యెహోవాసాక్షుల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి?
చాలావరకు యెహోవాసాక్షుల పెళ్లిళ్లు సింపుల్‌గా, గౌరవప్రదంగా జరుగుతాయి. పెళ్లిలో బైబిలు ఆధారంగా ఒక చిన్న ప్రసంగం కూడా ఉంటుంది. తర్వాత అందరు ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుంటారు, కొన్నిసార్లు భోజన ఏర్పాట్లు కూడా ఉండొచ్చు.a యేసు తన పరిచర్య మొదలుపెట్టిన కొత్తలో కానాలో జరిగిన అలాంటి ఒక పెళ్లి విందుకు వెళ్ళాడు.—యోహాను 2:1-11.
వాళ్ల పెళ్లి కార్యక్రమం ఎలా జరుగుతుంది?
పెళ్లిలో అన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి ప్రసంగం. అది దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుంది. దాన్ని యెహోవాసాక్షుల్లోని ఒక సంఘపెద్ద ఇస్తాడు. ఆయన ఇచ్చే ప్రోత్సాహకరమైన ప్రసంగంలో, పెళ్లి చేసుకునేవాళ్లు కలకాలం సంతోషంగా, ప్రేమగా, కలిసిమెలిసి ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో చెప్తాడు.—ఎఫెసీయులు 5:33.
చాలా దేశాల్లో యెహోవాసాక్షుల్లో ఉన్న పెద్దలకు, పెళ్లిని చట్టబద్ధం చేసే అధికారం ప్రభుత్వం ఇస్తుంది. అలాంటప్పుడు ప్రసంగం చివర్లో పెళ్లికొడుకు, పెళ్లికూతురు పెళ్లి ప్రమాణాలు చేసుకుంటారు. తర్వాత వాళ్లు ఉంగరాలు కూడా మార్చుకోవచ్చు. చివర్లో, ఆ సంఘపెద్ద వాళ్లిద్దర్ని భార్యాభర్తలుగా ప్రకటిస్తాడు.
ఇంకొన్ని దేశాల్లో ప్రభుత్వ అధికారులే పెళ్లిని చట్టబద్ధం చేస్తారు. అలాంటప్పుడు పెళ్లి ప్రసంగానికి కొంచెం ముందు దంపతులే వెళ్లి రిజిస్టర్ చేసుకుంటారు. ఒకవేళ పెళ్లికొడుకు, పెళ్లికూతురు రిజిస్ట్రేషన్ సమయంలో పెళ్లి ప్రమాణాలు చేసుకోకపోతే, వాళ్లు ఆ ప్రసంగం చివర్లో చేసుకుంటారు. ఒకవేళ వాళ్లు రిజిస్ట్రేషన్ సమయంలోనే పెళ్లి ప్రమాణాలు చేసేసి ఉంటే, వాళ్లు దాన్ని మళ్లీ అందరి ముందు చెప్పాలనుకుంటే, ఆ ప్రమాణాలు అప్పటికే చేసేసినట్టుగా వాటిని కొంచెం మార్చి చెప్తారు. పెళ్లి ప్రసంగం ఒక ప్రార్థనతో ముగుస్తుంది. ఆ ప్రార్థనలో పెళ్లయిన జంటను దీవించమని యెహోవాను అడుగుతారు.
యెహోవాసాక్షుల పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతాయి?
రాజ్యమందిరం అందుబాటులో ఉంటే, చాలామంది యెహోవాసాక్షులు అక్కడే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు.b ఒకవేళ భోజనాలు పెట్టాలనుకుంటే, వాళ్లు దాన్ని వేరేచోట పెట్టుకుంటారు.
ఎవరెవరు రావచ్చు?
రాజ్యమందిరంలో జరిగే పెళ్లిళ్లకు అందరూ రావచ్చు. అంటే వాళ్లు యెహోవాసాక్షులు అయినా, కాకపోయినా రావచ్చు. పెళ్లి తర్వాత విందు ఏర్పాట్లు చేస్తే, దానికి ఎవరెవరిని పిలవాలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు నిర్ణయిస్తారు.
ఫలానా బట్టలే వేసుకోవాలని ఏమైనా ఉందా?
రాజ్యమందిరంలో జరిగే పెళ్లిళ్లకు ఫలానా బట్టలే వేసుకోవాలని ఏమీ లేదు. కానీ యెహోవాసాక్షులు తమ బట్టలు అణకువగా, గౌరవప్రదంగా ఉండాలన్న బైబిలు సూత్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తారు. (1 తిమోతి 2:9) ఆ పెళ్లికి వచ్చేవాళ్లు కూడా అదే సూత్రాన్ని పాటిస్తే, వాళ్లు చాలా సంతోషిస్తారు. ఒకవేళ పెళ్లికొడుకు, పెళ్లికూతురు విందు ఏర్పాటు చేస్తే, అక్కడ కూడా వాళ్లు అదే సూత్రాన్ని పాటిస్తారు.
పెళ్లికి వచ్చిన వాళ్లు గిఫ్ట్‌లు ఇవ్వొచ్చా?
ఉదారస్ఫూర్తి చూపించమని బైబిలు చెప్తుంది. (కీర్తన 37:21) కాబట్టి యెహోవాసాక్షులు సంతోషంగా గిఫ్ట్‌లు ఇస్తారు, అలాగే తీసుకుంటారు. (లూకా 6:38) అయితే, యెహోవాసాక్షులు గిఫ్ట్‌లు ఇవ్వమని ఎవర్నీ బలవంతపెట్టరు లేదా ఇచ్చినవాళ్ల పేర్లు అందరికి వినిపించేలా చదవరు. (మత్తయి 6:3, 4; 2 కొరింథీయులు 9:7; 1 పేతురు 3:8) ఎందుకంటే, అలాంటి ఆచారాలు లేఖన విరుద్ధమైనవి, అలాగే దానివల్ల పెళ్లికి వచ్చినవాళ్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.
టోస్టింగ్ చేస్తారా?
బైబిలు టోస్టింగ్ లేదా గ్లాసులు పైకెత్తి ఛీర్స్ చెప్పుకోవడం తప్పని చెప్పట్లేదు. కాకపోతే పెళ్లికి వచ్చిన వేరేవాళ్లు అభ్యంతర పడకుండ, కొంతమంది దంపతులు అతిథులను టోస్ట్ చేయొద్దని చెప్పొచ్చు.—రోమీయులు 14:21.
దంపతుల మీద అక్షింతలు లాంటివి జల్లుతారా?
లేదు. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన వాళ్లమీద ప్రజలు అక్షింతలు లాంటివి జల్లుతారు. ఎందుకంటే, అవి ఆ దంపతులకు అదృష్టాన్ని, సంతోషాన్ని, దీర్ఘాయుష్షును ఇస్తాయని వాళ్లు నమ్ముతారు. కానీ యెహోవాసాక్షులు అలాంటి మూఢనమ్మకాలను నమ్మరు. ఎందుకంటే, అదృష్టాన్ని నమ్మడం బైబిలు సూత్రాలకు వ్యతిరేకమైనది.—యెషయా 65:11.
భోజనం, మద్యం ఏర్పాట్లు చేస్తారా?
పెళ్లి రాజ్యమందిరంలో జరిగితే అక్కడ భోజనం గానీ మందు గానీ ఏర్పాటు చేయరు. కొంతమంది దంపతులు వేరేచోట భోజనాలు గానీ లేదా ఏదైనా తేలికపాటి ఆహారాన్ని గానీ పెట్టాలనుకోవచ్చు. (ప్రసంగి 9:7) ఒకవేళ పెళ్లి చేసుకునేవాళ్లు మద్యం కూడా పెట్టాలనుకుంటే, అది తక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటారు. అలాగే దాన్ని కేవలం తాగడానికి చట్టపరమైన వయసు ఉన్నవాళ్లకు మాత్రమే ఇస్తారు.—లూకా 21:34; రోమీయులు 13:1, 13.
అక్కడ మ్యూజిక్ గానీ డాన్స్ గానీ ఉంటుందా?
ఒకవేళ దంపతులు విందు ఏర్పాటు చేయాలనుకుంటే, వాళ్లు మ్యూజిక్‌ని, డాన్స్‌ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. (ప్రసంగి 3:4) మ్యూజిక్‌ని తమ సొంత అభిరుచులకు తగ్గట్టు, వాళ్ల సంస్కృతికి తగ్గట్టు ఎంచుకోవచ్చు. కానీ ఆ మ్యూజిక్ వచ్చిన అతిథులందరికీ ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపించేలా చూసుకోవాలి. రాజ్యమందిరాల్లో జరిగే పెళ్లిళ్లో లేఖనాల మీద ఆధారపడిన మ్యూజిక్ మాత్రమే ఉంటుంది.
యెహోవాసాక్షులు పెళ్లి రోజును జరుపుకుంటారా?
దాన్ని చేసుకోమని గానీ చేసుకోవద్దని గానీ బైబిలు చెప్పట్లేదు. కాబట్టి యెహోవాసాక్షులు తమ పెళ్లి రోజును జరుపుకోవాలా వద్దా అని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ వాళ్లు జరుపుకోవాలనుకుంటే, వాళ్లిద్దరే చేసుకోవచ్చు లేదా స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని పిలవచ్చు.
a ప్రాంతాన్నిబట్టి పెళ్లిలో వేర్వేరు పద్ధతులు, చట్టపరమైన విషయాలు ఉండొచ్చు.
b పెళ్లి ప్రసంగాన్ని ఇస్తున్న సంఘపెద్ద, ఆ ప్రసంగాన్ని ఇస్తున్నందుకు ఎలాంటి డబ్బులు తీసుకోడు. అలాగే రాజ్యమందిరాన్ని వాడుకుంటున్నందుకు ఎలాంటి చార్జీలు ఉండవు.