39వ పాఠం
రక్తం విషయంలో దేవుని అభిప్రాయం
రక్తం చాలా ముఖ్యమైనది. అది లేకుండా మనలో ఎవ్వరం ప్రాణాలతో ఉండలేం. యెహోవా మన సృష్టికర్త కాబట్టి, రక్తాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పే హక్కు ఆయనకు ఉంది. రక్తం గురించి ఆయన ఏం చెప్తున్నాడు? రక్తాన్ని తినొచ్చా లేదా ఎక్కించుకోవచ్చా? ఈ విషయంలో మీరు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు?
1. రక్తం విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటి?
పూర్వకాలంలో యెహోవా తన ఆరాధకులతో ఇలా అన్నాడు: “ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం.” (లేవీయకాండం 17:14) యెహోవా దృష్టిలో రక్తం ప్రాణంతో సమానం. దేవుడు బహుమతిగా ఇచ్చిన ప్రాణం పవిత్రమైనది, కాబట్టి రక్తం కూడా పవిత్రమైనదే.
2. రక్తాన్ని ఎలా ఉపయోగించకూడదని దేవుడు చెప్తున్నాడు?
జలప్రళయం తర్వాత యెహోవా తన ఆరాధకులకు రక్తం తినకూడదని ఆజ్ఞాపించాడు. తర్వాత ఇశ్రాయేలీయులకు కూడా అదే ఆజ్ఞ ఇచ్చాడు. (ఆదికాండం 9:4 అలాగే లేవీయకాండం 17:10 చదవండి.) క్రైస్తవ సంఘం ఏర్పడిన తర్వాత, యెహోవా పరిపాలక సభ ద్వారా ఆ ఆజ్ఞను మళ్లీ ఇచ్చాడు: “రక్తానికి . . . ఎప్పుడూ దూరంగా ఉండండి.”—అపొస్తలుల కార్యాలు 15:28, 29 చదవండి.
రక్తానికి దూరంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఒకసారి దీని గురించి ఆలోచించండి. డాక్టరు మిమ్మల్ని మద్యానికి దూరంగా ఉండమని చెప్పాడనుకోండి, దాన్ని మీరు తాగరు. కానీ మద్యం కలిపిన ఆహారాన్ని మీరు తింటారా? లేదా మద్యాన్ని మీ నరాల్లోకి ఎక్కించుకుంటారా? లేదు కదా. అదేవిధంగా రక్తానికి దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడంటే, దాన్ని మనం తాగకూడదని లేదా తినకూడదని అర్థం. అలాగే రక్తం ఒలికించని మాంసాన్ని గానీ, రక్తం కలిసిన ఆహారాన్ని గానీ తినకూడదని అర్థం.
మరి రక్తాన్ని వైద్యపరంగా ఉపయోగించడం సంగతేంటి? కొన్ని వైద్య విధానాలు దేవుని నియమానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణకు, రక్తాన్ని లేదా దాని ప్రధాన భాగాల్లో వేటినైనా ఎక్కించుకోవడం లాంటివి. రక్తంలోని ప్రధాన భాగాలు ఏవంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా. అయితే, కొన్ని వైద్య విధానాలు దేవుని నియమానికి పూర్తి వ్యతిరేకం కాకపోవచ్చు. ఉదాహరణకు, కొన్ని విధానాల్లో రక్తంలోని ప్రధాన భాగాల నుండి తీసిన సూక్ష్మ భాగాల్ని ఉపయోగిస్తారు. ఇంకొన్ని విధానాల్లో రోగి సొంత రక్తాన్ని ఉపయోగిస్తారు. అయితే వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనలో ప్రతీ ఒక్కరం సొంతగా నిర్ణయించుకోవాలి.a—గలతీయులు 6:5.
ఎక్కువ తెలుసుకోండి
రక్తాన్ని ఉపయోగించే వైద్య విధానాలకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చో పరిశీలించండి.
3. వైద్యపరమైన విషయాల్లో యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోండి
వైద్యపరమైన విషయాల్లో మీరు దేవుని అభిప్రాయానికి తగ్గట్టు ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు? వీడియో చూడండి, తర్వాత ఈ కింది పనులు చేయడం ఎందుకు ప్రాముఖ్యమో చర్చించండి.
తెలివి కోసం ప్రార్థించండి.—యాకోబు 1:5.
బైబిలు సూత్రాల కోసం వెతకండి, వాటిని ఎలా పాటించవచ్చో ఆలోచించండి.—సామెతలు 13:16.
మీ ప్రాంతంలో ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి.
వాటిలో ఏవి దేవుని నియమానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయో గుర్తించండి.
మీరు మంచి మనస్సాక్షితో ఉండేలా సహాయం చేసే నిర్ణయాన్ని తీసుకోండి.—అపొస్తలుల కార్యాలు 24:16.b
మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో మీరే సొంతగా నిర్ణయం తీసుకోవాలని గుర్తుంచుకోండి. వేరే ఎవ్వరూ అంటే ఆఖరికి మీ భర్త, భార్య, సంఘ పెద్ద, లేదా మీకు స్టడీ ఇచ్చిన వ్యక్తి మీరు ఏం చేయాలో చెప్పకూడదు.—రోమీయులు 14:12.
మీ నిర్ణయాన్ని రాసి పెట్టుకోండి.
4. యెహోవాసాక్షులు మెరుగైన వైద్యం తీసుకోవాలని కోరుకుంటారు
రక్తం విషయంలో దేవుని నియమాన్ని పాటిస్తూనే, రక్తాన్ని ఉపయోగించని మెరుగైన వైద్యం తీసుకోవడం సాధ్యమే. వీడియో చూడండి.
తీతు 3:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:
మనం డాక్టర్లతో మాట్లాడేటప్పుడు ఎందుకు మర్యాదగా, సౌమ్యంగా మాట్లాడాలి?
క్రైస్తవులు ఎక్కించుకోకూడనివి |
క్రైస్తవులు వ్యక్తిగతంగా నిర్ణయించుకునేవి |
|---|---|
1. ప్లాస్మా |
ప్లాస్మాలోని సూక్ష్మ భాగాలు |
2. తెల్ల రక్త కణాలు |
తెల్ల రక్త కణాల్లోని సూక్ష్మ భాగాలు |
3. ప్లేట్లెట్స్ |
ప్లేట్లెట్స్లోని సూక్ష్మ భాగాలు |
4. ఎర్ర రక్త కణాలు |
ఎర్ర రక్త కణాల్లోని సూక్ష్మ భాగాలు |
5. రక్తంలోని సూక్ష్మ భాగాల్ని ఉపయోగించే వైద్య విధానాలు
రక్తంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా. ఈ ప్రధాన భాగాల్లో ఎన్నో చిన్నచిన్న భాగాలు ఉంటాయి. వాటినే సూక్ష్మ భాగాలు అంటారు.c కొన్ని సూక్ష్మ భాగాల్ని, వ్యాధులతో పోరాడడానికి లేదా రక్తం గడ్డకట్టడానికి సహాయం చేసే మందుల్లో ఉపయోగిస్తారు.
రక్తంలోని సూక్ష్మ భాగాల విషయానికొస్తే, ప్రతీ క్రైస్తవుడు బైబిలు చేత శిక్షణ పొందిన తన మనస్సాక్షిని ఉపయోగించి సొంతగా నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది, సూక్ష్మ భాగాల్ని ఉపయోగించి చేసే ఏదైనా ఒక వైద్య విధానాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకోవచ్చు. ఇంకొంతమంది మనస్సాక్షికి, సూక్ష్మ భాగాలు తీసుకోవడం తప్పేమీ కాదని అనిపించవచ్చు.
మీరు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:
నేను రక్తంలోని కొన్ని సూక్ష్మ భాగాల్ని ఎందుకు వద్దనుకుంటున్నాను లేదా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాను? నేను దీన్ని డాక్టరుకు ఎలా వివరిస్తాను?
కొంతమంది ఇలా అడుగుతారు: “రక్తం ఎక్కించుకుంటే తప్పేంటి?”
మీకేం అనిపిస్తుంది?
ఒక్కమాటలో
మనం రక్తాన్ని పవిత్రంగా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు.
మీరేం నేర్చుకున్నారు?
యెహోవా దృష్టిలో రక్తం ఎందుకు పవిత్రమైనది?
రక్తానికి దూరంగా ఉండమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో రక్తమార్పిడులు కూడా ఉన్నాయని మనకెలా తెలుసు?
రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాల విషయంలో మీరు ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు?
ఇవి కూడా చూడండి
మీ సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, మీరు ఏ విషయాల గురించి ఆలోచించాలి?
రక్తంలోని సూక్ష్మ భాగాల్ని తీసుకోవాలో వద్దో నిర్ణయించుకుంటున్నప్పుడు మీరు వేటి గురించి ఆలోచించాలి?
రక్తం విషయంలో యెహోవా అభిప్రాయం సరైనదని ఒక డాక్టరుకు ఎలా నమ్మకం కుదిరింది?
“రక్తం విషయంలో దేవుని అభిప్రాయం సరైనదని నేను తెలుసుకున్నాను” (తేజరిల్లు! ఆర్టికల్)
ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో సేవ చేసే సంఘ పెద్దలు తమ సహోదర సహోదరీలకు ఎలా సహాయం చేస్తారో తెలుసుకోండి.
b ఈ పాఠంలో “రక్తంలోని సూక్ష్మ భాగాల్ని ఉపయోగించే వైద్య విధానాలు” అనే 5వ పాయింట్; అదనపు సమాచారంలో “రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలు” అనే 3వ పాయింట్ చూడండి.
c కొంతమంది డాక్టర్లు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల్ని కూడా సూక్ష్మ భాగాలుగానే చూస్తారు. కాబట్టి రక్తాన్ని, లేదా అందులోని ఎర్ర రక్త కణాల్ని, తెల్ల రక్త కణాల్ని, ప్లేట్లెట్స్ని, ప్లాస్మాని ఎక్కించుకోరనే మీ నిర్ణయాన్ని వాళ్లకు స్పష్టంగా వివరించాల్సి రావచ్చు.