కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 నవంబరు పేజీలు 22-27
  • “నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి”!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి”!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • తమ విలువను గుర్తించేలా యేసు ప్రజలకు ఎలా సహాయం చేశాడు?
  • యెహోవా మనల్ని చూస్తున్నట్టు మనల్ని మనం ఎలా చూసుకోవచ్చు?
  • “నేను ప్రభువును చూశాను!”
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీ మీద ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల నుండి నేర్చుకునే పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 నవంబరు పేజీలు 22-27

అధ్యయన ఆర్టికల్‌ 47

పాట 38 ఆయనే నిన్ను బలపరుస్తాడు

“నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి”!

“నువ్వు ఎంతో అమూల్యమైనవాడివి.”—దాని. 9:23.

ముఖ్యాంశం

తాము చాలా తక్కువవాళ్లం అనుకునేవాళ్లు, యెహోవా దృష్టిలో చాలా అమూల్యమైనవాళ్లని అర్థంచేసుకోవడానికి ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది.

1-2. మనం యెహోవా దృష్టిలో అమూల్యమైనవాళ్లం అని అర్థంచేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

అమూల్యమైన యెహోవా సేవకుల్లో కొంతమంది, తాము చాలా తక్కువవాళ్లం అనుకుంటారు. బహుశా, ఎవరైనా వాళ్లని చిన్నచూపు చూడడంవల్ల వాళ్లకు అలా అనిపించి ఉంటుంది. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? అలాగైతే, యెహోవా దృష్టిలో మీరు అమూల్యమైనవాళ్లు అనే నమ్మకంతో ఎలా ఉండవచ్చు?

2 మనుషులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో చూపించే బైబిలు వృత్తాంతాల్ని చదవడం మీకు సహాయం చేయవచ్చు. యేసు ప్రజలకు మర్యాద ఇచ్చాడు, వాళ్లను గౌరవించాడు. అలా చేయడం వల్ల, తాము చాలా తక్కువవాళ్లం అనుకునే వినయస్థుల్ని తను, తన తండ్రి ఎంత గొప్పవాళ్లుగా చూస్తున్నారో చూపించాడు. (యోహా. 5:19; హెబ్రీ. 1:3) ఈ ఆర్టికల్‌లో మనం రెండు విషయాల్ని చూస్తాం: (1) ప్రజలు యెహోవా దృష్టిలో ఎంత విలువైనవాళ్లో అర్థంచేసుకునేలా యేసు ఎలా సహాయం చేశాడు? (2) దేవుని దృష్టిలో అమూల్యమైనవాళ్లం అనే నమ్మకంతో మనం ఎలా ఉండవచ్చు?—హగ్గ. 2:7.

తమ విలువను గుర్తించేలా యేసు ప్రజలకు ఎలా సహాయం చేశాడు?

3. తన సహాయం కోసం వచ్చిన గలిలయవాళ్లను యేసు ఎలా చూశాడు?

3 యేసు మూడోసారి గలిలయలో పరిచర్య చేస్తున్నప్పుడు, వేర్వేరు ప్రాంతాల నుండి ప్రజలు ఆయన చెప్పింది వినడానికి గుమికూడారు. వాళ్లందర్నీ యేసు బాగుచేశాడు. “వాళ్లు కాపరిలేని గొర్రెల్లా చర్మం ఒలిచేయబడి, వదిలేయబడ్డారని” యేసు గమనించాడు. (మత్త. 9:36, అధస్సూచి) మతనాయకులు వాళ్లని కనీసం మనుషుల్ని చూసినట్టు కూడా చూసేవాళ్లు కాదు, పైగా వాళ్లని “శపించబడిన వాళ్లు” అని పిలిచేవాళ్లు. (యోహా. 7:47-49) కానీ యేసు అలాంటి ప్రజలకు సమయం తీసుకుని బోధించడం ద్వారా, వాళ్ల జబ్బుల్ని నయం చేయడం ద్వారా ఆయన వాళ్లని గౌరవించాడు. (మత్త. 9:35) దానికి తోడు, ఇంకా చాలామందికి సహాయం చేసేలా యేసు తన అపొస్తలులకు పరిచర్యలో శిక్షణ ఇచ్చాడు, జబ్బుల్ని-అనారోగ్యాల్ని బాగుచేసే అధికారం కూడా ఇచ్చాడు.—మత్త. 10:5-8.

