వ్యక్తిగత, కుటుంబ బైబిలు అధ్యయనాలు ఎంతో ప్రాముఖ్యం!
1 మొదటి శతాబ్దంలోలాగే పరిపాలక సభ ఇప్పుడు కూడా యెహోవా ప్రజల సంక్షేమం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. (అపొ. 15:6, 28) త్వరలో మహా శ్రమల చీకట్లు కమ్ముకోబోతుండగా, ప్రతీ రాజ్య ప్రచారకుడికి యెహోవాతో దగ్గరి సంబంధం చాలా ప్రాముఖ్యం. గతంలో సంఘ పుస్తక అధ్యయనానికి కేటాయించిన సమయాన్ని ఇప్పుడు మీరెలా ఉపయోగిస్తారు? ఈ సమయాన్ని ప్రతీ ఒక్కరూ కుటుంబ ఆరాధనకు ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ సమయాన్ని సరిగా ఉపయోగిస్తే దేవుని ప్రేరేపిత వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి, దానిలోని జీవజలముల నుండి ప్రయోజనం పొందవచ్చు.—కీర్త. 1:1-3; రోమా. 11:33, 34.
2 కుటుంబ ఆరాధన చేసే రోజు: కుటుంబ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించాల్సిన బాధ్యతను యెహోవా కుటుంబ శిరస్సులకు ఇచ్చాడు. అది క్రమంగా, ప్రయోజనకరంగా జరిగేలా చూడమని వారిని ప్రోత్సహిస్తున్నాము. (ద్వితీ. 6:6, 7) కుటుంబ బాధ్యతలు లేని, అవివాహిత లేదా ఒంటరి సహోదర సహోదరీలు వ్యక్తిగత బైబిలు అధ్యయనానికి, పరిశోధనకు ఈ సమయాన్ని ఉపయోగించుకునే వీలుంటుంది. “దినములు చెడ్డవి గనుక” ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి అధ్యయనం చేస్తూ, అలా నేర్చుకున్నవాటి గురించి ఆలోచించడానికి ‘సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకోవడం’ మనందరికీ చాలా అవసరం.—ఎఫె. 5:15, 16.
3 అధ్యయనం చేయాల్సినవి: వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్‌లో లేదా సీడీ రామ్‌లోని వాచ్‌టవర్ లైబ్రరీలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మీ బైబిలు అధ్యయనాన్ని ఆనందదాయకం చేసుకోవచ్చు. కావలికోటలో క్రమంగా వచ్చే “కుటుంబ సంతోషానికి తోడ్పడే అంశాలు,” “మీ పిల్లలకు నేర్పించండి,” “మన యువతకు” వంటివాటిని కుటుంబాలు అధ్యయనం చేయవచ్చు. అంతేగాక, తేజరిల్లు! పత్రికలో “యువత ఇలా అడుగుతోంది” పరంపర, సృష్టిలోని వింతల గురించి చెప్పే ఆసక్తికరమైన ఆర్టికల్లు ఉన్నాయి.
4 కంగారు లేకుండా నెమ్మదిగా బైబిలు చదవడం, కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ దైవిక సూత్రాలను గుర్తుంచుకొని వాటిని తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేస్తుంది. (హెబ్రీ. 4:12) కొన్నిసార్లు, సంస్థ తయారుచేసిన ఏదైనా ఒక వీడియోను చూసి, చర్చించుకోవచ్చు. ఈ ఏర్పాటులో మీరు ఎంచుకున్న ప్రచురణను మీరు కనుగొన్న కొత్తపద్ధతుల్లో అధ్యయనం చేసే వీలుంటుంది. ఏమి అధ్యయనం చేస్తే బావుంటుందో, ఎలా అధ్యయనం చేస్తే బావుంటుందో మీ కుటుంబసభ్యులనే ఎందుకు అడగకూడదు?
5 ఇప్పుడెందుకు ప్రాముఖ్యమంటే: మనం ఆధ్యాత్మికంగా బలపడితే, ‘స్థిరంగా నిలబడి యెహోవా కలుగజేసే రక్షణను చూడడానికి’ సిద్ధంగా ఉంటాము. (నిర్గ. 14:13, NW) “మూర్ఖమైన వక్రజనము మధ్య,” పిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులకు దైవిక నడిపింపు అవసరం. (ఫిలి. 2:14, 15) నేడు పాఠశాలల్లో పెరిగిపోతున్న చెడు ప్రవర్తనా ప్రభావం పిల్లలపై పడకుండా వారికి సహాయం అవసరం. (సామె. 22:3, 6) దంపతులు, యెహోవా కూడా ఒక భాగంగా ఉన్న “మూడు పేటల త్రాడు[ను]” బలపర్చుకోవడం మంచిది. (ప్రసం. 4:12) కాబట్టి, మిగిలివున్న సమయాన్ని మనం మన ‘అతిపరిశుద్ధమైన విశ్వాసాన్ని’ పెంచుకోవడానికి జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుందాం.—యూదా 20.
[అధ్యయన ప్రశ్నలు]
1. పరిపాలక సభ ఇప్పుడు మన గురించి ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది, ఎందుకు?
2. కుటుంబ ఆరాధనను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు?
3, 4. మీరు ఎంపిక చేసుకోగల సమాచారం గురించి ఏమి సూచించబడింది, ఏ ఉద్దేశంతో అలా ఎంపిక చేసుకోవాలి?
5. వ్యక్తిగత, కుటుంబ బైబిలు అధ్యయనాలు ఇప్పుడు మన జీవితాల్లో ఎందుకంత ప్రాముఖ్యమైనవి?