దేవుణ్ణి ఆరాధించండి పుస్తక అధ్యయనం
అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తకం, కొత్తవారు జ్ఞానము పుస్తక అధ్యయనం పూర్తి చేసిన తర్వాత వారితో అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. ఈ ప్రచురణను సంఘ పుస్తక అధ్యయనంలో మనం పరిశీలించడం, పరిచర్యలో ఈ ఉపకరణాన్ని ఉపయోగించడానికి మనల్ని సిద్ధపరుస్తుంది, యెహోవాపట్ల ఆయన సంస్థపట్ల మన ప్రేమను మెప్పును అధికం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తక అధ్యయనం నుండి మనమెలా పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు?
అధ్యయనం నిర్వహించడం: మనం వారానికి ఒక అధ్యాయాన్ని పరిశీలిస్తాము కాబట్టి పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు సమయాన్ని ఆయాభాగాలకు జ్ఞానయుక్తంగా కేటాయించవలసి ఉంటుంది. వాళ్ళు ప్రారంభ పేరాలను కాస్త తక్కువ సమయంలో ముగిస్తూ, సాధారణంగా అధ్యాయంలోని తర్వాతి సగభాగంలో ఉండే ముఖ్యమైన విషయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ అధ్యయనాన్ని కొనసాగించాలి. ప్రతి అధ్యయనం ముగింపులో, పునఃసమీక్ష బాక్సును క్లుప్తంగా చర్చించడం హాజరైనవారందరు కీలకాంశాలను గుర్తుంచుకోవడానికి సహాయం చేస్తుంది.
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలోని దాదాపు యాభై శాతం అధ్యాయాల్లో ధ్యానించడానికి, చర్చించడానికి ఉద్దేశించబడిన ప్రశ్నలున్నాయి. దానికి ఒక ఉదాహరణను 48-9 పేజీల్లో చూడవచ్చు. అలాంటి ప్రశ్నలను పేరాలతోపాటు చదవవలసిన అవసరం లేదు. వాటిని అధ్యయన గుంపుతో పరిశీలించేటప్పుడు, పైవిచారణకర్త సమయం అనుమతించిన మేరకు, ఉల్లేఖించబడిన లేఖనాలను చదివించి, చర్చించాలి.
ముందుగా సిద్ధపడడం: అధ్యయనానికి చక్కగా సిద్ధపడడంలో, జవాబుల క్రింద గీతలు పెట్టుకోవడం కంటే ఎక్కువే ఇమిడివుంది. ఉల్లేఖించబడిన లేఖనాలను ప్రార్థనాపూర్వకంగా ధ్యానించడం, వ్యాఖ్యానించేందుకు సిద్ధపడడానికే కాక మరింత ప్రాముఖ్యంగా మన హృదయాలను సిద్ధం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (ఎజ్రా 7:10) సహేతుకంగా వ్యాఖ్యానించడం ద్వారా మనమందరం పరస్పర ప్రోత్సాహానికి దోహదపడవచ్చు.—రోమా. 1:11, 12.
దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని మనం అధ్యయనం చేయడం యెహోవాకు సన్నిహితమయ్యేందుకు మనకు సహాయం చేస్తుంది, యథార్థ హృదయులు ఆయనను ఆరాధించడంలో మనతో కలిసేలా వారికి సహాయపడేందుకు మనల్ని సంసిద్ధులను చేస్తుంది. (కీర్త. 95:6; యాకో. 4:8) ఈ చక్కని ఆధ్యాత్మిక ఏర్పాటు నుండి మనమందరం పూర్తిగా ప్రయోజనం పొందుదాము.