ్లిపోయి వాళ్ల నాన్న ఇంట్లో ఉంది.

12 కొంతకాలానికి యూదా భార్య అంటే షూయ కూతురు+ చనిపోయింది. ఆమె కోసం దుఃఖించే రోజులు అయిపోయాక యూదా అదుల్లామీయుడైన హీరాతో+ కలిసి తిమ్నాలో+ తన గొర్రెల బొచ్చు కత్తిరించేవాళ్ల దగ్గరికి వెళ్లాడు. 13 “ఇదిగో, మీ మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాకు వెళ్తున్నాడు” అని ఎవరో తామారుకు చెప్పారు. 14 అప్పుడు ఆమె తన విధవరాలి వస్త్రాలు తీసేసి, తలకు ముసుగు వేసుకొని, శాలువ కప్పుకొని తిమ్నాకు వెళ్లే దారిలో ఉన్న ఏనాయిము ద్వారం దగ్గర కూర్చుంది. ఎందుకంటే షేలహు పెద్దవాడైనా తన మామ తనను అతనికిచ్చి పెళ్లి చేయలేదని ఆమె గమనించింది.+

15 యూదా ఆమెను చూసిన వెంటనే ఆమె వేశ్య అనుకున్నాడు, ఎందుకంటే ఆమె ముసుగు వేసుకొని ఉంది. 16 అతను దారిపక్కన ఉన్న ఆమె దగ్గరికి వెళ్లి, ఆమె తన కోడలని తెలియక,+ “దయచేసి, ఈ రాత్రి నన్ను నీతో గడపనివ్వు” అన్నాడు. అయితే ఆమె, “అందుకు నువ్వు నాకు ఏమి ఇస్తావు?” అని అడిగింది. 17 అప్పుడు అతను ఆమెతో, “నేను నా మందలో నుండి ఒక మేకపిల్లను నీ దగ్గరికి పంపిస్తాను” అన్నాడు. కానీ ఆమె, “నువ్వు ఆ మేకపిల్లను పంపించేంత వరకు హామీగా ఏదైనా ఇస్తావా?” అని అడిగింది. 18 దానికి అతను, “హామీగా నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. అందుకు ఆమె, “నీ ముద్ర-ఉంగరాన్ని,+ దాని దారాన్ని, నీ చేతిలో ఉన్న కర్రను నాకు ఇవ్వు” అంది. అప్పుడు అతను వాటిని ఆమెకు ఇచ్చి, ఆ రాత్రి ఆమెతో గడిపాడు. అతని వల్ల ఆమె గర్భవతి అయ్యింది. 19 తర్వాత ఆమె లేచి, అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆమె తన శాలువను తీసేసి, మళ్లీ విధవరాలి వస్త్రాలు వేసుకుంది.

20 తర్వాత, యూదా ఆ స్త్రీకి హామీగా ఇచ్చినవాటిని విడిపించి తీసుకురావడం కోసం తన సహవాసియైన అదుల్లామీయుడికి+ మేకపిల్లను ఇచ్చి పంపించాడు. కానీ అతనికి ఆమె ఎక్కడా కనిపించలేదు. 21 దాంతో అతను ఆమె ఊరివాళ్లను, “ఏనాయిము ద్వారం దగ్గర దారిపక్కన ఉండే ఆ వేశ్య* ఎక్కడ?” అని అడిగాడు. కానీ వాళ్లు, “అసలు ఎన్నడూ ఈ ఊర్లో వేశ్యలు* అనేవాళ్లే లేరు” అన్నారు. 22 చివరికి అతను యూదా దగ్గరికి తిరిగొచ్చి, “ఆమె నాకు ఎక్కడా కనిపించలేదు, దానికితోడు ఆ ఊరివాళ్లు, ‘అసలు ఎన్నడూ ఈ ఊర్లో వేశ్యలు* అనేవాళ్లే లేరు’ అన్నారు” అని చెప్పాడు. 23 అప్పుడు యూదా ఇలా అన్నాడు: “ఆమె కోసం ఇంకా వెతికితే మన పరువు పోతుంది, వాటిని ఆమెనే తీసుకోనీ. ఏదేమైనా, నేను ఈ మేకపిల్లను పంపించాను, కానీ ఆమె నీకు కనిపించలేదు.”

24 అయితే, దాదాపు మూడు నెలల తర్వాత, ఎవరో యూదా దగ్గరికి వచ్చి, “నీ కోడలు తామారు వేశ్యగా ప్రవర్తించింది, దానివల్ల ఆమె గర్భవతి కూడా అయ్యింది” అని చెప్పారు. దానికి అతను, “ఆమెను బయటికి తీసుకొచ్చి, కాల్చేయండి”+ అన్నాడు. 25 ఆమెను బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆమె తన మామకు ఈ కబురు పంపింది: “ఈ వస్తువులు ఎవరివో, ఆ వ్యక్తి వల్ల నేను గర్భవతిని అయ్యాను.” ఆమె ఈ విషయం కూడా చెప్పమంది: “దయచేసి ఈ ఉంగరం, దారం, కర్ర ఎవరివో పరిశీలించండి.”+ 26 అప్పుడు యూదా వాటిని పరిశీలించి, “తప్పు చేసింది ఆమె కాదు, నేను. ఎందుకంటే నేను ఆమెను నా కుమారుడు షేలహుకు ఇచ్చి పెళ్లి చేయలేదు”+ అన్నాడు. ఆ తర్వాత యూదా ఎన్నడూ ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు.

27 కాన్పు సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. 28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక పిల్లవాడి చెయ్యి బయటికి వచ్చింది. మంత్రసాని వెంటనే వాడి చేతికి ఎర్రని దారం కట్టి, “ఇతను ముందుగా బయటికి వచ్చాడు” అంది. 29 కానీ ఆ పిల్లవాడు చెయ్యి వెనక్కి తీసుకోగానే, అతని తమ్ముడు బయటికి వచ్చాడు. అప్పుడు ఆ మంత్రసాని ఆశ్చర్యపోయి, “నువ్వే భలే సందు చేసుకొని వచ్చావే!” అంది. కాబట్టి ఆ పిల్లవాడికి పెరెసు*+ అని పేరు పెట్టారు. 30 ఆ తర్వాత, చేతికి ఎర్రని దారం ఉన్న అతని అన్న బయటికి వచ్చాడు. అతనికి జెరహు+ అని పేరు పెట్టారు.

39 ఇష్మాయేలీయులు+ యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లాక,+ పోతీఫరు+ అనే ఐగుప్తీయుడు యోసేపును వాళ్ల దగ్గర కొన్నాడు. ఇతను ఫరో ఆస్థాన అధికారి, రాజ సంరక్షకుల అధిపతి. 2 అయితే యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు.+ దానివల్ల, యోసేపు తాను చేసిన ప్రతీ పనిలో సఫలుడయ్యాడు. దాంతో అతను ఐగుప్తీయుడైన తన యజమాని ఇంటిమీద అధికారిగా నియమించబడ్డాడు. 3 యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడని, అతను చేసే ప్రతీ పనిని యెహోవా సఫలం చేస్తున్నాడని అతని యజమాని గమనించాడు.

4 యోసేపు తన యజమాని దృష్టిలో అనుగ్రహం పొందుతూ ఉన్నాడు. అలా యోసేపు అతనికి ముఖ్య సేవకుడు అయ్యాడు. అతను యోసేపును తన ఇంటిమీద, తన ఆస్తంతటి మీద అధికారిగా నియమించాడు. 5 అప్పటినుండి యెహోవా యోసేపును బట్టి ఆ ఐగుప్తీయుని ఇంటిని దీవిస్తూ ఉన్నాడు. దానివల్ల అతని ఇంట్లో, పొలంలో ఉన్నవాటన్నిటి మీదికి యెహోవా దీవెనలు వచ్చాయి.+ 6 అతను మెల్లమెల్లగా తనకున్న ప్రతీదాన్ని యోసేపుకు అప్పగించాడు, కేవలం తన ఆహారం గురించి మాత్రమే అతను పట్టించుకునేవాడు. అంతేకాదు, యోసేపు ఎదిగి మంచి శరీర దారుఢ్యం ఉన్నవాడిగా, అందగాడిగా తయారయ్యాడు.

7 కొంతకాలం తర్వాత, యోసేపు యజమాని భార్య అతని మీద కన్నేసి, “నాతో పడుకో” అని అడగడం మొదలుపెట్టింది. 8 కానీ అతను ఒప్పుకోకుండా తన యజమాని భార్యతో ఇలా అనేవాడు: “నా మీద నమ్మకంతో నా యజమాని తనకున్న ప్రతీది నా చేతికి అప్పగించాడు, ఈ ఇంట్లో దేని గురించీ అతను నన్ను లెక్క అడగడు. 9 ఈ ఇంట్లో నాకన్నా పైస్థానంలో ఎవ్వరూ లేరు. అతను నాకు అన్నీ అప్పగించాడు, ఒక్క నిన్ను తప్ప. ఎందుకంటే నువ్వు అతని భార్యవు. కాబట్టి నేను ఇంత చెడ్డపని చేసి దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేయగలను?”+

10 అలా ఆమె రోజూ యోసేపుతో మాట్లాడేది, అతను మాత్రం ఆమెతో పడుకోవడానికి గానీ, ఆమెతో ఉండడానికి గానీ ఎన్నడూ ఒప్పుకోలేదు. 11 ఒకరోజు అతను తన పని చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్లినప్పుడు, ఇంట్లో పనివాళ్లు ఎవ్వరూ లేరు. 12 అప్పుడామె అతని వస్త్రం పట్టుకొని లాగి, “నాతో పడుకో!” అంది. కానీ అతను తన వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలేసి బయటికి పారిపోయాడు. 13 అతను తన వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలేసి బయటికి పారిపోవడం గమనించగానే, 14 ఆమె గట్టిగా అరుస్తూ ఇంట్లోని మనుషుల్ని పిలిచి ఇలా అంది: “ఇదిగో! మా ఆయన మనల్ని నవ్వులపాలు చేయడానికి ఈ హెబ్రీయుణ్ణి మన దగ్గరికి తీసుకొచ్చాడు. వాడు నాతో పడుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. కానీ నేను బిగ్గరగా అరవడం మొదలుపెట్టాను. 15 నేను గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టేసరికి, తన వస్త్రాన్ని నా పక్కనే వదిలేసి బయటికి పారిపోయాడు.” 16 ఆ తర్వాత అతని యజమాని ఇంటికి వచ్చేవరకు ఆమె ఆ వస్త్రాన్ని తన పక్కనే  పెట్టుకుంది.

17 ఆమె తన భర్తకు కూడా అదే విషయం చెప్తూ ఇలా అంది: “నువ్వు మన దగ్గరికి తీసుకొచ్చిన ఆ హెబ్రీ సేవకుడు నన్ను నవ్వులపాలు చేయడానికి నా దగ్గరికి వచ్చాడు. 18 నేను గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టేసరికి, తన వస్త్రాన్ని నా పక్కనే వదిలేసి బయటికి పారిపోయాడు.” 19 “నీ సేవకుడు ఇలా ఇలా చేశాడు” అంటూ తన భార్య తనతో చెప్పిన మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది. 20 కాబట్టి యోసేపు యజమాని అతన్ని రాజు ఖైదీలు ఉండే చెరసాలలో వేయించాడు. అలా అతను ఆ చెరసాలలోనే ఉన్నాడు.+

21 కానీ ఎప్పటిలాగే యెహోవా యోసేపుకు తోడుగా ఉండి, అతని పట్ల విశ్వసనీయ ప్రేమను చూపిస్తూ, ఆ చెరసాల ముఖ్య అధికారి దృష్టిలో యోసేపు అనుగ్రహం పొందేలా చేస్తూ ఉన్నాడు.+ 22 కాబట్టి చెరసాల ముఖ్య అధికారి చెరసాలలో ఉన్న ఖైదీలందరి మీద యోసేపును నాయకునిగా పెట్టాడు. అక్కడ జరిగే పనులన్నీ అతనే వాళ్లచేత చేయించేవాడు.+ 23 ఆ చెరసాల ముఖ్య అధికారి యోసేపుకు అప్పగించిన వాటిలో దేని గురించీ లెక్క అడిగేవాడు కాదు. ఎందుకంటే, యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు, అతను ఏ పని చేసినా యెహోవా దాన్ని సఫలం చేశాడు.+

40 ఈ విషయాలు జరిగాక, ఐగుప్తు రాజు దగ్గర పనిచేసే ప్రధాన పానదాయకుడు,*+ ప్రధాన వంటవాడు* తమ ప్రభువైన ఐగుప్తు రాజుకు వ్యతిరేకంగా పాపం చేశారు. 2 కాబట్టి ఫరోకు తన ఇద్దరు ఉద్యోగుల మీద అంటే ప్రధాన పానదాయకుడి మీద, ప్రధాన వంటవాడి మీద చాలా కోపమొచ్చింది.+ 3 దాంతో ఫరో వాళ్లను రాజ సంరక్షకుల అధిపతి+ కింద ఉన్న చెరసాలలో వేయించాడు. యోసేపు ఖైదీగా ఉన్నది కూడా అక్కడే.+ 4 వాళ్లతో ఉంటూ వాళ్లను చూసుకునే పనిని రాజ సంరక్షకుల అధిపతి యోసేపుకు అప్పగించాడు.+ వాళ్లు కొంతకాలం* పాటు చెరసాలలోనే ఉన్నారు.

5 చెరసాలలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి ఐగుప్తు రాజు పానదాయకుడికి, వంటవాడికి ఒక్కో కల వచ్చింది. ఆ రెండు కలలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. 6 ఉదయం, యోసేపు లోపలికి వచ్చి వాళ్లను చూసినప్పుడు వాళ్లిద్దరి ముఖాలు దిగాలుగా కనిపించాయి. 7 కాబట్టి యోసేపు వాళ్లను, “ఈ రోజు మీ ముఖాలు ఎందుకు దిగాలుగా ఉన్నాయి?” అని అడిగాడు. 8 దానికి వాళ్లు, “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది, కానీ వాటి అర్థం చెప్పేవాళ్లెవరూ మా దగ్గర లేరు” అన్నారు. అందుకు యోసేపు, “కలల అర్థం చెప్పగలిగేది దేవుడే కదా?+ దయచేసి ఆ కలలు ఏంటో నాకు చెప్పండి” అన్నాడు.

9 కాబట్టి ప్రధాన పానదాయకుడు యోసేపుకు తన కల గురించి చెప్తూ ఇలా అన్నాడు: “నా కలలో నా ఎదుట ఒక ద్రాక్షచెట్టు ఉంది. 10 ఆ ద్రాక్షచెట్టుకు మూడు తీగలు ఉన్నాయి. వాటికి మొగ్గలు వచ్చి పూలు పూశాయి; వాటి గెలలు పండాయి. 11 అప్పుడు ఫరో గిన్నె నా చేతిలో ఉంది. నేను ఆ ద్రాక్షలు తీసుకొని ఫరో గిన్నెలో పిండి, దాన్ని ఫరో చేతికి అందించాను.” 12 అప్పుడు యోసేపు అతనికి ఇలా చెప్పాడు: “దాని అర్థం ఇదే: ఆ మూడు తీగలు మూడు రోజులు. 13 ఇప్పటినుండి మూడు రోజుల్లో ఫరో నిన్ను విడుదల చేసి,* మళ్లీ నీ ఉద్యోగం నీకు ఇస్తాడు.+ నువ్వు ఇంతకుముందు అతని పానదాయకుడిగా ఉన్నప్పుడు చేసినట్టే, ఫరో గిన్నెను అతని చేతికి అందిస్తావు.+ 14 అయితే, నీ పరిస్థితి మెరుగైనప్పుడు నన్ను గుర్తుచేసుకో. దయచేసి నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించి, ఫరోకు నా గురించి చెప్పి, నేను ఇక్కడి నుండి బయటికి వచ్చేలా చేయి. 15 నిజానికి నన్ను హెబ్రీయుల దేశం నుండి అపహరించి తీసుకొచ్చారు.+ నన్ను చెరసాలలో* వేసేంత తప్పేమీ నేను ఇక్కడ చేయలేదు.”+

16 ఆ పానదాయకుడి కలకు యోసేపు చెప్పిన అర్థం బాగుందని గమనించి, ప్రధాన వంటవాడు యోసేపుతో ఇలా అన్నాడు: “నాకు కూడా ఒక కల వచ్చింది. ఆ కలలో, తెల్లని రొట్టెలున్న మూడు గంపలు నా తలమీద ఉన్నాయి. 17 అన్నిటికన్నా పైనున్న గంపలో ఫరో కోసం చేసిన అన్నిరకాల పిండి వంటలు ఉన్నాయి, పక్షులు వచ్చి వాటిని తింటున్నాయి.” 18 అప్పుడు యోసేపు ఇలా అన్నాడు: “దాని అర్థం ఇదే: ఆ మూడు గంపలు మూడు రోజులు. 19 ఇప్పటినుండి మూడు రోజుల్లో ఫరో నీ తల నరికించి, నిన్ను కొయ్యకు వేలాడదీయిస్తాడు, పక్షులు వచ్చి నీ మాంసాన్ని తింటాయి.”+

20 మూడో రోజు ఫరో పుట్టినరోజు.+ ఆ రోజు అతను తన సేవకులందరికీ విందు ఏర్పాటుచేశాడు. అప్పుడు తన సేవకుల సమక్షంలో ఫరో ఆ ప్రధాన పానదాయకుణ్ణి, ప్రధాన వంటవాణ్ణి చెరసాల నుండి బయటికి రప్పించాడు.* 21 తర్వాత ప్రధాన పానదాయకుడికి అతని ఉద్యోగాన్ని తిరిగిచ్చాడు. కాబట్టి అతను ఎప్పటిలాగే ఫరో చేతికి గిన్నెను అందించాడు. 22 కానీ, యోసేపు వివరించినట్టే,+ ప్రధాన వంటవాణ్ణి కొయ్యకు వేలాడదీయించాడు. 23 అయితే ప్రధాన పానదాయకుడు యోసేపు సంగతి మర్చిపోయాడు.+

41 రెండు సంవత్సరాలు గడిచాక, ఫరోకు ఒక కల వచ్చింది.+ ఆ కలలో అతను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నాడు. 2 అప్పుడు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, ఒడ్డున గడ్డి మేస్తూ ఉన్నాయి.+ 3 వాటి తర్వాత, వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న మరో ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, ఒడ్డున ఉన్న బలిసిన ఆవుల పక్కన నిలబడ్డాయి. 4 తర్వాత వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న ఆవులు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవుల్ని తినడం మొదలుపెట్టాయి. అప్పుడు ఫరోకు మెలకువ వచ్చింది.

5 తర్వాత ఫరో మళ్లీ నిద్రపోయాడు, ఈసారి అతనికి ఇంకో కల వచ్చింది. ఆ కలలో, ఒకే దంటుకు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నులు వచ్చాయి.+ 6 వాటి తర్వాత, తూర్పు గాలికి వాడిపోయిన ఏడు పీల వెన్నులు వచ్చాయి. 7 ఆ పీల వెన్నులు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నుల్ని మింగేయడం మొదలుపెట్టాయి. అప్పుడు ఫరో నిద్రలేచి, అది కల అని గ్రహించాడు.

8 ఉదయమైనప్పుడు, అతను చాలా కలవరపడ్డాడు. కాబట్టి ఐగుప్తులోని ఇంద్రజాలం చేసే పూజారులందర్నీ, ఆ దేశంలోని జ్ఞానులందర్నీ పిలిపించి, తన కలల్ని వాళ్లకు చెప్పాడు. కానీ ఎవ్వరూ వాటి అర్థాన్ని అతనికి చెప్పలేకపోయారు.

9 అప్పుడు ప్రధాన పానదాయకుడు ఫరోతో ఇలా అన్నాడు: “ఈ రోజు నేను నా పాపాల్ని ఒప్పుకుంటున్నాను. 10 ఫరోకు తన సేవకులైన నా మీద, ప్రధాన వంటవాడి మీద విపరీతమైన కోపం వచ్చి మమ్మల్ని రాజ సంరక్షకుల అధిపతి కింద ఉన్న చెరసాలలో వేయించాడు.+ 11 ఆ తర్వాత, ఒకే రాత్రి మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. ఆ కలలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి.+ 12 అప్పుడు రాజ సంరక్షకుల అధిపతికి సేవకుడైన ఒక హెబ్రీ యువకుడు మాతోపాటు ఉన్నాడు.+ మా కలల్ని మేము అతనికి చెప్పినప్పుడు,+ అతను ఒక్కో కలకు ఉన్న అర్థాన్ని వివరించాడు. 13 సరిగ్గా అతను మాకు వివరించినట్టే జరిగింది. నా ఉద్యోగం నాకు తిరిగొచ్చింది, ప్రధాన వంటవాడినేమో వేలాడదీశారు.”+

14 దాంతో ఫరో యోసేపును పిలిపించాడు.+ వాళ్లు అతన్ని త్వరగా చెరసాలలో*+ నుండి తీసుకొచ్చారు. అతను క్షౌరం చేయించుకొని, బట్టలు మార్చుకొని ఫరో దగ్గరికి వచ్చాడు. 15 అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “నాకు ఒక కల వచ్చింది, కానీ దాని అర్థం చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు. నువ్వు కలల్ని విని, వాటి అర్థం చెప్పగలవని నేను విన్నాను.”+ 16 అందుకు యోసేపు ఫరోతో ఇలా అన్నాడు: “నాదేం లేదు! దేవుడే ఫరో క్షేమం గురించి చెప్తాడు.”+

17 అప్పుడు ఫరో యోసేపుకు ఇలా చెప్పాడు: “నా కలలో, నేను నైలు నది ఒడ్డున నిలబడి ఉన్నాను. 18 అప్పుడు చూడచక్కగా ఉన్న ఏడు బలిసిన ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి, నైలు నది ఒడ్డున గడ్డిని మేయడం మొదలుపెట్టాయి.+ 19 వాటి తర్వాత బలహీనంగా, వికారంగా, బక్కచిక్కిపోయి ఉన్న మరో ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చాయి. ఐగుప్తు దేశమంతట్లో అంత వికారమైన ఆవుల్ని నేను ఎన్నడూ చూడలేదు. 20 బక్కచిక్కి వికారంగా ఉన్న ఆవులు బలిసివున్న మొదటి ఏడు ఆవుల్ని తినడం మొదలుపెట్టాయి. 21 కానీ, వాటిని తినేసిన తర్వాత కూడా అవి ఏమీ తిననట్టే కనిపించాయి; అవి మొదట్లో ఎంత వికారంగా బక్కచిక్కి ఉన్నాయో ఇప్పుడూ అంతే వికారంగా బక్కచిక్కి ఉన్నాయి. అంతలో నాకు మెలకువ వచ్చింది.

22 “ఆ తర్వాత నా కలలో, ఒకే దంటుకు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నులు రావడం చూశాను.+ 23 వాటి తర్వాత ముడుచుకుపోయి, తూర్పు గాలికి వాడిపోయిన ఏడు పీల వెన్నులు వచ్చాయి. 24 తర్వాత ఆ పీల వెన్నులు పుష్టిగా ఉన్న ఏడు శ్రేష్ఠమైన వెన్నుల్ని మింగేయడం మొదలుపెట్టాయి. కాబట్టి నేను ఇంద్రజాలం చేసే పూజారులకు+ దాని గురించి చెప్పాను. కానీ ఎవ్వరూ దాని అర్థాన్ని నాకు చెప్పలేకపోయారు.”+

25 అప్పుడు యోసేపు ఫరోతో ఇలా అన్నాడు: “ఫరోకు వచ్చిన రెండు కలల అర్థం ఒక్కటే. సత్యదేవుడు తాను చేయబోయేదాని గురించి ఫరోకు చెప్పాడు.+ 26 ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరాలు. అలాగే, ఏడు మంచి వెన్నులు కూడా ఏడు సంవత్సరాలు. ఈ రెండు కలల అర్థం ఒక్కటే. 27 వాటి తర్వాత వచ్చిన బక్కచిక్కిన ఏడు చెడ్డ ఆవులు ఏడు సంవత్సరాలు. అలాగే తూర్పు గాలికి వాడిపోయిన గింజలులేని ఏడు వెన్నులు కరువు ఉండే ఏడు సంవత్సరాలు. 28 కాబట్టి నేను ఫరోకు చెప్పినట్టుగానే, సత్యదేవుడు తాను చేయబోయేదాన్ని ఫరోకు చూపించాడు.

29 “ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంటలు పండే ఏడు సంవత్సరాలు రాబోతున్నాయి. 30 కానీ వాటి తర్వాత ఖచ్చితంగా, కరువు ఉండే ఏడు సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ప్రజలు ఐగుప్తు దేశంలోని సమృద్ధి అంతటినీ మర్చిపోతారు, ఆ కరువు దేశాన్ని పూర్తిగా పాడుచేస్తుంది.+ 31 తర్వాత వచ్చే ఈ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ముందటి సంవత్సరాల్లో ఉన్న సమృద్ధిని ఎవ్వరూ గుర్తుచేసుకోరు. 32 సత్యదేవుడు త్వరలో దాన్ని జరిగించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు కాబట్టే సత్యదేవుడు ఫరోకు ఆ కల రెండుసార్లు వచ్చేలా చేశాడు.

33 “కాబట్టి ఫరో ఇప్పుడు బుద్ధి, తెలివి ఉన్న ఒక వ్యక్తిని ఎంచుకొని, అతన్ని ఐగుప్తు దేశం మీద అధికారిగా నియమించాలి. 34 ఫరో ఈ దేశంలో పర్యవేక్షకుల్ని నియమించాలి, సమృద్ధిగా పంటలు పండే ఆ ఏడు సంవత్సరాల్లో+ ఐగుప్తు పంట నుండి ఐదో వంతును సేకరించాలి. 35 వాళ్లు రాబోయే ఆ మంచి సంవత్సరాల్లో ఆహారాన్నంతా సేకరించి, నగరాల్లో నిల్వచేసి భద్రపర్చాలి.+ ఆ ధాన్యం ఫరోకు చెందుతుంది. 36 ఐగుప్తులో రాబోయే ఏడు సంవత్సరాల కరువు కాలంలో ఆ ఆహారాన్ని దేశంలో పంచి పెట్టాలి. అప్పుడు ఆ కరువు వల్ల దేశం నాశనం కాకుండా ఉంటుంది.”+

37 ఆ మాట ఫరోకు, అతని సేవకులందరికీ నచ్చింది. 38 కాబట్టి ఫరో తన సేవకులతో ఇలా అన్నాడు: “దేవుని శక్తి* పనిచేసే ఇతని లాంటివాళ్లు ఇంకెవరైనా దొరుకుతారా?” 39 తర్వాత ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “దేవుడు వీటన్నిటినీ నీకు బయల్పర్చాడు కాబట్టి నీ అంత బుద్ధి, తెలివి ఉన్నవాళ్లు ఎవ్వరూ లేరు. 40 నిన్ను నా ఇంటిమీద అధికారిగా నియమిస్తున్నాను. నా ప్రజలంతా అన్ని విషయాల్లో నీకు లోబడతారు.+ కేవలం రాజుగా ఉండే* విషయంలో మాత్రమే నేను నీ పైస్థానంలో ఉంటాను.” 41 ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నిన్ను ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమిస్తున్నాను.”+ 42 ఆ తర్వాత ఫరో తన ముద్ర-ఉంగరాన్ని తన చేతి నుండి తీసి యోసేపు చేతికి పెట్టాడు, అతనికి సన్నని నారబట్టలు తొడిగించాడు, మెడకు బంగారు హారం వేశాడు. 43 అంతేకాదు, ఘనతకు సూచనగా ఉన్న తన రెండో రథం మీద అతన్ని ఊరేగించాడు. జనం అతని ముందు వెళ్తూ, “అవ్రెఖ్‌! అవ్రెఖ్‌!”* అని కేకలువేశారు. అలా ఫరో అతన్ని ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు.

44 ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “నేను ఫరోను, కానీ నీ ఆమోదం లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవ్వరూ ఏ పనీ చేయకూడదు.”*+ 45 తర్వాత ఫరో యోసేపుకు జఫెనత్‌-పనేహు అని పేరు పెట్టి, ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతును+ ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశాన్ని పర్యవేక్షించడం* మొదలుపెట్టాడు.+ 46 ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబడినప్పుడు* యోసేపు వయసు 30 ఏళ్లు.+

తర్వాత యోసేపు ఫరో ముందు నుండి వెళ్లిపోయి, ఐగుప్తు దేశమంతటా ప్రయాణించాడు. 47 సమృద్ధిగల ఏడు సంవత్సరాల్లో ఆ దేశంలో పంటలు పుష్కలంగా పండాయి. 48 అతను ఆ ఏడు సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పండిన ఆహారాన్నంతా సేకరిస్తూ, దాన్ని నగరాల్లో నిల్వ చేయించేవాడు; ఏ నగరం చుట్టుపక్కల పొలాల్లో పండిన పంటను ఆ నగరంలోనే నిల్వ చేయించేవాడు. 49 యోసేపు ఎంత పెద్ద మొత్తంలో ధాన్యాన్ని సేకరిస్తూ ఉన్నాడంటే, అది సముద్రపు ఇసుకంత అయ్యింది. చివరికి దాన్ని కొలవడం వీలుకాక కొలవడం మానేశారు.

50 కరువు మొదలవ్వకముందు, ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతు ద్వారా యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టారు.+ 51 యోసేపు తన పెద్ద కుమారునికి మనష్షే*+ అని పేరు పెట్టాడు. ఎందుకంటే “దేవుడు నా కష్టాన్నంతా, నా తండ్రి ఇంటినంతా మర్చిపోయేలా చేశాడు” అని యోసేపు అన్నాడు. 52 అలాగే అతను, “నేను బాధలుపడిన దేశంలో+ దేవుడు నాకు పిల్లల్ని దయచేశాడు”* అంటూ తన రెండో కుమారునికి ఎఫ్రాయిము*+ అని పేరు పెట్టాడు.

53 తర్వాత ఐగుప్తులో సమృద్ధిగల ఏడు సంవత్సరాలు ముగిసి,+ 54 ఏడు సంవత్సరాల కరువు మొదలైంది. అదంతా యోసేపు చెప్పినట్టే జరిగింది.+ అన్నిదేశాల్లో కరువు మొదలైంది, కానీ ఐగుప్తు దేశంలో మాత్రం అన్నిచోట్లా ఆహారం ఉంది.+ 55 మెల్లమెల్లగా, ఐగుప్తు దేశమంతటా కరువు వ్యాపించింది. దాంతో ప్రజలు ఫరో దగ్గరికి వెళ్లి ఆహారం కోసం మొరపెట్టుకున్నారు.+ అప్పుడు ఫరో ఐగుప్తీయులందరితో, “మీరు యోసేపు దగ్గరికి వెళ్లి అతను మీకు ఏం చెప్తే అది చేయండి”+ అన్నాడు. 56 ఆ కరువు భూమంతటా వ్యాపించింది.+ ఐగుప్తు దేశంలో కరువు భారం ఎక్కువగా ఉండడంతో, యోసేపు వాళ్ల మధ్య ఉన్న గోదాములన్నిటినీ తెరిపించి, ఆ ధాన్యాన్ని ఐగుప్తీయులకు అమ్మడం మొదలుపెట్టాడు.+ 57 అంతేకాదు, భూమంతటా కరువు విపరీతంగా ఉన్నందువల్ల అన్నిదేశాల ప్రజలు యోసేపు దగ్గర ధాన్యాన్ని కొనుక్కోవడానికి ఐగుప్తుకు వచ్చారు.+

42 ఐగుప్తులో ధాన్యం ఉందని+ విన్నప్పుడు యాకోబు తన కుమారులతో ఇలా అన్నాడు: “మీరెందుకు ఊరికే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు?” 2 అతను ఇంకా ఇలా అన్నాడు: “ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను. మనం ఆకలితో చనిపోకుండా బ్రతికుండేలా, మీరు అక్కడికి వెళ్లి మనకోసం కొంత ధాన్యం కొనుక్కురండి.”+ 3 కాబట్టి యోసేపు సహోదరుల్లో పదిమంది+ ధాన్యం కొనుక్కురావడానికి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. 4 కానీ యాకోబు యోసేపు సొంత తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపించలేదు.+ ఎందుకంటే యాకోబు, “బహుశా ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతాడేమో”+ అని అనుకున్నాడు.

5 ఇశ్రాయేలు కుమారులు, ధాన్యాన్ని కొనడానికి వెళ్తున్న ఇతరులతో కలిసి ఐగుప్తుకు వచ్చారు. ఎందుకంటే కనాను దేశానికి కూడా కరువు వ్యాపించింది.+ 6 అప్పుడు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నది,+ భూమంతటా ఉన్న ప్రజలకు ధాన్యాన్ని అమ్ముతున్నది యోసేపే.+ కాబట్టి యోసేపు సహోదరులు వచ్చి, అతని ముందు నేలకు వంగి నమస్కారం చేశారు.+ 7 యోసేపు తన సహోదరుల్ని చూడగానే గుర్తుపట్టాడు, కానీ తానెవరన్నది వాళ్లకు తెలియనివ్వలేదు.+ అతను వాళ్లతో కఠినంగా మాట్లాడుతూ, “మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “మేము ఆహారం కొనుక్కోవడానికి కనాను దేశం నుండి వచ్చాం”+ అని చెప్పారు.

8 అలా, యోసేపు తన సహోదరుల్ని గుర్తుపట్టాడు కానీ వాళ్లు అతన్ని గుర్తుపట్టలేదు. 9 యోసేపుకు వెంటనే తాను ఒకప్పుడు వాళ్ల గురించి కన్న కల గుర్తుకొచ్చింది.+ అతను వాళ్లతో, “మీరు గూఢచారులు! ఈ దేశం లోటుపాట్లను తెలుసుకోవడానికి వచ్చారు!” అన్నాడు. 10 అందుకు వాళ్లు ఇలా అన్నారు: “లేదు ప్రభూ, నీ సేవకులమైన మేము ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం. 11 మేమంతా ఒకే తండ్రికి పుట్టినవాళ్లం. మేము నీతిగా నడుచుకునేవాళ్లం. నీ సేవకులమైన మేము గూఢచారులం కాదు.” 12 కానీ అతను వాళ్లతో, “లేదు! మీరు ఈ దేశం లోటుపాట్లను తెలుసుకోవడానికే వచ్చారు!” అన్నాడు. 13 అందుకు వాళ్లు, “మేము 12 మంది సహోదరులం.+ ఒకే తండ్రికి పుట్టినవాళ్లం.+ మా తండ్రి కనాను దేశంలో ఉన్నాడు. అందరికన్నా చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు,+ ఇంకొకతను ఇక లేడు”+ అన్నారు.

14 అయితే యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘మీరు గూఢచారులు!’ అని నేను చెప్పిన మాట నిజమే. 15 మీరు చెప్తున్నది నిజమో కాదో దీంతో తేలిపోతుంది: ఫరో జీవం తోడు, మీ చిన్న తమ్ముడు ఇక్కడికి వచ్చేంత వరకు మీరు ఇక్కడి నుండి వెళ్లరు.+ 16 మీ తమ్ముణ్ణి తీసుకురావడానికి మీలో ఒకర్ని పంపించండి. అప్పటివరకు మిగతావాళ్లు ఇక్కడ బందీలుగా ఉంటారు. ఆ విధంగా, మీరు నిజం చెప్తున్నారో లేదో తేలిపోతుంది. ఒకవేళ మీరు చెప్పింది నిజం కాకపోతే, ఫరో జీవం తోడు మీరు గూఢచారులే.” 17 ఆ మాట అని అతను వాళ్లందర్నీ మూడు రోజుల పాటు బంధించి ఉంచాడు.

18 మూడో రోజు యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను దేవునికి భయపడే మనిషిని. కాబట్టి నేను చెప్పింది చేసి మీ ప్రాణాలు కాపాడుకోండి. 19 మీరు నీతిగా నడుచుకునే మనుషులైతే, మీలో ఒకర్ని ఇక్కడే బందీగా ఉండనివ్వండి. మిగతావాళ్లు, కరువు నుండి మీ కుటుంబాల్ని కాపాడుకోవడానికి ధాన్యం తీసుకెళ్లవచ్చు.+ 20 అక్కడికి వెళ్లి, మీ చిన్న తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీ మాటలు నమ్మదగినవని రుజువౌతుంది, మీరు మీ ప్రాణాల్ని దక్కించుకుంటారు.” వాళ్లు యోసేపు చెప్పినట్టే చేశారు.

21 వాళ్లు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “నిజంగా, మన సహోదరునికి మనం అలా చేశాం కాబట్టే మనకు ఈ శిక్ష పడుతోంది.+ కనికరం చూపించమని అతను మనల్ని బ్రతిమాలినప్పుడు మనం అతని బాధను చూసి కూడా పట్టించుకోలేదు. అందుకే మనకు ఈ కష్టం వచ్చింది.” 22 అప్పుడు రూబేను వాళ్లతో ఇలా అన్నాడు: “ ‘ఆ పిల్లవాడి విషయంలో పాపం చేయకండి’ అని నేను మీకు చెప్పలేదా? అయినా మీరు నా మాట వినలేదు.+ ఇప్పుడు అతని రక్తం విషయంలో మనం జవాబు చెప్పాల్సి వస్తోంది.”+ 23 కానీ వాళ్లు మాట్లాడుకున్నదంతా యోసేపుకు అర్థమైందని వాళ్లకు తెలీదు. ఎందుకంటే యోసేపు అప్పటిదాకా ఒక అనువాదకుడి ద్వారా వాళ్లతో మాట్లాడాడు. 24 అప్పుడు యోసేపు పక్కకు వెళ్లి, ఏడ్వడం మొదలుపెట్టాడు.+ తర్వాత యోసేపు వెనక్కి వచ్చి వాళ్లతో మళ్లీ మాట్లాడి షిమ్యోనును+ పట్టుకొని వాళ్ల కళ్ల ముందే అతన్ని బంధించాడు.+ 25 యోసేపు ఆ తర్వాత వాళ్ల సంచుల్లో ధాన్యం నింపమని, ఎవరి డబ్బులు వాళ్ల గోనెసంచిలో పెట్టమని, వాళ్ల ప్రయాణానికి కావాల్సినవి ఇవ్వమని తన సేవకులకు ఆజ్ఞాపించాడు. వాళ్లు అతను చెప్పినట్టే చేశారు.

26 అప్పుడు యోసేపు సహోదరులు ధాన్యాన్ని తమ గాడిదల మీదికి ఎక్కించుకొని, అక్కడి నుండి వెళ్లిపోయారు. 27 మధ్యలో వాళ్లు విడిది కోసం ఒకచోట ఆగారు. వాళ్లలో ఒకతను తన గాడిదకు మేత వేద్దామని తన గోనెసంచిని విప్పినప్పుడు, ఇదిగో అందులో అతని డబ్బు కనిపించింది. 28 దాంతో అతను, “నా డబ్బు తిరిగిచ్చేశారు, ఇదిగో అది నా సంచిలోనే ఉంది!” అని తన సహోదరులతో అన్నాడు. అప్పుడు వాళ్ల గుండెలు జారిపోయాయి. వాళ్లు వణికిపోతూ, “ఇదేంటి, దేవుడు మనకు ఇలా చేశాడు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.

29 వాళ్లు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు, తమకు జరిగినవన్నీ అతనికి చెప్పారు. వాళ్లు ఇలా అన్నారు: 30 “ఆ దేశానికి ప్రభువుగా ఉన్న వ్యక్తి మాతో కఠినంగా మాట్లాడాడు,+ మేము ఆ దేశం గుట్టు తెలుసుకోవడానికి వచ్చామని మమ్మల్ని నిందించాడు. 31 కానీ మేము అతనితో ఇలా అన్నాం: ‘మేము నీతిగా నడుచుకునేవాళ్లం, గూఢచారులం కాదు.+ 32 మేము 12 మంది సహోదరులం,+ ఒకే తండ్రికి పుట్టినవాళ్లం. ఒకడు ఇక లేడు.+ అందరికన్నా చిన్నవాడు కనాను దేశంలో మా నాన్న దగ్గర ఉన్నాడు.’+ 33 కానీ, ఆ దేశానికి ప్రభువుగా ఉన్న వ్యక్తి మాతో ఇలా అన్నాడు: ‘ఇలా చేస్తే మీరు నీతిగా నడుచుకునే మనుషులని నాకు తెలుస్తుంది: మీలో ఒకర్ని నా దగ్గర వదిలేసి,+ మీ కుటుంబాల్ని కరువు నుండి కాపాడుకోవడానికి ఆహారం తీసుకొని వెళ్లండి.+ 34 తర్వాత, మీ చిన్న తమ్ముణ్ణి నా దగ్గరికి తీసుకురండి. దానివల్ల మీరు గూఢచారులు కాదని, నీతిగా నడుచుకునే మనుషులని నాకు తెలుస్తుంది. అప్పుడు మీ సహోదరుణ్ణి మీకు తిరిగి అప్పగిస్తాను, మీరు ఈ దేశంలో ధాన్యం కొనుక్కోవచ్చు.’ ”

35 వాళ్లు గోనెసంచుల్ని విప్పుతుండగా, ఇదిగో ఎవరి డబ్బుసంచి వాళ్ల గోనెసంచిలోనే ఉంది. ఆ డబ్బుసంచుల్ని చూసి వాళ్లు, వాళ్ల నాన్న భయపడిపోయారు. 36 వాళ్ల నాన్న యాకోబు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నాకు కుమారులు లేకుండా చేశారు!+ యోసేపు ఇక లేడు,+ షిమ్యోను కూడా ఇక లేడు,+ ఇప్పుడు మీరు బెన్యామీనును కూడా తీసుకెళ్లబోతున్నారు! ఈ కష్టాలన్నీ నా మీదికే వచ్చిపడ్డాయి!” 37 కానీ రూబేను తన తండ్రితో ఇలా అన్నాడు: “నేను ఇతన్ని తిరిగి నీ దగ్గరికి తీసుకురాకపోతే, నువ్వు నా ఇద్దరు కుమారుల్ని చంపేయవచ్చు.+ ఇతన్ని నా చేతుల్లో పెట్టు. నేను ఇతన్ని తిరిగి నీకు అప్పగిస్తాను.”+ 38 కానీ యాకోబు ఇలా అన్నాడు: “నా కుమారుడు నీతో రాడు. ఎందుకంటే ఇతని అన్న చనిపోయాడు, ఇతనొక్కడే మిగిలాడు.+ మీ ప్రయాణంలో ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే, మీరు ఖచ్చితంగా తల నెరసిన నన్ను దుఃఖంతో సమాధిలోకి*+ వెళ్లేలా చేస్తారు.”+

43 కనాను దేశంలో కరువు విపరీతంగా ఉంది.+ 2 ఐగుప్తు నుండి వాళ్లు తెచ్చిన ధాన్యం+ అయిపోయిన తర్వాత వాళ్ల నాన్న, “మీరు మళ్లీ వెళ్లి, మన కోసం కొంత ఆహారం కొనుక్కురండి” అని వాళ్లతో అన్నాడు. 3 అప్పుడు యూదా ఇలా అన్నాడు: “ఆ వ్యక్తి, ‘మీ తమ్ముణ్ణి మీతోపాటు తీసుకొస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడొద్దు’ అని మమ్మల్ని గట్టిగా హెచ్చరించాడు.+ 4 నువ్వు మా తమ్ముణ్ణి మాతో పంపిస్తే, మేము వెళ్లి ఆహారం కొనుక్కొస్తాం. 5 కానీ నువ్వు అతన్ని మాతో పంపించకపోతే, మేము వెళ్లం. ఎందుకంటే, ‘మీ తమ్ముణ్ణి మీతోపాటు తీసుకొస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడొద్దు’ అని ఆ వ్యక్తి మాతో అన్నాడు.”+ 6 అప్పుడు ఇశ్రాయేలు,+ “మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడని అతనికి చెప్పి, మీరెందుకు నామీదికి ఈ కష్టం తీసుకొచ్చారు?” అని వాళ్లను అడిగాడు. 7 అందుకు వాళ్లు ఇలా అన్నారు: “అతను ‘మీ నాన్న ఇంకా బ్రతికున్నాడా? మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా?’ అని మన గురించి, మన బంధువుల గురించి గుచ్చిగుచ్చి అడిగాడు. దాంతో మేము ఉన్నదున్నట్టుగా చెప్పేశాం.+ కానీ అతను, ‘మీ తమ్ముణ్ణి ఇక్కడికి తీసుకురండి’ అని అంటాడని మాకేం తెలుసు?”+

8 తర్వాత యూదా తన తండ్రి ఇశ్రాయేలును ఇలా వేడుకున్నాడు: “ఈ పిల్లవాణ్ణి నాతో పంపించు.+ నువ్వు, మేము, మా పిల్లలు+ చనిపోకుండా బ్రతికుండేలా+ మమ్మల్ని అక్కడికి వెళ్లనివ్వు. 9 అతనికి ఏమీ కాకుండా చూసుకునే పూచీ నాది.+ నువ్వు నన్ను బాధ్యునిగా ఎంచవచ్చు. నేను అతన్ని వెనక్కి తీసుకొచ్చి నీకు అప్పగించకపోతే, ఆ పాపం జీవితాంతం నా మీద ఉంటుంది. 10 ఇలా ఆలస్యం చేయకపోయుంటే, ఇప్పటికి మేము రెండుసార్లు అక్కడికి వెళ్లి, తిరిగొచ్చేవాళ్లం.”

11 అందుకు వాళ్ల నాన్న ఇశ్రాయేలు వాళ్లతో ఇలా అన్నాడు: “అలాగైతే, మీరు ఈ దేశంలో దొరికే శ్రేష్ఠమైన పదార్థాల్ని అంటే కొంచెం సాంబ్రాణిని,+ కొంచెం తేనెను, సువాసనగల జిగురును, గుగ్గిలం బెరడును,+ పిస్తా కాయల్ని, బాదం కాయల్ని మీ గోనెసంచుల్లో వేసుకొని అతనికి బహుమానంగా+ తీసుకెళ్లండి. 12 ఈసారి రెండింతల డబ్బు తీసుకెళ్లండి; మీ సంచుల్లో తిరిగి పెట్టిన డబ్బును కూడా తీసుకెళ్లండి.+ బహుశా వాళ్లు పొరపాటున ఆ డబ్బును పెట్టివుంటారు. 13 మీ తమ్ముణ్ణి తీసుకొని, అతని దగ్గరికి వెళ్లండి. 14 మీ ఇంకో సహోదరుణ్ణి, అలాగే బెన్యామీనును అతను మీకు తిరిగి అప్పగించేలా సర్వశక్తిగల దేవుడు అతనికి మీ మీద జాలి పుట్టించాలి. ఇక నా విషయమంటారా, నేను కుమారుల్ని పోగొట్టుకొని బాధపడాల్సి వస్తే బాధపడతాను!”+

15 కాబట్టి వాళ్లు ఆ బహుమానాన్ని, రెండింతల డబ్బును, బెన్యామీనును తీసుకొని బయల్దేరారు. వాళ్లు ఐగుప్తుకు వెళ్లి, మళ్లీ యోసేపు ముందు నిలబడ్డారు.+ 16 బెన్యామీను వాళ్లతోపాటు ఉండడం చూసిన వెంటనే యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తితో, “వీళ్లను ఇంటికి తీసుకెళ్లి, జంతువుల్ని వధించి, భోజనం తయారుచేయి. మధ్యాహ్నం వీళ్లు నాతో కలిసి భోజనం చేస్తారు” అన్నాడు. 17 అతను వెంటనే వెళ్లి యోసేపు చెప్పినట్టు చేశాడు,+ వాళ్లను యోసేపు ఇంటికి తీసుకెళ్లాడు. 18 వాళ్లను యోసేపు ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్లు భయపడిపోయి, ఇలా అనుకోవడం మొదలుపెట్టారు: “పోయినసారి మన సంచుల్లో తిరిగి పెట్టిన డబ్బు గురించే మనల్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్లు మనమీద దాడి చేసి, మనల్ని బానిసలుగా చేసుకుంటారు, మన గాడిదల్ని లాక్కుంటారు!”+

19 వాళ్లు యోసేపు ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి, ఇంటి గుమ్మం దగ్గర అతనితో మాట్లాడారు. 20 వాళ్లు ఇలా అన్నారు: “ప్రభూ! చిన్న మనవి. మేము ఇంతకుముందు ఆహారం కొనుక్కోవడానికి వచ్చాం.+ 21 కానీ మేము తిరిగెళ్లేటప్పుడు దారిలో ఒకచోట విడిది కోసం ఆగి, మా సంచులు విప్పినప్పుడు, మా డబ్బంతా మా సంచుల్లోనే ఉంది.+ మేము దాన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాం. 22 ఇప్పుడు మేము ఆహారం కొనడానికి ఎక్కువ డబ్బు తీసుకొచ్చాం. అప్పుడు మా సంచుల్లో డబ్బు ఎవరు పెట్టారో మాకు తెలీదు.”+ 23 దానికి అతను, “ఫర్వాలేదు, భయపడకండి. మీ దేవుడు, మీ తండ్రి ఆరాధించిన దేవుడు మీ సంచుల్లో ఆ డబ్బు పెట్టాడు. మీ డబ్బు నాకు ముట్టింది” అన్నాడు. తర్వాత అతను షిమ్యోనును వాళ్ల దగ్గరికి తీసుకొచ్చాడు.+

24 ఆ తర్వాత అతను వాళ్లను యోసేపు ఇంట్లోకి తీసుకొచ్చి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు, వాళ్ల గాడిదలకు మేత వేశాడు. 25 యోసేపు మధ్యాహ్నం అక్కడికి వచ్చి తమతో కలిసి భోజనం చేస్తాడని వాళ్లు విన్నారు,+ కాబట్టి అతని కోసం బహుమానాన్ని+ సిద్ధం చేశారు. 26 యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు తమ బహుమానాన్ని అతని దగ్గరికి తీసుకెళ్లి, అతని ముందు నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.+ 27 తర్వాత అతను వాళ్ల బాగోగులు తెలుసుకొని, “మీరు చెప్పిన వృద్ధుడైన మీ నాన్న ఎలా ఉన్నాడు? అతను ఇంకా బ్రతికేవున్నాడా?”+ అని అడిగాడు. 28 అందుకు వాళ్లు, “మీ సేవకుడైన మా నాన్న బాగున్నాడు, అతను ఇంకా బ్రతికేవున్నాడు” అని చెప్పి, వంగి సాష్టాంగ నమస్కారం చేశారు.+

29 యోసేపు తల ఎత్తి తన తమ్ముణ్ణి అంటే తన తల్లికి పుట్టిన బెన్యామీనును+ చూసినప్పుడు, “మీరు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?”+ అని అడిగి, “నా కుమారుడా, దేవుడు నీమీద అనుగ్రహం చూపించాలి” అన్నాడు. 30 యోసేపు తన తమ్ముణ్ణి చూసినప్పుడు భావోద్వేగాన్ని అణుచుకోలేక త్వరత్వరగా బయటికి వెళ్లి, ఏడ్వడానికి ఒక చోటు కోసం వెదికాడు. అతను ఒంటరిగా ఒక గదిలోకి వెళ్లి చాలా ఏడ్చాడు.+ 31 తర్వాత అతను తన భావోద్వేగాల్ని అణుచుకొని, ముఖం కడుక్కొని బయటికి వచ్చి, “భోజనం వడ్డించండి” అన్నాడు. 32 అప్పుడు సేవకులు యోసేపుకు, వాళ్లకు, అతనితో ఉన్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఎందుకంటే ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది వాళ్ల దృష్టిలో అసహ్యకరమైన విషయం.+

33 ఆ సహోదరుల్ని* యోసేపు ముందు వరుసగా కూర్చోబెట్టారు; జ్యేష్ఠత్వపు హక్కున్న పెద్దవాడితో+ మొదలుపెట్టి చిన్నవాడి వరకు అందర్నీ వయసుల వారీగా కూర్చోబెట్టారు. అప్పుడు వాళ్లు ఆశ్చర్యంతో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. 34 అతను తన బల్లమీద ఉన్న ఆహారాన్ని భాగాలుగా చేసి వాళ్ల బల్ల మీదికి పంపిస్తూ ఉన్నాడు. కానీ బెన్యామీను వంతు వచ్చినప్పుడు మిగతావాళ్లందరి కన్నా ఐదు రెట్లు ఎక్కువ పంపించాడు.+ అలా వాళ్లు యోసేపుతో కలిసి తృప్తిగా తిన్నారు, తాగారు.

44 తర్వాత యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తికి ఇలా ఆజ్ఞాపించాడు: “వాళ్లు మోసుకెళ్లగలిగేంత ఆహారాన్ని వాళ్ల సంచుల్లో నింపు, ఎవరి డబ్బు వాళ్ల సంచిలో పెట్టు.+ 2 అయితే, అందరికన్నా చిన్నవాడి సంచిలో అతని ధాన్యం డబ్బును, అలాగే నా వెండి గిన్నెను పెట్టు.” దాంతో అతను యోసేపు చెప్పినట్టే చేశాడు.

3 ఉదయం వెలుతురు వచ్చిన తర్వాత వాళ్లను తమ గాడిదలతోపాటు పంపించేశారు. 4 వాళ్లు నగరం దాటి ఎక్కువ దూరం వెళ్లకముందే, యోసేపు తన ఇంటిమీద అధికారిగా ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: “లే! త్వరగా వెళ్లి వాళ్లను పట్టుకో! వాళ్లు దొరికాక, వాళ్లతో ఇలా అను: ‘మేము మీకు మంచి చేస్తే మీరు ఎందుకు మాకు చెడు చేశారు? 5 నా యజమాని తాగడానికి, సరిగ్గా శకునం చూడడానికి ఉపయోగించేది ఈ గిన్నెనే కదా? మీరు చాలా చెడ్డపని చేశారు.’ ”

6 అప్పుడు ఆ అధికారి వెళ్లి వాళ్లను కలిసి, ఆ మాటలు చెప్పాడు. 7 కానీ వాళ్లు అతనితో ఇలా అన్నారు: “మా ప్రభువు ఎందుకు అంత మాట అంటున్నాడు? నీ సేవకులమైన మేము అలాంటి పని ఎప్పుడూ చేయం. 8 మా సంచుల్లో దొరికిన డబ్బునే మేము కనాను దేశం నుండి తిరిగి తీసుకొచ్చాం.+ అలాంటిది, మీ యజమాని ఇంట్లో నుండి వెండిని గానీ బంగారాన్ని గానీ ఎలా దొంగిలిస్తాం? 9 నీ సేవకులమైన మాలో ఎవరి దగ్గరైనా ఆ గిన్నె దొరికితే అతను చనిపోవాలి, అంతేకాదు మిగిలినవాళ్లం కూడా మా యజమానికి దాసులమౌతాం.” 10 అప్పుడు అతను ఇలా అన్నాడు: “మీరు చెప్పినట్టే కానివ్వండి. అది ఎవరి దగ్గర దొరికితే అతను నాకు దాసుడౌతాడు, మిగతావాళ్లు నిర్దోషులు.” 11 వెంటనే వాళ్లంతా తమ సంచుల్ని కిందికి దింపి, వాటిని విప్పారు. 12 అతను పెద్దవాడి సంచి నుండి మొదలుపెట్టి చిన్నవాడి సంచి వరకు ఒక్కొక్కటి జాగ్రత్తగా వెతికాడు. చివరికి ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది.+

13 అప్పుడు వాళ్లు తమ బట్టలు చింపుకొని, ప్రతీ ఒక్కరు మళ్లీ తమ సంచిని తమ గాడిద మీదికి ఎక్కించుకొని నగరానికి తిరిగి వచ్చారు. 14 యూదా,+ అతని సహోదరులు యోసేపు ఇంటికి వెళ్లేసరికి, యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. అప్పుడు వాళ్లు అతని ముందు నేలమీద సాష్టాంగపడ్డారు.+ 15 యోసేపు వాళ్లతో, “మీరు చేసిన పనేంటి? నాలాంటి వ్యక్తి శకునం చూసి జరిగినదంతా తెలుసుకోగలడని+ మీకు తెలీదా?” అన్నాడు. 16 అప్పుడు యూదా ఇలా అన్నాడు: “మేము మా యజమానికి ఏమి చెప్పగలం? ఏమి మాట్లాడగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేసుకోగలం? సత్యదేవుడే నీ దాసుల తప్పును+ కనిపెట్టాడు. ఇప్పుడు మేము, అలాగే ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో అతను, మా యజమానికి దాసులం.” 17 అయితే యోసేపు ఇలా అన్నాడు: “నేను ఎన్నడూ అలా చేయను! ఎవరి చేతిలో ఆ గిన్నె దొరికిందో అతను మాత్రమే నాకు దాసుడౌతాడు.+ మిగిలినవాళ్లు మనశ్శాంతితో మీ నాన్న దగ్గరికి వెళ్లండి.”

18 అప్పుడు యూదా యోసేపు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నా యజమానీ, దయచేసి నీ దాసుడు నీతో చెప్పే మాటను వినమని వేడుకుంటున్నాను, నీ దాసుని మీద కోపం తెచ్చుకోకు. నువ్వు ఫరో అంతటివాడివి.+ 19 నా యజమాని తన దాసుల్ని, ‘మీకు నాన్న గానీ తమ్ముడు గానీ ఉన్నాడా?’ అని అడిగాడు. 20 అప్పుడు మేము మా యజమానికి ఇలా చెప్పాం: ‘మాకు వృద్ధుడైన నాన్న, అతని వృద్ధాప్యంలో పుట్టిన ఒక పిల్లవాడు, అంటే మా అందరికన్నా చిన్నవాడైన తమ్ముడు ఉన్నాడు.+ అయితే అతని అన్న చనిపోయాడు.+ కాబట్టి వాళ్లమ్మకు పుట్టినవాళ్లలో మిగిలింది అతనొక్కడే.+ అతనంటే వాళ్ల నాన్నకు చాలా ఇష్టం.’ 21 అప్పుడు నువ్వు నీ దాసులతో, ‘అతన్ని నా దగ్గరికి తీసుకురండి, నేను అతన్ని చూడాలి’ అన్నావు.+ 22 కానీ మేము మా యజమానితో, ‘ఆ పిల్లవాడు వాళ్ల నాన్నను విడిచి రాలేడు. ఒకవేళ అలా విడిచి వస్తే, వాళ్ల నాన్న ఖచ్చితంగా చనిపోతాడు’+ అని చెప్పాం. 23 అప్పుడు నువ్వు నీ దాసులకు, ‘మీ చిన్న తమ్ముడు మీతో వస్తేనే గానీ మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని చెప్పావు.+

24 “కాబట్టి మేము నీ దాసుడైన మా నాన్న దగ్గరికి వెళ్లి, మా యజమాని అన్న మాటల గురించి అతనికి చెప్పాం. 25 తర్వాత మా నాన్న, ‘మీరు మళ్లీ అక్కడికి వెళ్లి మనకోసం కొంత ఆహారం కొనుక్కురండి’ అన్నాడు.+ 26 కానీ మేము ఇలా అన్నాం: ‘మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడు మాతోపాటు వస్తేనే మేము వెళ్తాం. ఎందుకంటే మాతోపాటు మా చిన్న తమ్ముడు ఉంటేనే గానీ అతని ముఖం చూడలేం.’+ 27 అప్పుడు నీ దాసుడైన మా నాన్న మాతో ఇలా అన్నాడు: ‘నా భార్య నాకు ఇద్దరు కుమారుల్ని కన్నదని+ మీకు బాగా తెలుసు. 28 కానీ వాళ్లలో ఒకడు నన్ను విడిచి వెళ్లాడు, అప్పుడు నేను “ఖచ్చితంగా ఒక క్రూరమృగం అతన్ని ముక్కలుముక్కలు చేసివుంటుంది!” అనుకున్నాను.+ ఇప్పటివరకు నేను అతన్ని చూడలేదు. 29 ఇతన్ని కూడా మీరు నా కళ్లముందు నుండి తీసుకెళ్లారనుకోండి, తర్వాత ఇతనికి ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే, మీరు ఖచ్చితంగా తల నెరసిన నన్ను దుఃఖంతో సమాధిలోకి*+ వెళ్లేలా చేస్తారు.’+

30 “నీ దాసుడైన మా నాన్న ప్రాణం ఇతని ప్రాణంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఈ పిల్లవాడు లేకుండా మా నాన్న దగ్గరికి వెళ్తే, 31 పిల్లవాడు లేకపోవడం చూసిన వెంటనే అతను చనిపోతాడు. అప్పుడు నీ దాసులమైన మేము, తల నెరసిన నీ దాసుడైన మా నాన్నను దుఃఖంతో సమాధిలోకి* వెళ్లేలా చేసినవాళ్లమౌతాం. 32 నీ దాసుడినైన నేను, ఆ పిల్లవాడికి ఏమీ కాకుండా చూసే పూచీ నాదని చెప్పి మా నాన్నతో, ‘నేను అతన్ని వెనక్కి తీసుకొచ్చి నీకు అప్పగించకపోతే, ఆ పాపం జీవితాంతం నా మీద ఉంటుంది’ అన్నాను.+ 33 కాబట్టి ఇప్పుడు ఆ పిల్లవాడు తన సహోదరులతో తిరిగెళ్లేలా, దయచేసి, ఆ పిల్లవాడి స్థానంలో నీ దాసుడినైన నన్ను నా యజమానికి దాసునిగా ఉండనివ్వు. 34 ఆ పిల్లవాడు లేకుండా నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్లగలను? మా నాన్నకు ఏమైనా జరిగితే, అది చూసి నేను తట్టుకోలేను!”

45 అప్పుడు యోసేపు తన సేవకులందరి ముందు తన భావోద్వేగాల్ని అణుచుకోలేక,+ “అందరూ నా దగ్గర నుండి వెళ్లిపోండి!” అని అరిచాడు. తాను యోసేపునని అతను చెప్తున్నప్పుడు అక్కడ అతని సహోదరులు తప్ప ఇంకెవరూ లేరు.+

2 అప్పుడు యోసేపు ఎంత గట్టిగా ఏడ్చాడంటే అది ఐగుప్తీయులకు, ఫరో ఇంటివాళ్లకు వినిపించింది. 3 చివరికి యోసేపు తన సహోదరుల్ని, “నేను యోసేపును. మా నాన్న ఇంకా బ్రతికున్నాడా?” అని అడిగాడు. కానీ అతని సహోదరులు ఏమీ జవాబు చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు. 4 కాబట్టి యోసేపు తన సహోదరులతో, “⁠దయచేసి, నా దగ్గరికి రండి” అన్నాడు. దాంతో వాళ్లు అతని దగ్గరికి వెళ్లారు.