4. తన మాటలు వినడానికి వచ్చిన వినయస్థుల్ని యేసు ఎలా చూశాడు? దాన్నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

4 తన మాటలు వినడానికి వచ్చినవాళ్లకు యేసు మర్యాద ఇచ్చేవాడు, వాళ్లను అర్థంచేసుకుంటూ మాట్లాడేవాడు. దీన్నిబట్టి, సమాజం అలాంటివాళ్లని చిన్నచూపు చూసినా యేసు, ఆయన తండ్రి మాత్రం వాళ్లని చాలా అమూల్యంగా చూస్తారని అర్థమౌతుంది. మీరు ఇప్పటికే యెహోవా సేవ చేస్తున్నా, మీకు విలువ లేదనిపిస్తే, తన గురించి తెలుసుకోవాలనుకునే వినయస్థుల్ని యేసు ఎలా పట్టించుకున్నాడో ఆలోచించండి. అలా ఆలోచించడం వల్ల, మీరు యెహోవా దృష్టిలో చాలా అమూల్యమైనవాళ్లని మీరు అర్థంచేసుకోగలుగుతారు.

5. యేసు కలిసిన గలిలయ స్త్రీ పరిస్థితిని వివరించండి.

5 యేసు ఒక గుంపుగా ప్రజలకు బోధించడమే కాదు, ఒక్కొక్కర్ని కూడా ఆయన చాలా పట్టించుకున్నాడు. ఉదాహరణకు, ఆయన గలిలయలో పరిచర్య చేస్తున్నప్పుడు, 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామెను కలిశాడు. (మార్కు 5:25) ఆమె పరిస్థితి వల్ల, ఆమె ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రురాలు. ఆమెను ముట్టుకున్న ఎవరైనా అపవిత్రులు అవుతారు. దానివల్ల ఆమె నలుగురిలో స్వేచ్ఛగా తిరగలేదు. దానికితోడు ఆమె నలుగురితో కలిసి యెహోవాను ఆరాధించడానికి సమాజమందిరానికి వెళ్లలేదు, లేదా పండుగలు జరుపుకోలేదు. (లేవీ. 15:19, 25) ఈ జబ్బు వల్ల ఆమె శరీరం హూనమై పోవడమే కాదు, ఆమె మనసు కూడా చితికిపోయి ఉంటుంది.—మార్కు 5:26.

6. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎలా బాగైంది?

6 అనారోగ్యంతో బాధపడుతున్న ఆ స్త్రీ, యేసు చేతిలో బాగవ్వాలని అనుకుంది. కానీ ఆమె నేరుగా యేసు దగ్గరికి వెళ్లి బాగుచేయమని అడగలేదు. ఎందుకు? ఎందుకంటే, బహుశా ఆమె పరిస్థితిని బట్టి ఆమెకి అవమానంగా లేదా సిగ్గుగా అనిపించి ఉంటుంది. లేదా ఆమె ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రురాలు కాబట్టి, ఇంతమంది జనాల మధ్యకు ఎందుకు వచ్చావని యేసు తిడతాడని ఆమె భయపడి ఉంటుంది. కాబట్టి ఆమె, యేసు పైవస్త్రాన్ని ముట్టుకున్నా చాలు నేను బాగౌతానని నమ్మింది. (మార్కు 5:27, 28) ఆమె నమ్మకం వమ్ము కాలేదు, ఆమె బాగైంది. తర్వాత యేసు తనను ఎవరు ముట్టుకున్నారని అడిగినప్పుడు, అది తనే అని ఒప్పుకుంటూ ముందుకు వచ్చింది. అప్పుడు యేసు ఆమెతో ఎలా మాట్లాడాడు?

