“మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?”
1 ఒక చక్కని ప్రేరణాత్మకమైన, హృదయానందకరమైన సందేశం 169 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడనుంది. ఏమిటా సందేశం? అది ఎలా అందించబడుతుంది?
2 పొరుగు ప్రేమ గురించే ఆ సందేశమంతా. ఇది “మానవులందరూ ఎప్పటికైనా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే శీర్షిక గల రాజ్య వార్త నెం. 35లో కనుగొనబడనుంది. ఈ రాజ్య వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తుంది. మానవుల మధ్య ప్రేమ లేకపోవడమే ఎంతో హృదయవేదనకూ బాధకూ మూల కారణమని అది చూపిస్తుంది. ముఖ్యంగా మన కాలంలో, పొరుగు ప్రేమ అనేది ఎందుకు చల్లారి పోయింది, దీనివల్ల భవిష్యత్తులో ఏమి జరుగనుంది అనే విషయాలను అది వివరిస్తుంది.
3 అంతేకాక, నేటి ప్రపంచంలో జీవిస్తున్న లక్షలాది మంది మధ్య నిజమైన పొరుగు ప్రేమ ఉందని కూడా రాజ్య వార్త నెం. 35 చూపిస్తుంది. తొలి క్రైస్తవత్వాన్ని—యేసుక్రీస్తు నేర్పించినట్లు పొరుగు ప్రేమతో గుర్తించబడిన మొదటి శతాబ్దపు ఆరాధనను—పునరుద్ధరించే పనిలో పాల్గొంటున్నవారెవరో అది తెలియజేస్తుంది.—లూకా 10:25-37.
4 క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యం క్రింద యావత్ ప్రపంచంలోని మానవులు పొరుగు ప్రేమను ఎలా చూపిస్తారనే వివరణతో రాజ్య వార్త నెం. 35 ముగుస్తుంది. ఈ సందేశాన్ని చదివేవారు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ను పొందాలనీ, దేవుని వాక్యంలో విశదంగా వర్ణించబడిన ప్రేమపూర్వకమైన ఈ ప్రపంచ వ్యాప్త ఏర్పాటులో ఎలా భాగం కాగలరో తెలుసుకోవాలనీ ప్రోత్సహించబడుతున్నారు.
5 ఈ సందేశాన్ని ఎవరు అందజేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు పొరుగు ప్రేమను గూర్చిన ఈ సందేశాన్ని అక్టోబరు, నవంబరు నెలల్లో తమ పరిచయస్థులకూ, పొరుగువారికీ, బంధువులకూ తెలియజేస్తారు. రాజ్య వార్త నెం. 35ను ప్రజలకు పంచిపెట్టే పనిలో యోగ్యతగల వారందరూ భాగం వహించాలని ప్రోత్సహించబడుతున్నారు.
6 దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు నుండి లేదా జ్ఞానము పుస్తకం నుండి బైబిలు అధ్యయనం చేసేందుకు ప్రజల ఆసక్తిని రేకెత్తించాలన్నదే ఈ ప్రచార పని యొక్క తుది లక్ష్యం. అంతేకాక, యెహోవాసాక్షుల్లో ప్రతి ఒక్కరూ పూర్ణ హృదయంతో చేసే ప్రయత్నం ప్రేమా స్వరూపియైన యెహోవా దేవుని గురించీ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గురించీ గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది.