దీర్ఘాయుష్షు కోసమైన మన అన్వేషణ ఎలా విజయవంతం కాగలదు?
దీర్ఘాయుష్షు కోసమైన మానవుని ప్రయత్నాలు క్రొత్త సహస్రాబ్దంలో విజయవంతమౌతాయని కొందరు ఆశిస్తున్నారు. డా. రానల్డ్ క్లాట్జ్ వారిలో ఒకరు. ఈయన, మానవ ఆయుష్షును పొడిగించేందుకు తమను తాము అంకితం చేసుకున్న వైద్యుల, శాస్త్రజ్ఞుల సంస్థయైన అమెరికన్ అకాడమీ ఆఫ్ యాంటి-ఏజింగ్ మెడిసిన్‌కి అధ్యక్షుడు. ఆయనా, ఆయన తోటివాళ్ళూ దీర్ఘకాలం జీవించాలని ప్లాన్ చేస్తున్నారు. “కనీసం 130 ఏండ్లన్నా జీవించాలని చూస్తున్నాను. వార్ధక్యం అనివార్యం కాదని మేం నమ్ముతున్నాం. ప్రస్తుతం సహజ వార్ధక్య ప్రక్రియ అని పిలువబడుతున్న శారీరక క్షీణతనూ, రోగాన్నీ నెమ్మదిపరచగల, ఆపగల, చివరికి దాన్ని పూర్తిగా త్రిప్పికొట్టగల సాంకేతికత ఇప్పుడు ఉనికిలో ఉంది” అని డా. క్లాట్జ్ చెబుతున్నారు. ఆయన, దీర్ఘాయుష్షు కొరకైన అన్వేషణలో ప్రతిరోజు దాదాపు 60 మాత్రలను తీసుకుంటారు.
హార్మోన్ థెరపీ మరియు జన్యుశాస్త్రం—ఆశించడానికి కారణాలా?
హార్మోన్ థెరపీ అనే క్షేత్రం ఆశను ఇస్తుంది. డి.హెచ్.ఇ.ఎ అని పిలువబడే హార్మోన్‌తో చేసిన ప్రయోగాలు, లాబరేటరీలోని జంతువుల్లో వార్ధక్య ప్రక్రియను తగ్గిస్తాయని అనిపిస్తుంది.
స్వీడన్ పత్రికయైన ఆఫ్టన్బ్లాడెట్, మొక్కల్లో ఉండే కయినెటిన్ హార్మోన్ గురించి చెబుతూ, “మా లాబరెటరీలో చేసిన పరీక్షలు చూపించేదేమిటంటే, మానవచర్మపు కణాలను కయినెటిన్ హార్మోన్లో ఉంచి పెంచినప్పుడు సాధారణంగా వార్ధక్య ప్రక్రియ సంబంధంగా కలిగే మార్పులు వాటిలో కలుగవు, అవి తమ ఆయుష్కాలమంతా యౌవనంగానే ఉంటాయి” అని డెన్మార్క్‌లోని ఆర్హూస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డా. సురేష్ రతన్ అన్న మాటలను ఉటంకించింది. ఈ హార్మోన్ ఇవ్వబడిన కీటకాలు మామూలు కీటకాల కన్నా 30 నుండి 45 శాతం ఎక్కువ కాలం జీవిస్తాయని చెప్పబడుతుంది.
మెలటోనిన్ అనే హార్మోన్‌తో చేసిన ట్రీట్మెంట్లు చిట్టెలుకల ఆయుష్కాలాన్ని 25 శాతం దాకా పొడిగించాయని చెప్పబడుతుంది. అంతేకాక, ఈ ట్రీట్మెంట్ పొందిన చిట్టెలుక వయస్సులో మరింత చిన్నగా, మరింత ఆరోగ్యంగా, మరింత చురుకుగా ఉన్నట్లు కనిపించింది.
చర్మ కాంతికీ, కండరాల పెరుగుదలకు, మరింత లైంగిక ఉద్దీపానికి, మరింత సంతోషంగా ఉండేందుకు, మెదడు మరింత చురుకుగా ఉండేందుకు, టీనేజర్లలో కలిగేటటువంటి జీవకణ మార్పులకు హెచ్.జి.హెచ్ (హ్యూమన్ గ్రోత్ హార్మోన్) తోడ్పడుతుంది అని హెచ్.జి.హెచ్‌ను సిఫారసు చేసేవాళ్ళు వాదిస్తారు.
చాలామంది జన్యుశాస్త్రం వైపుకు కూడా ఆశతో చూస్తున్నారు. జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా నులిపురుగుల ఆయుష్కాలాన్ని నియంత్రించగలమని శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. వాస్తవానికి, వాటిలో కొన్నింటిని, వాటి సాధారణ ఆయుష్షు కన్నా ఆరు రెట్లు ఎక్కువ కాలం జీవించేలా చేయడంలో వాళ్ళు సఫలులయ్యారు. దానితో, మానవుల్లో కూడా ఇలాంటి జన్యువులను కనుగొని, మార్పులు చేయవచ్చన్న ఆశలు రేగాయి. “మనం మానవుని ఆయుష్షును నిర్ణయించే జన్యువులన్నింటినీ కనుగొంటే, ఆ జన్యువుల ప్రక్రియను బహుశ కొంత నెమ్మదిపరచి ఆయుష్కాలాన్ని పొడిగించుకోవచ్చు” అని మోంట్రీయాల్లోని మ్యాక్గిల్ యూనివర్సిటీలోని డా. సిగ్ఫ్రీడ్ అన్నారని టైమ్ మ్యాగజిన్ ఉటంకించింది.
క్రోమోజోముల చివరి భాగం టలొమేరె అని పిలువబడుతుంది. దాని పొడవు, కణంలో పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ తగ్గిపోతుంది అని జీవశాస్త్రజ్ఞులకు చాలా కాలంగా తెలుసు. టెలొమేరె తన పొడవులో దాదాపు 20 శాతాన్ని కోల్పోయినప్పుడు కణానికుండే పునరుత్పత్తి చేసే సామర్థ్యం ఆగిపోయి, అది మరణిస్తుంది. టెలొమేరేస్ అని పిలువబడే నిర్దిష్ట ఎంజైమ్ టెలొమేరేను తిరిగి దాని అసలు పొడవుకు తీసుకురాగలదు. అలా ఆ కణంలో మళ్ళీ విభజన జరిగేందుకు వీలవుతుంది. దాదాపు అన్ని కణాల్లోను, టెలొమేరేస్ ఎంజైమ్ నియంత్రించబడి, నిష్క్రియంగా ఉంటుంది, కానీ క్రియాశీలంగా ఉన్న టెలొమేరేస్ నిర్దిష్ట కణాల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టబడినప్పుడు, ఆ కణాలు పెరిగి, సాధారణంగా విభజించుకునేదాని కన్నా అనేక రెట్లు ఎక్కువగా విభజించుకోవడం జరిగింది.
ఇది, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, వార్ధక్య సంబంధ రోగాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సంచలనాత్మకమైన అవకాశాలను తెరుస్తుంది. మన శరీరంలో ఉన్న మూల కణాల (శరీర కణజాలాలను మళ్ళీ ఉత్పత్తికి ఏర్పాట్లు చేసే కణాలు) స్థానంలో, క్రియాశీలంగా ఉండే టెలోమేరేస్ చేత “అమర్త్యంగా చేయబడిన” మూల కణాలను ఉంచే సంగతేమిటి? ఈ విషయాన్ని గురించి చెబుతూ, డా. విల్యమ్ ఏ. హేసెల్టీన్, “ఇది, తర్వాతి 50 సంవత్సరాల్లో నెమ్మదిగా ప్రవేశపెట్టబడబోతున్న మానవ అమర్త్యతను గురించి స్పష్టంగా తెలియజేస్తున్న భవిష్యద్దర్శనం” అని అంటున్నారు.—ద న్యూయార్క్ టైమ్స్.
నానొటెక్నాలజీ, క్రయోనిక్స్ల దగ్గర జవాబుందా?
ఒక నానొమీటరు పరిమాణపు (ఒక మీటరులో వందకోట్ల వంతు పరిమాణపు) వస్తువులను తయారు చేసే విజ్ఞానశాస్త్రమే నానొటెక్నాలజీ. ఈ టెక్నాలజీ కూడా ఆశ కలిగిస్తుంది. ఆ రంగంలో ఉన్న భవిష్యద్దర్శకులు ఏమని వాదిస్తున్నారంటే, వృద్ధాప్యానికి చేరుకుంటున్న కణాలను, కణజాలాలను, అవయవాలను మరమ్మతు చేసి, తిరిగి యౌవనంగా చేసేందుకు, భవిష్యత్తులో, కణాల కన్నా చాలా చిన్నవైన కంప్యూటరైజ్డ్ యంత్రాలను తయారు చేసి, వాటిని సూక్ష్మాణువుల స్థాయిలో పనిచేయించవచ్చని వాదిస్తున్నారు. ఒక వార్ధక్యవ్యతిరేక సమావేశంలో, మానవుడు శారీరకంగా అమర్త్యతను పొందేలా చేసేందుకు 21వ శతాబ్దపు వైద్యులు నానొటెక్నాలజీని ఉపయోగించవచ్చని ఒక పరిశోధకుడు సూచించాడు.
విజ్ఞానశాస్త్రం, మృత కణాలను పునర్జీవింపజేసి తద్వారా తిరిగి జీవాన్ని పోయగల్గుతుందనే ఆశతో మానవ శరీరాలను ఘనీభవింపజేసే ఆచారమే క్రయోనిక్స్. క్రయోనిక్స్లో, మొత్తం శరీరాన్ని, లేదా కేవలం మెదడును మాత్రమే ఘనీభవింపజేయవచ్చు. అంతెందుకు, ఒక మనిషి ఒక దుప్పటిని ఘనీభవింపజేశాడు. దుప్పటిని ఘనీభవింపజేయడం ఎందుకు? అది, కనిపించకుండా పోయిన ఒక స్నేహితుని దుప్పటి. దాంట్లో కొన్ని చర్మ కణాలూ, కొన్ని వెంట్రుకలూ ఉన్నాయి. ఒకవేళ విజ్ఞానశాస్త్రం, కేవలం కొన్ని కణాల నుండి లేదా ఒక కణం నుండి ప్రజలను తిరిగి నిర్మించేంత స్థాయికి చేరుకుంటే, తిరిగి జీవానికి వచ్చే అవకాశాన్ని తన స్నేహితునికి ఇవ్వాలని అలా ఘనీభవింపజేశాడు.
మనం దేనిపై నమ్మకముంచాలి?
మానవుడి సహజ కోరిక జీవించాలనే గాని, చనిపోవాలని కాదు. కనుకనే, ఈ రంగంలో విజ్ఞానశాస్త్ర పురోగతి ఎంతగానో ప్రశంసించబడుతుంది, దాని మూలంగా చాలా గొప్ప ఆశలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ, డి.హెచ్.ఇ.ఎ గానీ, కయినెటిన్గానీ, మెలటోనిన్ గానీ, హెచ్.జి.హెచ్ గానీ, మరే ఇతర పదార్థం గానీ నిజానికి మానవుడు వృద్ధుడవ్వడాన్ని ఆపగలదనేందుకు వాస్తవికమైన ఏ రుజువూ లేదు. కణాల్లోని టెలొమేరేస్లో మార్పులను చేయడంవల్ల, క్యాన్సర్ కణాలు రూపొందే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే తప్ప, ప్రయోజనమేమీ ఉండదని సంశయవాదులు భయపడుతున్నారు. నానొటెక్నాలజీని, క్రయోనిక్స్ని ఉపయోగించడం అనేది శాస్త్రీయ కల్పిత కథే గాని వాస్తవం కాదు.
విజ్ఞానశాస్త్రం, కొందరికి దీర్ఘాయుష్షునూ, మరింత ఆరోగ్యంతో కూడిన జీవితాన్నీ ఇచ్చింది, ఇంకా ఇవ్వవచ్చు కూడా. కానీ అది, అనంతకాల జీవాన్ని ఎవరికీ ఎన్నడూ ఇవ్వలేదు. ఎందుకివ్వలేదు? సరళంగా చెప్పాలంటే, వృద్ధాప్యానికీ, మరణానికీ మూల కారణం, మానవ విజ్ఞానశాస్త్ర రంగానికి సంబంధించినది కాదు.
వృద్ధాప్యానికీ, మరణానికీ మూల కారణం
వృద్ధులయ్యే, మరణించే ప్రణాళికలు ఏదో రీతిలో మన జన్యువుల్లో ప్రవేశపెట్టబడినట్లుగా ఉందని శాస్త్రజ్ఞుల్లో అనేకమంది ఒప్పుకుంటారు. అయితే, అవి మన జన్యు తంతువుల్లో ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రవేశపెట్టబడ్డాయి? అన్నదే ప్రశ్న.
బైబిలు మనకు సరళమైన జవాబును ఇస్తుంది. అయితే అది ఆ జవాబులో జన్యుశాస్త్రపు పదాలను లేదా డి.ఎన్.ఎ అనే పదాన్ని ఉపయోగించడంలేదు. “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను” అని రోమీయులు 5:12లో చదువుతాం.
మొదటి మానవుడైన ఆదాముకు శాశ్వత కాలం జీవించే నిరీక్షణ ఉండేది. అనంతకాలం జీవించేందుకూ, ఆ జీవితాన్ని ఆస్వాదించేందుకూ అవసరమైన సామర్థ్యాలతోనే అతని శరీరం రూపకల్పన చేయబడింది. అయితే, అనంతకాల జీవితం ఒక షరతుపై ఆధారపడి ఉండింది. ఆదాము తన జీవితాన్ని శాశ్వతం చేసుకునేందుకు, తన జీవానికి మూలకర్తయైన తన సృష్టికర్తతో సహకరించి, ఆయనకు విధేయుడై ఉండవలసిన అవసరం ఉండింది.—ఆదికాండము 1:31; 2:15-17.
ఆదాము సృష్టికర్తకు అవిధేయత చూపించడాన్నే ఎన్నుకున్నాడు. ఆ విధంగా, మానవుడు దేవునిపై ఆధారపడకుండా తనను తాను ఏలుకొనే స్థితిలో ఉన్నాడని ఆదాము వాదించాడు. ఆ విధంగా అతడు పాపం చేశాడు. అప్పటి నుండి, అతని జన్యు తంతువు మార్చబడిందా అన్నట్లుగా అయ్యింది. ఆదాము తన సంతానానికి శాశ్వతకాల జీవాన్ని వారసత్వంగా సంక్రమింపజేసే బదులు, పాపాన్ని మరణాన్ని సంక్రమింపజేశాడు.—ఆదికాండము 3:6, 19; రోమీయులు 6:23.
నిజమైన నిరీక్షణ
అయితే, ఆ పరిస్థితి అలా శాశ్వతంగా ఉండదు. “సృష్టి, . . . నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను” అని రోమీయులు 8:20 చెబుతుంది. మానవులు తనకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లే, మానవుని సృష్టికర్తయైన యెహోవా దేవుడు వాళ్ళను మరణానికి లోబరచాడు. కానీ అలా చేసినప్పుడు ఆయన నిరీక్షణకు ఒక ఆధారాన్ని కూడా ఇచ్చాడు.
ఆ ఆధారమేమిటన్నది, యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చినప్పుడు స్పష్టంగా గుర్తించడం జరిగింది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు [“విశ్వాసాన్ని అభ్యసించు,” NW] ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని యోహాను 3:16 చెబుతుంది. అయితే, యేసుక్రీస్తుయందు విశ్వాసాన్ని అభ్యసించడం మనలను మరణం నుండి ఎలా కాపాడగలదు?
మరణానికి కారణం పాపమే అయితే, మరణాన్ని తీసివేసే ముందు, పాపాన్ని నిర్మూలం చేయవలసి ఉంది. క్రీస్తుగా, యేసు తన పరిచర్య యొక్క ప్రథమ ఘట్టంలో ఉన్నప్పుడు, “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని బాప్తిస్మమిచ్చే యోహాను అన్నాడు. (యోహాను 1:29) పాపానికి శిక్ష మరణం. యేసులో పాపం లేదు. కనుక, ఆయన మరణించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ, ఇతరులు తనకు మరణాన్ని విధించేందుకు ఆయన అనుమతించాడు. ఎందుకని? ఎందుకంటే అలా చేయడం ద్వారా, ఆయన మన పాపాల కోసం క్రయధనాన్ని చెల్లించాడు.—మత్తయి 20:28; 1 పేతురు 3:18.
ఆ క్రయధనం చెల్లించబడడంతో, యేసుయందు విశ్వాసాన్ని అభ్యసించే వారందరికీ ఎన్నడూ చనిపోకుండా జీవించే అవకాశం తెరవబడింది. మన ఆయుష్షును కొంత పరిమితి వరకు పొడిగించుకోవడానికి విజ్ఞానశాస్త్రం దోహదపడవచ్చు గానీ, యేసుయందు విశ్వాసాన్ని అభ్యసించడమే నిత్యజీవానికి నిజమైన మార్గం. పరలోకంలో యేసు అలాంటి జీవాన్ని పొందాడు. ఆయన యొక్క నమ్మకస్థులైన అపొస్తలులూ, ఇతరులు కొంతమంది కూడా అలాంటి జీవాన్ని పొందుతారు. అయితే, యేసుయందు విశ్వాసాన్ని అభ్యసించే మనలో చాలా మందికి నిత్యజీవం భూమిపైనే లభిస్తుంది, యెహోవా దేవుడు భూపరదైసును పునఃస్థాపించినప్పుడు లభిస్తుంది.—యెషయా 25:8; 1 కొరింథీయులు 15:48, 49; 2 కొరింథీయులు 5:1.
భూపరదైసుపై శాశ్వతకాల జీవితం
“మరణించవలసిన అవసరం లేని పరిస్థితి వచ్చాక, జీవితానికి విలువ ఉంటుందని ఎంత మంది ప్రజలు కనుగొంటారు?” అని ఒకరు అడిగారు. మరణం లేని జీవితం బోర్ కొట్టేదిగా ఉంటుందా? అలా ఉండదు అని బైబిలు హామీ ఇస్తోంది. “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును [“అనంత కాలాన్ని,” NW] నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.” (ప్రసంగి 3:11) యెహోవా దేవుని సృష్టి చాలా సమృద్ధమైనది, చాలా సంకీర్ణమైనది, అది మనకు అన్నివేళలా ఆసక్తికరంగానూ, ప్రేరణాత్మకంగాను ఉంటుంది, మనం జీవించినంత కాలం—శాశ్వతకాలం జీవించినా కూడా అది మనలను సంతోషపరుస్తుంది.
సైబీరియన్ జే అని పిలువబడే ఒక పక్షి గురించి అధ్యయనం చేసిన ఒక వ్యక్తి దాని గురించి చెబుతూ, అది, “అసామాన్యమైన, ఆహ్లాదకరమైన, పరిచయస్థురాలు” అని అంటున్నాడు. ఆ పక్షిని గమనించడం తన జీవితంలోని అత్యంత ఆస్వాదయోగ్యమైన అనుభవాల్లో ఒకటి అని ఆయన వాదించాడు. ఆయన ఆ పక్షిని ఎంత ఎక్కువగా అధ్యయనం చేశాడో, అంత ఆసక్తికరంగా ఉన్నట్లు అతడు కనుగొన్నాడు. 18 సంవత్సరాల తర్వాత కూడా, తన అధ్యయనం ఇంకా ముగియ లేదని ఆయన అన్నాడు. ఒక్క జాతి పక్షి ఒక మేధావికి 18 ఏండ్ల తీవ్ర అధ్యయన కాలంలో ఆహ్లాదాన్నీ, ప్రేరణనూ, సంతోషాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నట్లయితే, భూమి మీద ఉన్న యావత్ సృష్టిని అధ్యయనం చేయడంలో కలుగగల ఆనందాన్నీ, సంతృప్తినీ ఒక్కసారి ఊహించండి.
కాల పరిమితులు లేని ఒకరి ఎదుట, విజ్ఞానశాస్త్రపు ఆసక్తికరమైన అన్ని రంగాల ద్వారాలూ తెరవబడి ఉండడాన్ని ఊహించుకోండి. పర్యటన చేసి తెలుసుకోగల ప్రాంతాలన్నింటినీ, మనం కలుసుకోగల ఆసక్తికరమైన ప్రజలందరినీ ఊహించండి. అనేకమైనవాటిని కల్పించే, సృష్టించే, నిర్మించే అనంతమైన అవకాశాలను మనో నేత్రాలతో చూడడానికి ప్రయత్నించండి. మన సృజనాత్మకతను వృద్ధి చేసుకునేందుకూ, సద్వినియోగం చేసుకునేందుకూ ఉండే అవకాశాలకు అవధి ఉండదు. మనం సృష్టి యొక్క సమృద్ధిని గురించి పర్యాలోచించినప్పుడు, జీవితంలో లభించే ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునేందుకు అనంతకాలమైతేనే సరిపోతుందని స్పష్టమౌతుంది.
సదాకాలం జీవించే అవకాశం, పునరుత్థానం ద్వారా మృతులకు కూడా ఇవ్వబడుతుంది అని బైబిలు చూపిస్తుంది. (యోహాను 5:28, 29) చరిత్రలోని అనేక నిగూఢమైన విషయాలు, వాటిని అనుభవించినవాళ్ళు వాటిని గురించిన వివరాలను ఇవ్వగల్గినప్పుడు, మన ప్రశ్నలకు జవాబులు ఇవ్వగల్గినప్పుడు, మనకు స్పష్టం కావచ్చు. మనకు పునరుత్థానమై వచ్చినవాళ్ళు, చరిత్రలోని అనేక కాలఘట్టాలను గురించిన అవగాహనను ఇవ్వడాన్ని గురించి ఆలోచించండి.—అపొస్తలుల కార్యములు 24:15.
ఆ కాలాన్ని గురించి ఆలోచించేటప్పుడు, పునరుత్థానుడై వచ్చే యోబు, యోబు 14:1లో చెప్పిన మాటలను సవరించవచ్చన్నది మీరు ఊహించవచ్చు. ‘స్త్రీ కనిన నరుడు అనంత కాలం జీవిస్తూ, సంతృప్తి పొందుతాడు,’ అని బహుశా ఆయన అనవచ్చు.
యెహోవాయందు నమ్మకముంచి, యేసుయందు విశ్వాసాన్ని అభ్యసించేవాళ్ళకు, కాల పరిమితులు లేకుండా శాశ్వత కాలం జీవించడం అనేది ఏదో అర్థం కాని స్వప్నంలాంటిది కాదు. అది త్వరలోనే నిజమవుతుంది. వృద్ధులవ్వడమూ, మరణించడమూ ఇక ఆగిపోతాయి. ఇది, “మరణము తప్పించుట ప్రభువైన యెహోవావశము” అని కీర్తన 68:20 చెబుతున్న దానికి అనుగుణ్యంగా ఉంటుంది.—ప్రకటన 21:3, 4.
[4, 5వ పేజీలోని చిత్రం]
విజ్ఞానశాస్త్ర అభివృద్ధి, మరెక్కువ కాలం జీవించవచ్చనే ఆశలనిస్తుంది
[7వ పేజీలోని చిత్రం]
జీవితంలో లభించే అవకాశాలన్నింటినీ ఉపయోగించుకునేందుకు అనంతకాలమైతేనే సరిపోతుంది