సెప్టెంబరు 7-13, 2026
పాట 88 నీ మార్గాలు నాకు తెలియజేయి
గిబియోనీయుల నుండి నేర్చుకోండి
“గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వాళ్ల మధ్య ఉంటున్నారు.”—యెహో. 10:1.
ముఖ్యాంశం
గిబియోనీయుల నుండి, యెహోవా వాళ్లను చూసుకున్న విధానం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చో చూస్తాం.
1-2. గిబియోనీయుల కథను మనం ఎందుకు తెలుసుకోవాలి?
క్రీస్తు పూర్వం 1473లో ఇశ్రాయేలీయులు వాగ్దానం దేశాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు యెరికో, హాయి నగరాల మీద అప్పటికే తిరుగులేని విజయం సాధించారు. కానీ తర్వాత వాళ్లు ఊహించని ఒక సంఘటన జరిగింది. ఇశ్రాయేలీయుల దగ్గరికి కొంతమంది వచ్చారు. వాళ్లు దేవుని ప్రజలతో సంధి చేసుకోవడానికి చాలా దూరదేశం నుండి వచ్చామని చెప్పారు.
2 వాళ్లే గిబియోనీయులు! బైబిల్లోని ఈ సందర్భంతోనే వాళ్లు మనకు పరిచయమౌతారు. ఆ తర్వాత కూడా, వాళ్ల గురించి బైబిల్లో చూస్తాం. వాళ్లు చాలాకాలం ఇశ్రాయేలీయులతో కలిసి జీవించారు. వాళ్ల కథ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అలాగే, యెహోవా గురించి కూడా ఎన్నో విషయాల్ని తెలియజేస్తుంది.
విశ్వాసం, వినయం చూపించండి
3. (ఎ) గిబియోనీయులు ఎవరు? (బి) వాళ్లు ఇశ్రాయేలీయులతో ఎందుకు సంధి చేసుకోవాలని అనుకున్నారు?
3 కనాను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, ఇశ్రాయేలీయులు ఏడు దేశాల్ని ఓడించాలి. ఆ దేశాలు వాళ్ల కన్నా “పెద్దవి, బలమైనవి.” వాటిలో హివ్వీయుల దేశం ఒకటి, గిబియోనీయులు ఆ దేశానికి చెందిన వాళ్లే. మిగతా దేశాల్లాగే గిబియోనీయుల సైన్యం కూడా చాలా పెద్దది. (ద్వితీ. 7:1) అంతేకాదు, వాళ్లు కట్టుదిట్టంగా ఉండే గిబియోను అనే నగరంలో ఉండేవాళ్లు. (యెహో. 10:2) అయితే వాళ్లు మిగతా కనానీయుల్లా, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవా పోరాడుతున్నాడని, ఆయన కనానును తప్పకుండా వాళ్లకు ఇస్తాడని, వాళ్లతో యుద్ధం చేస్తే ఓటమి తప్పదని గిబియోనీయులు అర్థం చేసుకున్నారు. (నిర్గ. 34:11; యెహో. 9:24) అందుకే యెరికో, హాయి నగరాల్ని ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారని తెలియగానే, వాళ్లతో సంధి చేసుకోవడానికి కొంతమందినిa గిల్గాలులో ఉన్న యెహోషువ దగ్గరికి పంపించారు.
4. (ఎ) యెహోషువ 9:8-13 లో చూసినట్టు, గిబియోనీయులు ఇశ్రాయేలీయుల్ని ఎలా నమ్మించారు? (చిత్రం కూడా చూడండి.) (బి) నిజం బయటపడినప్పుడు ఏం జరిగింది?
4 యెహోషువ 9:8-13 చదవండి. చాలా దూరదేశం నుండి వచ్చామన్నట్టు గిబియోనీయులు యెహోషువను నమ్మించారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చేలా, అమోరీయుల రాజులైన సీహోనును, ఓగును ఓడించేలా యెహోవా ఎలా సహాయం చేశాడో విన్నామని చెప్పారు. “ఎంతో దూరదేశం” నుండి వచ్చామని నమ్మించడానికి వాళ్లు తెలివిగా యెరికో, హాయి నగరాల గురించి అస్సలే మాట్లాడలేదు. ఎందుకంటే ఆ వార్త అంత త్వరగా దూరదేశాలకు చేరి ఉండదు. యెహోషువ అలాగే ఇతర నాయకులు వాళ్లు చెప్పినదంతా నమ్మి, యెహోవాను అడగకుండానే గిబియోనీయులతో సంధి చేసుకున్నారు. (యెహో. 9:14, 15) తర్వాత, నిజం బయటపడింది! అయితే, ఇశ్రాయేలీయులు అప్పటికే “యెహోవా పేరున ఒట్టేసి వాళ్లకు ప్రమాణం చేశారు” కాబట్టి, దానికి కట్టుబడి ఉన్నారు. (యెహో. 9:16-19) అప్పటినుండి, గిబియోనీయులు సేవకుల్లా పని చేస్తూ “సమాజం కోసం, యెహోవా ఎంపిక చేసే స్థలంలో ఉండే ఆయన బలిపీఠం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా” ఇశ్రాయేలీయుల మధ్య నివసించారు.—యెహో. 9:27.
తమతో సంధి చేసుకునేలా గిబియోనీయులు యెహోషువను నమ్మించారు (4వ పేరా చూడండి)
5. గిబియోనీయులు ఏయే విధాలుగా యెహోవా మీద విశ్వాసం చూపించారు?
5 గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారని విన్న వెంటనే, ఐదుగురు అమోరీయుల రాజులు కలిసి గిబియోను మీద దాడికి దిగారు. అప్పుడు గిబియోనీయులు, సహాయం చేయమని యెహోషువను వేడుకున్నారు. (యెహో. 10:3-7) వెంటనే ఆయన తన సైన్యంతో రంగంలోకి దిగాడు. యెహోవా కూడా వాళ్లకు తోడుగా ఉన్నాడు. యెహోవా ఆ శత్రువుల మీద పెద్దపెద్ద వడగండ్లను కురిపించాడు. అంతేకాదు ఎప్పుడూ జరగని ఒక అద్భుతం చేశాడు. వాళ్లు యుద్ధం గెలిచేంత వరకు సూర్యుడు అస్తమించకుండా చేశాడు! (యెహో. 10:9-14) ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోవడం ద్వారా, ప్రమాదంలో ఉన్నప్పుడు యెహోషువను సహాయం అడగడం ద్వారా గిబియోనీయులు యెహోవా మీద విశ్వాసం చూపించారు. యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, తమను కాపాడతాడని వాళ్లు నమ్మారు.
6. ఈ సందర్భం నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?
6 దీని నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు? యెహోవాకు కరుణ, వినయం అనే లక్షణాలు ఉన్నాయి. ఆయన ఇశ్రాయేలీయులకు ముందుగానే ఈ ఆజ్ఞ ఇచ్చాడు: కనాను “దేశ నివాసులందర్నీ మీ ముందు నుండి వెళ్లగొట్టాలి.” వాళ్లలో గిబియోనీయులు కూడా ఉన్నారు. (సంఖ్యా. 33:51, 52) కానీ ఇశ్రాయేలీయులు వాళ్లతో సంధి చేసుకున్నారు కాబట్టి, యెహోవా కరుణ చూపించి గిబియోనీయుల్ని ప్రాణాలతో వదిలేశాడు. తనను అడగకుండా ఇశ్రాయేలీయులు సంధి చేసుకున్నా సరే, యెహోవా అలా చేశాడు. అంతేకాదు గిబియోనీయుల్ని అద్భుతంగా కాపాడి, ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఇశ్రాయేలీయులకు సహాయం చేశాడు.—యెహో. 9:26; 11:19.
7. మనం కూడా గిబియోనీయుల్లా విశ్వాసం, వినయం ఎలా చూపించవచ్చు? (చిత్రం కూడా చూడండి.)
7 మనం గిబియోనీయుల్లా ఎలా ఉండవచ్చు? యెహోవా మీద బలమైన విశ్వాసం పెంచుకుంటూ ఉండాలి. అప్పటి గిబియోనీయులతో పోలిస్తే, ఇప్పుడు మనకు యెహోవా గురించి బాగా తెలుసు. కాబట్టి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచడానికి మనకే చాలా కారణాలు ఉన్నాయి. (కీర్త. 40:4, 5) అంతేకాదు, యెహోవా సేవలో ఎంత చిన్న పనైనా సరే, దాన్ని చేయడానికి ఇష్టంగా ముందుకు రావడం ద్వారా మనం గిబియోనీయుల్లా ఉండవచ్చు. (యెహో. 9:23, 27) లూక్ అనే అబ్బాయి అలాంటి స్ఫూర్తిని ఒక పెద్దవయసు బ్రదర్‌లో చూశాడు. ఆ పెద్దవయసు బ్రదర్‌కి బెతెల్‌లో ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. అయినా, బ్రదర్స్-సిస్టర్స్ రాజ్యమందిరాన్ని కడుతున్నప్పుడు, రాత్రిపూట దానికి కాపలా ఉండడానికి ఆయన ఇష్టంగా ముందుకు వచ్చాడు. లూక్ ఇలా అంటున్నాడు: “వినయం అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది మనం చేసే పనుల్లో కనిపిస్తుందని నాకు అర్థమైంది.” కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవా మీద ఆధారపడడం ద్వారా, ఏ నియామకం అయినా వినయంగా చేయడం ద్వారా మనం ఆయన మీద విశ్వాసం ఉందని చూపిస్తాం.
చిన్నచిన్న పనులు చేయడానికి కూడా ముందు ఉంటూ, గిబియోనీయుల్లా వినయం చూపించండి (7వ పేరా చూడండి)
యెహోవా అన్యాయాన్ని సరిచేసే వరకు ఎదురుచూడండి
8. గిబియోనీయులతో సౌలు ఎలా అన్యాయంగా ప్రవర్తించాడు?
8 మనకు బైబిల్లో గిబియోనీయుల గురించి మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది. ఈసారి ఏం జరిగిందంటే, రాజైన సౌలు ఇశ్రాయేలులో ఉంటున్న గిబియోనీయుల మీద దాడి చేశాడు. “ఇశ్రాయేలు, యూదా ప్రజల విషయంలో ఉన్న ఉత్సాహంతో” వాళ్లను తుడిచిపెట్టేయాలని ఆయన అనుకున్నాడు.b దానివల్ల చాలామంది గిబియోనీయులు చనిపోయారు. (2 సమూ. 21:2, 5, 6) ఎంత అన్యాయం! ఇశ్రాయేలీయులు-గిబియోనీయుల మధ్య చాలా కాలంగా ఉన్న శాంతి ఒప్పందాన్ని సౌలు అస్సలు లెక్క చేయలేదు.
9. గిబియోనీయులు న్యాయం కోసం ఎంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది?
9 గిబియోనీయులు న్యాయం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. చెప్పాలంటే, సౌలు పరిపాలన పూర్తయ్యి, దావీదు పరిపాలన మొదలయ్యేంత వరకు వాళ్లకు న్యాయం జరగలేదు. అయితే దావీదు పరిపాలనలో, మూడు సంవత్సరాలు కరువు రప్పించడం ద్వారా చివరికి యెహోవాయే ఆ అన్యాయాన్ని బయటపెట్టాడు. ఆ కరువు ఎందుకు వచ్చిందని దావీదు యెహోవాను అడిగినప్పుడు సౌలు, అతని ఇంటివాళ్లే దానికి కారణమని, గిబియోనీయులను చంపిన రక్తాపరాధం వాళ్ల మీద ఉందని యెహోవా చెప్పాడు.—2 సమూ. 21:1.
10. రెండవ సమూయేలు 21:3-6 ప్రకారం, గిబియోనీయులకు ధర్మశాస్త్రం మీద గౌరవం ఉందని ఎలా చెప్పవచ్చు?
10 రెండవ సమూయేలు 21:3-6 చదవండి. సౌలు చేసిన ఘోరమైన పనికి నష్టపరిహారంగా ఏం చేయవచ్చని దావీదు గిబియోనీయులను అడిగాడు. అదే అవకాశంగా తీసుకుని, వాళ్లు దావీదు దగ్గర బాగా డబ్బులు తీసుకోవాలని చూశారా? లేదు. అది “బంగారంతో గానీ వెండితో గానీ ప్రాయశ్చిత్తం” అయ్యేది కాదని వాళ్లు చెప్పారు. ఆ మాట అక్షరాల నిజం! ఎందుకంటే, ధర్మశాస్త్రం ప్రకారం హంతకుడి ప్రాణాన్ని విడిపించడానికి ఎలాంటి విమోచనా మూల్యం తీసుకోకూడదు. (సంఖ్యా. 35:30, 31) అంతేకాదు, రాజు ఆజ్ఞాపిస్తే తప్ప ఎవరినీ చంపకూడదని కూడా వాళ్లకు తెలుసు. కాబట్టి, సౌలు కుటుంబంలో ఏడుగురు పురుషుల్ని చంపడానికి దావీదు రాజు అనుమతించాడు. బహుశా వాళ్లు, గిబియోనీయుల వంశాన్ని తుడిచిపెట్టడానికి సౌలుకు సహాయం చేసుంటారు. తర్వాత, వర్షాలు పడి కరువు ముగిసింది. అలా, గిబియోనీయులకు జరిగిన అన్యాయం విషయంలో తన కోపం చల్లారిందని యెహోవా చూపించాడు.—2 సమూ. 21:9, 10, 14.
11. ఈ సందర్భం నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?
11 దీని నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు? యెహోవా న్యాయంగల దేవుడని స్పష్టంగా అర్థమవుతుంది. (కీర్త. 37:28) దేశం, జాతి, మతం, కులం వంటివాటి వల్ల పక్షపాతాన్ని ఎదుర్కొంటున్న వాళ్లతో సహా అందరికీ న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని ప్రజల్లో కూడా చాలామంది హింసను, అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారు. కొత్త లోకంలో వాళ్లకు న్యాయం చేస్తానని, ఇంకెప్పుడూ అన్యాయం జరగకుండా చూసుకుంటానని యెహోవా మాటిచ్చాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయులు గిబియోనీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని యెహోవా కోరుకున్నట్టే, మనం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.—ఆమోసు 1:9 పోల్చండి.
12. మనకు అన్యాయం జరిగినప్పుడు గిబియోనీయుల్లా ఎలా ఉండవచ్చు?
12 మనం గిబియోనీయుల్లా ఎలా ఉండవచ్చు? కొన్నిసార్లు మనకు బ్రదర్స్-సిస్టర్స్ వల్లే అన్యాయం జరగవచ్చు. అలాంటప్పుడు కూడా, యెహోవా తగిన సమయంలో పరిస్థితుల్ని సరిచేసేంత వరకు మనం ఓపిగ్గా ఎదురుచూడాలి. అలా చేసినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉందని చూపిస్తాం. లారా ఫ్రెంచ్ అనే సిస్టర్ ఉదాహరణ చూడండి. 1926లో ఆమె కెనడా బెతెల్‌లో పనిచేయడం మొదలుపెట్టింది. పది సంవత్సరాల తర్వాత, ఆమెకు ఘోరమైన అన్యాయం జరిగింది. మతభ్రష్టుల గుంపులో చేరిందని ఆమె మీద తప్పుడు నింద పడింది. దాంతో ఆమెను బెతెల్ నుండి పంపించేశారు. అప్పుడు ఆమె ఏం చేసింది? జరిగిన దానికి ఆమె మనసు ముక్కలైనా, సంస్థ గురించి గానీ బ్రదర్స్ గురించి గానీ ఆమె ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఆమె నాలుగు సంవత్సరాలు ఉత్సాహంగా పయినీరు సేవ కూడా చేసింది. సంతోషకరంగా, 1940లో ఆమెను మళ్లీ బెతెల్‌కు ఆహ్వానించారు. అప్పటినుండి 50 సంవత్సరాలు నమ్మకంగా సేవచేసి తన భూజీవితాన్ని ముగించుకుంది. మనం కూడా ఆ సిస్టర్‌లాగే అన్యాయం జరిగినప్పుడు, యెహోవా తగిన సమయంలో పరిస్థితుల్ని సరిచేస్తాడని ఓపిగ్గా ఎదురుచూస్తూ, పట్టుదలగా సరైంది చేద్దాం.—యెష. 26:3, 4.
నమ్మకంగా యెహోవా సేవ చేస్తూ ఉండండి
13. “నెతీనీయులు” ఎవరు? యూదులు బబులోను నుండి విడుదలైనప్పుడు నెతీనీయులు ఏం చేశారు?
13 దావీదు పరిపాలించిన 500 సంవత్సరాల తర్వాత, మళ్లీ గిబియోనీయుల గురించి బైబిల్లో చూస్తాం. యూదులు 70 సంవత్సరాలు బబులోనులో బందీలుగా ఉండి విడుదలయ్యారు. దాంతో క్రీస్తు పూర్వం 537లో కొంతమంది యూదులు అధిపతైన జెరుబ్బాబెలుతో యెరూషలేముకు తిరిగొచ్చారు. (ఎజ్రా 2:1, 2, 58) తర్వాత ఇంకొంతమంది, క్రీస్తు పూర్వం 468లో శాస్త్రి అయిన ఎజ్రాతో తిరిగొచ్చారు. (ఎజ్రా 7:1-7) అలా తిరిగొచ్చిన రెండు గుంపుల్లోనూ “నెతీనీయులు” ఉన్నారు. (ఎజ్రా 2:58 లో అలాగే 7:7లో ఉన్న అధస్సూచీలు చూడండి.) వాళ్లు ఎవరంటే, “ఇశ్రాయేలీయులుకాని ఆలయ సేవకులు లేదా పరిచారకులు.” వాళ్లలో చాలామంది గిబియోనీయుల వంశస్థులు అయ్యుంటారు.—పదకోశంలో “నెతీనీయులు” చూడండి.
14. గిబియోనీయులు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉన్నారు? (1 దినవృత్తాంతాలు 9:2, అధస్సూచి)
14 మొదటి దినవృత్తాంతములు 9:2, అధస్సూచి చదవండి. బబులోను నుండి యెరూషలేముకు మొదట తిరిగొచ్చిన వాళ్లలో “ఆలయ సేవకులు” కూడా ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే, యూదుల్లోనే చాలామంది తిరిగిరావడానికి ఇష్టపడలేదు. వాళ్లు బబులోనులో బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకుని స్థిరపడ్డారు. అంత మంచి జీవితాన్ని వదులుకుని పాడుబడ్డ యెరూషలేముకు తిరిగిరావడానికి వాళ్లకు మనసురాలేదు. కానీ కొంతమంది నమ్మకమైన యూదులు, గిబియోనీయుల వంశస్థులు మాత్రం యెహోవా ఆలయం కట్టాలని, అక్కడ ఆయన్ని మళ్లీ ఆరాధించాలని వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అందుకే అన్నిటినీ త్యాగం చేసి రావాలనుకున్నారు. యూదులకు వచ్చినట్టు గిబియోనీయులకు వారసత్వంగా ఆస్తి ఏమీ రాదు. అయినాసరే, ఆలయంలో పనులు చేయడానికి, యెరూషలేము గోడల్ని బాగుచేయడానికి ఇష్టంగా ముందుకొచ్చారు.—నెహె. 3:26.
15. ఈ సందర్భం నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు?
15 దీని నుండి యెహోవా గురించి ఏం నేర్చుకోవచ్చు? యెహోవాకు తన నమ్మకమైన సేవకులు అంటే చాలా ఇష్టమని, వాళ్లను ఎప్పుడూ పట్టించుకుంటాడని నేర్చుకున్నాం. ఆయన గిబియోనీయుల్ని యెహోషువ కాలంలో కాపాడాడు. దాదాపు 1,000 ఏళ్లు తర్వాత అంటే, క్రీస్తు పూర్వం 607లో యెరూషలేము నాశనమైనప్పుడు వాళ్ల వంశస్థుల్ని కాపాడాడు. వాళ్లు బబులోను నుండి విడుదలై వచ్చాక కూడా, ఆలయంలో లేవీయులకు సహాయం చేయడానికి ఆయన వాళ్లను ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. కొంతమందైతే, ఆలయానికి దగ్గర్లోనే ఉండేవాళ్లు. (ఎజ్రా 2:70; నెహె. 11:21) ఆలయంలో పని చేయడం వల్ల గిబియోనీయులు పన్ను గానీ కప్పం గానీ సుంకం గానీ కట్టాల్సిన అవసరం లేదు. (ఎజ్రా 7:24) అలా యెహోవా వాళ్లను దీవిస్తూ వచ్చాడు.
16. ఆరాధన విషయంలో మనం గిబియోనీయుల్లా ఎలా ఉండవచ్చు?
16 మనం గిబియోనీయుల్లా ఎలా ఉండవచ్చు? మనం కూడా యెహోవాను ఆరాధించడానికి చేయగలిగినదంతా చేయాలని అనుకుంటాం. మనకు యెహోవా అంటే చాలా ఇష్టం, ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటాం. కాబట్టి త్యాగాలు చేయడానికి ఇష్టంగా ముందుకొస్తాం. ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న ఆల్విన్ అనే బ్రదర్ కూడా అదే చేశాడు. ఆయన ఒక ఆయిల్ కంపెనీలో మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసేవాడు. కానీ ఆయన యెహోవా సేవ ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాడు. ప్రాంతీయ పర్యవేక్షకుడు వచ్చినప్పుడల్లా, ఆయన సెలవు పెట్టుకుని ఆ వారమంతా బాగా పరిచర్య చేసేవాడు. తర్వాత, ఆయన క్రమ పయినీరు అవ్వాలని అనుకున్నాడు. అందుకే ఆయన బాగా ప్రార్థన చేసి, తన ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. పయినీరింగ్ చేయడానికి వీలుపడే ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కున్నాడు. ముందు వచ్చినంత జీతం రాదని తెలిసినా, సంతోషంగా ఆ త్యాగం చేశాడు. ఆయన భార్య కూడా పయినీరింగ్ మొదలుపెట్టింది. అలా వాళ్లిద్దరూ కలిసి 21 మందికి, సత్యం తెలుసుకునేలా సహాయం చేశారు. వీళ్లు చేసిన త్యాగాల్ని యెహోవా ఎప్పటికీ మర్చిపోడు. మనం కూడా అదే ధైర్యంతో ఉండవచ్చు. మనం చేసే త్యాగాల్ని ఆయన ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు, మన అవసరాల్ని తప్పకుండా తీరుస్తాడు.—మత్త. 6:33.
17. గిబియోనీయుల కథ నుండి మనం ఏమేం నేర్చుకున్నాం?
17 గిబియోనీయుల కథ నుండి మనం యెహోవాకున్న ఎన్నో చక్కని లక్షణాల గురించి నేర్చుకున్నాం. ఆయన వినయస్థుడు, విశ్వసనీయంగా ఉంటాడు, కరుణ-న్యాయం గల దేవుడు. తనకు నమ్మకంగా ఉండే సేవకులకు ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాదు, మనం పాటించగలిగే ఎన్నో విషయాల్ని కూడా నేర్చుకున్నాం. వాళ్లలాగే మనం యెహోవా మీద బలమైన విశ్వాసం పెంచుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడాలి. అలాంటి విశ్వాసం పెంచుకుంటే, యెహోవా సేవలో ఏ పనైనా వినయంగా చేయగలుగుతాం. అలాగే, అన్యాయం జరిగినప్పుడు యెహోవా దాన్ని సరిచేసేదాకా ఓపిగ్గా ఎదురుచూడాలని, ఆయన్ని ఉత్సాహంగా-నమ్మకంగా ఆరాధించాలని నేర్చుకున్నాం. ఇవన్నీ చేస్తూ గిబియోనీయుల మంచి ఆదర్శాన్ని పాటిద్దాం!
పాట 148 యెహోవా రక్షిస్తాడు
a యెహోషువ దగ్గరికి వెళ్లిన గిబియోనీయుల్లో కెఫీరా, బెయేరోతు అలాగే కిర్యత్యారీము అనే మరో మూడు హివ్వీయుల నగరాల ప్రతినిధులు కూడా ఉన్నారు.—యెహో. 9:17.
b సౌలు ఎందుకు ఇంత అన్యాయం చేశాడో బైబిలు చెప్పట్లేదు. కానీ, ఇశ్రాయేలులో పరదేశులు ఎవ్వరూ ఉండకూడదనే పక్షపాత బుద్ధితో అలా చేసుంటాడని కొంతమంది పండితులు చెప్తున్నారు.