పత్రికలను అందించినవారితో బైబిలు అధ్యయనాలను ఎలా ప్రారంభించాలి?
1. మనం ఏ లక్ష్యంతో పత్రికలను అందించాలి?
1 శనివారాల్లో మనం సాధారణంగా పరిచర్యలో కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందిస్తాం. అయితే, యథార్థహృదయులకు సత్యాన్ని బోధించాలనే మన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది తొలిమెట్టు మాత్రమే. తిరిగి వెళ్ళినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని అందించి బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించాలనే విషయంలో ఈ క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. వీటిని మీ క్షేత్రానికి తగినట్లుగా మలచుకొని మీ సొంతమాటల్లో చెప్పవచ్చు. మరో ప్రతిపాదన మీకు చక్కని ఫలితాలు ఇస్తున్నట్లయితే మీరు దానిని ఉపయోగించవచ్చు.
2. బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని ప్రారంభ పేజీలను మనమెలా ఉపయోగించవచ్చు?
2 ప్రారంభ పేజీలను ఉపయోగించండి: మీరు తిరిగి వెళ్ళినప్పుడు ఇలా చెప్పవచ్చు: “నేను మీకిచ్చిన పత్రికలు బైబిలువైపు దృష్టిని మళ్ళిస్తాయి. బైబిలు చదవడం ఎందుకు ప్రాముఖ్యమో గమనించండి.” యెషయా 48:17, 18; యోహాను 17:3; లేదా సముచితమైన మరో లేఖనాన్ని చదవండి. తర్వాత బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గృహస్థుడికి చూపించి, ఆయనకు కూడా ఒక పుస్తకాన్నిచ్చి మీరిలా కొనసాగించవచ్చు:
◼ “బైబిలు భవిష్యత్తు గురించిన నిజమైన నిరీక్షణనిస్తుంది.” గృహస్థుడికి 4-5 పేజీలు చూపించి, ఇలా అడగండి: “ఇక్కడున్న ఏ వాగ్దానాలు నెరవేరాలని మీరు కోరుకుంటున్నారు?” ఆయన ఎంచుకున్న లేఖన వాగ్దానాన్ని చర్చించే అధ్యాయాన్ని ఆయనకు చూపించి, ఆయన అనుమతిస్తే ఒకటి, రెండు పేరాలను క్లుప్తంగా చర్చించండి.
◼ లేదా మీరు ఇలా కూడా చెప్పవచ్చు: “జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు బైబిలు సమాధానమిస్తోంది.” గృహస్థుడికి 6వ పేజీని చూపించి, పేజీ చివర్లో ఇవ్వబడిన ప్రశ్నల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అడగండి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చే అధ్యాయం తెరచి, ఒకటి, రెండు పేరాలను క్లుప్తంగా చర్చించండి.
◼ లేదా విషయసూచికలోని కొన్ని అధ్యయన శీర్షికలు చూపించి, వాటిలో ఆయనకు ఏ అంశం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి ఉందో అడగండి. ఆ అధ్యాయం తెరచి, బైబిలు అధ్యయనాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి.
3. (ఎ) విషమిస్తున్న లోకపరిస్థితులు, (బి) కుటుంబం, (సి) బైబిలు విశ్వసనీయత వంటి అంశాలను చర్చించే పత్రికలను అందించిన తర్వాత బైబిలు అధ్యయాన్ని మనమెలా ప్రారంభించవచ్చు?
3 మొదటిసారి కలుసుకున్నప్పుడు ఒక ప్రశ్న వేయండి: మొదటిసారి కలిసిన గృహస్థుడిని తిరిగి కలుసుకునేలా ఆయనను సిద్ధపరచడం మరో పద్ధతి. గృహస్థుడు పత్రికలను తీసుకొన్న తర్వాత, ఆయనకు ఒక ప్రశ్నవేసి, తిరిగొచ్చి దానికి సమాధానం చెప్తానని మాటివ్వండి. తిరిగివెళ్ళేందుకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకొని, చెప్పిన సమయానికే తప్పక వెళ్లండి. (మత్త. 5:37) మీరు తిరిగి వెళ్ళినప్పుడు, మీరు ముందు అడిగిన ప్రశ్నను గృహస్థుడికి గుర్తుచేసి, సమాధానాన్ని బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి చర్చించండి. గృహస్థుడు చర్చించబడుతున్న అధ్యాయాన్ని గమనించేలా ఆయనకు కూడా ఒక ప్రతిని ఇవ్వండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి:
◼ మీరిచ్చిన పత్రిక లోకపరిస్థితులు విషమించడాన్ని గురించి చర్చిస్తున్నట్లయితే మీరిలా చెప్పవచ్చు: “భూమిపై దేవుడు ఎలాంటి మార్పులను తీసుకొస్తాడు? అనే ప్రశ్నకు బైబిలు ఏమి సమాధానం చెబుతుందో మళ్లీ కలుసుకున్నప్పుడు చూద్దాం.” మీరు తిరిగివెళ్ళినప్పుడు గృహస్థుడికి 4-5 పేజీలను చూపించండి. లేదా “విషాదకర సంఘటనలు జరగడం దేవుని చిత్తమా?” అనే ప్రశ్నను మీరు అడగవచ్చు. తిరిగి వెళ్ళినప్పుడు, గృహస్థుడికి మొదటి అధ్యాయంలోని 7-8 పేరాలను చూపించండి.
◼ మీరిచ్చిన పత్రిక కుటుంబం గురించి చర్చిస్తున్నట్లయితే మీరు ఈ ప్రశ్న అడగవచ్చు: “కుటుంబ జీవితం సంతోషంగా ఉండడానికి కుటుంబ సభ్యుల్లో ప్రతీఒక్కరూ ఏమి చేయవచ్చు?” మీరు తిరిగి వెళ్ళినప్పుడు, 14వ అధ్యాయంలోని 4వ పేరాను పరిశీలించండి.
◼ మీరిచ్చిన పత్రిక బైబిలు విశ్వసనీయత గురించి చర్చిస్తున్నట్లయితే మీరు తర్వాతి చర్చకు ఈ ప్రశ్నను అడగవచ్చు: “బైబిలు విజ్ఞానశాస్త్రం ప్రకారం ఖచ్చితమైనదేనా?” మీరు తిరిగి వెళ్ళినప్పుడు, 2వ అధ్యాయంలోని 8వ పేరాను పరిశీలించండి.
4. గృహస్థుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి అంగీకరించకపోతే మనమేమి చేయాలి?
4 ప్రతీ చర్చ ముగింపులో, తిరిగి కలిసినప్పుడు సమాధానమిచ్చేలా మరో ప్రశ్నను అడగండి. ఒకసారి క్రమ బైబిలు అధ్యయనం ప్రారంభమైన తర్వాత పుస్తకాన్ని మొదటి నుండి చివరిదాకా క్రమపద్ధతిలో పరిశీలించండి. గృహస్థుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని తీసుకోవడానికి అంగీకరించకపోతే అప్పుడేం చేయాలి? మీరు ఆయనకు పత్రికలను క్రమంగా ఇస్తూ, బైబిలు ఆధారిత చర్చలను కొనసాగించండి. మీరు ఆయనలో ఆసక్తి పెంచినప్పుడు కొంతకాలానికి ఆయన బైబిలు అధ్యయాన్ని అంగీకరించవచ్చు.
5. ప్రజలకు పత్రికలను అందించండంకన్నా ఎక్కువే చేసేందుకు మనమెందుకు ప్రయత్నించాలి?
5 బైబిలు ఏమి బోధిస్తుందో తెలుసుకోవాలనే అభిలాషను కావలికోట, తేజరిల్లు! పత్రికలు కలిగించవచ్చు. కాబట్టి, పత్రికలను తీసుకున్నవారితో బైబిలు అధ్యయనాలను ప్రారంభించేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించండి. ఈ విధంగా మనం “శిష్యులనుగా చేయుడి . . . వారికి బోధించుడి” అని యేసు ఇచ్చిన ఆదేశాలకు విధేయులమవుతాం.—మత్త. 28:19, 20.