యెహోవా యొక్క ఆదిసంభూతున్ని స్తుతించండి!
1 సా.శ. 33, నీసాన్ 9, ఆదివారం, ఒక గొప్ప సమూహం ఖర్జూరపు మట్టలను చేత పట్టుకుని యెహోవా ఆదిసంభూతుడును, ప్రభువునైన యేసుక్రీస్తును ‘ప్రభువు పేరట వచ్చు రాజు!’ అని స్తుతించారు. (లూకా 19:38; హెబ్రీ. 1:6) నీసాన్ 10, 11 సోమ, మంగళవారాల్లో, యేసుక్రీస్తు భూమిపైని తన జీవితంలోని పనిరద్దీగల చివరి రోజుల్లో, పరిచర్యలో మరింతగా నిమగ్నమయ్యాడు.
2 నేడు, అంతకన్నా పెద్దదైన గొప్ప సమూహం అలంకారిక ఖర్జూరపు మట్టలతో “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని” మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతున్నారు. (ప్రక. 7:9, 10) మార్చి 26 న, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించడానికి మనం కలుస్తాం. ఆ తేదీ సమీపిస్తుండగా, పరిచర్యలో మన ప్రయత్నాల్ని ఎక్కువ చేస్తూ భూవ్యాప్తంగా ఎలుగెత్తి స్తుతించడాన్ని అధికం చేస్తామా?
3 ప్రాంతీయ సేవను ఎక్కువ చేయడం: ఇప్పటికే చాలామంది ప్రచారకులు మార్చి నెలలో సహాయ పయినీర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. మీరు వారితో కలవడానికి యిష్టపడతారా? అలాగైతే, ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయండి. ఈ పనిని గురించి ఏవైనా ప్రశ్నలున్నట్లయితే సంఘ పెద్దల్లో ఒకరు మీకు సమాధానమివ్వడంలో సంతోషిస్తారు.
4 మీరు సహాయ పయినీరుగా సేవచేయగలిగినా లేకపోయినా, మార్చిలో పరిచర్యయందు పూర్తిగా పాలుపంచుకోవాలని మీరు ఆశిస్తారు. ఆ నెలలో ప్రతిరోజు గుంపుగా సాక్ష్యమిచ్చే ఏర్పాటు సంఘం చేయవచ్చు. ఈ లక్ష్యం కొరకు కావలసినంత ప్రాంతాన్ని ఏర్పాటు చేసి ఉంచుకోవాలి.
5 శనివారం, మార్చి 26 న, ప్రాంతీయ పరిచర్య కొరకు ఒక ప్రత్యేక కూటాన్ని అన్ని సంఘాలు ఏర్పాటు చేయాలి. జ్ఞాపకార్థ దినం కొరకైన సిద్ధపాటులో మరింత చేయవలసి ఉన్నప్పటికీ, శనివారం ఉదయం సాధ్యమైనంతమట్టుకు ప్రతి ఒక్కరు పరిచర్యలో పాల్గొనాలని సిఫారసు చేయబడుతుంది. ఇంటింటి సేవ చేయడమే కాక, జ్ఞాపకార్థ దినానికి పిలువబడ్డవారికి ప్రయాణసౌకర్యాలున్నాయో లేదోనని, కూటం జరిగే సమయం, స్థలం వారికి స్పష్టంగా తెలుసునో లేదోనని రూఢి చేసుకోండి.
6 ఇతరులను ఆహ్వానించి, ప్రోత్సహించండి: “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని” యేసు తన అనుచరులను ఆజ్ఞాపించాడు. (1 కొరిం. 11:24) అభిషక్తులైన యేసుక్రీస్తు అనుచరులు ఆ ఆజ్ఞను అనుసరిస్తుండగా, యెహోవా దాసులైన ప్రతి ఒక్కరు జ్ఞాపకార్థ దినాచరణకు హాజరు కావాలని, శ్రద్ధతో ఆచరించాలని ఆహ్వానించబడుతున్నారు. ఇతరులతోపాటు, బైబిలు విద్యార్థులను, బంధువులను, మీరు ఎవరితోనైనా బైబిలును గూర్చి చర్చించినట్లయితే వారిని, అవిశ్వాసులైన వివాహ సహచరులను, సహోద్యోగులను మీరు తప్పక పిలవండి. ఎవ్వరినీ మర్చిపోకుండా ఉండేందుకు ఒక పట్టీని తయారు చేయండి.
7 జ్ఞాపకార్థ దినంలోనే ఆసక్తిగల ప్రజలను ప్రోత్సహించడానికి అదనపు అవకాశాలు లభిస్తాయి. కూటానికి మొదటిసారిగా హాజరయ్యేవారిని పలకరించడానికి వీలుగా, కాస్త ముందుగానే వెళ్ళాలని తీర్మానించుకోండి. ఒకవేళ మీ బైబిలు విద్యార్థుల్లోని అనేకులు హాజరైనట్లయితే, కూటం సమయంలో వారిలో కొందరితోపాటు మరో ప్రచారకుడు కూర్చోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. క్రొత్తగా వచ్చినవారిని సంఘంలో జరిగే బహిరంగ కూటానికి క్రమంగా రమ్మని ఆహ్వానించండి. బహిరంగ ప్రసంగమివ్వడానికి ఎంపిక చేయబడ్డ సంఘ పెద్ద ప్రేరణాత్మకంగా ప్రసంగమివ్వడానికి బాగా సిద్ధపడాలి.
8 జ్ఞాపకార్థ దినాచరణ ముగింపులో, “యెహోవా యొక్క ఆదిసంభూతున్ని స్తుతించండి!” అనే 105 వ పాట పాడడంలో మన స్వరాలను కలపడం ద్వారా, మనం యెహోవాను స్తుతించడానికి, దైవపరిపాలనా పరిచర్య చేసిన నెలను మనం ఎంత సంతృప్తిగా వెనుతిరిగి చూడవచ్చో!