మార్కు
2 కొన్నిరోజుల తర్వాత యేసు మళ్లీ కపెర్నహూముకు వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడనే సంగతి చుట్టుపక్కల వాళ్లందరికీ తెలిసిపోయింది. 2 దాంతో చాలామంది అక్కడికి వచ్చారు; ఆ ఇల్లంతా జనంతో నిండిపోయింది, వాకిట్లో కూడా చోటు లేదు. యేసు వాళ్లకు దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. 3 ఆ సమయంలో నలుగురు మనుషులు పక్షవాతం ఉన్న ఓ వ్యక్తిని ఆయన దగ్గరికి మోసుకొచ్చారు. 4 కానీ ఆ ఇల్లు జనంతో కిటకిటలాడుతున్నందువల్ల వాళ్లు అతన్ని యేసు ముందుకు తీసుకురాలేకపోయారు. అందుకని వాళ్లు యేసు ఉన్న చోట పైకప్పు తీసి, సందు చేసి, పక్షవాతం ఉన్న వ్యక్తిని పరుపుతోపాటు కిందకు దించారు. 5 యేసు వాళ్ల విశ్వాసాన్ని చూసి, పక్షవాతం ఉన్న వ్యక్తితో, “బాబూ, నీ పాపాలు క్షమించబడ్డాయి!” అన్నాడు. 6 అయితే, అక్కడ కూర్చొనివున్న శాస్త్రులు కొందరు మనసులో ఇలా అనుకున్నారు: 7 “ఈ మనిషి ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఇతను దేవుణ్ణి అవమానిస్తున్నాడు. క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి ఉంది?” 8 అయితే యేసు వెంటనే వాళ్ల హృదయాలోచనను పసిగట్టి ఇలా అన్నాడు: “మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు? 9 పక్షవాతం ఉన్న వ్యక్తితో ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనడం తేలికా? ‘లేచి నీ పరుపు తీసుకొని నడువు’ అని చెప్పడం తేలికా? 10 అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి* ఉందని మీరు తెలుసుకోవాలి.” ఆ తర్వాత, పక్షవాతం ఉన్న వ్యక్తితో ఆయన ఇలా అన్నాడు: 11 “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ పరుపు తీసుకొని మీ ఇంటికి వెళ్లు.” 12 అతను లేచి వెంటనే తన పరుపు తీసుకొని అందరూ చూస్తుండగా బయటికి వెళ్లిపోయాడు. దాంతో వాళ్లందరూ ఆశ్చర్యపోయారు, “ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదే” అంటూ దేవుణ్ణి మహిమపర్చారు.
13 ఆయన మళ్లీ సముద్ర తీరానికి వెళ్లాడు. ప్రజలంతా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు, ఆయన వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. 14 తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలు చేసే కార్యాలయంలో కూర్చొనివున్న లేవిని చూశాడు, ఇతను అల్ఫయి కొడుకు. యేసు లేవితో, “నా శిష్యుడివి అవ్వు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయనను అనుసరించాడు. 15 ఆ తర్వాత యేసు లేవి ఇంట్లో భోంచేస్తున్నప్పుడు,* చాలామంది పన్ను వసూలుదారులు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోంచేస్తున్నారు.* ఎందుకంటే వాళ్లు కూడా ఆయన అనుచరులే. 16 కానీ, ఆయన పాపులతో, పన్ను వసూలు చేసేవాళ్లతో కలిసి భోజనం చేయడం చూసి పరిసయ్యుల్లోని శాస్త్రులు ఆయన శిష్యులతో ఇలా అనడం మొదలుపెట్టారు: “ఇదేంటి? ఈయన పన్ను వసూలుదారులతో, పాపులతో కలిసి తింటాడా?” 17 అది విని యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను.”
18 యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం ఉండేవాళ్లు. కాబట్టి వాళ్లు వచ్చి యేసును ఇలా అడిగారు: “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?” 19 అందుకు యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “పెళ్లికొడుకు తమతో ఉండగా, అతని స్నేహితులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు కదా? కాబట్టి పెళ్లికొడుకు తమతో ఉన్నంతకాలం వాళ్లు ఉపవాసం ఉండరు. 20 అయితే పెళ్లికొడుకును వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి, అప్పుడు వాళ్లు ఉపవాసం ఉంటారు. 21 పాత వస్త్రానికి అతుకు వేయడానికి కొత్త గుడ్డముక్కను ఎవ్వరూ ఉపయోగించరు. ఒకవేళ అలా చేస్తే, ఆ కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి పాత వస్త్రం నుండి విడిపోతుంది, చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 అలాగే, కొత్త ద్రాక్షారసాన్ని ఎవ్వరూ పాత తోలుసంచుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, ఆ ద్రాక్షారసం వల్ల తోలుసంచులు పిగిలిపోతాయి. అప్పుడు ద్రాక్షారసం కారిపోతుంది, తోలుసంచులు పాడౌతాయి. అందుకే, కొత్త ద్రాక్షారసాన్ని కొత్త తోలుసంచుల్లోనే పోస్తారు.”
23 విశ్రాంతి రోజున యేసు పంటచేలలో నుండి వెళ్తుండగా ఆయన శిష్యులు ధాన్యం వెన్నులు తుంచడం మొదలుపెట్టారు. 24 అప్పుడు పరిసయ్యులు ఆయనతో ఇలా అన్నారు: “ఇదిగో చూడు! విశ్రాంతి రోజున చేయకూడని పనిని వాళ్లెందుకు చేస్తున్నారు?” 25 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దావీదుకు, అతని మనుషులకు ఆకలి వేసి, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేనప్పుడు దావీదు ఏమి చేశాడో మీరు చదవలేదా? 26 దావీదు దేవుని మందిరంలోకి వెళ్లి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప ఎవ్వరూ తినకూడని సముఖపు రొట్టెలు* తిని, తన మనుషులకు కూడా ఇచ్చాడు. ఈ విషయం ముఖ్య యాజకుడైన అబ్యాతారు వృత్తాంతంలో మీరు చదవలేదా?” 27 ఆ తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుడు మనిషి కోసమే విశ్రాంతి రోజును ఏర్పాటు చేశాడు కానీ, విశ్రాంతి రోజు కోసం మనిషిని చేయలేదు. 28 కాబట్టి మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు కూడా ప్రభువే.”