ఏప్రిల్
బుధవారం, ఏప్రిల్ 1
“కుమారుణ్ణి అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం.”—యోహా. 6:40.
మనం శాశ్వత జీవితాన్ని పొందాలంటే యేసు విమోచన క్రయధనం మీద విశ్వాసం చూపించాలి. (ఎఫె. 1:7) యేసు “వేరే గొర్రెలు” అని పిలిచినవాళ్లు ప్రభువు రాత్రి భోజనమప్పుడు రొట్టెను, ద్రాక్షారసాన్ని తీసుకోరు, తీసుకోకూడదు కూడా. (యోహా. 10:16) అయితే వాళ్లు యేసు బలి మీద విశ్వాసం చూపిస్తే ఆయన రక్తం, శరీరం నుండి ప్రయోజనం పొందుతారు. (యోహా. 6:53) మరోవైపు ఎవరైతే రొట్టె, ద్రాక్షారసాన్ని తీసుకుంటారో, వాళ్లు కొత్త ఒప్పందంలోకి వచ్చారని, భవిష్యత్తులో పరలోకం నుండి పరిపాలిస్తారని చూపిస్తారు. కాబట్టి మనం అభిషిక్త క్రైస్తవులమైనా, వేరే గొర్రెలమైనా శాశ్వత జీవితం పొందాలంటే విశ్వాసం చూపించాలి. w24.12 13 ¶14, 16
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 12) మత్తయి 26:1-5, 14-16; లూకా 22:1-6
జ్ఞాపకార్థ ఆచరణ రోజు
సూర్యాస్తమయం తర్వాత
గురువారం, ఏప్రిల్ 2
“చిన్నమందా, భయపడకండి, మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.”—లూకా 12:32.
ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు తన అపొస్తలులకు పులవని రొట్టె ఇచ్చి, అది తన శరీరానికి గుర్తు అని చెప్పాడు. తర్వాత ద్రాక్షారసాన్ని ఇచ్చి అది ‘ఒప్పంద రక్తానికి’ గుర్తు అని చెప్పాడు. (మార్కు 14:22-25; లూకా 22:20; 1 కొరిం. 11:24) ఎందుకంటే కొత్త ఒప్పందం “దేవుని రాజ్యంలో” ఉండే “[ఆధ్యాత్మిక] ఇశ్రాయేలు ఇంటివాళ్లతో” మాత్రమే చేయబడుతుంది. (హెబ్రీ. 8:6, 10; 9:15) ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు కేవలం “చిన్నమంద” గురించే చెప్పాడు. ఆ రోజు సాయంత్రం తనతోపాటు ఆ గదిలో ఉన్న నమ్మకమైన అపొస్తలులతో చిన్నమంద మొదలైంది. వాళ్లు యేసుతో కలిసి పరలోకంలో పరిపాలిస్తారు. w24.12 11 ¶9-10
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 13) మత్తయి 26:17-19; మార్కు 14:12-16; లూకా 22:7-13 (సూర్యాస్తమయం తర్వాత జరిగిన సంఘటనలు: నీసాను 14) యోహాను 13:1-5; 14:1-3
శుక్రవారం, ఏప్రిల్ 3
“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనమీద విశ్వాసం ఉంచే ఏ ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవితం పొందాలని అలా చేశాడు.”—యోహా. 3:16.
యేసును వెన్నుపోటు పొడిచారు, అరెస్టు చేశారు, తిట్టారు, లేనిపోనివి కల్పించి చెప్పారు, దోషిగా నిలబెట్టారు, చిత్రహింసలు పెట్టారు. సైనికులు ఆయన్ని చంపే స్థలానికి తీసుకెళ్లి కొయ్యకు మేకులతో దిగగొట్టారు. అంత వేదనను యేసు నమ్మకంగా సహించాడు. కానీ ఇంకో వ్యక్తి అంతకు మించిన బాధను అనుభవించాడు. ఆయన ఎవరోకాదు యెహోవా దేవుడు. తనకు అంతులేని శక్తి ఉన్నా యెహోవా ఎందుకు మౌనంగా ఉన్నాడు? కేవలం మన మీద ఉన్న ప్రేమవల్లే! యెహోవా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు అనడానికి యేసు విమోచన క్రయధనమే తిరుగులేని రుజువు. మిమ్మల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి యెహోవా ఎప్పుడూ అనుభవించనంత బాధను అనుభవించాడు. దానికోసం ఆయన ఎంతదూరం వెళ్లడానికైనా వెనకాడలేదు. (1 యోహా. 4:9, 10) అవును మనలో ప్రతీ ఒక్కరం పాపంతో పోరాడి గెలిచేలా సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. w24.08 6 ¶13-14
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 14) యోహాను 19:1-42
శనివారం, ఏప్రిల్ 4
‘క్రీస్తు మీ కోసం బాధలు అనుభవించాడు.’—1 పేతు. 2:21.
తన కుమారుడు నొప్పితో విలవిలలాడడం చూసి యెహోవా గుండె ఎంత తరుక్కుపోయి ఉంటుంది. దాని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు మనమీద ఎంత ప్రేముందో తెలుస్తుంది. ఏ చిన్న కష్టమొచ్చినా మనుషులు యెహోవాకు నమ్మకంగా ఉండరని సాతాను నిందించాడు. అది పచ్చి అబద్ధమని నిరూపించడానికి యేసు బాధలు పడి, చనిపోయేలా యెహోవా అనుమతించాడు. (యోబు 2:1-5) తన కళ్లముందే మతనాయకులు యేసును ఎగతాళి చేశారు, సైనికులు కొట్టారు, ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. తన ప్రియమైన కుమారుడు అంత బాధను అనుభవిస్తూ చనిపోతుంటే యెహోవా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. (మత్త. 27:28-31, 39) అక్కడ జరుగుతున్న దాన్ని ఏ క్షణంలోనైనా ఆపే శక్తి యెహోవాకు ఉంది. (మత్త. 27:42, 43) కానీ ఒకవేళ ఆయన అలా చేసుంటే, మన కోసం ఎలాంటి విమోచన క్రయధనమూ చెల్లించబడేది కాదు. అలాగే మనకు ఏ నిరీక్షణా ఉండేది కాదు. కాబట్టి తన కుమారుడు చివరిశ్వాస వరకు ఎంతో బాధ అనుభవించి, చనిపోయేలా యెహోవా అనుమతించాడు. w25.01 22 ¶7
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 15) మత్తయి 27:62-66 (సూర్యాస్తమయం తర్వాత జరిగిన సంఘటనలు: నీసాను 16) యోహాను 20:1
ఆదివారం, ఏప్రిల్ 5
“40 రోజులపాటు ఆయన వాళ్లకు చాలాసార్లు కనిపించాడు.”—అపొ. 1:3.
అది క్రీస్తు శకం 33 నీసాను 16. యేసు శిష్యుల్లో ఇద్దరు యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి బయల్దేరారు. మిగతా శిష్యుల్లాగే వీళ్లిద్దరు కూడా బాధలో మునిగిపోయారు, భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పరిచయంలేని ఒకాయన ఆ ఇద్దరు శిష్యులతో కలిసి నడవడం మొదలుపెట్టాడు. యేసుకు జరిగిన వాటన్నిటి గురించి వాళ్లు ఆయనకు చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు వాళ్ల మనసులో ముద్రపడిపోయాయి. “మోషే, ప్రవక్తలందరూ రాసిన వాటితో మొదలుపెట్టి” మెస్సీయ ఎందుకు బాధలుపడి చనిపోవాల్సి వచ్చిందో ఆయన వివరించాడు. అలా మాట్లాడుతూ-మాట్లాడుతూ ఆ ముగ్గురు ఎమ్మాయుకు చేరుకున్నారు. ఆ ఇద్దరు శిష్యులు ఇప్పటివరకు తమతో మాట్లాడింది పునరుత్థానమైన యేసే అని గుర్తుపట్టేశారు. (లూకా 24:13-35) యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల్లో తన శిష్యులకు చాలాసార్లు కనిపించాడు. బాధలో, భయంలో మునిగిపోయిన తన శిష్యులందర్నీ యేసు ఆ సమయంలో బలపర్చాడు. దానివల్ల వాళ్లందరూ సంతోషంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మంచివార్తను ప్రకటించగలిగారు, బోధించగలిగారు. w24.10 12 ¶1-3
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 16) యోహాను 20:2-18
సోమవారం, ఏప్రిల్ 6
“అతి పవిత్రమైన మీ విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి.”—యూదా 20.
పిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్లు అయిపోతారు. కానీ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం అనేది దానంతటదే జరిగే పనికాదు. ఉదాహరణకు, కొరింథులో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌నే తీసుకుంటే వాళ్లు మంచివార్తను అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు, పవిత్రశక్తిని పొందారు, పౌలు స్వయంగా చెప్పిన విషయాల నుండి చాలా నేర్చుకున్నారు. (అపొ. 18:8-11) కానీ వాళ్లలో చాలామంది బాప్తిస్మం తీసుకున్న ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా పరిణతి సాధించకుండా అక్కడే ఆగిపోయారు. (1 కొరిం. 3:2) మనం పరిణతి సాధించాలంటే, ముందు పరిణతి సాధించాలనే కోరికను పెంచుకోవాలి. “అజ్ఞానాన్ని” ప్రేమించేవాళ్లు ఆధ్యాత్మికంగా పసి పిల్లలుగా ఉండిపోవాలని కోరుకుంటారు కాబట్టి వాళ్లలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. (సామె. 1:22) కొంతమంది ఎంత పెద్దవాళ్లయినా సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడి, అమ్మానాన్నల్ని అడుగుతుంటారు. మనం వాళ్లలా ఉండాలని అస్సలు అనుకోం. బదులుగా, ఆధ్యాత్మికంగా పరిణతి సాధించే మన బాధ్యతను మనమే తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇంకా పరిణతి సాధించడానికి కృషి చేస్తుంటే ఆ “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి.—ఫిలి. 2:13. w24.04 4 ¶9-10
మంగళవారం, ఏప్రిల్ 7
‘ఎవ్వరూ నాశనమవ్వడం యెహోవాకు ఇష్టంలేదు.’—2 పేతు. 3:9.
ప్రజలకు తీర్పు తీరుస్తున్నప్పుడు తనకు ఎలా అనిపిస్తుందో యెహోవా చెప్పాడు. (యెహె. 33:11) యెహోవా తొందరపడి ఎవర్నీ శాశ్వతంగా నాశనం చేయడు. యెహోవా కరుణకు మారుపేరు. అందుకే ఆయన కరుణ చూపించడానికి అస్సలు వెనకాడడు. పునరుత్థానం అయ్యే అవకాశం లేని వాళ్ల గురించి మనకు ఏం తెలుసు? వాళ్ల గురించి బైబిల్లో కేవలం కొన్ని ఉదాహరణలే ఉన్నాయి. ఇస్కరియోతు యూదా పునరుత్థానం అవ్వడని యేసు చెప్పాడు. (మార్కు 14:21; యోహా. 17:12) ఎందుకంటే యూదా కావాలనే యెహోవాకు, ఆయన కుమారునికి ఎదురుతిరిగాడు. (మార్కు 3:29 అలాగే jw.orgలో ఉన్న “క్షమించరాని పాపం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్ చూడండి.) అదేవిధంగా, తనను వ్యతిరేకించిన మతనాయకుల్లో కూడా కొంతమంది పునరుత్థానం అవ్వరని యేసు చెప్పాడు. (మత్త. 23:33) అంతేకాదు, పశ్చాత్తాపపడని మతభ్రష్టులు కూడా పునరుత్థానం అవ్వరని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.—హెబ్రీ. 6:4-8; 10:29. w24.05 4 ¶10-11
బుధవారం, ఏప్రిల్ 8
“యెహోవా నమ్మకమైనవాళ్లను రక్షిస్తాడు.”—కీర్త. 31:23.
మనం యెహోవాకు దగ్గరగా ఉన్నప్పుడు సాతాను మనకు శాశ్వత హాని చేయలేడు. (1 యోహా. 3:8) కొత్త లోకంలో కూడా యెహోవా తన నమ్మకమైన స్నేహితుల్ని ఆధ్యాత్మిక హాని నుండే కాదు మరణం నుండి కూడా కాపాడుతూనే ఉంటాడు. (ప్రక. 21:4) యెహోవా గుడారంలో అతిథిగా ఉండడం అంటే ఆయనతో దగ్గరి స్నేహాన్ని ఆనందించడం. అది నిజంగా గొప్ప గౌరవం! (యెహె. 37:27) మరి ఆయన గుడారంలో అతిథులుగా కొనసాగాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎవరైనా మిమ్మల్ని వాళ్ల ఇంటికి పిలిస్తే, మీరు వాళ్లకు నచ్చినట్టు ఉండాలనుకుంటారు కదా. అదేవిధంగా తన అతిథులుగా ఉండేవాళ్ల విషయంలో యెహోవా ఏం కోరుతున్నాడో మనం తెలుసుకోవాలి. మనకు యెహోవా మీదున్న ప్రేమ వల్ల ‘ఆయన్ని పూర్తిగా సంతోషపెట్టడానికి’ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. (కొలొ. 1:10) ఆయన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. అలాంటి గౌరవం ఉన్నప్పుడు ఆయన్ని బాధపెట్టే పని ఏదీ చేయాలనుకోం. బదులుగా, “అణకువ కలిగి” దేవునితో నడవాలని అనుకుంటాం.—మీకా 6:8. w24.06 4 ¶8-9
గురువారం, ఏప్రిల్ 9
“ఆయన . . . దోషుల తరఫున వేడుకున్నాడు.”—యెష. 53:12.
యెహోవా అబ్రాహామును తన కొడుకైన ఇస్సాకును బలి ఇవ్వమని అడిగాడు. అది వినగానే అబ్రాహాము గుండె జారిపోయి ఉంటుంది. అయినాసరే ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ చివరి క్షణంలో యెహోవా అతన్ని ఆపాడు. అయితే, యెహోవా భవిష్యత్తులో ఏం చేస్తాడో ఆ ఉదాహరణ చూపించింది. యెహోవాకు మనుషులంటే ఎంత ఇష్టమంటే, తను ప్రాణంగా ప్రేమించే తన కుమారున్ని బలి ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. (ఆది. 22:1-18) వందల సంవత్సరాల తర్వాత, యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుని ప్రజల పాపాల్ని ప్రాయశ్చిత్తం చేయడానికి చాలారకాల బలులు అవసరమయ్యాయి. (లేవీ. 4:27-29; 17:11) ఆ బలులన్నీ మనుషుల్ని పాపం నుండి పూర్తిగా కాపాడే ఒక గొప్ప త్యాగాన్ని సూచించాయి. దేవుడు మాటిచ్చిన ఆ సంతానం గురించి ప్రవక్తలు పవిత్రశక్తి ప్రేరణతో రాశారు. ఆ సంతానం దేవుని ఒక్కగానొక్క కుమారుడని, మీతో సహా మనుషులందర్నీ పాపం, మరణం నుండి విడిపించడానికి ఆయన చాలా బాధలు పడి చనిపోతాడని వాళ్లు చెప్పారు.—యెష. 53:1-12. w24.08 4 ¶7-8
శుక్రవారం, ఏప్రిల్ 10
“నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను! రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను.”—కీర్త. 119:97.
బైబిల్ని చదువుతున్నప్పుడు, దాన్ని ఏయే విధాల్లో పాటించవచ్చో ఆలోచించడం చాలా ప్రాముఖ్యం. బైబిల్లో కొన్ని వచనాలు చదివిన తర్వాత ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను చదివిన దాన్ని ఇప్పుడు లేదా రాబోయే రోజుల్లో ఎలా పాటించాలి?’ ఉదాహరణకు మీరు 1 థెస్సలొనీకయులు 5:17, 18 చదివారు అనుకుందాం. ఆ రెండు వచనాలు చదివాక కాస్త ఆగి మీరు ఎంత తరచుగా, ఎంత బాగా ప్రార్థిస్తున్నారో ఆలోచించుకోవచ్చు. తర్వాత మీరు వేటి గురించి యెహోవాకు థాంక్స్ చెప్పవచ్చో ఆలోచించండి. కనీసం ఓ మూడు విషయాల గురించి యెహోవాకు థాంక్స్ చెప్పాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఇలా కొన్ని నిమిషాలైనా, మనసుపెట్టి ఆలోచించినప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వినేవాళ్లుగానే కాదు, దాన్ని పాటించేవాళ్లుగా కూడా అవుతారు. ఇలా ప్రతీరోజు చదివిన దాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే, మీరు ఎంత ప్రయోజనం పొందుతారో ఆలోచించండి. అవును, దేవుని వాక్యాన్ని పాటించేవాళ్లుగా మీరు ఎదుగుతారు. w24.09 4-5 ¶9-10
శనివారం, ఏప్రిల్ 11
“మేము కష్టపడి సాధించినవాటిని మీరు పోగొట్టుకోకుండా ఉండేలా, పూర్తి బహుమతి పొందేలా జాగ్రత్తగా ఉండండి.”—2 యోహా. 8.
యెహోవా మనల్ని ఒక ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించాడు. మనం తీసుకోవడంలో ఆనందం పొందినా, ఇవ్వడంలో అంతకన్నా గొప్ప ఆనందాన్ని పొందుతాం. మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయగలుగుతున్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. వాళ్లు కృతజ్ఞత చూపిస్తే ఆనందంగా ఉంటుంది. కానీ వాళ్లు కృతజ్ఞత చూపించినా, చూపించకపోయినా మనం మాత్రం సరైనది చేసినందుకు సంతోషంగా ఉండవచ్చు. మనం ఎంత ఇచ్చినా మనకు “యెహోవా అంతకన్నా ఎక్కువే ఇవ్వగలడు” అని ఎప్పుడూ మర్చిపోకండి. (2 దిన. 25:9) అవును, యెహోవా మీకు ఇచ్చిన దానికన్నా మించి మీరు వేరేవాళ్లకు ఇవ్వలేరు! అంతేకాదు యెహోవాయే ప్రతిఫలం ఇచ్చినప్పుడు అంతకుమించిన సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి మనం ఉదారంగా, సంతోషంగా ఇచ్చే మన పరలోక తండ్రిలా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం. w24.09 31 ¶20-21
ఆదివారం, ఏప్రిల్ 12
“యెహోవా, నా దేవా, నా నిండు హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాను, నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను.”—కీర్త. 86:12.
యెహోవా కనికరం, కరుణ గల దేవుడు. (కీర్త. 103:13; యెష. 49:15) యెహోవా మన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకుంటాడు. మనం బాధపడితే ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతాయి. (జెక. 2:8) తనకు ఫ్రెండ్ అవ్వడానికి, తన గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ఆయనే సహాయం చేస్తున్నాడు. (కీర్త. 25:14; అపొ. 17:27) అలాగే ఆయన వినయం గలవాడు. “భూమ్యాకాశాల్ని వంగి చూస్తాడు. దీనుల్ని మట్టిలో నుండి పైకి ఎత్తుతాడు.” (కీర్త. 113:6, 7) ఇంతగొప్ప దేవుణ్ణి మహిమపర్చాలని ఎవరికి ఉండదు చెప్పండి! ఇతరులు యెహోవా గురించి తెలుసుకోవాలనే కోరికతో మనం ఆయన్ని మహిమపరుస్తాం. చాలామందికి యెహోవా నిజంగా ఎవరో తెలీదు. ఎందుకంటే సాతాను యెహోవా గురించి పచ్చి అబద్ధాలు చెప్తూ, ప్రజల మనసులకు గుడ్డితనం కలుగజేశాడు. (2 కొరిం. 4:4) యెహోవాకు చాలా కోపం అని, మనమంటే అసలు పట్టింపు లేదని, లోకం ఇలా అవ్వడానికి కారణం ఆయనే అని సాతాను మనుషుల్ని నమ్మించాడు. కానీ యెహోవా గురించి నిజమేంటో మనకు తెలుసు. అబద్ధాల్ని వ్యాప్తిచేసే నోళ్లను మూయించే అవకాశం మనకుంది. అలా చేసినప్పుడు యెహోవాకు మహిమ తీసుకొస్తాం.—యెష. 43:10. w25.01 3 ¶6-7
సోమవారం, ఏప్రిల్ 13
“సాతాను . . . లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.”—ప్రక. 12:9.
యేసు పరిపూర్ణుడని, అద్భుతాలు చేసే సామర్థ్యం తనకు ఉందని మొదటి శతాబ్దంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అయినాసరే, సాతానుకు మద్దతిచ్చేవాళ్లు ఆయన గురించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ వచ్చారు. ఉదాహరణకు, యేసు చెడ్డదూతల్ని వెళ్లగొట్టేది “చెడ్డదూతల నాయకుడి సహాయంతోనే” అని మతనాయకులు ప్రజలకు చెప్పారు. (మార్కు 3:22) అలాగే, యేసును విచారణ చేస్తున్నప్పుడు ఆయన దైవదూషణ చేస్తున్నాడని నిందించి, ఆయనకు మరణశిక్ష వేయమని ప్రజలు అడిగేలా మతనాయకులు రెచ్చగొట్టారు. (మత్త. 27:20) ఆ తర్వాత క్రీస్తు అనుచరులు మంచివార్త ప్రకటిస్తున్నప్పుడు, వాళ్లను హింసించేలా ప్రజల “మనసుల్ని చెడగొట్టారు.” (అపొ. 14:2, 19) అపొస్తలుల కార్యాలు 14:2 గురించి, 1998 డిసెంబరు 1 కావలికోట పత్రిక ఇలా చెప్పింది: ‘విశ్వసించని యూదులు ఆ సందేశాన్ని కేవలం నిరాకరించి ఊరుకోలేదు గానీ క్రైస్తవులకు వ్యతిరేకంగా అన్యుల మనసుల్లో ప్రతికూల అభిప్రాయాల్ని నాటి, క్రైస్తవుల పేరుకు కళంకం తీసుకొచ్చే ప్రచారాన్ని మొదలుపెట్టారు.’ సాతాను ఇప్పటికీ “లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” w24.04 11 ¶15-16
మంగళవారం, ఏప్రిల్ 14
“భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”—ఆది. 18:25.
ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అనేది అతను ఎప్పుడు చనిపోతాడు అనే దానిమీద ఆధారపడిలేదు. యెహోవా తిరుగులేని న్యాయాధిపతి కాబట్టి ఆయన తీర్పులకు కూడా తిరుగుండదు. (కీర్త. 33:4, 5) “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనదే” చేస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అన్నది అతను జీవిస్తున్న ప్రాంతం మీద కూడా ఆధారపడి ఉండదని మనం చెప్పవచ్చు. మంచివార్త వినే అవకాశం దొరకని ప్రాంతాల్లో ఉన్న లక్షలమందిని యెహోవా “మేకలుగా” తీర్పు తీరుస్తాడని మనం అస్సలు ఊహించుకోలేం. (మత్త. 25:46) భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు వాళ్లలో ప్రతీఒక్కరిని మన కన్నా ఎక్కువగా పట్టించుకుంటాడు. మహాశ్రమ కాలంలో జరిగే సంఘటనల్ని యెహోవా ఎలా మలుపు తిప్పుతాడో మనకు తెలీదు. ఆ సంఘటనల్ని చూసినప్పుడు బహుశా కొంతమంది ప్రజలు యెహోవా గురించి నేర్చుకుని, ఆయన మీద విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. అంతేకాదు, యెహోవా దేశాల ముందు తననుతాను పవిత్రపర్చుకుంటున్నప్పుడు వాళ్లు ఆయన పక్షాన నిలబడవచ్చు.—యెహె. 38:16. w24.05 12 ¶14-15
బుధవారం, ఏప్రిల్ 15
“ఒకరినొకరు ప్రేమించుకోవాలి.”—యోహా. 15:12.
యెహోవా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుంటారు. (2 కొరిం. 8:4) అయితే, అలా చేయాలంటే కొన్నిసార్లు చాలా ధైర్యం కావాలి. ఉదాహరణకు, యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రదర్స్‌సిస్టర్స్‌కి ప్రోత్సాహం, మద్దతు అవసరం. అంతేకాదు బహుశా వాళ్లకు బైబిళ్లు, ప్రచురణలు, తలదాచుకోవడానికి ఒక చోటు, ఆహారం, బట్టలు కావాలని స్థానిక సంఘపెద్దలు గుర్తించవచ్చు. గొర్రెల మీదున్న ప్రేమతో వాళ్లకు అవసరమైంది ఇవ్వడానికి సంఘపెద్దలు తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. అలాంటి పరిస్థితిలో ఐక్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి స్థానిక బ్రాంచి కార్యాలయం ఇచ్చే నిర్దేశాల్ని పాటించండి. (హెబ్రీ. 13:17) ఏదైనా విపత్తు వస్తే ఎలా సిద్ధంగా ఉండాలో, దానికోసం ఏమేం చేయాలో అని సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని సంఘపెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. (1 కొరిం. 14:33, 40) ధైర్యం చూపిస్తూనే జాగ్రత్తలు పాటించండి. (సామె. 22:3) కాస్త తెలివిగా ఉండండి. అనవసరమైన సాహసాలు చేయకండి. యెహోవా మీద ఆధారపడండి. బ్రదర్స్‌సిస్టర్స్ సురక్షితంగా ఉండడానికి మీరు చేసే ప్రతీ పనిలో ఆయన తోడు ఉంటాడు. w24.07 4 ¶8; 5 ¶11
గురువారం, ఏప్రిల్ 16
“నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థించాను, . . . సహాయం కోసం నేను పెట్టిన మొర ఆయన దగ్గరికి చేరింది.”—కీర్త. 18:6.
దావీదు రాజుకు యెహోవా అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు. రాజైన సౌలు అలాగే వేరే శత్రువులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయం కోసం దావీదు యెహోవాకు ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థన విని, ఆయన్ని కాపాడినప్పుడు దావీదు ఇలా అన్నాడు: “యెహోవా సజీవుడు!” (కీర్త. 18:46) ఆ మాటలు అనడం ద్వారా దావీదు కేవలం దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్పడంలేదు. ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్టు యెహోవా “జీవంగల దేవుడు, తన ప్రజల తరఫున ఆయన ఎప్పుడూ చర్య తీసుకుంటాడు” అనే నమ్మకాన్ని దావీదు ఇక్కడ చూపించాడు. తనకు ఎదురైన సంఘటనల్ని బట్టి దేవుడు సజీవుడని దావీదు అర్థం చేసుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఏదేమైనా యెహోవాను సేవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని దావీదు గట్టిగా నిర్ణయించుకున్నాడు. (కీర్త. 18:28, 29, 49) యెహోవా జీవంగల దేవుడని మనం నమ్మినప్పుడు తన సేవను ఉత్సాహంగా చేస్తాం. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడానికి కావాల్సిన బలం పొందుతాం. అంతేకాదు, ఆయన సేవలో కష్టపడి పనిచేస్తూ ఉండాలనే తపన పెరుగుతుంది, యెహోవాకు దగ్గరగా ఉండాలనే మన నిర్ణయం బలపడుతుంది. w24.06 20-21 ¶3-4
శుక్రవారం, ఏప్రిల్ 17
“ఎవ్వరూ ఏ రకంగానూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి.”—2 థెస్స. 2:3.
థెస్సలొనీకయులకు అపొస్తలుడైన పౌలు రాసిన మాటల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? బైబిలు నుండి మనం నేర్చుకున్న విషయాలకు విరుద్ధంగా ఉన్నవి మన చెవినపడ్డా లేదా మనం ఊహించని ఏదైనా పుకారు మన చెవినపడ్డా వివేచన చూపించాలి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో ఏం జరిగిందో గమనించండి. మన శత్రువులు ఒక ఉత్తరాన్ని బ్రదర్స్‌కు పంపించారు. కొంతమంది బ్రదర్స్ విడిపోయి, ఒక సంస్థగా ఏర్పడాలని ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరం అచ్చం ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి వచ్చినట్టే కనిపించింది. కానీ నమ్మకమైన బ్రదర్స్ మాత్రం మోసపోలేదు. ఉత్తరంలో ఉన్న విషయం వాళ్లు నేర్చుకున్న విషయాలకు పూర్తి విరుద్ధంగా ఉందని వాళ్లు గుర్తించారు. ఈరోజుల్లో కూడా మన శత్రువులు మనల్ని తికమక పెట్టి, విడగొట్టాలని కొన్నిసార్లు టెక్నాలజీని ఉపయోగించవచ్చు. అప్పుడు మనం “వెంటనే అయోమయంలో పడిపోకుండా” విన్న విషయాలు, చదివిన విషయాలు మనం నేర్చుకున్న సత్యానికి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా ఆలోచించాలి.—2 థెస్స. 2:2; 1 యోహా. 4:1. w24.07 12 ¶14-15
శనివారం, ఏప్రిల్ 18
“ఒకవేళ ఎవరైనా పాపం చేసినా, మనకు ఒక సహాయకుడు ఉన్నాడు.”—1 యోహా. 2:1.
మనందరం తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి ఏంటంటే, యెహోవాకు సమర్పించుకుని, ఆయన కుటుంబంలో ఒకరు అవ్వాలనుకోవడం. ప్రతీఒక్కరు ఆ నిర్ణయం తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం తనకు ఫ్రెండ్స్‌గా ఉంటూ, శాశ్వతకాలం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. (ద్వితీ. 30:19, 20; గల. 6:7, 8) అయితే, యెహోవా తనను ఆరాధించమని ఎవ్వర్నీ బలవంతపెట్టడు, ఆ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తాడు. మరి ఒక బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవుడు దేవుని నియమాలు మీరి, ఘోరమైన పాపం చేస్తే అప్పుడేంటి? ఒకవేళ అతను పశ్చాత్తాపం చూపించకపోతే అతన్ని సంఘం నుండి తొలగిస్తారు. (1 కొరిం. 5:13) అయినాసరే, తప్పుచేసిన వ్యక్తి తన దగ్గరికి తిరిగొస్తాడని యెహోవా కోటి ఆశలతో ఎదురుచూస్తాడు. నిజానికి పశ్చాత్తాపపడిన వాళ్లను క్షమించడానికే యెహోవా విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు. తప్పు చేసినవాళ్లను పశ్చాత్తాపపడమని మన ప్రేమగల దేవుడు మనసారా పిలుస్తున్నాడు.—జెక. 1:3; రోమా. 2:4; యాకో. 4:8. w24.08 14 ¶1-2
ఆదివారం, ఏప్రిల్ 19
“నీ హృదయం తెలివిని సంపాదిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది.”—సామె. 23:15.
అపొస్తలుడైన యోహాను తన మూడో ఉత్తరం రాసే సమయానికి కొంతమంది అబద్ధ బోధల్ని వ్యాప్తి చేస్తున్నారు, సంఘంలో చిచ్చులు పెడుతున్నారు. కానీ మిగతావాళ్లు “సత్యంలో నడుస్తున్నారు,” యెహోవాకు లోబడుతూ ఆయన ‘ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నారు.’ (2 యోహా. 4, 6) ఈ నమ్మకమైన క్రైస్తవులు యోహానునే కాదు, యెహోవాను కూడా సంతోషపెట్టారు. (సామె. 27:11) మనకేంటి పాఠం? యెహోవాకు నమ్మకంగా ఉంటే మనతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉంటారు. (1 యోహా. 5:3) ఉదాహరణకు, యెహోవాను సంతోషపెడుతున్నందుకు మనం ఎంతో ఆనందిస్తాం. మనం ఈ లోకం మాయలో పడిపోకుండా, సత్యాన్ని సొంతం చేసుకున్నప్పుడు యెహోవా ఎంతో ఆనందిస్తాడు. పరలోకంలో ఉన్న దూతలు కూడా ఎంతో సంబరపడతారు. (లూకా 15:10) బ్రదర్స్‌సిస్టర్స్ నమ్మకంగా ఉండడాన్ని చూసినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. (2 థెస్స. 1:4) సాతాను చెప్పుచేతల్లో ఉన్న ఈ లోకంలో కూడా యెహోవాకు నమ్మకంగా ఉండి, కొత్త లోకంలోకి అడుగుపెట్టాం అనే సంతోషం-సంతృప్తి భవిష్యత్తులో మనకు ఉంటుంది. w24.11 12 ¶17-18
సోమవారం, ఏప్రిల్ 20
“ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.”—1 కొరిం. 10:24.
