కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w00 10/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవము, రక్తము—మీరు వాటిని పవిత్రముగా చూస్తారా?
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • రక్తము—జీవాధారము
    రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
w00 10/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

రక్తాన్ని సరిగ్గా ఉపయోగించే విషయాన్ని గురించిన బైబిలు ఆజ్ఞల దృష్ట్యా ఒకరి స్వంత రక్తాన్ని ఉపయోగించే విషయంలోని వైద్య ప్రక్రియలను యెహోవాసాక్షులు ఎలా దృష్టిస్తారు?

వ్యక్తిగత ఇష్టాయిష్టాలపైనో లేక కొన్ని వైద్య సిఫారసులపైనో ఆధారపడి నిర్ణయాల్ని తీసుకోవడానికి బదులు బైబిలు ఏమి చెప్తుందన్నదాన్ని ప్రతి క్రైస్తవుడు గంభీరంగా పరిశీలించాలి. అది ఆయనకు యెహోవాకు మధ్యనున్న విషయం.

మన జీవితాల్ని మనం ఎవరికైతే ఋణపడివున్నామో ఆ యెహోవా, రక్తాన్ని దుర్వినియోగం చేయకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. (ఆదికాండము 9:3, 4) ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, దేవుడు రక్తాన్ని ఉపయోగించడంలో కొన్ని పరిమితులను ఏర్పర్చాడు, ఎందుకంటే అది జీవానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయనిలా ఆజ్ఞాపించాడు: “రక్తము దేహమునకు ప్రాణము [లేదా జీవము]. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని.” ఒక మనిషి ఆహారం కోసం ఒక జంతువును చంపితే అప్పుడేమిటి? దేవుడిలా అన్నాడు: “దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను.”a (లేవీయకాండము 17:11, 13) యెహోవా ఈ ఆజ్ఞను వారికి కొన్నిసార్లు గుర్తుచేశాడు. (ద్వితీయోపదేశకాండము 12:16, 24; 15:22) యూదా మతానికి చెందిన గ్రంథమైన సాన్సినో కూమాష్‌ ఇలా పేర్కొంటుంది: “రక్తాన్ని నిలవ ఉంచకూడదు, బదులుగా దాన్ని నేలమీద ఒలికించడం ద్వారా దాన్ని తినడానికి అయోగ్యం చేయాలి.” ఏ ఇశ్రాయేలీయుడూ మరో ప్రాణికి చెందిన రక్తాన్ని తీసుకోవడం గానీ, నిలవ చేసుకోవడం గానీ, ఉపయోగించడం గానీ కుదరదు, ఆ ప్రాణి జీవం దేవునికే చెందుతుంది.”

మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన బాధ్యత మెస్సీయా చనిపోయినప్పుడు అంతమైంది. అయినా, రక్త పవిత్రతపట్ల దేవుని దృక్కోణం అలాగే వుంది. దేవుని పరిశుద్ధాత్మచే పురికొల్పబడి అపొస్తలులు ‘రక్తాన్ని విసర్జించండి’ అని క్రైస్తవులకు నిర్దేశించారు. ఆ ఆజ్ఞను తేలిగ్గా తీసుకోకూడదు. లైంగిక అనైతికతను లేదా విగ్రహారాధనను విసర్జించాల్సిన నైతిక బాధ్యత ఎంత ఉందో రక్తాన్ని విసర్జించడం విషయంలోనూ అంతే నైతిక బాధ్యత ఉంది. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 21:25) 20వ శతాబ్దంలో రక్తాన్ని దానం చేయడమూ మార్పిడి చేయడమూ సర్వసాధారణమైనప్పుడు యెహోవాసాక్షులు ఈ పనులు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నట్లు గ్రహించారు.b

