1 యోహాను
2 నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, తండ్రి దగ్గర మనకు ఒక సహాయకుడు* ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన యేసుక్రీస్తు. 2 మనం దేవునితో శాంతియుత సంబంధం తిరిగి నెలకొల్పుకోవడానికి తోడ్పడే బలిని* యేసు మన పాపాల కోసం అర్పించాడు. కేవలం మన పాపాల కోసమే కాదు, మొత్తం ప్రపంచంలోని ప్రజల పాపాల కోసం ఆ బలిని అర్పించాడు. 3 మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటే, మనకు ఆయన తెలుసని రుజువౌతుంది. 4 “నాకు ఆయన తెలుసు” అని చెప్పుకుంటూ ఎవరైనా ఆయన ఆజ్ఞల్ని పాటించకపోతే ఆ వ్యక్తి అబద్ధాలకోరు అన్నట్టే, అతనిలో సత్యం లేదు. 5 అయితే, ఓ వ్యక్తి ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు, అతను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని స్పష్టమౌతుంది. దీన్నిబట్టి మనం ఆయనతో ఐక్యంగా ఉన్నామని మనకు తెలుస్తుంది. 6 ఆయనతో ఐక్యంగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి ఆయనలా నడుచుకుంటూ ఉండాల్సిన బాధ్యత ఉంది.
7 ప్రియ సోదరులారా, నేను మీకు రాస్తున్న ఆజ్ఞ కొత్తదేమీ కాదు, పాతదే, మొదటి నుండీ మీ దగ్గర ఉన్నదే. మీరు విన్న వాక్యమే ఆ పాత ఆజ్ఞ. 8 యేసు, అలాగే మీరు పాటించిన ఆ ఆజ్ఞనే మళ్లీ ఓ కొత్త ఆజ్ఞలా రాస్తున్నాను. ఎందుకంటే, చీకటి పోయి నిజమైన వెలుగు ఇప్పటికే ప్రకాశిస్తోంది.
9 వెలుగులో ఉన్నానని చెప్పుకునే వ్యక్తి తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతను ఇంకా చీకట్లో ఉన్నట్టే. 10 తన సోదరుణ్ణి ప్రేమించే వ్యక్తి వెలుగులోనే ఉంటాడు, అతను దేనివల్లా తడబడడు. 11 కానీ తన సోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి మాత్రం చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. చీకటి వల్ల అతని కళ్లకు ఏమీ కనిపించదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.
12 చిన్నపిల్లలారా, ఆయన* పేరు కోసం దేవుడు మీ పాపాల్ని క్షమించాడు కాబట్టి నేను మీకు రాస్తున్నాను. 13 తండ్రులారా, ఆరంభం నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి నేను మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు దుష్టుడిపై విజయం సాధించారు కాబట్టి మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రైన దేవుణ్ణి తెలుసుకున్నారు కాబట్టి మీకు రాస్తున్నాను. 14 తండ్రులారా, ఆరంభం నుండి ఉన్న వ్యక్తిని మీరు తెలుసుకున్నారు కాబట్టి నేను మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ హృదయాల్లో ఉంది, మీరు దుష్టుడిపై విజయం సాధించారు కాబట్టి నేను మీకు రాస్తున్నాను.
15 ఈ లోకాన్ని గానీ, లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే ఆ వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదు; 16 ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతీదానికి అంటే శరీరాశకు, నేత్రాశకు,* వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడం* అనేదానికి మూలం తండ్రి కాదు, లోకమే. 17 అంతేకాదు ఈ లోకం నాశనమౌతుంది, లోకంలోని ప్రజలు కోరుకునే ప్రతీది నాశనమౌతుంది. అయితే దేవుని ఇష్టప్రకారం ప్రవర్తించే వ్యక్తి నిరంతరం జీవిస్తాడు.
18 చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ. క్రీస్తువిరోధి వస్తున్నాడని మీరు విన్నట్టే, ఇప్పుడు కూడా చాలామంది క్రీస్తువిరోధులు వచ్చారు. ఆ వాస్తవాన్ని బట్టి ఇది చివరి గడియ అని మనకు తెలుసు. 19 వాళ్లు మనల్ని వదిలి వెళ్లిపోయారు, వాళ్లు మనవాళ్లు* కాదు. వాళ్లు మనవాళ్లయితే మనతోనే ఉండేవాళ్లు. అయితే వాళ్లు అలా వెళ్లిపోయి, అందరూ మనవాళ్లు కాదని చూపించారు. 20 మిమ్మల్ని పవిత్ర దేవుడు ఎంపిక చేసుకున్నాడు, అంతేకాదు మీ అందరికీ జ్ఞానం ఉంది. 21 మీకు సత్యం తెలియదని కాదు, మీకు సత్యం తెలుసు; సత్యం నుండి ఏ అబద్ధమూ పుట్టదు. అందుకే నేను మీకు రాస్తున్నాను.
22 యేసును క్రీస్తని ఒప్పుకోనివాడే అబద్ధాలకోరు. తండ్రిని, కుమారుణ్ణి తిరస్కరించేవాడే క్రీస్తువిరోధి. 23 కుమారుణ్ణి తిరస్కరించే ప్రతీ ఒక్కరికి తండ్రి అంగీకారం కూడా ఉండదు. కానీ కుమారుణ్ణి ఒప్పుకునే ప్రతీ ఒక్కరికి తండ్రి అంగీకారం కూడా ఉంటుంది. 24 మీ విషయానికొస్తే, మొదటి నుండి మీరు విన్న విషయాలు మీ హృదయాల్లో ఉండాలి. అప్పుడు మీరు కుమారుడితో, తండ్రితో కూడా ఐక్యంగా ఉంటారు. 25 అంతేకాదు, శాశ్వత జీవితాన్ని ఆయనే స్వయంగా మనకు వాగ్దానం చేశాడు.
26 మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ల గురించి ఈ విషయాలు మీకు రాస్తున్నాను. 27 మీ విషయానికొస్తే, దేవుడు తన శక్తితో మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడు, ఆ శక్తి మీలో ఉంది. అంతేకాదు, మీకు ఒకరు బోధించాల్సిన పనిలేదు; కానీ ఆయన నుండి వచ్చే శక్తే మీకు అన్ని విషయాలు బోధిస్తోంది. ఆ శక్తి నిజమైనది, అబద్ధం కాదు. అది బోధించిన ప్రకారంగానే మీరు ఆయనతో ఐక్యంగా ఉండాలి. 28 కాబట్టి చిన్నపిల్లలారా, ఇప్పుడు మీరు ఆయనతో ఐక్యంగా ఉండండి. అలా ఉంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ధైర్యంగా మాట్లాడగలుగుతాం, ఆయన ప్రత్యక్షత కాలంలో సిగ్గుపడి వెనకడుగు వేయం. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిస్తే, నీతిగా నడుచుకునే వాళ్లంతా ఆయన పిల్లలనే విషయం కూడా మీకు తెలిసినట్టే.