మీ మనసులో ఇష్టాన్ని చెప్పేముందు వాళ్లను ఎంతకాలం గమనించాలి? మరీ ముందే చెప్పేస్తే, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని వాళ్లు అనుకోవచ్చు. (సామె. 29:20) అలాగని మీరు వాళ్లను ఇష్టపడుతున్నారని అవతలి వ్యక్తికి తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతుంటే, మీరు నిర్ణయాలు తీసుకోవడానికి జంకుతారని వాళ్లకు అనిపించవచ్చు. (ప్రసం. 11:4) అయితే ఒకటి గుర్తుంచుకోండి, మీ మనసులో మాట ఎదుటివ్యక్తికి చెప్పడానికి ముందు, మీరు ఖచ్చితంగా వాళ్లనే పెళ్లిచేసుకుంటారనే నమ్మకం కుదరాల్సిన అవసరం లేదు. కానీ మీరు పెళ్లికి రెడీగా ఉన్నారని, ఆ వ్యక్తి మీకు సరైన జోడీ అయ్యే అవకాశం ఉందనే నమ్మకం మాత్రం కుదరాలి. వేరేవాళ్లు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు అనిపిస్తే అప్పుడేం చేయాలి? ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకపోతే మీకు ఇష్టం లేదనే విషయాన్ని మీ పనుల ద్వారా స్పష్టంగా చూపించండి. అలా చేయకపోతే వాళ్లలో లేనిపోని ఆశల్ని పుట్టించి, వాళ్ల ఫీలింగ్స్‌తో ఆడుకున్నట్టు అవుతుంది!—ఎఫె. 4:25. w24.05 22-23 ¶9-10
మంగళవారం, ఏప్రిల్ 21
“నేను . . . మళ్లీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను.”—యోహా. 14:3.
కేవలం నిజమైన, నమ్మకమైన అభిషిక్తుల్ని మాత్రమే యేసు తన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అభిషిక్తుల్లో ఎవరైనా ఆధ్యాత్మికంగా అలర్ట్‌గా లేకపోతే వాళ్లు ‘ఎంచుకోబడిన వాళ్లతో’ సమకూర్చబడరు. (మత్త. 24:31) వాళ్లేకాదు దేవుని ప్రజలందరూ, ఎలాంటి నిరీక్షణ ఉన్నాసరే యేసు మాటల్లో ఉన్న హెచ్చరికను పట్టించుకుంటూ మెలకువగా ఉండాలి, నమ్మకంగా కొనసాగాలి. మనకు యెహోవా గురించి బాగా తెలుసు. అందుకే ఆయన తీర్పులు ఎప్పుడూ న్యాయంగా ఉంటాయని పూర్తిగా నమ్ముతాం. కాబట్టి ఆయన మనకాలంలో కొంతమందిని అభిషిక్తులుగా ఎంచుకుంటే, మనం కంగారుపడాల్సిన అవసరంలేదు. ద్రాక్షతోట ఉదాహరణలో ఐదింటికి పని చేయడానికి వచ్చినవాళ్ల గురించి యేసు ఏమన్నాడో గుర్తుచేసుకోండి. (మత్త. 20:1-16) సాయంత్రం వచ్చి పని చేసినవాళ్లకు, పొద్దున్నుండి కష్టపడి పని చేసినవాళ్లకు ఒకేలాంటి జీతం వచ్చింది. అదేవిధంగా అభిషిక్తులు ఏ సమయంలో ఎంచుకోబడినా, నమ్మకమైన వాళ్లని తీర్పు తీర్చబడితే చాలు పరలోక బహుమానాన్ని పొందుతారు. w24.09 24 ¶15-17
బుధవారం, ఏప్రిల్ 22
“క్రీస్తు . . . మీ కోసం బాధలు అనుభవించి, మీరు నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచాడు.”—1 పేతు. 2:21.
అన్యాయాన్ని సహించే విషయంలో యేసు తిరుగులేని ఆదర్శాన్ని ఉంచాడు. భూమ్మీద ఉన్నప్పుడు ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు యేసుతో సరిగ్గా ప్రవర్తించలేదు. బంధువులు ఆయనకు పిచ్చిపట్టిందని అన్నారు. మతనాయకులు ఆయన చెడ్డదూతల సహాయం తీసుకుంటున్నాడని నిందలు వేశారు. రోమా సైనికులు యేసును ఎగతాళి చేశారు, కొట్టారు, ఆఖరికి చంపేశారు. (మార్కు 3:21, 22; 14:55; 15:16-20, 35-37) ఇంత అన్యాయం జరిగినా యేసు తిరిగి ఒక్కమాట కూడా అనలేదు, ఏ తప్పూ చేయలేదు. ఆయన నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (1 పేతు. 2:21-23) మనకు అన్యాయం జరిగినప్పుడు యేసు ఆదర్శాన్ని పాటించవచ్చు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో యేసుకు తెలుసు. (మత్త. 26:62-64) ఇతరులు ఆయన గురించి అబద్ధాలు చెప్పిన ప్రతీసారి ఆయన జవాబు ఇవ్వాలనుకోలేదు. (మత్త. 11:19) ఒకవేళ జవాబిచ్చినా ఆయన తన వ్యతిరేకుల్ని అవమానించడం గానీ, బెదిరించడం గానీ చేయలేదు. w24.11 4-5 ¶9-10
గురువారం, ఏప్రిల్ 23
“పాపుల్ని రక్షించడానికి క్రీస్తుయేసు ఈ లోకంలోకి వచ్చాడు.”—1 తిమో. 1:15.
