కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 5/1 పేజీలు 28-31
  • మీరు చేసే పనులను యెహోవా గమనిస్తాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు చేసే పనులను యెహోవా గమనిస్తాడా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బలి అర్పించిన ఒక కాపరి
  • తన సందేశాన్ని అంగీకరించని వారికి ప్రకటించిన ప్రవక్త
  • భోజనం తయారుచేసిన విధవరాలు
  • ఇతరులు చేసే పనులను మీరు గమనిస్తారా?
  • సారెపతులోని విధవరాలు తన విశ్వాసానికి ప్రతిఫలం పొందింది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • హనోకు—విపత్తులన్నిటినీ నిర్భయంగా ఎదుర్కొన్నాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 5/1 పేజీలు 28-31

మీరు చేసే పనులను యెహోవా గమనిస్తాడా?

ఆప్రశ్నకు మీ సమాధానమేమిటి? చాలామంది ఇలా అనవచ్చు: ‘మోషే, గిద్యోను, దావీదు వంటి మానవులు సాధించినవాటిని దేవుడు గమనించాడని నేను నమ్ముతాను కానీ నేను చేయగలిగే పనులను ఆయన అలా గమనిస్తాడని మాత్రం నేను అనుకోను. నేను వాళ్ళలాంటి వాడిని కాదని నాకు తెలుసు.’

బైబిలు కాలాల్లోని కొంతమంది నమ్మకస్థులు అసాధారణమైన క్రియల ద్వారా తమ విశ్వాసాన్ని ప్రదర్శించారన్నది నిజమే. వారు ‘రాజ్యములను జయించారు, సింహముల నోళ్లను మూశారు, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకొన్నారు.’ (హెబ్రీయులు 11:33, 34) ఇతరులు తమ విశ్వాసాన్ని అంత అద్భుతంగా కాక సాధారణ రీతిలోనే ప్రదర్శించారు, అలాంటి వారు విశ్వాసంతో చేసిన పనులను కూడా దేవుడు గమనించాడని బైబిలు మనకు హామీ ఇస్తోంది. ఉదాహరణకు ఒక పశువుల కాపరి, ఒక ప్రవక్త, ఒక విధవరాలి లేఖనాధారిత మాదిరులను పరిశీలించండి.

బలి అర్పించిన ఒక కాపరి

ఆదాము హవ్వల రెండవ కుమారుడైన హేబెలు గురించి మీకు ఏమి గుర్తుంది? ఆయన హతసాక్షిగా మరణించాడని మీకు గుర్తుండవచ్చు, అలాంటి మరణాన్ని మనలో చాలా తక్కువమంది అనుభవించే అవకాశం ఉంది. అయితే మొదట దేవుడు హేబెలును మరో కారణాన్ని బట్టి గమనించాడు.

ఒకరోజు హేబెలు తన మందలో నుండి ఉత్తమమైన జంతువులను ఎంపిక చేసి దేవునికి బలి అర్పించాడు. ఆయనిచ్చిన అర్పణ గురించి ఆలోచిస్తే అది నేడు చాలా సాధారణమైనదిగా అనిపించవచ్చు కానీ యెహోవా ఆయన అర్పణను గమనించి తన ఆమోదాన్ని తెలియజేశాడు. అయితే అది అంతటితో అయిపోలేదు. దాదాపు నాలుగు వేల సంవత్సరాల తర్వాత యెహోవా ఆ విషయం గురించి హెబ్రీయుల పుస్తకంలో వ్రాసేందుకు అపొస్తలుడైన పౌలును ప్రేరేపించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఆ సాధారణమైన బలిని మరచిపోలేదు!—హెబ్రీయులు 6:10; 11:4.

ఎలాంటి బలి అర్పించాలనే విషయాన్ని హేబెలు ఎలా నిర్ణయించుకున్నాడు? దాని గురించి బైబిలు ఏమీ చెప్పడం లేదు కానీ ఆయన ఖచ్చితంగా ఆ విషయం గురించి గంభీరంగా ఆలోచించేవుంటాడు. ఆయన ఒక పశువుల కాపరి కాబట్టి తన మందలో నుండి జంతువులను అర్పించడమనేది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అయితే ఆయన ఉత్తమమైనవాటిని అంటే “క్రొవ్విన వాటిని” అర్పించాడని గమనించండి. (ఆదికాండము 4:4) ఏదెను తోటలో యెహోవా సర్పంతో అన్న ఈ మాటల గురించి ఆయన ధ్యానించివుండే అవకాశం కూడా ఉంది: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదు[వు].” (ఆదికాండము 3:15; ప్రకటన 12:9) అక్కడ ప్రస్తావించబడిన “స్త్రీ,” ఆమె “సంతానము” ఎవరో అర్థం కాకపోయినప్పటికీ, ఆ స్త్రీ సంతానం ‘మడిమె మీద కొట్టబడినప్పుడు’ రక్తం చిందుతుందని హేబెలు గ్రహించి ఉంటాడు. సజీవంగా ఉన్న జంతువు కంటే ఎక్కువ విలువైన అర్పణ మరొకటి ఉండదని ఆయన గ్రహించాడనడంలో సందేహం లేదు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన అర్పించిన బలి నిజంగా తగినదే.

హేబెలులాగే నేడు క్రైస్తవులు దేవునికి బలులు అర్పిస్తారు. వారు మందలో తొలిచూలును కాదు కానీ ‘దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుచు, అనగా దేవుని నామమును ఒప్పుకొనుచు [“బహిరంగంగా ప్రకటించుచు,” NW], జిహ్వాఫలము అర్పిస్తారు.’ (హెబ్రీయులు 13:15) మనం మన విశ్వాసం గురించి ఇతరులకు తెలియజేసినప్పుడు మన పెదవులు బహిరంగ ప్రకటన చేస్తాయి.

మీరు మీ స్తుతియాగపు నాణ్యతను పెంచుకోవడానికి ఇష్టపడతారా? మీ క్షేత్రంలోని ప్రజల అవసరాల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. వారు ఏ విషయాల గురించి చింతిస్తున్నారు? వారికి ఏ విషయాల్లో ఆసక్తి ఉంది? బైబిలు సందేశంలో ఎలాంటి విషయాలు వారికి నచ్చే అవకాశం ఉంది? మీరు ప్రకటిస్తున్న ప్రతీసారి, మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో మీ సందర్శనాలను విశ్లేషించుకోండి. మీరు యెహోవా గురించి మాట్లాడుతున్నప్పుడు దృఢ నమ్మకంతో హృదయపూర్వకంగా మాట్లాడండి. మీ బలిని ఒక నిజమైన ‘స్తుతియాగముగా’ చేయండి.

తన సందేశాన్ని అంగీకరించని వారికి ప్రకటించిన ప్రవక్త

ఇప్పుడు హనోకు ప్రవక్త గురించి ఆలోచించండి. ఆయన యెహోవా దేవునికి సాక్షిగా కేవలం ఒక్కడే ఉండివుండవచ్చు. మీరు హనోకులాగే మీ కుటుంబంలో ఒంటరిగా యెహోవాకు విశ్వసనీయంగా సేవచేస్తున్నారా? మీ క్లాస్‌లో లేదా మీ ఉద్యోగ స్థలంలో బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండేది కేవలం మీరొక్కరేనా? అలాంటప్పుడు మీరు సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులు, తోటి విద్యార్థులు లేదా ఉద్యోగస్థులు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించమని మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. “మీరు ఏమి చేశారో ఎవ్వరికీ తెలియదు. దాని గురించి మేము ఎవ్వరికీ చెప్పము” అని వారు అనవచ్చు. మీరు ఏమి చేస్తున్నారో దేవుడు పట్టించుకోడు కాబట్టి బైబిలు నైతిక ప్రమాణాల గురించి ఎక్కువగా ఆలోచించడం తెలివితక్కువతనం అని వారు వాదించవచ్చు. మీరు వారిలా ఆలోచించరు వారిలా ప్రవర్తించరు అనే అసూయతో వారు మీ నిగ్రహశక్తిని బలహీనపరచడానికి సాధ్యమైనదంతా చేస్తారు.

అలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడం సులభం కాదన్నది నిజమే కానీ అది అసంభవం మాత్రం కాదు. ఆదాము వంశక్రమంలో ఏడవ పురుషుడైన హనోకు గురించి ఆలోచించండి. (యూదా 14) హనోకు జన్మించే సమయానికల్లా చాలామంది నైతికంగా దిగజారిపోయారు. వారు దుర్భాష మాట్లాడేవారు; వారి ప్రవర్తన ‘దిగ్భ్రాంతికరంగా’ ఉండేది. (యూదా 15, NW) వారి ప్రవర్తన నేడున్న చాలామంది ప్రజల ప్రవర్తనలాగే ఉండేది.

హనోకు ఈ పరిస్థితులతో ఎలా వ్యవహరించాడు? ఈ ప్రశ్నకు సమాధానం నేడు మనకు వర్తిస్తుంది. అప్పట్లో భూమ్మీద యెహోవాను ఆరాధించేవాడు హనోకు ఒక్కడే అయినప్పటికీ నిజానికి ఆయన ఒంటరివాడు కాదు. హనోకు దేవునితో నడిచాడు.—ఆదికాండము 5:22.

దేవుణ్ణి సంతోషపరచడం హనోకు జీవితంలో కేంద్రస్థానంగా ఉండేది. దేవునితో నడవడం అంటే కేవలం నైతికంగా పరిశుభ్రమైన జీవితం జీవించడం కంటే ఎక్కువే చెయ్యాలని హనోకుకు తెలుసు. హనోకు ప్రకటించాలని యెహోవా ఆశించాడు. (యూదా 14, 15) ప్రజల దైవభక్తిలేని క్రియలను దేవుడు గమనించాడని వారిని హెచ్చరించాలి. హనోకు 300 సంవత్సరాల కంటే ఎక్కువకాలం దేవునితో నడిచాడు—అది, మనలో ఎవరమైనా కష్టాలను సహించే కాలం కంటే ఎంతో ఎక్కువ. హనోకు చనిపోయేంతవరకూ దేవునితో నడుస్తూనే ఉన్నాడు.—ఆదికాండము 5:23, 24.

హనోకుకు ఇవ్వబడినట్లే మనకు కూడా ప్రకటించమనే ఆజ్ఞ ఇవ్వబడింది. (మత్తయి 24:14) ఇంటింటికి వెళ్ళి సాక్ష్యమివ్వడంతో పాటు మనం బంధువులకు, పరిచయస్థులైన వ్యాపారులకు, తోటి విద్యార్థులకు సువార్త ప్రకటించడానికి ప్రయత్నిస్తాము. అయితే కొన్నిసార్లు మనం ధైర్యంగా సాక్ష్యమివ్వడానికి సంకోచిస్తాము. మీకు ఆ సమస్య ఉందా? నిరుత్సాహపడకండి. తొలి క్రైస్తవులను అనుకరిస్తూ ధైర్యం కోసం దేవునికి ప్రార్థించండి. (అపొస్తలుల కార్యములు 4:29, 30) మీరు దేవునితో నడుస్తున్నంత కాలం మీరు ఎన్నటికీ ఒంటరివారిగా ఉండరనే విషయం ఎన్నడూ మరచిపోకండి.

భోజనం తయారుచేసిన విధవరాలు

పేరు తెలియని ఒక విధవరాలు సాధారణ భోజనం తయారుచేసినందుకు రెండు ఆశీర్వాదాలను పొందిన విషయం ఆలోచించండి! ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు కానీ సా.శ.పూ. పదవ శతాబ్దంలో సారెపతు పట్టణంలో నివసించిన ఒక అన్యురాలు. ఎంతోకాలంగా వర్షాభావం, కరువు ఉండడంవల్ల ఆ విధవరాలి ఆహార నిల్వ దాదాపుగా అయిపోతోంది. ఆమె దగ్గర కేవలం పట్టెడు పిండి, తన కోసం తన కుమారుని కోసం ఆఖరి భోజనం తయారుచేసుకోవడానికి సరిపడా నూనె మాత్రమే మిగిలాయి.

ఈ సమయంలో ఆమె దగ్గరకు ఒక అతిథి వచ్చాడు. ఆయన దేవుని ప్రవక్త ఏలీయా, ఆయన విధవరాలి వద్దకు వచ్చి ఆమె ఆహారంలో తనకు కూడా భాగం ఇమ్మని అడిగాడు. ఆమె దగ్గర ఆమెకు ఆమె కుమారునికి సరిపడేంత ఆహరం కూడా లేదు కాబట్టి ఈ అతిథికి పెట్టడానికి ఆహారం లేదనడంలో సందేహం లేదు. కానీ ఆమె వద్దనున్న ఆహారాన్ని తనతో పంచుకుంటే ఆమె, ఆమె కుమారుడు పస్తులుండరని ఏలీయా యెహోవా మాట ప్రకారం ఆమెకు హామీ ఇచ్చాడు. ఇశ్రాయేలు దేవుడు తన పనిని గమనిస్తున్నాడని నమ్మడానికి అన్యురాలైన ఆ విధవరాలికి విశ్వాసం అవసరమయ్యింది. అయినప్పటికీ ఆమె ఏలీయాను నమ్మింది, యెహోవా ఆమెను ఆశీర్వదించాడు. “యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.” కరువు కాలం ముగిసేంతవరకూ విధవరాలికి, ఆమె కుమారునికి ఆహారం క్రమంగా సరఫరా చేయబడుతూనే ఉంది.—1 రాజులు 17:8-16.

అయితే ఆ విధవరాలు మరో ఆశీర్వాదం పొందనుంది. ఆ అద్భుతం జరిగిన కొంతకాలానికి ఆమె ప్రియ కుమారుడు అనారోగ్యం పాలై చనిపోయాడు. కనికరంతో కదిలించబడిన ఏలీయా, ఆ బాలుణ్ణి పునరుత్థానం చేయమని యెహోవాకు విన్నవించుకున్నాడు. (1 రాజులు 17:17-24) అంటే ఆయన అసాధారణమైన అద్భుతం చేయమని యెహోవాను కోరాడు. అంతకుముందు ఎవరైనా పునరుత్థానం చేయబడినట్లు నమోదు చేయబడలేదు! అన్యురాలైన ఈ విధవరాలికి యెహోవా మళ్ళీ దయ చూపిస్తాడా? అవును చూపించాడు. ఆ బాలుని పునరుత్థానం చేయడానికి యెహోవా ఏలీయాకు శక్తినిచ్చాడు. గొప్ప ఆధిక్యతను పొందిన ఈ విధవరాలి గురించి యేసు ఆ తర్వాత ఇలా వ్యాఖ్యానించాడు: “ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను, ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.”—లూకా 4:25, 26.

నేటి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందిన దేశాల్లో సహితం చాలా అస్థిరంగా ఉంది. కొన్ని పెద్ద కంపెనీలు, ఎన్నో దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేసిన ఉద్యోగులను పనిలోనుండి తీసివేశాయి. నిరుద్యోగిగా ఉండవలసిన పరిస్థితి ఎదురవుతుందేమోనని ఒక క్రైస్తవుడు తన కంపెనీ తనను ఉద్యోగంలో నుండి తొలగించకూడదనే ఆశతో కంపెనీలో పని చేయడానికి ఎక్కువ సమయం వెచ్చించడానికి శోధించబడవచ్చు. అలా చేయడంవల్ల క్రైస్తవ కూటాలకు హాజరవడానికి, క్షేత్ర పరిచర్యలో భాగం వహించడానికి లేదా తన కుటుంబపు భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి చాలా తక్కువ సమయం మిగలవచ్చు. అయితే ఆ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోకూడదని ఆయన భావిస్తుండవచ్చు.

ఇలాంటి ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొనే క్రైస్తవుడు చింతించడానికి కారణం లేకపోలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం కష్టమే. మనలో చాలామంది ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడడం లేదు కానీ సారెపతుకు చెందిన విధవరాలిలాగే కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాము. అయితే “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను” అని దేవుడు చెప్పాడని అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. “ప్రభువు [యెహోవా] నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?” అని మనం ధైర్యంగా చెప్పవచ్చు. (హెబ్రీయులు 13:5, 6) ఆ వాగ్దానాన్ని పౌలు బలంగా విశ్వసించాడు, యెహోవా ఆయనను ఎల్లప్పుడూ శ్రద్ధగా చూసుకున్నాడు. మనం దేవుణ్ణి ఎడబాయకుండా ఉంటే ఆయన మనలను కూడా అలాగే చూసుకుంటాడు.

మోషే, గిద్యోను, దావీదు వంటి ఆధ్యాత్మిక పురుషులు చేసిన గమనార్హమైన పనులను ఎన్నడూ చేయలేమని మనం భావించవచ్చు కానీ మనం వారి విశ్వాసాన్ని అనుకరించవచ్చు. హేబెలు, హనోకు, సారెపతు విధవరాలు విశ్వాసంతో చేసిన సాధారణమైన పనులను మనం గుర్తుంచుకోవచ్చు. యెహోవా, విశ్వాసంతో చేసే పనులన్నింటిని—అవి చిన్నవైనా సరే—గమనిస్తాడు. దైవభక్తిగల ఒక విద్యార్థి, తోటి విద్యార్థి అందించిన మాదకద్రవ్యాలను స్వీకరించడానికి నిరాకరించినప్పుడు, ఒక క్రైస్తవ ఉద్యోగి తన ఉద్యోగ స్థలంలో అనైతికమైన పనులు చేయడానికి నిరాకరించినప్పుడు లేదా ఒక వృద్ధురాలు అలసిపోయినప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నమ్మకంగా సంఘ కూటాలకు హాజరవుతున్నప్పుడు యెహోవా వారిని గమనిస్తాడు. ఆయన ఎంతో సంతోషిస్తాడు!—సామెతలు 27:11.

ఇతరులు చేసే పనులను మీరు గమనిస్తారా?

అవును మనం చేసే పనులను యెహోవా గమనిస్తాడు. కాబట్టి దేవుణ్ణి అనుకరించేవారిగా మనం ఇతరులు చేసే కృషిని గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. (ఎఫెసీయులు 5:1) సంఘ కూటాలకు హాజరవడానికి, క్షేత్ర పరిచర్య చేయడానికి, తమ దైనందిన కార్యకలాపాలను చేసుకోవడానికి కూడా మీ తోటి క్రైస్తవులు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారో ఎందుకు గమనించకూడదు?

తర్వాత, వారు చేస్తున్న కృషిని మీరు విలువైనదిగా ఎంచుతున్నారని యెహోవాను ఆరాధించే మీ తోటి ఆరాధకులకు తెలియజేయండి. మీరు వారి పనులను గమనించారని వారు సంతోషిస్తారు, మీరు చూపే శ్రద్ధ, యెహోవా కూడా వారిని గమనిస్తాడని వారికి హామీ ఇస్తుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి