పనినీ, విరామాన్నీ సమతుల్యంగా ఉంచుకోవడం
“విరామం అనేది ఒక అందమైన వస్త్రం, కాని అది ప్రతిరోజు వేసుకోవడానికి పనికిరాదు.” ఈ మాటలతో, ఒక అజ్ఞాత రచయిత, విరామ విలువను సరిగ్గా పోలుస్తున్నాడు. అయితే, దాన్ని ప్రయోజనకరమైన కార్యకలాపంతో సమతూకం చేయవలసి ఉందని అతడు చూపిస్తున్నాడు.
ప్రేరేపిత రచయితైన సొలొమోను కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జ్ఞానవంతుడైన ఈ రాజు, నివారించవలసిన రెండు రకాలైన విపరీతాలను గుర్తించాడు. మొదటగా, ఆయనిలా పేర్కొన్నాడు: “బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును.” (ప్రసంగి 4:5) అవును, బద్దకం బీదరికాన్ని తీసుకురాగలదు. తత్ఫలితంగా, అది సోమరివాని ఆరోగ్యాన్ని, చివరికి జీవితాన్ని ప్రమాదంలో పడవేయగలదు. మరో వైపున, కష్టపడి పని చేయడానికి సమస్తాన్నీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యేవారు కూడా ఉన్నారు. వారి నిర్విరామ శ్రమను, ‘వ్యర్థముగా గాలిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నములు’ అని సొలొమోను వర్ణించాడు.—ప్రసంగి 4:4.
మంచి కారణంతోనే, సొలొమోను సమతూకాన్ని సిఫారసు చేశాడు: “శ్రమయును గాలికైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు.” (ప్రసంగి 4:6) ఒక వ్యక్తి తన ‘కష్టార్జితముచేత సుఖపడాలి,’ అంటే తాను సంపాదించుకున్నదాన్ని ఆనందించడానికి అతడు అప్పుడప్పుడూ సమయం తీసుకోవాలి. (ప్రసంగి 2:24) లౌకిక పని మాత్రమే కాక జీవితంలో మరితర విషయాలు కూడా ఉండాలి. మన సమయంలో కొంత మన కుటుంబం కోసం వెచ్చించడం సబబు. మన ప్రాథమిక బాధ్యత లౌకిక పని కాదు గాని దేవుని సేవ చేయడమని సొలొమోను నొక్కి తెలియజేశాడు. (ప్రసంగి 12:13) పని గురించి సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండేవారిలో మీరూ ఒకరా?