మీ మనసుకు బాగా నచ్చిన వ్యక్తికి మీరొక గిఫ్ట్ ఇచ్చారనుకోండి. ఆ గిఫ్ట్ చాలా అందంగా ఉంది, వాళ్లకు బాగా పనికొస్తుంది. కానీ వాళ్లు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అటకెక్కించారు కాబట్టి దానికి బూజు పట్టింది. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? బాధపడతారు కదా. మరోవైపు, వాళ్లు ఆ గిఫ్ట్‌ని చక్కగా ఉపయోగిస్తూ మీకు థ్యాంక్స్ చెప్తే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంటుంది కదా. యెహోవా కూడా మనకోసం తన కుమారుణ్ణి ఒక గిఫ్ట్‌గా ఇచ్చాడు. వెలకట్టలేని ఆ గిఫ్ట్‌కి, ఆయన చూపించిన ఆ ప్రేమకు అంటే విమోచన క్రయధనానికి మనం కృతజ్ఞత చూపించినప్పుడు యెహోవా కూడా చాలా సంతోషిస్తాడు. (యోహా. 3:16; రోమా. 5:7, 8) అయితే, రోజులు గడిచేకొద్దీ విమోచన క్రయధనం అనే గిఫ్ట్‌ని మనం మర్చిపోయే అవకాశం ఉంది. అదెలా ఉంటుందంటే, దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్‌ని తీసుకెళ్లి అటకెక్కించినట్టు ఉంటుంది. మొదట్లో చాలా సంతోషించాం కానీ మెల్లిమెల్లిగా దానిగురించి పూర్తిగా మర్చిపోతామేమో. అలా జరగకుండా ఉండాలంటే, యెహోవా అలాగే యేసుక్రీస్తు చూపించిన ప్రేమ గురించి మనం ప్రతీరోజు ఆలోచిస్తూ ఉండాలి. w25.01 26 ¶1-2
శుక్రవారం, ఏప్రిల్ 24
“వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.”—1 తిమో. 4:15.
పెద్ద అవ్వాలనుకునే బ్రదర్ “ఈ మధ్యే విశ్వాసిగా మారినవాడై” ఉండకూడదు. అంటే మీరు బాప్తిస్మం తీసుకుని చాలా సంవత్సరాలు అవ్వాలని కాదు. బదులుగా పరిణతిగల క్రైస్తవులు అవ్వడానికి కొంత సమయం పడుతుందని దాని అర్థం. మీరు సంఘ పెద్దగా నియమించబడక ముందే యేసులా వినయంగా ఉండాలి. యెహోవా మీకు నియామకాలు ఇచ్చేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడాలి. (మత్త. 20:23; ఫిలి. 2:5-8) మీరు యెహోవాను అంటిపెట్టుకుని ఉంటే, ఆయనకు నచ్చినట్టు జీవిస్తే, సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని పాటిస్తే మీరు ‘విశ్వసనీయులు’ అని నిరూపించుకుంటారు. పర్యవేక్షకులకు ఖచ్చితంగా “బోధించే సామర్థ్యం ఉండాలి” అని లేఖనాలు చెప్తున్నాయి. అంటే మీరు అదరగొట్టే ప్రసంగాలు ఇవ్వాలనా? కాదు. అర్హతలు సంపాదించిన చాలామంది పెద్దలు ప్రసంగాలు అంతబాగా ఇవ్వలేకపోయినా, పరిచర్యలో చక్కగా బోధిస్తారు, కాపరి సందర్శనాలు కూడా చాలా బాగా చేస్తారు. w24.11 23-24 ¶14-15
శనివారం, ఏప్రిల్ 25
“బంగారం కన్నా, మేలిమి బంగారం కన్నా నీ ఆజ్ఞలంటే నాకు ఎక్కువ ఇష్టం.”—కీర్త. 119:127.
బైబిలు చదువుతున్నప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే పరిశోధన చేయండి. ఆ తర్వాత రోజంతా మీరు చదివిన దానిగురించి, యెహోవా, యేసు చూపించిన ప్రేమ గురించి ఏం నేర్చుకున్నారో ఆలోచిస్తూ ఉండండి. (కీర్త. 119:97, అధస్సూచి) మీరు బైబిలు చదువుతున్నప్పుడు లేదా పరిశోధన చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త విషయం గానీ, ఆసక్తికరమైన విషయం గానీ దొరకకపోతే డీలాపడిపోకండి. బంగారం కోసం వెదికే వ్యక్తి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. చిన్న బంగారం ముక్క కోసం వాళ్లు ఎన్నో గంటల తరబడి, రోజుల తరబడి వెదుకుతూనే ఉంటారు. అది దొరక్కపోతే డీలాపడి, వెదకడం ఆపరు. ఎందుకంటే, రవ్వంత బంగారమైనా వాళ్లకు చాలా విలువైనది. నిజానికి, బైబిల్లో మనం నేర్చుకునే ప్రతీ కొత్త విషయం బంగారం కన్నా చాలా విలువైన రత్నం లాంటిది. (సామె. 8:10) కాబట్టి బైబిలు చదువుతూనే ఉండండి, కొత్త విషయాల కోసం ఓపిగ్గా వెదుకుతూనే ఉండండి.—కీర్త. 1:2. w25.01 25 ¶14-15
ఆదివారం, ఏప్రిల్ 26
“యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.”—కొలొ. 3:13.
మనల్ని బాధపెట్టినవాళ్లను మనం మనస్ఫూర్తిగా క్షమించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 86:5; లూకా 17:4; ఎఫె. 4:32) ఎవరైనా, ముఖ్యంగా మన అనుకున్నవాళ్లు నొప్పించేలా ఏమైనా అంటే లేదా ఏదైనా చేస్తే మనకు చాలా బాధగా అనిపిస్తుంది. (కీర్త. 55:12-14) కొన్నిసార్లు, మన మనసుకైన గాయాల్ని శరీరానికి అయ్యే గాయాలతో పోల్చవచ్చు. (సామె. 12:18) బాధగా అనిపించినప్పుడు మన ఫీలింగ్స్‌ని అణచుకోవడమో లేదా వాటిని పట్టించుకోకపోవడమో చేస్తాం. కానీ అలా చేస్తే శరీరాన్ని కత్తితో పొడిచి, గాయం దగ్గరే కత్తిని తీయకుండా వదిలేసినట్టు ఉంటుంది. కాబట్టి మన ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా ఉంటే అవే తగ్గిపోతాయిలే అని అనుకోకూడదు. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనకు వెంటనే కోపం రావచ్చు. అది సహజమే అని బైబిలు చెప్తుంది. అయితే ఆ కోపం మన మీద పైచేయి సాధించనివ్వకుండా చూసుకోవాలని బైబిలు హెచ్చరిస్తుంది. (కీర్త. 4:4; ఎఫె. 4:26) ఎందుకు? ఎందుకంటే కోపం చూపించడం వల్ల మనకు వచ్చేదేమీ ఉండదు. (యాకో. 1:20) కోపం రావడం సహజమే, కానీ ఆ కోపాన్ని పెంచుకుంటామా లేక దాన్ని తీసేసుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి. w25.02 15 ¶4-6
సోమవారం, ఏప్రిల్ 27
‘తెలివి తన యజమాని ప్రాణాన్ని కాపాడుతుంది.’—ప్రసం. 7:12.
“దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి” ఏ మాత్రం కృషి చేయకుండా కేవలం డబ్బును మాత్రమే పోగేసుకోవడం తెలివితక్కువతనం అని యేసు ఒక ఉదాహరణతో చెప్పాడు. (లూకా 12:16-21) ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. (సామె. 23:4, 5; యాకో. 4:13-15) అయితే, క్రీస్తు అనుచరులందరికీ ముఖ్యమైన సవాలు ఎదురౌతుంది. తన శిష్యులుగా ఉండాలనుకునే వాళ్లు తమకు ఉన్నవన్నీ వదిలేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పాడు. (లూకా 14:33) యూదయలో ఉన్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమకున్న వాటిని సంతోషంగా వదిలేశారు. (హెబ్రీ. 10:34) మన కాలంలో కూడా చాలామంది బ్రదర్స్ ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల తమకున్న మంచిమంచి ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు. (ప్రక. 13:16, 17) అవన్నీ చేయడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది? యెహోవా ఇచ్చిన ఈ మాటమీద వాళ్లకున్న కొండంత నమ్మకం: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.” (హెబ్రీ. 13:5) అవును, మన భవిష్యత్తు అవసరాల కోసం మనం చేయగలిగినదంతా చేస్తూ చక్కగా ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ఊహించని సంఘటనలు జరిగితే భారమంతా యెహోవా మీద వేస్తాం. w25.03 29 ¶13-14
మంగళవారం, ఏప్రిల్ 28
“మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి దాటేశాం కాబట్టి ఇప్పుడు పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం. వేసిన పునాదినే మళ్లీ వేయకుండా ఉందాం.”—హెబ్రీ. 6:1.
మనంతట మనమే పరిణతి సాధించాలని యెహోవా కోరుకోవట్లేదు. ఆయన మనకోసం సంఘంలో కాపరుల్ని, బోధకుల్ని ఇచ్చాడు. వాళ్లు మనం ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లం అయ్యేలా, “క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి” సాధించేలా సహాయం చేస్తారు. (ఎఫె. 4:11-13) యెహోవా మనకు పవిత్రశక్తి కూడా ఇస్తాడు. దానివల్ల మనం “క్రీస్తు మనసు” కలిగివుండవచ్చు. (1 కొరిం. 2:14-16) అంతేకాదు, ఆయన నాలుగు సువార్త పుస్తకాల్ని కూడా మనకోసమే రాయించాడు. అందులో యేసు భూమ్మీదున్నప్పుడు ఎలా ఆలోచించేవాడో, ఎలా మాట్లాడేవాడో, ఎలా ప్రవర్తించేవాడో ఉంది. యేసులా ఆలోచించినప్పుడు, పనులు చేసినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా పరిణతి సాధించవచ్చు. పరిణతి సాధించాలంటే, “మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి” దాటాలి. w24.04 4-5 ¶11-12
బుధవారం, ఏప్రిల్ 29
“ఆలోచనా సామర్థ్యం నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది, వివేచన నీకు కాపుదలగా ఉంటుంది.”—సామె. 2:11.
పొద్దున లేచిన దగ్గర్నుండి, పడుకునే వరకు మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ఏం తినాలి, ఎప్పుడు పడుకోవాలి లాంటి కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటాం. మరోవైపు, కాస్త పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటాం. వాటివల్ల మన ఆరోగ్యం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే యెహోవాను మనం ఎంత బాగా ఆరాధిస్తాం అనేది కూడా మన నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఎంతైనా మన నిర్ణయాల వల్ల మనకు, మన కుటుంబానికి మంచే జరగాలని కోరుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మన నిర్ణయాలు యెహోవాను సంతోషపెట్టాలని కూడా ఆశిస్తాం. (రోమా. 12:1, 2) మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని, వాస్తవాల్ని తెలుసుకోవడం. ఇది ఎందుకు ప్రాముఖ్యం? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. ఒక డాక్టర్ ఏదైనా పెద్ద జబ్బు వచ్చిన వ్యక్తికి చికిత్స ఎలా చేస్తాడు? రోగిని చూడకుండా లేదా అతన్ని ఏ ప్రశ్నలు అడగకుండానే చికిత్స మొదలుపెట్టేస్తాడా? లేదు కదా. మీరు కూడా ఆ మంచి డాక్టర్‌లాగే, పరిస్థితికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ ముందు తెలుసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. w25.01 14 ¶1-3
గురువారం, ఏప్రిల్ 30
“యెహోవా నీ పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు చనిపోవు.”—2 సమూ. 12:13.
మరోవైపు, యెహోవా కరుణ గురించి మనకు ఏం తెలుసు? “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు” అని ఎలా చూపించాడు? (2 పేతు. 3:9) ఘోరమైన పాపాలు చేసిన కొంతమంది మీద ఆయన ఎలా కరుణ చూపించాడో ఆలోచించండి. రాజైన దావీదు లైంగిక పాపం, హత్య లాంటి ఘోరమైన పాపాలు వెంటవెంటనే చేసినా, అతను పశ్చాత్తాపం చూపించినప్పుడు యెహోవా కరుణ చూపించి, క్షమించాడు. (2 సమూ. 12:1-12) రాజైన మనష్షే జీవితమంతా పాపాలతో నిండిపోయింది. ఘోరమైన పాపాలు చేసినా, అతను పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా కరుణ చూపించి, క్షమించాడు. (2 దిన. 33:9-16) కరుణ చూపించడానికి కారణాలు ఉన్నప్పుడు యెహోవా దాన్ని చూపిస్తాడని ఈ ఉదాహరణలు మనకు గుర్తుచేస్తున్నాయి. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుని, పశ్చాత్తాపపడతారో వాళ్లను ఆయన పునరుత్థానం చేస్తాడు. w24.05 4 ¶12