కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 5/15 పేజీలు 19-23
  • దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • భవిష్యత్తును ఊహించుకుంటూ విశ్వాసాన్ని బలపర్చుకున్నారు
  • దేవుని వాగ్దానాలు నిజమవ్వడాన్ని వాళ్లు ‘చూశారు’
  • బహుమానం మీదే దృష్టిపెట్టాడు
  • దేవుని రాజ్యంలో ఉండే ఆశీర్వాదాలను ఊహించుకోండి
  • మీరు ఎదురుచూస్తున్న వాటిగురించి మాట్లాడండి
  • ‘వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకోవడం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “మీ హృదయములను స్థిరపరచుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మోషే విశ్వాసాన్ని అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • విశ్వాసముంచుట ద్వారా దేవుని వాగ్దానములకు ప్రత్యుత్తరమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 5/15 పేజీలు 19-23
మనిషి కనుగుడ్డులో కనిపిస్తున్న పరదైసు చిత్రం

దేవుడు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ‘చూశారు’

‘వాళ్లు ఆ వాగ్దానాల ఫలము అనుభవించకపోయినా, దూరంనుండి చూశారు.’—హెబ్రీ. 11:13.

మీరు వివరించగలరా?

  • దేవుడిచ్చిన ఏ బహుమతి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది?

  • దేవుడు తమకు ఇవ్వబోయే భవిష్యత్తును, బైబిలు కాలాల్లోని నమ్మకమైన స్త్రీపురుషులు ఊహించుకోగలిగారనీ మనకెలా తెలుసు?

  • యెహోవా మనకు వాగ్దానం చేసినవాటి గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల ఎలా ప్రయోజనం పొందుతాం?

1. చూడనివాటిని ఊహించుకోగల సామర్థ్యం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం? (ప్రారంభ చిత్రం చూడండి.)

యెహోవా మనందరికీ ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. చూడనివాటిని ఊహించుకోగల సామర్థ్యమే ఆ బహుమతి. ఆ సామర్థ్యం వల్ల, మనం భవిష్యత్తులో జరిగే మంచివాటి కోసం ఎదురుచూస్తాం. అంతేకాక ముందే ఆలోచించుకుని సమస్యల్ని తప్పించుకుంటాం. యెహోవా భవిష్యత్తును చూడగలడు కాబట్టి, ముందుముందు జరగబోయే వాటిని బైబిలు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనం వాటిని చూడలేకపోయినా, వాటిని ఊహించుకోగలం, అవి ఖచ్చితంగా జరుగుతాయనే విశ్వాసంతో ఉండగలం.—2 కొరిం. 4:17, 18.

2, 3. (ఎ) ఊహించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 నిజమే, కొన్నిసార్లు మనం ఎప్పటికీ జరగనివాటిని ఊహించుకుంటాం. ఉదాహరణకు, ఓ చిన్నపాప సీతాకోకచిలుక మీద కూర్చుని ఎగురుతున్నట్లు ఊహించుకోవచ్చు. కానీ అదెప్పటికీ జరగదు. అయితే, సమూయేలు తల్లి హన్నా మాత్రం నిజంగా జరగబోయేదాన్ని ఊహించుకుంది. తన కొడుకును ప్రత్యక్ష గుడారానికి తీసుకెళ్లినట్లు, అక్కడ ఆ అబ్బాయి యాజకులతోపాటు సేవ చేస్తున్నట్లు ఆమె ఊహించుకుంటూ ఉండేది. ఆ ఊహలు కేవలం పగటి కలలు కావు. తన కొడుకును యెహోవా సేవకు అర్పించాలని ఆమె అప్పటికే నిర్ణయించుకుంది. హన్నా అలా ఊహించుకోవడం వల్ల, యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలిగింది. (1 సమూ. 1:22) అలాగే మనం కూడా యెహోవా వాగ్దానాల గురించి ఊహించుకుంటున్నామంటే, ఖచ్చితంగా జరిగేవాటిని ఊహించుకుంటున్నామని అర్థం.—2 పేతు. 1:19-21.

3 బైబిలు కాలాల్లో చాలామంది దేవుని సేవకులు యెహోవా వాగ్దానం చేసినవాటిని ఊహించుకోగలిగారు. దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రయోజనం పొందారు? మనం కూడా, దేవుని వాగ్దానాలు నెరవేరినప్పుడు ఉండే పరిస్థితుల గురించి ఎందుకు ఊహించుకోవాలి?

భవిష్యత్తును ఊహించుకుంటూ విశ్వాసాన్ని బలపర్చుకున్నారు

4. హేబెలు మంచి భవిష్యత్తును ఎందుకు ఊహించుకోగలిగాడు?

4 యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం ఉంచిన మొట్టమొదటి మనిషి హేబెలు. ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు యెహోవా సర్పంతో అన్న ఈ మాటల గురించి హేబెలుకు తెలుసు, “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆది. 3:14, 15) ఆ వాగ్దానం ఖచ్చితంగా ఎలా నెరవేరుతుందో తెలీకపోయినా, హేబెలు దానిగురించి చాలా ఆలోచించివుంటాడు. సర్పం గాయపర్చే ఆ వ్యక్తి, మనుషులు మళ్లీ పరిపూర్ణులయ్యేలా సహాయం చేసే ఆ వ్యక్తి ఎవరై ఉంటారా అని హేబెలు బహుశా ఆలోచించి ఉండవచ్చు. యెహోవా చేసిన ప్రతీ వాగ్దానం నెరవేరుతుందనే విశ్వాసం హేబెలుకు ఉంది. అందుకే, ఆయన అర్పించిన బలిని యెహోవా అంగీకరించాడు.—ఆదికాండము 4:3-5; హెబ్రీయులు 11:4 చదవండి.

5. భవిష్యత్తు గురించి ఊహించుకోవడం వల్ల హనోకు ఏమి చేయగలిగాడు?

5 యెహోవా మీద అచంచల విశ్వాసం ఉంచిన మరో వ్యక్తి హనోకు. దేవునికి వ్యతిరేకంగా “కఠినమైన మాటలు” మాట్లాడే ప్రజల మధ్య ఆయన జీవించాడు. అయినప్పటికీ హనోకు ఎంతో ధైర్యంగా, దైవభక్తిలేని ప్రజలందర్నీ యెహోవా నాశనం చేయబోతున్నాడనే సందేశాన్ని ప్రకటించాడు. (యూదా 14, 15) ఆయన ఆ పని ఎలా చేయగలిగాడు? బహుశా, లోకంలోని ప్రజలందరూ యెహోవాను ఆరాధించినప్పుడు ఎలా ఉంటుందో హనోకు ఊహించుకుని ఉండవచ్చు.—హెబ్రీయులు 11:5, 6 చదవండి.

6. జలప్రళయం తర్వాత నోవహు ఏ విషయాల గురించి ఊహించుకుని ఉంటాడు?

6 నోవహు, యెహోవా మీదున్న విశ్వాసం వల్ల జలప్రళయాన్ని తప్పించుకున్నాడు. (హెబ్రీ. 11:7) అదే విశ్వాసంతో ఆయన జలప్రళయం తర్వాత యెహోవాకు జంతుబలులు అర్పించాడు. (ఆది. 8:20) అయితే కొంతకాలానికి లోకంలో మళ్లీ చెడుతనం ఎక్కువైంది. నిమ్రోదు తన పరిపాలనలో, యెహోవా మీద తిరుగుబాటు చేసేలా ప్రజల్ని ప్రోత్సహించాడు. (ఆది. 10:8-12) కానీ నోవహు విశ్వాసం మాత్రం చెక్కుచెదర్లేదు. హేబెలులాగే ఆయన కూడా, యెహోవా ఏదో ఒకరోజు పాపమరణాల్ని ఖచ్చితంగా తీసేస్తాడని నమ్మాడు. అంతేకాక, క్రూరమైన పరిపాలకులు ఉండని కాలం గురించి కూడా నోవహు ఊహించుకుని ఉంటాడు. ఆయనలాగే మనం కూడా, త్వరలో రానున్న అలాంటి అద్భుతమైన కాలాన్ని ఊహించుకోవచ్చు.—రోమా. 6:23.

దేవుని వాగ్దానాలు నిజమవ్వడాన్ని వాళ్లు ‘చూశారు’

7. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు ఎలాంటి భవిష్యత్తును ఊహించుకోగలిగారు?

7 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు తమ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకుని ఉంటారు. ఎందుకంటే, వాళ్ల ‘సంతానం’ ద్వారా భూమ్మీదున్న ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందుతారని యెహోవా వాగ్దానం చేశాడు. (ఆది. 22:18; 26:4; 28:14) అంతేకాక, వాళ్ల కుటుంబం ఓ పెద్ద జనాంగంగా తయారై, అందమైన వాగ్దాన దేశంలో నివసిస్తారని కూడా ఆయన చెప్పాడు. (ఆది. 15:5-7) ఆ వాగ్దానాలు నిజమౌతాయని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తెలుసు కాబట్టే, తమ కుటుంబాలు వాగ్దానదేశంలో జీవిస్తున్నట్లు వాళ్లు ఊహించుకోగలిగారు. నిజానికి ఆదాముహవ్వలు పాపం చేసినా, మనుషులు మళ్లీ పరిపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారని యెహోవా తన నమ్మకమైన సేవకులకు భరోసా ఇస్తూనే వచ్చాడు.

8. అబ్రాహాము బలమైన విశ్వాసాన్ని ఎందుకు చూపించగలిగాడు?

8 అబ్రాహాముకు బలమైన విశ్వాసం ఉండడం వల్ల కష్టకాలాల్లో కూడా యెహోవాకు విధేయత చూపించాడు. అబ్రాహాము, ఇతర నమ్మకమైన సేవకులు దేవుని వాగ్దానాల నెరవేర్పును కళ్లారా చూడకపోయినా, అవి నెరవేరినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోగలిగారు. వాళ్లు ‘ఆ వాగ్దానాల ఫలము అనుభవించకపోయినా, దూరంనుండి చూసి వందనము చేశారు’ అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 11:8-13 చదవండి.) యెహోవా గతంలో చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాడు కాబట్టి భవిష్యత్తులో కూడా తప్పకుండా నెరవేరుస్తాడని అబ్రాహాము బలంగా నమ్మాడు.

9. దేవుని వాగ్దానాల మీద విశ్వాసం అబ్రాహాముకు ఎలా సహాయం చేసింది?

9 యెహోవా తనకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటాడని అబ్రాహాము నమ్మాడు కాబట్టే ఆయన చెప్పిన ప్రతీ పనిని చేశాడు. ఉదాహరణకు, అబ్రాహాము ఊరు పట్టణంలోని తన ఇంటిని విడిచిపెట్టి వచ్చేశాడు, ఆ తర్వాత ఆయన ఏ పట్టణంలోనూ శాశ్వతంగా ఉండిపోలేదు. వాటి పరిపాలకులు యెహోవా ఆరాధకులు కాదు కాబట్టి, అవి ఎంతోకాలం నిలువవని ఆయనకు తెలుసు. (యెహో. 24:2) అబ్రాహాము తన జీవితాంతం ‘దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణం’ కోసం ఎదురుచూశాడు. (హెబ్రీ. 11:10) యెహోవా పరిపాలన కింద నిరంతరం జీవిస్తున్నట్లు అబ్రాహాము ఊహించుకున్నాడు. హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, మరితరులు పునరుత్థానంపై విశ్వాసం ఉంచుతూ, ‘పునాదులుగల ఆ పట్టణం’ అంటే దేవుని ప్రభుత్వం కింద జీవించాలని ఎదురుచూశారు. అలాంటి ఆశీర్వాదాల గురించి ఆలోచించిన ప్రతీసారి, వాళ్లకు యెహోవా మీద విశ్వాసం మరింత పెరిగింది.—హెబ్రీయులు 11:15, 16 చదవండి.

10. భవిష్యత్తు గురించి ఊహించుకోవడం వల్ల శారా ఎలా ప్రయోజనం పొందింది?

10 అబ్రాహాము భార్య శారా కూడా యెహోవా వాగ్దానాల మీద ఎంతో విశ్వాసం చూపించింది. ఆమెకు 90 ఏళ్ల వయసులో ఇంకా పిల్లలు లేకపోయినా, భవిష్యత్తులో తనకో కొడుకు పుడతాడని ఆమె ఎదురుచూసింది. అంతేకాదు, తన సంతానం ఓ జనాంగంగా అవ్వడాన్ని కూడా ఆమె ఊహించుకుని ఉండవచ్చు. (హెబ్రీ. 11:11, 12) అది ఖచ్చితంగా జరుగుతుందని ఆమె ఎలా నమ్మగలిగింది? ఎందుకంటే, యెహోవా ఆమె భర్త అబ్రాహాముతో ఇలా చెప్పాడు, ‘నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేస్తాను; నేనామెను ఆశీర్వదిస్తాను; ఆమె జనములకు తల్లిగా ఉంటుంది; జనముల రాజులు ఆమెవలన కలుగుతారు.’ (ఆది. 17:16) యెహోవా చెప్పినట్లే శారాకు ఇస్సాకు పుట్టాడు. ఈ అద్భుతం చూశాక, యెహోవా వాగ్దానంలోని మిగతా విషయాలు కూడా నెరవేరతాయని ఆమె నమ్మింది. యెహోవా మనకు వాగ్దానం చేసిన అద్భుతమైనవాటిని ఊహించుకున్నప్పుడు మన విశ్వాసం కూడా మరింత బలపడుతుంది.

బహుమానం మీదే దృష్టిపెట్టాడు

11, 12. మోషే యెహోవా మీద ఎలా ప్రేమ పెంచుకోగలిగాడు?

11 యెహోవామీద ప్రేమను పెంచుకుంటూ, ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచిన మరో వ్యక్తి మోషే. ఆయన ఐగుప్తులో రాకుమారునిగా పెరిగాడు. అయినా మోషే అన్నిటికన్నా ఎక్కువగా యెహోవాను ప్రేమించాడు, కాబట్టే అధికారాన్ని, సంపదల్ని వదులుకున్నాడు. ఆయన యెహోవా గురించీ, హెబ్రీయులను బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశంలోకి నడిపిస్తానని ఆయన చేసిన వాగ్దానం గురించీ తన కన్నతల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాడు. (ఆది. 13:14, 15; నిర్గ. 2:5-10) ఈ వాగ్దానాల గురించి ఆలోచించేకొద్దీ, ఆయనకు యెహోవా మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది.

12 మోషే ఆలోచించిన విషయాల గురించి బైబిలు ఇలా చెప్తుంది, ‘మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమారునిగా గుర్తించబడడానికి నిరాకరించాడు. పాపం ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించడంకన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అనుభవించడానికి సిద్ధమయ్యాడు. అతడు ప్రతిఫలం కోసం ఎదురుచూస్తుండేవాడు కనుక, ఈజిప్టులోని ఐశ్వర్యంకన్నా క్రీస్తు కొరకు అవమానం భరించడం ఉత్తమమని భావించాడు.’—హెబ్రీ. 11:24-26, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

13. యెహోవా చేసిన వాగ్దానాల గురించి లోతుగా ఆలోచించడం వల్ల మోషే ఎలా ప్రయోజనం పొందాడు?

13 ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపిస్తానని యెహోవా చేసిన వాగ్దానం గురించి మోషే చాలా ఆలోచించి ఉంటాడు. అంతేకాక, యెహోవా మానవజాతిని మరణం నుండి విడిపించే రోజు కోసం, ఇతర సేవకుల్లాగే మోషే కూడా ఎదురుచూసి ఉండవచ్చు. (యోబు 14:14, 15; హెబ్రీ. 11:17-19) యెహోవాకు మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో మోషే అర్థం చేసుకున్నాడు. దాంతో మోషేకు దేవుని మీద ప్రేమ, విశ్వాసం మరింతగా పెరిగాయి. ఈ రెండు లక్షణాలవల్ల ఆయన జీవితాంతం యెహోవాను నమ్మకంగా సేవించగలిగాడు. (ద్వితీ. 6:4, 5) తనను చంపుతానని ఫరో బెదిరించినా మోషే భయపడలేదు. ఎందుకంటే భవిష్యత్తులో యెహోవా తనకు బహుమానం ఇస్తాడని ఆయనకు తెలుసు.—నిర్గ. 10:28, 29.

దేవుని రాజ్యంలో ఉండే ఆశీర్వాదాలను ఊహించుకోండి

14. కొంతమంది భవిష్యత్తు గురించి ఎలా ఊహించుకుంటున్నారు?

14 చాలామంది ప్రజలు, అసలెప్పటికీ జరగని వాటిగురించి ఆలోచిస్తూ ఉంటారు. ఉదాహరణకు, కొంతమంది బీదవాళ్లు తాము కోటీశ్వరులం అయిపోతామని, ఏ చీకూచింతా లేకుండా ఉంటామని కలలు కంటుంటారు. కానీ సాతాను లోకంలో జీవించినంత కాలం “ప్రయాస, బాధ” ఉంటాయని బైబిలు చెప్తుంది. (కీర్త. 90:10, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మరికొంతమంది, ఈ లోక ప్రభుత్వాలు మన కష్టాల్ని తీరుస్తాయని ఆశలు పెట్టుకుంటారు. కానీ మన కష్టాలన్నిటికీ దేవుని రాజ్యమే ఏకైక పరిష్కారమని బైబిలు చెప్తుంది. (దాని. 2:44) ఇంకా చాలామంది, లోకంలోని దుష్టత్వం ఎప్పటికీ నాశనమవ్వదని అనుకుంటారు. కానీ దేవుడు దాన్ని త్వరలోనే నాశనం చేస్తాడని బైబిలు చెప్తుంది. (జెఫ. 1:18; 1 యోహా. 2:15-17) యెహోవా దేవుడు చెప్తున్న వాటికి భిన్నంగా ఆలోచించేవాళ్ల ఊహలు ఊహలుగానే మిగిలిపోతాయి.

చేతిలో తాపీ పట్టుకుని భవిష్యత్తు మీద ఆశతో చూస్తున్న ఓ వృద్ధుడు

మీరు కొత్తలోకంలో ఉన్నట్లు ఊహించుకోగలుగుతున్నారా? (15వ పేరా చూడండి)

15. (ఎ) దేవుడు మనకు వాగ్దానం చేసిన జీవితాన్ని మనం ఎందుకు ఊహించుకోవాలి? (బి) దేవుని రాజ్యంలో మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

15 అయితే, యెహోవా మనందరికీ ఓ అద్భుతమైన జీవితాన్ని వాగ్దానం చేశాడు. దాన్ని ఊహించుకున్న ప్రతిసారీ మనం ఎంతో సంతోషాన్ని, ఆయన సేవలో కొనసాగడానికి అవసరమైన ధైర్యాన్ని పొందుతాం. మీకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా, యెహోవా వాగ్దానం చేసిన జీవితాన్ని ఆనందిస్తున్నట్లు ఊహించుకుంటున్నారా? ఒకవేళ మీరు భూమ్మీద నిత్యం జీవించాలని ఎదురుచూస్తుంటే, మీరు ఇతరులతో కలిసి ఈ భూమిని అందమైన పరదైసులా మారుస్తున్నట్లు ఊహించుకోండి. ఆ పనిని పర్యవేక్షించేవాళ్లకు మీమీద ఎంతో శ్రద్ధ ఉంది కాబట్టి మీరెంతో సంతోషంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా మీలాగా యెహోవాను ప్రేమించేవాళ్లే. మీరు ఎంతో ఆరోగ్యంగా, బలంగా ఉన్నారు, మీకు దేని గురించీ దిగులు లేదు. యెహోవాకు ఘనత తీసుకురావడానికి, ఇతరులకు సహాయం చేయడానికి మీ నైపుణ్యాలను, సామర్థ్యాలను ఉపయోగిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. పునరుత్థానమైన వాళ్లకు మీరు యెహోవా గురించి నేర్పిస్తున్నారు కూడా. (యోహా. 17:3; అపొ. 24:14, 15) ఇలా ఊహించుకుంటున్నారంటే, మీరు పగటి కలలు కంటున్నారని కాదు. ఇవన్నీ ఖచ్చితంగా నెరవేరతాయని బైబిలు చెప్తుంది.—యెష. 11:9; 25:8; 33:24; 35:5-7; 65:22.

మీరు ఎదురుచూస్తున్న వాటిగురించి మాట్లాడండి

16, 17. కొత్తలోకంలో మనం చేయాలనుకుంటున్న వాటిగురించి ఇతరులతో మాట్లాడడంవల్ల ప్రయోజనం ఏమిటి?

16 మనం కొత్తలోకంలో ఏమేమి చేయాలనుకుంటున్నామో తోటి సహోదరసహోదరీలతో మాట్లాడాలి. అప్పుడే, ఆ అద్భుతమైన భవిష్యత్తును మరింత బాగా ఊహించుకోవడానికి ఒకరికొకరం సహాయం చేసుకోగలుగుతాం. నిజమే, దేవుని రాజ్యంలో ఎవరికి ఏ పని ఉంటుందో మనకు ఇప్పుడే తెలీదు. కానీ మనం చేయాలనుకుంటున్న పని గురించి ఇతరులతో మాట్లాడడం ద్వారా, యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం ఉందని చూపిస్తాం. దానివల్ల, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా యెహోవా సేవలో కొనసాగేలా ఒకర్నొకరం ప్రోత్సహించుకుంటాం. అపొస్తలుడైన పౌలు, రోములోని సహోదరులు కూడా అదేవిధంగా ఒకర్నొకరు ప్రోత్సహించుకున్నారు.—రోమా. 1:11, 12.

తాపీతో రాతి గోడను కడుతున్న ఓ యౌవనుడు

17 యెహోవా వాగ్దానం చేసిన జీవితం గురించి ఊహించుకోవడం వల్ల, ప్రస్తుతం మీకున్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటారు. ఒక సందర్భంలో పేతురు కాస్త ఆందోళనగా, ‘ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, గనుక మాకేమి దొరకును?’ అని యేసును అడిగాడు. పేతురుతో సహా తన శిష్యులందరూ తమ అద్భుతమైన భవిష్యత్తును ఊహించుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే వాళ్లతో ఇలా అన్నాడు, ‘మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనంమీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనాలమీద ఆసీనులై ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలవారికి తీర్పుతీరుస్తారు. నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్లనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇళ్లనైనను విడిచిపెట్టిన ప్రతీవాడు నూరురెట్లు పొందుతాడు. ఇదిగాక నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటాడు.’ (మత్త. 19:27-29) దానివల్ల పేతురూ, ఇతర శిష్యులూ యేసుతోపాటు పరలోకంలో పాలిస్తున్నట్లు, భూమ్మీదున్న విధేయులైన మానవులు పరిపూర్ణులయ్యేలా సహాయం చేస్తున్నట్లు ఊహించుకోగలిగారు.

18. యెహోవా వాగ్దానాలు నిజమయ్యే కాలాన్ని ఊహించుకోవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

18 యెహోవా సేవకులు ఆయన వాగ్దానం చేసినవాటిని ఊహించుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు. హేబెలు, భవిష్యత్తు గురించిన యెహోవా వాగ్దానాన్ని ఊహించుకుంటూ ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడు. అందుకే ఆయనను సంతోషపెట్టగలిగాడు. అబ్రాహాము, తన ‘సంతానం’ విషయంలో యెహోవా చేసిన వాగ్దానం నిజమయ్యే కాలాన్ని ‘చూశాడు.’ అందుకే, ఆయన అసాధారణమైన విశ్వాసాన్ని చూపించగలిగాడు. (ఆది. 3:15) మోషే, దేవుడు ఇవ్వబోయే బహుమానం కోసం ఎదురుచూశాడు. దానివల్ల ఆయన యెహోవాను ప్రేమించగలిగాడు, నమ్మకంగా ఉండగలిగాడు. (హెబ్రీ. 11:24-26) అదేవిధంగా మనం కూడా యెహోవా వాగ్దానాలు నిజమయ్యే కాలాన్ని ఊహించుకున్నప్పుడు, ఆయన మీద మనకున్న ప్రేమ, విశ్వాసం పెరుగుతాయి. తర్వాతి ఆర్టికల్‌లో, ఊహించుకోగల మన సామర్థ్యాన్ని మరో విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి