2 థెస్సలొనీకయులు
3 చివరిగా సోదరులారా, యెహోవా* వాక్యం వేగంగా వ్యాప్తి చెందాలని, దాన్ని మీరు స్వీకరించినట్టే ప్రజలు కూడా గౌరవంతో స్వీకరించాలని మా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి. 2 అలాగే హానిచేసే దుష్టుల నుండి దేవుడు మమ్మల్ని కాపాడాలని ప్రార్థించండి, ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు. 3 కానీ ప్రభువు నమ్మకస్థుడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడతాడు. 4 అంతేకాదు, మేము ఇచ్చిన నిర్దేశాలు మీరు పాటిస్తున్నారని, ముందుముందు కూడా పాటిస్తూనే ఉంటారని ప్రభువు శిష్యులుగా మాకు మీమీద నమ్మకం ఉంది. 5 దేవుణ్ణి ప్రేమించడానికి, క్రీస్తు కోసం సహించడానికి ప్రభువు మీకు సహాయం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
6 సోదరులారా, పద్ధతిగా నడుచుకోని ప్రతీ సోదరునికి, మా నుండి మీరు* అందుకున్న నిర్దేశాల* ప్రకారం నడుచుకోని ప్రతీ సోదరునికి దూరంగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు పేరున ఇప్పుడు మీకు ఆదేశాలు ఇస్తున్నాం. 7 మమ్మల్ని ఎలా ఆదర్శంగా తీసుకోవాలో మీకు తెలుసు. ఎందుకంటే మేము మీ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా నడుచుకున్నాం, 8 ఎవరి దగ్గరా ఉచితంగా* భోజనం చేయలేదు. మేము మీలో ఎవ్వరికీ భారంగా ఉండకూడదని రాత్రనకా, పగలనకా ఎంతో కష్టపడి పనిచేశాం. 9 మాకు అధికారం లేక కాదు, మీకు ఆదర్శంగా ఉండాలని అలా చేశాం. 10 నిజానికి, మేము మీతో ఉన్నప్పుడు మీకు ఈ ఆజ్ఞ ఇచ్చేవాళ్లం: “పనిచేయడం ఇష్టంలేనివాళ్లకు తినే హక్కు లేదు.” 11 మీ మధ్య కొందరు పద్ధతిగా నడుచుకోవట్లేదని, అసలు పనే చేయట్లేదని, తమకు సంబంధంలేని విషయాల్లో తలదూరుస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. 12 ప్రభువైన యేసుక్రీస్తు పేరున అలాంటివాళ్లకు మేము ఆజ్ఞాపించేది, ఉపదేశించేది ఏమిటంటే, వాళ్లు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ల పని వాళ్లు చూసుకోవాలి, సొంతగా సంపాదించుకున్న ఆహారం తినాలి.
13 సోదరులారా, మీరైతే మంచి చేయడం మానకండి. 14 కానీ మేము ఈ ఉత్తరంలో చెప్పిన మాటకు ఎవరైనా లోబడకపోతే, అతను సిగ్గుపడేలా అతనికి గుర్తువేసి అతనితో సహవాసం మానేయండి. 15 అయితే అతన్ని శత్రువుగా చూడకండి, సోదరునిగా భావించి హెచ్చరిస్తూ ఉండండి.
16 శాంతికి మూలమైన ప్రభువు మీకు అన్ని విషయాల్లో శాంతిని ప్రసాదిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభువు మీ అందరికీ తోడుండాలి.
17 నా శుభాకాంక్షల్ని స్వహస్తాలతో రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటినీ గుర్తుపట్టడానికి నా చేతిరాతే మీకు గుర్తు, ఇదే నా చేతిరాత.
18 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీ అందరికీ తోడుండాలి.