ప్రశ్నాభాగం
◼ తల్లిదండ్రులు, తమ పిల్లలు కూటాల్లో సరియైన ప్రవర్తన కలిగివుండేలా వారికి సహాయం చేయడానికి అటెండెంట్లు తల్లిదండ్రులకు ఎలా మద్దతునివ్వగలరు?
పిల్లలు సహజంగానే చలాకీగా ఉంటారు, ఎక్కువసేపు కూర్చోవడానికి అంతగా ఇష్టపడరు. అదిమిపెట్టిన శక్తి మూలంగా, కూటం అయిపోయిన తర్వాత పిల్లలు ఇతర పిల్లలతో పాటు రాజ్యమందిరంలోనూ బయటా పరుగులు పెట్టాలనుకుంటారు. అయితే సామెత చెప్తున్నట్లుగా “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.”—సామె. 29:15.
విచారకరంగా, ఈ చిన్నపిల్లలు అటు ఇటు పరుగెత్తి, పెద్ద వయస్సున్న మన సహోదర సహోదరీల్లో కొందరిని పడేయడం వల్ల వాళ్ళు గాయపడ్డారు. ఇది అనవసరమైన బాధను కలిగించడమే కాక తల్లిదండ్రులకు, సంఘానికి అనవసరమైన ఖర్చులు అయ్యేలా చేసింది. వారి స్వంత భద్రత కోసం, ఇతరుల క్షేమం కోసం పిల్లలు రాజ్యమందిరం లోపలా, బయటా కూడా పరిగెత్తడానికి గానీ, ఆడటానికి గానీ అనుమతించకూడదు.
మన ఆరాధనా స్థలాల్ని సరియైన గౌరవంతో చూసేలా పిల్లలకు శిక్షణనివ్వాల్సిన లేఖనాధార బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. (ప్రసం. 5:1) మన క్రైస్తవ కూటాల్లో, అసెంబ్లీల్లో, సమావేశాల్లో, “సమస్తమును మర్యాదగాను క్రమముగాను” జరిగేలా, అలాగే “యోగ్యమైన ప్రవర్తన” ఉండేలా చూడటానికి అటెండెంట్లు నియుక్తులయ్యారు. (1 కొరిం. 14:39; కొలొ. 2:5) లోపలా, బయటా కూటానికి ముందూ, కూటం జరుగుతున్నప్పుడూ, కూటం అయిన తర్వాతా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఒక పిల్లవాడు పరిగెడుతున్నా లేక అవిధేయుడుగా ఉన్నా అటెండెంటు ఆ పిల్లవాణ్ణి సావధానంగా ఆపి, అలాంటి పనులు ఎందుకు సరైనవి కావో చెప్పాలి. పిల్లవాడి తల్లిదండ్రులకు కూడా దయాపూర్వకంగా ఆ సమస్యనూ పిల్లవాణ్ణి పర్యవేక్షించాల్సిన అవసరాన్నీ తెలియజేయాలి. తల్లిదండ్రులు కూడా తగిన విధంగా ప్రతిస్పందించాలి.
కొన్నిసార్లు కూటాల్లో శిశువులు, చిన్నపిల్లలు ఏడుస్తారు, అల్లరిచిల్లరిగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నది అర్థం చేసుకొనదగినదే. కూటం ప్రారంభమవ్వడానికి కనీసం 20 నిమిషాల ముందు వచ్చే అటెండెంట్లు, తల్లిదండ్రులు తమ చిన్నపిల్లలతోపాటు కూర్చొనేలా వారి కోసం చివరి కొన్ని సీట్లను కేటాయించవచ్చు. ఆ సీట్లను వారికే విడిచిపెట్టడం ద్వారా మిగిలిన మనమందరం వారితో సహకరించాలి.
పిల్లవాడు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు చర్య తీసుకోకపోతే పిల్లవాడు చేస్తున్న అల్లరి ఇతరులకు భంగం కలిగిస్తుంటే, పిల్లవాడ్ని బయటకు తీసుకువెళ్ళమని అటెండెంట్లు తల్లిదండ్రులకు మర్యాదపూర్వకంగా చెప్పాలి. మనం కొత్త వారిని కూటాలకు ఆహ్వానించినప్పుడు, వారు పిల్లలను తీసుకువస్తే మనం వాళ్ళతో పాటు కూర్చొని, పిల్లలు ఏడ్చినా లేక ఏ విధంగానైనా భంగం కలిగిస్తున్నా వాళ్ళకు సహాయం చేయాలి.
అన్ని వయస్సుల్లోని పిల్లలు రాజ్యమందిరానికి వచ్చి, దేవుని మందిరంలో మంచి ప్రవర్తనను కలిగివుండటాన్ని గమనించడం మనకు ఆనందాన్ని తీసుకువస్తుంది. (1 తిమో. 3:15) ఆరాధన కోసమైన యెహోవా ఏర్పాట్లను వారు గౌరవించడం ద్వారా, వారు యెహోవాకు ఘనతను తెస్తారు, సంఘంలోని అందరి మెప్పునూ పొందుతారు.