ఔదార్యం అంచులు దాటినప్పుడు
ఒక రాజుకు ఏదైనా కానుక ఇచ్చే అవకాశం మీకు లభించిందనుకోండి, మీరు ఆయనకేమిస్తారు? అతడు ఒకవేళ ప్రపంచంలోకెల్లా సంపన్నుడైన, జ్ఞానవంతుడైన పరిపాలకుడనుకోండి అప్పుడు? ఆయనకు ఏ కానుక ప్రీతిపాత్రమైనది కాగలదో మీరూహించగలరా? దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం, సరిగ్గా అలాంటి పరిపాలకుడే అయిన ఇశ్రాయేలు రాజైన సొలొమోనును దర్శించడానికి సిద్ధమౌతూ, షేబ రాణి అలాంటి ప్రశ్నల గురించే ఆలోచించాల్సి వచ్చింది.
ఆమె ఇచ్చిన బహుమతి 240 మణుగుల బంగారంతోపాటు, ‘బహు విస్తారమైన గంధవర్గము, రత్నములు’ అని బైబిలు చెబుతుంది. నేటి ధరల ప్రకారం, ఆ బంగారం విలువే దాదాపు 4,00,00,000 అమెరికా డాలర్లు ఉంటుంది. సుగంధభరితమైన, రోగచికిత్స చేసే గుణాలుగల గంధవర్గము అమూల్యమైన వస్తువుగా బంగారంతోపాటు లెక్కించబడుతుంది. రాణి సొలొమోనుకు ఎంత గంధవర్గాన్ని ఇచ్చిందో బైబిలు చెప్పకపోయినప్పటికీ, ఆమె ఇచ్చిన కానుకకు ఎవ్వరూ సరితూగలేదని మాత్రం బైబిలు చెబుతుంది.—1 రాజులు 10:10.
షేబ రాణి ఎంతో సంపన్నురాలు, ఉదార స్వభావురాలు అని స్పష్టమౌతుంది. అంతేగాక, ఆమె ఉదార స్వభావానికి తగినట్లుగానే ఆమెకు ప్రతిఫలం లభించింది. “షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను” అని బైబిలు చెబుతుంది. (ఇటాలిక్కులు మావి.) (2 దినవృత్తాంతములు 9:12) నిజమే, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవడం రాచరికాచారమే అయ్యుండవచ్చు; అయినప్పటికీ, బైబిలు సొలొమోను “ఔదార్యాన్ని” ప్రత్యేకంగా తెలియజేస్తుంది. (1 రాజులు 10:13, NW) సొలొమోను తానే స్వయంగా ఇలా వ్రాశాడు: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”—సామెతలు 11:25.
షేబ రాణి సొలొమోనును దర్శించడానికి వస్తూ తను వెచ్చించిన సమయం దృష్ట్యా, చేసిన కృషి దృష్ట్యా ఎంతో గొప్ప త్యాగం చేసింది. షేబ స్పష్టంగా ప్రస్తుతదిన రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ ప్రాంతంలో ఉంది; కాబట్టి ఆమె తన ఒంటెల దండుతోపాటు యెరూషలేముకు చేరుకోవడానికి దాదాపు 1,600 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించింది. యేసు చెప్పినట్లుగా, ఆమె “భూమ్యంతములనుండి” వచ్చింది. షేబ రాణి ఎందుకంత శ్రమ తీసుకుంది? ఆమె ప్రాముఖ్యంగా, “సొలొమోను జ్ఞానము వినుటకు” వచ్చింది.—లూకా 11:31.
షేబ రాణి “గూఢార్థముగల మాటలచేత [సొలొమోనును] శోధించుటకై” వచ్చిందనీ, “[ఆమె] తనకు తోచినదానినంతటినిబట్టి అతనితో” మాట్లాడిందనీ 1 రాజులు 10:1, 2 వచనాలు చెప్తున్నాయి. సొలొమోను ఎలా ప్రతిస్పందించాడు? “ఆమె వేసిన ప్రశ్నలన్నిటికి సొలొమోను ప్రత్యుత్తరము నిచ్చెను; రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసినవాటన్నిటి భావము చెప్పెను.”—1 రాజులు 10:3.
ఆమె తాను విన్నదాన్నిబట్టి, చూసినదాన్నిబట్టి ఆశ్చర్యపోయి, వినమ్రంగా ఇలా సమాధానమిచ్చింది: “నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులును భాగ్యవంతులు”! (1 రాజులు 10:4-8) సొలొమోను సేవకులు సకలైశ్వర్యాల మధ్యన ఉన్నప్పటికీ, ఆమె వారిని అందు గురించి భాగ్యవంతులని అనలేదు. బదులుగా, సొలొమోనుకు దేవుడనుగ్రహించిన జ్ఞానాన్ని ఆయన సేవకులు ఎల్లవేళలా వినగలరు గనుక వాళ్లు భాగ్యవంతులు. స్వయంగా సృష్టికర్త జ్ఞానములోను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు జ్ఞానములోను సేదదీరుతూ ఉండే నేటి యెహోవా ప్రజలకు షేబ రాణి ఎంత చక్కని ఉదాహరణ!
సొలొమోనుతో రాణి అన్న తర్వాతి మాటలు కూడా గమనించదగినవే: “నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.” (1 రాజులు 10:9) సొలొమోను జ్ఞానసంపదల వెనుక యెహోవా హస్తం ఉందని ఆమె గ్రహించినట్లు స్పష్టమౌతుంది. యెహోవా మునుపు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దానితో ఇది పొందిక కల్గివుంది. ఆయనిలా చెప్పాడు: “ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి—నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు.”—ద్వితీయోపదేశకాండము 4:5-7.
జ్ఞానదాతను సమీపించడం
ఆధునిక కాలాల్లో, లక్షలాదిమంది యెహోవా సంస్థవైపుకు ఆకర్షించబడుతున్నారు ఎందుకంటే, “దేవుని ఇశ్రాయేలు” “జ్ఞానవివేచనలు గల జనమని” వాళ్లు గ్రహించారు. ఈ జ్ఞానవివేచనలు సహజంగానే రాలేదుగానీ, దేవుని పరిపూర్ణమైన కట్టడలు, సూత్రాలు వారిని నడిపిస్తున్నందుకే వారికవి లభించాయి. (గలతీయులు 6:16) ఇటీవలి సంవత్సరాల్లో లక్షలాదిమంది క్రొత్త శిష్యులు ప్రతి సంవత్సరం, “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని” ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో చెప్తున్నారని బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్యలు చూపుతున్నాయి. (జెకర్యా 8:23) యెహోవా తన సేవకుల ఎదుట ఉంచిన ఆధ్యాత్మిక విందు భోజనాన్ని చూసి ఈ క్రొత్తవారు ఎంతగా ఆశ్చర్యపోతున్నారో కదా! వాళ్లు తమ పూర్వపు మతాల్లో ఇలాంటిదేదీ కనీ వినీ ఎరుగరు.—యెషయా 25:6.
మహా దాతకు ఇవ్వడం
ఇంతగా పొందిన, కృతజ్ఞతా భావంగల వారు మహాగొప్ప రాజూ, దాతా అయిన యెహోవా దేవునికి తాము తిరిగి ఏమివ్వగలమా అని ఆలోచించడం సహజమే. యెహోవాకు మనమివ్వగల అతి శ్రేష్ఠమైన కానుక “స్తుతియాగము” అని బైబిలు తెలియజేస్తుంది. (హెబ్రీయులు 13:15) ఎందుకు? ఎందుకంటే ఈ యాగము జీవరక్షక పనితో సూటిగా సంబంధం కల్గివుంది, ఇదే ఈ అంత్యకాలంలో యెహోవాకు ఎంతో ఆసక్తిగల విషయమైయుంది. (యెహెజ్కేలు 18:23) అంతేగాక, రోగులకు, కృంగినవారికి, ఇతరులకు తమ శక్తిని, సమయాన్ని ఇవ్వడం కూడా అంగీకారయుక్తమైన యాగమే.—1 థెస్సలొనీకయులు 5:14; హెబ్రీయులు 13:16; యాకోబు 1:27.
ఆర్థికపరమైన మద్దతు కీలక పాత్రను వహిస్తుంది. అది బైబిళ్లను, బైబిలు ఆధారిత సాహిత్యాన్ని ఉత్పత్తి చేసేందుకూ, క్రైస్తవులు సమకూడగల స్థలాలను సంపాదించేందుకూ దోహదపడుతుంది. (హెబ్రీయులు 10:24, 25) ఆ విరాళాలు, యుద్ధ పీడితులకు, ప్రకృతి వైపరీత్యాలకు బలైనవారికి కూడా సహాయాన్ని అందజేస్తాయి.
ఇచ్చేగుణం కల్గివుండటంలో మనకు నడిపింపునిచ్చేందుకు, దేవుని వాక్యం కొన్ని చక్కని సూత్రాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు, క్రైస్తవులు ఏదో నిర్ణీత మొత్తాన్ని ఇవ్వాలని కాదు గాని, వాళ్లు సహేతుకంగా తాము ఏమి ఇవ్వగలరో అదే ఇవ్వాలనీ, అదీ ఇష్టపూర్వకంగా సిద్ధమనస్సుతో ఇవ్వాలనీ అది బోధిస్తుంది. (2 కొరింథీయులు 9:7) కొంతమంది ఎక్కువ ఇవ్వగలుగుతుండవచ్చు; ఇతరులు, యేసు కాలంనాటి బీద విధవరాలిలా, కొంచెమే ఇవ్వగలుగుతుండవచ్చు. (లూకా 21:2-4) మొత్తం విశ్వానికి యజమానియైన యెహోవా, తన నామము నిమిత్తం మంచి ఉద్దేశంతో ఇచ్చిన ప్రతి కానుకను, చేసిన ప్రతి త్యాగాన్ని విలువైనదిగా ఎంచుతాడన్నది విశేషమైన విషయం కాదంటారా?—హెబ్రీయులు 6:10.
ఉత్సాహంతో ఇవ్వగలిగేలా, యెహోవా ప్రజలకు అనేక అవసరాల గురించి, ఆ అవసరాలను సరైన విధంగా తీర్చడం గురించి పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇష్టపడే హృదయాలు ప్రతిస్పందించడానికి యెహోవా పరిశుద్ధాత్మ పురికొల్పుతుంది. ప్రాచీన ఇశ్రాయేలులో గుడార నిర్మాణంలోనూ, ఆ తర్వాత ఆలయ నిర్మాణంలోనూ ఈ పద్ధతిని అనుసరించడం జరిగింది. (నిర్గమకాండము 25:2; 35:5, 21, 29; 36:5-7; 39:32; 1 దినవృత్తాంతములు 29:1-19) సా.శ. మొదటి శతాబ్దంలో, అదే విధానం క్రైస్తవులు రాజ్య సువార్తను జనాంగాల వద్దకు తీసుకువెళ్లడానికీ, ఇశ్రాయేలులో కరవు ఏర్పడినప్పుడు సహోదరులకు మద్దతునివ్వడానికీ అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు దోహదపడింది.—1 కొరింథీయులు 16:2-4; 2 కొరింథీయులు 8:4, 15; కొలొస్సయులు 1:23.
అలాగే నేడు, ప్రపంచంలో మునుపెన్నడూ జరుగని అతిగొప్ప ప్రకటనా బోధనా పనిని తుదముట్టించడానికి అవసరమైన వాటిని తన ప్రజలకు ఇవ్వడం ద్వారా యెహోవా వారిని ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తూనే ఉంటాడు.—మత్తయి 24:14; 28:19, 20.
ప్రస్తుత అవసరాలేమిటి?
ఇటీవలి సంవత్సరాల్లో మునుపు తమ పని నిషేధించబడిన అనేక దేశాల్లో నేడు యెహోవాసాక్షులు చట్టబద్ధంగా రిజిస్టరు చేయబడ్డారు. ఫలితంగా, ఈ దేశాల్లో అనేకం తమ ప్రచారకుల సంఖ్యల్లో విపరీతమైన పెరుగుదలను చూశాయి. బైబిళ్లకు, బైబిలు ఆధారిత ప్రచురణలకు డిమాండు పెరుగుతుందన్న విషయం అర్థం చేసుకొనదగినదే.
రాజ్యమందిరాల విషయం కూడా అంతే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9,000 క్రొత్త రాజ్యమందిరాలు అవసరం. కనీసం రోజుకు ఒక రాజ్యమందిరాన్ని కట్టాలన్నా, ప్రస్తుతమున్న అవసరాలు తీరాలంటే 24 కంటే ఎక్కువ సంవత్సరాలే పడుతుంది! ఈ మధ్యలో, రోజుకు ఏడు క్రొత్త సంఘాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటిలో ఎక్కువ భాగం, ప్రపంచంలోని ఆర్థికపరంగా వెనుకబడివున్న ప్రాంతాల్లోనే. మరోవైపున, ఈ ప్రాంతాల్లో అనేకానికి ఖరీదైన భవనాలు అవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లో, అవసరానికి సరిపోయే, ఆ ప్రాంతంలో చక్కని సాక్ష్యాన్నిచ్చే రాజ్యమందిరాన్ని 6,000 అమెరికా డాలర్ల ఖర్చులో ముగించవచ్చు.
మొదటి శతాబ్దంలో, కొంతమంది క్రైస్తవులు ఇతరులకన్నా ఆర్థికపరంగా మంచి స్థితిలో ఉన్నారు, కాబట్టి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలె[ను].” (2 కొరింథీయులు 8:14, 15) నేడు అదే విధమైన “సమాన”పర్చే పని, బైబిళ్లను, బైబిలు సాహిత్యాన్ని, రాజ్యమందిరాలను, ప్రకృతి విపత్తు సహాయాన్ని, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇతర విషయాలను చూసేందుకు అవసరమైన నిధులను సమకూరుస్తోంది. అలాంటి ఇచ్చేగుణం, అటు ఇచ్చేవారికీ, ఇటు తీసుకునేవారికీ ఎంతటి ఆశీర్వాదం!—అపొస్తలుల కార్యములు 20:35.
ఉదారహృదయుల నుండి సంస్థకు అందుతున్న ఉత్తరాలు సూచిస్తున్నట్లుగా, ఈ పత్రిక పాఠకులనేకులు సహాయం చేయాలని ఇష్టపడుతున్నారు, కానీ విరాళాలు ఇవ్వగల విధానాల గురించి వారికి కచ్చితంగా తెలియదు. దీనితోపాటువున్న బాక్సు వారి ప్రశ్నలకు తప్పకుండా సమాధానమిస్తుంది.
సొలొమోను మహిమాన్విత పరిపాలనా కాలంలో, ఆయన గురించి విన్న “భూరాజులందరు” ఆయనను దర్శించడానికి వచ్చారు. అయినప్పటికీ, బైబిలు కేవలం ఒక్క పరిపాలకురాలి గురించే మాట్లాడుతుంది, ఆమే షేబ రాణి. (2 దినవృత్తాంతములు 9:23) ఆమె ఎంతటి త్యాగం చేసింది! కాని ఆమె గొప్పగా ఆశీర్వదించబడింది—ఎంతగా ఆశీర్వదించబడిందంటే, ఆమె తన సందర్శన ముగింపులో, ‘విస్మయమొందింది.’—2 దినవృత్తాంతములు 9:4.
భవిష్యత్తులో, మహాగొప్ప రాజూ, దాతా అయిన యెహోవా, తన కోసం త్యాగాలు చేసిన వారికి సొలొమోను తిరిగి ఇవ్వగలదానికంటే ఎంతో ఎక్కువే ఇస్తాడు. దానికి ప్రతిస్పందనగా, వాళ్లు ‘విస్మయమొందుతారు,’ ఎందుకంటే యెహోవా వారిని భయంగొల్పే తన తీర్పు దినాన కాపాడటమేగాక, ఆయన అటుతర్వాత ‘తన గుప్పిలినివిప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తాడు.’—కీర్తన 145:16.
[22వ పేజీలోని బాక్సు]
ఇవ్వడానికి కొంతమంది ఎన్నుకునే పద్ధతులు
ప్రపంచవ్యాప్త పనికోసం విరాళాలు
“సొసైటీ ప్రపంచవ్యాప్త పని కోసం చందాలు.—మత్తయి 24:14.” అని వ్రాయబడిన చందా పెట్టెలలో వేయడానికి అనేకమంది కొంత డబ్బును ప్రక్కకు తీసిపెడతారు లేదా తమ బడ్జెట్‌లో దాన్ని చేరుస్తారు. ప్రతినెలా సంఘాలు ఈ మొత్తాలను స్థానిక బ్రాంచి కార్యాలయానికి పంపిస్తాయి.
డబ్బు రూపంలోని స్వచ్ఛంద విరాళాలను నేరుగా Treasurer’s Office, Praharidurg Prakashan Society, Plot A/35, Near Industrial Estate, Nangargaon, Lonavla, 410 401కి కూడా పంపించవచ్చు. ఆభరణాలను ఇతర విలువైన వాటిని సహితం విరాళంగా ఇవ్వవచ్చు. వీటితో పాటు వీటిని విరాళంగా ఇస్తున్నామని ఖచ్చితంగా తెలియజేసే క్లుప్తమైన లేఖను కూడా జతచేయాలి.
పథకం వేసి ఇవ్వడం
ప్రపంచవ్యాప్త రాజ్యసేవ ప్రయోజనార్థం విరాళాలివ్వడంలో, నేరుగా డబ్బునే కానుకగా ఇవ్వడం మరియు షరతు మీద ఇచ్చే విరాళాలే కాక, వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిలో:
భీమా: జీవిత భీమా పాలసీకి లేదా ఉద్యోగవిరమణ/పింఛను పథకం లబ్దిదారుగా Praharidurg Prakashan Society పేరును సూచించవచ్చు.
బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాల ప్రకారం, బ్యాంకు ఖాతాలను, డిపాజిట్ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగ విరమణ ఖాతాలను Praharidurg Prakashan Society ట్రస్టుకు ఇవ్వవచ్చు లేదా మరణానంతరం వాటిని Societyకి చెల్లించే ఏర్పాటును చేయవచ్చు.
స్టాక్‌లు మరియు బాండ్లు: పూర్తిగా ఒక కానుకగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించే ఏర్పాటుతో స్టాక్‌లను మరియు బాండ్లను Praharidurg Prakashan Societyకి విరాళంగా ఇవ్వవచ్చు.
ఇళ్లస్థలాలు: అమ్మదగిన ఇళ్లస్థలాలను పూర్తిగా ఒక బహుమానంగా లేక ఆమె/అతడు జీవించినంత కాలం తానుండే ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో Praharidurg Prakashan Societyకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను వ్రాయకముందు సొసైటీని సంప్రదించాలి.
వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని లేదా డబ్బును చట్టబద్ధంగా Praharidurg Prakashan Society పేర వీలునామా వ్రాయవచ్చు, లేక ఒక ట్రస్టు అగ్రిమెంట్ లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు.
“పథకం వేసి ఇవ్వడం” అనే పదబంధం సూచిస్తున్నట్లే, ఈ తరహా విరాళాలను ఇవ్వాలంటే దాత కొంత పథకం వేసుకోవలసి ఉంటుంది.
[23వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షుల కార్యకలాపాలు స్వచ్ఛంద విరాళాల సహాయంతో కొనసాగుతున్నాయి