1 యోహాను
1 జీవ వాక్యాన్ని తెచ్చిన వ్యక్తి గురించి మేము మీకు రాస్తున్నాం. ఆయన మొదటి నుండి ఉన్నాడు, మేము ఆయన మాట్లాడుతుంటే విన్నాం, ఆయన్ని కళ్లారా చూశాం, జాగ్రత్తగా గమనించాం, చేతులతో ముట్టుకున్నాం. 2 (అవును, శాశ్వత జీవితం మాకు ప్రత్యక్షపర్చబడింది, దాన్ని మేము చూశాం, దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాం, దాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఆ శాశ్వత జీవితానికి తండ్రే మూలం, అది మాకు ప్రత్యక్షపర్చబడింది.) 3 తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మేము ఐక్యంగా ఉన్నట్టు మీరు మాతో ఐక్యంగా ఉండాలని మేము చూసింది, విన్నది మీకు చెప్తున్నాం. 4 మన ఆనందం సంపూర్ణం అవ్వాలని మేము ఈ విషయాలు రాస్తున్నాం.
5 మేము ఆయన నుండి విని, మీకు ప్రకటిస్తున్న సందేశం ఇదే: దేవుడు వెలుగు, ఆయనలో చీకటి ఏమాత్రం లేదు. 6 మనం ఒకవేళ “మేము ఆయనతో ఐక్యంగా ఉన్నాం” అని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే మనం అబద్ధమాడినట్టే, సత్యాన్ని ఆచరణలో పెట్టనట్టే. 7 అయితే, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో నడిస్తే ఒకరితో ఒకరం ఐక్యంగా ఉంటాం, ఆయన కుమారుడైన యేసు రక్తం మన పాపాలన్నిటినీ కడిగివేస్తుంది.
8 మనం ఒకవేళ “మాలో ఏ పాపం లేదు” అని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, మనలో సత్యం లేనట్టే. 9 ఆయన నమ్మకస్థుడు, నీతిమంతుడు కాబట్టి, మనం మన పాపాల్ని ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు, అన్నిరకాల చెడుతనం నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. 10 మనం ఒకవేళ “మేము ఎప్పుడూ పాపం చేయలేదు” అని చెప్పుకుంటే మనం ఆయన్ని అబద్ధాలకోరుగా చేసినట్టే, ఆయన మాటల్ని మనం నమ్మనట్టే.