సమయపాలనను అలవర్చుకోండి
1. సమయపాలన విషయంలో యెహోవా ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?
1 యెహోవా ప్రతీది సమయానికి చేస్తాడు. ఉదాహరణకు, ఆయన తన సేవకులకు “సమయోచితమైన సహాయము” అందిస్తాడు. (హెబ్రీ. 4:16) ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా “తగినవేళ” పెడతాడు. (మత్త. 24:45) కాబట్టి, ఆయన ఉగ్రతదినం కూడా ‘జాగుచేయక వస్తుంది’ అని మనం రూఢిగా నమ్మవచ్చు. (హబ. 2:3) యెహోవా సమయాన్ని పాటిస్తున్నందువల్ల మనం ఎంతగా ప్రయోజనం పొందుతున్నామో కదా! (కీర్త. 70:5) మనం అపరిపూర్ణ మానవులం, పైగా చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి కాబట్టి సమయపాలన మనకు పెద్ద సవాలుగా అనిపించవచ్చు. ఇంతకీ సమయపాలనను మనమెందుకు అలవర్చుకోవాలి?
2. మనం సమయం పాటిస్తే, యెహోవాకు ఎందుకు ఘనత వస్తుంది?
2 ఈ అంత్యదినాల్లో చాలామంది స్వార్థపరులు, ఆత్మనిగ్రహం లేనివాళ్లే ఉన్నారు. దాంతో, సమయపాలనకు అంత ప్రాముఖ్యత లేకుండా పోతోంది. (2 తిమో. 3:1-3) అందుకే క్రైస్తవులు పనికి, కూటాలకు సమయానికి వెళ్లినప్పుడు; మాటిచ్చిన సమయానికి వెళ్లి కలిసినప్పుడు ఇతరులు గమనిస్తారు, యెహోవాకు ఘనత వస్తుంది. (1 పేతు. 2:12) మనం సాధారణంగా ఉద్యోగానికి సమయానికి వెళ్తూ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మాత్రం ఆలస్యంగా వస్తున్నామా? ఆరంభ పాట, ప్రార్థన కన్నా ముందే కూటాలకు రావడం, అన్నీ క్రమపద్ధతిలో చేసే మన పరలోక తండ్రి యెహోవాను అనుకరించాలనే కోరిక మనకుందని చూపిస్తుంది.—1 కొరిం. 14:33, 39, 40.
3. సమయపాలన, ఇతరుల మీద మనకు శ్రద్ధ ఉందని ఎలా చూపిస్తుంది?
3 సమయం పాటించడం వల్ల, ఇతరుల మీద మనకు శ్రద్ధ ఉందని కూడా చూపిస్తాం. (ఫిలి. 2:3, 4) క్రైస్తవ కూటాలకు, క్షేత్రసేవా కూటాలకు సమయానికి వెళ్తే తోటి ఆరాధకులకు అనవసర ఇబ్బంది కలిగించకుండా ఉంటాం. అలాకాకుండా మనం ఎప్పుడూ ఆలస్యంగా వెళ్తుంటే, ఇతరుల సమయం కన్నా మన సమయమే మనకు విలువైనదని వాళ్లు అనుకుంటారు. చక్కగా సమయం పాటిస్తే, మనం ఆధారపడదగిన వాళ్లమని, కష్టపడే స్వభావం మనకుందని, నమ్మదగిన వాళ్లమని చూపిస్తాం. మన చుట్టూ ఉన్నవాళ్లు అలాంటి లక్షణాలను విలువైనవిగా చూస్తారు.
4. మనం తరచూ ఆలస్యంగా వెళ్తుంటే, మెరుగయ్యేందుకు ఏమి చేయవచ్చు?
4 మీరు తరచూ ఆలస్యంగా వెళ్తుంటే, ఎందుకలా జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించండి. పనులన్నీ సమయానికి పూర్తి చేసుకోగలిగేలా చక్కని పట్టిక వేసుకొని మీ జీవన శైలిని క్రమబద్ధం చేసుకోండి. (ప్రసం. 3:1; ఫిలి. 1:9-11) యెహోవా సహాయం కోరండి. (1 యోహా. 5:14) దేవుణ్ణి ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అనే ధర్మశాస్త్రంలోని రెండు అతిగొప్ప ఆజ్ఞలను పాటించడానికి సమయపాలన ఒక చక్కని మార్గం.—మత్త. 22:37-39.