సెప్టెంబరు 14-20, 2026
పాట 41 దయచేసి నా ప్రార్థన ఆలకించు
యెషయా పుస్తకం నుండి ఓదార్పు పొందండి
“యెహోవా ఇలా అంటున్నాడు: . . . ‘తల్లి తన కుమారుణ్ణి ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాను.’”—యెష. 66:12, 13.
ముఖ్యాంశం
మనం బాధలో మునిగిపోయినప్పుడు, డీలాపడిపోయినప్పుడు యెషయా పుస్తకంలోని మాటల్ని ధ్యానించడం ఎలా ఓదార్పును ఇస్తుందో తెలుసుకుంటాం.
1-2. మనం బాధగా, దిగులుగా ఉన్నప్పుడు యెహోవా ఏం చేస్తాడు?
ఒక పిల్లవాడు వెక్కివెక్కి ఏడుస్తున్నట్టు ఊహించుకోండి. బహుశా ఇల్లు మారడం వల్ల తన ఫ్రెండ్స్‌ని వదిలి వెళ్తున్నానని ఆ అబ్బాయి బాధతో ఏడుస్తూ ఉండవచ్చు. లేదా, తను చేసిన తప్పు వల్ల నలిగిపోతూ ఉండవచ్చు. ఒక ప్రేమగల తల్లి తన పిల్లవాడు అలా ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోగలదా? వెంటనే తనని కౌగిలించుకుని, తన కన్నీళ్లు తుడిచి, ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకుంటుంది. అలాగే, తన పిల్లవాడు అంటే తనకు ఎంత ఇష్టమో కూడా చెప్తుంది.
2 యెహోవా తనను తాను ప్రేమ-అనురాగం ఉన్న ఒక తల్లితో పోల్చుకుంటున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు: “తల్లి తన కుమారుణ్ణి ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాను.” (యెష. 66:13) చెప్పాలంటే, అమ్మానాన్నల కంటే ఎక్కువగా యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు. (యెష. 49:15) మనం బాధగా, దిగులుగా ఉన్నప్పుడు యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనకు కావాల్సిన ఓదార్పును, బలాన్ని ఇస్తాడు.—రోమా. 15:4.
3. ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం?
3 యెహోవా ఓదార్పును ఇచ్చే మాటలతో యెషయా పుస్తకాన్ని నింపేశాడు. (యెష. 40:1) ఎందుకంటే, ఆ పుస్తకాన్ని రాస్తున్న సమయానికి యూదయలో ఉంటున్న తన ప్రజలు పెద్దపెద్ద కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. నేడు మనం ‘ప్రమాదకరమైన, కష్టమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. కాబట్టి మనకు కూడా ఓదార్పు చాలా అవసరం. (2 తిమో. 3:1) అయితే, ఈ ఆర్టికల్‌లో (1) మన జీవితం ఉన్నట్టుండి తలకిందులు అయినప్పుడు, (2) చేసిన తప్పుకు మన మనసు పదేపదే మనల్ని నిందిస్తున్నప్పుడు, (3) మనవాళ్లు చనిపోయారనే బాధలో మునిగిపోయినప్పుడు యెషయా పుస్తకంలోని కొన్ని వచనాలు మనకు ఎలా ఊరటను ఇస్తాయో, ఎలా బలపరుస్తాయో చూద్దాం.
మన జీవితం ఉన్నట్టుండి తలకిందులు అయినప్పుడు
4. మన జీవితం ఉన్నట్టుండి తలకిందులైతే ఎలా అనిపించవచ్చు?
4 సాఫీగా సాగుతున్న మన జీవితం ఉన్నట్టుండి తలకిందులు అయిపోవచ్చు. (ప్రసం. 9:11; 1 కొరిం. 7:31) ఆరోగ్యం పాడవ్వడం, ఆర్థికంగా ఇబ్బందులు రావడం, దేశంలో అల్లర్లు జరగడం, లేదా నియామకం మారడం వంటివాటి వల్ల అలా జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో, మనకు చాలా భయంగా, ఆందోళనగా అనిపిస్తుంది. ‘ఇప్పుడు నేను ఏం చేయాలి?’ అనే అయోమయంలో పడడం సహజమే. జోసెఫ్ అనే బ్రదర్ 17 ఏళ్లు బెతెల్‌లో సేవ చేశాడు. తర్వాత తన నియామకం మారడంతో పయినీరు సేవ మొదలుపెట్టాడు. ఆయన ఇలా అంటున్నాడు: “అంతకాలం బెతెల్‌లో ఉండి బయటకు వచ్చాక, మళ్లీ కొత్త జీవితం మొదలుపెట్టడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఏం చేయాలో, ఎలా చేయాలో అస్సలు తోచలేదు.” మన జీవితం కూడా ఉన్నట్టుండి మారిపోవచ్చు. అలాంటప్పుడు, యెహోవా మనకు యెషయా పుస్తకం ద్వారా ఏ అభయాన్ని ఇస్తున్నాడు?