అప్పుడు అతను ఇలా అన్నాడు: “నేను మీ సహోదరుణ్ణి, మీరు ఐగుప్తీయులకు అమ్మేసిన యోసేపును.+ 5 కానీ ఇప్పుడు మీరు ఆందోళన పడకండి. మీరు నన్ను ఇక్కడివాళ్లకు అమ్మేసినందుకు ఒకరినొకరు నిందించుకోకండి; మన ప్రాణాల్ని కాపాడడానికి దేవుడే మీకన్నా ముందు నన్ను ఇక్కడికి పంపించాడు.+ 6 రెండేళ్ల నుండి దేశంలో కరువు ఉంది,+ ఇంకా ఐదేళ్లపాటు దున్నడం గానీ కోయడం గానీ జరగవు. 7 భూమ్మీద* మీ వంశం* నిలిచి ఉండడానికి,+ శక్తివంతమైన రీతిలో మిమ్మల్ని విడిపించి మీ ప్రాణాల్ని కాపాడడానికి దేవుడు మీకన్నా ముందు నన్ను పంపించాడు. 8 కాబట్టి మీరు కాదు, సత్యదేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు. నన్ను ఫరోకు ముఖ్య సలహాదారునిగా,* అతని ఇంటివాళ్లందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటి మీద పరిపాలకునిగా నియమించడానికి దేవుడే అలా చేశాడు.+

9 “మీరు త్వరగా మా నాన్న దగ్గరికి వెళ్లి ఇలా చెప్పాలి, ‘నీ కుమారుడు యోసేపు ఇలా అన్నాడు: “దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీద ప్రభువుగా నియమించాడు.+ ఆలస్యం చేయకుండా నా దగ్గరికి వచ్చేయి.+ 10 నువ్వు గోషెను ప్రాంతంలో నివసించాలి.+ అప్పుడు నువ్వు, నీ కుమారులు, నీ మనవళ్లు, నీ మందలు, నీ పశువులు, నీకున్నవన్నీ నాకు దగ్గర్లో ఉండొచ్చు. 11 నేను నిన్ను పోషిస్తాను. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే నువ్వు, నీ ఇంటివాళ్లు పేదవాళ్లౌతారు, నీకున్నదంతా కోల్పోతావు. ఎందుకంటే కరువు ఇంకా ఐదేళ్లపాటు ఉంటుంది.” ’+ 12 ఇప్పుడు మీరూ, నా తమ్ముడు బెన్యామీనూ నన్ను కళ్లారా చూస్తున్నారు కదా, మీతో మాట్లాడుతున్నది నిజంగా నేనే.+ 13 కాబట్టి మీరు ఐగుప్తులో నా వైభవం గురించి, మీరు చూసిన ప్రతీదాని గురించి మా నాన్నకు చెప్పాలి. ఇప్పుడు త్వరగా వెళ్లి మా నాన్నను ఇక్కడికి తీసుకురండి.”

14 తర్వాత యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగిలించుకొని* ఏడ్చాడు, బెన్యామీను కూడా యోసేపు మెడ చుట్టూ చేతులేసి ఏడ్చాడు.+ 15 తర్వాత యోసేపు తన సహోదరులందర్నీ ముద్దుపెట్టుకొని, వాళ్లను కౌగిలించుకొని ఏడ్చాడు. అప్పుడు అతని సహోదరులు అతనితో మాట్లాడారు.

16 “యోసేపు సహోదరులు వచ్చారు!” అన్న వార్త ఫరో ఇంటికి చేరింది. అది విని ఫరో, అతని సేవకులు సంతోషించారు. 17 కాబట్టి ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “నీ సహోదరులకు ఈ మాట చెప్పు: ‘మీ జంతువుల మీద ధాన్యం సంచుల్ని పెట్టుకొని కనాను దేశానికి వెళ్లండి. 18 మీ నాన్నను, మీ ఇంటివాళ్లను తీసుకొని నా దగ్గరికి రండి. ఐగుప్తు దేశంలో ఉన్న మంచివాటిని మీకు ఇస్తాను. ఈ దేశంలోని శ్రేష్ఠమైన పంటను* మీరు తింటారు.’+ 19 అంతేకాదు నువ్వు ఈ మాట కూడా వాళ్లకు చెప్పాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను:+ ‘మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తు దేశం నుండి బండ్లను తీసుకెళ్లి,+ ఒకదానిలో మీ నాన్నను కూర్చోబెట్టుకొని ఇక్కడికి తీసుకురండి.+ 20 మీ ఆస్తిపాస్తుల+ గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఐగుప్తు దేశంలోని శ్రేష్ఠమైనవన్నీ మీవే.’ ”

21 ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. ఫరో ఆజ్ఞాపించినట్టే యోసేపు వాళ్లకు బండ్లను, ప్రయాణానికి కావాల్సిన వాటిని ఇచ్చాడు. 22 వాళ్లలో ప్రతీ ఒక్కరికి ఒక జత బట్టల్ని ఇచ్చాడు, కానీ బెన్యామీనుకు మాత్రం 300 వెండి రూకలు, ఐదు జతల బట్టలు ఇచ్చాడు.+ 23 వాళ్ల నాన్నకేమో ఐగుప్తు దేశంలో దొరికే మంచివాటిని మోస్తున్న పది గాడిదల్ని, అతని ప్రయాణానికి కావాల్సిన ధాన్యాన్ని, రొట్టెల్ని, ఆహారాన్ని మోస్తున్న పది ఆడ గాడిదల్ని పంపించాడు. 24 అలా యోసేపు తన సహోదరుల్ని సాగనంపాడు. వాళ్లు వెళ్తున్నప్పుడు యోసేపు, “దారిలో ఒకరితో ఒకరు గొడవ పడకండి”+ అని వాళ్లకు చెప్పాడు.

25 అప్పుడు వాళ్లు ఐగుప్తు నుండి బయల్దేరి కనాను దేశంలో ఉన్న వాళ్ల నాన్న యాకోబు దగ్గరికి వచ్చి, 26 “యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, అతను ఇప్పుడు ఐగుప్తు దేశమంతటికీ పరిపాలకుడు!”+ అని చెప్పారు. కానీ యాకోబు వాళ్లు చెప్పేది నమ్మలేదు కాబట్టి వాళ్ల మాటల్ని పట్టించుకోలేదు.+ 27 అయితే వాళ్లు యోసేపు తమతో మాట్లాడిన విషయాలన్నిటినీ తమ తండ్రి యాకోబుకు చెప్తూ వెళ్లినప్పుడు, అలాగే అతన్ని తీసుకురావడానికి యోసేపు పంపించిన బండ్లను చూసినప్పుడు యాకోబు మనసు* కుదుటపడింది. 28 అప్పుడు ఇశ్రాయేలు ఇలా అన్నాడు: “ఇక చాలు! యోసేపు బ్రతికే ఉన్నాడు! నేను చనిపోకముందే వెళ్లి నా కుమారుణ్ణి చూడాలి!”+

46 ఇశ్రాయేలు తనకున్న వాటన్నిటినీ* తీసుకొని బయల్దేరాడు. అతను బెయేర్షెబాకు+ చేరుకున్నప్పుడు, తన తండ్రి ఇస్సాకు ఆరాధించిన దేవునికి+ బలులు అర్పించాడు. 2 రాత్రిపూట దేవుడు ఒక దర్శనంలో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, “యాకోబూ, యాకోబూ!” అని పిలిచాడు. దానికి అతను, “చెప్పు ప్రభువా!” అన్నాడు. 3 అప్పుడు దేవుడు ఇలా అన్నాడు: “నేను సత్యదేవుణ్ణి, నీ తండ్రికి దేవుణ్ణి.+ ఐగుప్తుకు వెళ్లడానికి భయపడకు, ఎందుకంటే అక్కడ నువ్వు ఒక గొప్ప జనం అయ్యేలా నేను చేస్తాను.+ 4 నేను కూడా నీతోపాటు ఐగుప్తుకు వస్తాను, నేనే నిన్ను మళ్లీ ఐగుప్తు నుండి తీసుకొస్తాను.+ నువ్వు చనిపోయినప్పుడు యోసేపు తన చేతితో నీ కళ్లు మూస్తాడు.”+

5 తర్వాత యాకోబు బెయేర్షెబా నుండి బయల్దేరాడు. అతని కుమారులు అతన్ని,* తమ పిల్లల్ని, తమ భార్యల్ని ఫరో పంపించిన బండ్లలోకి ఎక్కించి ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. 6 కనాను దేశంలో తాము సంపాదించుకున్న పశువుల మందల్ని, వస్తువుల్ని కూడా తమతోపాటు తీసుకెళ్లారు. అలా యాకోబు, అతనితోపాటు అతని పిల్లలందరూ ఐగుప్తుకు చేరుకున్నారు. 7 యాకోబు తనతోపాటు తన కుటుంబమంతటినీ అంటే కుమారుల్ని, మనవళ్లను, కూతుళ్లను, మనవరాళ్లను ఐగుప్తుకు తీసుకొచ్చాడు.

8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కుమారుల పేర్లు, అంటే యాకోబు కుమారుల పేర్లు ఇవి: యాకోబు పెద్ద కుమారుడు రూబేను.+

9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.+

10 షిమ్యోను+ కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, షావూలు.+ ఈ షావూలు ఒక కనానీయురాలి కుమారుడు.

11 లేవి+ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.

12 యూదా+ కుమారులు: ఏరు, ఓనాను, షేలహు,+ పెరెసు,+ జెరహు.+ అయితే ఏరు, ఓనాను ఇద్దరూ కనాను దేశంలో చనిపోయారు.+

పెరెసు కుమారులు: ఎస్రోను, హామూలు.+

13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.+

14 జెబూలూను+ కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.+

15 వీళ్లు లేయా నుండి వచ్చినవాళ్లు.* ఆమె పద్దనరాములో యాకోబుకు వీళ్లను, అతని కూతురు దీనాను కన్నది. యాకోబు వంశస్థులైన వీళ్లంతా 33 మంది.

16 గాదు+ కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదు, అరేలీ.+

17 ఆషేరు+ కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వాళ్ల సహోదరి శెరహు.

బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.+

18 వీళ్లంతా లాబాను తన కూతురు లేయాకు సేవకురాలిగా ఇచ్చిన జిల్పా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం 16 మంది.

19 యాకోబు భార్య రాహేలుకు పుట్టిన కుమారులు: యోసేపు,+ బెన్యామీను.+

20 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కుమారులు: మనష్షే,+ ఎఫ్రాయిము.+ వీళ్లను ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతు+ యోసేపుకు కన్నది.

21 బెన్యామీను కుమారులు:+ బెల, బేకెరు, అష్బేలు, గెరా,+ నయమాను, ఏహీ, రోషు, ముప్పీము, హుప్పీము,+ ఆర్దు.+

22 వీళ్లంతా రాహేలు ద్వారా యాకోబుకు పుట్టిన కుమారులు, మొత్తం 14 మంది.

23 దాను+ కుమారుడు* హుషీము.+

24 నఫ్తాలి+ కుమారులు: యహసేలు, గూనీ, యేసెరు, షిల్లేము.+

25 వీళ్లంతా లాబాను తన కూతురు రాహేలుకు సేవకురాలిగా ఇచ్చిన బిల్హా కుమారులు. వీళ్లను ఆమె యాకోబుకు కన్నది, వీళ్లు మొత్తం ఏడుగురు.

26 యాకోబు కోడళ్లు కాకుండా అతనితో పాటు ఐగుప్తుకు వెళ్లిన అతని వంశస్థులందరు 66 మంది.+ 27 యోసేపుకు ఐగుప్తులో పుట్టిన కుమారులు ఇద్దరు. అలా ఐగుప్తుకు వచ్చిన యాకోబు ఇంటివాళ్లందరు మొత్తం 70 మంది.+

28 తాను గోషెనుకు వచ్చే దారిలో ఉన్నానని యోసేపుకు చెప్పడానికి యాకోబు యూదాను+ ముందుగా పంపించాడు. వాళ్లు గోషెను ప్రాంతానికి+ వచ్చినప్పుడు, 29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన తండ్రి ఇశ్రాయేలును కలవడానికి గోషెనుకు వెళ్లాడు. తన తండ్రి కనబడగానే యోసేపు అతన్ని కౌగిలించుకొని* చాలాసేపు ఏడ్చాడు. 30 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “నేను నీ ముఖం చూశాను, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. కాబట్టి ఇక నేను చనిపోయినా ఫర్వాలేదు.”

31 తర్వాత యోసేపు తన సహోదరులతో, తన తండ్రి ఇంటివాళ్లతో ఇలా అన్నాడు: “నేను ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాను,+ ‘కనాను దేశం నుండి నా సహోదరులు, నా తండ్రి ఇంటివాళ్లు ఇక్కడికి వచ్చారు.+ 32 వాళ్లు గొర్రెల్ని, పశువుల్ని కాస్తారు.+ వాళ్లు తమ మందల్ని, పశువుల్ని, తమకున్న వాటన్నిటినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు.’+ 33 ఫరో మిమ్మల్ని పిలిచి, ‘మీరేం పని చేస్తుంటారు?’ అని అడిగినప్పుడు 34 మీరు, ‘నీ సేవకులమైన మేము చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పశువుల కాపరులం. మేమే కాదు మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్లు’+ అని చెప్పాలి. అప్పుడు మీరు గోషెను ప్రాంతంలో నివసించవచ్చు.+ ఎందుకంటే గొర్రెల కాపరులంటే ఐగుప్తీయులకు అసహ్యం.”+

47 యోసేపు ఫరో దగ్గరికి వెళ్లి, “మా నాన్న, నా సహోదరులు తమ మందల్ని, పశువుల్ని, తమకున్న వాటన్నిటినీ తీసుకొని కనాను దేశం నుండి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్లు గోషెను ప్రాంతంలో ఉన్నారు”+ అని చెప్పాడు.+ 2 యోసేపు తనతోపాటు తన సహోదరుల్లో ఐదుగుర్ని తీసుకెళ్లి ఫరో ముందు నిలబెట్టాడు.+

3 ఫరో వాళ్లను, “మీరు ఏమి పని చేస్తుంటారు?” అని అడిగాడు. అందుకు వాళ్లు, “నీ సేవకులమైన మేము గొర్రెల కాపరులం. మేమే కాదు, మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవాళ్లు” అని చెప్పారు.+ 4 తర్వాత వాళ్లు ఫరోతో ఇలా అన్నారు: “మేము ఇక్కడ పరదేశులుగా ఉండడానికి వచ్చాం.+ ఎందుకంటే కనాను దేశంలో కరువు విపరీతంగా ఉండడంవల్ల+ నీ సేవకులమైన మా మందలకు అక్కడ పచ్చిక లేదు. దయచేసి నీ సేవకులమైన మమ్మల్ని గోషెను ప్రాంతంలో ఉండనివ్వు.”+ 5 అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు: “మీ నాన్న, నీ సహోదరులు నీ దగ్గరికి వచ్చారు. 6 ఐగుప్తు దేశం నీ ముందుంది. మీ నాన్నను, నీ సహోదరుల్ని ఐగుప్తు దేశంలోని అత్యంత శ్రేష్ఠమైన ప్రాంతంలో ఉండనివ్వు.+ వాళ్లను గోషెను ప్రాంతంలో ఉండనివ్వు. నీకు తెలిసి, వాళ్లలో ఎవరైనా సమర్థులు ఉంటే, వాళ్లను నా పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు.”

7 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ముందుకు తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు ఫరోను దీవించాడు. 8 ఫరో యాకోబును, “నీ వయసెంత?” అని అడిగాడు. 9 దానికి యాకోబు ఫరోతో ఇలా అన్నాడు: “నా వయసు 130 ఏళ్లు. నా పూర్వీకులతో పోలిస్తే నా జీవితకాలం చాలా చిన్నది.+ నా జీవితమంతా ఎన్నో కష్టాల మధ్య సాగింది.+ నేను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సంచరిస్తూ పరదేశిగా బ్రతికాను. నా పూర్వీకులు కూడా పరదేశులుగానే బ్రతికారు.” 10 తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ముందు నుండి వెళ్లిపోయాడు.

11 ఫరో ఆజ్ఞాపించినట్టే యోసేపు ఐగుప్తు దేశంలోని అత్యంత శ్రేష్ఠమైన ప్రాంతంలో అంటే రామెసేసులో+ కొంత భాగాన్ని తన తండ్రికి, తన సహోదరులకు ఆస్తిగా ఇచ్చి, వాళ్లు అక్కడ నివసించేలా చేశాడు. 12 యోసేపు తన తండ్రికి, తన సహోదరులకు, తన తండ్రి ఇంటివాళ్లందరికీ వాళ్లవాళ్ల కుటుంబ అవసరాల ప్రకారం ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉన్నాడు.

13 కరువు విపరీతంగా ఉన్నందువల్ల దేశమంతట్లో ఎక్కడా ఆహారం లేకుండా పోయింది. కరువు వల్ల ఐగుప్తు దేశ పరిస్థితి, కనాను దేశ పరిస్థితి దుర్భరంగా తయారైంది.+ 14 యోసేపు ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో ఉన్న డబ్బునంతా అంటే ప్రజలు ధాన్యం కొనడానికి ఇస్తున్న డబ్బునంతా+ సేకరించి, దాన్ని ఫరో ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. 15 కొంతకాలానికి ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. అప్పుడు ఐగుప్తీయులందరూ యోసేపు దగ్గరికి రావడం మొదలుపెట్టి, “మా డబ్బంతా అయిపోయింది! మాకు ఆహారం ఇవ్వు, లేదంటే మేమంతా నీ కళ్లముందే ఆకలితో చనిపోతాం” అన్నారు. 16 అప్పుడు యోసేపు ఇలా అన్నాడు: “మీ డబ్బు అయిపోతే, మీ పశువుల్ని ఇవ్వండి. మీ పశువులకు మారుగా నేను మీకు ఆహారం ఇస్తాను.” 17 కాబట్టి వాళ్లు యోసేపు దగ్గరికి తమ పశువుల్ని తీసుకురావడం మొదలుపెట్టారు. వాళ్ల గుర్రాల్ని, పశువుల్ని, మందల్ని, గాడిదల్ని తీసుకొని అతను వాళ్లకు ఆహారం ఇస్తూ ఉన్నాడు. అలా ఆ సంవత్సరం అతను వాళ్ల పశువులన్నిటికీ మారుగా ఆహారం ఇచ్చి, వాళ్లను పోషిస్తూ ఉన్నాడు.

18 ఆ సంవత్సరం గడిచాక, తర్వాతి సంవత్సరం ప్రజలు అతని దగ్గరికి వచ్చి ఇలా అనడం మొదలుపెట్టారు: “ప్రభూ, నీ దగ్గర దాచేదేముంది? ఇప్పటికే మేము మా డబ్బును, పశువుల మందల్ని మా ప్రభువుకు ఇచ్చేశాం. ఇప్పుడు మా ప్రభువుకు ఇవ్వడానికి మా శరీరాలు, మా భూములు తప్ప మా దగ్గర ఏమీ మిగల్లేదు. 19 మేమూ, మా భూములూ నీ కళ్లముందు ఎందుకు నశించిపోవాలి? మమ్మల్ని, మా భూముల్ని కొని మాకు ఆహారం ఇవ్వు. మేము ఫరోకు దాసులమౌతాం, మా భూములు ఫరో సొంతమౌతాయి. మేము చనిపోకుండా బ్రతికి ఉండేలా, మా పొలాలు బీడుబారిపోకుండా ఉండేలా మాకు విత్తనాల్ని ఇవ్వు.” 20 అప్పుడు యోసేపు ఐగుప్తీయుల భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. ఎందుకంటే కరువు చాలా విపరీతంగా ఉన్నందువల్ల ప్రతీ ఐగుప్తీయుడు తన పొలాన్ని అమ్మేశాడు. అలా భూములన్నీ ఫరో సొంతమయ్యాయి.

21 తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో ఈ చివర నుండి ఆ చివర వరకు ఉన్న ప్రజలందర్నీ నగరాల్లోకి రప్పించాడు.+ 22 పూజారుల భూముల్ని మాత్రం అతను కొనలేదు,+ ఎందుకంటే పూజారులకు ఫరో దగ్గర నుండే సరుకులు వెళ్తూ ఉండేవి, ఫరో ఇచ్చిన సరుకులతోనే వాళ్ల జీవనం సాగేది. అందుకే వాళ్లు తమ భూముల్ని అమ్మలేదు. 23 తర్వాత యోసేపు ప్రజలకు ఇలా చెప్పాడు: “ఇదిగో, ఈ రోజు నేను మిమ్మల్ని, మీ భూముల్ని ఫరో కోసం కొన్నాను. ఇప్పుడు మీకు విత్తనాలు ఇస్తున్నాను, వాటిని మీరు పొలాల్లో విత్తాలి. 24 పంట చేతికి వచ్చినప్పుడు ఐదో వంతును ఫరోకు ఇవ్వండి.+ మిగతా నాలుగు వంతులు మీవే. అవి మళ్లీ పంట పండించడానికి విత్తనాలుగా, అలాగే మీకు, మీ ఇంట్లోవాళ్లకు, మీ పిల్లలకు ఆహారంగా ఉంటాయి.” 25 అందుకు వాళ్లు ఇలా అన్నారు: “నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు.+ ప్రభూ, మా మీద నీ దయ చూపించు, మేము ఫరోకు దాసులమౌతాం.”+ 26 అప్పుడు, ఐదో వంతు ఫరోకు చెందుతుందని యోసేపు ఒక చట్టం జారీచేశాడు. అది నేటికీ ఐగుప్తు దేశమంతటా అమల్లో ఉంది. పూజారుల భూములు మాత్రమే ఫరో సొంతం అవ్వలేదు.+

27 ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలోనే నివసించసాగారు.+ వాళ్లు అక్కడే స్థిరపడి, పిల్లల్ని కని, గొప్ప జనం అయ్యారు.+ 28 యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాక ఇంకా 17 ఏళ్లు బ్రతికాడు. అలా యాకోబు మొత్తం 147 ఏళ్లు బ్రతికాడు.+

29 ఇశ్రాయేలు చనిపోయే సమయం దగ్గర పడుతుండడంతో,+ అతను తన కుమారుడైన యోసేపును పిలిచి ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ దయ నా మీద ఉంటే, దయచేసి నీ చెయ్యి నా తొడ కింద పెట్టి, నా పట్ల విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు.+ 30 నేను చనిపోయినప్పుడు,* నువ్వు నన్ను ఐగుప్తు నుండి తీసుకెళ్లి నా పూర్వీకుల సమాధిలో పాతిపెట్టాలి.”+ అందుకు యోసేపు, “నువ్వు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు. 31 అప్పుడు ఇశ్రాయేలు, “నాకు ఒట్టేయి” అన్నాడు, యోసేపు ఒట్టేశాడు.+ అప్పుడు ఇశ్రాయేలు మంచం తలవైపున వంగి ప్రార్థన చేశాడు.+

48 ఇవి జరిగాక, “మీ నాన్న పరిస్థితి ఏం బాలేదు” అనే వార్త యోసేపుకు అందింది. దాంతో అతను తన ఇద్దరు కుమారుల్ని అంటే మనష్షేను, ఎఫ్రాయిమును+ తీసుకొని అక్కడికి వెళ్లాడు. 2 అప్పుడు ఎవరో యాకోబుకు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడడానికి వచ్చాడు” అని చెప్పారు. దాంతో ఇశ్రాయేలు తన బలాన్నంతా కూడగట్టుకొని లేచి మంచం మీద కూర్చున్నాడు. 3 తర్వాత యాకోబు యోసేపుతో ఇలా అన్నాడు:

“సర్వశక్తిగల దేవుడు కనాను దేశంలోని లూజు దగ్గర నాకు కనిపించి, నన్ను దీవించాడు.+ 4 ఆయన నాతో, ‘నువ్వు పిల్లల్ని కని, ఎక్కువమంది అయ్యేలా చేస్తాను; నిన్ను ఎన్నో గోత్రాలున్న పెద్ద సమూహం అయ్యేలా చేస్తాను.+ నీ తర్వాత నీ సంతానానికి* ఈ దేశాన్ని శాశ్వతమైన ఆస్తిగా ఇస్తాను’ అన్నాడు.+ 5 నేను ఐగుప్తుకు రాకముందు, ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నాకు చెందుతారు.+ రూబేను, షిమ్యోనుల్లా ఎఫ్రాయిము, మనష్షేలు కూడా నా కుమారులు అవుతారు.+ 6 కానీ వాళ్ల తర్వాత నీకు పుట్టే పిల్లలు నీ పిల్లలే అవుతారు. వాళ్లు తమ సహోదరులకు వారసత్వంగా వచ్చే భూమిలో కొంత భాగాన్ని పొందుతారు.+ 7 అయితే నేను పద్దనరాము* నుండి వస్తూ కనాను దేశంలో ఎఫ్రాత్‌కు+ కొంతదూరంలో ఉన్నప్పుడు మీ అమ్మ రాహేలు నా కళ్లముందే చనిపోయింది.+ కాబట్టి నేను ఆమెను అక్కడే ఎఫ్రాత్‌కు వెళ్లే దారిలో, అంటే బేత్లెహేముకు+ వెళ్లే దారిలో పాతిపెట్టాను.”

8 తర్వాత ఇశ్రాయేలు యోసేపు కుమారుల్ని చూసి, “వీళ్లు ఎవరు?” అని అడిగాడు. 9 అందుకు యోసేపు, “వీళ్లు ఈ దేశంలో దేవుడు నాకు అనుగ్రహించిన కుమారులు”+ అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు, “⁠దయచేసి వాళ్లను నా దగ్గరికి తీసుకురా, నేను వాళ్లను దీవించాలి” అన్నాడు.+ 10 వృద్ధాప్యం కారణంగా ఇశ్రాయేలుకు కంటిచూపు తగ్గిపోవడంతో అతను చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు వాళ్లను ఇశ్రాయేలుకు దగ్గరగా తీసుకొచ్చాడు. అప్పుడు అతను వాళ్లను ముద్దుపెట్టుకొని కౌగిలించుకున్నాడు. 11 ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “నేను మళ్లీ నీ ముఖం చూస్తానని అనుకోలేదు,+ కానీ దేవుడు నీ సంతానాన్ని* కూడా చూసే అవకాశం నాకు ఇచ్చాడు.” 12 యోసేపు వాళ్లను ఇశ్రాయేలు మోకాళ్ల దగ్గర నుండి పక్కకు తీసి, నేలకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు.

13 తర్వాత యోసేపు తన కుడిచేతితో ఎఫ్రాయిమును,+ ఎడమచేతితో మనష్షేను+ తీసుకొచ్చి ఇశ్రాయేలు ఎడమపక్కన ఎఫ్రాయిమును, కుడిపక్కన మనష్షేను నిలబెట్టాడు. 14 అయితే ఇశ్రాయేలు మాత్రం ఎఫ్రాయిము చిన్నవాడే అయినా తన కుడిచేతిని చాపి అతని తలమీద పెట్టాడు, తన ఎడమచేతిని మనష్షే తలమీద పెట్టాడు. మనష్షే పెద్దవాడని+ తెలిసినా, ఇశ్రాయేలు కావాలనే అలా పెట్టాడు. 15 తర్వాత అతను యోసేపును దీవిస్తూ ఇలా అన్నాడు:+

“నా తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకులు ఆరాధించిన సత్యదేవుడు,+

ఈ రోజు వరకు నా జీవిత కాలమంతట్లో నన్ను కాచికాపాడిన సత్యదేవుడు,+

16 కష్టాలన్నిటి నుండి నన్ను గట్టెక్కిస్తూ వచ్చిన దేవదూత+ ఈ అబ్బాయిల్ని దీవించాలి.+

వీళ్లు నా పేరుతో, నా తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకుల పేర్లతో పిలవబడాలి.

వీళ్లు భూమ్మీద పెద్ద జనం అవ్వాలి.”+

17 తన తండ్రి ఇశ్రాయేలు తన కుడిచేతిని ఎఫ్రాయిము మీద పెట్టడం చూసినప్పుడు, అది యోసేపుకు నచ్చలేదు. దాంతో అతను తన తండ్రి చేతిని ఎఫ్రాయిము తలమీద నుండి తీసి మనష్షే తలమీద పెట్టడానికి ప్రయత్నించాడు. 18 అతను తన తండ్రితో “అలాకాదు నాన్న, ఇదిగో ఇతను పెద్దవాడు.+ నీ కుడిచేతిని ఇతని తలమీద పెట్టు” అన్నాడు. 19 కానీ అతని తండ్రి దానికి ఒప్పుకోకుండా ఇలా అన్నాడు: “నాకు తెలుసు బాబూ, నాకు తెలుసు. ఇతను కూడా ఒక జనం అవుతాడు, ఇతను కూడా గొప్పవాడు అవుతాడు. కానీ, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అవుతాడు,+ అతని సంతానం* పెద్ద జనసమూహాలతో సమానమౌతుంది.”+ 20 కాబట్టి ఇశ్రాయేలు ఆ రోజు వాళ్లను ఇంకా దీవిస్తూ+ ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలు ప్రజలు దీవిస్తున్నప్పుడు ఇలా మీ పేర్లు ప్రస్తావిస్తూ దీవించాలి:

‘దేవుడు నిన్ను ఎఫ్రాయిములా, మనష్షేలా చేయాలి.’ ”

అలా ఇశ్రాయేలు ఎఫ్రాయిమును మనష్షే కన్నా పైస్థానంలో ఉంచాడు.

21 తర్వాత ఇశ్రాయేలు యోసేపుతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను చనిపోతున్నాను.+ కానీ దేవుడు ఖచ్చితంగా ఇకమీదట కూడా నీకు తోడుగా ఉంటాడు, నిన్ను తిరిగి నీ పూర్వీకుల దేశానికి తీసుకెళ్తాడు.+ 22 నేనైతే నీకు నీ సహోదరుల కన్నా ఒక వంతు భూమి ఎక్కువ ఇస్తాను. నేను ఆ భూమిని నా కత్తితో, నా విల్లుతో అమోరీయుల్ని జయించి వాళ్ల దగ్గర నుండి తీసుకున్నాను.”

49 తర్వాత యాకోబు తన కుమారుల్ని పిలిచి ఇలా అన్నాడు: “అందరూ నా దగ్గరికి రండి. చివరి రోజుల్లో మీకు ఏమి జరుగుతుందో చెప్తాను. 2 యాకోబు కుమారులారా, మీరంతా ఒక చోటికి వచ్చి మీ తండ్రి ఇశ్రాయేలు చెప్పే మాటలు వినండి.

3 “రూబేనూ,+ నువ్వు నా పెద్ద కుమారుడివి.+ నువ్వు నా బలానివి, నా శక్తికి* ప్రథమఫలానివి, అందరికన్నా ఎక్కువ గౌరవాన్ని, బలాన్ని పొందినవాడివి. 4 కానీ నువ్వు ఉధృతమైన ప్రవాహంలా అదుపులేకుండా ప్రవర్తించావు, కాబట్టి నువ్వు వర్ధిల్లవు. నువ్వు నీ తండ్రి పరుపు మీదికి ఎక్కావు.+ ఆ సమయంలో నువ్వు నా పరుపును అపవిత్రం చేశావు. అతను నిజంగా దాని మీదికి ఎక్కాడు!

