సరిగ్గా చదవడం రానివాళ్లకు ఎలా సహాయం చేయాలి?
1. సరిగ్గా చదవడం రానివాళ్లకు బైబిలు విషయాలు బోధించేటప్పుడు ఏ ఇబ్బంది ఎదురౌతుంది?
1 సరిగ్గా చదవడం రాని ఇంటివాళ్లకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉండవచ్చు కానీ బైబిలు, ఇతర పుస్తకాలు చదవాలంటే భయపడవచ్చు. అటువంటి వాళ్లకు మొదట్లోనే బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇస్తే అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటివాళ్లకు ఆధ్యాత్మికంగా ఎలా సహాయం చేయవచ్చు? వాళ్లయితే ఏమి చేస్తారో చెప్పమని 20 కన్నా ఎక్కువ దేశాలకు చెందిన అనుభవజ్ఞులైన ప్రచారకులను అడిగాం. వాళ్లు ఇచ్చిన సలహాలు కింద ఉన్నాయి.
2. సరిగ్గా చదవడం రానివాళ్లకు సహాయం చేయడానికి ఏ చక్కని ఉపకరణాలు ఉన్నాయి?
2 బైబిలు విద్యార్థికి చదవడం అంతగా రాకపోయినా లేదా అస్సలు రాకపోయినా, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషురుతో అధ్యయనం మొదలుపెట్టవచ్చు. అమెరికాలోని ఒక పయినీరు, గృహస్థునికి రెండు బ్రోషుర్లూ చూపించి ఆయనకు వాటిలో ఏది బాగా అర్థమౌతుందో అడుగుతాడు. ఈ రెండు బ్రోషుర్లు ఆఫ్రికా ప్రజలకు చక్కని ఉపకరణాలుగా ఉన్నాయని కెన్యాలోని బ్రాంచి కార్యాలయం నివేదిస్తుంది. ఎందుకంటే, వాళ్లు సాధారణంగా ప్రశ్నాజవాబుల పద్ధతిలో కాకుండా కథల రూపంలో బోధిస్తే చక్కగా నేర్చుకుంటారు. చదవడం, ప్రశ్నలకు జవాబు చెప్పడం వంటివి చదువుకున్న వాళ్లు ఇష్టపడవచ్చు, కానీ అంతగా చదువురాని వాళ్లకైతే అది కష్టంగా అనిపించవచ్చు. ఒకవేళ విద్యార్థులు కొంచెం చదవగలిగినా, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురు నుండి లేదా నా బైబిలు కథల పుస్తకము నుండి అధ్యయనం మొదలుపెట్టడానికి చాలామంది ప్రచారకులు ఇష్టపడతారు.
3. చదువురాని వాళ్లకు చక్కగా బోధించాలంటే వాళ్ల గురించి ఏ విషయాలు తెలుసుకోవడం మంచిది?
3 మెచ్చుకోండి: చదువురాని వాళ్లు ఇబ్బంది పడుతుండవచ్చు, తమ గురించి తాము తక్కువగా భావిస్తుండవచ్చు. వాళ్లకు సత్యం నేర్పించాలంటే మనం చేయాల్సిన మొదటి పని, వాళ్లు ఇబ్బందిపడకుండా చూసుకోవడం. చదువురాని చాలామందికి తెలివితేటలు ఉంటాయి, నేర్చుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. వాళ్లకు తగిన గౌరవం, మర్యాద ఇవ్వండి. (1 పేతు. 3:15, 16) తమ ప్రయత్నాలు వృథా కావట్లేదని, తాము ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నామని వాళ్లకు అనిపిస్తే, అధ్యయనాన్ని కొనసాగించాలనే పురికొల్పు పొందుతారు. కాబట్టి వీలైనప్పుడల్లా వాళ్లను మెచ్చుకోండి.
4. విద్యార్థికి చదవడం అంతగా రాకపోయినా అధ్యయనానికి సిద్ధపడేలా ఎలా ప్రోత్సహించవచ్చు?
4 విద్యార్థికి చదవడం అంతగా రాకపోయినా, అధ్యయనానికి సిద్ధపడమని ప్రోత్సహించండి. బాగా చదివే కుటుంబ సభ్యుని లేదా స్నేహితుని సహాయం తీసుకోమని దక్షిణ ఆఫ్రికాలోని కొందరు ప్రచారకులు తమ విద్యార్థులను ప్రోత్సహిస్తారు. బ్రిటన్లోని ఓ ప్రచారకుడు అధ్యయనం చేసేటప్పుడు, అండర్లైన్ చేసుకున్న తన పుస్తకాన్ని విద్యార్థులకు ఇచ్చి కొన్ని పేరాలు చర్చిస్తాడు. సిద్ధపడేటప్పుడు అండర్లైన్ చేసుకోవడం వల్ల సమాధానాలను తేలిగ్గా చెప్పవచ్చంటూ ఆ విధంగా ప్రోత్సహిస్తాడు. ఇండియాలోని ఓ సహోదరుడు, తర్వాతి వారంలో జరిగే పాఠంలోని చిత్రాలను చూసి ముందే ధ్యానించమని తన విద్యార్థులను ప్రోత్సహిస్తాడు.
5. అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ఎలా ఓపిక చూపించవచ్చు?
5 ఓపికతో ఉండండి: మీరు ఏ ప్రచురణ ఉపయోగించినా, ముఖ్యమైన విషయాలపై మనసుపెట్టండి. వాటిని మీ విద్యార్థి బాగా అర్థంచేసుకునేలా సహాయం చేయండి. మొదట్లో, 10 నుండి 15 నిమిషాలు చర్చించడమే మంచిది. ఒకేసారి ఎక్కువ సమాచారాన్ని చర్చించకండి, వెళ్లినప్పుడల్లా కొన్ని పేరాలు చర్చిస్తే సరిపోతుంది. ఒకవేళ విద్యార్థి మెల్లగా చదువుతుంటే ఓపికతో ఉండండి. యెహోవాపట్ల ఉన్న కృతజ్ఞత పెరిగేకొద్దీ, చదివే సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాలనే ప్రేరణ అతను పొందవచ్చు. అలా చేసేలా మీ విద్యార్థికి సహాయం చేయాలంటే అధ్యయనం ప్రారంభం నుండే అతణ్ణి కూటాలకు ఆహ్వానించడం మంచిది.
6. చదువు నేర్చుకోవడానికి ప్రజలకు ఎలా సహాయం చేయాలి?
6 బైబిలు విద్యార్థులు చదవడం నేర్చుకుంటే, త్వరగా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు. (కీర్త. 1:1-3) ఒకవేళ విద్యార్థి నిరుత్సాహపడితే, తాను నేర్చుకున్న కొన్ని విషయాలను అతనికి చెబుతూ ధైర్యాన్ని నింపవచ్చు. యెహోవా తన ప్రయత్నాలను తప్పకుండా ఆశీర్వదిస్తాడనే భరోసా ఆయనకు ఇవ్వండి, అలాగే సహాయం కోసం ప్రార్థించమని ప్రోత్సహించండి. (సామె. 16:3; 1 యోహా. 5:14, 15) బ్రిటన్లోని కొందరు ప్రచారకులు, చేరుకోగలిగే ప్రగతిదాయక లక్ష్యాలను పెట్టుకోమని విద్యార్థులను ప్రోత్సహిస్తారు. మొదట, అక్షరాలను బాగా నేర్చుకోమని, తర్వాత కొన్ని లేఖనాలు ఎంపిక చేసుకుని వాటిని తెరచి చదవమని, చివరిగా సరళమైన భాషలో ఉన్న బైబిలు ప్రచురణల్లో నుండి చదవమని చెప్పవచ్చు. చదువు నేర్చుకోవడానికి ప్రజలకు సహాయం చేయాలంటే, కేవలం ఎలా చదవాలో నేర్పించడమే కాదుగానీ చదవాలనే కోరికను మనం వాళ్లలో పుట్టించాలి.
7. సరిగ్గా చదవలేని వాళ్లకు సత్యం చెప్పడానికి మనం ఎందుకు వెనకాడకూడదు?
7 అంతగా చదువుకోని వాళ్లను యెహోవా చిన్నచూపు చూడడు. (యోబు 34:19) యెహోవా పరిశోధించేది వ్యక్తి హృదయాన్ని. (1 దిన. 28:9) కాబట్టి, సరిగ్గా చదవలేని వాళ్లకు సత్యం చెప్పడానికి వెనుకాడకండి. వాళ్లకు సత్యం నేర్పించడం మొదలుపెట్టడానికి మీ దగ్గర ఎన్నో అద్భుతమైన ఉపకరణాలు ఉన్నాయి. క్రమక్రమంగా, మీరు బైబిలు బోధిస్తోంది పుస్తకంతో అధ్యయనాన్ని మొదలుపెట్టి వాళ్లు లేఖనాలను మరింత లోతుగా అర్థంచేసుకోవడానికి సహాయం చేయవచ్చు.
చదువురాని వాళ్లు ఇబ్బంది పడుతుండవచ్చు, తమ గురించి తాము తక్కువగా భావిస్తుండవచ్చు. వాళ్లకు సత్యం నేర్పించాలంటే మనం చేయాల్సిన మొదటి పని, వాళ్లు ఇబ్బందిపడకుండా చూసుకోవడం