ఎఫెసీయులు
6 పిల్లలూ, ప్రభువు ఇష్టానికి అనుగుణంగా మీ అమ్మానాన్నల మాట వినండి. ఇది దేవుని దృష్టిలో సరైనది. 2 వాగ్దానంతో పాటు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ ఏమిటంటే, “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు. 3 అప్పుడు నీ జీవితం బాగుంటుంది,* నువ్వు భూమ్మీద ఎక్కువ కాలం జీవిస్తావు.” 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి; యెహోవా* నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను ఇస్తూ, ఉపదేశాన్ని ఇస్తూ* వాళ్లను పెంచండి.
5 దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టే భూమ్మీదున్న* మీ యజమానులకు కూడా భయంతో, గౌరవంతో మనస్ఫూర్తిగా లోబడండి. 6 మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు* మాత్రమే లోబడడం కాదు, మీ శక్తి* మేరకు దేవుని ఇష్టప్రకారం నడుచుకుంటూ క్రీస్తు దాసుల్లా ఎప్పుడూ లోబడండి. 7 మనుషులకు సేవ చేస్తున్నట్టు కాకుండా యెహోవాకు* సేవ చేస్తున్నట్టు మంచి మనసుతో చేయండి. 8 ఎందుకంటే దాసునికైనా, స్వతంత్రునికైనా మంచిపని చేసే ప్రతీ ఒక్కరికి యెహోవా* ప్రతిఫలం ఇస్తాడని మీకు తెలుసు. 9 యజమానులారా, మీరు కూడా మీ దాసులతో అలాగే ప్రవర్తించండి, వాళ్లను బెదిరించకండి. ఎందుకంటే వాళ్లకూ, మీకూ యజమాని అయిన వ్యక్తి పరలోకంలో ఉన్నాడని మీకు తెలుసు. ఆయనకు పక్షపాతం లేదు.
10 చివరిగా నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, ప్రభువు తన మహాబలంతో ఇచ్చే శక్తిని పొందుతూ ఉండండి. 11 మీరు అపవాది పన్నాగాలకు* పడిపోకుండా స్థిరంగా నిలబడగలిగేలా దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి. 12 మనం పోరాడుతున్నది* మనుషులతో కాదు, ప్రభుత్వాలతో, నాయకులతో, ఈ చీకటి ప్రపంచ పాలకులతో, అంటే పరలోకంలోని ఎంతోమంది చెడ్డదూతలతో. 13 అందుకే, మీరు దేవుడు ఇచ్చే సంపూర్ణ యుద్ధ కవచాన్ని తొడుక్కోండి. అలా చేస్తే, శత్రువు దాడిచేసినప్పుడు* మీరు అతన్ని ఎదిరించగలుగుతారు. మీరు చేయాల్సినవన్నీ చేస్తే, స్థిరంగా నిలబడి పోరాడగలుగుతారు.
14 కాబట్టి, మీరు స్థిరంగా నిలబడడానికి మీ నడుముకు సత్యం అనే నడికట్టు కట్టుకోండి, నీతి అనే రొమ్ము-కవచం తొడుక్కోండి, 15 శాంతికరమైన మంచివార్తను ప్రకటించేలా మీ కాళ్లకు సంసిద్ధత అనే చెప్పులు వేసుకోండి. 16 వాటన్నిటితోపాటు విశ్వాసం అనే పెద్ద డాలు పట్టుకోండి, దానితో మీరు దుర్మార్గుడి అగ్ని బాణాలన్నీ* ఆర్పివేయగలుగుతారు. 17 అంతేకాదు, మీ తలకు రక్షణ అనే శిరస్త్రాణం* పెట్టుకోండి, పవిత్రశక్తి ద్వారా ఇవ్వబడిన దేవుని వాక్యం అనే ఖడ్గం పట్టుకోండి. 18 అలాగే, ప్రతీ సందర్భంలో అన్నిరకాల ప్రార్థనలతో, అభ్యర్థనలతో పవిత్రశక్తికి అనుగుణంగా ప్రార్థిస్తూ ఉండండి. అందుకోసం ఎప్పుడూ మెలకువగా ఉంటూ, పవిత్రులందరి కోసం వేడుకుంటూ ఉండండి. 19 నేను మంచివార్త గురించిన పవిత్ర రహస్యాన్ని తెలియజేయడానికి నోరు తెరిచినప్పుడు సరైన పదాలతో ధైర్యంగా మాట్లాడగలిగేలా నాకోసం కూడా ప్రార్థించండి. 20 సంకెళ్లతో ఉన్న నేను ఆ మంచివార్తకు రాయబారిగా పనిచేస్తున్నాను కాబట్టి, నేను మాట్లాడాల్సిన పద్ధతిలో ధైర్యంగా మాట్లాడాలని ప్రార్థించండి.
21 ప్రియ సోదరుడు, ప్రభువుకు నమ్మకమైన పరిచారకుడు అయిన తుకికు నా గురించి, నా పనుల గురించి మీకు వివరంగా చెప్తాడు. 22 మేమెలా ఉన్నామో మీకు తెలియజేయడానికి, మీకు ఊరటనివ్వడానికి అతన్ని మీ దగ్గరకు పంపిస్తున్నాను.
23 తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి శాంతిని, విశ్వాసంతో కూడిన ప్రేమను సోదరులు పొందాలని కోరుకుంటున్నాను. 24 ప్రభువైన యేసుక్రీస్తు మీద చెక్కుచెదరని ప్రేమ ఉన్నవాళ్లందరికీ దేవుని అపారదయ తోడుండాలి.