5. యెషయా 42:16 లో యెహోవా మనకు ఏ అభయాన్ని ఇస్తున్నాడు? (చిత్రం కూడా చూడండి.)
5 యెషయా 42:16 చదవండి. యెహోవా గుడ్డివాళ్లను అంతగా పరిచయం లేని దారుల్లో నడిపిస్తానని, చీకటిని వెలుగుగా మారుస్తానని అభయాన్ని ఇస్తున్నాడు. మన పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోతే, భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలీదు. కాబట్టి మనకంతా ‘చీకటిగా’ ఉన్నట్టు, ‘గుడ్డివాళ్లం’ అయినట్టు అనిపించవచ్చు. జీవితం ‘అంతగా పరిచయంలేని దారిలా,’ ‘ఎగుడుదిగుడు ప్రదేశంలా’ కనిపిస్తుంది. చెప్పాలంటే, ఒక దట్టమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉంటాం. ఏదేమైనా యెహోవా మనల్ని నడిపిస్తానని, ఎప్పుడూ విడిచిపెట్టనని మాటిస్తున్నాడు. ఆయన చీకటిని చీల్చి వెలుగులో నడిపిస్తానని, ఎగుడుదిగుడు ప్రదేశాన్ని చదునుగా చేస్తానని చెప్తున్నాడు. ఎలా? తన వాక్యమైన బైబిలు ద్వారా, తన సంస్థ ద్వారా యెహోవా మనకు తెలివైన సలహాలు ఇస్తాడు. (కీర్త. 119:105; యెష. 30:21) అంతేకాదు మన బ్రదర్స్-సిస్టర్స్ ద్వారా, ఇతరుల ద్వారా కూడా సహాయం చేస్తాడు. మన ముందున్న దారి చీకటిగా ఉన్నప్పుడు, అందులో నడవడం కష్టంగా అనిపించినప్పుడు యెహోవా మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయనే ప్రేమతో మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు.—యెష. 41:10; 1 పేతు. 5:6, 7.
మీ జీవితం ఉన్నట్టుంది తలకిందులైనా, యెహోవా మాత్రం మీ చేయి వదలడు (5వ పేరా చూడండి)b
6. మన పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయినా మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
6 ముందు పేరాల్లో చూసిన జోసెఫ్, ఆయన భార్య బెతెల్ నుండి వచ్చేశాక యెహోవా సహాయాన్ని చూశారు. ఆయన ఇలా అంటున్నాడు: “ఆ సమయంలో మేము యెహోవా ప్రేమను కళ్లారా చూశాం. బ్రదర్స్-సిస్టర్స్ ద్వారా ఆయన మాకు సహాయాన్ని అందించాడు. సరైన సమయంలో మా అవసరాల్ని తీర్చాడు, మాకు ఓదార్పును ఇచ్చాడు. ఇప్పటికీ అలా చేస్తున్నాడు.” జీవితం తలకిందులు అవ్వడం వల్ల మీరు కూడా డీలాపడిపోయారా? అలాగైతే, యెహోవా మీకు అవసరమైన బలాన్ని, తెలివైన సలహాల్ని ఇచ్చి నడిపిస్తాడనే నమ్మకంతో ఉండండి. (యెష. 54:10; 58:11) జోసెఫ్ ఇంకా ఇలా చెప్తున్నాడు: “నాకు మన ప్రత్యేక పాటల్లో ఒకటంటే చాలా ఇష్టం. పరిస్థితులు తారుమారైనా యెహోవా నాతో ఎప్పుడూ ఉంటాడనే ధైర్యాన్ని అది నాకు ఇచ్చింది.a మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా, ఒక విషయం మాత్రం గ్యారంటీ: యెహోవా ప్రతీ అడుగులో మనకు తోడుగా ఉంటాడు.”
మన మనసు పదేపదే మనల్ని నిందిస్తున్నప్పుడు
7. గతంలో చేసిన తప్పుల వల్ల కొంతమందికి ఎలా అనిపిస్తుంది?
7 మనం ఏదైనా ఒక పెద్ద తప్పు చేసి దాన్ని ఒప్పుకున్నప్పుడు, సంఘపెద్దలు ప్రేమతో మనకు సహాయం చేస్తారు. మనం కూడా ఆ తప్పును మళ్లీ చేయకుండా ఉండడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తాం. అప్పుడు మనం యెహోవా క్షమాపణ పొందుతాం. (సామె. 28:13; యాకో. 5:14-16; 1 యోహా. 1:9) అయినాసరే, మన మనసు ‘నేను ఇంత పెద్ద తప్పు చేశాను కదా, యెహోవా నన్ను ఎలా క్షమిస్తాడు?’ అని పదేపదే మనల్ని నిందిస్తూ ఉంటుంది. (2 కొరిం. 2:7) నిజమే, మనం చేసిన తప్పుల వల్ల మనకు చాలా భారంగా అనిపిస్తుంది, ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దావీదు ఆ బాధ ఎలా ఉంటుందో చెప్తూ, ఇలా రాశాడు: “నా పాపం కారణంగా నా ఎముకల్లో ప్రశాంతతే లేదు . . . నేను మొద్దుబారిపోయాను, పూర్తిగా నలిగిపోయాను.” (కీర్త. 38:3, 8) మీకు కూడా అలానే అనిపిస్తుంటే, యెషయా పుస్తకంలోని మాటలు ఓదార్పును ఇస్తాయి.
8-9. యెషయా 1:18 ప్రకారం యెహోవా ఎంతగా క్షమిస్తాడు?
8 యెషయా 1:18 చదవండి. యెహోవా ఎంత అధికంగా క్షమిస్తాడో ఒక ఉదాహరణ ద్వారా చెప్పాడు. మన “పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా” దాన్ని “మంచు అంత తెల్లగా” చేస్తానని అంటున్నాడు. ఒక ఎర్రని మచ్చ మన బట్టలకు అంటితే, అది అస్సలు పోదు. కానీ యెహోవా మనల్ని క్షమించినప్పుడు, ఆ మచ్చ కొంచెం కూడా కనిపించకుండా చేస్తానని అంటున్నాడు. అంటే, మన పాపాల్ని ఇంకెప్పుడూ గుర్తుచేసుకోను అనే భరోసాను ఇస్తున్నాడు.
9 దావీదు ఉదాహరణే తీసుకోండి. ఆయన వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు కానీ యెహోవా ఆయన్ని క్షమించాడు. ఆ తర్వాత ఆయన్ని యథార్థ హృదయం ఉన్న వ్యక్తి అని పిలిచాడు. (2 సమూ. 11:3, 4, 14, 15; 12:13; 1 రాజు. 9:4, 5) యెహోవా దావీదు చేసిన తప్పుల్ని కాదుగానీ, ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడో గుర్తు పెట్టుకున్నాడు. మన విషయంలో కూడా అంతే. మనం చేసిన తప్పుకు పశ్చాత్తాపపడితే యెహోవా మనల్ని క్షమిస్తాడు, మంచి మనస్సాక్షితో ముందుకు వెళ్లేలా సహాయం చేస్తాడు. దీని గురించి యెషయా పుస్తకంలో, యెహోవా మనకు ఇంకా ఏ భరోసాను ఇస్తున్నాడు?
10. యెషయా 38:17 లోని మాటలు మనకు ఎలా ఓదార్పును ఇస్తాయి?
10 యెషయా 38:17 అలాగే అధస్సూచి చదవండి. “నా పాపాలన్నిటినీ నీ వెనక పారేశావు” అనే మాటల్ని “నా పాపాలన్నిటినీ నీ కళ్లముందు నుండి తొలగించేశావు” అని కూడా అనొచ్చు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడితే ఆ వ్యక్తి పాపాల్ని యెహోవా తన వెనక్కి పారేసుకుంటాడు. అంటే, ఆయన ఇక వాటిని చూడాలనుకోడు లేదా వాటి గురించి ఆలోచించాలని అనుకోడు. ఒక రెఫరెన్సు పుస్తకం ఆ మాటల్ని ఇలా అనువదించింది: ‘నేను అసలు పాపం చేయనట్టే నువ్వు చూస్తున్నావు.’ యెహోవా ఒక్కసారి మన పాపాన్ని క్షమించాడంటే, మనం దాన్ని చేయనట్టుగానే చూస్తాడు. తర్వాత మనల్ని నిందించడానికి లేదా శిక్షించడానికి దాన్ని మళ్లీ తవ్వితీయడు. ఆయన మన పాపాల్ని లెక్కపెట్టే బదులు వాటన్నిటిని చెరిపేస్తాడు. ఆయన ఇలా మాటిస్తున్నాడు: “నీ పాపాన్ని నేను గుర్తుచేసుకోను.” (యెష. 43:25) ఆ మాటలు మనకు ఎంత ఓదార్పును ఇస్తాయో కదా! మహాగొప్ప న్యాయమూర్తి అయిన యెహోవాయే మన పాపాల్ని గుర్తుపెట్టుకోనప్పుడు మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?
ఎప్పుడో చేసిన తప్పులకు, ఇప్పుడున్న సంతోషం ఆవిరైపోకుండా చూసుకుందాం
11. యెహోవాకు ఏది ముఖ్యం? (చిత్రం కూడా చూడండి.)
11 గతంలో చేసిన తప్పులకు మన మనసు మనల్ని బాగా నిందిస్తుంటే, యెహోవా ప్రేమతో ఇస్తున్న భరోసాను గుర్తుంచుకోవాలి. ఆయన మనల్ని పూర్తిగా క్షమిస్తాడు. మనల్ని తన స్నేహితులని చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడు. మనుషులైతే, ఇతరుల తప్పుల్ని గుర్తుంచుకొని కోపం పెంచుకుంటారు, కానీ యెహోవా అలా కాదు. (యెష. 57:16) మనం గతంలో ఎలా ఉన్నాం అనే దానికన్నా ప్రస్తుతం ఎలా ఉన్నాం, ఎలా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అనేదే ఆయనకు ముఖ్యం. (యెష. 55:7) మన దేవుడు ఎంత ప్రేమగలవాడో, ఎంతగా క్షమిస్తాడో గుర్తుచేసుకుంటే మన గుండెల మీదున్న భారమంతా దిగిపోయి, మనశ్శాంతిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడో చేసిన తప్పులకు, ఇప్పుడున్న సంతోషం ఆవిరైపోకుండా, భవిష్యత్తులో పొందే దీవెనల్ని పోగొట్టుకోకుండా చూసుకుందాం.
మనల్ని చూసినప్పుడు, యెహోవాకు మనం గతంలో చేసిన తప్పులు గుర్తుకురావు (11వ పేరా చూడండి)c
మనవాళ్లు చనిపోయారనే బాధలో మునిగిపోయినప్పుడు
12. ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు మనకు ఎలా అనిపించవచ్చు?
12 మనకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు వచ్చే బాధ చాలాకాలం ఉంటుంది. దాన్ని మనం మాటల్లో చెప్పలేం. కొన్నిసార్లు, అసలు వాళ్లు చనిపోయేలా యెహోవా ఎందుకు అనుమతించాడని అనిపిస్తుంది. మైఖెల్ అనే బ్రదర్ వాళ్ల అమ్మానాన్నలు అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఇలా అంటున్నాడు: “నా గుండె ముక్కలైపోయింది. యెహోవా వాళ్లను ఎందుకు చనిపోయేలా చేశాడని ఆయన మీద నాకు కోపం వచ్చింది. వాళ్ల చావుకు ఆయన కారణం కాదని నాకు తెలుసు, కానీ వాళ్లు చనిపోకుండా ఎందుకు ఆపలేదు అని అనిపించేది.” బహుశా మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ రావచ్చు. మనం బాధలో మునిగిపోయినప్పుడు యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తాడు? మనలో ఎలాంటి ఆశను నింపుతాడు?
13. యెషయా 25:8 లో యెహోవా మనకు ఏ మాటిస్తున్నాడు?
13 యెషయా 25:8 చదవండి. యెహోవా ‘మరణాన్ని మింగేస్తాను’ అని మాటిస్తున్నాడు. మరణమే లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించండి. కావాల్సినవాళ్లు చనిపోయారని మనం ఇంకెప్పుడూ కంటతడిపెట్టం. (యెష. 35:10) చనిపోయినవాళ్లను గుర్తుచేసుకుని బాధపడే అవసరం ఉండదు. చావు ఇక ఉండదని, మనవాళ్లు ఎప్పుడూ సంతోషంగా-ఆరోగ్యంగా ఉంటారని మనం ఆశతో ఉండవచ్చు. ఇవి వట్టి మాటలు కావు, ఎందుకంటే వాటిని నిజం చేసే శక్తి ఉన్న యెహోవాయే ఆ మాటల్ని చెప్పాడు.—ప్రక. 21:4, 5.
14. చనిపోయినవాళ్లు తిరిగి లేస్తారనే ఆశ గురించి ఆలోచించినప్పుడు మీకెలా అనిపిస్తుంది? (యెషయా 26:19) (చిత్రం కూడా చూడండి.)
14 యెషయా 26:19 చదవండి. యెహోవా మరణాన్ని లేకుండా చేయడమే కాదు, చనిపోయిన వాళ్లకు తిరిగి ప్రాణం కూడా పోస్తాడు. దాని గురించి ఆయన ఇలా అంటున్నాడు: “నావాళ్ల శవాలు లేస్తాయి.” ఇక్కడ “నావాళ్లు” అనే మాటను బట్టి, అలా లేపడాన్ని ఆయన తన బాధ్యతగా చూస్తున్నాడని అర్థమవుతుంది. సమయం వచ్చినప్పుడు జీవానికి మూలమైన యెహోవా వాళ్లందరికీ ప్రాణం పోస్తాడు. అప్పటిదాకా వాళ్లను తన జ్ఞాపకంలో పదిలంగా ఉంచుకుంటాడు. ఎలాగైతే, తెల్లవారుజామున పడే మంచు ఎండిపోయిన మొక్కలకు జీవాన్నిస్తుందో, అలాగే యెహోవా కూడా చనిపోయిన వాళ్లందరికీ జీవాన్నిస్తాడు. కొత్త లోకంలో వాళ్లను తిరిగి ఆహ్వానిస్తున్నప్పుడు, మన ఆనందానికి అవధులు ఉండవు!—మార్కు 5:42 పోల్చండి.
మనవాళ్లు తిరిగి బ్రతుకుతారనే మాట వందకు వంద శాతం నిజం (14వ పేరా చూడండి)
15. చనిపోయినవాళ్లు తిరిగి లేస్తారనే ఆశ మన బాధను భరించడానికి ఎలా సహాయం చేస్తుంది?
15 నిజమే, యెహోవా చనిపోయినవాళ్లను తిరిగి లేపుతాడనే ఆశ మన బాధను పూర్తిగా తీసేయలేదు. కానీ యెహోవా మన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మర్చిపోలేదనే విషయం మనకు ఊరటను ఇస్తుంది. ఇందాక చెప్పిన మైఖెల్ అనే బ్రదర్ కూడా దానివల్లే ఓదార్పు పొందాడు. ఆయన ఇలా అంటున్నాడు: “యెషయా 26:19 చదివినప్పుడు, యెహోవాకు మా అమ్మానాన్నలు అంటే చాలా ఇష్టమని నేను అర్థంచేసుకున్నాను. ఇప్పటివరకు ఆయన వాళ్లను తన జ్ఞాపకంలో సురక్షితంగా ఉంచుకున్నాడు. ఇకపై కూడా, అంటే భవిష్యత్తులో వాళ్లను తిరిగి లేపేంత వరకు కూడా యెహోవా వాళ్లను తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఈ విషయం నాకు బలాన్ని, ఓదార్పును ఇచ్చింది.” మనం కూడా చనిపోయిన మనవాళ్లను తిరిగి కలుస్తామనే ఆశ మీద మనసుపెడితే, మన బాధను భరించడం కాస్త తేలిక అవుతుంది.
16. కష్టాల వల్ల ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు, మీకు ఏ లేఖనం ఊరటనిచ్చింది?
16 ఇప్పటివరకు మనం యెషయా పుస్తకంలో ఉన్న కొన్ని లేఖనాల్ని పరిశీలించాం. పరిస్థితులు ఉన్నట్టుండి తలకిందులైనప్పుడు, మన మనసు పదేపదే మనల్ని నిందిస్తున్నప్పుడు, చనిపోయినవాళ్ల గురించి బాధపడుతున్నప్పుడు ఆ లేఖనాలు మనకు ఓదార్పును ఇస్తాయి. తన వాక్యం ద్వారా యెహోవా మనల్ని ఓదారుస్తున్నందుకు మనం ఆయనకు ఎంత రుణపడి ఉండాలో కదా! (కీర్త. 94:19) కష్టాల వల్ల ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు, మీకు ఏ లేఖనం ఊరటనిచ్చింది? వీలైతే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, మీ నోట్స్‌లో దాన్ని రాసుకోండి లేదా మీకు బాగా కనిపించే చోట దాన్ని పెట్టుకోండి. అలా, మన ప్రేమగల తండ్రైన యెహోవా మాటల నుండి మనం ఊరటను పొందుతూ ఉందాం.
పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం
a ఆ ప్రత్యేక పాట పేరు “యెహోవా నాతో లేడా!”
b చిత్రాల వివరణ: బెతెల్ నుండి వచ్చేసిన ఒక జంటను సంఘంలో అందరూ ప్రేమగా ఆహ్వానిస్తున్నారు.
c చిత్రాల వివరణ: ఒక బ్రదర్ గతంలో చేసిన తప్పుల్ని పక్కనపెట్టి, పయినీరు పాఠశాలను ఎంజాయ్ చేస్తున్నాడు.