బైబిలు అధ్యయనాలు ఇంకా చక్కగా చేద్దాం
1. బైబిలు అధ్యయనాలు చేసే వాళ్ళకు ఏ బాధ్యత ఉంది?
1 యెహోవా “ఆకర్షించితేనే” తప్ప ఆయనను ఎవరూ సేవించలేరు. (యోహా. 6:44) అయినా, ప్రజలు దేవునికి దగ్గరవ్వాలంటే బైబిలు అధ్యయనం చేసే వాళ్లు కూడా కష్టపడాల్సిన బాధ్యత ఉంది. (యాకో. 4:8) కాబట్టి ముందే సిద్ధపడాలి. విద్యార్థి చక్కగా అర్థం చేసుకుని ప్రగతి సాధించాలంటే ఊరికే పేరాలు చదివి, అక్కడున్న ప్రశ్నలు అడిగితే సరిపోదు.
2. బైబిలు అధ్యయనం చక్కగా చేస్తే విద్యార్థి ఎలా ప్రగతి సాధిస్తాడు?
2 విద్యార్థులు ప్రగతి సాధించాలంటే మనం వాళ్లకు బైబిల్లో ఉన్నది (1) అర్థం చేసుకునేలా, (2) అంగీకరించేలా, (3) పాటించేలా సహాయం చేయాలి. (యోహా. 3:16; 17:3; యాకో. 2:26) ఇలా ఒక్కో మెట్టు చేరుకోవడానికి విద్యార్థికి నెలలు పట్టవచ్చు. అయినా సరే ప్రతీ మెట్టు ముఖ్యమైనదే. ఎందుకంటే యెహోవాకు దగ్గరై ఆయనకు సమర్పించుకోవడానికి ఈ మూడింటిలో ప్రతీది అవసరం.
3. మనసులో ఉన్నవాటిని తెలుసుకోవడానికి ప్రశ్నలు ఎందుకు అడగాలి?
3 బైబిలు నేర్చుకునే వాళ్లు ఏమి ఆలోచిస్తున్నారు?: నేర్చుకునేవి అర్థం చేసుకుంటున్నారా, వాటిని అంగీకరిస్తున్నారా అనేవి తెలుసుకోవాలంటే ఎప్పుడూ మనమే మాట్లాడకూడదు, వాళ్ల మనసులో ఉన్నది చెప్పేలా చేయాలి. (యాకో. 1:19) మీరు చదువుతున్న విషయం గురించి బైబిలు చెప్పేది వాళ్లకు అర్థమౌతుందా? సొంత మాటల్లో చెప్తున్నారా? నేర్చుకున్న వాటి గురించి వాళ్లకు ఏమనిపిస్తుంది? బైబిల్లో ఉన్నవి పాటించవచ్చు అని వాళ్లకు అనిపిస్తుందా? (1 థెస్స. 2:13) నేర్చుకున్న వాటిని బట్టి జీవితంలో మార్పులు కూడా చేసుకోవాలని వాళ్లకు అర్థమౌతుందా? (కొలొ. 3:9, 10) వీటన్నిటికీ జవాబులు తెలుసుకోవాలంటే వాళ్ల మనసులో ఉన్నవాటిని బయటకు తెచ్చే ప్రశ్నలు అడగాలి, వాళ్లు చెప్తుంటే వినాలి.—మత్త. 16:13-16.
4. నేర్చుకునేవి అర్థం చేసుకోవడానికి, పాటించడానికి విద్యార్థికి కష్టంగా ఉంటే ఏమి చేయాలి?
4 అలవాట్లు, ఆలోచించే విధానాలు లోతుగా పాతుకుపోయి ఉంటాయి కాబట్టి అవి మార్చుకోవడానికి సమయం పడుతుంది. (2 కొరిం. 10:5) నేర్చుకుంటున్నవి వాళ్లు అంగీకరించకపోతే, పాటించకపోతే అప్పుడేమి చేయాలి? దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ విద్యార్థి హృదయంపై పనిచేసి అవసరమైన మార్పులు చేసుకునేలా కొంత కాలం ఓపిక చూపించాలి. (1 కొరిం. 3:6, 7; హెబ్రీ. 4:12) వాళ్లకు ఏదైనా అర్థం కానప్పుడు, దాన్ని పాటించడం కష్టంగా ఉన్నప్పుడు వాళ్లను ఇబ్బంది పెట్టకుండా తర్వాత విషయానికి వెళ్లండి. ఓపికగా, ప్రేమతో బైబిలు గురించి నేర్పిస్తూ ఉంటే, భవిష్యత్తులో వాళ్లే అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.