7. అనారోగ్యంతో నలిగిపోతున్న స్త్రీతో యేసు ఎలా మాట్లాడాడు? (మార్కు 5:34)

7 యేసు ఆమెతో దయగా, మర్యాదగా మాట్లాడాడు. ఆమె ‘భయంతో వణికిపోవడం’ ఆయన గమనించాడు. (మార్కు 5:33) ఆమె భావాల్ని ఆయన అర్థంచేసుకుని ఆమెకి భరోసానిస్తూ మాట్లాడాడు, అలాగే ఆమెను “కూతురా” అని కూడా పిలిచాడు. ఆప్యాయంగా అన్న ఆ మాట, ఆమె మీద ఆయనకున్న గౌరవాన్నే కాదు దయను, ప్రేమను కూడా చూపిస్తుంది. (మార్కు 5:34 అలాగే అధస్సూచి చదవండి.) యేసు ఒక స్త్రీని “కూతురు” అని నేరుగా పిలిచిన ఒకేఒక్క సందర్భం ఇది. బహుశా ఆమె భయంతో వణికిపోవడం గమనించి యేసు ఆ పదాన్ని ఉపయోగించి ఉంటాడు. యేసు అలా పిలిచినప్పుడు ఆమెకి ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి! ఆమె గుండెదడ అంతా తగ్గిపోయి ఉంటుంది కదా! ఒకవేళ యేసు ఆమెకి భరోసానిస్తూ మాట్లాడకపోయుంటే, ఆమె బాగై వెళ్లేదేమో కానీ తప్పుచేశానన్న బాధతో వెళ్లుండేది. కానీ యేసు అలా మాట్లాడడం వల్ల ఆమె యెహోవాకు ఒక ప్రేమగల కూతురు అని ఆయన గుర్తుచేశాడు.

8. బ్రెజిల్‌లో ఉన్న మన సిస్టర్‌ ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొంది?

8 ఈ రోజుల్లో కూడా కొంతమంది దేవుని సేవకులు తమకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి చాలా కుమిలిపోతూ ఉంటారు. బ్రెజిల్‌లో పయినీరుగా సేవచేస్తున్న మారియa అనే సిస్టర్‌ అనుభవం గమనించండి. ఆమెకి పుట్టుకతోనే రెండు కాళ్లూ, ఎడమ చెయ్యి లేదు. ఆమె ఇలా అంటుంది: “నా పరిస్థితిని బట్టి మా స్కూల్లో నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్లు. వాళ్లు నన్ను రకరకాల పేర్లు పెట్టి వెక్కిరించేవాళ్లు. అంతెందుకు, నా సొంత కుటుంబ సభ్యులు కూడా నన్ను చీదరించుకునేవాళ్లు.”

9. యెహోవా దృష్టిలో అమూల్యమైనదని అర్థంచేసుకోవడానికి మారియకు ఎవరు సహాయం చేశారు?

9 మారియకు సహాయం ఎలా దొరికింది? ఆమె ఒక యెహోవాసాక్షి అయిన తర్వాత, తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఆమెని ఓదార్చి, యెహోవా చూసినట్టే ఆమె తనని తాను చూసుకునేలా సహాయం చేశారు. ఆమె ఇలా అంటుంది: “నాకు సహాయం చేసిన వాళ్ల పేర్లన్నీ రాయాలంటే, నా నోట్‌బుక్‌ సరిపోదు! నాకు ఇంత మంచి ఆధ్యాత్మిక కుటుంబం ఇచ్చినందుకు యెహోవాకి చాలాచాలా థాంక్స్‌!” యెహోవా దృష్టిలో ఆమె చాలా అమూల్యమైనదని అర్థంచేసుకునేలా తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ మారియకు సహాయం చేశారు.

10. మగ్దలేనే మరియకు ఎలాంటి సమస్య ఉంది? దానివల్ల ఆమెకి ఎలా అనిపించి ఉంటుంది? (చిత్రాలు కూడా చూడండి.)

10 యేసు సహాయం చేసిన ఇంకొక స్త్రీ, మగ్దలేనే మరియ. ఆమెలో ఏడుగురు చెడ్డదూతలు ఉండేవాళ్లు. (లూకా 8:2) దానివల్ల ఆమె పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేది. దాంతో ప్రజలు ఆమెను చూసి పారిపోయేవాళ్లు. ఆ కష్ట సమయం అంతటిలో ఆమెకు చాలా భయంగా, ఎవ్వరూ తనను ప్రేమించలేరని లేదా బాగుచేయలేరని ఆమెకు అనిపించి ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ఆమెలో ఉన్న చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడో, అప్పుడు ఆమె యేసు శిష్యురాలు అయింది. అయితే, యెహోవా దృష్టిలో ఆమె అమూల్యమైనదని అర్థంచేసుకోవడానికి యేసు మగ్దలేనే మరియకు ఇంకా ఎలా సహాయం చేశాడు?

చిత్రాలు: 1. మగ్దలేనే మరియ, ఒక మూల మోకాళ్ల మీద కూర్చొని బాధపడడం యేసు గమనించాడు. 2. మగ్దలేనే మరియ యేసుతో అలాగే మిగతా శిష్యులతో సంతోషంగా వెళ్తుంది.

మగ్దలేనే మరియ యెహోవాకు అమూల్యమైనదని అర్థంచేసుకునేలా యేసు ఆమెకు ఎలా సహాయం చేశాడు? (10-11 పేరాలు చూడండి)


11. మగ్దలేనే మరియ దేవునికి చాలా అమూల్యమైనదని యేసు ఎలా చూపించాడు? (చిత్రాలు కూడా చూడండి.)

11 యేసు వేర్వేరు చోట్లకు వెళ్లి పరిచర్య చేస్తున్నప్పుడు, తనతోపాటు రమ్మని మగ్దలేనే మరియను పిలిచాడు.b దానివల్ల ఆమె యేసు ప్రకటించడం కళ్లారా చూడగలిగింది, వినగలిగింది. అంతేకాదు, యేసు పునరుత్థానమైన రోజే మగ్దలేనే మరియకు కనిపించాడు. పైగా, ఆ రోజు యేసు మాట్లాడిన మొట్టమొదటి శిష్యురాలు ఈమే. కేవలం కనిపించడమే కాదు, తాను పునరుత్థానమైన విషయం అపొస్తలులకు చెప్పమనే బాధ్యతను కూడా యేసు ఆమెకు ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ఆమె యెహోవా దృష్టిలో ఎంత అమూల్యమైనదో మనకు అర్థమౌతుంది కదా!—యోహా. 20:11-18.

12. తనను ఎవ్వరూ ఇష్టపడరని లిడియా ఎందుకు అనుకుంది?

12 తమను ఎవ్వరూ ఇష్టపడరని, మగ్దలేనే మరియలాగే చాలామంది బాధపడుతూ ఉంటారు. స్పెయిన్‌లో ఉంటున్న లిడియా అనే సిస్టర్‌ అనుభవాన్ని గమనించండి. ఆమె కడుపులో ఉన్నప్పుడే వాళ్ల అమ్మ అబార్షన్‌ చేయించుకోవాలని అనుకుంది. ఆమె బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు కూడా వాళ్లమ్మ ఎప్పుడూ ఆమెను పట్టించుకునేది కాదు, పైగా నోటికొచ్చినట్టు తిడుతూ ఉండేది. ఆ సిస్టర్‌ ఇలా అంటుంది: “ఇతరులు నన్ను ప్రేమించాలి, నాతో స్నేహం చేయాలి అనేదే నా జీవిత లక్ష్యం అయిపోయింది. కానీ అలా ఎప్పటికీ అవ్వదు అనుకున్నా. ఎందుకంటే నేను చాలా చెడ్డదాన్ని అని మా అమ్మ నా మనసులో ముద్ర వేసేసింది.”

13. యెహోవా దృష్టిలో ఆమె అమూల్యమైనదని అర్థంచేసుకోవడానికి లిడియాకి ఏది సహాయం చేసింది?

13 లిడియా సత్యం తెలుసుకున్న తర్వాత వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, తోటి బ్రదర్స్‌-సిస్టర్స్‌ చేసే దయగల పనులు, చెప్పే మాటలు యెహోవా దృష్టిలో ఆమె అమూల్యమైనదని అర్థంచేసుకోవడానికి సహాయం చేశాయి. ఆమె ఇలా అంటుంది: “నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఆయన పద్దాకా నాలో ఉన్న మంచి లక్షణాల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నా ఫ్రెండ్స్‌ కూడా అదే చేస్తూ ఉంటారు.” ఒకప్పుడు లిడియా ఆలోచించినట్టు ఆలోచించేవాళ్లు ఎవరైనా మీకు తెలుసా?

యెహోవా మనల్ని చూస్తున్నట్టు మనల్ని మనం ఎలా చూసుకోవచ్చు?

14. మనుషుల్ని యెహోవా చూస్తున్నట్టే మనమూ చూడడానికి 1 సమూయేలు 16:7 మనకెలా సహాయం చేస్తుంది? (“యెహోవా ఎందుకు తన ప్రజల్ని అమూల్యంగా చూస్తాడు?” అనే బాక్స్‌ కూడా చూడండి.)

14 ఈ లోకం మిమ్మల్ని చూస్తున్నట్టు యెహోవా అస్సలు చూడడని గుర్తుంచుకోండి. (1 సమూయేలు 16:7 చదవండి.) మీరు ఎంత అందంగా ఉన్నారు, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, లేదా మీరు ఎంత చదువుకున్నారు అనేదాన్ని బట్టి యెహోవా మీకు విలువ కట్టడు. (యెష. 55:8, 9) ఈ లోక ప్రమాణాల్ని బట్టి కాదుగానీ, యెహోవా ప్రమాణాల్ని బట్టే మీ విలువను అంచనా వేసుకోండి. బైబిల్లో కొంతమంది తమకు ఎలాంటి విలువ లేదనుకున్నారు. వాళ్లలో ఏలీయా, నయోమి, హన్నా ఉన్నారు. కానీ యెహోవా మాత్రం వాళ్లకు చాలా విలువ ఇచ్చాడు. అలాంటివాళ్ల వృత్తాంతాల్ని చదవడం మీకు సహాయం చేయవచ్చు. అంతేకాదు, యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని, మీకు విలువ ఇస్తున్నాడని మీకు అనిపించిన సందర్భాల్ని మీరు ఒక చోట రాసుకోవచ్చు. అలాగే, ఆత్మగౌరవం లేదా విలువ అనే అంశం కిందున్న సమాచారాన్ని మన ప్రచురణల్లో మీరు చదవవచ్చు.c

యెహోవా ఎందుకు తన ప్రజల్ని అమూల్యంగా చూస్తాడు?

యెహోవా కావాలనే మనుషుల్ని జంతువుల కంటే వేరుగా చేశాడు. మనం తనతో ఒక మంచి బంధం కలిగివుండాలని, తన స్నేహితులు అవ్వాలని యెహోవా మనల్ని చేశాడు. (ఆది. 1:27; కీర్త. 8:5; 25:14; యెష. 41:8) మనకు విలువుందని చెప్పడానికి ఆ ఒక్క వాస్తవం చాలు. అయితే, మనం యెహోవాకు దగ్గరౌతూ, మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని, ఆయనకు లోబడి ఉంటే మన విలువ ఇంకా పెరుగుతుంది. అప్పుడు మన సృష్టికర్తా, దేవుడూ అయిన యెహోవా మనల్ని ఇంకా అమూల్యంగా చూస్తాడు.—యెష. 49:15.

15. యెహోవా దానియేలును ఎందుకు అమూల్యమైనవానిగా చూశాడు? (దానియేలు 9:23)

15 నమ్మకంగా మీరు చేస్తున్న సేవను బట్టి, యెహోవా మీకు చాలా విలువిస్తాడని గుర్తుంచుకోండి. ఒక సందర్భంలో దానియేలు ప్రవక్త “బాగా అలసిపోయి,” డీలా పడిపోయాడు. అప్పుడు ఆయన 90 దాటి 100కి దగ్గర్లో ఉన్న వృద్ధుడు. (దాని. 9:20, 21) అప్పుడు యెహోవా ఆయన్ని ఎలా ప్రోత్సహించాడు? ఆయన గబ్రియేలు అనే దేవదూతను పంపించి, దానియేలు “ఎంతో అమూల్యమైనవాడు” అనీ, ఆయన ప్రార్థనలు విన్నాడనీ భరోసా ఇచ్చాడు. (దానియేలు 9:23 చదవండి.) దేవుడు ఎందుకు దానియేలును అమూల్యమైనవాడిగా చూశాడు? ఎందుకంటే, తనకున్న ఇతర మంచి లక్షణాలతో పాటు దానియేలు నీతిని ప్రేమించాడు, యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. (యెహె. 14:14) మనం ఓదార్పు పొందడానికే యెహోవా దానియేలు గురించి బైబిల్లో రాయించాడు. (రోమా. 15:4) సరైనది చేయడం వల్ల, నమ్మకంగా తన సేవచేయడం వల్ల యెహోవా మనల్ని విలువైనవాళ్లుగా చూస్తాడు. అంతేకాదు, ఆయన మన ప్రార్థనలు వింటాడు.—మీకా 6:8, అధస్సూచీలు; హెబ్రీ. 6:10.

16. యెహోవాను మిమ్మల్ని ప్రేమించే నాన్నలా చూడడానికి ఏది సహాయం చేస్తుంది?

16 యెహోవాను మిమ్మల్ని ప్రేమించే నాన్నలా చూడండి. యెహోవా మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు, అంతేగానీ మీలో తప్పులు వెదకాలని అనుకోవట్లేదు. (కీర్త. 130:3; మత్త. 7:11; లూకా 12:6, 7) ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల, చాలామంది ఎందుకూ పనికిరాం అనే ఆలోచనల నుండి బయటపడగలిగారు. ఉదాహరణకు, స్పెయిన్‌లో ఉంటున్న ఎలీయనా అనే సిస్టర్‌ అనుభవం గమనించండి. ఆమె భర్త ఆమెను చాలా సంవత్సరాలు తిట్టి, మాటలతో మానని గాయం చేయడం వల్ల, తనను ఎవ్వరూ ప్రేమించరని, తను ఎందుకూ పనికిరాదని ఆమె అనుకునేది. ఆమె ఇలా అంటుంది: “నాకు ఎప్పుడైనా నేను పనికిరానిదాన్ని అని అనిపిస్తే, యెహోవా నన్ను ఎత్తుకున్నట్టు, ఆయన నా మీద ప్రేమ కురిపిస్తూ కావాల్సిన సంరక్షణ ఇస్తున్నట్టు ఊహించుకుంటాను.” (కీర్త. 28:9) దక్షిణాఫ్రికాలో ఉంటున్న లారెన్‌ అనే సిస్టర్‌ ఇలా గుర్తుచేసుకుంటుంది: “ప్రేమ అనే తాళ్లతో యెహోవా నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను దగ్గరికి తీసుకున్నాడు. వేరేవాళ్లకి బోధించడానికి నన్ను ఉపయోగించుకుంటున్నాడు. ఇవన్నీ ఆయన చేస్తున్నాడంటే, నేను ఆయనకి విలువైనదాన్ని, పనికొచ్చేదాన్ని అనే కదా!”—హోషే. 11:4.

17. యెహోవా అనుగ్రహం మీ మీద ఉందని మీకెలా తెలుస్తుంది? (కీర్తన 5:12) (చిత్రం కూడా చూడండి.)

17 యెహోవా అనుగ్రహం మీ మీద ఉందని నమ్మండి. (కీర్తన 5:12 చదవండి.) యెహోవా అనుగ్రహాన్ని, దావీదు నీతిమంతుల్ని కాపాడే ‘పెద్ద డాలుతో’ పోల్చాడు. యెహోవా అనుగ్రహం అలాగే మద్దతు మీకు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు మీరు పనికిరానివాళ్లు అనే ఆలోచన మిమ్మల్ని తినేయకుండా ఉంటుంది. మరి, యెహోవా అనుగ్రహం మీ మీద ఉందని మీకెలా తెలుస్తుంది? మనం ఇప్పటివరకూ చూసినట్టు యెహోవా తన వాక్యం ద్వారా మనకు ఆ భరోసా ఇస్తాడు. దాంతోపాటు ఆయన సంఘపెద్దల్ని, దగ్గరి స్నేహితుల్ని, అలాగే వేరేవాళ్లను ఉపయోగించుకొని ఆయన దృష్టిలో మనం అమూల్యమైనవాళ్లమని గుర్తుచేస్తూ ఉంటాడు. మరి, ఇతరుల ప్రోత్సాహాన్ని మనమెలా చూడాలి?

