పత్రిక ముఖ్యాంశం | జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
జీవం మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
బైబిల్లో ఆదికాండము అనే పుస్తకంలో సృష్టి ఎలా జరిగిందో ఉంది. అందులో మొదటి మనిషి అయిన ఆదాముతో దేవుడు ఇలా చెప్పాడని చదువుతాం: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:16, 17) ఈ మాటలను బట్టి స్పష్టంగా, సూటిగా చెప్పాలంటే ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు గానీ ఏదెను తోటలో బ్రతికే ఉండేవాడని తెలుస్తుంది.
కానీ, ఆదాము దేవునికి లోబడి నిత్యం జీవించే బదులు దేవుని ఆజ్ఞను పట్టించుకోకుండా తన భార్యయైన హవ్వ ఇచ్చిన తినకూడని పండును తిన్నాడు. (ఆదికాండము 3:1-6) లోబడకపోవడంవల్ల వచ్చిన పర్యవసానాలను మనం ఇప్పటికీ చూస్తున్నాం. దీని గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి. అదే విధంగా, అందరూ పాపం చేశారు కాబట్టి మరణం అందరికీ వ్యాపించింది.” (రోమీయులు 5:12) ఆ “ఒక మనిషి” ఆదాము. అయితే, పాపం అంటే ఏంటి? దానివల్ల మరణం ఎలా వచ్చింది?
ఆదాము చేసినదే అంటే దేవుని ఆజ్ఞకు కావాలని లోబడకపోవడం లేదా ఆజ్ఞ తప్పడమే పాపం. (1 యోహాను 3:4) దేవుడు ఆదాముకు చెప్పినట్లు పాపానికి శిక్ష మరణం. ఆదాముకు, భవిష్యత్తులో ఆయనకు పుట్టే పిల్లలకు దేవుని ఆజ్ఞలు లోబడినంత కాలం పాపం ఉండదు, మరణం కూడా ఉండదు. దేవుడు మనుషులను చనిపోవడానికి కాదుగానీ, ఎప్పటికీ బ్రతికి ఉండడానికి చేశాడు.
బైబిలు చెప్పినట్లు “మరణం అందరికీ వ్యాపించింది” అనే విషయంలో మనకు ఏ సందేహం లేదు. కానీ చనిపోయాక మనలో ఒక భాగం ఏదో ఇంకా బ్రతికే ఉంటుందా? చాలామంది అవుననే అంటారు. మనలో ఆత్మ అనే భాగం ఉంటుందని, అది అమర్త్యమైనదని చెప్తారు. కానీ అలా అయితే, దేవుడు ఆదాముతో అబద్ధం చెప్పినట్లు అవుతుంది. ఎలా? ఎలా అంటే చనిపోయాక కూడా మనలో ఒక భాగం ఎక్కడికో వెళ్లి బ్రతుకుతుందంటే, దేవుడు చెప్పినట్లు పాపానికి శిక్ష మరణం అవ్వదు. బైబిలు ఇలా అంటుంది: “[దేవుడు] అబద్ధమాడడం అసాధ్యం.” (హెబ్రీయులు 6:18) నిజానికి అబద్ధమాడింది సాతాను, ఆయన హవ్వతో ఇలా అన్నాడు: “మీరు చావనే చావరు.”—ఆదికాండము 3:4.
ఇప్పుడు మనకు ఈ ప్రశ్న రావచ్చు, ఆత్మ అమర్త్యమైనది అనే బోధ అబద్ధం వల్ల వచ్చినదైతే, మరి చనిపోయాక నిజంగా ఏం జరుగుతుంది?
బైబిలు నిజాన్ని బయటపెడుతుంది
ఆదికాండములో ఉన్న సృష్టి గురించిన వివరణ, ఇలా చెప్తుంది: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.” “జీవాత్మ” అనే పదాన్ని హీబ్రూ భాషలో నెఫెష్a అనే పదం నుండి అనువదించారు. అక్షరార్థంగా ఆ పదానికి ఉన్న అర్థం “ఊపిరి పీల్చుకునే ప్రాణి.”—ఆదికాండము 2:7.
కాబట్టి బైబిలు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే దేవుడు మనుషుల్ని అమర్త్యమైన ఆత్మతో సృష్టించలేదు కానీ, ప్రతి మనిషిని జీవించే ప్రాణిగా చేశాడు. అందుకే, మీరు ఎంత వెదికినా, “అమర్త్యమైన ఆత్మ” అనే మాట బైబిల్లో ఎక్కడా కనిపించదు.
మనుషులకు అమర్త్యమైన ఆత్మ ఉందని బైబిలు చెప్పకపోయినా చాలా మతాలు ఎందుకు అమర్త్యమైన ఆత్మ ఉందని వేరుగా బోధిస్తున్నాయి? జవాబు కోసం మనం పూర్వ కాలం ఈజిప్టు దేశానికి వెళ్లాలి.
విస్తృతంగా వ్యాపించిన అబద్ధ బోధ
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడైన హెరోడోటస్ ఈజిప్టు దేశస్థుల గురించి ఇలా చెప్పాడు: “ఆత్మ అమర్త్యమైనదనే బోధను కాపాడుకుంటూ వచ్చిన మనుషుల్లో వీళ్లు మొదటివాళ్లు.” మరో ప్రాచీన సంస్కృతికి చెందిన బబులోనీయులు కూడా అమర్త్యమైన ఆత్మ గురించి చెప్పారు. క్రీస్తు పూర్వం 332లో అలెగ్జాండర్ ద గ్రేట్ మధ్యప్రాచ్య దేశాలపై విజయం సాధించే సమయానికి గ్రీకు తత్వవేత్తలు ఈ బోధకు బాగా పేరు తెచ్చారు. కొద్దికాలంలోనే ఈ బోధ గ్రీకు సామ్రాజ్యమంతా వ్యాపించింది.
“అమర్త్యమైన ఆత్మ” అనే మాట బైబిల్లో మీకు ఎక్కడా కనిపించదు
చనిపోయాక ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందని, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఎస్సెన్లు, పరిసయ్యులు అనే రెండు ముఖ్యమైన యూదా తెగలు బోధించేవాళ్లు. ద జూయిష్ ఎన్సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “గ్రీకు బోధల వల్ల ముఖ్యంగా ప్లేటో సిద్ధాంతాల వల్ల అమర్త్యమైన ఆత్మ ఉందని యూదులు నమ్మడం మొదలుపెట్టారు.” మొదటి శతాబ్దంలో ఉన్న యూదా చరిత్రకారుడు జోసిఫస్ కూడా ఆ బోధ పరిశుద్ధ లేఖనాల నుండి కాదు కానీ, “గ్రీసు దేశపు కుమారుల నమ్మకాల” నుండి వచ్చిందని చెప్పాడు. ఆ నమ్మకాలు గ్రీకు పురాణాలను రాసినవాళ్లు చెప్పిన కథలని ఆయన అభిప్రాయం.
గ్రీకు సంస్కృతి విస్తరిస్తూ ఉండగా క్రైస్తవులని పేరుకి చెప్పుకునే వాళ్లు కూడా ఈ వేరే మత బోధను సొంతం చేసుకున్నారు. యోన లెన్డరింగ్ అనే చరిత్రకారుడు ఇలా అంటున్నాడు: “ప్లేటో పరికల్పన ప్రకారం మన ఆత్మ ఒకప్పుడు మంచి చోటున ఉండి ఇప్పుడు పడిపోయిన లోకంలో జీవిస్తుంది. దీన్నిబట్టి ప్లేటో తత్వసిద్ధాంతాన్ని, క్రైస్తవత్వంతో కలపడం సులువైంది.” ఈ విధంగా “క్రైస్తవ” చర్చిల్లోకి అమర్త్యమైన ఆత్మ అనే వేరే మత బోధ కలిసిపోయి ఒక ముఖ్య బోధగా తయారైంది.
“సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది”
మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “తర్వాతి కాలాల్లో కొందరు విశ్వాసాన్ని విడిచిపెడతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది. వాళ్లు దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల్ని, చెడ్డదూతల బోధల్ని వినడం వల్ల అలా జరుగుతుంది.” (1 తిమోతి 4:1) ఈ మాటలు ఎంతో నిజం. ఆత్మ అమర్త్యమైనదనే బోధ ‘చెడ్డదూతల బోధల్లో’ ఒక ఉదాహరణ మాత్రమే. బైబిల్లో ఈ బోధకు ఏ ఆధారాలు లేవు కానీ ప్రాచీన అబద్ధ మతాల్లో, తత్వసిద్ధాంతాల్లో వాటి ఆరంభం కనిపిస్తుంది.
సంతోషకరమైన విషయం ఏంటంటే యేసు ఇలా అన్నాడు: “మీరు సత్యాన్ని తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.” (యోహాను 8:32) బైబిలు సత్యాల గురించి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకుంటే ప్రపంచంలో అనేక మతాలు ప్రోత్సహిస్తున్న బోధలు, ఆచారాల నుండి విడుదల పొందుతాం. ఈ బోధలు దేవున్ని అవమానిస్తాయి. అంతేకాదు, దేవుని వాక్యంలో ఉన్న సత్యం మనల్ని మరణానికి సంబంధించిన ఆచారాలు, మూఢనమ్మకాలు నుండి కూడా విడుదల చేస్తుంది.—“చనిపోయినవాళ్లు ఎక్కడ ఉన్నారు?” అనే బాక్సు చూడండి.
భూమ్మీద 70 లేదా 80 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఇంకో లోకానికి వెళ్లి అక్కడ శాశ్వతంగా ఉండిపోవాలని మన సృష్టికర్త మనల్ని సృష్టించలేదు. మనుషులు తనకు విధేయులైన పిల్లలుగా భూమ్మీద శాశ్వతంగా జీవించాలని ఆయన మొదట్లో ఉద్దేశించాడు. ఈ గొప్ప ఉద్దేశం దేవునికి మనుషుల మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది. ఆ ఉద్దేశం మారదు. (మలాకీ 3:6) కీర్తనకర్త రాసిన ఈ మాటలు కూడా మనకు ఎంతో అభయాన్ని ఇస్తాయి: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.
a పరిశుద్ధ గ్రంథము (BSI) బైబిల్లో నెఫెష్ అనే పదాన్ని “జీవాత్మ” అని అనువదించారు. కానీ చాలా అనువాదాల్లో ఆ పదాన్ని అంటే పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం బైబిల్లో “సజీవుడయ్యాడు,” కతోలిక అనువాదము బైబిల్లో “జీవము గలవాడయ్యెను” అని అనువదించారు.