కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఆగస్టు పేజీలు 8-13
  • యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నమ్మండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నమ్మండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఎందుకు నమ్మాలి?
  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?
  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మేలా యేసు సహాయం చేస్తాడు
  • యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి
  • యెహోవా మీ మీద ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • విమోచన క్రయధనం నేర్పే పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఆగస్టు పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 33

పాట 4 “యెహోవా నా కాపరి”

యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని నమ్మండి

“విశ్వసనీయ ప్రేమతో నిన్ను దగ్గరికి తెచ్చుకున్నాను.”—యిర్మీ. 31:3.

ముఖ్యాంశం

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని మనం ఎందుకు నమ్మాలి? ఆ నమ్మకాన్ని మనం ఎలా పెంచుకోవాలి?

1. మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకున్నారు? (చిత్రం కూడా చూడండి.)

మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకున్నారు? ఆయన గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించారు కాబట్టే ఆ నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితంలో ఆయనకే మొదటిస్థానం ఇస్తారని, మీ నిండు హృదయంతో, మీ నిండు ప్రాణంతో, మీ నిండు మనస్సుతో, మీ పూర్తి బలంతో ఆయన్ని మాత్రమే ప్రేమిస్తారని మీరు మాటిచ్చారు. (మార్కు 12:30) అప్పటినుండి ఆయన మీద మీకున్న ప్రేమ అంచెలంచెలుగా పెరిగింది. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, “మీరు నిజంగానే యెహోవాను ప్రేమిస్తున్నారా?” అని అడిగితే మీ సమాధానం ఏంటి? ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా “నా జీవితంలో యెహోవాను ప్రేమించినంతగా నేను ఎవర్నీ, దేన్నీ ప్రేమించలేదు, ప్రేమించనుకూడా!” అని చెప్తారు.

చిత్రాలు: తన సమర్పణను, బాప్తిస్మాన్ని గుర్తుచేసుకుంటున్న ఒక సిస్టర్‌. 1. ఆమె చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది. 2. ఆమె ఒక నదిలో బాప్తిస్మం తీసుకుంటుంది.

మీరు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవాను మీరెంతగా ప్రేమించారో గుర్తుందా? (1వ పేరా చూడండి)


2-3. మనం ఏ నమ్మకంతో ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు? ఈ ఆర్టికల్‌లో మనం ఏం చూస్తాం? (యిర్మీయా 31:3)

2 అయితే, “యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా?” అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఆయన ప్రేమ పొందే అర్హత లేదనుకొని, దానికి జవాబు ఇవ్వడానికి మీరు తటపటాయిస్తుండవచ్చు. ప్రేమలేని ఒక వాతావరణంలో పెరిగిన ఓ సిస్టర్‌ ఏమంటుందంటే: “నేను యెహోవాను ప్రేమిస్తున్నాను అని నాకు తెలుసు. అందులో డౌటేలేదు! కానీ యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడో లేడో అని నేను పద్దాక ఆలోచించేదాన్ని.” మరైతే, యెహోవాకు మీ గురించి ఏమనిపిస్తుంది?

3 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేడో అనే డౌట్‌ మీకు ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. (యిర్మీయా 31:3 చదవండి.) నిజమేంటంటే యెహోవా మిమ్మల్ని చేరదీశాడు. మీరు ఎప్పుడైతే సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారో ఆయన నుండి మీకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్‌ వచ్చింది. అదే ఆయన విశ్వసనీయ ప్రేమ! ఆ ప్రేమ ఎవ్వరూ కొలవలేనిది, ఎప్పటికీ కరిగిపోనిది! ఆ విశ్వసనీయ ప్రేమ వల్ల మీతో సహా, ఆయన సేవకులందర్నీ “విలువైన సంపదగా” చూస్తున్నాడు. (మలా. 3:17, అధస్సూచి) తన ప్రేమ గురించి పౌలుకు అనిపించినట్టే మీకు కూడా అనిపించాలని యెహోవా కోరుకుంటున్నాడు. పౌలు గట్టి నమ్మకంతో ఇలా రాశాడు: “మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన ఇంకేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని నాకు నమ్మకం కుదిరింది.” (రోమా. 8:38, 39) అందుకే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనే నమ్మకాన్ని ఎందుకు పెంచుకోవాలో, దాన్నెలా పెంచుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఎందుకు నమ్మాలి?