ఒక సిస్టర్‌ రాజ్యమందిరం నుండి ప్రీచింగ్‌కి సంతోషంగా వెళ్తుంది. ఆమె భుజం మీద ఇంకో సిస్టర్‌ చేయి వేసి సరదాగా మాట్లాడుతుంది.

యెహోవా అనుగ్రహం మనమీద ఉందని తెలుసుకుంటే, మనం విలువైనవాళ్లం కాదనే ఆలోచన రానివ్వం (17వ పేరా చూడండి)


18. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటూ మాట్లాడినప్పుడు దాన్ని తీసుకోవడం ఎందుకు నేర్చుకోవాలి?

18 మీ గురించి తెలిసినవాళ్లు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్లు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, ఆ మాటల్ని కొట్టి పారేయకండి. తన అనుగ్రహం మీ మీద ఉందని చెప్పడానికి యెహోవానే వాళ్లతో ఆ మాటలు చెప్పిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. మనం ముందు పేరాలో చూసిన ఎలీయనా అనే సిస్టర్‌ ఇలా అంటుంది: “ఇతరులు నన్ను మెచ్చుకుంటూ మాట్లాడితే, దాన్ని తీసుకోవడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అది ఇప్పటికీ నాకు కష్టమే, కానీ నేనలా చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు కాబట్టి నేను దాన్ని చేస్తున్నాను.” ప్రేమగల పెద్దలు ఇచ్చిన సహాయం నుండి ఎలీయనా చాలా ప్రయోజనం పొందింది. ప్రస్తుతం ఆమె ఒక పయినీరుగా అలాగే ఇంటి నుండే బెతెల్‌కి కూడా పని చేస్తుంది.

19. యెహోవా దృష్టిలో మీరు అమూల్యమైనవాళ్లు అని ఎందుకు నమ్మవచ్చు?

19 మన పరలోక తండ్రికి మనం చాలా అమూల్యమైనవాళ్లం అని యేసు గుర్తుచేస్తున్నాడు. (లూకా 12:24) కాబట్టి, యెహోవా కంటికి మనమందరం అమూల్యమైన వాళ్లం అనే విషయంలో ఏ డౌటూ లేదు! ఆ విషయాన్ని మనం అస్సలు మర్చిపోవద్దు. అలాగే, ఇతరులు కూడా ఆ విషయాన్ని అర్థంచేసుకునేలా చేయగలిగినదంతా చేద్దాం!

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా దృష్టిలో వాళ్లు అమూల్యమైనవాళ్లని గుర్తించేలా యేసు ప్రజలకు ఎలా సహాయం చేశాడు?

  • రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి యేసు ఎలా సహాయం చేశాడు?

  • యెహోవా మనల్ని చూసినట్టు మనల్ని మనం చూసుకోవడానికి ఏది సహాయం చేస్తుంది?

పాట 139 కొత్త లోకంలో ఉన్నట్టు ఊహించుకోండి!

a కొన్ని పేర్లను మార్చాం.

b యేసుతోపాటు ప్రయాణించిన స్త్రీలల్లో మగ్దలేనే మరియ కూడా ఉంది. ఆ స్త్రీలు తమ సొంత డబ్బుతో యేసుకు అలాగే అపొస్తలులకు కావాల్సిన వాటిని చూసుకున్నారు.—మత్త. 27:55, 56; లూకా 8:1-3.

c ఉదాహరణకు, యెహోవాకు దగ్గరవ్వండి పుస్తకంలోని 24వ అధ్యాయం చూడండి. అలాగే, మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకంలో, “పనికిరాని వాళ్లమని అనిపిస్తే” అనే అంశం కింద ఉన్న లేఖనాల్ని, బైబిలు వృత్తాంతాల్ని చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి