యేసును చూసి నేర్చుకోండి
ప్రపంచ శాంతి త్వరలో రాబోతుంది
మనలో ప్రతీ ఒక్కరం శాంతిగా ఉండే లోకంలో జీవించాలని కోరుకుంటాం. చరిత్రలోకి వెళ్తే ప్రపంచ నాయకులు గొడవల్ని ఆపడానికి, శాంతిని తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కొంతమేరకు వాళ్ల ప్రయత్నాలు ప్రశాంతతను తీసుకొచ్చాయి. కానీ, గొడవలు మళ్లీమళ్లీ చెలరేగాయి. పరిస్థితి ఇలానే ఉంటే, ప్రపంచ శాంతిని ఎప్పటికైనా చూస్తామా? చూస్తాం! దాని గురించి యేసు ఏం చెప్పాడో, భవిష్యత్తులో ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.
యేసు త్వరలో ఏం చేస్తాడు?
ప్రపంచ శాంతిని తీసుకురావడానికి యేసు త్వరలో ఏం చేస్తాడో బైబిలు చెప్తుంది.
“శాంతికి అధిపతి అని [యేసుకు] పేరు పెట్టబడుతుంది. ఆయన రాజ్యాధికారం పెరుగుతూ పోతుంది, అంతులేని శాంతి ఉంటుంది.“ (యెషయా 9:6, 7) దేవుని రాజ్యానికి రాజుగా, యేసు భూమంతటా శాంతి ఉండేలా చూసుకుంటాడు, ఆ శాంతి చిరకాలం ఉంటుంది.
“సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను . . . నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు.” (కీర్తన 72:12-14) యేసు తనకున్న అధికారాన్ని ఉపయోగించి అందరికీ సమానంగా న్యాయం తీరుస్తాడు. అలా ఆయన హింసకు, యుద్ధాలకు, బాధలన్నిటికీ ముగింపు పలుకుతాడు.
“దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు, వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.” (యెషయా 2:4) యేసు పరిపాలన కింద మనుషులందరూ యుద్ధాల్ని వదిలేసి, శాంతిగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు.
యేసు భవిష్యత్తులో శాంతిని ఎలా తీసుకొస్తాడో, దాన్ని చూడాలంటే మీరు ఏం చేయవచ్చో తెలుసుకోవడానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే ఈ చిన్న వీడియోని చూడండి.
యేసు ఏం చెప్పాడు?
ఈరోజుల్లో కూడా, యేసు బోధించిన విషయాలు శాంతిగా ఉండేలా లక్షలమందికి సహాయం చేస్తున్నాయి. పేరుగాంచిన కొండమీది ప్రసంగంలో, రోజూ శాంతిగా జీవించడానికి ఉపయోగపడే సలహాల్ని యేసు బోధించాడు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం.
“శాంతిని నెలకొల్పేవాళ్లు సంతోషంగా ఉంటారు.” (మత్తయి 5:9) యేసు తన అనుచరులను గొడవలకు దూరంగా ఉండండి అని మాత్రమే కాదు నలుగురికి శాంతిని పంచమని కూడా చెప్పాడు.
“ముందు నీ సహోదరునితో సమాధానపడు; తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.” (మత్తయి 5:23, 24) ఇతరులతో ఏమైనా మనస్పర్థలు వస్తే, వీలైనంత త్వరగా వాటిని సరిచేసుకోమని యేసు చెప్పాడు. ఇతరులతో శాంతిగా ఉంటేనే మనకు దేవునితో మంచి బంధం ఉంటుందని యేసు బోధించాడు.
“తీర్పు తీర్చడం ఆపేయండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు.” (మత్తయి 7:1) కఠినంగా తీర్పు తీర్చొద్దని, మనం చేయలేనివి ఇతరుల నుండి ఆశించవద్దని యేసు హెచ్చరించాడు. ఎందుకంటే అలాంటి ప్రవర్తన గొడవల్ని రేపుతుంది. లోపాల్ని ఎత్తి చూపించే బదులు, ఒకరినొకరు ‘క్షమించుకుంటూ ఉండమని’ యేసు చెప్పాడు.—లూకా 6:37.
యేసు బోధల్ని ప్రపంచంలో ఉన్న చాలామంది ప్రజలు పాటిస్తున్నారు. హింస-గొడవలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా కోప్పడకుండా గొడవల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో, ఎలా క్షమించుకోవచ్చో, ఎదుటివాళ్లు దయ చూపించకపోయినా ఎలా ప్రేమగా ఉండవచ్చో నేర్చుకుంటున్నారు.
శాంతిగా ఉండడానికి యేసు బోధలు కొంతమందికి ఎలా సహాయం చేశాయో తెలుసుకోవడానికి “యుద్ధాలు, దాడులు జరుగుతున్నా ప్రశాంతంగా ఉండవచ్చు” అనే ఆర్టికల్ చదవండి.