2 పేతురు
3 ప్రియ సోదరులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండో ఉత్తరం. మొదటి ఉత్తరంలో పురికొల్పినట్టే ఇందులో కూడా కొన్ని విషయాలు గుర్తుచేసి స్పష్టంగా ఆలోచించే మీ సామర్థ్యాల్ని పురికొల్పుతున్నాను. 2 పవిత్రమైన ప్రవక్తలు ముందే చెప్పిన విషయాల్ని, మన రక్షకుడైన ప్రభువు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు గుర్తుంచుకోవాలన్నదే నా ఉద్దేశం. 3 ముందుగా ఈ విషయం తెలుసుకోండి. చివరి రోజుల్లో ఎగతాళి చేసేవాళ్లు వస్తారు. వాళ్లు మంచి విషయాల్ని ఎగతాళి చేస్తారు. వాళ్లు తమ సొంత కోరికల ప్రకారం ప్రవర్తిస్తూ 4 ఇలా అంటారు: “ఆయన ప్రత్యక్షత గురించిన వాగ్దానం ఏమైంది? మా పూర్వీకులు చనిపోయిన* రోజు నుండి ఇప్పటి వరకు అసలేమీ మారలేదు. దేవుడు మనుషుల్ని సృష్టించినప్పటి నుండి పరిస్థితులన్నీ అలానే ఉన్నాయి కదా.”
5 వాళ్లు కావాలనే ఈ వాస్తవాన్ని పట్టించుకోరు. ఎంతోకాలం క్రితం ఆకాశం ఉండేదని, దేవుని నోటిమాటతో భూమి నీళ్లలో నుండి వేరు చేయబడిందని, అది నీళ్ల మధ్యలో ఉండేదని, 6 నీళ్లు భూమంతటినీ ముంచేసినప్పుడు అవే అప్పటి ప్రజల్ని నాశనం చేశాయని వాళ్లు పట్టించుకోరు. 7 అయితే ఇప్పుడున్న ఆకాశం, భూమి అదే మాట వల్ల అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి; దైవభక్తిలేని ప్రజలు నాశనమయ్యే తీర్పు రోజు వరకు అవి అలా ఉంచబడుతున్నాయి.
8 అయితే ప్రియ సోదరులారా, ఈ విషయాన్ని మర్చిపోకండి. యెహోవాకు* ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలతో సమానం, అలాగే వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. 9 కొందరు అనుకుంటున్నట్టు యెహోవా* తన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో ఆలస్యం చేయడు. కానీ మీ విషయంలో ఆయన ఓర్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరూ నాశనం కావడం ఆయనకు ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు. 10 యెహోవా* రోజు దొంగలా వస్తుంది. అప్పుడు ఆకాశం ఉరుముల శబ్దంతో వేగంగా గతించిపోతుంది; ఆకాశంలోనివి, భూమిలోనివి తీవ్రమైన వేడి వల్ల కరిగిపోతాయి; భూమి, దాని మీద జరిగే పనులు బట్టబయలౌతాయి.
11 ఇవన్నీ ఇలా నాశనమౌతాయి కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలో ఆలోచించండి. మీరు పవిత్రంగా నడుచుకుంటూ, దైవభక్తిగల పనులు చేస్తూ ఉండాలి. 12 అలాగే యెహోవా* రోజు కోసం* ఎదురుచూస్తూ, దాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని జీవించాలి. ఆ సమయంలో ఆకాశం మంటల్లో కాలిపోతుంది; ఆకాశంలోనివి, భూమిలోనివి తీవ్రమైన వేడికి కరిగిపోతాయి. 13 అయితే మనం ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశం కోసం, కొత్త భూమి కోసం ఎదురుచూస్తున్నాం; వాటిలో ఎప్పుడూ నీతి ఉంటుంది.
14 ప్రియ సోదరులారా, మీరు వీటికోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి, మీరు చివరికి ఆయన దృష్టిలో మచ్చ గానీ, కళంకం గానీ లేనివాళ్లుగా ఉండాలి; ఆయనతో మంచి సంబంధం ఉన్నవాళ్లుగా ఉండాలి; అందుకోసం చేయగలిగినదంతా చేయండి. 15 అంతేకాదు, మన ప్రభువు చూపించే ఓర్పు మీ రక్షణ కోసమేనని గ్రహించండి. దేవుడు అనుగ్రహించిన తెలివి ప్రకారం మన ప్రియ సోదరుడు పౌలు కూడా దాని గురించి రాశాడు. 16 నిజానికి, పౌలు తన ఉత్తరాలన్నిట్లో ఈ విషయాల గురించి మాట్లాడాడు. అయితే, వాటిలో కొన్ని అర్థంచేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం లేనివాళ్లు, నిలకడ లేనివాళ్లు ఆ విషయాల్ని వక్రీకరిస్తున్నారు. వాళ్లు మిగతా లేఖనాల్ని కూడా అలాగే చేస్తుంటారు. దానివల్ల వాళ్లు నాశనం కొనితెచ్చుకుంటారు.
17 ప్రియ సోదరులారా, మీకు ఈ విషయాలు ముందే తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీరు అలా అక్రమంగా నడుచుకునేవాళ్లు చేసే మోసం వల్ల తప్పుదోవ పట్టకుండా, విశ్వాసంలో నిలకడ కోల్పోకుండా ఉండగలుగుతారు. 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు అపారదయ విషయంలో, జ్ఞానం విషయంలో ఎదుగుతూ ఉండండి. ఇప్పుడూ, ఎల్లప్పుడూ ఆయనకు మహిమ కలగాలి. ఆమేన్.