2 పేతురు
2 అయితే, ఇశ్రాయేలు ప్రజల మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా బయల్దేరారు. అలాగే మీ మధ్య కూడా అబద్ధ బోధకులు ఉంటారు. వీళ్లు రహస్యంగా విభజనలు* సృష్టిస్తారు, అవి మీ విశ్వాసాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు వాళ్లు తమను కొన్న యజమానిని కూడా వదిలేస్తారు. అలా తమ మీదికి తాము వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు. 2 అంతేకాదు, చాలామంది వాళ్ల లెక్కలేనితనాన్ని* అనుసరిస్తారు, వాళ్లవల్ల సత్యమార్గం గురించి ప్రజలు చెడుగా మాట్లాడుకునే పరిస్థితి తలెత్తుతుంది. 3 అంతేకాదు, వాళ్లు అత్యాశపరులు కాబట్టి మోసపూరిత మాటలతో మిమ్మల్ని తమ స్వార్థానికి వాడుకుంటారు. అయితే, ఎంతోకాలం క్రితమే వాళ్లకోసం నిర్ణయించబడిన తీర్పు ఆలస్యం కాదు, వాళ్లు తప్పక నాశనమౌతారు.
4 పాపం చేసిన దేవదూతల్ని దేవుడు శిక్షించకుండా వదిలేయలేదు కానీ, వాళ్లను టార్టరస్లో* పడేశాడు. తీర్పు కోసం వాళ్లను కటికచీకట్లో సంకెళ్లతో* బంధించాడు. 5 అలాగే, ఆయన ప్రాచీన లోకాన్ని శిక్షించకుండా విడిచిపెట్టలేదు. కానీ దైవభక్తిలేని లోకం మీదికి జలప్రళయాన్ని తీసుకువచ్చినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును, మరో ఏడుగురిని రక్షించాడు. 6 అంతేకాదు దేవుడు సొదొమ, గొమొర్రా నగరాలను బూడిద చేసి వాటిని శిక్షించాడు. దైవభక్తిలేని ప్రజలకు జరగబోయేదానికి అది ఓ నమూనాగా ఉంది. 7 అలాగే దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. దుష్టుల లెక్కలేనితనాన్ని* చూసి లోతు చాలా బాధపడ్డాడు. 8 (ఆ దుష్టుల మధ్య నివసిస్తున్నప్పుడు వాళ్లు చేస్తున్న చెడు పనుల్ని చూసి, వాటి గురించి విని ఆ నీతిమంతుడు ప్రతీరోజు చాలా బాధపడ్డాడు.) 9 కాబట్టి, దైవభక్తి ఉన్న ప్రజల్ని కష్టాల నుండి ఎలా తప్పించాలో, తీర్పు రోజున జరిగే నాశనం కోసం అనీతిమంతుల్ని ఎలా వేరుగా ఉంచాలో యెహోవాకు* తెలుసు. 10 ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇతరుల్ని అపవిత్రం చేయాలని చూసేవాళ్లను, అధికారాన్ని ధిక్కరించేవాళ్లను* ఎలా వేరుగా ఉంచాలో దేవునికి తెలుసు.
తెగింపుతో, గర్వంతో వాళ్లు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవాళ్ల గురించి అమర్యాదగా మాట్లాడడానికి భయపడరు. 11 అదే దేవదూతల విషయానికొస్తే, వాళ్లకు అబద్ధ బోధకుల కన్నా ఎక్కువ బలం, శక్తి ఉన్నప్పటికీ యెహోవా* మీద గౌరవం వల్ల వాళ్లు అవమానకరమైన మాటలతో ఆ బోధకుల్ని నిందించరు. 12 ఈ అబద్ధ బోధకులు మాత్రం సహజ ప్రవృత్తి ప్రకారం ప్రవర్తించే విచక్షణలేని జంతువుల్లా, పట్టబడి నాశనం చేయబడడానికే పుట్టే జంతువుల్లా తమకు తెలియనివాటి గురించి అవమానకరంగా మాట్లాడతారు. వాళ్లు తమ నాశనకరమైన ప్రవర్తన వల్లే నాశనమౌతారు. 13 తమ హానికరమైన ప్రవర్తనకు ప్రతిఫలంగా వాళ్లకు హాని జరుగుతుంది.
