పురోభివృద్ధికరమైన గృహ బైబిలు పఠనాలను నిర్వహించడం
1 టాంజాన్యాలోని ఒక నర్సు, అర్జెంటీనాలోని ఒక యౌవనురాలు, లాట్వియాలోని ఒక తల్లి, వీరు ముగ్గురికీ ఏ విషయంలో సారూప్యం ఉంది? వీరు ముగ్గురూ తమ గృహ బైబిలు పఠనాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధించారని 1997 వార్షికపుస్తకం ([ఆంగ్లం] పేజీలు 8, 46, 56) నివేదిస్తుంది. జ్ఞానము పుస్తకంలో వారు ఒక్కొక్క వారంలో ఒకటికన్నా ఎక్కువసార్లు పఠనానికి కూర్చోవడానికి సుముఖత చూపడంవల్ల ఇది సాధ్యమయ్యింది. సాధ్యమైనప్పుడల్లా పఠనానికి కూర్చున్న ప్రతీసారీ ప్రచారకులు పుస్తకంలోని ఒక్క అధ్యాయం చర్చించడానికి ప్రయత్నించాలని సిఫారసు చేయబడింది. అయితే, అలా చేయడం ఒక సవాలుగా ఉన్నట్లు కొంతమందికి అనిపించింది. చాలావరకు ప్రతి విద్యార్థి పరిస్థితులూ, సామర్థ్యాలపై ఆధారపడివున్నప్పటికీ అనుభవంగల బోధకులు ఈ క్రింది సూచనలను పాటించడంద్వారా విజయాన్ని సాధించారు.
2 జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్లో చర్చించబడినట్లే, పఠనం కొరకు సిద్ధపడడంలో మీ విద్యార్థులకు శిక్షణనివ్వడం అవసరం. ఇదెలా చేయబడుతుందో ఆదిలోనే వివరించి, ప్రదర్శించడం మంచిగా ఉంటుంది. జ్ఞానము పుస్తకం యొక్క మీ వ్యక్తిగత పఠన ప్రతిని వారికి చూపించండి. మొదటి పాఠాన్ని కల్సి సిద్ధపడండి. ముద్రిత ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చే కీలక పదాలు లేక మాటలను కనుగొనడానికి విద్యార్థులకు సహాయపడండి, తర్వాత వాటి క్రింద గీత గీయడమో లేక గుర్తు పెట్టడమో చేయండి. కొంతమంది ప్రచారకులు తమ విద్యార్థులకు వాటిని రంగు పెన్నుతో గుర్తు పెట్టడానికి ఒక హైలైటర్ను కూడా ఇచ్చారు. వారు పఠనానికి సిద్ధపడుతుండగా లేఖనాలన్నింటినీ తెరిచి చూడమని వారిని ప్రోత్సహించండి. ఈ విధంగా చేయడం ద్వారా సంఘ పుస్తక పఠనానికీ, కావలికోట పఠనానికీ హాజరవ్వడానికి ముందు సిద్ధపడడంలో వారికి మీరు శిక్షణనిస్తారు.—లూకా 6:40.
3 ఒక మంచి బోధకుడు తన విద్యార్థి స్వేచ్ఛగా మాట్లాడేలా చేస్తాడు, తాను ఎక్కువగా మాట్లాడడు. చిన్న విషయాలపై అవధానం మళ్లకుండేలా చూస్తాడు. అదనపు సమాచారాన్ని చాలా తక్కువగా తీసుకొస్తాడు. బదులుగా, ఆయన పాఠంలోని ముఖ్య విషయాల్ని నొక్కిచెబుతాడు. ప్రశ్నలకు జవాబులను కనుగొనడానికి విద్యార్థులకు సహాయపడేందుకు కొంతమంది వారికి అదనపు సాహిత్యాన్ని అందించారు. దానికితోడు, ఆసక్తిగలవారు సంఘ కూటాలకు హాజరవ్వడం ద్వారా సవివరమైన అదనపు సమాచారాన్ని పొందుతారు.
4 పాఠంలో సూచించబడిన లేఖనాలన్నింటిని చూడడానికి బైబిలు తెరవాల్సిన అవసరం లేకపోవచ్చు. కొన్ని ముఖ్య విషయాలను పేరాలో ఎత్తివ్రాయబడిన లేఖనాల ఆధారంగానే వివరించవచ్చు. పునఃసమీక్ష చేస్తున్న సమయంలో, చర్చించబడిన కీలక లేఖనాలను నొక్కి చెప్పి, వీటిని గుర్తుంచుకోమని విద్యార్థిని ప్రోత్సహించండి.
5 ఒక్కొక్క పఠనాన్ని ఎంత సమయం జరపవచ్చు?: పఠనాన్ని ఒక్క గంటకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంటియజమానులకు ఇంకా పఠించడానికి సమయం ఉండవచ్చు, మరింకాస్సేపు పఠించాలని కోరుకోవచ్చు. లేకపోతే విద్యార్థి వారంలో ఒక్కసారికన్నా ఎక్కువసార్లు పఠించాలని ఇష్టపడవచ్చు. ఆ విధంగా చేయగల్గేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
6 యెషయా 60:8 చిత్రిస్తున్నట్లుగా, నేడు యెహోవాను స్తుతించే లక్షలాదిమంది క్రొత్తవారు ఆయన ప్రజల సంఘాల్లోనికి “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసివచ్చు”చున్నారు. గొర్రెలవంటి వారిని సమకూర్చడాన్ని యెహోవా త్వరితపరుస్తుండగా మనం ఆయనతో సన్నిహితంగా పనిచేయడంలో మనమందరం మన భాగాన్ని నిర్వర్తిద్దాము.—యెష. 60:22.