5 “షిమ్యోను, లేవి అన్నదమ్ములు.+ వాళ్ల ఖడ్గాలు హింసాయుధాలు.+ 6 నా ప్రాణమా,* వాళ్లతో సహవాసం చేయకు. నా వైభవమా,* వాళ్ల గుంపులో చేరకు. ఎందుకంటే కోపంతో వాళ్లు మనుషుల్ని చంపారు,+ సరదా కోసం ఎద్దుల గుదికాలి నరం తెగగొట్టారు. 7 వాళ్ల కోపం శపించబడాలి, అది క్రూరమైనది. వాళ్ల ఆగ్రహం శపించబడాలి, అది కఠినమైనది.+ యాకోబు దేశంలో వాళ్లను చెదరగొడతాను, ఇశ్రాయేలు దేశంలో వాళ్లను చెల్లాచెదురు చేస్తాను.+

8 “యూదా,+ నీ సహోదరులు నిన్ను ఘనపరుస్తారు.+ నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.+ నీ తండ్రి కుమారులు నీకు వంగి నమస్కారం చేస్తారు.+ 9 యూదా ఒక సింహం పిల్ల.+ నా కుమారుడా, నువ్వు వేటాడిన జంతువును తప్పకుండా పట్టుకొని వస్తావు. అతను పొంచివున్న సింహంలా నేలమీద చాచుకొని పడుకున్నాడు. సింహంలాంటి అతన్ని లేపడానికి ఎవరు సాహసించగలరు? 10 షిలోహు* వచ్చేవరకు+ యూదా దగ్గర నుండి రాజదండం తొలగిపోదు,+ అతని కాళ్ల మధ్య నుండి అధికార దండం తొలగిపోదు. జనాల విధేయత అతనికే చెందుతుంది.+ 11 అతను తన గాడిదను ద్రాక్షచెట్టుకు, తన గాడిద పిల్లను శ్రేష్ఠమైన ద్రాక్షచెట్టుకు కట్టి ద్రాక్షారసంలో తన బట్టల్ని, ద్రాక్షల రక్తంలో తన వస్త్రాన్ని ఉతుక్కుంటాడు. 12 ద్రాక్షారసం వల్ల అతని కళ్లు చాలా ఎర్రగా ఉన్నాయి, పాల వల్ల అతని పళ్లు తెల్లగా ఉన్నాయి.

13 “జెబూలూను+ సముద్రతీరాన ఓడలు లంగరు వేసివున్న చోట నివసిస్తాడు.+ అతని సరిహద్దు సీదోను వరకు ఉంటుంది.+

14 “ఇశ్శాఖారు+ రెండు జీనుసంచుల మధ్య పడుకొని ఉన్న బలమైన గాడిదలాంటివాడు. 15 అతను విశ్రాంతి చోటు చక్కగా ఉందని, నేల రమ్యంగా ఉందని చూస్తాడు. అతను బరువు మోయడానికి తన భుజం వంచి, వెట్టిచాకిరి చేసే దాసుడౌతాడు.

16 “దాను+ ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా ఉండి తన ప్రజలకు తీర్పుతీరుస్తాడు.+ 17 దాను దారిపక్కన ఉండే పాములా, అలాగే గుర్రం మడిమెల్ని కాటువేసి దాని రౌతును వెనక్కి పడిపోయేట్టు చేసే కొమ్ములుగల పాములా ఉంటాడు.+ 18 యెహోవా, నువ్విచ్చే రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను.

19 “గాదు+ విషయానికొస్తే, దోపిడీ ముఠా అతని మీద దాడి చేస్తుంది, కానీ అతను వాళ్లమీద ఎదురుదాడి చేసి వాళ్లను తరిమికొడతాడు.+

20 “ఆషేరు+ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అతను రాజుకు తగిన ఆహారాన్ని అందజేస్తాడు.+

21 “నఫ్తాలి+ వేగంగా పరుగెత్తే లేడి. అతను వినసొంపుగా ఉండే మాటలు మాట్లాడుతున్నాడు.+

22 “యోసేపు+ ఫలవంతమైన చెట్టు రెమ్మ. అతను నీళ్ల ఊట పక్కన ఉండే ఫలవంతమైన చెట్టు రెమ్మ, ఆ చెట్టు కొమ్మలు గోడ మీదుగా వ్యాపిస్తాయి. 23 అయితే విలుకాండ్రు అతన్ని వేధిస్తూ వచ్చారు, అతని మీద బాణాలు వేశారు, అతని మీద ద్వేషం పెంచుకుంటూ వచ్చారు.+ 24 కానీ అతని విల్లు స్థిరంగా ఉంది,+ అతని చేతులు బలంగా, చురుగ్గా ఉన్నాయి.+ యాకోబు శక్తిమంతుని వల్ల, ఇశ్రాయేలుకు కాపరిగా, ఆధారశిలగా* ఉన్న వ్యక్తి వల్ల ఇది జరిగింది. 25 అతను* తన తండ్రి ఆరాధించిన దేవుడు ఇచ్చిన బహుమానం. దేవుడు అతనికి సహాయం చేస్తాడు. అతను సర్వశక్తిమంతుడితో ఉన్నాడు. ఆయన ఆకాశ దీవెనలతో, అగాధ జలాల దీవెనలతో,+ స్తనముల-గర్భముల దీవెనలతో అతన్ని దీవిస్తాడు. 26 అతని తండ్రి దీవెనలు శాశ్వతకాలం ఉండే పర్వతాల దీవెనల కన్నా, ఎల్లకాలం నిలిచే కొండల మధ్య దొరికే శ్రేష్ఠమైన వాటికన్నా గొప్పగా ఉంటాయి.+ ఆ దీవెనలు యోసేపు తల మీద అలాగే నిలిచివుంటాయి, తన సహోదరుల నుండి వేరుచేయబడిన అతని నడినెత్తి మీద అలాగే నిలిచివుంటాయి.+

27 “బెన్యామీను+ తోడేలులా చీల్చివేస్తూనే ఉంటాడు.+ ఉదయం అతను వేటాడిన జంతువును తింటాడు, సాయంకాలం దోపుడుసొమ్మును పంచుకుంటాడు.”+

28 వీళ్ల నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి; వాళ్ల నాన్న వాళ్లను దీవిస్తున్నప్పుడు అన్న మాటలు అవి. అతను వాళ్లలో ప్రతీ ఒక్కరికి తగిన దీవెనను ఇచ్చాడు.+

29 తర్వాత అతను వాళ్లకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “నేను నా ప్రజల దగ్గరికి చేర్చబడుతున్నాను.*+ నన్ను హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలో ఉన్న గుహలో+ నా తండ్రుల దగ్గర పాతిపెట్టండి. 30 ఆ గుహ కనాను దేశంలో మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా పొలంలో ఉంది. అబ్రాహాము ఆ పొలాన్ని సమాధుల స్థలం కోసం హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర కొన్నాడు. 31 అబ్రాహామును, అతని భార్య శారాను అక్కడే పాతిపెట్టారు.+ ఇస్సాకును, అతని భార్య రిబ్కాను కూడా అక్కడే పాతిపెట్టారు.+ నేను కూడా లేయాను అక్కడే పాతిపెట్టాను. 32 అబ్రాహాము ఆ పొలాన్ని, అందులోని గుహను హేతు కుమారుల దగ్గర కొన్నాడు.”+

33 అలా యాకోబు తన కుమారులకు నిర్దేశాలు ఇవ్వడం పూర్తయ్యాక, మంచం మీద పడుకొని తుదిశ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరికి చేర్చబడ్డాడు.*+

50 తర్వాత యోసేపు తన తండ్రి మీద పడి,+ ఏడ్చి, అతన్ని ముద్దుపెట్టుకున్నాడు. 2 తర్వాత అతను, సుగంధ తైలాలతో తన తండ్రి మృతదేహాన్ని సిద్ధం చేయమని*+ వైద్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్లు అతను చెప్పినట్టే ఇశ్రాయేలు మృతదేహాన్ని సిద్ధం చేశారు. 3 అలా సిద్ధం చేయాలంటే మొత్తం 40 రోజుల సమయం కావాలి, కాబట్టి వాళ్లు ఇశ్రాయేలు విషయంలో కూడా 40 రోజులు తీసుకున్నారు. ఐగుప్తీయులు 70 రోజులపాటు అతని గురించి ఏడుస్తూనే ఉన్నారు.

4 ఇశ్రాయేలు గురించి దుఃఖపడే రోజులు ముగిశాక, యోసేపు ఫరో కింద పనిచేసే అధికారులతో* ఇలా అన్నాడు: “మీ దయ నా మీద ఉంటే, ఫరోకు ఈ వార్త అందజేయండి: 5 ‘నా తండ్రి నాతో ఒట్టు వేయించుకుంటూ,+ “ఇదిగో, నేను చనిపోతున్నాను.+ కనాను దేశంలో నేను తొలిపించుకున్న సమాధిలో+ నువ్వు నన్ను పాతిపెట్టాలి”+ అన్నాడు. కాబట్టి దయచేసి, వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుకోనివ్వు. ఆ తర్వాత నేను తిరిగొస్తాను.’ ” 6 అందుకు ఫరో, “వెళ్లి, నీ తండ్రి నీతో ఒట్టు వేయించుకున్న ప్రకారమే అతన్ని పాతిపెట్టు”+ అన్నాడు.

7 అప్పుడు యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి బయల్దేరాడు. అతనితో పాటు ఫరో సేవకులందరూ అంటే ఫరో దర్బారులో ఉండే పెద్దలు,+ ఐగుప్తు దేశంలోని పెద్దలందరూ బయల్దేరారు. 8 అంతేకాదు యోసేపు ఇంటివాళ్లందరు, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటివాళ్లు+ కూడా బయల్దేరారు. వాళ్లు తమ చిన్నపిల్లల్ని, మందల్ని, పశువుల్ని మాత్రం గోషెనులోనే ఉంచి వెళ్లారు. 9 రథాలు,+ గుర్రపురౌతులు కూడా అతనితోపాటు వెళ్లడంతో, ఒక పెద్ద సమూహం తయారైంది. 10 తర్వాత వాళ్లు యొర్దాను ప్రాంతంలో ఉన్న ఆఠదు కళ్లం* దగ్గరికి వచ్చారు. అక్కడ వాళ్లు చాలా బిగ్గరగా, తీవ్రంగా ఏడ్చారు. యోసేపు తన తండ్రి గురించి ఏడురోజుల పాటు దుఃఖిస్తూనే ఉన్నాడు. 11 ఆ దేశ ప్రజలు అంటే కనానీయులు ఆఠదు కళ్లం దగ్గర వాళ్లు ఏడ్వడం చూసి, “ఇది ఐగుప్తీయులకు గొప్ప విలాపం!” అన్నారు. అందుకే యొర్దాను ప్రాంతంలోని ఆ చోటుకు ఆబేల్‌-మిస్రాయిము* అని  పేరు పెట్టారు.

12 అలా యాకోబు కుమారులు, సరిగ్గా అతను చెప్పినట్టే చేశారు.+ 13 వాళ్లు అతన్ని కనాను దేశానికి తీసుకెళ్లి, మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా పొలంలోని గుహలో పాతిపెట్టారు. అబ్రాహాము ఆ పొలాన్ని సమాధుల స్థలం కోసం హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర ఆస్తిగా కొన్నాడు.+ 14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత తన సహోదరులతో, అలాగే తన తండ్రిని సమాధి చేయడానికి తనతోపాటు వచ్చిన వాళ్లందరితో కలిసి ఐగుప్తుకు తిరిగొచ్చాడు.

15 యోసేపు సహోదరులు తమ తండ్రి చనిపోవడం చూసి, “యోసేపు మనమీద పగ పెట్టుకున్నాడేమో, మనం అతనికి చేసిన కీడంతటికీ ఇప్పుడు ప్రతికీడు చేస్తాడేమో” అనుకున్నారు.+ 16 కాబట్టి వాళ్లు యోసేపుకు ఇలా కబురు పంపారు: “నీ తండ్రి చనిపోకముందు మాకు ఇలా ఆజ్ఞాపించాడు: 17 ‘మీరు యోసేపుతో ఇలా చెప్పాలి: “దయచేసి, నీ సహోదరులు చేసిన తప్పును మన్నించమని, నీకు అలాంటి హాని తలపెట్టి వాళ్లు చేసిన పాపాన్ని క్షమించమని నిన్ను బ్రతిమాలుతున్నాను.” ’ కాబట్టి ఇప్పుడు దయచేసి, నీ తండ్రి ఆరాధించిన దేవుని సేవకులమైన మా తప్పును క్షమించు.” వాళ్ల మాటలు విన్నప్పుడు యోసేపు ఏడ్చాడు. 18 తర్వాత అతని సహోదరులే స్వయంగా వచ్చి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, “ఇదిగో, మేము నీ దాసులం!” అన్నారు.+ 19 అప్పుడు యోసేపు వాళ్లతో ఇలా అన్నాడు: “భయపడకండి. నేనేమైనా దేవుని స్థానంలో ఉన్నానా? 20 మీరు నాకు హాని చేయాలనుకున్నా+ దేవుడు ఆ పరిస్థితిని మలుపు తిప్పి, నేడు మీరు చూస్తున్నట్టు మంచి జరిగేలా, అనేకమంది ప్రాణాలు కాపాడబడేలా చేశాడు.+ 21 కాబట్టి భయపడకండి. నేను మిమ్మల్ని, మీ చిన్నపిల్లల్ని పోషిస్తూనే ఉంటాను.”+ అలా అతను వాళ్లను ఓదార్చి, వాళ్లకు ధైర్యం చెప్పాడు.

22 యోసేపు, అతని తండ్రి ఇంటివాళ్లు ఐగుప్తులోనే నివసిస్తూ ఉన్నారు. యోసేపు మొత్తం 110 ఏళ్లు బ్రతికాడు. 23 యోసేపు ఎఫ్రాయిము కుమారుల మూడో తరం+ వరకు చూశాడు. అలాగే మనష్షే కుమారుడైన మాకీరు+ కుమారుల్ని కూడా చూశాడు. యోసేపు వాళ్లను తన సొంత కుమారుల్లా చూసుకున్నాడు.* 24 చాలాకాలం తర్వాత యోసేపు తన సహోదరులతో ఇలా అన్నాడు: “నేను చనిపోతున్నాను, కానీ దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు.+ మిమ్మల్ని తప్పకుండా ఈ దేశం నుండి బయటికి తీసుకొచ్చి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకెళ్తాడు.”+ 25 కాబట్టి యోసేపు ఇశ్రాయేలు కుమారులతో ఇలా ఒట్టు వేయించుకున్నాడు: “దేవుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుచేసుకుంటాడు. అప్పుడు మీరు నా ఎముకల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలి.”+ 26 యోసేపు 110 ఏళ్ల వయసులో చనిపోయాడు. వాళ్లు అతని మృతదేహాన్ని సుగంధ తైలాలతో సిద్ధం చేయించి,+ ఐగుప్తు దేశంలో ఒక శవపేటికలో పెట్టారు.

అంటే, నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రవీధులు మొదలైనవి ఉన్న విశ్వం.

లేదా “పొంగిపొర్లుతున్న జలాల్ని.”

లేదా “దేవుని పవిత్రశక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

పదకోశంలో “ప్రాణం” చూడండి.

లేదా “కదిలే జంతువుల్ని.” వీటిలో సరీసృపాలు, పైన పేర్కొన్న జంతువులకు భిన్నమైన జంతువులు ఉన్నాయని తెలుస్తోంది.

అక్ష., “వాటి సైన్యమంతటినీ.”

ఇక్కడ, దేవుని సొంత పేరైన יהוה (YHWH) మొట్టమొదటిసారి కనిపిస్తుంది. ఈ పేరు ఆయన్ని వేరే దేవుళ్లందరి నుండి ప్రత్యేకపరుస్తుంది. అనుబంధం A4 చూడండి.

ఇది ఆరు సృష్టి రోజుల కాలమంతటినీ సూచిస్తోంది.

లేదా “ఊపిరిని; శ్వాసను.”

లేదా “జీవించే ప్రాణి.” హీబ్రూలో నెఫెష్‌. దీనికి అక్షరార్థంగా, “ఊపిరి తీసుకునే ప్రాణి” అని అర్థం. పదకోశంలో “ప్రాణం” చూడండి.

లేదా “జ్ఞానాన్నిచ్చే.”

లేదా “టైగ్రిస్‌.”

లేదా “జ్ఞానాన్నిచ్చే.”

లేదా “భార్యతోనే ఉండిపోతాడు.”

లేదా “తెలివిగలది; జిత్తులమారి.”

అంటే, సాయంత్రం కావస్తుండగా.

అక్ష., “దేవుని ముఖానికి.”

అక్ష., “విత్తనానికీ.”

అక్ష., “విత్తనానికీ.”

“మట్టిమనిషి; మానవజాతి” అని అర్థం.

“జీవిస్తున్న వ్యక్తి” అని అర్థం.

అక్ష., “మనలో ఒకడిలా.”