4. సాతాను వేసే ఒక పన్నాగం నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు?

4 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు, సాతాను వేసే ఒక “పన్నాగం” నుండి మనం తప్పించుకుంటాం. (ఎఫె. 6:11) మనల్ని యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను ఎంతకైనా తెగిస్తాడు. అయితే, సాతాను పన్నాగాల్లో ఒకటి ఏంటంటే, యెహోవా మనల్ని ప్రేమించట్లేదనే అబద్ధాన్ని వ్యాప్తి చేయడం. సాతాను ఒక అవకాశవాది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. గతం తాలూకు గాయాలతో, ప్రస్తుత అవస్థలతో, భవిష్యత్తు భయాలతో మనం బలహీనంగా ఉన్నప్పుడు సాతాను మన మీదికి విరుచుకుపడతాడు. (సామె. 24:10) ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న జంతువును వేటాడడానికి కాచుకు కూర్చున్న సింహంలా సాతాను ఉన్నాడు. మనం కూడా బలహీనపడి, చేతులెత్తేసే సమయం కోసం సాతాను కాచుకు కూర్చుని, దాడి చేస్తాడు. కానీ యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటే సాతానుకు ధీటుగా నిలబడతాం. అతని జిత్తులకు-ఎత్తులకు పడిపోం!—1 పేతు. 5:8, 9; యాకో. 4:7.

5. మనం యెహోవా ప్రేమను ఎందుకు గుర్తించాలి?

5 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు మనం ఆయనకు ఇంకా దగ్గరౌతాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? మనం ఒకర్ని ప్రేమించేలా, మనల్ని ఒకరు ప్రేమించేలా యెహోవా సృష్టించాడు. మనల్ని ఒకరు ప్రేమిస్తే మనం తిరిగి ప్రేమిస్తాం, అది సహజం! కాబట్టి యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఎంత ఎక్కువగా గుర్తిస్తే, అంతెక్కువగా మనం ఆయన్ని తిరిగి ప్రేమిస్తాం. (1 యోహా. 4:19) యెహోవా మీద మనం ప్రేమ పెంచుకుంటే, ఆయన తిరిగి మన మీద ప్రేమ పెంచుకుంటాడు. బైబిలు ఇలా చెప్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకో. 4:8) అయితే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు?

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?

6. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే అనుమానం ఉంటే మీరేం చేయాలి?

6 యెహోవా మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకునేలా సహాయం చేయమని పట్టుదలగా ప్రార్థన చేయండి. (లూకా 18:1; రోమా. 12:12) యెహోవా మిమ్మల్ని చూసినట్టు, మిమ్మల్ని మీరు చూసుకునేలా సహాయం చేయమని రోజూ ప్రార్థన చేయండి. నిజమే కొన్నిసార్లు మనల్ని మనం ఎంతగా నిందించుకుంటామంటే, యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ యెహోవా మన హృదయాల కంటే గొప్పవాడనే విషయం మర్చిపోకండి. (1 యోహా. 3:19, 20) ఆయనకు మీ గురించి మీకంటే ఎక్కువగా తెలుసు. మీలో మీరు చూసుకోలేని విషయాల్ని కూడా ఆయన చూస్తాడు. (1 సమూ. 16:7; 2 దిన. 6:30) కాబట్టి మీ ఫీలింగ్స్‌ని ఆయనకు చెప్పకుండా దాచిపెట్టుకోకండి. అలాగే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయం నమ్మేలా సహాయం చేయమని ఆయన్ని అడగడానికి వెనకాడకండి. (కీర్త. 62:8) మీరు ప్రార్థన చేసుకున్న తర్వాత, ఈ కింది పనులు చేయడం మర్చిపోవద్దు.

7-8. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే భరోసాను కీర్తనల పుస్తకం ఎలా ఇస్తుంది?

7 యెహోవా మాటల్ని నమ్మండి. తన గురించి, తన వ్యక్తిత్వం గురించి అచ్చుగుద్దినట్టు రాసేలా బైబిలు రచయితల్ని యెహోవా ప్రేరేపించాడు. ఆయన మనుషులతో ఎంత మృదువుగా ఉంటాడో కీర్తనకర్త దావీదు వర్ణించాడు. దావీదు ఇలా రాశాడు: “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నిరుత్సాహపడినవాళ్లను ఆయన కాపాడతాడు.” (కీర్త. 34:18, అధస్సూచి) మీ మనసు విరిగిపోయినప్పుడు, మిమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని అనిపించవచ్చు. కానీ అలాంటి సమయాల్లోనే ముందెప్పటికన్నా ఇప్పుడు తన అవసరం మీకు ఎక్కువ ఉందని తెలుసుకుని యెహోవా మీ పక్కనే ఉంటానని మాటిచ్చాడు. ఇంకో కీర్తనలో దావీదు ఇలా రాశాడు: “నా కన్నీళ్లను నీ తోలుసంచిలో ఉంచు.” (కీర్త. 56:8) మీరు పడే వేదనను యెహోవా అర్థంచేసుకుంటాడు. బాధవల్ల మీ గుండె పిండేసినట్టు అనిపించినప్పుడు యెహోవా మిమ్మల్ని తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీరు బాధపడడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఎడారిలో ప్రయాణించే ఒక వ్యక్తికి, తోలుసంచిలో ఉన్న ప్రతీ నీటి బొట్టు చాలా విలువైనది. అలాగే మీరు కార్చే ప్రతీ కన్నీటి బొట్టును యెహోవా అంతే విలువైనదిగా చూస్తాడు. మీరు బాధపడితే ఆయన చలించిపోతాడు. మీరు ఏడ్చిన ప్రతీ సందర్భం ఆయనకు గుర్తుంటుంది. కీర్తన 139:3లో ఇలా చదువుతాం: “నా మార్గాలన్నీ నీకు బాగా తెలుసు.” యెహోవా మీరు చేసే ప్రతీ పనిని చూస్తాడు, మీరు చేసే మంచిని ఆయన మర్చిపోడు. (హెబ్రీ. 6:10) ఎందుకంటే తనను సంతోషపెట్టడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నాన్ని ఆయన ఇష్టపడతాడు.a

8 మన మనసుకైన గాయాల్ని మాన్పే అలాంటి లేఖనాల్ని ఉపయోగించి, యెహోవా ఒకరకంగా మనతో ఇలా అంటున్నాడు: “నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను, నువ్వంటే నాకు ప్రాణం.” అయితే, మనం ముందే తెలుసుకున్నట్టు, యెహోవా మనల్ని అస్సలు ప్రేమించట్లేదనే అబద్ధాన్ని సాతాను వ్యాప్తి చేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైనా యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే అనుమానం వస్తే, ఒక్క క్షణం ఆగి ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను ఎవర్ని నమ్ముతాను? “అబద్ధానికి తండ్రి” అయిన సాతానునా? లేదా నిజానికి తండ్రియైన యెహోవానా?’—యోహా. 8:44; కీర్త. 31:5.

9. తనను ప్రేమించేవాళ్లకు యెహోవా ఏ అభయం ఇస్తున్నాడు? (నిర్గమకాండం 20:5, 6)

9 తనను ప్రేమించేవాళ్ల గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. యెహోవా మోషేతో, ఇశ్రాయేలీయులతో ఏమన్నాడో గమనించండి. (నిర్గమకాండం 20:5, 6 చదవండి.) తనను ప్రేమించేవాళ్ల మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూనే ఉంటానని ఆయన మాటిచ్చాడు. యెహోవా విశ్వసనీయుడు కాబట్టి ఆయనిచ్చిన మాటను నమ్మవచ్చు. (నెహె. 1:5) కాబట్టి ఎప్పుడైనా యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే భరోసా మీకు అవసరమైతే, ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాను ప్రేమిస్తున్నానా?’ ఆ తర్వాత ఇలా ఆలోచించండి: ఒకవేళ మీరు యెహోవాను ప్రేమిస్తే, ఆయన్ని సంతోషపెట్టడానికి చేయగలిగినదంతా చేస్తే, ఆయన కూడా తిరిగి మిమ్మల్ని అమితంగా ప్రేమించడంటారా? (దాని. 9:4; 1 కొరిం. 8:3) మరో మాటలో చెప్పాలంటే, మీరు యెహోవాను ప్రేమిస్తున్నారనే విషయంలో మీకు అనుమానం లేకపోతే, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే విషయంలో కూడా అనుమానం అవసరంలేదు!

10-11. విమోచన క్రయధనాన్ని మీరెలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు? (గలతీయులు 2:20)

10 విమోచన క్రయధనం గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు విమోచన క్రయధనం, యెహోవా మనుషులకు ఇచ్చిన గొప్ప బహుమతి. (యోహా. 3:16) అయితే, యెహోవా ఆ బహుమతిని మీలో ప్రతీఒక్కరికి పేరుపేరున ఇచ్చాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి అపొస్తలుడైన పౌలు ఉదాహరణ గమనించండి. ఆయన క్రైస్తవునిగా మారకముందు కొన్ని ఘోరమైన పాపాలు చేశాడు, క్రైస్తవునిగా మారిన తర్వాత కూడా సొంత బలహీనతలతో పోరాడుతూనే ఉన్నాడు. (రోమా. 7:24, 25; 1 తిమో. 1:12-14) అయితే, విమోచన క్రయధనం యెహోవా తన కోసమే ఇచ్చిన ఒక బహుమతిగా ఆయన చూశాడు. (గలతీయులు 2:20 చదవండి.) ఆ విషయాన్నే బైబిల్లో రాసేలా యెహోవా ఆయన్ని ప్రేరేపించాడు. అదేకాదు, బైబిల్లో ఉన్న ప్రతీది మనకోసమే రాయించాడు. (రోమా. 15:4) విమోచన క్రయధనాన్ని మీరు ఎలా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడో పౌలు మాటల్నిబట్టి అర్థమౌతుంది. దాన్ని మీ కోసమే ఇచ్చిన బహుమతిగా చూడాలి. విమోచన క్రయధనాన్ని మీరు అలా చూడగలిగితే, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు.

11 మనకోసం చనిపోయేలా యేసును భూమ్మీదకు పంపించినందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. అయితే, యేసు భూమ్మీదకు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే, దేవుని గురించిన సత్యాన్ని ఇతరులకు చెప్పడం. (యోహా. 18:37) ఆ సత్యంలో ఒకటి ఏంటంటే, తన పిల్లల్ని యెహోవా ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పడం.

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మేలా యేసు సహాయం చేస్తాడు

12. యెహోవా గురించి యేసు చెప్పింది మనం ఎందుకు నమ్మవచ్చు?

12 యెహోవా ఎలాంటివాడో భూమ్మీద ఉన్నప్పుడు యేసు ఇష్టంగా చెప్పాడు. (లూకా 10:22) యేసు చెప్పింది మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే, యేసు భూమ్మీదకు రాకముందు, పరలోకంలో యెహోవాతోపాటు కోట్ల సంవత్సరాలు గడిపాడు. (కొలొ. 1:15) కాబట్టి తన నమ్మకమైన కొడుకుల్ని, కూతుళ్లను యెహోవా ఎంత ప్రేమిస్తాడో యేసు పక్కనే ఉండి చూశాడు. అయితే, దేవుడు తమను ప్రేమిస్తున్నాడని నమ్మేలా యేసు ఇతరులకు ఎలా సహాయం చేస్తాడు?

13. యెహోవాను మనం ఎలా చూడాలని యేసు కోరుకుంటున్నాడు?

13 యేసు యెహోవాను ఎలా చూశాడో, మనమూ అలాగే చూడాలని కోరుకుంటున్నాడు. సువార్త పుస్తకాల్లో యేసు యెహోవాను “తండ్రి” అని 160 కన్నా ఎక్కువసార్లు పిలిచాడు. అలాగే తన అనుచరులతో మాట్లాడుతున్నప్పుడు “మీ తండ్రి” లేదా “మీ పరలోక తండ్రి” అనే పదాల్ని ఆయన ఉపయోగించాడు. (మత్త. 5:16; 6:26) మత్తయి 5:16 కు ఉన్న స్టడీ నోట్‌లో ఇలా ఉంది: “ఒకప్పటి దేవుని సేవకులు యెహోవాను వర్ణించడానికి ‘సర్వశక్తిమంతుడు,’ ‘మహోన్నతుడు,’ ‘మహాగొప్ప సృష్టికర్త’ లాంటి పెద్దపెద్ద బిరుదులు ఉపయోగించారు. కానీ యేసు మాత్రం అందరూ వాడే, ‘తండ్రి’ అనే ఒక సాధారణ పదాన్ని వాడాడు. ఆ పదం తన ఆరాధకులు దేవుని మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారో చూపించింది.” అవును, యేసు యెహోవాను ఎలా చూశాడో మనమూ అలాగే చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. తన పిల్లల్ని ప్రాణంగా చూసుకునే ఒక ప్రేమగల తండ్రిలా మనం యెహోవాను చూడాలని యేసు కోరుకున్నాడు. యేసు యెహోవాను “తండ్రి” అని పిలిచిన రెండు సందర్భాల గురించి ఇప్పుడు చూద్దాం.

14. మనలో ప్రతీఒక్కరం మన పరలోక తండ్రికి చాలా విలువైనవాళ్లమని యేసు ఎలా చూపించాడు? (మత్తయి 10:29-31) (చిత్రం కూడా చూడండి.)

14 మొదటిగా, యేసు మత్తయి 10:29-31 లో అన్న మాటల్ని గమనించండి. (చదవండి.) పిచ్చుకలు చాలా చిన్న పక్షులు. అవి యెహోవాను ప్రేమించలేవు, ఆరాధించలేవు. అయినాసరే, మన పరలోక తండ్రి వాటిని చాలా పట్టించుకుంటాడు. అలాంటిది తనను ప్రేమించి, నమ్మకంగా ఆరాధించే సేవకుల్ని ఇంకెంతగా పట్టించుకొని విలువిస్తాడో కదా! 30వ వచనంలో, “మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు” అనే మాటల గురించి స్టడీ నోట్‌లో ఇలా ఉంది: “మన గురించి అలాంటి చిన్నచిన్న వివరాలు కూడా యెహోవాకు తెలుసంటే, యేసుక్రీస్తును అనుసరించే ప్రతీఒక్కర్ని యెహోవా ఎంతగా పట్టించుకుంటున్నాడో అది చూపిస్తుంది.” అవును, మన పరలోక తండ్రికి మనలో ప్రతీఒక్కరం చాలా విలువైనవాళ్లమనే విషయాన్ని మనం నమ్మాలని యేసు కోరుకుంటున్నాడు.

నేల మీద వాలుతున్న పిచ్చుకను చూపించి యేసు మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు శ్రద్ధగా వింటున్నారు.

