మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం—మంచి వివాహ జీవితానికి ఒక కీలకం
1778లో, రాబర్ట్ బరన్, రెండు విధాలుగా పనిచేసే, లివర్-టంబ్లర్ తాళాన్ని తయారు చేశాడు. అది ఆధునిక తాళాలకు ఒక ఆధారం అయ్యింది. ఆయన రూపకల్పన చేసిన తాళానికి దానిలోని రెండు టంబ్లర్లను ఒకే సమయంలో లేపగల ఒక తాళం చెవిని ఉపయోగించడం అవసరం.
అలాగే, విజయవంతమైన వైవాహిక జీవితం అనేది భార్యాభర్తలు ఒకే సమయంలో ఐకమత్యంతో కలిసి కృషి చేయడంపై ఆధారపడి ఉంటుంది. మంచి వివాహబంధమనే తాళాన్ని తెరవడానికి, అందులోని ప్రశస్తమైన ఆనందాలను అనుభవించేందుకు మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం అత్యవసరం.
మనస్సులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడంలో ఇమిడివున్నది ఏమిటంటే
మనస్సులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడంలో ఇమిడివున్నది ఏమిటి? మనసులో మాటను తెలియజేసుకోవడమంటే, “తలంపులను, అభిప్రాయాలను, లేదా సమాచారాన్ని మాట ద్వారా వ్రాత ద్వారా లేదా సంజ్ఞల ద్వారా తెలియజేయడం లేదా తెలియజేసుకోవడం” అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. కనుక, మనస్సులో మాటను తెలియజేసుకోవడంలో, మనస్సులోని భావాలను ఆలోచనలను పంచుకోవడం ఇమిడి ఉంది. మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడంలో నిర్మాణాత్మకమైన, సేదతీర్చేటువంటి, నీతియుక్తమైన, ప్రశంసించదగిన, సాంత్వనపరచే విషయాలను తెలుపుకోవడం ఇమిడి ఉంది.—ఎఫెసీయులు 4:29-32; ఫిలిప్పీయులు 4:8.
మనస్సులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం అనేది నమ్మకం, విశ్వాసం, పరస్పర అవగాహనల ద్వారా సాధ్యమౌతుంది. వైవాహిక అనుబంధాన్ని జీవితకాల అనుబంధంగా దృష్టించినప్పుడు, తమ అనుబంధం జీవితకాల అనుబంధంగా ఉండేందుకు తమను తాము యథార్థంగా బద్ధులుగా చేసుకున్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సంబంధంపై వ్యాఖ్యానిస్తూ, 18వ శతాబ్దపు వ్యాసరచయితయైన జోసఫ్ అడిసన్, “ఒకరి నుండి ఒకరు సేదదీర్చుకునేందుకూ, వినోదాన్ని పొందేందుకూ, మిగతా మానవులనెవరినీ కాక, పరస్పరం ఎన్నుకున్న ఇద్దరు మనుష్యులు అలా ఎన్నుకోవడంలో, జీవితాంతం వరకూ ఒకరి బలహీనతలను మరొకరు తేలికగా తీసుకునేందుకు, ఉత్తమ గుణాల విషయమై ఆహ్లాదంగా ఉండేందుకు, దయాపూర్వకంగా ఉండేందుకు, వివేకముగలవారై ఉండేందుకు, క్షమించుకునేవారై ఉండేందుకు, సహనంతో ఉండేందుకు, ఆనందభరితులుగా ఉండేందుకు తమను తాము బద్ధులను చేసుకున్నారు” అని వ్రాశారు. అలాంటి కలయిక ఎంత సంతోషంగా ఉంటుంది! ఈ రత్నాల్లాంటి గుణాలు మీ వైవాహిక జీవితాన్ని శోభాయమానం చేయగలవు, మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం ద్వారా అవి మీ సొంతం కాగలవు.
మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడంలో గల ఆటంకాలు
చాలా మంది దంపతులు వివాహ జీవితంలోకి ఎంతో ఆశాభావంతో, అత్యంత సంతోషంతో, పులకరింతతో అడుగుపెడతారు. అయినప్పటికీ, అనేకమంది విషయంలో ఆ సంతోషమూ, పులకరింతా త్వరలోనే నీరుకారిపోతాయి, ఆశాభావం మటుమాయమైపోతుంది. నిశ్చింత స్థానంలో నిరాశనిస్పృహలు, కోపం, శత్రుభావం, ఏవగింపు మిళితమై ఉంటాయి. అప్పుడు వివాహ జీవితం అనేది, “మరణం తమను వేరు చేసేంత వరకు” భరించవలసిన పరిస్థితిగా మారుతుంది. మంచి వివాహ జీవితం కోసం, మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడాన్ని మెరుగుపరచుకునేందుకూ, ఆ విధంగా కొనసాగేందుకూ, నిర్దిష్ట ఆటంకాలను అధిగమించడం తప్పనిసరి.
నిర్దిష్ట సమాచారానికి లేదా వ్యక్తపరచే కోరికకు తన భార్య/భర్తా ఎలా ప్రతిస్పందిస్తారు అన్న భయం మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడానికి ఒక నిజమైన ఆటంకం కాగలదు. ఉదాహరణకు, వ్యక్తిగతంగా ఏదో అశక్తత వృద్ధి అవుతున్నట్లు తెలిసినప్పుడు నిరాకరించబడతానేమోనన్న భయం ఉండవచ్చు. చేయించుకోబోతున్న ట్రీట్మెంట్ తన రూపాన్నే మార్చివేయవచ్చు లేక మునుపటిలా పనులు చేసే సామర్థ్యాన్నే నాటకీయంగా తగ్గించివేయవచ్చు అన్న విషయాన్ని తన భార్యకు/భర్తకు ఎలా వివరించవచ్చు? అలాంటి పరిస్థితుల్లో, సత్యసంధంగా విషయాలను తెలియజేసుకోవడమూ సాలోచనగా భవిష్యత్తు కొరకు పథకం వేసుకోవడమూ మునుపటికన్నా ఎక్కువ అవసరం. ప్రేమిస్తున్నానని మాటల ద్వారా హామీ ఇవ్వడమూ, దానితోపాటు ఆర్ద్రతతోకూడిన చర్యలను తరచూ చేయడమూ భర్తపై/భార్యపై వ్యక్తిగత ఆసక్తి ఉందని తెలియజేస్తుంది, అది నిజంగా సంతృప్తికరమైన వైవాహిక జీవితాన్ని పెంపొందించుకునేందుకు సహాయపడుతుంది. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అనే సామెత మరెక్కడికన్నా, వివాహజీవితంలో నిజంగా చక్కగా వ్యక్తీకరించబడగలదు.—సామెతలు 17:17.
ఉక్రోషం కూడా, మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేయడానికి ఆటంకమౌతుంది. సంతోషకరమైన కుటుంబ జీవితమనేది క్షమించే ఇద్దరు వ్యక్తుల కలయిక అని సముచితంగానే చెప్పబడుతుంది. ఈ వివరణకు తగినట్లు, “సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు” అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఆచరణాత్మక సలహాను అనుసరించేందుకు వివాహిత దంపతులు ప్రతి ప్రయత్నాన్ని చేస్తారు. (ఎఫెసీయులు 4:26) కోపాన్ని లేదా ఉక్రోషాన్ని పెంచుకోకుండా ఈ ఉపదేశాన్ని పాటించాలంటే, నమ్రతగా మాట్లాడుకోవడం అవసరం. కోపమూ, పోట్లాటలూ, అయిష్టమూ తమను ఎక్కువ సమయం అధిగమించేందుకు మంచి వివాహభాగస్వాములు అనుమతించరు. (సామెతలు 30:33) దేవుడు కోపాన్ని అలాగే పెంచుకోడు. వాళ్ళు ఆయనను అనుకరించడానికి చూస్తారు. (యిర్మీయా 3:12) నిజంగానే, వారు మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటారు.—మత్తయి 18:35.
ఎలాంటి విషయాన్ని తెలియజేసుకోవడానికైనా ఒక ఖచ్చితమైన ఆటంకం ఒకరు మాట్లాడకపోవడం. కోపంతోకూడిన వ్యక్తీకరణలు, నిట్టూర్పులు, యాంత్రికమైన చర్యలు, ఇద్దరిలో ఒకరు మాట్లాడడానికి నిరాకరించడం అందులో ఇమిడి ఉండవచ్చు. భర్త/భార్య ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే, ఏదో రకమైన అసంతోషాన్ని తెలియజేస్తున్నారన్నమాట. కోపంగా, మాట్లాడకుండా ఉండేకన్నా, వ్యక్తిగత అనుభూతులను దాపరికం లేకుండా, ప్రశాంతంగా మాటల్లో తెలియజేయడం కుటుంబజీవితాన్ని మెరుగుపరచుకునేందుకు చాలా దోహదపడుతుంది.
వివాహజీవితపు సన్నిహిత బాంధవ్యంలో విషయాలను సరిగ్గా తెలియజేసుకోవాలంటే తప్పకుండా అధిగమించవలసిన మరొక ప్రతిబంధకం, ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు సరిగా వినడంలో విఫలం కావడం, లేదా అసలు వినకపోవడం. ఒకరు చెప్పేది మరొకరు జాగ్రత్తగా ఆలకించేందుకు అవసరమైన మానసిక శక్తిని, భావోద్వేగ శక్తిని కూడదీసుకోలేనంతగా బహుశా మనం అలసిపోయి ఉండవచ్చు, లేదా బిజీగా ఉండవచ్చు. అపార్థం చేసుకున్న ఏర్పాట్ల విషయమై వివాదాలు రేగవచ్చు. ఒకరేమో తాను స్పష్టంగా చెప్పానని అనుకోవచ్చు, మరొకరేమో, తాను మొదటిసారిగా వింటున్నానని వాదిస్తుండవచ్చు. అలాంటి ఇబ్బందులకు కారణం, విషయాలను సరైన విధంగా తెలియజేసుకోకపోవడమే.
మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడాన్ని వృద్ధిచేసుకోవడమెలా
ప్రేమపూర్వకమైన విధంగా, ఆరోగ్యకరమైన విధంగా విషయాలను తెలియజేసుకోవడానికి సమయాన్ని తీసుకోవడం ఎంతో ప్రాముఖ్యం! కొందరికి తమ సొంత జీవితాల గురించి సమయం ఉండదు గానీ, టీ.వీ. ముందు కూర్చుని అందులో కనిపించే ఇతరుల జీవితాలను వీక్షిస్తూ చాలా సమయం గడుపుతారు. కనుక, ఆరోగ్యకరమైన విధంగా విషయాలను తెలియజేసుకొనేందుకు, టెలివిజన్ సెట్‌ను కట్టేయడం తరచూ అవసరమైన చర్య.
అయితే, మాట్లాడడానికి సరైన సమయం ఉన్నట్లే, మౌనంగా ఉండడానికి కూడా సమయం ఉంది. “ప్రతిదానికి సమయము కలదు . . . మౌనముగా నుండుటకు మాటలాడుటకు” సమయము కలదు అని జ్ఞానియైన ఒక వ్యక్తి అన్నాడు. నిజానికి, చెప్పవలసిన సరైన మాటలు కూడా ఉన్నాయి. “సమయోచితమైన మాట యెంత మనోహరము!” అని ఒక సామెత పేర్కొంటుంది. (ప్రసంగి 3:1, 7; సామెతలు 15:23) మీరేమనుకుంటున్నారన్న విషయాన్ని తెలిపేందుకు, లేక మీ హృదయంలో ఉన్న చింతను వ్యక్తీకరించేందుకు శ్రేష్ఠమైన సమయమేదో నిర్ణయించుకోండి. ‘నా భర్త/భార్య అలిసిపోయి ఉన్నారా లేక, విశ్రాంతిగా ఉన్నారా, ప్రశాంత మనస్సుతో ఉన్నారా? నేను ప్రస్తావించాలనుకుంటున్న విషయం మండిపడేలా చేస్తుందా? మేము ఈ విషయాన్ని క్రితం సారి మాట్లాడుకున్నప్పుడు, నేను పలికిన ఏ మాటలు ఆయనకు/ఆమెకు అభ్యంతరాన్ని కలిగించాయి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
కోరిన కార్యానికి సహకరించడం లేదా దానికి అనుగుణ్యంగా ప్రవర్తించడం తమకు ఎలా ప్రయోజనాన్నిస్తుందో గ్రహించగల్గినప్పుడు ప్రజలు మరింత బాగా ప్రతిచర్య తీసుకుంటారని గుర్తుంచుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య వ్యతిరేక భావాలు ఏర్పడితే, “ఒక విషయం నన్ను బాధపెడుతోంది, మనమిప్పుడే ఆ విషయాన్ని పరిష్కరించుకుందాం!” అని చెప్పేందుకు ఇద్దరిలో ఒకరు మ్రొగ్గు చూపుతుండవచ్చు. అవును, ఖచ్చితంగా ఏం చెప్పాలన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే, “ప్రియతమా, మనం మునుపు చర్చించుకున్న విషయాన్ని గురించి, విషయాలు ఎలా చక్కబడతాయనే దాని గురించి ఆలోచిస్తున్నాను” అని గానీ, అలాంటిదేదైనా గానీ చెబితే బాగుంటుంది. ఏ విధంగా మాట్లాడితే, మీ భార్య/భర్త విషయాన్ని ఎక్కువగా గుణగ్రహించే అవకాశం ఉంటుంది?
అవును, ఒక విషయాన్ని ఎలా చెబుతారన్నది చాలా ప్రాముఖ్యం. “మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (కొలొస్సయులు 4:6) మీ స్వరమూ మీరు ఎన్నుకునే మాటలూ దయగలవిగా ఉండేందుకు శ్రమించండి. “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి” అన్న విషయాన్ని మనస్సులో ఉంచుకోండి.—సామెతలు 16:24.
కొంతమంది దంపతుల విషయానికి వస్తే, ఇంట్లో పనులను కలిసిచేసుకోవడం, మనసులో మాటను పంచుకునే చక్కని వాతావరణాన్ని కలిగిస్తుంది. అలాంటి సహకరణ, ఆరోగ్యకరమైన సంభాషణకు సమయాన్నిస్తూ, పనులను పంచుకుంటున్నామన్న స్పృహను పెంపొందిస్తుంది. కొందరు దంపతుల విషయానికి వస్తే, ప్రశాంతమైన సమయంలో ఏదైన పని చేయాలని ప్రయత్నించకుండా ఏకాంతంగా కలిసి గడపడమే శ్రేష్ఠం, అలాగే అది మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకునేందుకు నడిపిస్తుంది కూడా.
సహజీవనం సాగించగల్గుతున్న భార్యాభర్తలు మనసులో మాటను పరస్పరం ఎలా తెలియజేసుకుంటున్నారో గమనించడం ద్వారా చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళను ఆ విధంగా చేసినదేమిటి? వాళ్ళు అన్యోన్యంగా ఉంటున్నదీ, వాళ్ళు ఎంతో సునాయాసంగా మనసులో మాటను పంచుకోగల్గుతున్నదీ, వాళ్ళు వ్యక్తిగతంగా కృషి చేయడంవల్లా, ఓపిక పట్టడం వల్లా, ప్రేమపూర్వకమైన పరిగణన చూపుకోవడం వల్లా వచ్చినవే. వాళ్ళూ ఎన్నో నేర్చుకోవలసి ఉండిందన్నది స్పష్టం. మంచి వివాహ జీవితం అనేది, దానంతటదే సంభవించేది కాదు. అలాగైతే మరి, మీ భార్య/భర్త దృక్కోణాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఆమె/ఆయన అవసరాలను గ్రహించడం, ఘర్షణపడే పరిస్థితులను వివేకంతో కూడిన మాటతో ప్రశాంతపర్చడం ఎంతో ప్రాముఖ్యం. (సామెతలు 16:23) మీరు వివాహితులైతే, ప్రశాంతంగా కలిసి జీవించేందుకు, వెంటనే సులభంగా క్షమాపణ కోరదగ్గవారై ఉండేందుకు కృషి చేయండి. వివాహ జీవితాన్ని చక్కపర్చుకునేందుకు అది ఖచ్చితంగా సహాయపడుతుంది.
మానవులు సంతోషకరమైన, కలకాలం నిలిచే వైవాహిక జీవితాలను ఆస్వాదించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. (ఆదికాండము 2:18, 21) దాని కీలకం వివాహ అనుబంధంలో ఉన్నవారి చేతిలోనే ఉంది. అందుకు, మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకునే కళను సొంతం చేసుకోవడం ద్వారా, విజయవంతమైన వివాహజీవితపు తాళాన్ని తెరవడానికి ఆ అనుబంధంలో నిజంగా కలిసి పనిచేసే ఇద్దరు ప్రేమపూర్వక వ్యక్తులు కావాలి.
[22వ పేజీలోని చిత్రం]
టీ.వీ.ని కట్టేస్తే మనసులో మాటను తెలియజేసుకోవడానికి చాలా సమయం ఉంటుంది
[23వ పేజీలోని చిత్రం]
కలకాలం నిలిచే ప్రేమలో హృదయాలు కలిసిపోయేందుకు మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం సహాయపడుతుంది