“ఆకాశధాన్యము” నుండి ప్రయోజనం పొందడం
ఐగుప్తు నుండి అద్భుతరీతిన విడుదల పొందిన తర్వాత కొద్దికాలానికే ఇశ్రాయేలీయులు తమ విమోచనకర్త అయిన యెహోవాపట్ల ఘోరమైన విశ్వాసరాహిత్యాన్ని ప్రదర్శించారు. దాని ఫలితంగా, వారు సీనాయి అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడేలా యెహోవా చేశాడు. ఆ కాలమంతట్లోను ఇశ్రాయేలీయులూ, వారితో కలిసిన “అనేకులైన అన్యజనుల సమూహము” “సమృద్ధిగా” తిని త్రాగారు. (నిర్గమకాండము 12:37, 38) ఇదెలా సాధ్యమయ్యిందో కీర్తన 78:23-25 మనకు చెబుతుంది: “ఆయన [యెహోవా] పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్షద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను, ఆకాశధాన్యము వారికనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.”
మన్నాను భుజించిన వ్యక్తిగా మోషే ఈ విశేషమైన ఆహారాన్ని వర్ణించాడు. ఉదయంపూట “మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, ఇదేమి”—హెబ్రీలో అక్షరార్థంగా “మన్‌హూ”—“అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.” బహుశ ఈ వ్యక్తీకరణే ఇశ్రాయేలీయులు ఈ ఆహారానికి పెట్టిన పేరు అయిన “మన్నా” అనే పదానికి మూల పదమైవుండవచ్చు. “అది తెల్లని కొతిమెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను” అని మోషే చెబుతున్నాడు.—నిర్గమకాండము 16:13-15, 31, NW అధస్సూచి.
కొందరు వాదిస్తున్నట్లుగా, మన్నా సహజంగా లభించే ఆహారం కాదు. ఈ ఏర్పాటులో మానవాతీత శక్తి ఇమిడివుంది. ఉదాహరణకు, అది దొరకడం ఒక స్థానానికీ లేదా ఒక ఋతువుకూ పరిమితమైలేదు. రాత్రంతా ఉంచితే అది పురుగులుపట్టి కంపు కొట్టడం ప్రారంభించేది; అయినా, వారపు సబ్బాతుకు ముందు రోజు ప్రతి కుటుంబము రెండంతలు కూర్చుకున్నప్పుడు అది మరునాటికి పాడుకాలేదు—ఈ విధంగా మన్నా కనబడని సబ్బాతు రోజున తినడానికి మన్నా మిగిలేది. నిశ్చయంగా మన్నా అద్భుతంగా అందజేయబడింది.—నిర్గమకాండము 16:19-30.
కీర్తన 78లో ‘బలవంతులు’ లేదా ‘దేవదూతలు’ పేర్కొనబడటం, యెహోవా బహుశ మన్నాను అందజేయడానికి దేవదూతల్ని ఉపయోగించివుండవచ్చని సూచిస్తుంది. (కీర్తన 78:25, NW అధస్సూచి) ఏదేమైనా, దేవుని దయ విషయమై ప్రజలు తప్పక కృతజ్ఞులై ఉండాలి. అయితే, అత్యధికులు తమను ఐగుప్తులోని బానిసత్వం నుండి విమోచించిన వ్యక్తిపట్లనే కృతఘ్నతతో వ్యవహరించారు. ఆయన ప్రేమపూర్వక కనికరం గురించి ధ్యానించక పోయినట్లయితే మనం కూడా యెహోవా ఏర్పాట్లను తేలిగ్గా తీసుకునే లేదా చివరికి కృతఘ్నులమయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఇశ్రాయేలీయుల విమోచననూ, అటుతర్వాత జరిగిన సంఘటనల నివేదికల్నీ “మనకు బోధ కలుగు నిమిత్తము” యెహోవా నమోదు చేసినందుకు మనం కృతజ్ఞులమై ఉండగలము.—రోమీయులు 15:4.
ఇశ్రాయేలీయులకు ఒక పాఠం, క్రైస్తవులకు ప్రయోజనకరం
యెహోవా మన్నాను ఇచ్చినప్పుడు కేవలం ముప్ఫై లక్షల ఇశ్రాయేలీయుల భౌతిక అవసరాలను తీర్చడం మాత్రమే ఆయన మనస్సులో లేదు. ఆయన వారిని శుద్ధీకరించేందుకు, వారి ప్రయోజనం నిమిత్తమే వారికి క్రమశిక్షణనిచ్చేందుకు వారికి ‘వినయము నేర్పించి, పరీక్షించాలని’ కూడా అనుకున్నాడు. (ద్వితీయోపదేశకాండము 8:16, పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము; యెషయా 48:17) వారు ఈ శుద్ధీకరణా క్రమశిక్షణలకు ప్రతిస్పందించినట్లైతే, వాగ్దత్త దేశంలో వారికి శాంతి, సౌభాగ్యాలు, సంతోషాలను దయచేయడం ద్వారా యెహోవా ‘తుదకు వారికి మేలు చేయడంలో’ ఆనందిస్తాడు.
వారు నేర్చుకోవలసిన కీలకమైన ఒక విషయం ఏమిటంటే, “ఆహారమువలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతిమాటవలన నరులు బ్రదుకుదు[రు].” (ద్వితీయోపదేశకాండము 8:3) యెహోవా మన్నాను గనుక ఇవ్వకపోయినట్లైతే ప్రజలు ఆకలికి మరణించివుండేవారు—ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారు. (నిర్గమకాండము 16:3, 4) హృదయాల్లో మెప్పుదల ఉన్న ఇశ్రాయేలీయులకు తాము యెహోవాపైనే పూర్తిగా ఆధారపడివున్నామన్న విషయం ప్రతిదినం జ్ఞాపకానికి వచ్చేది, తద్వారా వారు వినయాన్ని నేర్చుకున్నారు. ఒక్కసారి వాగ్దత్త దేశంలోనికి, అందులోని వస్తుపరమైన సమృద్ధిలోనికి ప్రవేశించిన తర్వాత వారు యెహోవానూ, తాము ఆయనపై ఆధారపడివున్నామన్న విషయాన్నీ మర్చిపోయే అవకాశం తక్కువ.
ఇశ్రాయేలీయుల వలెనే క్రైస్తవులు జీవిత అవసరాలకు—అటు భౌతిక అవసరాలకు, ఇటు ఆధ్యాత్మిక అవసరాలకు—దేవునిపై ఆధారపడివున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. (మత్తయి 5:3; 6:31-33) అపవాది శోధనల్లో ఒకదానికి యేసుక్రీస్తు ద్వితీయోపదేశకాండము 8:3లోని మోషే మాటల్ని ఎత్తిచెబుతూ ఇలా అన్నాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని [“యెహోవా,” NW] నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును అని వ్రాయబడియున్న[ది].” (మత్తయి 4:4) అవును దేవుణ్ని సత్యంతో ఆరాధించేవారు యెహోవా వాక్యంలోని ఆయన వ్యక్తీకరణలను చదవడం ద్వారా పోషించబడుతున్నారు. దానికితోడు, వారు దేవునితో నడుస్తుండగా, ఆయన రాజ్యాసక్తులను మొదటి స్థానంలో ఉంచుతుండగా వారి జీవితాలపై ఈ వ్యక్తీకరణలు చూపించే ప్రయోజనకరమైన ప్రభావాలను అనుభవించినప్పుడు వారి విశ్వాసం దృఢమౌతుంది.
అపరిపూర్ణ మానవులు తమ జీవితాల్లో అనునిత్యమూ ఉండే విషయాలపట్ల మెప్పుదలను కోల్పోగలరు—చివరికి అవి యెహోవా యొక్క ప్రేమపూర్వక చింతను ప్రతిబింబిస్తున్నప్పుడు కూడా అలా జరుగగలదు. ఉదాహరణకు, మానవాతీతమైన రీతిలో మన్నాను అందించడం ఇశ్రాయేలీయులను మొదట్లో ఆశ్చర్యపర్చింది, సంతృప్తిపర్చింది, కానీ కొంత కాలానికి వారిలో అనేకులు ఫిర్యాదు చేశారు. వారు ఏమాత్రం గౌరవం లేకుండా “చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి”—ఇది ‘జీవముగల దేవుని విడిచిపోవడం’ ప్రారంభమైందనడానికి ఒక సూచన. (సంఖ్యాకాండము 11:6; 21:5; హెబ్రీయులు 3:12) అందుకని, వారి మాదిరి “యుగాంతమందున్న మనకు” ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుంది.—1 కొరింథీయులు 10:11.
మనమీ హెచ్చరికను ఎలా లక్ష్యపెట్టగలము? ఒక విధానం ఏమిటంటే, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని నుండి మనం పొందుతున్న బైబిలు బోధలను లేదా ఏర్పాట్లను ఎన్నడూ అల్పమైనవిగా లేదా సామాన్యమైనవిగా దృష్టించకుండా ఉండటం. (మత్తయి 24:45) యెహోవా ఇచ్చే కానుకల్ని మనం ఒక్కసారి అల్పంగా దృష్టించడం ప్రారంభించామంటే, ఇక ఆయనతో మన సంబంధంలో బీటలు ఏర్పడటం మొదలౌతుంది.
ఉత్తేజాన్ని కలిగించే క్రొత్త విషయాల వెల్లువను మనమీదికి యెహోవా నిరంతరాయంగా రప్పించకపోవడానికి మంచి కారణం ఉంది. అలా చేయడానికి బదులుగా, ఆయన తన వాక్యంపై వెలుగును క్రమక్రమంగా పురోభివృద్ధికరంగా ప్రకాశింపజేస్తాడు. (సామెతలు 4:18) ఈ విధంగా ఆయన ప్రజలు తాము నేర్చుకుంటున్న వాటిని జీర్ణించుకుంటూ ఆచరణలో పెట్టడానికి సాధ్యమౌతుంది. తన తొలి శిష్యులకు బోధించేటప్పుడు యేసు తన తండ్రి మాదిరిని అనుకరించాడు. ఆయన “వారికి వినుటకు శక్తి కలిగినకొలది,” లేదా కొన్ని ఇతర అనువాదాలు చెబుతున్నట్లుగా “అర్థంచేసుకున్న కొలది” దేవుని వాక్యాన్ని వివరించాడు.—మార్కు 4:33; పోల్చండి యోహాను 16:12.
దేవుని ఏర్పాట్లపట్ల మీ మెప్పుదలను దృఢపర్చుకోండి
యేసు పునరుక్తిని కూడా ఉపయోగించాడు. మెదడు ఒక విషయాన్ని—ఉదాహరణకు, ఒక బైబిలు సూత్రాన్ని—వెంటనే గ్రహించగల్గుతుండవచ్చు, కానీ దాన్ని హృదయంలోనికి తీసుకోవడానికీ, దాన్ని “నవీనస్వభావము”లో భాగంగా చేసుకోవడానికీ కాస్త ఎక్కువ సమయం పడుతుండవచ్చు, ప్రాముఖ్యంగా పాత లోక విధానాలూ వైఖరులూ మనస్సులో కూరుకుపోయి ఉన్నట్లైతే ఇది వాస్తవం. (ఎఫెసీయులు 4:22-24) యేసు శిష్యులు గర్వాన్ని అధిగమించటం, నమ్రతను పెంపొందించుకోవటం విషయానికొచ్చినప్పుడు అది నిశ్చయంగా వాస్తవం. యేసు వారికి నమ్రత గురించి అనేకసార్లు బోధించాల్సి వచ్చింది, ప్రతీసారి అదే ప్రాథమికమైన విషయం వారి మనస్సుల్లో లోతుగా నాటుకునేలా చేయడానికి దాన్నే అనేక కోణాల్లో వివరించాల్సి వచ్చింది, చివరికది వారి మనస్సుల్లోనికి ఇంకింది.—మత్తయి 18:1-4; 23:11, 12; లూకా 14:7-11; యోహాను 13:5, 12-17.
ఆధునిక కాలాల్లో క్రైస్తవ కూటాలూ, వాచ్ టవర్ ప్రచురణలూ యేసు మాదిరిని అనుకరిస్తూ ముందే ఎంతో బాగా ఆలోచించి సరైన విధంగా పునరుక్తిని ఉపయోగిస్తాయి. కాబట్టి మనం దీన్ని మనపట్ల దేవునికిగల ప్రేమపూర్వకమైన చింతకు వ్యక్తీకరణగా మెప్పుదలను కనపరుద్దాము, ఇశ్రాయేలీయులు మన్నాను చీదరించుకున్నట్లుగా మనం ఎన్నడూ మనం పొందేదాన్ని బట్టి చిరాకును ప్రదర్శించకుందాము. నిజానికి, మనం ఓర్పుతో యెహోవా క్రమంగా ఇచ్చే జ్ఞాపికలను జీర్ణించుకుంటూ వాటిని అన్వయించుకుంటూ ఉండగా మన జీవితాల్లో మనం చక్కని ఫలాన్ని చూస్తాము. (2 పేతురు 3:1, 2) ఇటువంటి మెప్పుదలతో కూడిన వైఖరి, దేవుని వాక్యాన్ని మనం మన హృదయాలతోను మన మనస్సులతోను ‘గ్రహిస్తున్నామని’ నిజంగా చూపిస్తుంది. (మత్తయి 13:15, 19, 23) ఈ విషయంలో కీర్తన రచయిత అయిన దావీదులో మనకు మంచి మాదిరి కనిపిస్తుంది. మనం నేడు పొందే వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక ఆహారం ఆయన పొందనప్పటికీ యెహోవా నియమాలు “తేనెకంటేను జుంటి తేనెధారలకంటెను మధురమైనవి” అని వర్ణించాడు!—కీర్తన 19:10.
నిత్యజీవాన్నిచ్చే “మన్నా”
“జీవాహారము నేనే” అని యేసు యూదులతో అన్నాడు. “మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. . . . పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే; ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును . . . నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే.” (యోహాను 6:48-51) అక్షరార్థమైన ఆహారము లేదా మన్నా నిత్యజీవాన్ని ఇవ్వలేదు, ఇచ్చే శక్తి వాటికి లేదు. కానీ యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసాన్ని ఉంచేవారు చివరికి నిత్యజీవ ఆశీర్వాదాన్ని అనుభవించగలరు.—మత్తయి 20:28.
యేసు విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందేవారిలో అత్యధికులు పరదైసు భూమిపై నిత్య జీవాన్ని అనుభవిస్తారు. వీరితో కూడిన “యొక గొప్ప సమూహము” భూమ్మీది నుండి దుష్టత్వాన్నంతటినీ నిర్మూలించేందుకు వస్తున్న “మహాశ్రమ”లను తప్పించుకుంటారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల నిర్గమంలో వారితోపాటు చేరిన “అనేకులైన అన్యజనుల సమూహము” ఈ ‘గొప్ప సమూహానికి’ పూర్వఛాయగా ఉన్నారు. (ప్రకటన 7:9, 10, 14; నిర్గమకాండము 12:38) ఇశ్రాయేలీయులు ఎవరికి పూర్వఛాయగా ఉన్నారో వారు ఇంకా గొప్ప బహుమానాన్ని అనుభవిస్తారు. 1,44,000 మందిగా ఉన్న వీరిని అపొస్తలుడైన పౌలు వర్ణిస్తూ వారు దేవుని ఇశ్రాయేలుగా ఉన్నారని చెబుతున్నాడు. మరణమప్పుడు వారు పొందబోయే బహుమానం ఏమిటంటే పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడటమే. (గలతీయులు 6:16; హెబ్రీయులు 3:1; ప్రకటన 14:1) అక్కడ యేసు వారికి ఒక ప్రత్యేకమైన మన్నాను ఇస్తాడు.
“మరుగైయున్న మన్నా” అంటే భావం
“జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును” అని పునరుత్థానుడైన యేసు ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెప్పాడు. (ప్రకటన 2:17) సూచనార్థకమైన ఈ మరుగైయున్న మన్నా మనకు, ఒక బంగారు పాత్రలో మన్నాను పెట్టి నిబంధన మందసములో దాన్ని ఉంచుమని దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞప్తికి తెస్తుంది. ఆ మందసము గుడారములోని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడింది. అక్కడది ఎవరికీ కనబడకుండా మరుగైయున్నట్లుగా ఉంచబడింది. ఒక జ్ఞాపికగా ఉన్న ఈ మన్నా మందసంలో కుళ్లుపట్టకుండా ఉండిపోయింది, అందుకని అది నశ్వరం కాని ఆహారసరఫరాకు యుక్తమైన సూచనగా ఉంది. (నిర్గమకాండము 16:32; హెబ్రీయులు 9:3, 4, 23, 24) మరుగైయున్న మన్నాను 1,44,000 మందికి ఇవ్వడం ద్వారా యేసు, వారు దేవుని ఆత్మ కుమారులుగా అమర్త్యాన్నీ అక్షయతనూ పొందుతారన్న దానికి హామీ ఇస్తున్నాడు.—యోహాను 6:51; 1 కొరింథీయులు 15:54.
“నీయొద్ద [యెహోవాయొద్ద] జీవపు ఊట కలదు” అని కీర్తన గ్రంథకర్త అన్నాడు. (కీర్తన 36:9) ఈ ప్రాథమిక సత్యాన్ని మన్నా ఏర్పాటు—అటు అక్షరార్థమైన, ఇటు సూచనార్థమైన మన్నా ఏర్పాటు—ఎంత చక్కగా ధృవపరుస్తుంది ! దేవుడు ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన మన్నా, మనకోసం అర్పించబడిన యేసు శరీరం రూపంలో ఆయన అందించిన సూచనార్థక మన్నా, యేసు ద్వారా 1,44,000 మందికి ఆయన ఇచ్చే సూచనార్థకమైన మరుగైయున్న మన్నా—ఈ మూడూ జీవం కోసం మనం దేవునిపై పూర్తిగా ఆధారపడటాన్ని మనకందరికీ గుర్తుకు తెస్తాయి. (కీర్తన 39:5, 7) ఈ ఆధారపడటాన్ని నమ్రతతో, వినయంతో మనం ఎల్లకాలమూ గుర్తిద్దాము. దీనికి ప్రతిఫలంగా యెహోవా ‘తుదకు మనకు మేలు చేస్తాడు.’—ద్వితీయోపదేశకాండము 8:16.
[26వ పేజీలోని చిత్రాలు]
నిత్య జీవాన్ని పొందడానికి మానవులందరూ “పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము”పై ఆధారపడివున్నారు
[28వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ కూటాలన్నింటికీ హాజరుకావడం యెహోవా జ్ఞాపికలపట్ల మనకున్న మెప్పుదలను ప్రతిబింబిస్తుంది