మార్కు
1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించిన మంచివార్త ప్రారంభం. 2 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “(ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు* ముందుగా పంపిస్తున్నాను. అతను నీ కోసం మార్గం సిద్ధం చేస్తాడు.) 3 ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి’ అని అరణ్యంలో* ఒకరి స్వరం గట్టిగా వినిపిస్తోంది.” 4 ప్రవక్త రాసినట్టే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో ఉంటూ, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ప్రకటిస్తూ వచ్చాడు. 5 యూదయ, యెరూషలేము ప్రజలంతా అతని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్లు తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకుంటూ, యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.* 6 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రం వేసుకునేవాడు; నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు; మిడతల్ని, అడవి తేనెను తినేవాడు. 7 అతను ఇలా ప్రకటిస్తుండేవాడు: “నా తర్వాత నాకన్నా బలవంతుడు రాబోతున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల తాడు విప్పడానికి కూడా అర్హుణ్ణి కాదు. 8 నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన మీకు పవిత్రశక్తితో బాప్తిస్మం ఇస్తాడు.”
9 ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు నుండి యేసు వచ్చాడు, యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. 10 తాను నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశం తెరుచుకోవడం, పవిత్రశక్తి పావురం రూపంలో తన మీదకు రావడం యేసు చూశాడు. 11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది: “నువ్వు నా ప్రియ కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”*
12 వెంటనే యేసు అరణ్యంలోకి వెళ్లేలా పవిత్రశక్తి ఆయన్ని బలంగా ప్రేరేపించింది. 13 అందుకే ఆయన 40 రోజులపాటు అరణ్యంలో ఉన్నాడు. అక్కడ సాతాను ఆయన్ని ప్రలోభపెట్టాలని చూశాడు. ఆయన అడవి జంతువుల మధ్య గడిపాడు, దేవదూతలు ఆయనకు సేవలు చేశారు.
14 యోహాను చెరసాల పాలయ్యాక, యేసు గలిలయకు వెళ్లి దేవుని గురించిన మంచివార్తను ప్రకటిస్తూ, 15 “నిర్ణీత సమయం వచ్చేసింది. దేవుని రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి, మంచివార్త మీద విశ్వాసం ఉంచండి” అని చెప్తూ వచ్చాడు.
16 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తుండగా సీమోను, అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో తమ వలలు వేయడం చూశాడు, వాళ్లు జాలరులు. 17 అప్పుడు యేసు వాళ్లతో, “నా వెనుక రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నాడు. 18 వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన్ని అనుసరించారు. 19 ఆయన కొంచెం దూరం వెళ్లాక జెబెదయి కొడుకు యాకోబును, అతని సోదరుడు యోహానును చూశాడు. ఆ సమయంలో వాళ్లు తమ పడవలో ఉండి వలలు బాగుచేసుకుంటున్నారు. 20 ఆయన ఆలస్యం చేయకుండా వాళ్లను పిలిచాడు. అప్పుడు వాళ్లిద్దరు వాళ్ల నాన్న జెబెదయిని పడవలోనే పనివాళ్ల దగ్గర వదిలేసి, ఆయనతో వెళ్లారు. 21 వాళ్లంతా కపెర్నహూముకు వెళ్లారు.
విశ్రాంతి రోజు రాగానే, ఆయన సభామందిరానికి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు. 22 ఆయన బోధించే తీరు చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన శాస్త్రుల్లా కాకుండా అధికారం ఉన్నవాడిలా బోధించాడు. 23 ఆ సమయంలో, ఓ అపవిత్ర దూత* పట్టిన మనిషి ఆ సభామందిరంలో ఉన్నాడు. అతను ఇలా అరిచాడు: 24 “నజరేయుడివైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన పవిత్రుడివి!” 25 అప్పుడు యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకు, అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు. 26 దాంతో ఆ అపవిత్ర దూత, అతను కిందపడి గిలగిల కొట్టుకునేలా చేసి, పెద్దపెద్ద కేకలు వేస్తూ అతన్ని వదిలి బయటికి వచ్చాడు. 27 అప్పుడు ప్రజలందరూ ఎంత ఆశ్చర్యపోయారంటే, వాళ్లు ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు: “ఇదేంటి? ఈయన బోధ కొత్తగా ఉందే! అపవిత్ర దూతల్ని కూడా ఈయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు, వాళ్లు ఈయన మాట వింటున్నారు.” 28 ఆ సంఘటనతో ఆయన గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా పాకిపోయింది.
29 ఆ తర్వాత వాళ్లు సభామందిరం నుండి యాకోబు, యోహానులతో కలిసి సీమోను, అంద్రెయవాళ్ల ఇంటికి వెళ్లారు. 30 అక్కడ సీమోనువాళ్ల అత్త జ్వరంతో పడుకొనివుంది. వాళ్లు వెంటనే ఆమె గురించి ఆయనకు చెప్పారు. 31 ఆయన ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేయి పట్టుకొని లేపాడు. అప్పుడు ఆమె జ్వరం పోయింది. ఆమె వాళ్లకు సేవలు చేయడం మొదలుపెట్టింది.
32 సాయంకాలం సూర్యుడు అస్తమించాక ప్రజలు రోగులను, చెడ్డదూతలు పట్టినవాళ్లను అందరినీ యేసు దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు; 33 ఆ నగరంలోని ప్రజలంతా ఆ ఇంటి గుమ్మం ముందు చేరారు. 34 అప్పుడు రకరకాల రోగాలతో బాధపడుతున్న చాలామందిని ఆయన బాగుచేశాడు; ఎంతోమంది చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు, అయితే ఆయనే క్రీస్తు అని ఆ చెడ్డదూతలకు తెలుసు* కాబట్టి ఆయన వాళ్లను మాట్లాడనివ్వలేదు.
35 ఆయన తెల్లవారుజామున, చీకటితోనే లేచి బయటికి వెళ్లాడు; ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లి ప్రార్థించడం మొదలుపెట్టాడు. 36 అయితే సీమోను, అతనితో ఉన్నవాళ్లు హడావిడిగా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. 37 ఆయన కనబడగానే వాళ్లు ఆయనతో, “అందరూ నీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు. 38 కానీ ఆయన వాళ్లతో, “మనం వేరే ఎక్కడికైనా వెళ్దాం పదండి, దగ్గర్లోని పట్టణాలకు వెళ్దాం. అక్కడ కూడా నేను ప్రకటించాలి, ఇందుకే కదా నేను వచ్చాను” అన్నాడు. 39 తర్వాత ఆయన బయలుదేరి, గలిలయ అంతటా తిరుగుతూ ప్రజల సభామందిరాల్లో ప్రకటించాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు.
40 అక్కడ ఆయన దగ్గరికి ఓ కుష్ఠురోగి కూడా వచ్చాడు. అతను మోకాళ్లూని ఆయన్ని ఇలా వేడుకున్నాడు: “నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు.” 41 అప్పుడు ఆయన జాలిపడి చెయ్యి చాపి, అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు!” అన్నాడు. 42 వెంటనే అతని కుష్ఠురోగం పోయింది, అతను శుద్ధుడయ్యాడు. 43 ఆ తర్వాత యేసు అతన్ని గట్టిగా హెచ్చరించి వెంటనే పంపించేశాడు. 44 ఆయన ఏమని హెచ్చరించాడంటే, “ఎవ్వరికీ ఏమీ చెప్పకు. కానీ, నువ్వు వెళ్లి యాజకునికి కనిపించి, శుద్ధుడివి అయినందుకు మోషే ధర్మశాస్త్రం చెప్పినవి అర్పించు. ఇది వాళ్లకు సాక్ష్యంగా ఉంటుంది.” 45 కానీ అతను అక్కడ నుండి వెళ్లిన తర్వాత, ఆ విషయాన్ని అంతటా చాటుతూ అందరికీ తెలిసేలా చేశాడు. దానివల్ల యేసు ఏ నగరంలోకీ బహిరంగంగా వెళ్లలేకపోయాడు. అందుకే ఆయన ఎవరూలేని ప్రదేశాల్లో నివసించాడు. అయినా సరే, నలుమూలల నుండి ప్రజలు ఆయన దగ్గరికి వస్తూనే ఉన్నారు.