అక్ష., “సారాన్ని; శక్తిని.”

“దేశదిమ్మరిగా ఉండే స్థితి” అని అర్థం.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అంటే, ఫ్లూటు.

“నియమించబడిన; ఇవ్వబడిన” అని అర్థం.

లేదా “సంతానాన్ని.” అక్ష., “విత్తనాన్ని.”

లేదా “ఆదాము; మానవజాతి.”

పదకోశం చూడండి.

బహుశా “విశ్రాంతి; ఊరట” అని అర్థం.

లేదా “ఉపశమనాన్ని.”

లేదా “దేవదూతలు.”

లేదా “నా చురుకైన శక్తి.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “వాళ్లు శరీర ప్రకారం ప్రవర్తిస్తారు.”

బహుశా “పడేసేవాళ్లు” అనే అర్థం ఉండవచ్చు. అంటే, ఇతరుల్ని కిందపడేలా చేసేవాళ్లు అని అర్థం. పదకోశం చూడండి.

లేదా “దుఃఖపడ్డాడు.”

అక్ష., “తరాల్లో.”

లేదా “నిందలేని.”

అక్ష., “పెద్దపెట్టె.”

లేదా “కీలు, మక్కు.”

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

హీబ్రూలో సోహర్‌. సోహర్‌ అనేది వెలుగు వచ్చే ఒక రంధ్రాన్నో, కిటికీనో కాదుగానీ ఒక మూర వాలుగా ఉండే పైకప్పును సూచిస్తుందని కొందరు అంటారు.

లేదా “జీవశక్తి గల.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “నిబంధనను.”

లేదా “ఏడు జతల” అయ్యుంటుంది.

లేదా “ఏడు జతల” అయ్యుంటుంది.

లేదా “ప్రవాహ ద్వారాలు.”

లేదా “జీవశక్తి గల.” పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

లేదా “ముక్కు రంధ్రాల్లో జీవశక్తికి సంబంధించిన ఊపిరిగల.”

లేదా “ప్రవాహ ద్వారాలు.”

లేదా “దాని కాలు మోపడానికి.”

లేదా “శాంతపర్చే.”

లేదా “అధికారం కింద ఉంచబడ్డాయి.”

పదకోశం చూడండి.

లేదా “సూచన.”

అక్ష., “దాసాను దాసుడు.”

లేదా “తీరప్రాంతాల్లో.”

అంటే, బబులోను.

అక్ష., “ఇదే ఆ గొప్ప నగరం.” బహుశా, ఇది నీనెవెను, మిగతా మూడు నగరాల్ని కలిపి సూచిస్తుంది.

లేదా “అన్న” అయ్యుంటుంది.

“విభజన” అని అర్థం.

అక్ష., “భూమి విభజించబడింది.”

లేదా “బంకమన్నుకు; బురదకు.”

లేదా “కీలును; మక్కును.”

లేదా “అవధానాన్ని ఇచ్చాడు.”

అంటే, బబులోను. “తారుమారు” అని అర్థం.

లేదా “దీవెన సంపాదించుకుంటాయి.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

అక్ష., “విత్తనానికి.”

లేదా “పరదేశిగా.”

లేదా “ఈజిప్టు.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “దేశం పొడవు, వెడల్పు.”

అంటే, మృత సముద్రం.

ఇక్కడ “వీళ్లు” అనే మాట 2వ వచనంలో ప్రస్తావించిన ఐదుగురు రాజుల్ని సూచిస్తుండవచ్చు.

పదకోశం చూడండి.

లేదా “డేరాల్లో నివసిస్తున్నాడు.”

అక్ష., “సహోదరుణ్ణి.”

అక్ష., “యెహోవా వాక్యం.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “కుమారుడు.”

అక్ష., “విత్తనం.”

లేదా “లెక్కించాడు.”

అక్ష., “విత్తనం.”

లేదా “కాగడా.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “నా సేవకురాలితో లైంగిక సంబంధం పెట్టుకో.”

అక్ష., “విత్తనాన్ని.”

“దేవుడు వింటాడు” అని అర్థం.

ఇది బహుశా స్వతంత్ర వైఖరిని సూచిస్తుంది.

లేదా “తన సహోదరులందరితో విరోధం కలిగివుండి” అయ్యుంటుంది.

“నన్ను చూసే సజీవుడైనవాడి బావి” అని అర్థం.

లేదా “దోషంలేని.”

“తండ్రి ఉన్నతుడు (ఘనపర్చబడ్డాడు)” అని అర్థం.

“ఒక జనానికి (సమూహానికి) తండ్రి; అనేకులకు తండ్రి” అని అర్థం.

అక్ష., “విత్తనంతో.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “విత్తనం.”

అంటే, పురుషాంగం ముందు భాగంలో ఉండే చర్మం.

అక్ష., “విత్తనం.”

లేదా “చంపబడాలి.”

బహుశా “కయ్యాలమారి” అనే అర్థం ఉండవచ్చు.

“రాకుమారి” అని అర్థం.

“నవ్వు” అని అర్థం.

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “మీ హృదయాన్ని బలపర్చుకొని.”

అక్ష., “సీయ కొలతల.” అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో (దాదాపు 10 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.

అంటే, ఆమెకు రుతుస్రావం ఆగిపోయింది.

లేదా “దీవెన సంపాదించుకుంటారు.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

అక్ష., “తెలుసుకున్నాను.”

లేదా “విశ్వసనీయ ప్రేమ.”

లేదా “నా ప్రాణాలు దక్కుతాయి.”

“చిన్న” అని అర్థం.

లేదా “బట్టీ.” ఇటుకలు, మట్టి పాత్రలు కాల్చడానికి ఉపయోగించే ఒక రకమైన పొయ్యి.

లేదా “పరదేశిగా నివసిస్తున్నప్పుడు.”

అంటే, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోలేదు.

లేదా “నీతిమంతులైన.”

లేదా “అబీమెలెకు ఇంట్లో ఉన్న స్త్రీలందరి గర్భాల్ని పూర్తిగా మూసేశాడు.”

లేదా “నన్ను చూసి నవ్వుతారు” అయ్యుంటుంది.

అక్ష., “విత్తనం.”

అక్ష., “విత్తనమే.”

“ప్రమాణపు బావి” లేదా “ఏడిటి బావి” అని అర్థం అయ్యుంటుంది.

అక్ష., “చాలా రోజులు.”

లేదా “పరదేశిగా నివసించాడు.”

ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపుమీద వేసేది.

లేదా “వధించే కత్తిని.”

లేదా “వధించే కత్తి.”

“యెహోవా ఇస్తాడు; యెహోవా చూసుకుంటాడు” అని అర్థం.

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “విత్తనం.”

దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

లేదా “నువ్వు మా మధ్య గొప్ప ప్రధానుడివి” అయ్యుంటుంది.

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

అక్ష., “విత్తనానికి.”

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.

ఇది బహుశా లాబానును సూచిస్తుంది.

లేదా “మనవరాల్ని.”

అక్ష., “కుడివైపు వెళ్లాలో, ఎడమవైపు వెళ్లాలో.”

అంటే, చిన్నప్పుడు దాదిగా ఉండి, ఇప్పుడు ఆమె సేవకురాలిగా ఉన్న స్త్రీ.

అక్ష., “విత్తనం.”

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

లేదా “ప్రాకారాలుగల శిబిరాల.”

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

లేదా “తన సహోదరులందరితో విరోధం కలిగివుండి” అయ్యుంటుంది.

“వెంట్రుకలతో నిండిన” అని అర్థం.

“మడిమెను పట్టుకునేవాడు; ఇంకొకరి స్థానాన్ని లాక్కునేవాడు” అని అర్థం.

లేదా “ఆకలితో చచ్చిపోతున్నాను.”

“ఎర్రని” అని అర్థం.

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనం.”

దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

లేదా “రిబ్కాను కౌగిలించుకోవడం.”

లేదా “వాగు దగ్గర.”

లేదా “వాగు దగ్గర.”

“గొడవ” అని అర్థం.

“నిందారోపణ” అని అర్థం.

“విశాలమైన స్థలాలు” అని అర్థం.

అక్ష., “విత్తనాన్ని.”

“మడిమెను పట్టుకునేవాడు; ఇంకొకరి స్థానాన్ని లాక్కునేవాడు” అని అర్థం.

లేదా “నిన్ను చంపాలని ఆలోచిస్తూ తనను తాను సముదాయించుకుంటున్నాడు.”

అక్ష., “అమ్మవాళ్ల నాన్న.”

అక్ష., “విత్తనానికి.”

లేదా “మెట్ల వరుస.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “విత్తనం.”

అక్ష., “విత్తనం.”

లేదా “దీవెన సంపాదించుకుంటాయి.” దానికోసం కష్టపడాల్సి ఉంటుందని ఇది సూచిస్తుండవచ్చు.

“దేవుని ఇల్లు” అని అర్థం.

అక్ష., “సహోదరుణ్ణని.”

అక్ష., “నా ఎముకవి, నా మాంసానివి.”

అక్ష., “సహోదరుడివి.”

లేదా “లైంగిక సంబంధం పెట్టుకోవాలి.”

లేదా “లైంగిక సంబంధం పెట్టుకోవాలని.”

లేదా “లైంగిక సంబంధం పెట్టుకున్నాడు.”

అక్ష., “ద్వేషిస్తున్నాడని.”

అక్ష., “ఆమె గర్భాన్ని తెరిచాడు.”

“ఇదిగో, ఒక కుమారుడు!” అని అర్థం.

“వినడం” అని అర్థం.

“అంటిపెట్టుకొని ఉండడం; అంటిపెట్టుకున్న” అని అర్థం.

“స్తుతించబడిన; స్తుతిని పొందే” అని అర్థం.

లేదా “గర్భఫలం లేకుండా.”

అక్ష., “నా మోకాళ్ల మీద.”

“న్యాయమూర్తి” అని అర్థం.

“నా కుస్తీపట్లు” అని అర్థం.

“భాగ్యం” అని అర్థం.

“సంతోషంగా ఉండడం; సంతోషం” అని అర్థం.

లేదా “కూలివాడి జీతం.”

“ఇతనే జీతం” అని అర్థం.

“సహించడం” అని అర్థం.

అక్ష., “ఆమె గర్భాన్ని తెరిచాడు.”

ఇది యోసిఫియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీనికి “‘యా’ కలుపును (పెంచును) గాక!” అని అర్థం. “యా” అనేది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.

లేదా “రుజువులు.”

అంటే, బ్రౌన్‌.

లేదా “నిజాయితీ.”

అక్ష., “అభిషేకించావు.”

అంటే, యూఫ్రటీసు.

అంటే, గిలకల తప్పెట.

ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.

అక్ష., “కుమారుల్ని.”

లేదా “రుతుస్రావ సమయంలో.”

“సాక్ష్యపు కుప్ప” అనే అర్థమున్న అరామిక్‌ పదం.

“సాక్ష్యపు కుప్ప” అనే అర్థమున్న హీబ్రూ పదం.

అక్ష., “కుమారుల్ని.”

“రెండు శిబిరాలు” అని అర్థం.

లేదా “పరదేశిగా నివసించాను.”

అక్ష., “విత్తనాన్ని.”

అంటే, నదిని నడుస్తూ దాటగలిగేలా లోతు తక్కువ ఉన్న ప్రదేశం.

మానవ శరీరం ధరించిన దేవదూతను సూచిస్తోంది.

“దేవునితో పోరాడేవాడు (పట్టువదలనివాడు)” లేదా “దేవుడు పోరాడతాడు” అని అర్థం.

“దేవుని ముఖం” అని అర్థం.

లేదా “పెనీయేలు.”

“పర్ణశాలలు; ఆశ్రయాలు” అని అర్థం.

లేదా “అమ్మాయిల్ని చూడడానికి.”

లేదా “ఆమె మనసు గెలుచుకునేలా.”

లేదా “కన్యాశుల్కం.”

లేదా “మార్గంలో.”

లేదా “దాచిపెట్టాడు.”

“బేతేలు దేవుడు” అని అర్థం.

“ఏడ్పు సింధూర చెట్టు” అని అర్థం.

అక్ష., “నీ గర్భవాసం.”

అక్ష., “విత్తనానికి.”

“నా దుఃఖ పుత్రుడు” అని అర్థం.

“కుడిచేతి పుత్రుడు” అని అర్థం.

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

లేదా “పరదేశులుగా నివసిస్తున్న.”

అక్ష., “కుమారులు.”

అక్ష., “కుమారులు.”

షేక్‌ అంటే గోత్రపు పెద్ద.

అక్ష., “కుమారులు.”

అక్ష., “కుమారులు.”

అక్ష., “ఇశ్రాయేలు కుమారుల్ని.”

లేదా “ఒక అందమైన పొడవాటి వస్త్రం.”

లేదా “ధాన్యపు వెన్నుల కట్టల్ని.”

అక్ష., “అతని రక్తాన్ని.”

అక్ష., “మాంసం.”

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

అంటే, యూదా.

లేదా “కజీబులో.”

లేదా “ఆలయ వేశ్య.”

లేదా “ఆలయ వేశ్యలు.”

లేదా “ఆలయ వేశ్యలు.”

“చీలిక” అని అర్థం. బహుశా మూలాధారానికి సంబంధించిన చీలికను సూచిస్తుంది.

లేదా “పానీయాలు అందించేవాడు.”

ఇతను రొట్టెలు, పిండివంటలు చేసేవాడు.

అక్ష., “కొన్ని రోజుల.”

అక్ష., “నీ తలను పైకెత్తి.”

అక్ష., “బావిలో; గుంటలో.”

అక్ష., “తల పైకెత్తాడు.”

అక్ష., “బావిలో; గుంటలో.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “సింహాసనం.”

ఇది గౌరవాన్ని, ఘనతను ఇవ్వాలని సూచించే పదం అని తెలుస్తోంది.

అక్ష., “తన చేతినైనా, కాలునైనా ఎత్తకూడదు.”

అంటే, హీలియోపొలిస్‌.

లేదా “దేశమంతటా ప్రయాణించడం.”

లేదా “ఫరోకు సేవచేయడం మొదలుపెట్టినప్పుడు.”

అంటే, హీలియోపొలిస్‌.

“మర్చిపోయేలా చేసేవాడు” అని అర్థం.

లేదా “దేవుడు నేను ఫలించేలా చేశాడు.”

“రెండింతలు ఫలించడం” అని అర్థం.

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

అక్ష., “వాళ్లను.”

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.

లేదా “దేశంలో.”

అక్ష., “శేషం.”

అక్ష., “ఫరోకు తండ్రిగా.”

అక్ష., “మెడ మీద పడి.”

అక్ష., “కొవ్వినదాన్ని.”

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.

లేదా “తన వాళ్లందర్నీ.”

అక్ష., “ఇశ్రాయేలును.”

అక్ష., “కుమారులు.”

అంటే, హీలియోపొలిస్‌.

అక్ష., “కుమారులు.”

అక్ష., “అతని మెడ మీద పడి.”

అక్ష., “నా తండ్రులతో నిద్రించినప్పుడు.”

అక్ష., “విత్తనానికి.”

అక్ష., “పద్దన్‌.”

అక్ష., “విత్తనాన్ని.”

అక్ష., “విత్తనం.”

లేదా “పిల్లల్ని కనే శక్తికి.”

పదకోశం చూడండి.

లేదా “స్వభావమా” అయ్యుంటుంది.

“అది ఎవరిదో ఆయన; అది ఎవరికి చెందుతుందో ఆయన” అని అర్థం.

అక్ష., “రాయిగా.”

అంటే, యోసేపు.

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

మరణాన్ని కావ్యరూపంలో ఇలా వర్ణించారు.

మృతదేహం కుళ్లిపోకుండా ఉండడానికి అలా చేసేవాళ్లు.

లేదా “ఫరో ఇంటివాళ్లతో.”

పదకోశం చూడండి.

“ఐగుప్తీయుల విలాపం” అని అర్థం.

అక్ష., “వాళ్లు యోసేపు మోకాళ్ల మీదే పుట్టారు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి