హనోకు—విపత్తులన్నిటినీ నిర్భయంగా ఎదుర్కొన్నాడు
ఒక మంచి మనిషికి ఎంతో కష్టకాలం వచ్చింది. భూమ్మీద భక్తిహీనత నిండిపోయింది. మానవజాతి నైతికస్థితి క్రమంగా క్షీణించిపోతోంది. వాస్తవానికి, త్వరలో ఇలా చెప్పబడుతుంది: “నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా” చూశాడు.—ఆదికాండము 6:5.
ఆదాము వంశావళిలో ఏడవవాడైన హనోకు ఇతరులకు భిన్నంగా ఉండేందుకు ధైర్యాన్ని కలిగివున్నాడు. ఏ పర్యవసానాలు వచ్చినప్పటికీ అతను నీతి నిమిత్తం దృఢంగా నిలిచాడు. భక్తిహీనులైన పాపులకు హనోకు సందేశం ఎంత కోపాన్ని తెప్పించేదిగా ఉందంటే అతన్ని చంపేయాలని వారు యోచించారు, కేవలం యెహోవాయే అతనికి సహాయం చేయగలడు.—యూదా 14, 15.
హనోకు మరియు విశ్వ వివాదాంశం
హనోకు జన్మించడానికి చాలాకాలం ముందు, విశ్వ సర్వాధిపత్యానికి సంబంధించిన వివాదాంశం లేవదీయబడింది. దేవుడు పరిపాలించే హక్కును కలిగి ఉన్నాడా? నిజానికి, కలిగి లేడని అపవాదియైన సాతాను అన్నాడు. వివేకంగల సృష్టిప్రాణులు దేవుని నడిపింపు లేకుండా ఉంటే వారు ఇంకా శ్రేష్ఠంగా జీవించగలరని అతను వాదించాడు. మానవులను కపటముతో తన వైపుకు తిప్పుకోవడం ద్వారా సాతాను యెహోవా దేవునికి విరుద్ధంగా తన వాదనను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. ఆదాము, అతని భార్యయైన హవ్వ, వారి మొదటి కుమారుడైన కయీనులు దేవుని పరిపాలనకు బదులు స్వయంపాలనను ఎంపిక చేసుకోవడంలో దుష్కీర్తి గాంచారు. దేవుడు తినకూడదని చెప్పిన ఫలాన్ని తినడం ద్వారా మొదటి దంపతులు అలా చేశారు, నీతిమంతుడైన తన తమ్ముడగు హేబెలును పన్నాగాలు పన్ని హత్య చేయడం ద్వారా కయీను అలా చేశాడు.—ఆదికాండము 3:4-6; 4:8.
హేబెలు ధైర్యంగా యెహోవా పక్షాన నిలిచాడు. హేబెలు చూపిన యథార్థత పవిత్రారాధనను వృద్ధి చేసింది గనుక, కయీను హేబెలుపై హత్యాప్రయత్న ఆగ్రహాన్ని వ్రెళ్లగక్కినప్పుడు సాతాను నిశ్చయంగా ఆనందించి ఉంటాడు. అప్పటి నుండి సాతాను, భయపెట్టేందుకు “మరణభయము”ను అస్త్రంగా ఉపయోగిస్తున్నాడు. సత్య దేవున్ని ఆరాధించాలని ఇష్టపడే వారందరి హృదయాల్లో ఆ భయాన్ని ప్రవేశపెట్టాలని అతను కోరుకుంటున్నాడు.—హెబ్రీయులు 2:14, 15; యోహాను 8:44; 1 యోహాను 3:12.
హనోకు జన్మించే సమయానికల్లా, యెహోవా సర్వాధిపత్యాన్ని మానవులు ఉన్నతపర్చరనే సాతాను వాదన బహుశ సరైన ఆధారాన్ని కలిగియున్నట్లు అనిపించి ఉంటుంది. హేబెలు మరణించాడు, అతని నమ్మకమైన మాదిరిని ఎవరూ అనుకరించడం లేదు. అయినప్పటికీ, హనోకు తాను మాత్రం వేరుగా ఉన్నానని నిరూపించుకున్నాడు. అతను విశ్వసించేందుకు బలమైన కారణాన్ని కలిగి ఉన్నాడు, ఎందుకంటే ఏదెను తోటలో జరిగిన సంగతుల గురించి అతనికి బాగా తెలుసు.a వాగ్దానం చేయబడిన సంతానం సాతానుకు, అతని కోరికలకు ఒక అంతాన్ని తెస్తాడని సూచించే యెహోవా ప్రవచనాన్ని అతను ఎంతగా ఇష్టపడి ఉంటాడోకదా!—ఆదికాండము 3:15.
ఈ నిరీక్షణ తన ఎదుట ఎల్లప్పుడూ ఉండటంతో, అపవాది కుతంత్రాల మూలంగా హేబెలు హత్య గావించబడిన సంఘటననుబట్టి హనోకు భీతి చెందలేదు. బదులుగా, యథార్థ ప్రవర్తనను జీవితాంతం కల్గియుండి అతను యెహోవాతో నడుస్తూ వచ్చాడు. లోకంలో వున్న స్వతంత్ర వైఖరిని నిరాకరిస్తూ అతను తననుతాను లోకం నుండి వేరుగా ఉంచుకున్నాడు.—ఆదికాండము 5:23, 24.
అంతే కాకుండా, అపవాది యొక్క చెడు క్రియలు తప్పక అపజయాన్ని చవిచూస్తాయని ధైర్యంగా మాట్లాడుతూ, ఆ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తి ప్రభావంతో, దుష్టులను గురించి హనోకు ఇలా ప్రవచించాడు: “ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.”—యూదా 14, 15.
హనోకు నిర్భయంగా ప్రకటించినందుకు, హెబ్రీ క్రైస్తవులకు లేఖను వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు, “గొప్ప సాక్షి సమూహము”లో అతన్ని కూడా చేర్చాడు, వీళ్లంతా క్రియల్లో విశ్వాసాన్ని చూపడంలో అత్యంత గొప్ప మాదిరినుంచారు.b (హెబ్రీయులు 11:5; 12:1) విశ్వాసంగల వ్యక్తిగా, హనోకు తన యథార్థతా మార్గంలో 300 కంటే ఎక్కువ సంవత్సరాలు నడిచాడు. (ఆదికాండము 5:22) పరలోకములోను భూమిమీదను ఉన్న దేవుని శత్రువులను హనోకు యథార్థత ఎంతగా విసిగించి ఉంటుందో కదా! హనోకు యొక్క తీవ్రమైన ప్రవచనం సాతాను ద్వేషాన్ని రేకెత్తించి ఉంటుంది అయితే అది యెహోవా రక్షణను అందించింది.
దేవుడు హనోకును తీసికొనిపోయెను—ఎలా?
సాతాను లేక అతని భూసంబంధ సేవకులు హనోకును చంపేందుకు యెహోవా అనుమతించలేదు. బదులుగా, ప్రేరేపిత నివేదిక ఇలా చెబుతుంది: “దేవుడతని తీసికొనిపోయెను.” (ఆదికాండము 5:24) అపొస్తలుడైన పౌలు సంగతులను ఇలా వివరిస్తున్నాడు: “విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను [“తరలించబడెను,” NW]; అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైయుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.”—హెబ్రీయులు 11:5.
హనోకు “మరణము చూడకుండునట్లు” ఎలా “కొనిపోబడెను” [“తరలించబడెను,” NW]? లేక ఆర్. ఎ. నాక్స్ చేసిన అనువాదంలో ఉన్నట్లు, హనోకు ఎలా “మరణాన్ని అనుభవించకుండా తీసుకు వెళ్లబడ్డాడు”? అనారోగ్యం లేక అతని శత్రువుల చేతిలో దౌర్జన్యాన్ని అనుభవించడం ద్వారా కలిగే మరణపు వేదన నుండి అతన్ని తప్పిస్తూ, దేవుడు హనోకు జీవితాన్ని శాంతియుతంగా అంతం చేశాడు. అవును, యెహోవా హనోకు జీవితాన్ని 365 సంవత్సరాలకు కుదించాడు. అతని సమకాలీనులతో పోల్చి చూస్తే అతనిది అప్పటికి చాలా చిన్న వయస్సే అనవచ్చు.
తాను “దేవునికి ఇష్టుడైయుండెనని” హనోకు ఎలా “సాక్ష్యము పొందెను”? అతనికి ఏ రుజువులు ఉన్నాయి? క్రైస్తవ సంఘమును గూర్చిన భవిష్యత్ ఆత్మీయ పరదైసు యొక్క దర్శనాన్ని పొందుతూ, “కొనిపోబడిన” లేక ‘తరలించబడిన’ అపొస్తలుడైన పౌలు వలె బహుశ హనోకుకు కూడా దేవుడు పారవశ్యము కలిగించి ఉంటాడు. (2 కొరింథీయులు 12:3, 4) హనోకు దేవునికి ఇష్టుడైయుండెననే సాక్ష్యం లేక రుజువులో, దేవుని సర్వాధిపత్యానికి మద్దతు ఇచ్చే వారు ఉన్న భవిష్యత్ భూపరదైసు యొక్క దర్శనాన్ని చూపడం కూడా ఇమిడి ఉండవచ్చు. బహుశ హనోకు పారవశ్యములో ఉండి అలాంటి దర్శనాన్ని చూస్తున్నప్పుడే అతను తన పునరుత్థాన దినం వరకూ నిద్రిస్తూ ఉండేలా దేవుడు అతనికి నొప్పి తెలియని మరణాన్ని కలిగించి ఉండవచ్చు. మోషే విషయంలో చేసినట్లే యెహోవా హనోకు శరీరాన్ని కూడా కన్పించకుండా చేసి ఉండవచ్చు, ఎందుకంటే “అతడు కనబడలేదు.”—హెబ్రీయులు 11:5; ద్వితీయోపదేశకాండము 34:5, 6; యూదా 9.
ప్రవచనం నెరవేరింది
నేడు యెహోవాసాక్షులు హనోకు ప్రవచనం యొక్క సారాంశాన్ని ప్రకటిస్తున్నారు. త్వరలో దేవుడు భక్తిహీనులను నాశనం చేసినప్పుడు అది ఎలా నెరవేరుతుందో వారు లేఖనాల నుండి చూపుతున్నారు. (2 థెస్సలోనీకయులు 1:6-10) ఈ ప్రపంచం యొక్క ఉద్దేశాలనుండి, లక్ష్యాలనుండి వారి సందేశం ఎంతో భిన్నంగా ఉంది గనుక వారు ప్రజాదరణ పొందలేకపోతున్నారు. వారు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందుకు ఆశ్చర్యపడరు, ఎందుకంటే యేసు తన అనుచరులకు ఇలా హెచ్చరిక చేశాడు: “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు.”—మత్తయి 10:22; యోహాను 17:14.
అయితే, హనోకువలె ప్రస్తుతదిన క్రైస్తవులు తమ శత్రువుల నుండి తప్పింపబడతారనే నిశ్చయతను కలిగి ఉన్నారు. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు.” (2 పేతురు 2:9) ఒక సమస్యను లేక కష్టతరమైన ఒక పరిస్థితిని తీసేయడం మంచిదని దేవుడు అనుకోవచ్చు. హింస అంతం కావచ్చు. ఒకవేళ అలా కాకపోతే, తన ప్రజలు తమ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు వారికి “తప్పించుకొను మార్గమును కలుగజేయ”డమూ ఆయనకు తెలుసు. అవసరమైనప్పుడు యెహోవా “బలాధిక్యము” కూడా అనుగ్రహిస్తాడు.—1 కొరింథీయులు 10:13; 2 కొరింథీయులు 4:7.
“తన్ను వెదకువారికి ఫలము దయచేయువా”నిగా యెహోవా తన నమ్మకమైన సేవకులకు నిత్యజీవాన్నిచ్చి దీవిస్తాడు. (హెబ్రీయులు 11:6) వారిలో అత్యధికులకు, అది భూపరదైసులో నిత్య జీవాన్ని అందిస్తుంది. హనోకువలె మనం కూడా దేవుని వర్తమానాన్ని నిర్భయంగా ప్రకటించుదాం. విశ్వాసంతో, విపత్తులన్నిటినీ ఎదుర్కొంటూ అలా చేద్దాము.
[అధస్సూచీలు]
a హనోకు జన్మించినప్పుడు ఆదాము 622 సంవత్సరాల వాడు. ఆదాము మరణం తర్వాత హనోకు దాదాపు 57 సంవత్సరాలు జీవించాడు. కాబట్టి, వారి జీవితాలు చాలాకాలం కలిసిసాగాయి.
b హెబ్రీయులు 12:1 నందలి ‘సాక్షులు’ అనే అనువాదం, మార్టిస్ అనే గ్రీకు పదం నుండి వస్తుంది. వ్యూస్ట్స్ వర్డ్ స్టడీస్ ఫ్రమ్ ద గ్రీక్ న్యూ టెస్టమెంట్ ప్రకారం, ఈ పదం “తాను చూచిన లేక వినిన లేక ఇతర ఏ విధాలుగానైనా తనకు తెలిసిన విషయాలను గురించి సాక్ష్యమిచ్చే లేక సాక్ష్యమివ్వగల వ్యక్తి” అనే భావాన్ని కలిగి ఉంది. “తన వ్యక్తిగత అనుభవం నుండి . . . సత్యాలను మరియు దృక్పథాలను గురించిన నమ్మకాన్ని బట్టి” మాట్లాడే వ్యక్తి అనే భావాన్ని ఆ పదము కలిగివుందని నైగల్ టర్నర్ వ్రాసిన క్రిస్టియన్ వర్డ్స్ చెబుతుంది.
[30వ పేజీలోని బాక్సు]
దేవుని నామం దూషించబడింది
హనోకు కాలానికి దాదాపు నాలుగు దశాబ్దాల ముందు, ఆదాము మనుమడైన ఎనోషు జన్మించాడు. “అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది” అని ఆదికాండము 4:26 చెబుతుంది. దేవుని నామాన “దూషణకరంగా” పిలువడం “మొదలైంది” అని లేక “దూషించడం అప్పుడు మొదలైంది” అని ఈ వచనం చదువబడాలని కొందరు హెబ్రీ భాషా పండితులు విశ్వసిస్తున్నారు. చరిత్రలోని ఆ కాలాన్ని గురించి, జెరూసలేమ్ టార్గమ్ ఇలా చెబుతుంది: “వారు ఆ తరంలోని దినాల్లోనే తప్పు చేయడాన్ని మరియు తమ కొరకు విగ్రహాలను చేసుకోవడాన్ని ప్రారంభించారు, ప్రభువు వాక్యమందలి పేరును తమ విగ్రహాలకు మారు పేర్లుగా పెట్టుకున్నారు.”
ఎనోషు కాలంలో యెహోవా పేరు చాలా విరివిగా దురుపయోగానికి గురైంది. ప్రజలు ఆ దైవిక నామాన్ని తమకు లేక తాము ఎవరి ద్వారా యెహోవా దేవునికి ఆరాధన చెల్లిస్తున్నామని చూపేవారో ఆ వ్యక్తికి అన్వయించడం ద్వారా వారు అలా చేసి ఉంటారు. లేక వారు ఆ దైవిక నామాన్ని విగ్రహాలకు అన్వయించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ, అపవాదియైన సాతాను విగ్రహారాధనా ఉరిలో మానవజాతినంతటినీ గట్టిగా బంధించి ఉంచాడు. హనోకు జన్మించే సమయానికల్లా, సత్యారాధన అంతరించి పోయింది. సత్యానికి అనుగుణంగా జీవించి దాన్ని ప్రకటించిన హనోకు వంటి వారెవరైనా, ప్రజాదరణ పొందేవారు కాదు, అలా వారు హింసకు గురయ్యేవారు.—మత్తయి 5:11, 12 పోల్చండి.
[31వ పేజీలోని బాక్సు]
హనోకు పరలోకానికి వెళ్లాడా?
“విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. [“తరలించబడెను,” NW]” హెబ్రీయులు 11:5 యొక్క ఈ భాగాన్ని అనువదించడంలో, హనోకు వాస్తవంగా మరణించలేదని కొన్ని బైబిలు అనువాదాలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, జేమ్స్ మొఫాట్ అనువదించిన ఎ న్యూ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది బైబిల్ ఇలా పేర్కొంటుంది: “విశ్వాసం ద్వారా హనోకు పరలోకానికి తీసుకువెళ్లబడ్డాడు కనుక ఆయన మరణించలేదు.”
అయితే, హనోకు జీవించిన దాదాపు 3,000 సంవత్సరాల తర్వాత, యేసుక్రీస్తు ఇలా పేర్కొన్నాడు: “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను 3:13) ది న్యూ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది: “పరలోకం నుండి క్రిందికి దిగి వచ్చిన వాడైన మనుష్య కుమారుడు తప్ప ఎవరూ ఎప్పుడూ పరలోకానికి ఎక్కి వెళ్లలేదు.” యేసు ఆ మాట పలికినప్పుడు ఆయన కూడా పరలోకానికి ఆరోహణం కాలేదు.—లూకా 7:28 పోల్చండి.
గొప్ప సాక్షి సమూహములోని వారైన ఇతరులు మరియు హనోకు, ‘మృతినొందిరని’ మరియు తమ ‘వాగ్దానఫలము అనుభవింపలేదని’ అపొస్తలుడైన పౌలు పేర్కొన్నాడు. (హెబ్రీయులు 11:13, 39) ఎందుకు? ఎందుకంటే, హనోకుతో సహా మానవులందరూ, ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందారు. (కీర్తన 51:5; రోమీయులు 5:12) రక్షణకుగల ఒకే మార్గం యేసుక్రీస్తు బలి క్రయధనం మాత్రమే. (అపొస్తలుల కార్యములు 4:12; 1 యోహాను 2:1, 2) హనోకు కాలంలో ఆ క్రయధనం ఇంకా చెల్లించబడలేదు. కాబట్టి, హనోకు పరలోకానికి వెళ్లలేదు, అయితే భూమిపై పునరుత్థానం చేయబడేందుకు వేచి ఉండి అతను మరణమందు నిద్రిస్తున్నాడు.—యోహాను 5:28, 29.
[29వ పేజీలోని చిత్రసౌజన్యం]
Illustrirte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s నుండి పునరుత్పత్తి చేయబడింది