వాళ్లు పట్టపగలే శరీర కోరికల్ని తీర్చుకుంటూ అదే సంతోషం అనుకుంటారు. వాళ్లు మీ మధ్య మచ్చలాంటివాళ్లు, మురికిలాంటివాళ్లు. వాళ్లు విందుల్లో మీతో కలిసివుంటూనే తమ మోసపూరిత బోధల్ని వ్యాప్తి చేస్తూ ఇతరుల్ని తప్పుదోవ పట్టించడంలో ఎక్కడలేని ఆనందం పొందుతారు. 14 వాళ్ల కళ్లు కామంతో నిండిపోయాయి; వాళ్లు పాపం చేయడం మానుకోలేరు; వాళ్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్లను బుట్టలో వేసుకుంటారు. వాళ్ల హృదయం నిండా అత్యాశే.* వాళ్లు శపించబడిన పిల్లలు. 15 వాళ్లు తిన్నని దారిని విడిచిపెట్టి తప్పుదోవ పట్టారు. వాళ్లు బెయోరు కొడుకైన బిలాము బాటలో నడిచారు. అతను బహుమానం పొందాలనే విపరీతమైన కోరికతో తప్పు చేశాడు. 16 అతను చేసిన తప్పు వల్లే అతను గద్దించబడ్డాడు. నోరులేని గాడిద మనిషి స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త చేయబోతున్న వెర్రి పనిని అడ్డుకుంది.
17 ఆ అబద్ధ బోధకులు నీళ్లులేని బావులు, పెనుగాలికి కొట్టుకుపోయే మబ్బులు. వాళ్ల కోసం కటికచీకటి సిద్ధం చేయబడి ఉంది. 18 వాళ్లు ఇతరులను ముగ్ధుల్ని చేసే విషయాలు మాట్లాడతారు, కానీ వాటిలో ఏమీ ఉండదు. శరీర కోరికల్ని రేపడం ద్వారా, లెక్కలేనట్టు* ప్రవర్తించడం ద్వారా వాళ్లు తప్పుదారిలో నడిచేవాళ్ల నుండి అతికష్టం మీద తప్పించుకున్న ప్రజల్ని బుట్టలో వేసుకుంటారు. 19 తాము చెప్పినట్టు చేస్తే స్వేచ్ఛ లభిస్తుందని వాళ్లు ప్రజలకు వాగ్దానం చేస్తారు, కానీ వాళ్లే భ్రష్టత్వానికి దాసులుగా ఉన్నారు; ఎందుకంటే ఒక వ్యక్తి దేనికైనా లొంగిపోయాడంటే అతను దానికి దాసుడైనట్టే.* 20 ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు గురించిన సరైన జ్ఞానం ద్వారా ఈ లోకంలోని పాపపు బురద నుండి బయటపడిన తర్వాత మళ్లీ అవే చెడుపనులు చేస్తూ, వాటికి దాసోహమైతే వాళ్ల చివరి స్థితి మొదటి స్థితి కన్నా ఘోరంగా ఉంటుంది. 21 వాళ్లు నీతిమార్గం గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత పవిత్రమైన ఆజ్ఞల్ని విడిచిపెట్టడం కన్నా అసలు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఉంటేనే బాగుండేది. 22 వాళ్ల విషయంలో ఈ సామెత నిజమైంది: “కుక్క తన వాంతి దగ్గరికి తిరిగివెళ్లింది; కడగబడిన పంది మళ్లీ బురదలో దొర్లడానికి వెళ్లింది.”