“మీరెలా జవాబిస్తారు?”
1. మనలో చాలామంది ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు?
1 మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పటికీ బైబిలు వృత్తాంతాల వివరాలను గుర్తుంచుకోవడం లేక లేఖనాల్లో ఫలాని వ్యాఖ్యానాలు ఎక్కడ వ్రాయబడ్డాయో గుర్తుంచుకోవడం కష్టమనిపిస్తోందా? ప్రాథమిక బైబిలు వాస్తవాలు లేదా బోధలు మీ పిల్లలు చక్కగా అర్థం చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? తేజరిల్లు! పత్రికలోని, 31వ పేజీలో కనబడే “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షిక, దేవుని వాక్యంతో చక్కగా పరిచయం పెంచుకునేందుకు పిల్లలకు, పెద్దలకు సహాయపడగలదు.—అపొ. 17:11.
2. “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షికలోని ఇతర భాగాలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
2 ఈ శీర్షికను మీరు చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు? తేజరిల్లు! ఏప్రిల్-జూన్ 2006 సంచిక ఈ క్రింది సలహాలనిచ్చింది: ‘కొన్ని త్రైమాసిక సంచికల్లో కూడా “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షిక ఉంటుంది. దానిలోని కొన్ని భాగాలు యువ పాఠకులకు ఆసక్తికరంగా ఉంటాయి; వేరేవి అభివృద్ధి సాధించిన బైబిలు విద్యార్థుల జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. “చరిత్రలో ఎప్పుడు జరిగింది?” అనే భాగం, బైబిలులో ప్రస్తావించబడిన వ్యక్తులు ఎప్పుడు జీవించారు, ప్రధాన సంఘటనలు ఎప్పుడు జరిగాయి వంటివి చూపించే కాలరేఖను మీరు తయారుచేసుకోవడానికి సహాయం చేస్తుంది. “ఈ సంచికలో నుండి” అనే భాగానికి సంబంధించిన జవాబులు పత్రిక అంతటిలో ఉన్నా, అనేక ఇతర ప్రశ్నలకు జవాబులు అదే పేజీలో ఉంటాయి, అయితే అవి తలక్రిందులుగా ముద్రించబడి ఉంటాయి. ఆ జవాబులను చదవడానికి ముందు కొంత పరిశోధన ఎందుకు చేయకూడదు? అలా చేశాక మీరు తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవచ్చు. “మీరెలా జవాబిస్తారు?” అనే ఈ క్రొత్త శీర్షికను కుటుంబంగా చేసే లేక గుంపుగా చేసే బైబిలు చర్చలకు ఆధారంగా కూడా ఉపయోగించుకోవచ్చు.’
3. ఈ శీర్షిక నుండి కొన్ని కుటుంబాలు ఎలా ప్రయోజనం పొందాయి, మీరు ఏ భాగాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
3 నిజానికి చాలా కుటుంబాలు ఈ శీర్షిక ఆధారంగా కుటుంబ అధ్యయనాలు చేయడానికి ఇష్టపడుతున్నాయి. బ్రెజిల్‌లోని ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “తేజరిల్లు!లోని ఈ శీర్షికంటే ఏడేళ్ళ మా అబ్బాయికి, నాకు చాలా ఇష్టం. మోయిజెజ్ అవధానం నిలపడానికి, లేఖనాలను కనుగొనడానికి, చిత్రాల భావాన్ని, తేదీలను అర్థం చేసుకోవడానికి అది సహాయం చేసింది.” ఎనిమిది సంవత్సరాల ఆష్లీ ఇలా వ్రాస్తుంది: “తేజరిల్లు! సంచిక చివరన ఉండే ‘మీరెలా జవాబిస్తారు?’ అనే శీర్షిక ప్రచురిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. దానినుండి నేను బైబిలు గురించి ఎంతో తెలుసుకుంటున్నాను.”
4. ఒక కుటుంబం తమ కుటుంబ బైబిలు అధ్యయనంలో ఈ శీర్షికను ఉపయోగించి ఎలా అధ్యయనం చేయవచ్చు?
4 “మీరెలా జవాబిస్తారు?” అనే శీర్షికను అప్పుడప్పుడూ మీ కుటుంబ అధ్యయనంలో భాగంగా ఉపయోగించడం గురించి ఎందుకు ఆలోచించకూడదు? కష్టంగా ఉండే కొన్ని ప్రశ్నలకు ఇండెక్స్ లేదా సీడీ రామ్‌లోవున్న వాచ్‌టవర్ లైబ్రరీలో సమాధానాల కోసం మీరు వెదకవచ్చు. అలాచేయడం ద్వారా మీ పిల్లలకు పరిశోధన ఎలా చేయాలో మీరు నేర్పిస్తారు. మీ కుటుంబ అధ్యయనానికి ముందే “నేను ఎవరిని?” లేక “చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?” వంటి వాటికి సమాధానాలు కనుగొనడానికి పరిశోధన చేయడమనే కాస్త కష్టమైన పనిని ఎదిగిన మీ పిల్లలకు ఎందుకు అప్పగించకూడదు? వారు చేసిన పరిశోధనలో లభించిన జవాబులను అధ్యయన సమయంలో పంచుకోగలుగుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి, చిన్నప్పటినుండే “పరిశుద్ధలేఖనములను” నేర్చుకొనేందుకు వారికి సహాయం చేయడానికి ఈ పేజీని సమర్థవంతంగా ఉపయోగించడం ఒక మార్గం.—2 తిమో. 3:14; ద్వితీ. 6:7.