బైబిలు విద్యార్థులు రాజ్య సువార్త ప్రచారకులయ్యేందుకు సహాయం చేయండి
1 మత్తయి 28:19, 20లో వ్రాయబడి ఉన్నట్లుగా యేసు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ నిజానికి చాలా విస్తృతమైనది. క్రీస్తు శిష్యులు ఇంకా ఎక్కువమందిని శిష్యులుగా చేయాలని ఉపదేశించబడ్డారు, ఆ శిష్యులు తిరిగి మరికొంతమందిని శిష్యులుగా చేస్తారు. అలా, విశేషమైన ఈ అంత్యదినాల్లో దేవుని రాజ్య సువార్త చివరిసారి ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడడానికి పునాది వేయబడింది, మనమిప్పుడు ఆ కాలాల్లోనే జీవిస్తున్నాం.—మత్త. 24:14.
2 మన బైబిలు విద్యార్థులు మన పిల్లలే కావచ్చు, లేదా మనతో బైబిలు అధ్యయనం చేయాలనుకునేవారే కావచ్చు. యేసుక్రీస్తు శిష్యులయ్యేందుకు ఇతరులకు సహాయపడాలనే తమ బాధ్యతను అంగీకరించేలా అలాంటివారికి మనం నిజంగా సహాయం చేయాలనుకుంటాం.—లూకా 6:40.
3 సాక్ష్యమిచ్చేందుకు వారిని సంసిద్ధుల్ని చేయండి: మీరు ఎవరితో అధ్యయనం చేస్తున్నారో వారు, తాము నేర్చుకుంటున్న విషయాలను ఇతరులతో పంచుకోమని వారిని ప్రోత్సహించండి. క్షేత్రసేవలో మీరు పొందిన ప్రోత్సాహకరమైన అనుభవాలను వారితో పంచుకోండి. మీ పిల్లలు పరిచర్యలో వారికి సాధ్యమైనంతవరకు అర్థవంతంగా పాల్గొనేలా వారికి చిన్నప్పటి నుండే శిక్షణనివ్వండి. (కీర్త. 148:12, 13) పరిచర్య మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని మాటల ద్వారా, మాదిరి ద్వారా వారికి చూపించండి.—1 తిమో. 1:12.
4 యెహోవా తన నీతియుక్త ప్రమాణాలను అంగీకరించి, వాటికి విధేయులయ్యే వారినే ఉపయోగించుకుంటాడు. అనుభవజ్ఞులైన, సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న రాజ్య ప్రచారకులకు తెలిసినంతగా కొత్త ప్రచారకులకు తెలియదనేది నిజమే కానీ కొత్తవారు ప్రాథమిక బైబిలు బోధలను విశ్వసించి, వాటిని వివరించగలగాలి. (సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 79-82 పేజీలు చూడండి.) “మహాబబులోను” నుండి తమనుతాము వేరుపర్చుకొని రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేకుండా ఉండడమేకాక వారు క్రమంగా సంఘ కూటాలకు హాజరవ్వాలి.—ప్రక. 18:2, 4; యోహా. 17:16; హెబ్రీ. 10:24, 25.
5 మీ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడయ్యేందుకు అర్హుడని మీకనిపించగానే ఆ విషయాన్ని సంఘ పైవిచారణకర్తకు చెప్పండి. మీ బైబిలు విద్యార్థి సంఘంతో కలిసి రాజ్య సువార్తను ప్రకటించేలా బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడయ్యేందుకు అర్హుడో కాదో నిర్ణయించడానికి ఆయన మీతోనూ, మీ బైబిలు విద్యార్థితోనూ మాట్లాడేందుకు ఇద్దరు పెద్దలను ఏర్పాటు చేస్తారు. అప్పుడిక మీ బైబిలు విద్యార్థి క్షేత్రసేవకు మీతోపాటు వస్తుండగా ఆయనకు మరింత శిక్షణనిచ్చే ఆధిక్యత మీకు లభిస్తుంది.