రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి మీకున్న అన్ని అవకాశాల్నీ ఉపయోగించుకోండి!
1. దావీదు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
1 రాజైన దావీదు తన పరిస్థితులు తనను ఆటంకపర్చేందుకు ఎన్నడూ అనుమతించలేదు. ఉదాహరణకు, యెహోవా కోసం దావీదు ఒక ఆలయం కట్టాలనుకున్నాడు. అది కుదరదని దేవుడు చెప్పినప్పుడు, దావీదు తన ఆలోచనను మార్చుకుని తన కుమారుడైన సొలొమోను ఆ ఆలయాన్ని కట్టడానికి కావల్సినవన్నీ సమకూర్చాడు. (1 రాజు. 8:17-19; 1 దిన. 29:3-9) తాను చేయలేని దాని గురించి ఆలోచించే బదులు, చేయగలిగే దానిమీదే దృష్టి పెట్టాడు. రాజ్య సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుండగా దావీదును మనమెలా అనుకరించవచ్చు?
2. మీరు దేని గురించి ఆలోచించవచ్చు?
2 చేయగలిగింది చేయండి: సహాయ పయినీర్లుగా, క్రమ పయినీర్లుగా సేవచేయడానికి చాలామంది నిరాడంబరంగా జీవిస్తున్నారు. (మత్త. 6:22) మీరూ అలా చేయగలరా? ప్రార్థనాపూర్వకంగా మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తే, సేవ చేయడానికి ‘గొప్ప ద్వారం తెరవబడియున్నది’ అని మీరు గమనించవచ్చు. అప్పుడు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి.—1 కొరిం. 16:9, అధస్సూచి.
3. పయినీరు సేవ చేసేందుకు మన పరిస్థితులు అనుకూలించకపోయినా, సాక్ష్యమిచ్చే ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకోవచ్చు?
3 అయినా కొన్ని పరిస్థితుల వల్ల మీరు పయినీరు సేవ చేయలేకపోతుంటే, అప్పుడెలా? మీకు వేరే అవకాశాలు ఉన్నాయేమో చూడండి. ఉదాహరణకు, మీరు పనిచేసే ప్రాంతంలో సాక్ష్యం ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య సహాయం తీసుకుంటున్నప్పుడు, డాక్టర్లకూ నర్సులకూ సాక్ష్యం ఇవ్వడానికి చూడండి. వయసు పైబడినవాళ్లు, తీవ్ర అనారోగ్యం పాలైనవాళ్లు 15 నిమిషాలు కూడా రిపోర్టు చేయవచ్చు. మీరు ప్రతీనెల రిపోర్టు ఇచ్చేటప్పుడు, అనియత సాక్ష్యంలో వెచ్చించిన సమయం; కరపత్రాలు, జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాలు, సమావేశ ఆహ్వానపత్రాలతో సహా ఇచ్చిన ప్రచురణలన్నీ రిపోర్టు చేయడం మర్చిపోకండి. ఆ చిన్నచిన్న అవకాశాలన్నీ ఉపయోగించుకుంటే నెలాఖరున మీరిచ్చే గంటలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
4. మీ నిర్ణయం ఏంటి?
4 మన పరిస్థితులు ఎలా ఉన్నా సువార్తను వ్యాప్తి చేయడానికి ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. అప్పుడు, మనం రాజ్యం కోసం చేయగలిగినదంతా చేస్తున్నామనే తృప్తి మనకు ఉంటుంది.—మార్కు 14:8; లూకా 21:2-4.