మీకు ఉన్నదానితో సంతృప్తి చెందండి
1 మన కుటుంబానికున్న వస్తుదాయకమైన అవసరాలను తీర్చమని లేఖనాలు మనకు ఉపదేశిస్తున్నాయి, కానీ మన జీవిత ప్రధాన లక్ష్యం అదే కాకూడదు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమస్థానం ఇవ్వాలి. (మత్త. 6:33; 1 తిమో. 5:8) ఈ ‘అపాయకరమైన కాలములలో’ సరైన సమతుల్యాన్ని కలిగి ఉండడం ఒక సవాలే. (2 తిమో. 3:1) అలా ఉండడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?
2 బైబిలు ఉద్దేశాన్ని స్వీకరించండి: సంపదల కోసం వెంటాడడం ఆధ్యాత్మిక పతనానికి దారితీయవచ్చని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. (ప్రసం. 5:10; మత్త. 13:22; 1 తిమో. 6:9, 10) ఈ క్లిష్ట కాలాల్లో, మనలో ఎవరమైనా సరే ఉద్యోగపరమైన, ఆర్థికపరమైన చింతలలో మునిగిపోయి కూటాలు, అధ్యయనం, పరిచర్య వంటి ఆధ్యాత్మిక కార్యాలను మన జీవితాల్లో రెండవ స్థానానికి నెట్టివేయడం ప్రమాదకరం. (లూకా 21:34-36) దానికి విరుద్ధంగా, “అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము” అని బైబిలు ఉపదేశిస్తుంది.—1 తిమో. 6:7, 8.
3 దీనర్థం క్రైస్తవులు కావాలని పేదరికంలో జీవించాలని కాదు. కాని ఆ ఉపదేశం, నిజంగా మన జీవితావసరాలు ఏమిటో గుర్తించడానికి మనకు సహాయం చేస్తుంది, అవేమిటంటే మనం జీవిస్తున్న ప్రాంతానికి తగిన ఆహారం, దుస్తులు, వసతి వంటివి. మన కనీసావసరాలు తీరుతూ ఉంటే, ఉన్నత జీవిత ప్రమాణాన్ని అంతు లేకుండా వెంబడించవలసిన అవసరం లేదు. ఏదైనా కొనుక్కోవాలని లేదా అదనపు ఉద్యోగం చేపట్టాలని మనం అనుకుంటే, మనల్ని మనం, ‘ఇది నిజంగా అవసరమా?’ అని ప్రశ్నించుకోవాలి. అలా చేయడం, “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి” అన్న ప్రేరేపిత ఉపదేశాన్ని లక్ష్యపెట్టడానికి మనకు సహాయం చేస్తుంది.—హెబ్రీ. 13:5.
4 మనం యెహోవాయందు విశ్వాసముంచితే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. (సామె. 3:5, 6) నిత్యావసర వస్తువులను సంపాదించుకోవడానికి మనం కష్టించి పనిచేయవలసి వచ్చినప్పటికీ మనం మన జీవితాల్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వము. మనకు ఉన్నది కొంచెమైనా, ఎక్కువైనా మన అవసరాలను తీర్చడానికి మనం యెహోవా మీద ఆధారపడతాం. (ఫిలి. 4:11-13) దాని ఫలితంగా మనం ఇతర ఆశీర్వాదాలతోపాటు దైవిక సంతృప్తిని కూడా అనుభవిస్తాం.
5 ఇతరుల విశ్వాసాన్ని అనుకరించండి: తన కుమార్తెను సత్య మార్గంలో పెంచుతున్న ఒక ఒంటరి తల్లి తన జీవితాన్ని క్రమంగా సరళీకృతం చేసుకుంటూ వచ్చింది. అన్ని సౌకర్యాలూ ఉన్న తన ఇంటిలో ఆమె సంతోషంగా ఉన్నప్పటికీ, మొదట చిన్న ఇంట్లోకి ఆ తర్వాత ఒక అపార్ట్మెంట్లోకి మారింది. ఇది తాను ఉద్యోగం చేయవలసిన గంటలను తగ్గించుకోవడానికి ఆమెకు సహాయం చేసింది, అలా ఆమె పరిచర్యకు ఎక్కువ సమయం వెచ్చించగలిగింది. తన కూతురు పెద్దదై, పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆమె రిటైర్మెంట్ తీసుకుంది. అలా చేయడం వల్ల తనకొచ్చే ఆదాయం ఇంకా తగ్గిపోతుందని తెలిసినప్పటికీ ఆమె ముందుగా రిటైర్మెంట్ తీసుకుంది. ఈ సహోదరి తన క్రమ పయినీరు సేవ ప్రారంభించి ఏడు సంవత్సరాలయ్యింది, ఆమె తన జీవితంలో రాజ్యాసక్తులను మొదట ఉంచడానికి తాను చేసిన వస్తుదాయక త్యాగాల విషయమై ఏమాత్రం చింతించడం లేదు.
6 ఒక పెద్ద, ఆయన భార్య తమ ముగ్గురు పిల్లలను పెంచుతూ ఎన్నో సంవత్సరాలు పయినీరు సేవ చేశారు. ఒక కుటుంబంగా వారు తాము కావాలనుకున్నవాటిని సమకూర్చుకోవడం కాకుండా తమ అవసరాలను తీర్చుకోవడం ద్వారా సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నారు. ఆ సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “మేము మా జీవితాన్ని మరింత సరళం చేసుకోవలసి వచ్చింది. మాకు కొన్ని కష్ట సమయాలు వచ్చినప్పటికీ, యెహోవా ఎల్లప్పుడూ మాకు కావలసినవి సమకూర్చాడు. . . . నా కుటుంబం ఆధ్యాత్మిక అవసరాలను ముందుంచడాన్ని చూసినప్పుడు, అన్ని విషయాలు ఉండవలసిన విధంగానే సక్రమంగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది, జీవితంలో విజయం సాధించానన్న భావన కలుగుతుంది.” ఆయన భార్య ఇలా అంటుంది: “[నా భర్త] ఆధ్యాత్మిక విషయాలతో బిజీగా ఉండడం చూసినప్పుడు, నాకు లోతైన మానసిక సంతృప్తి కలుగుతుంది.” తమ తల్లిదండ్రులు యెహోవాకు పూర్తికాల సేవ చేయాలని నిర్ణయించుకున్నందుకు పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు.
7 వస్తుదాయకమైన విషయాలకు బదులు దైవభక్తితో కూడిన ఇలాంటి మార్గాన్ని ఎన్నుకునే వారందరికీ, ఇప్పుడూ రాబోయే జీవితంలోనూ గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని బైబిలు వాగ్దానం చేస్తుంది.—1 తిమో. 4:8.