నేల మీద రాలే ఒక చిన్న పిచ్చుకను కూడా యెహోవా పట్టించుకుంటున్నాడంటే, తనను ప్రేమించి, నమ్మకంగా ఆరాధించే మిమ్మల్ని ఇంకెంతగా పట్టించుకొని, విలువిస్తాడో కదా! (14వ పేరా చూడండి)


15. యోహాను 6:44 లో యేసు చెప్పిన మాటల్నిబట్టి మీ పరలోక తండ్రి గురించి ఏం అర్థమౌతుంది?

15 యేసు యెహోవాను “తండ్రి” అని పిలిచిన ఇంకో సందర్భాన్ని గమనించండి. (యోహాను 6:44 చదవండి.) మీ పరలోక తండ్రి మిమ్మల్ని తనవైపుకు ఆకర్షించుకున్నాడు, ప్రేమగా సత్యంవైపు నడిపించాడు. ఎందుకు? ఎందుకంటే మీలో ఉన్న మంచి లక్షణాల్ని ఆయన చూశాడు. (అపొ. 13:48) యోహాను 6:44కు ఉన్న స్టడీ నోట్‌ ప్రకారం, బహుశా ఈ లేఖనంలోని మాటలు, ఈ ఆర్టికల్‌ ముఖ్య లేఖనంలో ఉన్న యిర్మీయా మాటల్ని మనసులో ఉంచుకుని యేసు చెప్పి ఉండవచ్చు. ఆ లేఖనంలో ఇలా ఉంది: “అందుకే విశ్వసనీయ ప్రేమతో నిన్ను దగ్గరికి తెచ్చుకున్నాను [లేదా, నీ మీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తూ ఉన్నాను].” (యిర్మీ. 31:3; అధస్సూచి; హోషేయ 11:4తో పోల్చండి.) ఆ మాటల అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. మీలో మీకు కనిపించని మంచిని కూడా మీ పరలోక తండ్రి చూస్తూనే ఉంటాడని దానర్థం.

16. (ఎ) ఒకరకంగా యేసు ఏం చెప్తున్నాడు? ఆయన మాటల్ని మనం ఎందుకు నమ్మాలి? (బి) యెహోవా మన బెస్ట్‌ తండ్రి అనే నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు? (“మనకు ఎలాంటి తండ్రి కావాలో సరిగ్గా అలాంటి తండ్రే” అనే బాక్స్‌ చూడండి.)

16 యేసు యెహోవాను, మన తండ్రి అని పిలిచినప్పుడు ఒకరకంగా ఆయన ఇలా చెప్తున్నాడు: “యెహోవా నాకు మాత్రమే కాదు. మీకు కూడా తండ్రే. ఆయన మీలో ప్రతీఒక్కర్ని చాలా ప్రేమిస్తున్నాడు, చాలా పట్టించుకుంటున్నాడు.” కాబట్టి ఎప్పుడైనా యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో అనే అనుమానం ఉంటే, ఒక్క క్షణం ఆగి ఇలా ఆలోచించండి: ‘మన తండ్రి గురించి బాగా తెలిసీ, ఎప్పుడూ నిజం మాట్లాడే యేసు మాటల్ని కాకుండా మనం ఇంకెవరి మాటల్ని నమ్ముతాం!’—1 పేతు. 2:22.

“మనకు ఎలాంటి తండ్రి కావాలో సరిగ్గా అలాంటి తండ్రే”

ఆ మాటలు యెహోవాకు దగ్గరవ్వండి అనే పుస్తకంలోని ముందుమాటలో కనిపిస్తాయి. ఈ పుస్తకం ఉద్దేశం గురించి చెప్తూ పరిపాలక సభ ఇలా అంది: “మనకు ఎలాంటి తండ్రి కావాలో [యెహోవా] సరిగ్గా అలాంటి తండ్రే అని అర్థం చేసుకుంటాం. శక్తి, న్యాయం, తెలివి, ప్రేమ ఉన్న యెహోవా తన నమ్మకమైన పిల్లల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు.”

క్రూరమైన తండ్రి పెంపకంలో పెరిగిన ఒక అమ్మాయికి, ఈ పుస్తకం ఎలా సహాయం చేసిందో వివరిస్తూ ఇలా అంది: “‘తండ్రి’ అనే పదం వినగానే భయం రాకూడదని ఈ పుస్తకం నేర్పించింది. ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడో ఇప్పుడు నాకు తెలిసింది. యెహోవా నన్ను తన కూతురిగా అంగీకరిస్తాడని నాకు తెలుసు. నేను కూడా ఆయన్ని నా తండ్రిగా అంగీకరిస్తాను.” ఈ పుస్తకాన్ని చదివిన ఇంకో ఆవిడా ఇలా అంది: “యెహోవాయే మనం ఊహించుకోగలిగే బెస్ట్‌ తండ్రి!”

మీకు ఎలాంటి తండ్రి కావాలో, యెహోవా సరిగ్గా అలాంటి తండ్రి అనే మీ నమ్మకాన్ని పెంచుకోవాలంటే, ఈ పుస్తకాన్ని చదవండి. ఒకవేళ ఇప్పటికే చదివేస్తే, మళ్లీ చదవండి.

యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండండి

17. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని ఎందుకు పెంచుకుంటూ ఉండాలి?

17 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని బలపర్చుకుంటూనే ఉండాలి. మనం ముందే చూసినట్టు, మనం యెహోవా సేవ ఆపేలా చేయడానికి జిత్తులమారి సాతాను ఏం చేయడానికైనా తెగిస్తాడు. సాతాను మనల్ని బలహీనపర్చడానికి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని నీరుగార్చడానికి విశ్వప్రయత్నాలు చేస్తాడు. కానీ మనం సాతానును అస్సలు గెలవనివ్వద్దు!—యోబు 27:5.

18. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏమేం చేయవచ్చు?

18 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకంతో ఎలా ఉండవచ్చో ఈ ఆర్టికల్‌లో చూశాం. యెహోవా మిమ్మల్ని చూసినట్టు, మిమ్మల్ని మీరు చూసుకునేలా సహాయం చేయమని ఆయన్ని అడుగుతూ ఉండండి. ఆయన మృదువైన ప్రేమను బైబిలు రచయితలు ఎలా వర్ణించారో ఆలోచించండి. మీరు చూపించే ప్రేమకు ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో గమనించండి. ఆయన్ని ఎవరైనా ప్రేమిస్తే, తిరిగి వాళ్లను ప్రేమించకుండా ఉండలేడు అని గుర్తుపెట్టుకోండి. విమోచన క్రయధనాన్ని మీకోసమే ఇచ్చిన ఒక స్పెషల్‌ గిఫ్ట్‌గా ఎందుకు చూడాలో ధ్యానించండి. అంతేకాదు, యెహోవా మీ పరలోక తండ్రి అని యేసు ఇచ్చిన అభయాన్ని నమ్మండి. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, “యెహోవా మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నాడా?” అని అడిగితే ఏ డౌట్‌ లేకుండా “అవును, ఆయన ప్రేమిస్తున్నాడు! నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీ!” అని చెప్తారు.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని ఎందుకు నమ్మాలి?

  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?

  • యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మడానికి యేసు ఎలా సహాయం చేశాడు?

పాట 154 ప్రేమ శాశ్వతమైనది

a యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడనే భరోసా ఇచ్చే ఇంకొన్ని లేఖనాల కోసం, మంచి క్రైస్తవులుగా ఉండడానికి ఉపయోగపడే లేఖనాలు అనే పుస్తకంలో “పనికిరాని వాళ్లమని అనిపిస్తే” అంశాన్ని చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి