అసంభవమనిపించిన బోయజు రూతుల వివాహం
బేత్లెహేముకు దగ్గరున్న ఒక కళ్లములో వసంత ఋతువుకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఆ రోజు పని ఎక్కువగా ఉంది. అప్పుడే వేయించిన ధాన్యపు కమ్మని వాసన, భోజనానికి వేళయ్యిందని ఆకలితోవున్న పనివారికి తెలియజేసింది. అందరూ తాము కష్టపడి చేసిన పనికి వచ్చిన ప్రతిఫలాలను ఆనందంగా ఆరగించారు.
సంపన్న భూస్వామి అయిన బోయజు తృప్తిగా భుజించి ఒక పెద్ద ధాన్యరాశి వద్ద అలసట తీర్చుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత కోత పని ముగిసిన వెంటనే అందరూ విశ్రాంతి తీసుకోవడానికి అనువైన స్థలాలకు వెళ్ళిపోయారు. బోయజు సంతృప్తితో, ఒక వస్త్రం కప్పుకొని నిద్రలోకి జారుకున్నాడు.
రహస్యమైన కలయిక
అర్థరాత్రి బోయజు చలికి వణకుతూ నిద్ర లేచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎవరో కావాలనే ఆయన కాళ్ళపైనుండి వస్త్రాన్ని తొలగించారు అంతేకాదు ఆయన కాళ్ళ దగ్గర ఎవరో పడుకొని ఉన్నారు! చీకటిలో ఆ వ్యక్తిని గుర్తుపట్టలేక ‘నువ్వు ఎవరు?’ అని ఆయన అడిగాడు. “నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు[ము]” అని ఒక స్త్రీ స్వరం సమాధానమిచ్చింది.—రూతు 3:1-9.
ఆ చీకటిలో వారిద్దరూ మాట్లాడుకున్నారు. స్త్రీలు ఈ విధంగా కళ్ళానికి వెళ్ళరు. (రూతు 3:14) అయినప్పటికీ బోయజు కోరిక మేరకు రూతు ఆయన కాళ్ళ దగ్గరే పడుకొని, నిరాధారమైన విమర్శకు తావివ్వకుండా ఉండడానికి తెల్లవారక ముందే లేచి వెళ్ళిపోయింది.
వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి కలుసుకున్నారా? వయసులో పెద్దవాడైన ఈ ధనికుడిని, అన్య దేశమునుండి వచ్చిన పేద యౌవన విధవరాలైన రూతు తెలివిగా బుట్టలో వేసుకుందా? లేక రూతు పరిస్థితులను, ఆ రాత్రి ఆమె ఒంటరితనాన్ని బోయజు తన స్వలాభానికి వాడుకుంటున్నాడా? లేదు, నిజానికి అక్కడ జరిగింది విశ్వసనీయతకు, దేవునిపై ప్రేమకు చక్కని ఉదాహరణ. వాస్తవాలన్నీ హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
కానీ రూతు ఎవరు? ఆమె ఉద్దేశం ఏమిటి? సంపన్నుడైన ఈ బోయజు ఎవరు?
‘యోగ్యురాలు’
ఈ సంఘటనలు జరగడానికి ఎన్నో సంవత్సరాల ముందు యూదాలో కరువు ఏర్పడింది. నలుగురు సభ్యులున్న ఇశ్రాయేలీయుల కుటుంబం—ఎలీమెలెకు; ఆయన భార్య నయోమి; ఇద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను—సారవంతమైన మోయాబు దేశానికి వలస వెళ్ళింది. ఆ కుమారులు ఇద్దరు మోయాబు స్త్రీలను అంటే రూతును, ఓర్పాను పెళ్ళి చేసుకున్నారు. మోయాబులో ఆ తండ్రి కుమారులు చనిపోయారు. కొంతకాలానికి ఇశ్రాయేలులోని పరిస్థితులు మెరుగుపడ్డాయని అత్తాకోడళ్ళకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు విధవరాలిగా పిల్లలు గానీ మనుమలు గానీ లేక బాధతోవున్న నయోమి తన స్వదేశానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంది.—రూతు 1:1-14.
ఇశ్రాయేలుకు వెళ్ళే దారిలో, తన సొంత ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళిపొమ్మని నయోమి ఓర్పాను ఒప్పించింది. ఆ తర్వాత నయోమి రూతుతో, “ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్లు” అని చెప్పింది. అయితే రూతు “నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు—నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను . . . నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు; నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను” అని చెప్పింది. (రూతు 1:15-17) కాబట్టి ఏ ఆధారమూ లేని ఆ ఇద్దరు విధవరాండ్రు బేత్లెహేముకు తిరిగి వచ్చారు. రూతు తన అత్తగారిపై చూపిన ప్రేమ, శ్రద్ధ అక్కడి పొరుగువారిని ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆమె నయోమికి ‘యేడుగురు కుమారులకంటే ఎక్కువగా’ ఉందని వారు పరిగణించారు. ఇతరులు ఆమెను “యోగ్యురా[లు]” అని వర్ణించారు.—రూతు 3:11; 4:15.
బేత్లెహేములో యవల కోతకాలం ప్రారంభమయినప్పుడు రూతు నయోమితో “నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందు[ను]” అని అడిగింది.—రూతు 2:2.
అనుకోకుండా ఆమె తన మామగారు ఎలీమెలెకు బంధువైన బోయజు పొలానికి వచ్చింది. అక్కడి పనిని పర్యవేక్షించే వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆమె పరిగె ఏరుకోవడానికి అనుమతి కోరుతుంది. పరిగె ఏరుకోవడంలో ఆమె చూపిన ఓర్పు గమనార్హమైనది, ఆమె శ్రమించే స్వభావం గురించి ఆ వ్యక్తి బోయజు ఎదుట ప్రశంసిస్తాడు.—రూతు 1:22-2:7.
రక్షకుడు, పోషకుడు
బోయజు యెహోవాను యథార్థంగా ఆరాధించే వ్యక్తి. ప్రతి ఉదయం బోయజు తన కోత పనివారిని “యెహోవా మీకు తోడై యుండునుగాక” అని పలకరించినప్పుడు వారు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక” అని సమాధానమిస్తారు. (రూతు 2:4) పని చేయడంలో రూతు ప్రదర్శించిన ఓర్పునూ శ్రమించే స్వభావాన్నీ గమనించి, ఆమె నయోమిపట్ల చూపిన విశ్వసనీయత గురించి తెలుసుకున్న బోయజు రూతు పరిగె ఏరుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఆమెతో ‘[నీవు నా పొలాల్లోనే పరిగె ఏరుకో; వేరేవాళ్ళ పొలాలకు వెళ్ళవలసిన అవసరం లేదు.] నా పనికత్తెలవద్ద నిలకడగా ఉండు; [వారితో ఉంటే నువ్వు సురక్షితంగా ఉంటావు.] నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు నేను ఆజ్ఞాపించాను. నీకు దాహమేస్తే [వాళ్ళు నీ కోసం నీళ్లు చేదుతారు]’ అని చెప్పాడు.—రూతు 2:8, 9.
రూతు సాగిలపడి ‘ఏమి తెలిసి పరదేశినైన నాయందు నీకు కటాక్షము కలిగెను?’ అని అడిగింది. ‘నీ భర్త మరణించిన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసింది. నీవు నీ తలిదండ్రులను, [బంధువులను,] జన్మభూమిని విడిచి యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చావు. యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిస్తాడు; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిస్తాడు’ అని బోయజు సమాధానమిచ్చాడు.—రూతు 2:10-12.
బోయజు ఆమె ప్రేమను పొందడానికేమీ ప్రయత్నించడం లేదు. ఆయన ఆమెను యథార్థంగానే ప్రశంసించాడు. రూతు ఆయన ఇచ్చిన ఓదార్పుకరమైన హామీకి యథార్థవంతమైన వినయంతో కృతజ్ఞతలు చెప్పింది. ఆ మంచితనాన్ని పొందడానికి తాను అనర్హురాలినని ఎంచి ఇంకా కష్టించి పని చేయడంలో కొనసాగింది. ఆ తర్వాత, భోజన సమయంలో బోయజు ‘నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తిను’ అని రూతును పిలిచాడు. ఆమె తృప్తిగా తిని మిగిలిన ఆహారాన్ని నయోమి కోసం ఇంటికి తీసుకువెళ్ళడానికి తీసిపెట్టుకుంటుంది.—రూతు 2:14.
సాయంకాలం అయ్యేసరికి రూతు దాదాపు తూమెడు యవలను ఏరుకుంది. ఆమె యవలను, మిగిలిన ఆహారాన్ని ఇంట్లో ఉన్న నయోమి కోసం తీసుకువెళుతుంది. (రూతు 2:15-18) సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని చూసి, “నేడు నీవెక్కడ ఏరుకొంటివి? . . . నీయందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక” అని నయోమి అన్నది. రూతు బోయజు పొలంలో పరిగె ఏరుకొందని తెలుసుకొన్న నయోమి “బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక . . . ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒక[డు]” అని చెప్పింది.—రూతు 2:19, 20.
“విశ్రాంతి” ఏర్పాటు చేయడం
తన కోడలు కోసం “విశ్రాంతి”ని లేక గృహాన్ని ఏర్పాటు చేయడం కోసం దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా తమను విడిపించమని కోరేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి నయోమి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంది. (లేవీయకాండము 25:25; ద్వితీయోపదేశకాండము 25:5, 6) ఇప్పుడు నయోమి బోయజు అవధానాన్ని ఆకట్టుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన, నాటకీయమైన పనిని ఎలా చేయాలో రూతుకు ఉపదేశించింది. మంచి ఉపదేశముతో సిద్ధపడి రూతు రాత్రిపూట చీకటిలో బోయజు కళ్లముకు వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఆయన నిద్రపోతున్నాడు. ఆమె ఆయన పాదాలపై ఉన్న వస్త్రాన్ని పక్కకు తొలగించి ఆయనకు మెలకువ వచ్చేంతవరకూ వేచివుంది.—రూతు 3:1-7.
చివరకు బోయజుకు మెలకువ వచ్చినప్పుడు, రూతు చేసిన సూచనార్థక చర్య, ‘నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుము’ అనే ఆమె కోరిక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడిందనడంలో సందేహం లేదు. రూతు చేసిన పని, వయసులో పెద్దవాడైన ఆ యూదుడికి వారిని విడిపించవలసిన వ్యక్తిగా తన బాధ్యతను గుర్తుచేసింది, ఎందుకంటే ఆయన రూతు భర్త మహ్లోను బంధువు.—రూతు 3:9.
రూతు రాత్రివేళలో వస్తుందని ఆయన ఊహించలేదు. అయితే విడిపించమని రూతు కోరడం ఊహించనిది కాదని బోయజు ఆ కోరికకు ప్రతిస్పందించిన విధానం సూచిస్తోంది. బోయజు రూతు కోరిక మేరకు చర్య తీసుకోవడానికి ఇష్టపడ్డాడు.
రూతు ఆయనతో మాట్లాడినప్పుడు ఆమె స్వరంలో కొంచెం భయం ధ్వనించివుండవచ్చు అందుకే బోయజు ఆమెకు ఇలా హామీ ఇచ్చాడు: “నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.”—రూతు 3:11.
బోయజు రూతు చర్యలను సంపూర్ణంగా నీతిమంతమైనవిగా పరిగణించాడని ఆయన అన్న ఈ మాటల ద్వారా స్పష్టమౌతోంది: “నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; . . . నీ మునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.” (రూతు 3:10) మొదటి సందర్భంలో రూతు నయోమిపట్ల ప్రేమపూర్వక దయను లేదా విశ్వసనీయమైన ప్రేమను ప్రదర్శించింది. చివరి సందర్భంలో ఆమె తనకంటే ఎంతో పెద్దవాడైన బోయజు దగ్గరకు వెళ్ళి తనను విడిపించమని నిస్వార్థంగా అడిగింది. ఆమె, చనిపోయిన తన భర్త మహ్లోను కోసం, నయోమి కోసం వంశాన్ని కొనసాగించడానికి పిల్లలను కనేందుకు ఇష్టపడింది.
విడుదల చేసే వ్యక్తి వెనుకంజ వేయడం
ఆ తర్వాతి రోజు, నయోమికి తనకంటే దగ్గరి బంధువును, “ఓయి” అని ప్రస్తావించబడిన వ్యక్తిని బోయజు పిలిచాడు. ‘నయోమి [భర్త] ఎలీమెలెకునకు కలిగిన భూభాగాన్ని [ఆమె అమ్మాలి కాబట్టి దాన్ని విడిపించే హక్కు నీకుందని తెలియజేయాలనుకున్నాను]’ అని బోయజు ఆ ఊరి నివాసుల ఎదుట, పెద్దల ఎదుట ఆ బంధువుతో చెప్పాడు. ‘[నువ్వు దాని విడిపిస్తావా? లేకపోతే నేను విడిపిస్తాను]’ అని బోయజు అడిగాడు. తాను విడిపిస్తానని ఆ వ్యక్తి చెప్పాడు.—రూతు 4:1-4.
కానీ ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగించే విషయమొకటుంది! “నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలె[ను]” అని బోయజు సాక్షులందరి ముందు ఆ వ్యక్తికి చెప్పాడు. ఆ బంధువు తన స్వాస్థ్యాన్ని పొగొట్టుకుంటాననే భయంతో, “నేను దాని విడిపింపలేను” అని తన హక్కును వదులుకున్నాడు.—రూతు 4:5, 6.
సాంప్రదాయం ప్రకారం, విడిపించడానికి నిరాకరించే వ్యక్తి తన చెప్పు తీసి తన పొరుగువాడికి ఇవ్వాలి. కాబట్టి, విడిపించవలసిన ఆ వ్యక్తి “నీవే దానిని సంపాదించుకొను[ము]” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు. అప్పుడు బోయజు, “ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులైయున్నారు. మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు . . . నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై యున్నా[రు]” అని పెద్దలతో ప్రజలందరితో చెప్పాడు.—రూతు 4:7-10.
అప్పుడు పురద్వారము దగ్గర ఉన్న ప్రజలందరూ, “యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలినదానిగాను చేయును గాక; ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక” అని బోయజుతో అన్నారు.—రూతు 4:11, 12.
ప్రజల ఆశీస్సులతో బోయజు రూతును వివాహం చేసుకొన్నాడు. ఆమె ఓబేదు అనే కుమారుణ్ణి కంటుంది, అలా రూతు బోయజులు, దావీదు రాజుకు చివరికి యేసుక్రీస్తుకు పూర్వికులయ్యారు.—రూతు 4:13-17; మత్తయి 1:5, 6, 16.
‘సంపూర్ణమైన బహుమానము’
ఈ వృత్తాంతమంతటిలో, తన పనివారిని దయాపూర్వకంగా పలకరించడం దగ్గర నుండి ఎలీమెలెకు వంశాన్ని కాపాడడం వరకూ బోయజు తాను ఒక అసాధారణమైన వ్యక్తినని—వెంటనే చర్య తీసుకునే అధికారంగల వ్యక్తినని—రుజువు చేసుకున్నాడు. అదే సమయంలో ఆయన ఆశానిగ్రహము, విశ్వాసం, యథార్థత గల వ్యక్తి. అంతేకాకుండా బోయజు ఉదార స్వభావం, దయ, నైతిక పరిశుభ్రత, యెహోవా ఆజ్ఞలకు పూర్తి విధేయత చూపించే వ్యక్తి.
రూతు యెహోవాపట్ల ఉన్న ప్రేమకు, నయోమిపట్ల ఉన్న విశ్వసనీయమైన ప్రేమకు, శ్రమించి పనిచేయడానికి, నమ్రతకు చక్కని మాదిరి. ప్రజలు ఆమెను ‘యోగ్యురాలిగా’ పరిగణించడంలో ఆశ్చర్యంలేదు. “పనిచేయకుండ ఆమె భోజనము చేయదు,” ఆమె కష్టపడి పనిచేయడం వల్ల ఎంతో అవసరంలో ఉన్న తన అత్తగారిని పోషించగలిగింది. (సామెతలు 31:27, 31) నయోమి తరఫున బాధ్యతను స్వీకరించినప్పుడు, ఇతరులకు ఇవ్వడంలోని ఆనందాన్ని రూతు చవిచూసివుండవచ్చు.—అపొస్తలుల కార్యములు 20:35; 1 తిమోతి 5:4, 8.
రూతు పుస్తకంలో ఎంతటి అద్భుతమైన మాదిరులు ఉన్నాయో కదా! నయోమిని యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. రూతుకు యేసుక్రీస్తు పూర్వికురాలిగా ‘సంపూర్ణమైన బహుమానం’ లభించింది. బోయజు ‘యోగ్యురాలైన’ భార్యతో ఆశీర్వదించబడ్డాడు. మన విషయానికొస్తే, ఇలాంటి వ్యక్తుల విశ్వాసం మనకు మాదిరికరం.
[26వ పేజీలోని బాక్సు]
ఆశాకిరణం
మీరు అసంతోషకరమైన కాలాల్లో జీవిస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, రూతు కథ మీకు ఆశాకిరణంగా ఉంటుంది. అది న్యాయాధిపతుల పుస్తకానికి ప్రముఖమైన ఉపసంహారంగా అవధానాన్ని ఆకర్షిస్తుంది. పరదేశమైన మోయాబునుండి వచ్చిన వినయస్థురాలైన ఒక విధవరాలిని యెహోవా తన ప్రజల కోసం రాజును ఉత్పన్నం చేయడానికి ఎలా ఉపయోగించుకున్నాడో రూతు పుస్తకం మనకు తెలియజేస్తుంది. న్యాయాధిపతుల పుస్తకం నేపథ్యంలో రూతు విశ్వాసం ఆ శకంలో వెలుగులా ప్రకాశిస్తుంది.
పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రజల గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటాడని, తన సంకల్పాలను నెరవేరుస్తాడని రూతు కథ చదవడం ద్వారా మనకు హామీ లభిస్తుంది.