కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp17 No. 3 పేజీలు 4-7
  • జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు నిజాన్ని బయటపెడుతుంది
  • విస్తృతంగా వ్యాపించిన అబద్ధ బోధ
  • “సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది”
  • పునరుత్థానంలో మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ప్రాణమునకు మరింత శ్రేష్ఠమైన నిరీక్షణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మరణానంతర జీవితం—ప్రజలేమి నమ్ముతున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
wp17 No. 3 పేజీలు 4-7
సమాధిలో శవం

పత్రిక ముఖ్యాంశం | జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిల్లో ఆదికాండము అనే పుస్తకంలో సృష్టి ఎలా జరిగిందో ఉంది. అందులో మొదటి మనిషి అయిన ఆదాముతో దేవుడు ఇలా చెప్పాడని చదువుతాం: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఈ మాటలను బట్టి స్పష్టంగా, సూటిగా చెప్పాలంటే ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు గానీ ఏదెను తోటలో బ్రతికే ఉండేవాడని తెలుస్తుంది.

ముసలివాళ్లైన ఆదాము, అవ్వ

కానీ, ఆదాము దేవునికి లోబడి నిత్యం జీవించే బదులు దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా తన భార్యయైన హవ్వ ఇచ్చిన తినకూడని పండును తిన్నాడు. (ఆదికాండము 3:1-6) లోబడకపోవడంవల్ల వచ్చిన పర్యవసానాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఆ “ఒక మనిషి” ఆదాము. అయితే, పాపం అంటే ఏంటి? దానివల్ల మరణం ఎలా వచ్చింది?

ఆదాము చేసినదే అంటే దేవుని ఆజ్ఞకు కావాలని లోబడకపోవడం లేదా ఆజ్ఞ తప్పడమే పాపం. (1 యోహాను 3:4) దేవుడు ఆదాముకు చెప్పినట్లు పాపానికి శిక్ష మరణం. ఆదాముకు, భవిష్యత్తులో ఆయనకు పుట్టే పిల్లలకు దేవుని ఆజ్ఞలు లోబడినంత కాలం పాపం ఉండదు, మరణం కూడా ఉండదు. దేవుడు మనుషులను చనిపోవడానికి కాదుగానీ, ఎప్పటికీ బ్రతికి ఉండడానికి చేశాడు.

బైబిలు చెప్పినట్లు “మరణం అందరికీ వ్యాపించింది” అనే విషయంలో మనకు ఏ సందేహం లేదు. కానీ చనిపోయాక మనలో ఒక భాగం ఏదో ఇంకా బ్రతికే ఉంటుందా? చాలామంది అవుననే అంటారు. మనలో ఆత్మ అనే భాగం ఉంటుందని, అది అమర్త్యమైనదని చెప్తారు. కానీ అలా అయితే, దేవుడు ఆదాముతో అబద్ధం చెప్పినట్లు అవుతుంది. ఎలా? ఎలా అంటే చనిపోయాక కూడా మనలో ఒక భాగం ఎక్కడికో వెళ్లి బ్రతుకుతుందంటే, దేవుడు చెప్పినట్లు పాపానికి శిక్ష మరణం అవ్వదు. బైబిలు ఇలా అంటుంది: “[దేవుడు] అబద్ధమాడడం అసాధ్యం.” (హెబ్రీయులు 6:18) నిజానికి అబద్ధమాడింది సాతాను, ఆయన హవ్వతో ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు.”—ఆదికాండము 3:4.

ఇప్పుడు మనకు ఈ ప్రశ్న రావచ్చు, ఆత్మ అమర్త్యమైనది అనే బోధ అబద్ధం వల్ల వచ్చినదైతే, మరి చనిపోయాక నిజంగా ఏం జరుగుతుంది?

బైబిలు నిజాన్ని బయటపెడుతుంది

ఆదికాండములో ఉన్న సృష్టి గురించిన వివరణ, ఇలా చెప్తుంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” “జీవాత్మ” అనే పదాన్ని హీబ్రూ భాషలో నెఫెష్‌a అనే పదం నుండి అనువదించారు. అక్షరార్థంగా ఆ పదానికి ఉన్న అర్థం “ఊపిరి పీల్చుకునే ప్రాణి.”—ఆదికాండము 2:7.

కాబట్టి బైబిలు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే దేవుడు మనుషుల్ని అమర్త్యమైన ఆత్మతో సృష్టించలేదు కానీ, ప్రతి మనిషిని జీవించే ప్రాణిగా చేశాడు. అందుకే, మీరు ఎంత వెదికినా, “అమర్త్యమైన ఆత్మ” అనే మాట బైబిల్లో ఎక్కడా కనిపించదు.

మనుషులకు అమర్త్యమైన ఆత్మ ఉందని బైబిలు చెప్పకపోయినా చాలా మతాలు ఎందుకు అమర్త్యమైన ఆత్మ ఉందని వేరుగా బోధిస్తున్నాయి? జవాబు కోసం మనం పూర్వ కాలం ఈజిప్టు దేశానికి వెళ్లాలి.

విస్తృతంగా వ్యాపించిన అబద్ధ బోధ

క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడైన హెరోడోటస్‌ ఈజిప్టు దేశస్థుల గురించి ఇలా చెప్పాడు: “ఆత్మ అమర్త్యమైనదనే బోధను కాపాడుకుంటూ వచ్చిన మనుషుల్లో వీళ్లు మొదటివాళ్లు.” మరో ప్రాచీన సంస్కృతికి చెందిన బబులోనీయులు కూడా అమర్త్యమైన ఆత్మ గురించి చెప్పారు. క్రీస్తు పూర్వం 332⁠లో అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ మధ్యప్రాచ్య దేశాలపై విజయం సాధించే సమయానికి గ్రీకు తత్వవేత్తలు ఈ బోధకు బాగా పేరు తెచ్చారు. కొద్దికాలంలోనే ఈ బోధ గ్రీకు సామ్రాజ్యమంతా వ్యాపించింది.

“అమర్త్యమైన ఆత్మ” అనే మాట బైబిల్లో మీకు ఎక్కడా కనిపించదు

చనిపోయాక ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందని, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఎస్సెన్‌లు, పరిసయ్యులు అనే రెండు ముఖ్యమైన యూదా తెగలు బోధించేవాళ్లు. ద జూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “గ్రీకు బోధల వల్ల ముఖ్యంగా ప్లేటో సిద్ధాంతాల వల్ల అమర్త్యమైన ఆత్మ ఉందని యూదులు నమ్మడం మొదలుపెట్టారు.” మొదటి శతాబ్దంలో ఉన్న యూదా చరిత్రకారుడు జోసిఫస్‌ కూడా ఆ బోధ పరిశుద్ధ లేఖనాల నుండి కాదు కానీ, “గ్రీసు దేశపు కుమారుల నమ్మకాల” నుండి వచ్చిందని చెప్పాడు. ఆ నమ్మకాలు గ్రీకు పురాణాలను రాసినవాళ్లు చెప్పిన కథలని ఆయన అభిప్రాయం.

గ్రీకు సంస్కృతి విస్తరిస్తూ ఉండగా క్రైస్తవులని పేరుకి చెప్పుకునే వాళ్లు కూడా ఈ వేరే మత బోధను సొంతం చేసుకున్నారు. యోన లెన్‌డరింగ్‌ అనే చరిత్రకారుడు ఇలా అంటున్నాడు: “ప్లేటో పరికల్పన ప్రకారం మన ఆత్మ ఒకప్పుడు మంచి చోటున ఉండి ఇప్పుడు పడిపోయిన లోకంలో జీవిస్తుంది. దీన్నిబట్టి ప్లేటో తత్వసిద్ధాంతాన్ని, క్రైస్తవత్వంతో కలపడం సులువైంది.” ఈ విధంగా “క్రైస్తవ” చర్చిల్లోకి అమర్త్యమైన ఆత్మ అనే వేరే మత బోధ కలిసిపోయి ఒక ముఖ్య బోధగా తయారైంది.

“సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది”

మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “తర్వాతి కాలాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెడతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది. వాళ్లు దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల్ని, చెడ్డదూతల బోధల్ని వినడం వల్ల అలా జరుగుతుంది.” (1 తిమోతి 4:1) ఈ మాటలు ఎంతో నిజం. ఆత్మ అమర్త్యమైనదనే బోధ ‘చెడ్డదూతల బోధల్లో’ ఒక ఉదాహరణ మాత్రమే. బైబిల్లో ఈ బోధకు ఏ ఆధారాలు లేవు కానీ ప్రాచీన అబద్ధ మతాల్లో, తత్వసిద్ధాంతాల్లో వాటి ఆరంభం కనిపిస్తుంది.

సంతోషకరమైన విషయం ఏంటంటే యేసు ఇలా అన్నాడు: “మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.” (యోహాను 8:32) బైబిలు సత్యాల గురించి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకుంటే ప్రపంచంలో అనేక మతాలు ప్రోత్సహిస్తున్న బోధలు, ఆచారాల నుండి విడుదల పొందుతాం. ఈ బోధలు దేవున్ని అవమానిస్తాయి. అంతేకాదు, దేవుని వాక్యంలో ఉన్న సత్యం మనల్ని మరణానికి సంబంధించిన ఆచారాలు, మూఢనమ్మకాలు నుండి కూడా విడుదల చేస్తుంది.—“చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు?” అనే బాక్సు చూడండి.

భూమ్మీద 70 లేదా 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇంకో లోకానికి వెళ్లి అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని మన సృష్టికర్త మనల్ని సృష్టించలేదు. మనుషులు తనకు విధేయులైన పిల్లలుగా భూమ్మీద శాశ్వతంగా జీవించాలని ఆయన మొదట్లో ఉద్దేశించాడు. ఈ గొప్ప ఉద్దేశం దేవునికి మనుషుల మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఆ ఉద్దేశం మారదు. (మలాకీ 3:6) కీర్తనకర్త రాసిన ఈ మాటలు కూడా మనకు ఎంతో అభయాన్ని ఇస్తాయి: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

బైబిలు జీవమరణాలు గురించి ఏం చెప్తుందో ఇంకా తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 6వ అధ్యాయం చూడండి. ఈ పుస్తకాన్ని www.jw.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు లేదా ఈ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.

a పరిశుద్ధ గ్రంథము (BSI) బైబిల్లో నెఫెష్‌ అనే పదాన్ని “జీవాత్మ” అని అనువదించారు. కానీ చాలా అనువాదాల్లో ఆ పదాన్ని అంటే పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం బైబిల్లో “సజీవుడయ్యాడు,” కతోలిక అనువాదము బైబిల్లో “జీవము గలవాడయ్యెను” అని అనువదించారు.

మనుషులు ఎప్పటికీ బ్రతికి ఉండడం సాధ్యమేనా?

కొన్ని సంవత్సరాల క్రితం, పరిశోధకులు నీళ్లలో ఉండే కొన్ని మొక్కలు కనుక్కున్నారు. అవి ఎన్నో వేల సంవత్సరాలుగా బ్రతికి ఉన్నాయని వాళ్లు నమ్ముతున్నారు. బహుశా భూమ్మీద ఉన్న ఏ జీవికన్నా అవే ఎక్కువ కాలం జీవించి ఉన్నాయని వాళ్లు చెప్తున్నారు. ఈ మొక్కలు పొసిడోనియా ఓషియానికా అనే జాతికి చెందినవి. ఈ రకమైన సముద్రపు గడ్డి స్పెయిన్‌, సైప్రస్‌ దేశాల మధ్య ఉన్న మధ్యధరా సముద్ర భూతలంలో చాలా ఎక్కువగా ఉంటుంది.

మొక్కలు అన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలిగినప్పుడు మనుషులు విషయం ఏంటి? ముసలితనం గురించి పరిశోధిస్తున్న కొంతమంది సైన్‌టిస్టులు మనిషి ఆయుష్షును పెంచవచ్చు అని నమ్ముతున్నారు. ఉదాహరణకు, ఈ రంగంలో ఎంతో వైజ్ఞానిక అభివృద్ధి జరుగుతుందని ఈ విషయానికి సంబంధించిన ఒక పుస్తకం చెప్తుంది. అయితే ఈ వైజ్ఞానిక అభివృద్ధి వల్ల నిజంగా మనిషి ఆయుష్షు పెరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.

నిజానికి చనిపోకుండా ఎప్పటికీ బ్రతికి ఉండే విషయంలో సైన్స్‌పై ఆధారపడలేం. బైబిలు మన సృష్టికర్త అయిన యెహోవా దేవుని వైపు చూపిస్తూ ఇలా చెప్తుంది: “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) ఆయనకు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు: “ఒకేఒక్క సత్య దేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” (యోహాను 17:3) యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడానికి, వాళ్లకు ఇష్టమైన విధంగా జీవించడానికి మనం చేసే ప్రయత్నాల వల్ల మనం శాశ్వత ఆశీర్వాదాలు పొందుతాం.

సముద్రపు గడ్డి

ఈ సముద్రపు గడ్డి జాతికి చెందిన కొన్ని మొక్కలు ఎన్నో వేల సంవత్సరాలుగా బ్రతికి ఉన్నాయని పరిశోధకులు నమ్ముతున్నారు

చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు?

యేసు లాజరును తిరిగి బ్రతికించాడు

ఒక్క మాటలో చెప్పాలంటే, పునరుత్థానం ద్వారా మళ్లీ బ్రతికే వరకు చనిపోయినవాళ్లు సమాధిలో ఉంటారని బైబిల్లో ఉంది. (యోహాను 5:28, 29) వాళ్లు బాధపడడం లేదు, వాళ్లకు ఏ నొప్పీ లేదు ఎందుకంటే “చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) యేసు తన బోధల్లో, మరణాన్ని గాఢ నిద్రతో పోల్చాడు. (యోహాను 11:11-14) కాబట్టి చనిపోయినవాళ్లకు మనం భయపడాల్సిన అవసరం లేదు, వాళ్లను సంతోషపెట్టడానికి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు. వాళ్లు మనకు సహాయం చేయలేరు, హాని చేయలేరు ఎందుకంటే “పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:10) పునరుత్థాన ఏర్పాటు ద్వారా, దేవుడు మరణాన్ని ఇంకెప్పటికీ లేకుండా తీసేస్తాడు.—1 కొరింథీయులు 15:26, 55; ప్రకటన 21:4.

బైబిలు చెప్తున్నవాటిని మనం ఎందుకు నమ్మవచ్చు?

బైబిలు చెప్తున్నవాటిని నమ్మడానికి మనకు మంచి ఆధారాలు ఉన్నాయి. ఈ విషయాలను చదవండి:

  • ఈక, ఇంకు బుడ్డి

    సాటిలేని మూలం: క్రీస్తు పూర్వం 1513 నుండి క్రీస్తు శకం 98 వరకు బైబిల్ని రాశారు. అంటే మొత్తం 1,600 సంవత్సరాలు పట్టింది. బైబిలులో 40 మంది రాసిన 66 పుస్తకాలు ఉన్నాయి. అయినా అందులో ఉన్న సమాచారమంతా పొందికగా, ఒకే ఆలోచనతో ఉంది. దాన్నిబట్టి బైబిలుకు నిజమైన రచయిత లేదా మూలం మహోన్నతుడైన దేవుడు అని తెలుస్తుంది. బైబిల్ని రాసిన మనుషులకు ఆయన తన ఆలోచనలను తెలియజేశాడు.

  • స్తంభం

    చారిత్రకంగా ఖచ్చితం: చరిత్రలో రుజువైన నిజాలతో బైబిల్లో ఉన్న సంఘటనలు పూర్తిగా కలుస్తున్నాయి. అ లాయర్‌ ఎక్సామిన్స్‌ ద బైబిల్‌ పుస్తకం ఇలా చెప్తుంది: “ప్రేమ కథలు, పురాణాలు, అబద్ధ సాక్ష్యాలు సంఘటనలను ఎక్కడో తెలియని ప్రాంతాల్లో, అనగనగా ఎప్పుడో ఒక కాలంలో జరిగాయని చెప్తుంటాయి . . . కానీ బైబిలు మాత్రం ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా చెప్తుంది.”

  • అణువు

    సైన్స్‌పరంగా ఖచ్చితం: బైబిలు సైన్స్‌ పుస్తకం కాదు. కానీ సైన్స్‌కు సంబంధించిన విషయాల గురించి మాట్లాడినప్పుడు సైన్స్‌ కన్నా ముందే వాస్తవాలను చెప్పింది. ఉదాహరణకు, మనుషులు క్రిములు, అంటువ్యాధులు గురించి కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాల ముందే ఇశ్రాయేలీయులకు పరిశుభ్రత, కడగా లేదా దూరంగా ఉంచడం గురించి ఇచ్చిన చాలా నియమాలు లేవీయకాండము అనే పుస్తకంలో 13, 14 అధ్యాయాల్లో ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందని, ఏ ఆధారం లేకుండా అంతరిక్షంలో వ్రేలాడుతుందని మనుషులు కనిపెట్టడానికి ఎన్నో వందల సంవత్సరాలు ముందే బైబిల్లో దాని గురించి రాశారు.—యోబు 26:7; యెషయా 40:22.

బైబిలు చాలా ఖచ్చితమైనదని నిరూపించడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. బైబిల్లోనే ఇలా ఉంది: “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు. అవి బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.”—2 తిమోతి 3:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి