గురువారం, ఏప్రిల్ 16
“నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థించాను, . . . సహాయం కోసం నేను పెట్టిన మొర ఆయన దగ్గరికి చేరింది.”—కీర్త. 18:6.
దావీదు రాజుకు యెహోవా అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు. రాజైన సౌలు అలాగే వేరే శత్రువులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయం కోసం దావీదు యెహోవాకు ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థన విని, ఆయన్ని కాపాడినప్పుడు దావీదు ఇలా అన్నాడు: “యెహోవా సజీవుడు!” (కీర్త. 18:46) ఆ మాటలు అనడం ద్వారా దావీదు కేవలం దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్పడంలేదు. ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్టు యెహోవా “జీవంగల దేవుడు, తన ప్రజల తరఫున ఆయన ఎప్పుడూ చర్య తీసుకుంటాడు” అనే నమ్మకాన్ని దావీదు ఇక్కడ చూపించాడు. తనకు ఎదురైన సంఘటనల్ని బట్టి దేవుడు సజీవుడని దావీదు అర్థం చేసుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఏదేమైనా యెహోవాను సేవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని దావీదు గట్టిగా నిర్ణయించుకున్నాడు. (కీర్త. 18:28, 29, 49) యెహోవా జీవంగల దేవుడని మనం నమ్మినప్పుడు తన సేవను ఉత్సాహంగా చేస్తాం. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడానికి కావాల్సిన బలం పొందుతాం. అంతేకాదు, ఆయన సేవలో కష్టపడి పనిచేస్తూ ఉండాలనే తపన పెరుగుతుంది, యెహోవాకు దగ్గరగా ఉండాలనే మన నిర్ణయం బలపడుతుంది. w24.06 20-21 ¶3-4
శుక్రవారం, ఏప్రిల్ 17
“ఎవ్వరూ ఏ రకంగానూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి.”—2 థెస్స. 2:3.
థెస్సలొనీకయులకు అపొస్తలుడైన పౌలు రాసిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిలు నుండి మనం నేర్చుకున్న విషయాలకు విరుద్ధంగా ఉన్నవి మన చెవినపడ్డా లేదా మనం ఊహించని ఏదైనా పుకారు మన చెవినపడ్డా వివేచన చూపించాలి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఏం జరిగిందో గమనించండి. మన శత్రువులు ఒక ఉత్తరాన్ని బ్రదర్స్‌కు పంపించారు. కొంతమంది బ్రదర్స్ విడిపోయి, ఒక సంస్థగా ఏర్పడాలని ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం అచ్చం ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చినట్టే కనిపించింది. కానీ నమ్మకమైన బ్రదర్స్ మాత్రం మోసపోలేదు. ఉత్తరంలో ఉన్న విషయం వాళ్లు నేర్చుకున్న విషయాలకు పూర్తి విరుద్ధంగా ఉందని వాళ్లు గుర్తించారు. ఈరోజుల్లో కూడా మన శత్రువులు మనల్ని తికమక పెట్టి, విడగొట్టాలని కొన్నిసార్లు టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అప్పుడు మనం “వెంటనే అయోమయంలో పడిపోకుండా” విన్న విషయాలు, చదివిన విషయాలు మనం నేర్చుకున్న సత్యానికి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా ఆలోచించాలి.—2 థెస్స. 2:2; 1 యోహా. 4:1. w24.07 12 ¶14-15
శనివారం, ఏప్రిల్ 18
“ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు.”—1 యోహా. 2:1.
మనందరం తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే, యెహోవాకు సమర్పించుకుని, ఆయన కుటుంబంలో ఒకరు అవ్వాలనుకోవడం. ప్రతీఒక్కరు ఆ నిర్ణయం తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం తనకు ఫ్రెండ్స్‌గా ఉంటూ, శాశ్వతకాలం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (ద్వితీ. 30:19, 20; గల. 6:7, 8) అయితే, యెహోవా తనను ఆరాధించమని ఎవ్వర్నీ బలవంతపెట్టడు, ఆ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తాడు. మరి ఒక బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు దేవుని నియమాలు మీరి, ఘోరమైన పాపం చేస్తే అప్పుడేంటి? ఒకవేళ అతను పశ్చాత్తాపం చూపించకపోతే అతన్ని సంఘం నుండి తొలగిస్తారు. (1 కొరిం. 5:13) అయినాసరే, తప్పుచేసిన వ్యక్తి తన దగ్గరికి తిరిగొస్తాడని యెహోవా కోటి ఆశలతో ఎదురుచూస్తాడు. నిజానికి పశ్చాత్తాపపడిన వాళ్లను క్షమించడానికే యెహోవా విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు. తప్పు చేసినవాళ్లను పశ్చాత్తాపపడమని మన ప్రేమగల దేవుడు మనసారా పిలుస్తున్నాడు.—జెక. 1:3; రోమా. 2:4; యాకో. 4:8. w24.08 14 ¶1-2