కొన్నిసార్లు, రోగి తన రక్తాన్ని శస్త్రచికిత్సకు కొన్ని వారాల ముందు నిలవ ఉంచుకోమని (ప్రీ-ఆపరేటివ్‌ ఆటోలోగస్‌ బ్లడ్‌ డొనేషన్‌, లేదా పిఎడి) వైద్యుడు ఒత్తిడిచేస్తాడు, తద్వారా అవసరమైనట్లైతే ఆయన ఆ రక్తాన్ని ఆ రోగికి తిరిగి ఎక్కిస్తాడు. అయితే, రక్తాన్ని అలా సేకరించడం, నిలవ ఉంచడం, మార్పిడి చేయడం అనేవి లేవీయకాండము, ద్వితీయోపదేశకాండము పుస్తకాల్లో చెప్పబడిన దానికి పూర్తి విరుద్ధం. రక్తాన్ని నిలవ ఉంచుకోకూడదు; దాన్ని ఒలకబోయాలి—⁠ఒక భావంలో చెప్పాలంటే, దేవునికి తిరిగి ఇచ్చేయాలి. నిజమే, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం అమల్లో లేదు. అయినప్పటికీ, దేవుడు దాని వెనుక ఉంచిన సూత్రాలను యెహోవాసాక్షులు గౌరవిస్తారు, వారు ‘రక్తాన్ని విసర్జించాలని’ స్థిరనిశ్చయంతో ఉన్నారు. అందుకని, మేము రక్తాన్ని దానం చేయము, ‘ఒలక బోయాల్సిన’ రక్తాన్ని మార్పిడీ నిమిత్తం నిలవచేసుకోము. అటువంటి మార్పిడులు దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తాయి.

ఒక వ్యక్తి రక్తం ఇమిడివున్న ఇతర ప్రక్రియలు లేదా పరీక్షలు దేవుడిచ్చిన సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఏమీలేవు. ఉదాహరణకు, అనేకమంది క్రైస్తవులు తమ రక్తంలో కొంత, పరీక్షల కోసం లేదా విశ్లేషణ కోసం తీయడానికి అనుమతించారు, తీసిన ఆ రక్త శాంపిళ్ళు తర్వాత పడేయడం జరిగింది. ఇతర సంక్లిష్టమైన ప్రక్రియలను కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు.

ఉదాహరణకు, కొన్ని శస్త్రచికిత్స ప్రక్రియల్లో కొంత రక్తాన్ని శరీరం నుండి దారిమళ్ళిస్తారు. దీన్ని హెమోడైల్యూషన్‌ అంటారు. ఈ ప్రక్రియలో, రోగి శరీరంలో మిగిలి ఉన్న రక్తాన్ని పల్చన చేస్తారు. తర్వాత, శరీరం నుండి బయటకు వెళ్ళిన ఆయన రక్తాన్ని తిరిగి లోపలికి రప్పిస్తారు, తద్వారా బ్లడ్‌ కౌంట్‌ దాదాపు నార్మల్‌ అవుతుంది. అదే విధంగా, గాయం తగిలినప్పుడు అక్కడినుంచి స్రవించే రక్తాన్ని పట్టుకుని, ఎర్ర కణాలు తిరిగి రోగిలోనికి ప్రవేశపెట్టగల్గేలా దాన్ని ఫిల్టర్‌ చేస్తారు; దీన్ని సెల్‌ సాల్వేజ్‌ అంటారు. మరో ప్రక్రియలో, రక్తాన్ని ఒక యంత్రంలోకి పంపిస్తారు, ఆ యంత్రం మామూలుగానైతే శరీర భాగాలు (ఉదాహరణకు, గుండె, ఊపిరితిత్తులు, లేదా మూత్రపిండాలు) చేసే పనుల్ని తాత్కాలికంగా చేపడుతుంది. తర్వాత రక్తాన్ని ఆ యంత్రం నుండి తిరిగి రోగిలోకి ప్రవేశపెడ్తారు. మరితర ప్రక్రియల్లో, రక్తాన్ని ఒక సెపరేటర్‌ (సెంట్రీఫ్యూజ్‌)లోకి ప్రవేశపెడ్తారు, అక్కడ రక్తంలో పాడైపోయిన విభాగాల్ని తీసేయడం జరుగుతుంది. లేదా, రక్తంలోని విభాగాల్లో కొంత మొత్తాన్ని వేరుచేసి, దాన్ని శరీరంలోని మరో చోట అప్లై చేయవచ్చు. మరికొన్ని పరీక్షల్లో భాగంగా, కొంత రక్తాన్ని మందుతో జతచేయడమో లేదా కలపడమో చేసి, తిరిగి దాన్ని రోగిలోకి ప్రవేశపెడ్తారు.

విధానాలు వేర్వేరుగా ఉండవచ్చు, అలాగే కొత్త ప్రక్రియలు, చికిత్సలు, పరీక్షలు వస్తూనే ఉంటాయి. ప్రతి విధానాన్ని విశ్లేషించి ఒక నిర్ణయాన్ని చేయడం మా పరిధిలోనిది కాదు. ఒక క్రైస్తవుడు శస్త్రచికిత్స, వైద్య పరీక్ష, లేదా ప్రస్తుత చికిత్స సమయాల్లో తన రక్తాన్ని ఎలా ఉపయోగిస్తారన్నది తానుగా నిర్ణయించుకోవాలి. చాలా సమయం ముందే ఆయన వైద్యుడి నుంచి గాని లేదా టెక్నీషియన్‌ నుంచి గాని ఫలాని ప్రక్రియలో తన రక్తాన్ని ఏమి చేస్తారన్నదాని గురించిన వాస్తవాల్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆయన తన మనస్సాక్షి అనుమతించేదాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. (బాక్సు చూడండి.)

క్రైస్తవులు దేవునికి తాము చేసుకున్న సమర్పణనూ, అలాగే ‘పూర్ణహృదయముతోను, పూర్ణమనస్సుతోను, పూర్ణశక్తితోను, పూర్ణవివేకముతోను ఆయన్ను ప్రేమించాలన్న’ తమ బాధ్యతను మనస్సులో ఉంచుకోవాలి. (లూకా 10:27) లోకంలోని అనేకమందికి భిన్నంగా, యెహోవాసాక్షులు దేవునితో తమకు గల మంచి సంబంధాన్ని ఎంతో అమూల్యంగా ఎంచుతారు. యేసు ధారపోసిన రక్తంలో నమ్మకం ఉంచమని జీవదాత మనందరినీ పురికొల్పుతున్నాడు. మనమిలా చదువుతాము: “[యేసుక్రీస్తు] రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.”—ఎఫెసీయులు 1:7.

[అధస్సూచీలు]

a ప్రొఫెసర్‌ ఫ్రాంక్‌ హెచ్‌. గోర్మన్‌ ఇలా వ్రాస్తున్నాడు: “రక్తాన్ని ఒలక పోయడం అనేది గౌరవసూచకమైన క్రియ అని అర్థం చేసుకోవచ్చు. అలాగే అది ఆ జంతువు జీవంపట్లా తద్వారా దాన్ని సృష్టించి పోషిస్తున్న దేవునిపట్లా గౌరవాన్ని ప్రదర్శిస్తుంది.”

b కావలికోట (ఆంగ్లం) జూలై 1, 1951, దానం చేయబడిన రక్తాన్ని మార్పిడి చేసుకోవడం ఎందుకు యుక్తం కాదో చూపిస్తూ, ఈ విషయాన్ని గురించిన కీలకమైన ప్రశ్నలకు జవాబులనిచ్చింది.

[31వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవల్సినవి

కొంత రక్తాన్ని శరీరం నుండి బయటికి మళ్ళిస్తున్నట్లైతే, ఆ ప్రవాహానికి కొంతసేపు ఆపినట్లైతే, ఆ రక్తాన్ని ‘నేలపై ఒలక బోయాల్సిన’ అవసరం లేకుండా అది నా శరీరంలో భాగంగానే ఉన్నట్లు దృష్టించడానికి నా మనస్సాక్షి నన్ను అనుమతిస్తుందా?

ఏదైనా రోగనిర్ధారణ లేదా చికిత్సా ప్రక్రియల్లో నా రక్తాన్ని తీసి, దానికి మార్పులు చేసి, తిరిగి నా శరీరంలోనికి పంపించినప్పుడు (లేదా శరీరంపైన ఉంచినప్పుడు) బైబిలుచే శిక్షణ పొందిన నా మనస్సాక్షి నన్ను కలవరపెడుతుందా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి