యోబు
8 అప్పుడు షూహీయుడైన+ బిల్దదు+ ఇలా అన్నాడు:
2 “ఎంతసేపు నువ్విలా మాట్లాడుతూ ఉంటావు?+
నీ నోటి మాటలు సుడిగాలి లాంటివి!*
3 దేవుడు న్యాయాన్ని పక్కదారి పట్టిస్తాడా?
సర్వశక్తిమంతుడు నీతిని తారుమారు చేస్తాడా?
4 ఒకవేళ నీ పిల్లలు* ఆయనకు వ్యతిరేకంగా పాపం చేశారేమో,
అందుకే ఆయన వాళ్ల తిరుగుబాటును బట్టి వాళ్లను శిక్షించాడు;
5 అయితే ఇప్పుడు నువ్వు దేవుని వైపు చూస్తే,+
దయ చూపించమని సర్వశక్తిమంతుణ్ణి వేడుకుంటే,
6 నిజంగా నువ్వు స్వచ్ఛంగా, నిజాయితీగా జీవించివుంటే,+
ఆయన నీ మీద దృష్టిపెడతాడు,
మళ్లీ నిన్ను సరైన స్థానంలో ఉంచుతాడు.
7 నీ ఆరంభం చిన్నగా ఉన్నా
నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది.+
8 దయచేసి, ముందటి తరంవాళ్లను అడిగిచూడు,
వాళ్ల తండ్రులు కనుగొన్న వాటిమీద దృష్టిపెట్టు.+
9 ఎందుకంటే, మనం కేవలం నిన్న గాక మొన్న పుట్టినవాళ్లం, మనకేమీ తెలీదు,
భూమ్మీద మన రోజులు నీడ లాంటివి.
10 వాళ్లు నీకు ఉపదేశించరా?
తమకు తెలిసినవాటిని నీకు చెప్పరా?
11 చిత్తడినేల లేని చోట జమ్ము,*
నీళ్లులేని చోట రెల్లు ఏపుగా పెరుగుతాయా?
12 అది మొగ్గ దశలో ఉండగానే, ఇంకా కోయక ముందే,
మిగతా మొక్కల కన్నా త్వరగా ఎండిపోతుంది.
13 దేవుణ్ణి మర్చిపోయే వాళ్లందరికీ అదే గతి పడుతుంది,
భక్తిహీనుల* ఆశ నశించిపోతుంది.
14 వాళ్ల నమ్మకం వమ్ము అవుతుంది,
అది సాలెగూడు అంత బలహీనమైనది.
15 అతను తన ఇంటిమీద ఆనుకుంటాడు, కానీ అది నిలవదు;
దానిమీద ఒరుగుతాడు, కానీ అది కూలిపోతుంది.
16 అతను ఎండలో ఉన్న పచ్చని మొక్కలాంటివాడు,
అతని కొమ్మలు తోటంతా వ్యాపిస్తాయి.+
17 అతని వేళ్లు రాళ్లకుప్పలో పెనవేసుకుంటాయి;
అతను రాళ్ల మధ్య ఒక ఇల్లు కోసం* చూస్తాడు.
18 కానీ అతను తన స్థలంలో నుండి పీకేయబడినప్పుడు,
ఆ స్థలం, ‘నేను నిన్నెప్పుడూ చూడలేదు’+ అంటూ అతన్ని తిరస్కరిస్తుంది.
19 అవును, అతను అలా మాయమైపోతాడు;+
తర్వాత వేరేవాళ్లు ధూళిలో నుండి పైకిలేస్తారు.
20 ఖచ్చితంగా, దేవుడు యథార్థవంతుల్ని* తిరస్కరించడు;
ఆయన చెడ్డవాళ్లకు మద్దతివ్వడు,
21 చివరికి ఆయన నీ నోటిని నవ్వుతో,
నీ పెదాలను ఆనంద ధ్వనులతో నింపుతాడు.
22 నిన్ను ద్వేషించేవాళ్లు సిగ్గుపడతారు,
దుష్టుల డేరా ఇక ఉండదు.”