జీవాన్ని కాపాడే మన పరిచర్యలో విజయవంతంగా పాల్గొనుట
1 “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని” అపొస్తలుడైన పౌలు, సువార్త అందించే తన విధానాన్ని వారికి అనువుగా మలచాడు. (1 కొరిం. 9:19-23) అలాగే, గృహస్థుని ఆసక్తిని గ్రహించుటకు అప్రమత్తంగా ఉండి, ఆయన అవసరతలకు తగినట్లు మన సంభాషణను మలచుకొనుటకు సిద్ధంగా వున్న యెడల మనం మన పరిచర్యలో ఎక్కువ విజయవంతులమౌతాము. వాచ్‌టవర్, అవేక్! చందా సేకరించేటప్పుడు దీన్ని సులువుగా చేయగలగాలి.
2 మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొన్న తరువాత, మీ స్వంత మాటలలో ఇలా ప్రారంభించ వచ్చు:
◼ “మనకాలంలో వున్న సమస్యలకు ఆచరణయోగ్య పరిష్కారాలను ఇవ్వడంలో ప్రపంచ ప్రభుత్వాల స్పష్టమైన అసమర్థతను బట్టి చాలమంది నిస్పృహ చెందుతున్నారు. కొంతమంది, వారి సమస్యల గురించి ప్రభుత్వాలను కూడ నిందిస్తారు. మన అవసరతలన్నిటి యెడల సంపూర్ణ శ్రద్ధ చూపించే ప్రభుత్వం వుండగలదని మీరు భావిస్తున్నారా? [జవాబు చెప్పనివ్వండి] మనమెదుర్కొంటున్న సమస్యలన్నిటిని తప్పకుండ తీసివేయగల ప్రభుత్వాన్ని గూర్చిన నమ్మదగిన వాగ్దానం మనకుందని మీకు తెలుసా?” గృహస్థుని సమాధానం జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పేదాని ఆధారంగా, అనేక వేర్వేరు అందింపులలో ఒకదానిని ప్రారంభించడానికి సిద్ధంగా వుండండి.
3 గృహస్థుడు క్రైస్తవుడని ఏదైనా సూచన వుంటే ప్రభువు ప్రార్థన లేక పరలోక ప్రార్థన చేస్తారా అని ఆయనను అడుగవచ్చు. అతను అవునని సమాధానమిచ్చినట్లయితే, “నీ రాజ్యం వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక” అని వున్నంతవరకు మనం మాదిరి ప్రార్థన వల్లించవచ్చు. (మత్తయి. 6:9, 10) ఒకనాటికి యెహోవా చిత్తం ఇక్కడ ఈ భూమిపై నెరవేరబోతున్నదని ఇది నిరూపిస్తుంది. వాచ్‌టవర్ లేక అవేక్! నుండి తగిన శీర్షికను చూపించి, చందాను సేకరించవచ్చు. గృహస్థుడు నిరాకరిస్తే, అదే భావాన్ని వ్యక్తంచేసే పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వం అనే బ్రోషూర్‌లోని 3వ పేజీని చూపించవచ్చును.
4 ఒకవేళ గృహస్థుడు హిందువయితే, మీరు దానియేలు 2:44 సూచిస్తూ ఇటీవలి పత్రికలలోని ఒక విషయంతో ముడిపెట్టవచ్చు. చందా చేయుటకు నిరాకరిస్తే మళ్లీ మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్‌లోని 8వ పేజీకి త్రిప్పండి. అక్కడ 4వ పేరాలో ఉదహరించబడిన సామాన్య నమ్మకం వైపు దృష్టిమరల్చి, మన సమస్యలను పరిష్కరించుటకు త్వరలోనే యెహోవా దేవుడు ఎలా చర్య గైకొనబోతున్నాడో చూపించండి. ఈ బ్రోషూర్‌ను రెండు పత్రికలతో జతచేసి అందజేయవచ్చును.
5 ఒకవేళ గృహస్థుడు జీవితంలో తనకున్నవాటితో సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తే, మీరు ఇలా ప్రశ్నించవచ్చు:
◼ “ప్రభుత్వ భవిష్యత్తును గూర్చి బైబిలు చెప్తున్న దానిని మనమెందుకు గంభీరంగా తలంచాలి?” అప్పుడు రీజనింగ్ పుస్తకంలోని 154, 155 పేజీలలో ఉన్న సమాచారాన్ని క్లుప్తంగా ఉదహరిస్తూ, అక్కడ ఇవ్వబడిన ఎనిమిదింటిలో, ఒకటి లేక రెండు కారణాలను మనం ఉపయోగించవచ్చు. మీ వద్దనున్న పత్రికలలో ఒకదాని యందలి సముచిత అంశానికి దీన్ని జతచేయండి. ఒకవేళ గృహస్థుడు చందా చేయుటకు అంగీకరించకపోతే, సంభాషణను కొనసాగించటానికి లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వర్ల్డ్ కరపత్రాన్ని ఉపయోగించండి.
6 మీరు పునర్దర్శనం చేయునట్లు గృహస్థుని ఆసక్తిని మీరు ఉత్తేజపరచకపోతే, మీ మొదటి దర్శనం పూర్తిగా సఫలం కాదు. గనుక, మరచిపోకుండా ఒక ఆసక్తికరమైన ప్రశ్నవేసి, మళ్లీ వచ్చినప్పుడు దానికి సమాధానం చెబుతానని వాగ్దానం చేయండి.
7 పైసమాచారం నుండి చెప్పటానికి మీకు అనుకూలంగా ఉండే అంశాన్ని ఎన్నుకోండి. మీ ప్రాంతానికి సరిపోయే విధంగా ఈ సూచనలను సరిచేసుకోండి. గృహస్థుని అవసరాలకు తగినట్లు మీ సంభాషణను త్వరగా మలచుకొనేలా, బ్రోషూర్లు, కరపత్రాలు, పత్రికలలోని శీర్షికలను చదివి తెలుసుకొని వుండండి. “సువార్త కొరకే” మనం మన అందింపులను బాగా సిద్ధపడి, జీవాన్ని కాపాడే యీ పరిచర్యలో విజయవంతంగా పాల్గొందాము.—1 కొరిం. 9:23.