దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా బోధిస్తుండండి
1 మనం ప్రకటిస్తున్నప్పుడు మనం చెప్పేది అందరూ వినరని క్రైస్తవ పరిచారకులమైన మనకు తెలుసు. (మత్త. 10:14) అయితే కొందరి ప్రతికూల స్పందనల కారణంగా మనం సువార్త ప్రకటించడం మానుకోము. (సామె. 29:25) దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా ప్రకటించేందుకు మనకు ఏమి సహాయం చేస్తుంది?
2 అపొస్తలుడైన పౌలు “యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞా[నాన్ని]” విలువైనదిగా పరిగణించాడు. ఆయన “సంపూర్ణ నిశ్చయతతో” ప్రకటించేలా అది ఆయనను ప్రేరేపించింది. (ఫిలి. 3:8; 1 థెస్స. 1:4-5) ఆయన ప్రకటించిన సందేశాన్ని కొందరు బలహీనమైనదిగా, అవివేకమైనదిగా భావించినా, “నమ్ము ప్రతివానికి . . . రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి” అని ఆయనకు తెలుసు. (రోమా. 1:16) కాబట్టి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆయన ‘యెహోవాను ఆనుకొని ధైర్యముగా మాటలాడాడు.’—అపొ. 14:1-7; 20:18-21, 24.
3 మన బలానికి మూలాధారం: పౌలు తన స్వశక్తితోనే ధైర్యంగా సాక్ష్యం ఇవ్వలేదు. పౌలు తన గురించీ, సీల గురించీ మాట్లాడుతూ ఇలా వ్రాశాడు: ‘మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానముపొంది, యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును.’ (1 థెస్స. 2:2; అపొ. 16:12, 37) అంతేకాక, పౌలు రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు ‘తాను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో’ సువార్త ప్రకటిస్తూ ఉండేలా తన కోసం ప్రార్థించమని ఇతరులను కోరాడు. (ఎఫె. 6:18-20) పౌలు తన స్వశక్తి మీద కాక యెహోవా మీద ఆధారపడడం ద్వారా దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ ధైర్యంగా ప్రకటించగలిగాడు.—2 కొరిం. 4:7; ఫిలి. 4:13.
4 నేడు కూడా అది సాధ్యమే. తన ఉద్యోగ స్థలంలో తనను తాను ఒక యెహోవాసాక్షిగా చెప్పుకోవడం, తన ఉద్యోగ స్థలంలో ఉన్నవారికి సాక్ష్యం ఇవ్వడం చాలా కష్టమని భావించిన ఒక సహోదరుడు, ఆ విషయం గురించి ప్రార్థించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒక సహోద్యోగి మొదట్లో ఆయన ప్రయత్నాలను తిరస్కరించాడు, కానీ ఆ వ్యక్తి పునరుత్థాన నిరీక్షణ గురించి విన్నప్పుడు అది బైబిలు అధ్యయనానికి దారితీసింది. అప్పటి నుండి ఆ సహోదరుడు సాక్ష్యమిచ్చేందుకు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన తన తర్వాతి ఉద్యోగ స్థలంలో, 14 సంవత్సరాల కాలంలో 34 మంది బాప్తిస్మం తీసుకొనేందుకు సహాయం చేశాడు. మనం ‘తన వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తూ ఉండడానికి’ యెహోవా మనల్ని కూడా అలాగే బలపరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—అపొ. 4:30.